పాక్‌లో మళ్ళీ అధికార కుస్తీలు, సూఫీ గురువు వెనుక దాగిన మిలట్రీ?


తాహిర్-ఉల్ ఖాద్రి (ఫొటో: ది హిందూ)

తాహిర్-ఉల్ ఖాద్రి – మిలట్రీ తాజా తురుపు ముక్క? (ఫొటో: ది హిందూ)

సూఫీ గురువు తాహిర్-ఉల్-ఖాద్రి కెనడా నుండి పాకిస్థాన్ లోకి తిరిగి ప్రవేశించినప్పటినుండీ అక్కడ అధికార కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాలనీ, మే నెలలో జరగనున్న ఎన్నికలను వాయిదా వేయాలనీ ఖాద్రి ఒకవైపు డిమాండ్ చేస్తుండగా, మరో వైపు పాకిస్థాన్ ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయనను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలిచ్చిందని ఫస్ట్ పోస్ట్ తెలిపింది .

న్యాయ వ్యవస్థ, మిలట్రీ తప్ప పాకిస్థాన్ లో ఇతర వ్యవస్థలన్నీ అవినీతితో నిండిపోయాయని ఖాద్రి వేలాది మద్దతుదారుల మధ్య ప్రకటించగా, అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ దుబాయ్ వెళ్లిపోయాడంటూ పుకార్లు ఊపందుకున్నాయి. ఖాద్రి మిలట్రీ తరపున పనిచేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థను కూల్చడానికి కుట్ర పన్నుతున్నాడన్న ఆరోపణలు అప్పుడే బయలుదేరాయి. ఎన్నికలు వాయిదా వేయించి మిలట్రీకి కీలుబొమ్మగా పనిచేసే కేర్ టేకర్ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి మిలట్రీయే ఖాద్రిని రంగంలోకి దించిందని వార్తలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ తెహరీక్-ఎ-ఇన్శాఫ్ (పి.టి.ఐ) ఖాద్రితో చేయి కలుపవచ్చని పత్రికలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు చేయనున్న ప్రకటనలో ఇమ్రాన్ భవిష్యత్ వ్యూహం ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

ఎవరీ ఖాద్రి?

కెనడా, పాకిస్థాన్ దేశాలలో ద్వంద్వ పౌరసత్వం ఉన్న తాహిర్-ఉల్-ఖాద్రి ఒక సూఫీ గురువు. ఆయనకు పాకిస్థాన్ లో విస్తృత మద్దతుదారులు ఉన్నారని పత్రికలు చెబుతున్నాయి. ఏడు సంవత్సరాల నుండి కెనడాలో నివసిస్తున్న ఈయన గత డిసెంబరు చివరలో పాకిస్థాన్ కి అకస్మాత్తుగా ఊడిపడ్డాడు. ప్రభుత్వం అవినీతితో నిండిపోయిందని, దానిని తాను ప్రక్షాళన చేస్తాననీ ఉపన్యాసాలు దంచడం మొదలు పెట్టాడు. మిలట్రీ, న్యాయ వ్యవస్థ తప్ప పార్లమెంటు, బ్యూరోక్రసీ లాంటి ఇతర వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని విమర్శలు గుప్పించడంతో ఆయన ఎవరి తరపున మాట్లాడుతున్నాడో పరిశీలకులకు ఇట్టే అర్ధమైపోయింది. గత కొన్ని నెలలుగా న్యాయ వ్యవస్థను అడ్డు పెట్టుకుని అధ్యక్షుడు జర్దారీ, ప్రధాని గిలానీ, అష్రాఫ్ లను సాధిస్తూ వస్తున్న మిలట్రీ తాజాగా ఖాద్రిని తన తురుపు ముక్కగా రంగంలోకి దించిందని పలువురు అనుమానిస్తున్నారు.

ఇస్లామాబాద్ లో ఖాద్రి మద్దతుదారుల ప్రదర్శన

ఇస్లామాబాద్ లో ఖాద్రి మద్దతుదారుల ప్రదర్శన

పాకిస్థాన్ లో మార్పు తీసుకు వస్తానని దేశంలోకి అడుగు పెట్టిన ఖాద్రి లాహోరు నుండి ఇస్లామాబాద్ వరకూ మోటార్ వాహనాలపై ‘లాంగ్ మార్చ్’ పేరుతో యాత్ర నిర్వహించాడు. మంగళవారం తెల్లవారు ఝాము 2 గంటలకు ఇస్లామాబాద్ చేరుకుని ఒక పెద్ద ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ప్రజలను పాలించే అర్హత కోల్పోయాయని చెబుతూ అవన్నీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. తన ప్రసంగంలో అధ్యక్షుడు, ప్రధాని, ముఖ్యమంత్రులను మాజీలుగా ఆయన సంబోధించాడని ది హిందూ తెలిపింది. తన డిమాండ్లు నెరవేర్చకపోతే మిలియన్ మంది నిరసనకారులతో దేశ రాజధానిలోని ‘కాన్స్టిట్యూషన్ ఎవెన్యూ’ ను మరో ‘తాహ్రిరి స్క్వేర్’ గా మారుస్తానని హెచ్చరించాడు.

ఖాద్రి డిమాండ్లు అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం జనవరి 10 నే రాజీనామా చేసి ఉండాలి. మిలట్రీ, కోర్టులను సంప్రదించి ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పరచాలి. మే నెలలో జరగనున్న ఎన్నికలను వాయిదా వేయాలి. లాంగ్ మార్చ్ పేరుతో వివిధ పట్టణాల్లో ఇచ్చిన ఉపన్యాసాల్లో తన డిమాండ్లు చిత్తానుసారంగా మార్చుతూ వచ్చిన ఖాద్రి ఇస్లామాబాద్ లో తెల్లవారు ఝామునే అలజడి సృష్టించాడు. పార్లమెంటు ముందు ప్రదర్శనలకు కేటాయించబడిన డి-చౌక్ వద్ద తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించాడు. ఫస్ట్ పోస్ట్ లైవ్ కవరేజి ప్రకారం ర్యాలీలో ఆయన మద్దతుదారులు పోలీసులతో తలపడుతున్నారు. చాలా రోజుల ముందే డి-చౌక్ చుట్టూ ఓడల కంటెయినర్లతో దిగ్బంధించినప్పటికీ ఆందోళనకారులు అడ్డంకులను బద్దలు కొడుతున్నారని తెలుస్తోంది.

ఆందోళనకారులు పోలీసులతో తలపడడంతో వారు గాలిలోకి కాల్పులు జరిపారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీసులు ఖాద్రిని అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించడంతో సమస్య మొదలయిందని ఖాద్రి ప్రతినిధి షాహిద్ ముర్సలీన్ చెబుతున్నాడు. ఖాద్రిపై కూడా పోలీసులు కాల్పులు జరిపారని ఆయన తెలిపాడు. పోలీసుల వద్ద బులెట్లుంటే తనకు ఎదుర్కోవడానికి తన ఛాతీ ఉందని ఖాద్రి భావోద్వేగంతో చేసిన ప్రకటనను గేలి చేసినవారు లేకపోలేదు. బులెట్ ప్రూఫ్ వెనక నిలబడి ప్రసంగాలివ్వగలిగితే తాము బులెట్లకు ఛాతీ చూపిస్తామని కొందరు సామాజిక వెబ్ సైట్లలో వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రధాని అరెస్టుకి ఆదేశాలు

ఒకవైపు తహీరుల్ ఖాద్రి నిరసనల తతంగం కొనసాగుతుండగానే మరో వైపు సుప్రీం కోర్టు కూడా రంగంలోకి దిగింది. విద్యుత్ మంత్రిగా ఉండగా రెంటల్ పవర్ ప్రాజెక్టులు (ఆర్.పి.పి) నెలకొల్పడం కోసం ప్రధాని రాజా పర్వేజ్ అష్రఫ్ లంచాలు తీసుకున్నాడన్న అభియోగంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఆర్.పి.పి కింద ప్రభుత్వం కుదుర్చుకున్న కాంట్రాక్టులన్నీ చట్ట విరుద్ధమని గత సంవత్సరం మార్చి నెలలో సుప్రీం తీర్పు చెప్పింది. సదరు ప్రాజెక్టులు ఆమోదించిన అందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరింది. పాకిస్ధాన్ లో ప్రధాన అవినీతి విచారణ సంస్థ అయిన ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’ (ఎన్.ఎ.బి) ప్రధాని అష్రఫ్ పై చర్యలు తీసుకోవడానికి నిరాకరించింది. మంగళవారం ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ఎన్.ఎ.బి అధిపతి ఫాసి బుఖారి పై కోర్టు ధిక్కరణ నేరం కింద నోటీసులు ఇస్తూ ప్రధాని అష్రఫ్ అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. 24 గంటలలోపు తన అరెస్టు ఆదేశాలు అమలు కావాలని సుప్రీం కోర్టు హుకుం ఇచ్చింది. అష్రఫ్ అవినీతిపై విచారణ చేస్తున్న ఇద్దరు అధికారులను బదిలీ చేయడం కోర్టుకు ఆగ్రహం తెప్పించిందని పత్రికలు చెబుతున్నాయి.

రాజా పర్వేజ్ అష్రఫ్

రాజా పర్వేజ్ అష్రఫ్

కోర్టు ఆదేశాలతో పాక్ మరోసారి సంక్షోభంలో కూరుకుపోయింది. కోర్టు తీర్పును ఖాద్రి తన విజయంగా చెప్పుకోగా ప్రభుత్వ పరంగా తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నదీ పరిశీలకులకు అంతుబట్టడం లేదు. అష్రఫ్ రాజీనామా చేస్తే గనుక సంవత్సరం పరిధిలోనే ఇద్దరు ప్రధానులు రాజీనామా చేసినట్లు అవుతుంది. గత జూన్ నెలలో అప్పటి ప్రధాని యూసఫ్ రాజా గిలానీ రాజీనామా అనంతరం అష్రఫ్ ప్రధాని అయ్యాడు. అధ్యక్షుడు జర్దారీ అవినీతి ఆరోపణల విచారణకు స్విస్ ప్రభుత్వానికి లేఖ రాయడానికి నిరాకరించడంతో సుప్రీం కోర్టు ఆయన ప్రధాని పదవికి అనర్హుడుగా తీర్పు చెప్పింది. రాజ్యాంగబద్ధంగా పాలిస్తానంటూ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించినందున ఆయన రాజీనామా చేయాలని హుకుం ఇచ్చింది.

అనంతరం ప్రధాని అయిన అష్రఫ్ తో కూడా సుప్రీం కోర్టు తలపడింది. జర్దారీపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలపై తిరిగి విచారణ ప్రక్రియ ప్రారంభించాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందేనని స్పష్టం చేసింది. మొదట ఊగిసలాడిన అష్రఫ్ కోర్టు తదుపరి చర్యలకు సిద్ధం కావడంతో లేఖ రాయక తప్పలేదు. ఇదెలా ఉండగానే డిసెంబరులో ఖాద్రి రంగ ప్రవేశంతో మే ఎన్నికలలోపే పాక్ మిలట్రీ తనకు తగిన విధంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టం అయింది. పరిశీలకుల అనుమానాలకు తగినట్లుగా ఖాద్రి మిలట్రీ, న్యాయ వ్యవస్థలను ఆకాశానికెత్తాడు.

పాకిస్థాన్ మిలట్రీ, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న అవ్యాజానురాగ బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. జర్దారీ, గిలానీ, అష్రఫ్ తదితరుల నేతృత్వంలోని ‘సో కాల్డ్’ ప్రజాస్వామిక వ్యవస్థలపై పట్టు బిగించడానికి అవి రెండూ అనేక యేళ్లుగా అలుపెరగని కృషి చేస్తుండగా, పార్లమెంటు కేంద్రంగా అధికారం నెరుపుతున్న వర్గాలు వారిని ప్రతిఘటించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. మిలట్రీని బ్యారక్ లకు పరిమితం చేయడంలో భాగంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఇఫ్తికార్ చౌదరిని ఆ పదవినుండి తొలగించారు. కానీ వివిధ ఎత్తుగడలతో చౌదరి తిరిగి న్యాయమూర్తి పదవిని అధిష్టించడంతో జర్దారీ, గిలానీ తదితరులకు కష్టాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.

ప్రజలకు ఏమాత్రం సంబంధం లేదు

ఇక్కడ ప్రధానంగా గమనించవలసింది పాకిస్థాన్ లో అధికారం కోసం జరుగుతున్న కుమ్ములాటలనే. ఈ కుమ్ములాటల్లో ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం లేవు. వారి పాత్ర నామమాత్రం. మిలట్రీ, కోర్టుల నాయకత్వంలో పాకిస్థాన్ లోని కొన్ని భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలు తమ ప్రయోజనాలకోసం కృషి చేస్తుండగా, పార్లమెంటు, బ్యూరోక్రసీ ల నాయకత్వంలో జర్దారీ, గిలానీ, అష్రాఫ్ లాంటి భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలు వారితో తలపడుతున్నాయి. పాక్ లో అనాదిగా మిలట్రీ వెనుక ఉన్న వర్గాలదే ఆధిపత్యంగా ఉంటూ వస్తోంది. వీరి పైన చట్ట సభల కేంద్రంగా అధికారం నెరిపే వర్గాలు పై చేయి సాధించినప్పుడల్లా, మిలట్రీ పచ్చిగా రంగంలోకి దిగి అధికారం లాక్కుంటూ వచ్చింది. వీరు తమ తమ బలాలు నిరూపించుకోవడానికి మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారు. జర్దారీ, గిలానీ, అష్రాఫ్ లాంటి వారంతా పూర్వాశ్రమంలో భూస్వామ్య పాలకులైన జమీందార్లు, రాజులు, నవాబులు మొ.న వారు. అలాగే మిలట్రీ, కోర్టుల వెనుక ఉన్న పాలక వర్గాలు కూడా.

అధికార పోటీలో ఓడిపోయే పరిస్ధితి వస్తే ప్రజలని ఆశ్రయించడం జర్దారీ తదితర వర్గాలకు రివాజు. (ఆ మాటకొస్తే ఇది అన్ని దేశాల్లోనూ ఉన్న రివాజే, ఇండియాతో సహా) ఇన్నాళ్లూ బల ప్రయోగంతో అధికారం లాక్కుంటూ వచ్చిన మిలట్రీ వెనుక వర్గాలు ఈసారి తాము కూడా ప్రజలను ఆశ్రయించ తలచాయని ఖాద్రి ప్రవేశం స్పష్టం చేస్తున్నది. అంటే గతంలో లాగా బల ప్రయోగం చేసి అధికారం హస్తగతం చేసుకునే పరిస్ధితి ఇపుడు లేదని భావించవచ్చు. దాదాపు 5 యేళ్లు జర్దారీ, గిలానీ, అష్రఫ్ ల నేతృత్వంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రభుత్వం మనగలిగిన నేపధ్యంలో ప్రజల్లో మిలట్రీ పట్ల గతంలో ఉన్న భయ భక్తులు పలుచబడ్డాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మిలట్రీ ఖాద్రి లాంటి పాపులర్ మతగురువుని రంగంలోకి దించి తద్వారా తమకూ ప్రజల మద్దతు ఉన్నట్లు చూపుకోవాలని ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.

పాకిస్ధాన్ లో ఇంకా కొనసాగుతున్న తాజా పరిణామాల్లో కోర్టు పాత్ర ప్రగతిశీలంగా కనిపిస్తోంది. ప్రధాని అవినీతిపై కూడా విచారణ చేయడం, ఆయన అరెస్టుకి ఆదేశాలు ఇవ్వడం, గతంలో అధ్యక్షుడు జర్దారీ అవినీతి కేసులు తిరిగి తెరవాలని తీవ్రంగా ప్రయత్నించి సఫలం కావడం ఇవన్నీ మొదటి పరిశీలనలో ప్రగతిశీలమైన అంశాలే. కానీ పాక్ మిలట్రీ అనేక దశాబ్దాలుగా పాల్పడిన విపరీతమైన అవినీతి, సుప్రీం న్యాయమూర్తి కొడుకు పైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం… ఇవి గుర్తుకు వస్తే సదరు ప్రగతిశీలతలోని డొల్లతనం బైటపడుతుంది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్న క్రమంలో ఒకటీ అరా ప్రజోపయోగమైన చర్యలు కనిపించడం అనివార్యం. అంతమాత్రాన ప్రభుత్వం (పార్లమెంటు, బ్యూరోక్రసీ…) గానీ, మిలట్రీ మరియు కోర్టులు గానీ ఎవరినీ నీతిమంతులుగా భావించనవసరం లేదు. మహా అయితే పాక్ పరిణామాలు పాక్, భారత్ ప్రజలకు వినోద కారకాలు మాత్రమే కాగలవు.

2 thoughts on “పాక్‌లో మళ్ళీ అధికార కుస్తీలు, సూఫీ గురువు వెనుక దాగిన మిలట్రీ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s