అంతర్జాల స్వేచ్ఛా పిపాసి, RSS, Redditల నిర్మాత ఆత్మహత్య


Aaron Swartz -Photo: CNN

Aaron Swartz -Photo: CNN

విజ్ఞానం ఒకరి సొత్తు కాదనీ, అది అందరికీ స్వేచ్ఛగా అందుబాటులో ఉండాలని పోరాడిన ఆరన్ స్వార్జ్ ఎఫ్.బి.ఐ వేధింపుల ఫలితంగా ఆత్మహత్య చేసుకున్నాడు. 14 సంవత్సరాల అతి పిన్న వయసులోనే ప్రఖ్యాత వెబ్ ఫీడ్ వ్యవస్థ అయిన RSSను నిర్మించిన ఆరన్ ఆ తర్వాత సోషల్ న్యూస్ వెబ్ సైట్ Reddit నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాడు. పిన్న వయసులోనే ఇంటర్నెట్ మేధావి గానూ, గుత్త స్వామ్య వ్యతిరేకి గానూ అవతరించిన ఆరన్ 26 యేళ్ల వయసులోనే బలవన్మరణానికి గురయ్యాడు. న్యూయార్క్ నగరంలోని తన అపార్ట్ మెంట్ లో శుక్రవారం ఆయన శవమై కనిపించాడని పోలీసులు తెలిపారు. ప్రఖ్యాత ‘మసాచుసెట్స్ టెక్నలాజికల్ యూనివర్సిటీ’ లైబ్రరీ నుండి మిలియన్ల కొద్దీ విజ్ఞాన పత్రాలను దొంగిలించాడన్న పేరుతో అతనికి 35 సంవత్సరాల శిక్ష వేయాలని ఎఫ్.బి.ఐ ప్రాసిక్యూటర్లు ప్రతిపాదించిన నేపధ్యంలో అతని ఆత్మహత్య ప్రజాస్వామ్య ప్రియులందరికీ ఆశనిపాతం. కాగా తరాల తరబడిన విజ్ఞానాభివృద్ధిని తమ గుత్త సొత్తు చేసుకుని బిలియన్లు ఆర్జిస్తున్న బహుళజాతి కంపెనీలకు ఆరన్ మరణం ఒక ఉపశమనం. డిప్రెషన్ తో బాధపడిన ఆరన్ ను చావు వైపుకి నడిపించడం వారికి పెద్ద కష్టం కాలేదు.

అనేక సంవత్సరాలుగా ఆన్ లైన్ ఐకాన్ గా గుర్తించబడ్డ వ్యక్తి ఆరన్. వార్తా వెబ్ సైట్లు, బ్లాగ్ లు లాంటి సమాచారం నిరంతరం మారుతూ పోయే అంతర్జాల పత్రికల్లోని వార్తలను యూజర్లకు నిరంతరాయంగా అందజేసే RSS (Rich Site Summary) మొట్టమొదటి రూపాన్ని (RSS 1.0) డిజైన్ చేసింది ఆయనే. 14 సంవత్సరాల చిన్న వయసులోనే RSS 1.0 ని ఆరన్ రూపొందించాడని అతని మిత్రుడు, సైన్స్ ఫిక్షన్ రచయిత ‘కోరి డాక్టరో’ తన బ్లాగ్ లో తెలియజేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. RSS 1.0 మరింత అభివృద్ధి చెంది RSS 2.0 గా సమస్త ప్రముఖ ఫ్రాక్ పశ్చిమ, పెద్దా చిన్నా పత్రికలకు, బ్లాగ్ లకూ, యూజర్లకూ అత్యంత సౌకర్యవంతంగా అందుబాటులోకి వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే.

Anonymous mask

Anonymous mask

తన మేధను, విజ్ఞానాన్నీ ఉచితంగా పొందిన బహుళజాతి వార్తా, విజ్ఞాన కంపెనీలు దాన్ని తిరిగి ప్రజలకు ఉచితంగా ఇవ్వకుండా వ్యాపార చక్ర బంధంలో బంధించడంతో ఆరన్ లాంటి అనేకమంది ‘ఇంటర్నెట్ ఫ్రీడం’ కార్యకర్తలుగా అవతరించారు. ‘ఎనోనిమస్’, ‘హేక్టివిస్టు’, ‘లుల్జ్ సెక్’ లాంటి ఇంటర్నెట్ అజ్ఞాత సంస్థలు ‘ఆక్యుపై వాల్ స్ట్రీట్’ లాంటి ఉద్యమాల్లో కూడా ముఖ్య పాత్ర పోషించాయి. వీరి కార్యకలాపాలు బడా బహుళజాతి ఇంటర్నెట్ గుత్త కంపెనీల లాభ దాహానికి ఆటంకంగా పరిణమించడంతో కంపెనీల ప్రతినిధి ఐన అమెరికా సామ్రాజ్యవాద రాజ్యం సహజంగానే ఆగ్రహం చెందింది.

దానితో ఆయా ఇంటర్నెట్ అజ్ఞాత సంస్థల కార్యకర్తలపై వేట సాగించడానికి ఎఫ్.బి.ఐ, సిఐఎ, ఎన్.ఐ.ఎ మొదలయిన పోలీసు, గూఢచారి సంస్థలను ఉసిగొల్పింది. ఫలితమే ఆరన్ స్వార్జ్ పై బూటకపు కేసులు. బాధితులంటూ ఎవరూ లేని కేసులు మోపిన ఎఫ్.బి.ఐ 35 సంవత్సరాల శిక్షతో ఆరన్ లాంటి స్వేచ్ఛా పిపాసులయిన కార్యకర్తలను భయబ్రాంతులను చేయడానికి పూనుకుంది. లిబర్టీ విగ్రహానికి ప్రాణమే ఉంటే ఆరన్ మరణం చూసి అమెరికా రాజుల స్వేచ్ఛా ప్రియత్వం ఏపాటిదో గ్రహించి తాను సైతం ఆత్మహత్య అయినా చేసుకుంటుంది లేదా అక్కడినుంచి పరుగెత్తి పారిపోయి ఉంటుంది.

వెంటాడి వేధించిన రాజ్యం

అనేక సంవత్సరాల పాటు సాగించిన కృషి ద్వారా పర్వతాలతో పోల్చదగిన విజ్ఞాన సమాచారాన్ని ఆరన్ పోగుచేసి యూజర్లకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చాడు. అందులో 19 మిలియన్ పేజీల అమెరికన్ ఫెడరల్ కోర్టు డాక్యుమెంట్లు కేవలం ఒక భాగం మాత్రమే. PACER కేస్ లా సిస్టం లో ఈ పత్రాలను నిలవ చేసిన ప్రభుత్వం అవి అవసరమైన వారినుండి నామమాత్ర ఫీజు వసూలు చేస్తుంది. ఆరన్ చర్యవల్ల ప్రభుత్వం మిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం ఆ విధంగా అమెరికా రాజ్యం కోల్పోయిందని ఎఫ్.బి.ఐ ప్రచారం చేసింది. కానీ అది ఒట్టి అబద్ధమని క్రియేటివ్ కామన్స్ స్ధాపకుడు లారెన్స్ లెస్సిగ్ లాంటి అనేకమంది ప్రముఖులు తేల్చేశారు. “సమాచారం అంటే అధికారం. కానీ ఇతర అన్ని అధికారాల వలెనే ఈ అధికారాన్ని కూడా తమ వద్దే అట్టి పెట్టుకోవాలని కొందరు భావిస్తున్నారు” అని 2008లో రాసిన ఆన్ లైన్ ‘మేనిఫెస్టో’లో ఆరన్ పేర్కొన్న సంగతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత ఏర్పడ్డదే అమెరికా ప్రజాస్వామ్య ప్రభుత్వం అయి ఉంటే ఆరన్ మేధకు అది సంతోషించి ఉండాలి. కానీ జరిగింది అందుకు పూర్తి విరుద్ధం. ఎటువంటి ఎన్క్రిప్షన్ లేని లాప్ ట్యాప్ నుండి సాధారణ కమేండ్స్ ద్వారా ఆరన్ చేసిన డౌన్ లోడ్ ను దొంగతనంగా అమెరికా ప్రభుత్వం ముద్రవేసింది.

LulzSec logo

LulzSec logo

“అనేక వందల సంవత్సరాలుగా పుస్తకాల రూపంలోనూ, పత్రికల రూపంలోనూ ముద్రితం అవుతూ వస్తున్న సమస్త ప్రపంచ వైజ్ఞానిక, సాంస్కృతిక వారసత్వం మొత్తాన్ని కొద్ది సంఖ్యలోని కార్పొరేషన్లు డిజిటలైజ్ చేసి తమ ఆస్తిగా స్వాధీనం చేసుకుంటున్నాయి… పంచుకోవడం అనైతికం ఏమీ కాదు, అది స్వాభావికం, అవశ్యం. దురాశతో అంధులైన వారు మాత్రమే కాపీ చేసుకోవడానికి తన మిత్రుడిని నిరాకరిస్తారు” అని ఆరన్ ‘మేనిఫెస్టో’లో రాశాడు. సమాచారాన్ని పంచుకోవాలనీ, సమాజం మంచి కోసం అది అందరికీ అందుబాటులో ఉండాలని నమ్మిన ఆరన్ లాభ రహిత సంస్థ ‘డిమాండ్ ప్రోగ్రెస్’ (DemandProgress) ని స్థాపించాడు.

2011లో అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives) ‘స్టాప్ ఆన్ లైన్ పైరసీ’ అనే చట్టాన్ని ఆమోదించకుండా అడ్డుకోవడానికి ఈ సంస్థ కృషి చేసి విజయవంతం అయింది. సంస్థ ప్రచారాన్ని అంది పుచ్చుకుని ప్రజానీకం ఈ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చెయ్యడంతో సభ బిల్లుని ఉపసంహరించుకుంది. ఈ బిల్లు చట్టంగా ఆమోదం పొందితే మేధా సంపత్తిని పంచుకోవడానికి అవకాశం కల్పించే వెబ్ సైట్లను కోర్టు ఆదేశాలతో మూసివేయడానికి అవకాశం ఇచ్చి ఉండేది. చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన వెబ్ సమాచార ప్రసారాలను ఈ చట్టం అడ్డుకొంటుందని, ప్రభుత్వానికి విచ్చలవిడి అధికారాలు ఇస్తుందని ఆరన్, ఇతర కార్యకర్తలు ప్రచారం చేసి విద్యార్ధి, యువతరాన్ని, మేధావులను మేల్కొలపడంతో కంపెనీల ఆటలు సాగలేదు.

అయితే జులై 2011లో ఆరన్ కి కష్టాలు తీవ్రం అయ్యాయి. కాదు, కాదు… తీవ్రంగా కష్టపెట్టారు. ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ సమావేశమై అతనిపై వైర్ ఫ్రాడ్, కంప్యూటర్ ఫ్రాడ్ మొదలయిన కేసులు మోపింది. ‘మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (MIT – మిట్) లోని డిజిటల్ విజ్ఞాన భాండాగారం నుండి అనేక మిలియన్ల విద్యా విషయక వ్యాసాలు, పత్రికలు దొంగిలించాడని సదరు కేసుల్లో మోపిన ఆరోపణలు. మిట్ నిర్మించిన JSTOR అనే ఆన్ లైన్ జర్నల్ పంపిణీ భాండాగారం నుండి 4 మిలియన్ల వ్యాసాలను మిట్ కంప్యూటర్ నెట్ వర్క్ ని ఉపయోగించి దొంగిలించాడని ఫెడరల్ అధికారులు ఆరోపించారు.

లాభార్జనా కంపెనీల తరపున పనిచేసే రాజ్యం దృష్టిలో ఇది దొంగతనం అయితే ప్రజల దృష్టిలో, మానవ సమాజ అభివృద్ధి దృష్టిలో ఇది అత్యంత ప్రజాస్వామిక చర్య. తరతరాలుగా శ్రామిక సమాజం అనేక రూపాల్లో కష్టించి ఉత్పత్తులు తయారు చేయగా పోగు పడిన సమాచార విజ్ఞానాన్ని తిరిగి అదే శ్రామిక ప్రజలకు ఉచితంగా, సౌకర్యవంతంగా అందుబాటులో ఉంచాలని చెప్పడంకంటే మించిన ప్రజాస్వామిక సంస్కృతి ఇంకేం ఉంటుంది? అయినప్పటికీ మిట్ నుండి తాను సంపాదించిన కాపీలని తిరిగి ఇచ్చెయ్యడంతో ఆరన్ పై మిట్ ఎలాంటి ఆరోపణలూ చేయలేదని అప్పట్లో పత్రికలు తెలిపాయి. కానీ కంపెనీల ప్రతినిధులతో కూడిన రాజ్యం ఊరుకోలేదు. విస్తృతం అవుతున్న ఆన్ లైన్ ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్తలకు వారు గుణపాఠం నేర్పదలిచారు. తమ లాభార్జనకు అడ్డు వస్తే ఏమవుతుందో ఆరన్ ను ఒక ఉదాహరణగా చూపదలిచారు. 35 సంవత్సరాల శిక్షకు పాత్రుడయ్యే విధంగా నేరారోపణలు నమోదు చేసారు. ఆరోపణలు రుజువైతే జైలు శిక్షతో పాటు 1 మిలియన్ డాలర్లు జరిమానా చెల్లించవలసి ఉండేదని సి.ఎన్.ఎన్ పత్రిక తెలిపింది.

ఈ ఆరోపణలన్నింటినీ ఆరన్ తిరస్కరించాడు. ది హిందూ పత్రిక ప్రకారం ఆరన్ పై ఆరోపణలేవీ నిలిచేవి కాదు. ఆయన తస్కరించాడని భావిస్తున్న ఆర్టికల్స్ అన్నీ మిట్ యూనివర్సిటీ అతిధులకు అందుబాటులో ఉండేవే. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ‘సఫ్రా సెంటర్ ఫర్ ఎధిక్స్’ లో ఫెలో అయిన ఆరన్ మిట్ యూనివర్సిటీకి అతిధి కూడా అయినందున ఆర్టికల్స్ ను తస్కరించే అవసరమే అతనికి లేదని న్యాయ నిపుణులను ఉటంకిస్తూ ది హిందూ తెలిపింది.

ఆరోపణలే చావుకి దారి తీశాయి

ఫెడరల్ అధికారులు ఎక్కుపెట్టిన ఆరోపణలు, మిట్ అధికారులు సాగించిన వ్యవహారమే తమ కుమారుడి మరణానికి దారి తీశాయని ఆరన్ తల్లిదండ్రులు ఆరోపించారు. అత్యద్భుతమైన తన తెలివితేటలను, సామాజిక సమ న్యాయం పట్ల తనకి ఉన్న నిబద్ధత కోసమే తమ కుమారుడు వెచ్చించాడని వారు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. మిట్ అధికారులు, ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చేసిన నిర్ణయాలే అతనిని చావు వైపుకి నెట్టాయని వారు తెలిపారు. “ఆరన్ చావు కేవలం వ్యక్తిగత దుఃఖాంతం కాదు. బెదిరింపులతో, మోసపూరితమైన ప్రాసిక్యూటర్ల నియంతృత్వ చేష్టలతోనూ నిండిపోయి పుచ్చిపోయిన ఒక నేర పూరిత న్యాయ వ్యవస్థ వల్ల కలిగిన ఫలితం ఇది… అమెరికా అటార్నీ కార్యాలయం 30 సం. కు పైగా జైలు శిక్ష విధించే విధంగా, ఊహించనలవికాని కఠినాత్మక ఆరోపణలను ఎక్కుపెట్టి బాధితులెవ్వరూ లేని నేరానికి శిక్షించడానికి పూనుకుంది” అని వారు తమ ప్రకటనలో తెలిపారు.

Hacktivist logo

Hacktivist logo

ఆరన్ స్వార్జ్ డిప్రెషన్ వ్యాధితో బాధపడుతున్నాడని అతని మిత్రుడు డాక్టరో తెలిపాడు. ఆరన్ తో కలిసి ఆయన ‘బోయింగ్ బోయింగ్’ అనే వెబ్ లాగ్ (బ్లాగ్) నిర్వహిస్తున్నాడు. “రాజకీయ అంతర్ దృష్టి కోణం, సాంకేతిక నైపుణ్యం, ప్రజలు వారి సమస్యలపైన అద్భుత తెలివితేటలు మున్నగు లక్షణాలతో కూడిన ప్రావీణ్యం ఆరన్ సొంతం… కానీ ఆయన అనేక సంవత్సరాలుగా డిప్రెషన్ వ్యాధితో బాధపడుతున్నాడు” అని డాక్టరో తెలిపాడు.

వార్తలను పంచుకునేందుకు ఏర్పడిన Reddit సామాజిక వెబ్ సైట్ ను నిర్మించినవారిలో ఆరన్ ఒకరు. అయితే Wired పత్రిక ఎడిటర్ కొండే నాస్ట్ దానిని కొనేశాక ఆరన్ అక్కడినుంచి బైటకి వచ్చేశాడు. Wired ఆధీనంలోని Reddit లో పని చేస్తుండగానే ఆరన్ డిప్రెషన్ ఎక్కువయింది. వైర్డ్ పత్రిక ఆఫీసుల్లో పనిచేయడంలో ఆయన అసంతృప్తి చెందాడు. “సుదీర్ఘ కాలంపాటు సెలవు తీసుకున్నాను. జబ్బు పడ్డాను. చచ్చిపోవాలని అనుకున్నాను. పోలీసులను తప్పించుకోవడానికి పరుగులు పెట్టాను. సోమవారం మళ్ళీ తిరిగి వీధుల్లో చేరాక నన్ను రాజీనామా చెయ్యమని కోరారు” అని తన గురించి రాసుకున్న అంశాల్లో ఆరన్ తెలిపాడని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. “ఆరన్ చనిపోయాడు. లోక ద్రిమ్మరులారా, మనం ఒక తెలివయిన పెద్దాయనని కోల్పోయాము. హక్కుల కోసం పోరాడే హ్యాకర్లారా, మనలో ఒకరు కూలిపోయాడు. అందరు తల్లిదండ్రులారా, మనం ఒక సుపుత్రుడిని కోల్పోయాము. దుఃఖిద్దాం రండి!” అని వరల్డ్ వైడ్ వెబ్ లేదా ఇంటర్నెట్ ను సృష్టించడంలో ప్రముఖ పాత్ర పోషించిన బెర్నర్స్ లీ తన ట్విట్టర్ పేజీలో పేర్కొన్నాడు.

స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు తనను తాను ఛాంపియన్ గా చెప్పుకునే అమెరికా సంయుక్త రాష్ట్రాలు వాస్తవంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు బద్ధ శతృవని ఆరన్ బలవన్మరణం మరోసారి స్పష్టం చేస్తున్నది. వ్యక్తులు తమ తెలివితేటలను బహుళజాతి కంపెనీలకు అమ్ముకొని తమ తమ ఆర్ధిక సంపాదనలకు వినియోగిస్తేనే అవి మనగలుగుతాయి తప్పితే సమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ తదితర మానవ సమాజ అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించాలని భావిస్తే సహించనివారు ఈ భూమిపైనే ఉన్నారనీ, నిజానికి భూగోళం అలాంటివారి ఆధీనంలోనే ఉన్నదనీ ఆరన్ జీవన ప్రయాణం, ముగింపు తెలియజేస్తున్నాయి.

తమ తెలివి తమ హక్కు భుక్తమనీ, దానిని తనకు ఇష్టమైన రీతిలో, ముఖ్యంగా సమాజం మేలు కోసం వినియోగించాలని ఎవరైనా భావిస్తే వారికి ఆరన్ జీవితం గుణపాఠం కావాలని అమెరికా రాజ్యమే కాక లాభాల దోపిడీని సమర్థించే రాజ్యాలన్నీ భావిస్తాయి. ప్రజల డబ్బుతో వైద్యం చదువుకుని చట్టవిరుద్ధంగా భ్రూణహత్యలకు పాల్పడుతూ కూడా నిక్షేపంగా కోట్లు ఆర్జించే వాణిజ్య డాక్టర్లు పెద్దమనుషులుగా ఒకవైపు చలామణీ అవుతుంటే నిస్వార్ధ బుద్ధితో గిరిజనులకు ఉచిత వైద్యం అందించిన బినాయక్ సేన్ రాజద్రోహం ఆరోపణలతో నాలుగేళ్లు జైలు జీవితం గడపవలసి రావడం అందుకు ప్రబల సాక్ష్యం. అమెరికా జైల్లో మగ్గుతున్న బ్రాడ్లీ మేనింగ్, లండన్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో బందిఖానా అయిన జులియన్ అసాంజే… మొదలైనవారు కూడా ఆ కోవలోని వారే.

ఆరన్ ఆశయాల నేపధ్యంలో ఆయన చావు వృధా పోకూడదని, ఇంటర్నెట్ స్వాతంత్ర్యం కోసం ప్రపంచ వ్యాపితంగా మరెంతోమంది మిలిటెంట్ కార్యకర్తలు ఆవిర్భవించాలనీ ఆశించడంలో తప్పులేదు.

3 thoughts on “అంతర్జాల స్వేచ్ఛా పిపాసి, RSS, Redditల నిర్మాత ఆత్మహత్య

 1. ” లిబర్టీ విగ్రహానికి ప్రాణమే ఉంటే ఆరన్ మరణం చూసి అమెరికా రాజుల స్వేచ్ఛా ప్రియత్వం ఏపాటిదో గ్రహించి తాను సైతం ఆత్మహత్య అయినా చేసుకుంటుంది లేదా అక్కడినుంచి పరుగెత్తి పారిపోయి ఉంటుంది.”

  ఈ మాటలు అక్షరసత్యాలు.
  ఆరన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం.

 2. “ఆరన్ చనిపోయాడు. లోక ద్రిమ్మరులారా, మనం ఒక తెలివయిన పెద్దాయనని కోల్పోయాము. హక్కుల కోసం పోరాడే హ్యాకర్లారా, మనలో ఒకరు కూలిపోయాడు. అందరు తల్లిదండ్రులారా, మనం ఒక సుపుత్రుడిని కోల్పోయాము. దుఃఖిద్దాం రండి!”

  ఇంటర్నెట్లో ఇప్పుడే ఈ పసిహృదయం గురించి చదువుతున్నా. అప్పుడే మీరు తెలుగుపాఠకులకు అందించేశారు. హైదరాబాద్ కేంద్రంగా తెలుగు సాహిత్య, సంగీత, సినిమా , మీడియా తదితర రంగాలకు సంబంధించి విస్తృతస్థాయిలో జరుగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియ ఈ పసివాడి అర్థాంతర మృతి సాక్షిగా మరింత వేగం పుంజుకోవలసిన అవసరం ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంటోంది.

  “లాభార్జనా కంపెనీల తరపున పనిచేసే రాజ్యం దృష్టిలో ఇది దొంగతనం అయితే ప్రజల దృష్టిలో, మానవ సమాజ అభివృద్ధి దృష్టిలో ఇది అత్యంత ప్రజాస్వామిక చర్య. తరతరాలుగా శ్రామిక సమాజం అనేక రూపాల్లో కష్టించి ఉత్పత్తులు తయారు చేయగా పోగు పడిన సమాచార విజ్ఞానాన్ని తిరిగి అదే శ్రామిక ప్రజలకు ఉచితంగా, సౌకర్యవంతంగా అందుబాటులో ఉంచాలని చెప్పడంకంటే మించిన ప్రజాస్వామిక సంస్కృతి ఇంకేం ఉంటుంది?”

  ఇక్కడ శ్రామిక సమాజం కంటే మానవ సమాజం అంటేనే మరింత విస్తృతార్థంతో ఉంటుందేమో. శ్రామిక సమాజం అంటున్నారు కదా అని మన మధ్యతరగతి కుహనా ప్రపంచం ‘ఇది మనకు సంబంధించని శ్రామిక విషయం’ అని దాటవేసే ప్రమాదం ఉంది.

  మానవ సమాజం శ్రామిక సమాజానిదే. దానికీ దీనికీ అభేదం లేదు కదా?

  ఈ సహస్రాబ్ది పొడవునా జీవించవలసిన మాననీయుడిని చంపేశారు. డిజిటలీకరణకు మారుపేరుగా కలకాలం తను గుర్తుండిపోతాడు.

  చాలా మంచి వ్యక్తి అవునో కాదో తెలియదు కాని మనుషులందరికీ అవసరమైనవాడు. అందరి దుఃఖజ్ఞాపకాలకూ అర్హుడైనవాడు..

  ఈ కోణంలో ఇది చాలా మంచి కథనం.

  “The world’s entire scientific and cultural heritage, published over centuries in books and journals, is increasingly being digitized and locked up by a handful of private corporations … sharing isn’t immoral — it’s a moral imperative. Only those blinded by greed would refuse to let a friend make a copy,”

  కమ్యూనిస్టు మేనిఫెస్టోలో యువ మార్క్స్ రాసిన ఆ మహత్పూర్ణ వర్ణనను ఇక్కడ మళ్లీ ఈ యువస్వేచ్ఛా పిపాసి వ్యాఖ్యలో చూస్తున్నాను. ఇదీ జీవితమంటే..

  రాజ్యమే ఒక పర్వతభారమై జీవితాన్ని హరించినప్పుడు ఆత్మహత్యను నిరసనాయుధంగా చేసుకున్నవాడు ఎంత గొప్పవాడై ఉంటాడు. వందేళ్లు రోగాలతో పుచ్చిపోతూ ఎవరికీ పనికిరాని బతుకు బతకడం కంటే పాతికేళ్లకే జీవితాలను వెలిగిస్తూ పోవడం మిన్నకాదా?

  ఆత్మహత్య పిరికితనం అని కూసినవాడెవ్వడు…?

 3. ఆరన్ కృషి అమోఘం. అమెరికా ప్రభుత్వం ప్రవచించే స్వేచ్ఛా స్వాతంత్ర్యాల డొల్లతనాన్ని ఆరన్ మరణం బట్టబయలు చేస్తోంది. చిన్నవయసులోనే ఆన్ లైన్ వేదికగా అద్భుతాలు సృష్టించిన ఆరన్ ఇలా బలవన్మరణం పాలు కావటం ఎంతో విషాదకరం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s