అంతర్జాతీయ చీదరింపులు తోసిరాజని కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం“దశాబ్దాల క్రితమే హద్దులు మీరిన ఇజ్రాయెల్ జాత్యహంకారం అంతర్జాతీయ సహనాన్ని పరీక్షించడంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తన సహన పరిమితులు పెంచుకుంటూ పోవడంలో అంతర్జాతీయ సమాజం కూడా తన రికార్డులు తానే అధిగమిస్తున్నదని చెప్పడంలోనూ ఎటువంటి సందేహం లేదు.”

పాలస్తీనాకు ‘పరిశీలక సభ్యేతర దేశం’ హోదాను ఇస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించిన మరుసటి రోజే E-1 ఏరియాలో 3000 ఇళ్లతో కొత్త సెటిల్‌మెంట్ నిర్మిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిన సంగతిని గానీ, ఇజ్రాయెల్ ప్రకటనను నిరసిస్తూ అదే ప్రాంతంలో గుడారాలు వేసి నిరసన తెలియజేస్తున్న స్థానిక, అంతర్జాతీయ ఆందోళనకారులపై ఈరోజు ఇజ్రాయెల్ బలగాలు వినియోగించిన మొరటు బలప్రయోగం గానీ గమనిస్తే ఇజ్రాయెల్ vis-à-vis అంతర్జాతీయ సమాజం విషయంలో ఇది ఎంత సరైన ప్రకటనో తెలియగలదు.

E-1 ఏరియా అంటే వెస్ట్ బ్యాంక్ (పాలస్తీనా)ను ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విడదీసే సన్నని ప్రాంతం. పాలస్తీనా దేశానికి భవిష్యత్తులో రాజధాని గా ఉంటుందని పాలస్తీనీయులు ఆశిస్తున్న తూర్పు జెరూసలెమును దురాక్రమించుకుని కలుపుకోగా మిగిలిన ప్రాంతాల్లో E-1 ఒకటి. బహుశా తూర్పు జెరూసలెములో ఇజ్రాయెల్ ఇంకా ఆక్రమించుకోని చివరి ప్రాంతం కూడా అదేనని పత్రికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా యూదుల కోసం ఇజ్రాయెల్ నిర్మించిన ‘మాలే అడుమిమ్’ పేరుగల అక్రమ సెటిల్‌మెంట్ ను జెరూసలెము నుండి E-1 ఏరియా విడదీస్తుంది. E-1 అంటే East-1 అని అర్ధం. జెరూసలెముకు తూర్పున ఉన్న ప్రాంతం కనుక సంబంధిత ప్రాంతం కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం రూపొందించిన కనస్ట్రక్షన్ ప్లాన్ లో E-1 గా చెప్పడం వలన ఆ ఏరియాను E-1 ఏరియాగా అంతర్జాతీయంగా పిలుస్తున్నారు.

Protesters' tents -Photo: Haaretz

Protesters’ tents -Photo: Haaretz

E-1 ఏరియాలో సెటిల్‌మెంట్ నిర్మిస్తున్నట్లు ఇజ్రాయెల్ చేసిన ప్రకటన వాస్తవ రూపం దాల్చితే వెస్ట్ బ్యాంక్ ను ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విడదీసినట్లేనని అమెరికా, యూరప్ లతో పాటు అన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పాలస్తీనా ప్రజలు కోరుతున్న సొంత దేశాన్ని వారికి కాకుండా చేయడానికే, తమ భవిష్యత్తు రాజధాని తూర్పు జెరూసలెమును పూర్తిగా దురాక్రమించడానికీ ఇజ్రాయెల్ ఈ పధకం అమలు చేస్తున్నదని పాలస్తీనా నాయకులు ఆరోపిస్తున్నారు. తూర్పు, పశ్చిమ జెరూసలెము అంటూ ఏవీ లేవనీ, ఉన్నదంతా జెరూసలెము మాత్రమేనని, అదంతా ఇజ్రాయెల్ లో భాగమేనని ప్రధాని నెతన్యాహు అనేక సార్లు చేసిన ప్రకటనలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

E-1 సెటిల్‌మెంట్ నిర్మాణంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు చేసిన ప్రకటనను నిరసిస్తూ పాలస్తీనీయులు, అంతర్జాతీయ కార్యకర్తలతో కూడిన 200 మందికి పైగా E-1 ఏరియాలో 20 వరకు గుడారాలు నిర్మించారని ది గార్డియన్ పత్రిక తెలిపింది. ఈ ప్రాంతం పేరు బాబ్ ఆల్-షామ్స్ అనీ నూతన పాలస్తీనా గ్రామంగా అది ఉంటుందనీ వారు ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకోలేదు. E-1 ఏరియాను మిలిటరీ రక్షిత ప్రాంతంగా ప్రకటిస్తూ 500కి పైగా పోలీసులను అక్కడ దింపింది. మరో వారం రోజుల వరకూ E-1 ఏరియాలోని గుడారాలను కొనసాగనివ్వాలని ఇజ్రాయెల్ కోర్టు ఒకటి తీర్పు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. లాఠీలతో బలప్రయోగం చేసి వారిని అక్కడినుంచి తొలగించారు. కోర్టు గుడారాలు ఉండాలని చెప్పింది తప్ప మనుషులుని కాదని చెప్పి ఇజ్రాయెల్ తన బలప్రయోగాన్ని సమర్ధించుకొంది.

పోలీసులు ఎవరిపైనా బలప్రయోగం చెయ్యలేదనీ వారిని శాంతియుతంగా బస్సులు ఎక్కించి అక్కడినుంచి తీసుకెళ్లామని ఇజ్రాయెల్ పోలీసులు చెబుతున్నారు. అయితే ఆందోళనకారులు పోలీసుల మాటలను కొట్టి పారేశారు. పోలీసు చర్యలో అనేకమంది ఆందోళనకారులు గాయపడ్డారని వారు తెలిపారు. కొందరని ఆసుపత్రిలో చేర్చారని తెలిపారు. పోలీసులు మొరటుగా వ్యవహరించారనీ, బలంగా తోసుకుంటూ బస్సులో కుదేశారనీ తాను కూడా గాయపడ్డానని పాలస్తీనా చట్టసభ సభ్యుడు ముస్తఫా బర్ఘౌతి చెప్పాడని ‘ది హిందూ’ తెలిపింది.

1947 నుండి ఇప్పటివరకూ పాలస్తీనాను ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న తీరిది (ఫొటో: ది హిందూ)

1947 నుండి ఇప్పటివరకూ పాలస్తీనాను ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న తీరిది (ఫొటో: ది హిందూ)

“ఒకవైపు ఈ ఇజ్రాయెల్ ప్రభుత్వం మా నేలను దోచుకోవడానికి సెటిలర్లను అనుమతిస్తోంది, చట్ట విరుద్ధంగా నిర్మాణాలను అనుమతిస్తోంది. ఐరాస తోపాటు ప్రపంచంలోనే దేశాలన్నీ ఇదే చెబుతున్నాయి. ఇప్పుడేమో మా నేలపై మేము నిలబడి ఉన్నందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నారు” అని ముస్తఫా ఆల్-జజీరా చానెల్ కి చెప్పాడని ‘ది హిందూ’ తెలిపింది. జనవరి 22, 2013 తేదీన జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికే నెతన్యాహు ఇలాంటి తీవ్రచర్యలకు పాల్పడుతున్నాడని ముస్తఫా ఆరోపించాడు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో సెటిల్‌మెంట్లు నిర్మించకుండా అడ్డుకోవడానికి ఇకనుండి తాము నిరసన శిబిరాలు లేదా ఔట్ పోస్టులు నిర్మిస్తామనీ ఆయన తెలిపాడు. అక్రమ సెటిల్‌మెంటు నిర్మాణానికి ముందు ప్రభుత్వ అనుమతితో ఇజ్రాయెలు టెర్రరిస్టులు సాధారణంగా అనుసరించే ఎత్తుగడ ఇదే కావడం గమనార్హం.

ఆందోళనకారులపై ఇజ్రాయెల్ పోలీసులు విరుచుకుపడడాన్ని పాలస్తీనా అధ్యక్షుడు అమెరికా, యూరప్ ల నమ్మిన బంటు అయిన మహమ్మద్ అబ్బాస్ ‘ఏహ్యమైన నేరంగా’ అభివర్ణించాడు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం తమ పోలీసులను పొగడ్తలతో ముంచెత్తాడు. E-1 ఏరియా తమదేనని మరొక సారి ఆయన నొక్కి చెప్పాడు. E-1 ఏరియాలో సెటిల్‌మెంట్ నిర్మిస్తే ఇజ్రాయెల్ కి అదే రెడ్ లైన్ అవుతుందని అమెరికా, యూరప్ లు అనేక సార్లు ప్రకటించాయి. కానీ అమెరికా, యూరప్ బెదిరింపులను ఇజ్రాయెల్ ఏనాడూ లెక్క చేసింది లేదు. అవి చేసే ప్రకటనలు ప్రపంచ దేశాలనూ, పాలస్తీనీయులనూ నమ్మించడానికే తప్ప తమను ఉద్దేశించినవి కావని ఇజ్రాయెల్ పాలకులకు బాగానే తెలుసు మరి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s