నా జీవితంకోసం పోరాడి గెలిచాను -30 సం. క్రితం సొహైలా


Dont get raped(ఇప్పటికి ముప్ఫైయేళ్ళ క్రితం, తనపై నలుగురు సంస్కృతీ కాపలాదారులు రెండు గంటలపాటు అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపిన మూడు సంవత్సరాల తరవాత ‘సొహైలా అబ్దులాలి’ రాసిన వ్యాసం ఇది. దీనిని మహిళా పత్రిక ‘మానుషి’ ప్రచురించింది. అప్పటికీ ఇప్పటికీ భారత సమాజంలో పితృస్వామిక విలువలు మారని వైనాన్ని ఈ వ్యాసం స్పష్టం చేస్తోంది. భారత పాలకులు అదే బూజుపట్టిన, స్త్రీలను చెరబట్టిన బురదలోనే దొర్లుతున్నారని ఈ వ్యాసంలోని అంశాలనూ, ఢిల్లీ అత్యాచారం తర్వాత వారు వరదలా పారిస్తున్న ప్రకటనల మకిలినీ పోల్చిచూస్తే అర్ధం అవుతుంది. ‘అన్నలారా, తమ్ములారా’ అంటూ రేపిస్టుల కాళ్లపై పడి బతిమాలుకుంటే దామిని బతికిపోయేదని అసరం బాపూజీ లాంటి మత గురువుల ప్రకటనలు ఎంత తప్పో కూడా ఈ వ్యాసం చెబుతోంది.)

—   ***   —   ***   —   ***   —

నాకు 17 యేళ్ళ వయసప్పుడు, అనగా మూడేళ్ళ క్రితం, నేను సామూహిక అత్యాచారానికి గురయ్యాను. నా పేరు, నా ఫోటో ఈ వ్యాసంతోపాటు కనిపిస్తాయి.

నేను బోంబేలో పెరిగాను. ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నాను. అత్యాచారాలపై ఒక ధీసిస్ రాస్తున్నాను. పరిశోధనకోసం రెండు వారాల క్రితం ఇండియా వచ్చాను. అత్యాచారం గురించీ, అత్యాచారం చేసేవారి గురించీ, అత్యాచారానికి గురయ్యేవారి గురించీ జనానికి ఉండే దురభిప్రాయాలపై మూడేళ్లనాటి ఆ రోజునుండీ తీవ్రస్ధాయిలో నా అవగాహనలోకి వచ్చాయి. (అత్యాచారం తరువాత) బతికి బట్టకట్టినవారికి అంటుకుని ఉండే అపవాదు లేదా కళంకం గురించి కూడా నేను ఎరుగుదును. ఆ విలువైన ‘కన్నెరికాన్ని’ పోగొట్టుకోవడం కంటే బహుశా చావడమే మంచిదని సందర్భం వచ్చినప్పుడల్లా జనం మనకి గుర్తు చేస్తూనే ఉంటారు. దానిని నేను అంగీకరించను. నా జీవితమే నాకు అన్నింటికంటే విలువైనది.

ఈ అపవాదునుండి తప్పించుకోడానికే అనేకమంది బాధిత మహిళలు మౌనంగా ఉంటారని నేను భావిస్తాను. కానీ వారు ఆ మౌనంవల్లనే భరించలేని వేదనను అనుభవిస్తారు. పురుషులు అనేక కారణాలతో బాధితురాళ్లనే వేలెత్తి చూపుతారు. దిగ్భ్రమ కలిగించేదేమిటంటే మహిళలు సైతం బాధితురాళ్లనే వేలెత్తి చూపడం. వ్యవస్ధీకృతమయిన పితృస్వామిక విలువలు దీనికి కారణం; బహుశా అటువంటి భయానక అనుభవం తమకు జరిగే అవకాశం లేదని చెప్పుకోవడానికి అదొక మార్గమేమో!

ఒక వెచ్చనైన సాయంత్రం వేళ అది జరిగింది. అత్యాచారాల నిరోధం కోసం మెరుగైన చట్టాలు తేవాలని మహిళా గ్రూపులు డిమాండ్లు మొదలు పెట్టిన సంవత్సరం అది. నేను నా ఫ్రెండ్ రషీద్ తో ఉన్నాను. మేము అలా నడుచుకుంటూ వెళ్లాము. మా ఇంటికి మైలున్నర దూరంలో బొంబే శివారు ప్రాంతమైన చెంబూరువద్ద ఒక కొండపక్క కూర్చొని ఉన్నాము. నలుగురు వ్యక్తులు మాపై దాడి చేశారు. వారివద్ద కొడవలి ఉంది. వాళ్ళు మమ్మల్ని కొట్టారు; బలవంతంగా కొండ ఎక్కించారు. దాదాపు రెండు గంటలపాటు మమ్మల్ని అక్కడ ఉంచారు. మమ్మల్ని శారీరకంగా, మానసికంగా హింసించారు. చీకటిపడ్డాక కేకలువేస్తూ మా ఇద్దరినీ వేరు చేశారు. రషీద్ ని బందీగా పెట్టుకుని నాపై అత్యాచారం జరిపారు. మా ఇద్దరిలో ఎవరు ప్రతిఘటించినా రెండో వ్యక్తిని గాయపరుస్తారు. ఈ ఎత్తుగడ బాగానే పనిచేసింది.

మమ్మల్ని చంపాలా లేదా అన్నది వారు నిర్ణయించుకోలేకపోయారు. మేము జీవించి ఉండడానికి మా శక్తులన్నీ ఉపయోగించాము. నా లక్ష్యం ఏమిటంటే నేను బతికి ఉండడం. మరే ఇతర అంశం కన్నా నాకదే ముఖ్యం. వారిని నేను మొదట భౌతికంగా ప్రతిఘటించాను. నన్ను కదలకుండా చేశాక వివిధ మాటలని ప్రయోగించాను. కోపం, కేకలు ఇవేవీ పని చేయలేదు. ప్రేమ చూపాలనీ, కనికరం చూపమనీ ఒక విధంగా పిచ్చిగా మాట్లాడాను. మానవత్వం గురించి మాట్లాడాను. నేను మనిషిననీ, వారూ మనుషులే కనుక లోపల ఎక్కడో మానవత్వం ఉండే ఉంటుందనీ… ఇలా. ఈ మాటల తర్వాత కనీసం ఆ క్షణాల్లో అత్యాచారం చేయని వారు మృదువుగా వ్యవహరించారు. నన్నూ, రషీద్ నీ చంపకుండా వదిలిపెట్టినయితే తర్వాత రోజు కలవడానికి నేను మళ్ళీ వస్తానని వారిలో ఒక రేపిస్టుకి చెప్పాను. ఆ మాటలే నేను చెప్పగలదానికంటే ఎక్కువగా మూల్యం చెల్లించుకోవడానికి తర్వాత కారణమయ్యాయి; కానీ రెండు జీవితాలు గాలిలో ఉన్నాయి మరి. నేను మళ్ళీ వెనక్కి వెళ్లగలిగేది ఎప్పుడంటే వాళ్ళు మళ్ళీ ఎప్పుడూ ఎవరినీ అత్యాచారం చెయ్యకుండా చెయ్యగల పదునైన ఆయుధంతో నేను వెళ్లగలిగితేనే.

సంవత్సరాల తరబడిన హింసతో పోలిన టార్చర్ అనంతరం (నాపై కనీసం 10 సార్లు అత్యాచారం జరిపారనుకుంటాను. కానీ నేను ఎంత నెప్పితో బాధపడ్డానంటే కొంతసేపటికి ఏమి జరుగుతున్నదో కూడా గ్రహించలేకపోయాను) మమ్మల్ని వెళ్లనిచ్చారు. ఒక అబ్బాయితో ఒంటరిగా ఉన్నందుకు నేను ఎంతటి అనైతిక ‘_ _’ (whore)నో తెలియజేస్తూ చివరిగా ఒక సుదీర్ఘమైన లెక్చర్ ఇచ్చాక మమ్మల్ని వదిలారు. అదే (అబ్బాయితో ఒంటరిగా ఉండడం) వారికి అన్నింటికంటే ఎక్కువగా కోపం తెప్పించింది. ఆ సమయం అంతా వారు నాకేదో మేలు చేస్తున్నట్లే, నాకు గుణపాఠం నేర్పుతున్నట్లే వ్యవహరించారు. వారిది అత్యంత మూఢత్వంతో కూడిన ఆత్మ ధర్మనిష్టాపరత్వం (self-righteousness).

యుక్త వయసులో సొహైలా అబ్దులాలి -ఫొటో: మానుషి

యుక్త వయసులో సొహైలా అబ్దులాలి -ఫొటో: మానుషి

వాళ్ళు మమ్మల్ని కొండకిందికి తీసుకెళ్లారు. చీకటిలో కలిసిపోయిన రోడ్డు మాకు ఎదురైంది. మేము ఒకరినొకరు విడువకుండా, అస్ధిరమైన నడకతో దానివెంటే వెళ్లాము. వాళ్ళు కొడవలి ఎత్తిచూపిస్తూ మమ్మల్ని కొంతసేపు వెంటాడారు. బహుశా అన్నింటికంటే భయానక పరిస్ధితి ఆదేనేమో -విముక్తి అతి సమీపంలోనే ఉంది; కానీ చావు మా వెన్నంటే ఉంటూ వచ్చింది. చిరిగిపోయి, చెదిరిపోయి, గాయాలతో,  గీకుళ్లతో, విహ్వలురై చివరికి ఇంటికి చేరాము. అదొక ‘ఆశలని జారవిడిచే’ నమ్మలేని దుర్భరమైన భావన: ఏంజరిగితేనేం బతుకు బేరం ఇక వద్దనే తెగింపు, అయినా వారికి కోపం తెప్పించే ఒక్క మాట మాట్లాడినా కొడవలి మా కడుపులోకి దిగుతుందన్న స్పృహతో ఆచితూచి పెగిలే బరువైన మాటలు. మా ఎముకల్లోకి ఉపశమన భావన ఒక్క ఉదుటున పరుగులెత్తి కళ్లనుండి ఎగిసిపడగా మేము అక్కడికక్కడే అదాటున పిచ్చి అరుపులలో కూలిపోయాము.

జరిగిన సంగతి ఎవరికీ చెప్పనని రేపిస్టులకు దృఢమైన హామీ ఇచ్చిన నేను ఇంటికి చేరిన మరునిమిషంలోనే పోలీసులను పిలవమని మా నాన్నకి చెప్పాను. వారిని పట్టుకోవాలని నేనెంత ఆతృతగా ఉన్నానో మా నాన్న కూడా అంతే ఆతృత ప్రదర్శించాడు. నాకు ఎదురయిన అనుభవం మరొకరికి ఎదురుకాకుండా ఉండడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధమైపోయాను. పోలీసులు అత్యంత మొరటుగా వ్యవహరించారు; చులకనగా చూశారు; చివరికి నన్ను కూడా తప్పుచేసినవారిలో భాగంగా చేశారు. ఏంజరిగిందని వాళ్ళు నన్ను అడిగినప్పుడు, జరిగిందేమిటో వారికి నేరుగా చెప్పేశాను. వారు నా మాటలని నన్ను అపఖ్యాతిపాలు చేయడానికి వినియోగించారు; మొఖం ఎర్రబారని, సిగ్గుపడని బాధితురాలిగా ప్రచారం చేసారు. అంతా ప్రచారం అవుతుందని వారు నాకు చెప్పినపుడు ‘ఏం ఫర్వాలేదని’ భరోసా ఇచ్చాను. నిజాయితీగా చెప్పాలంటే… మమ్మల్నే నిందిస్తారని నేనుగానీ, రషీద్ గానీ అనుకోలేదు. నా ‘రక్షణ’ కోసం చిన్నపిల్లల నేరస్ధుల గృహంలో ఉండాల్సి ఉంటుందని చెప్పినపుడు నాపై దాడి చేసినవారిని కోర్టుకి ఈడ్వడానికి తార్పుడుగాళ్ళు, రేపిస్టుల మధ్య ఉండడానికి కూడా సిద్ధపడ్డాను.

కానీ న్యాయ వ్యవస్ధలో స్త్రీలకి న్యాయం అందుబాటులో లేదని నాకు త్వరలోనే అర్ధం అయింది. ఆ కొండపై మీరేం చేస్తున్నారని వాళ్ళు అడిగినప్పుడు నాకు క్రోధం, రోషం తన్నుకు రావడం మొదలయింది. ‘నువ్వేమీ చేయకుండా ఎందుకున్నావు?’ అని రషీద్ ని అడిగినప్పుడు నేను అరిచి గోల చేశాను. అతను ప్రతిఘటించడం అంటే నాకు మరింత టార్చర్ ఎదురుకావడమే అని వారికి అర్ధం అవదా? నేనేలాంటి బట్టలు ధరించాననీ, రషీద్ ఒంటిపై కనపడేవిధంగా గాయాలేవీ ఎందుకు లేవనీ (కొడవలి పిడితో పదేపదే కడుపులో పొడవడం వలన అతనికి శరీరం లోపలే రక్తస్రావం అయింది)… లాంటి ప్రశ్నలు అడిగినపుడు నేను నిస్సహాయురాలినై, నిస్పృహాత్మక భయవిహ్వలనై దుఃఖించాను. మా నాన్న వారెలాంటివారని తాను భావిస్తున్నాడో చెప్పిమరీ వారిని ఇంటినుండి గెంటేశాడు. పోలీసులు నాకు ఇచ్చిన మద్దతు అలాంటిది! ఏ నేరారోపణలూ దాఖలు చెయ్యబడలేదు. మేము అలా నడవడానికి వెళ్లామనీ ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయ్యిందనీ పోలీసులు మా స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు.

ఇది జరిగి మూడేళ్లయింది. కానీ జరిగిన ఘోరం నన్ను వెంటాడని రోజు ఒక్కటీ లేదు. అబధ్రత, ప్రమాదం పొంచిఉందన్న భయం, నిస్సహాయత, క్రోధం… వీటితో నిరంతరం పోరాడుతూ గడిపాను. ఒక్కోసారి నేను రోడ్డుమీద నడుస్తుండగా నా వెనక అడుగుల చప్పుడు వినపడినప్పుడు నాకు చెమటలు కమ్ముకొచ్చేవి; అరుపు బైటికి రాకుండా ఉండడానికి పెదిమలని పళ్లతో అదిమిపెట్టేదాన్ని. స్నేహపూర్వకంగా తడిమినా ఉలిక్కి పడేదాన్ని; చేతులతో గొంతు పిసికినట్లు ఉండడం వలన బిగుతయిన స్కార్ఫ్ ని భరించలేకపోయేదాన్ని; మగవాళ్ళ కళ్లనుండి దూసుకువచ్చే ఒక రకమైన చూపులకు బెదిరిపోయేదాన్ని- ఆ చూపులు చాలా తరచుగా నాకు ఎదురయేవి.

అయినప్పటికీ అనేక విధాలుగా నేనిప్పుడు దృఢమైన వ్యక్తినే. ఎప్పటికంటే ఎక్కువగా అభినందనపూర్వకమైన జీవితాన్ని నేను గడుపుతున్నాను. ప్రతిరోజూ నాకొక బహుమతే. నేను నా జీవితం కోసం పోరాడాను; గెలిచాను. ప్రతికూల ప్రతిస్పందనేదీ నా యీ సానుకూల దృక్పధాన్ని మార్చలేదు.

నేను మగవారిని ద్వేషించడం లేదు. అలా చేయడం చాలా తేలిక. అదేకాక అనేకమంది మగవారు వివిధ రకాల అణచివేతలకు బాధితులు. నా ద్వేషం అంతా పితృస్వామికం పైనే. ‘ఆడవారి కంటే మగవారే గొప్ప, మహిళలకు ఉండకూడని హక్కులు పురుషులకు ఉన్నాయి, పురుషులు మనపై సాధికార పెత్తందార్లు…’ ఇలాంటి నమ్మడానికి వీల్లేని అబద్ధాలంటేనే నాకు పరమ ద్వేషం.

నేను అత్యాచారానికి గురయ్యాను కాబట్టే నేను మహిళా సమస్యలపై స్పందిస్తున్నానని నా ఫెమినిస్టు మిత్రులు భావిస్తుంటారు. కానీ అది సరికాదు. నేను ఫెమినిస్టుగా వ్యక్తీకరించబడిన కారణాలలో అత్యాచారం ఒకటి మాత్రమే. అత్యాచారాన్ని ప్రత్యేకంగా విడగొట్టడం (compartmentalize) ఎందుకు? అత్యాచారాన్ని అవాంఛనీయ మైధున చర్యల్లో ఒకటిగానే ఎందుకు చూడగూడదు? మనం రోడ్డుపై నడిచివెళ్తుండగా ఆకలిచూపుల బారినపడి ప్రతిరోజూ అత్యాచారానికి గురికావడం లేదా? లైంగిక వస్తువులుగానే మనల్ని చూసినపుడు, హక్కులను నిరాకరించినప్పుడు ఇంకా అనేకవిధాలుగా అణచివేతలకు గురయినపుడు అత్యాచారాలకు గురికావడం లేదా? మహిళల అణచివేతను ఏకదిశలో (uni-dimensional) విశ్లేషించడం సాధ్యం కాదు. ఉదాహరణకి వర్గ విశ్లేషణ చాలా ముఖ్యమైనదే, కానీ ఒకే వర్గంలో కూడా అత్యాచారాలు ఎందుకు జరుగుతాయో అది వివరించలేదు.

వివిధ రకాలుగా మహిళలు అణచివేతకు గురవుతున్నంతవరకూ మహిళలంతా అత్యాచారాలకు అనువుగానే ఉంటారు. అత్యాచారాన్ని నిగూఢీకరించడం మనం మానుకోవాలి. మన చుట్టూ ఉనికిలో ఉన్న అత్యాచారాలను అవి ఉన్నాయనీ, వివిధ రూపాల్లో వ్యక్తీకృతం అవుతున్నాయనీ అంగీకరించాలి. వాటిని రహస్యంతో కప్పి పెట్టడాన్ని ఆపాలి. దానిని ఉన్నది ఉన్నట్లు -అత్యాచారం అనేది ఒక హింస, దాన్ని చేసేవాడు నేరస్ధుడు- చూడగలగాలి.

నేను జీవించి ఉన్నందుకు అమితంగా సంతోషిస్తున్నాను. అత్యాచారానికి గురికావడం మాటల్లో చెప్పలేని భయానక అనుభవం, కానీ జీవించి ఉండడం అంతకంటే ముఖ్యమని నా అభిప్రాయం. దీన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఒక మహిళకి గల హక్కు నిరాకరణకు గురయితే మన విలువల వ్యవస్ధలో ఎక్కడో బలీయమైన దోషం ఉన్నట్లే. ఎవరైనా ఒక స్త్రీని బెదిరించి జీవించి ఉండడం కోసం కొట్టించుకోవడానికైనా అంగీకరించేలా చేస్తే, ఆమె కొట్టబడడానికి ఇష్టపూర్వకంగానే  అంగీకరించిన నేరానికి పాల్పడిందని ఎవరూ చెప్పజాలరు. అత్యాచారం విషయంలో ఒక బాధితురాలిని వారినాపని ఎందుకు చేయనిచ్చావని అడుగుతున్నారు; ఎందుకు ప్రతిఘటించలేదని అడుగుతున్నారు; నువ్వూ ఆనందం పొందలేదా అని అడుగుతున్నారు!

అత్యాచారం అనేది నిర్దిష్ట గ్రూపులకు చెందిన మహిళకు మాత్రమే పరిమితం కాదు. లేదా రేపిస్టులు నిర్దిష్ట గ్రూపుకి చెందిన పురుషులే కారు. రేపిస్టు అనేవాడు పక్కింటిలోని క్రూరమైన పిచ్చివాడు కావచ్చు; బాగా స్నేహంగా ఉండే అంకుల్ అయినా కావచ్చు. అత్యాచారం అనేది మరో మహిళకి సంబంధించిన సమస్య అని భావించడం మానుకుందాం. దాని సార్వజనీనతను అంగీకరించి దానిగురించి మరింత మెరుగైన అవగాహనకి వద్దాం.

ఈ ప్రపంచంలో అధికార సంబంధాల పునాది మారనంతవరకూ, స్త్రీలను పురుషుల ఆస్తిగా చూడడం ఆగనంతవరకూ మన హక్కులను హరించి కూడా నిర్దోషిత్వంతో బైటపడగల పరిస్ధితుల మధ్య నిరంతర భయంతో మనం గడపాల్సి ఉంటుంది.

నేను బతికిపోయినదానిని. నన్ను అత్యాచారం చేయాలని నేనెప్పుడూ అడగలేదు; నేను దానిని ఆనందించలేదు కూడా. నాకు తెలిసి అది అత్యంత భయానకమైన హింస. అత్యాచారం మహిళ తప్పు కాజాలదు, ఎప్పటికీ. నిశ్శబ్దాన్ని బద్దలు చేయడానికీ, మనం ఎప్పటికీ బాధితులము కాలేమని మనకి మనం నచ్చజెప్పుకోవడానికి వీలుగా మనం నిర్మించుకున్న సౌకర్యవంతమైన భ్రమలను బదాబదలు చేయడానికీ, ఆ విధంగా వాస్తవ బాధితురాళ్లను మనిషి అనేవారెవరూ ఎరుగని అత్యంత వేదనామయ ఒంటరితనంలో బందీ చేయకుండా ఉండడానికీ… నావైపునుండి ఇస్తున్న ఒక తోడ్పాటు ఈ వ్యాసం.

—   ***   —   ***   —   ***   —

(వర్గ విశ్లేషణ ఏక దిశ (uni-dimensional) లో సాగే విశ్లేషణగా రచయిత్రి చెప్పిన అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు. వర్గ విశ్లేషణను కేవలం రెండు వర్గాల ఉనికిని మాత్రమే గుర్తించేదిగా చెప్పడం సత్యదూరం.  నిజానికి వర్గ విశ్లేషణ సమాజంలోని సమస్త వైరుధ్యాలనీ ఎటువంటి శషబిషలు లేకుండా గుర్తించి, వాటికి పరిష్కారాన్ని కూడా సూచిస్తుంది. There is no such a philosophical analysis in human history as comprehensive as the class analysis that from a minute contradiction say, between electron and proton to a largest contradiction between the imperialist and a globalized worker can easily be analyzed with so much of simplification and wisdom. ఇరవై యేళ్ళ వయసులోని ఫెమినిస్టు కార్యకర్తకు వర్గ విశ్లేషణను సరిగ్గా గ్రహించకపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కాని ఆమె వయసు రీత్యా చూసినపుడు అత్యాచార సమస్యను అత్యంత సూక్ష్మంగానూ, స్ధూలంగానూ విశ్లేషించిన తీరు మాత్రం అనన్య సామాన్యం. -విశేఖర్)

8 thoughts on “నా జీవితంకోసం పోరాడి గెలిచాను -30 సం. క్రితం సొహైలా

 1. కళ్ళు చెమర్చేలా ఉంది ఆమె అనుభవించిన వేదన. అంతటి దారుణమైన హింసకు గురై కూడా తన భావాల్లో ఆమె ఈ స్థాయి పరిణతి చూపటం అసాధారణం.

 2. అవును. ముఖ్యంగా ఇరవైయేళ్ల వయసులో సమతూకంతో కూడిన పరిణతి చూపగలగడం (ఈ వ్యాసం ఆంగ్లంలో చదివినపుడు) నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. విశ్లేషణ చేయడం ఒడ్డుమీద ఉన్నవారికి చాలా తేలిక. పీకల్లోతు సంక్షోభంలో కొనసాగుతూ సొహైలా ఎంతో ధైర్యంతో అప్పట్లోనే రాసిన ఈ వ్యాసం పితృస్వామిక సమాజం మొఖంపై కళ్ళు బైర్లు కమ్మేలా చాచి కొట్టిన దెబ్బ!

 3. విశేఖర్ గారూ, మీ అనువాదం గురించి ప్రత్యేకించి చెప్పాలి…. మూలం చూడాలనిపించేలా… ఎంతో బాగుంది. ఈ టపాను ఫేస్ బుక్ లో షేర్ చేశాను.

  మరో విషయం- వర్గ విశ్లేషణ ప్రత్యేకత గురించి మీరిక్కడ క్లుప్తంగా చెప్పారు కానీ, దాన్ని ఉదాహరణలతో వివరంగా విడి టపాగా రాస్తే బాగుంటుంది!

 4. నాకు ఇంగ్లిష్ బాగానే అర్థమవుతుంది. కానీ చాలా మందికి అర్థం కాదు కదా. అందుకే ఈ వ్యాసాన్ని కూడా తెలుగులోకి అనువదించమని విజ్ఞప్తి చేస్తున్నాను. http://tehelka.com/why-did-it-need-an-incident-so-unspeakably-brutal-to-trigger-our-outrage/

 5. సోమా చౌధురి వ్రాసిన వ్యాసం చదివిన తరువాత చిన్నప్పుడు నేను తెలుగు పత్రికలలోనే చదివిన చేతబడి నెపంతో రేప్‌ల వార్తలు గుర్తొచ్చాయి. పదిహేనేళ్ళ క్రితం నాకు ఇంగ్లిష్ వ్యాకరణం సరిగా రాదు. అప్పట్లో తెలుగు పత్రికలే ఎక్కువగా చదివేవాణ్ణి. తెలుగు పత్రికలలో వ్రాసిన వార్తలు చదివితేనే ఒళ్ళు గగ్గురుపొడిచింది. ఇంగ్లిష్ పత్రికలలో చదివితే ఇంకా గగ్గురుపొడుస్తుంది.

 6. చాలా గొప్పగా ఉంది ఆమె భావ వ్యక్తీకరణ. అవును…జీవించి ఉండటం అన్నింటికంటే ముఖ్యం!

  ఆ సమయంలో ఆమె వారిని నమ్మించేలా, సంయమనం తొ మాట్లాడ్డం కూడా నూటికి నూరు పాళ్ళూ అర్థం చేసుకోదగ్గది. అలాటి సమయస్ఫూర్తి ఆమెకు ఆ సమయంలో ఉన్నందుకు అభినందించాలి. జీవించాలనే కాంక్ష ఆమె చేత అలా చేయించింది.

  వెనగ్గా వినపడుతున్నా అడుగుల చప్పుడు, స్నేహ పూర్వహ స్పర్శలు కూడా ఆమెను వణికిపోయేలా చేశాయంటే..ఎంత హింస అనుభవించి ఉంటుంది. మానసికంగా ఎంత నలిగి పోయి ఉంటుంది? ఎన్ని పీడకలలు వచ్చి ఉంటాయి? ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపి ఉంటుంది?

  ఆ తర్వాత సమాజమూ పోలీసులూ ప్రవర్తించిన తీరు ఆమెను ఎంత నిరాశలోకి నెట్టివేసి ఉంటాయి?

  ఎంత ఘోరం ఎంత ఘోరం?

  ఇలాంటి ఘోర జరిగిన క్షణంలో మనుషులుగా స్పందించలేని వాళ్ళు….చుట్టూ ఆధ్యాత్మిక ప్రగతిని బోధిస్తున్నారు..ఎంత విచిత్రం?

  ఒకడేమో రేపిస్టుల కాళ్ళు పట్టుకుని ఏడవమంటాడు…మరొకడు బురఖా వేసుకోమంటాడు..ఇంకొకడు ఎవరైనా తోడు లేనిది ఇంట్లోంచి బయటికే రావొద్దంటాడు. సాక్షాత్తూ పోలీసులేమో కారప్పొడి, పెప్పర్ స్ప్రే పట్టుకుని తిరగమంటారు..

  సాటి స్త్రీని గౌరవంగా, మనిషిగా చూడండి అని ఒక్కడూ చెప్పడే?

  ఎంత నీచం? మనుషుల మధ్యనే బతుకుతున్నామా అని సందేహం వస్తోంది!!

  ఈ బ్లాగ్ పోస్ట్ ని నా ఫేస్బుక్ వాల్ మీద షేర్ చేసుకున్నాను. విశేఖర్ గారూ, ధన్యవాదాలు

 7. Survival of the fittest అన్నది మనిషి స్వభావంలోనే ఉన్న జంతు నైజం. దీనినుంచి బలహీనుల పైన దాడులు జరుగుతూనే ఉంటాయి. బలహీనత అన్నది శారీరకమైనది మాత్రమే కాదన్నది గమనించాలి. ఇక్కడ చర్చించబడుతున్నట్టు సామాజికమైనది కావచ్చు. మరీ ముఖ్యంగా ఆర్థిక బలం. ప్రస్తుతానికి అర్థిక స్వతంత్రత స్త్రీని చాలా వరకు రక్షిస్తోంది- అత్తింటి ఆరళ్ళు మొదలుకుని భర్త ఆధిపత్య ధోరణి వరకు. కొన్ని కులాల్లో ఆస్తిని ఆడపిల్ల పేరున పెట్టటం వల్ల స్త్రీ భ్రూణ హత్యలు తగ్గాయి, కొన్నింటిలో మాతృస్వామ్యానికీ దారితీసింది!
  దాడి చేయకూడదు అనేది విజ్ఞత. ఇది నైతిక విలులవల వల్ల మనిషికి అలవడుతుంది. దీనికి నైతిక విద్య అవసరం. దీనిని అవకాశం ఉన్నా పాఠశాలల్లో బోధించట్లేదు. ఇళ్ళల్లో తల్లిదండ్రులు చెప్పట్లేదు. కొందరు సంస్కృతి, పురాణాల పైన నెట్టేస్తున్నారు- జరిగిన నేరానికి “శూర్ఫణకను లక్ష్మణుడు దండించిన వైనం” ప్రేరణ అంటున్నారు. కత్తితో చంపొచ్చనే పిల్లవాడి పరిణితిని “కత్తితో శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాల్ని నిలబెట్టాలి” అని తల్లిదండ్రులు మార్చగలగాలి. దీనికి ముందు తల్లిదండ్రుల్లో ఆ పరిణితి ఉండాలి. నాకు తెలిసిన తల్లిదండ్రుల్లో కనీసం 50% మంది అసలు ఈ ధోరణుల్ని పట్టించుకోరు. ఇందులో చాలా మంది ప్రోత్సహిస్తారు కూడా- ఆత్మరక్షణ పేరుతో (ఇది fittest of the survival భావజాలం). అందువల్ల ఈ విజ్ఞతను పాఠశాలల్లో తప్పనిసరిగా బోధించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s