కూతుళ్ళకి కాదు, కొడుకులకు కాపలా కాయండి!


Protest good, but...(రచన: రమ)

ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచార దుర్ఘటన ఎన్నడూ లేనివిధంగా ప్రజాగ్రహానికి గురయింది. మధ్య తరగతి యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి రోజుల తరబడి తీవ్రస్ధాయిలో ఉద్యమించారు. వీరివెనుక ఎలాంటి రాజకీయ పార్టీలుగానీ, విద్యార్ధి సంఘాలుగానీ, ఇతరేతర సంఘాలుగానీ ఉన్న ధాఖలాలు కనపడలేదు. 1975లో హైదరాబాదులో జరిగిన రమీజాబీ అత్యాచార దుర్ఘటన తరువాత యింత ఉధృతమైన ప్రజాప్రతిఘటన అత్యాచారాల విషయంలో ఇదేనని చెప్పవచ్చు. రమీజాబీ విషయంలో విద్యార్ధి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ఒక కార్యాచరణ ప్రకటించి సంఘటిత కృషి చేశాయి. కానీ ఇక్కడ యువత స్వచ్ఛందంగా కదిలినతీరు యాదృచ్ఛికంగా భావించనవసరం లేదు.

ఢిల్లీని భారత రాజధానిగానే కాక అత్యాచారాల రాజధాని నగరంగా కూడా పేర్కోవడం అతిశయోక్తికాదేమో! ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా రాత్రింబవళ్ళు యువతులు పనిచేయాల్సిన ఒక అనివార్య చారిత్రక అవసరంలో మెట్రోల్లో, బస్సుల్లో ఒంటరి ప్రయాణాలు చేస్తున్న యువతలో, వరుసగా జరుగుతున్న ఈ అత్యాచారాల పరంపర వారిలో కలిగిస్తున్న అబధ్రతాభావం, దేశ రాజధానిలోనే రక్షణ కరువైందనే అసంతృప్తి, భయాందోళనలు ఈ దుర్ఘటనతో తారాస్ధాయికి చేరుకుని ఉద్రిక్తతకూ, ఉద్యమాలకూ దారి తీసిందేతప్ప ఇది యాదృచ్ఛికం కాదు.

అత్యాచార దుర్ఘటననూ, ఆ తర్వాత జరిగిన ఘటనలనూ శాస్త్రీయంగా పరికిస్తే కొన్ని ప్రశ్నలూ, మరికొన్ని సమాధానాలూ మనకు కనిపిస్తాయి.

ఒకటి: ఉద్యమిస్తున్న యువతీ యువకుల డిమాండ్స్ లో ప్రముఖంగా కనిపిస్తున్నది నిందితులను కఠినంగా శిక్షించాలని. ఎంత కఠినంగా శిక్షించాలి అనంటే వారిని ఉరితీయాలి లేదా నపుంసకులుగా మార్చాలి అన్నంత దూరం ఆ డిమాండ్స్ వెళ్ళాయి. తక్షణ డిమాండ్స్ గా ఇవి మనకి కనిపిస్తున్నప్పటికీ, తరువాత? అన్న ప్రశ్నకు వారివద్ద సమాధానంగానీ స్పష్టతగానీ లేదు. ఒక మానసిక వైపరీత్యంతో కూడిన హింసాత్మక నేరం అమాయకురాలిపై జరిగినపుడు ప్రకోపించే కోపాన్ని, ఆగ్రహావేశాలనూ తమగానో లేక తమ కుటుంబ సభ్యురాలిగానో ఐడెంటిఫై చేసుకుని తద్వారా వాళ్ళు పొందుతున్న అభద్రతాభావం నుండి పెల్లుబుకిన ఆ డిమాండ్స్ ను మనం అర్ధం చేసుకోవచ్చు; కానీ సమర్ధించలేము.

రెండు: ఈ సందర్భంగా వివిధ రాజకీయ నాయకులు, సినిమా నటులు చేస్తున్న ప్రకటనలు మన రాజకీయ వ్యవస్ధ ఇంత అపరిపక్వ దశలో ఉందా అనే సందేహం కలిగిస్తోంది. లేక అపరిపక్వత నటిస్తున్నారా అన్న సందేహం కూడా లేకపోలేదు. దేశానికి దిశానిర్దేశం చేయవలసిన రాజకీయ నాయకులు ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారంటే అత్యాచారాలకు మహిళల వస్త్రధారణే కారణం అనే దగ్గర్నుండి ఎదిగి “అర్ధరాత్రి స్వాతంత్ర్యం వస్తే మాత్రం ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగేస్తారా?” అని కూడా అనేస్తున్నారంటే… వీళ్ళ తలకాయలు ఏ యుగాల్ని దాటిరానట్లు? అర్ధరాత్రి స్వతంత్రం అవినీతిపరులకు, భూ బకాసురులకూ, కబ్జాదారులకూ, ఖూనీకోర్లకూ, రేపిస్టులకూ మాత్రమే వచ్చిందని వీరు చెప్పదలిచారా?

మూడు: నాయకులు, సెలబ్రిటీల తీరు ఎలాఉంది? ఉద్యమం మొదలయినపుడు ‘అరాచకాన్ని సహించేది లేద’ని హుంకరించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంతలోనే దిగివచ్చి ‘ప్రజాగ్రహాన్ని అర్ధం చేసుకున్నాం’ అని ప్రకటించాల్సి వచ్చింది. సోనియాగాంధిగారు నేరస్ధులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృత్యువుతో పోరాడుతున్న దామిని పరిస్ధితిపై కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ గాద్గదిక స్వరంతో విలపిస్తూ చేసిన ప్రకటన అందరినీ కన్నీళ్లు పెట్టించింది. “ఇలాంటి దేశంలోనా నా కూతురు పెరగాల్సింది?” అంటూ ఆవేదన వెలిబుచ్చి అభిషేక్ బచ్చన్ అందరి దృష్టినీ ఆకర్షించడంలో తానూ ఒక అడుగు ముందుకేసాడు.

ఈ నాయకులకూ, సెలబ్రిటీలకూ నా ప్రశ్న. కాంగ్రెస్ పార్టీనీ, దానిద్వారా దేశాన్నీ నడిపిస్తున్న సోనియా గాంధిగారు ఒక స్త్రీగా మొదటిసారి స్త్రీలపై జరుగుతున్న హింసకు స్పందించారా? మంచిదే. ఈశాన్య రాష్ట్రాలకు మీరు పంపిన మిలట్రీ జవాన్లు అక్కడి స్త్రీలపై నిత్యం పాల్పడుతున్న దారుణ అత్యాచారాలు మీ కళ్ళకు కనిపించకపోయినా, మణిపూర్ లో 14 సంవత్సరాలుగా ‘సాయుధ ధళాల ప్రత్యేక అధికారాల చట్టం”కు వ్యతిరేకంగా ఇరోమి షర్మిల చేస్తున్న అకుంఠిత నిరాహారదీక్ష, రోజు రోజుకీ క్షీణిస్తున్న ఆమె ఆరోగ్యం మీకు ఎలాంటి భావోద్రేకాన్నీ కలిగించకపోయినా, గిరిజన స్త్రీలపైనా, దళిత మహిళలపైనా పోలీసు మూకలు జరుపుతున్న అత్యాచారాలు మిమ్మల్ని కదిలించకపోయినా మీ కన్నీళ్లను మేము నమ్ముతున్నాము.

అయితే  మీరు తెచ్చిన చట్టాలు, అగ్రరాజ్యాలకు అనుకూలంగా అమలుచేస్తున్న నూతన ఆర్ధిక విధానాలు స్త్రీలని ఈ స్ధితికి దిగజార్చాయని మీకు తెలియదనుకోవాలా? దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయ రంగాన్ని నీరుకారిస్తే వ్యవసాయ కుటుంబాలు, ఆ స్త్రీల ఏమయ్యారు? ఎటుపోయారు? రైతులు కూలీలయ్యారు, రైతుకూలీలు పట్టణాలకు వలసపోయి భవన నిర్మాణ కార్మికులయ్యారు. వారి ఆర్ధిక, సాంఘిక జీవనం ఛిన్నాభిన్నం అయ్యి ఆ కుటుంబాల ఆడబిడ్డలు అనేకమంది వేశ్యలయ్యారు. నూతన ఆర్ధిక విధానాల అమలు ఫలితంగా భారతదేశంలో శరీర వ్యాపారం (flesh market) దినదినాభివృద్ధి చెందింది. గ్రామీణ వలసకూలీల ఆడబిడ్డలు శరీర వ్యాపారంలో సరుకుగా అమ్ముడవుతూ రోగాలకూ, రొష్టులకూ దగ్గరై, ఓ కవి చెప్పినట్లుగా ఎందరికో పండై, తనువు పుండై బతుకులు చాలిస్తున్నారు.

1990 తర్వాత వచ్చిన యువతరం మీరు ప్రోత్సహించి పెంచిన పశ్చిమ సామ్రాజ్యవాద విష సంస్కృతికి పూచిన కుక్కమూతి పిందెలే కాదా? మీరు కొత్తగా, ఇష్టంగా తెచ్చిన FDI చట్టం కోట్ల కుటుంబాలను రోడ్డుమీదికి ఈడ్వబోతోంది. వీళ్ళంతా రేపు సంఘవ్యతిరేక శక్తులుగా మారి స్త్రీలపై జరగబోయే దమనకాండకు కారకులుగా తేలితే మీకందరికీ ఇక విలపించడానికి గ్లిజరిన్ సహాయం కావలసిందే.

జయాబచ్చన్ గారూ! మీ భావోద్రేకాన్ని స్త్రీలుగా, పౌరులుగా అర్ధం చేసుకున్నాం. దానికంటే ముందు మీరు తీసిన, మీ కుటుంబ సభ్యులు తీస్తూ నటిస్తున్న సినిమాల్లో స్త్రీ పాత్రలు ఏమిటి? విచ్చలవిడి అశ్లీలతతో అర్ధనగ్న దేహాలతో నటిస్తూ, నర్తిస్తూ శరీర ప్రదర్శన తప్ప వ్యక్తిత్వ ప్రదర్శన చేయలేని మీ సినిమాలు యువతరానికి ఏ సందేశం ఇస్తున్నాయి? ఒక పక్క మీ అప్పులు తీర్చి, మీ వ్యాపారాలు పెంచడానికి ఉపయోగపడే సినిమాలు ఇంకొక పక్క స్త్రీలపట్ల అమానవీయమైన హింసాప్రవృత్తిని ప్రేరేపిస్తున్నాయన్న వాస్తవాన్ని మీరు గ్రహించలేకపోతున్నారా? ఈ దుర్ఘటనలేవీ చెదురుకుదురుగా జరుగుతున్నవేమీ కాదే?! అనేక సంవత్సరాలుగా, స్త్రీలు పనిచేసే దగ్గర, చదువుకునే చోట్ల, చివరికి స్వంత ఇంట్లో చీకటిగదుల్లో… ఆడపిల్లగా పుట్టినందుకు మాంసపు ముద్దలుగానే భావించి జరుపుతున్న అత్యాచారాలు కోకొల్లలు.

అభిషేక్ బచ్చన్ గారూ! మీ అమ్మాయి ఈ దేశంలో క్షేమంగా పెరగాలంటే వ్యక్తిత్వం ఉండే స్త్రీపాత్రలను మీరు నటించే సినిమాల్లో సృష్టించాలని చెప్పగలరా? సామాజిక బాధ్యతతో తీసే సినిమాల్లోనే నటిస్తామని ఆంక్షలు విధించి అమలు చేయగలరా?

నాలుగు: దామిని మరణం గురించి విలపిస్తున్న ఆడపిల్లల తల్లిదండ్రులారా! మీరిపుడు కుమార్తెలగురించి కాదు, కొడుకుల గురించి జాగ్రత్తపడండి! కూతుళ్ళకి కాదు, కొడుకులకి కాపలా కాయండి! స్త్రీకి ఇష్టం లేకుండా ఆమె కాలిగోరు కూడా తాకరాదనే వ్యక్తిగత హక్కునూ, కనీస ప్రజాస్వామిక సూత్రాన్ని మీ మగపిల్లలకు నేర్పించండి. దానికి మీ బోధనలు కాదు కావలసింది, మీ ఆచరణ కావాలి. అమ్మాయి, అబ్బాయి సమానులనే ప్రజాస్వామిక సూత్రాన్ని పాటించడాన్ని మొదట మీ కుటుంబంనుండే మొదలుపెట్టండని చెబితే అది అత్యాశ కాదు కదా?

మహిళల శీలం గురించి వస్తున్న వ్యాఖ్యానాలు అత్యంత గర్హనీయం. లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ‘ఆమె శీలంపై మచ్చపడింది, ఆమె భవిష్యత్తు ఏమిటి?’ అని ఆవేదనతో మధనపడ్డారని పత్రికలు చెబుతున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత బోంబేలో, గోధ్రా దుర్ఘటన తర్వాత గుజరాత్ లో జరిగిన అమానుషకాండలో భ్రష్టమైన శీలాలెన్ని? అసలు శీలమంటే మీ అభిప్రాయం ఏమిటి? అది శరీరంలో స్త్రీలకు మాత్రమే ఉండే భాగామా? శ్రీకారం చిత్రంలో నూతన ప్రసాద్ పాత్ర చెప్పినట్లుగా ‘మానభంగం కాదు అనవలసింది, అభిమానభంగం’ అని! ఇష్టం లేకుండా ఆమె శరీరాన్ని తాకడం ద్వారా మగడికి కలిగేదే అసలు శీలభంగం. స్త్రీ శరీరానికి కలిగేది కేవలం గాయం తప్ప మరొకటి కానేకాదు. అదిక్కడ హింసతో కూడుకుని ఆమెను మరణం వరకూ తీసుకెళ్లింది. ఆమె మరణించకపోతే మీరు చెప్పే శీలంకంటే అత్యున్నతమైన వ్యక్తిత్వంతో ఆమె జీవించేది. మీరు నమ్మే మిధ్యా విలువలని దయచేసి స్త్రీకి అంటగట్టి ఆమి జీవితాన్ని మరింత సంక్లిష్టం చేయవద్దు!

రాజకీయ నాయకులారా! పోలీసు అధికారులారా! పంచాయితీ పెద్దలారా! మత గురువులారా! తల్లిదండ్రులారా! ఉపాధ్యాయులారా! అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకి సుద్దులు చెప్పండి!!! మీ అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకు కాపలా కాయండి!!!

(రచన: రమ -ప్రగతిశీల మహిళా సంఘం-POW)

6 thoughts on “కూతుళ్ళకి కాదు, కొడుకులకు కాపలా కాయండి!

 1. మీ విశ్లేషణ చాలా శాస్త్రీయంగా ఉంది. కూతుళ్ళకి కాదు, కొడుకులకి కాపలా కాయండి. అనే మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. అమ్మాయి, అబ్బాయి సమానులనే ప్రజాస్వామిక సూత్రాన్ని పాటించమని ప్రచారం చెయ్యాలి.

 2. విశేఖర్ గారూ
  నాణేనికి రెండో వైపు ఉన్నవిషయాన్ని తీవ్ర భావోద్వేగంతోనూ, అదే సమయలో అత్యంత వాస్తవికంగానూ ఈ స్పందన ఉంది.

  దయచేసి వీలయితే దీన్ని ఇంగ్లీషులోఅనువదించి ఆంగ్ల పత్రికలకు,వెబ్ సైట్లకు పంపండి. తెలుగు భాష నుంచి శక్తివంతమైన వ్యక్తీకరణకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

  “స్త్రీకి ఇష్టం లేకుండా ఆమె కాలిగోరు కూడా తాకరాదనే వ్యక్తిగత హక్కునూ, కనీస ప్రజాస్వామిక సూత్రాన్ని మీ మగపిల్లలకు నేర్పించండి.”

  యావత్ సమాజం కలకాలం గుర్తుంచుకోవలసిన మహిమాన్విత సందేశం ఇది.

  నెల్లునూ పొల్లునూ వేరు చూపిన కథనానికి గాను రమగారికి అబినందనలు ఆదే సమయంలో ఈ కథనంలోని సత్యసంథతకు జోహార్లు.

 3. రమ గారి వ్యాసం భావోద్వేగంతో పదనుగా, ఆలోచనలు రేపుతూ వాస్తవికంగా ఉంది. ‘మీ అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకు కాపలా కాయండి!!!’ అంటూ ఎంత సూటిగా చెప్పారో కదా!

  >> ఆమె మరణించకపోతే మీరు చెప్పే శీలంకంటే అత్యున్నతమైన వ్యక్తిత్వంతో ఆమె జీవించేది.?>> ఆమె శీలం గురించి అమితంగా బెంగపడి, అది మచ్చగా భావించి బాధపడే సుష్మా లాంటివాళ్ళకు చక్కని సమాధానం!

 4. రమ గారూ చక్కని విష్లేషణతో కొంత ఆవేషంతో రాసిన మీ వ్యాసం వాస్తవికతను ప్రతిఫలిస్తున్నది.సమాజంలోని వివిధ సమూహాలకు చెందిన సెలెబ్రిటీల స్పందనల గుట్టును రట్టు చేయడం ఇందులో విశేషం.ఇక సాంప్రదాయవాదుల భావజాలాన్ని ముఖ్యంగా శీలం పేరుతో స్త్రీలను ఎలా అణచివేతకు గురి చేస్తున్నారో ఎండగట్టదం సమంజసంగా వుంది.ప్రజా స్వామ్య సంస్కృతి అలవర్చుకుంటేనే ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందనేది కూడ నిర్వివాదాంశమే. మిరు ఇచ్చిన ముగింపు చాలా బాగుంది.మీ వ్యాసము అద్యంతమూ అలోచనాత్మకంగా,ఆసక్తికరంగానూ,హేతుబద్ధంగానూ సాగింది.ఇంత మంచి వ్యాసం రాసినందుకు మీరు అభినందనీయులు.

 5. ఒకప్రక్క పాశ్చాత్య ఆర్ధిక విధానాలూ, ఆ జీవనశైలులూకావాలి, విలువలుమాత్రం గ్రంధాల్లో చెప్పినట్లుగా చెక్కుచెదరకుండా ఉండాలి. మొదటిదాన్ని వ్యతిరేకించనివాళ్ళకు, సంస్కృతి నాశనమైపోతుందనో, స్త్రీలను ఆటవస్తువుగా చూపిస్తున్నారనో కన్నీళ్ళుకార్చే హక్కు లేదు. సరే పాశ్చాత్య సంస్కృతినే పరిశీలించినా అక్కడకూడా అత్యాచారాలను అందరూ ఖండిస్తారేతప్ప ఫలానా కారణాన సమర్ధించడమంటూ జరగదు. ఒకవేళ సమర్ధించినా ఆ సమర్ధించినవారిని మర్దించడానికి కావాల్సిన వెసులుబాట్లు చట్టాల్లోనూ, వారికి బుధ్దిచెప్పే చైతన్యం ప్రజల్లోనూ ఉంటుంది. మరి ఇక్కడేమిటి ఒక అబలపై అత్యాచారం జరిగితే దాన్ని వెనుకేసుకొచ్చేదీ, ఆ సందర్భంగా స్త్రీలకు నీతులుచెప్పేదీ మతాపెద్దలూ, సంస్కృతోధ్ధారకూలూనా! ఇప్పుడు మనం అటు పాశ్చాత్యమూ, ఇటు ప్రాచ్యమూ గాకుండా ఉభయభ్రష్టులమయ్యామని అనిపించడంలేదా?

 6. బావుంది …మీ వివరణత్మక, సహేతుక, విమర్శ …మీపిలుపు ,….ఆవేశాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచనలోకి వొంపి …కర్తవ్యభోద చేశారు …ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s