నా కూతురి పేరు ప్రపంచానికి తెలియాలి -బద్రిసింగ్ పాండే


Photo: Sunday People

Photo: Sunday People

“ప్రపంచానికి నాకూతురు పేరు తెలియాలి. నాకూతురు తప్పేమీ చేయలేదు. తననుతాను కాపాడుకునే ప్రయత్నంలో ఆమె చనిపోయింది… నా కూతురంటే నాకు గర్వంగా ఉంది. ఆమె పేరు వెల్లడిస్తే ఇలాంటి దాడులు ఎదుర్కొని బైటపడినవారికి ధైర్యంగా ఉంటుంది. నాకూతురినుండి వారు శక్తిని పొందుతారు” అని 53 సంవత్సరాల బద్రిసింగ్ పాండే చెప్పడాని బ్రిటన్ పత్రిక ‘సండే పీపుల్’ తెలిపింది. మరో ప్రఖ్యాత పత్రిక ‘డెయిలీ మిర్రర్’ కి ఇది అనుబంధం. అమ్మాయి పేరును కూడా పత్రిక వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారి పూర్వీకుల గ్రామం బిల్లియాలో వారి ఇంటిముందు దుప్పటి కప్పుకుని ఉన్న బద్రిసింగ్ ఫోటోను పత్రిక ప్రచురించింది. అమ్మాయి ఫోటో ప్రచురించవద్దని బద్రిసింగ్ కోరినట్లు పత్రిక తెలిపింది.

అమ్మాయి తండ్రి కోరికను తెలియజేస్తూ భారత పత్రికలు వార్తలు ప్రచురించినప్పటికీ అమ్మాయి పేరు మాత్రం ఏ పత్రికా ప్రచురించలేదు. అమ్మాయి మిత్రుడి ఇంటర్వ్యూ ప్రసారం చేసినందుకు జీ న్యూస్ పై పోలీసులు కేసు నమోదు చేయడంతో భారత పత్రికలు తమను తాము నిభాయించుకున్నాయి.

“మొదట ఈఘోరానికి పాల్పడినవారి ఎదుట నిలబడి వారిని చూడాలనుకున్నాను. కానీ ఇప్పుడా కోరికలేదు. కోర్టులు వారిని శిక్షించిన వార్తను మాత్రమే వినాలని ఉంది. వారికి ఉరిశిక్ష పడాలి… వారందరికీ చావే సరైన శిక్ష. వారు పశువులు. వారికి పడే శిక్ష ఒక ఉదాహరణగా నిలవాలి. సమాజం అలాంటివారిని అనుమతించని విధంగా తయారుకావాలి” అని బద్రిసింగ్ తెలిపాడు.

సండే పీపుల్ తో మాట్లాడుతూ ఆరోజు ఏం జరిగిందో బద్రిసింగ్ గుర్తుకు తెచ్చుకున్నాడు. డిసెంబర్ 16 రాత్రి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో లోడింగ్ పనిలో షిఫ్టు ముగించుకుని 10:30కి తాను ఇంటికి వచ్చాననీ, కూతురు సినిమాకెళ్లి ఇంకా ఇంటికిరాలేదని అప్పటికే ఆమె తల్లి బెంగపెట్టుకుని ఉందనీ తెలిపాడు. “మేము ఆమె మొబైల్ కీ, ఆమె ఫ్రెండ్ మొబైల్ కీ కాల్ చెయ్యడం మొదలుపెట్టాము. కానీ మాకు సమాధానం రాలేదు. ఆ తర్వాత 11:15కి ఢిల్లీ ఆసుపత్రినుండి ఫోన్ వచ్చింది. మా అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని వారు చెప్పారు” అని ఆయన తెలిపాడు. వెంటనే ఒక మిత్రుడిని సాయం అడిగి అతని మోటార్ బైక్ పై బద్రిసింగ్ ఆసుపత్రికి వెళ్ళాడు.

“నేను మొదట తనను చూసినపుడు మంచపైన కళ్లుమూసుకుని ఉంది. నా అరచేతిని ఆమె నుదుటిపై ఉంచి పేరుపెట్టి పిలిచాను. నెమ్మదిగా కళ్ళు తెరిచిన నా కూతురు ఏడ్వడం మొదలుపెట్టింది. బాగా నెప్పిగా ఉందని చెప్పింది. నేను నా దుఃఖాన్ని ఆపుకున్నాను. బెంగపడవద్దనీ, అంతా సర్దుకుంటుందనీ ధైర్యంగా ఉండాలని చెప్పాను.” అప్పటికి ఏమి జరిగిందీ బద్రిసింగ్ కి తెలియదు. ఒక పోలీసు ఆయనకు జరిగిందంతా చెప్పాడు. అమ్మాయి తన మిత్రుడు అవీంద్ర పాండేతో కలిసి బస్సు ఎక్కడం, రెండున్నర గంటలపాటు నరకయాతన అనుభవించడం అంతా వివరించి చెప్పాడు. ఐరన్ రాడ్ తో ఇద్దరినీ ఎలా బాధించిందీ, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే రోడ్డుపైకి నగ్నంగా ఎలా విసిరేసిందీ చెప్పారు.

“నేను వెంటనే నా భార్యకూ, ఇద్దరు కొడుకులకూ ఫోన్ చేసి ఆసుపత్రికి రమ్మని చెప్పాను. కానీ అత్యాచారం గురించి వారికి చెప్పలేకపోయాను” అని బద్రిసింగ్ తెలిపాడు. మొదటి పదిరోజులు ఆమె స్పృహలోకి వస్తూ పోతూ ఉంది. ఆమె బతుకుతుందనే అందరూ భావించారు. “ఆమెను రక్షించడానికి డాక్టర్లు తాము చేయగలిగిందంతా చేశారు. చాలా కొద్దిసార్లే మాట్లాడింది. ఎక్కువగా సైగలతోనే మాట్లాడింది. ఆమె నోటిలో ఫీడింగ్ పైప్ ఉండడం మూలాన మాట్లాడడం కష్టమైపోయింది. కాగితంపై కూడా రాసి చెప్పింది. తనకు బతకాలని ఉందనీ, మాతో కలిసి జీవించాలని ఉందనీ రాసిచూపింది. కానీ చివరి నిర్ణయం విధి చేతుల్లోనే కదా ఉంది!” అని బద్రిసింగ్ తనకుతాను సర్దిచెప్పుకున్నాడు. రెండుసార్లు స్టేట్ మెంట్ ఇచ్చినప్పటికీ ఆ గదిలో ఆయన ఉండలేకపోయాడు. తనకూతురికి జరిగిన ఘోరాన్ని ఆయన వినలేకపోయాడు.

“నా భార్య తనతో ఉంది. స్టేట్ మెంట్ ఇస్తుండగా అక్కడే ఉంది. కూతురికి జరిగింది విన్నాక నా భార్య బాగా ఏడ్చింది. ఆ తర్వాత అదంతా నాకు చెప్పింది. నాకు మాటలు రావడం లేదు. ఆమె ఎదుర్కొన్న నరకం ఇంకెవరూ ఎదుర్కోకూడదు. వాళ్ళు మనుషులు కాదని మాత్రమే నేను చెప్పగలను. కనీసం జంతువులుకూడా కాదు. ఈ లోకానికి చెందినవారు కాదు” అని బద్రిసింగ్ వివరించాడు.

“నా కూతురు చాలా సార్లు బాధతో ఏడ్చింది. విపరీతమైన నెప్పితో బాధపడింది. తన తల్లి, తమ్ముళ్లను చూడగానే మళ్ళీ మళ్ళీ ఏడ్చిమ్ది…. కానీ ఆ తర్వాత ఆమె స్ధైర్యంతో వ్యవహరించింది. మాకు కూడా ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది. ఇకముందు అంతా బాగానే ఉంటుందని మాకు సర్ది చెప్పింది” అమ్మాయి పేగులు దెబ్బతినడంతో మెజారిటీ భాగాన్ని డాక్టర్లు తొలగించవలసి రావడం తెలిసిందే. “నేను కూడా కోలుకుని ధైర్యం చెప్పాను. త్వరలోనే ఇంటికి వెళ్తామని చెప్పాను. ఇంటికి వెళ్తామని చెప్పాక ఆమె ఉత్సాహభరితురాలయింది. చిరునవ్వు నవ్వింది” అని తన కూతురు చివరి సంతోష క్షణాలను బద్రిసింగ్ మురిపెంగా ఒకింత విషాధ స్వరంతో చెప్పుకున్నాడు. “ఆమె నుదుటిపై చేయివేశాను. నేను ఏమైనా తిన్నానా లేదా అని అడిగి, ఇక నిద్రపొమ్మని సైగలు చేసిచూపింది.  నేనామె చేతిని ముద్దాడి, విశ్రమించాలనీ, బాధపడొద్దనీ చెప్పాక కళ్ళు మూసుకుంది.” అని బద్రిసింగ్ వివరించాడు.

Photo: Sunday People

Photo: Sunday People

“ఆమె బతకాలని నేను బాగా కోరుకున్నాను. అటువంటి దాడికి సంబంధించిన చేదు జ్ఞాపకాలతోనైనా, కోలుకుని తిరగాలని కోరుకున్నాను. కానీ మ్మల్నిలా వదిలి ఆమె వెళ్లిపోయింది. మా జీవితాల్లో ఇప్పుడు పెద్ద ఖాళీ మిగిల్చిపోయింది. మా ప్రపంచానికి ఆమే కేంద్రకం. మా జీవితాలు ఆమె చుట్టూనే తిరిగాయి. ఆమె లేకపోవడం తీవ్రంగా బాధిస్తోంది. ఆమేలేని భవిష్యత్తు ఊహించలేకుండా ఉన్నాము.” అంటూ బద్రిసింగ్ చెమ్మగిల్లాడు. అవీంద్ర తనకూతురికి బాయ్ ఫ్రెండ్ కాదనీ, ఒక ధైర్యవంతుడైన స్నేహితుడు మాత్రమేననీ, తనకూతురిని కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నించాడనీ చెప్పాడు. “అతనితో పెళ్లి అయే సమస్యే లేదు. ఇద్దరూ వేరు వేరు కులాలు… పెళ్లి చేసుకోవాలని ఆమె ఎప్పుడూ కోరిక వ్యక్తం చేయలేదు. చదువుపైనే శ్రద్ధ పెట్టింది. మొదట జాబ్ సంపాదించాలని భావించింది.” అని తెలిపాడు.

అవీంద్ర తనను కాపాడడానికి ఎంత తీవ్రంగా ప్రయత్నించిందీ తన కూతురు తనకు చెప్పిందని బద్రిసింగ్ తెలిపాడు. “ఆమె తన తల్లితో చెబుతూనే ఉంది. తనను రక్షించడానికి అన్నీ శక్తులూ ఉపయోగించాడనీ, కానీ అతన్ని ఇనప రాడ్ తో కొడుతూనే ఉన్నారనీ చెప్పింది.” అని తెలిపాడు.

తనకూతురు కలల జ్ఞాపకాలను కూడా బద్రి నెమరువేసుకున్నాడు. “అలాంటి సబ్జెక్టులు చదవడానికి తాను డబ్బు పెట్టలేనని తనకు చెప్పాను. కానీ ఆమె స్ధిర నిశ్చయంతో ఉంది. తాను డాక్టర్ కావాలనుకుంది. బోలెడు డబ్బు సంపాదించాలనీ, విదేశాలకు కూడా వెళ్లాలనీ కలలు కన్నది.” 1983లో బద్రి ఢిల్లీ వచ్చినపుడు అతని సంపాదన నెలకు రు.150/-. కూతురు చదువుకోసం తనకొద్దిపాటి పొలంలో కొద్దిగా అమ్మి ఖర్చుపెట్టాడు. తన ఇప్పటి నెలజీతం 5,700/- లో సాధ్యమైనంతగా కూడబెట్టి కూతురు చదువుకోసం వెచ్చించాడు. “ఆ వేతనంతో ఢిల్లీలో బతకడం చాలా కష్టం. కానీ అదంతా మార్చేస్తామని తాను చెబుతుండేది. తనకు జాబ్ వస్తే మా జీవితాలను మార్చేయాలని ఆమె కోరుకుంది.”

ఫిజియోధేరపీ కోర్సుని అప్పుడే పూర్తిచేసిన అమ్మాయి ఢిల్లీలో హౌస్ సర్జన్ లాంటి కోర్సు చేస్తోంది. ఆమె తమ్ముళ్ళు ఇద్దరూ 20, 15 సంవత్సరాల వాళ్ళు. వారికీ అక్కే ప్రపంచం, మార్గదర్శి. “ఆమె లేకుండా జీవితం చాలా కష్టంగా ఉండబోతుంది. ఆమె గైడెన్స్ లేకుండా నేనేమీ చేయాలో నాకు తెలియదు. మళ్ళీ జీవితాన్ని ఎలా రూపొందించుకోవాలో నాకు తెలియదు” అని ఆమె పెద్ద తమ్ముడు చెప్పాడు.

తమ కుటుంబానికి దేశం మొత్తం మద్దతుగా నిలవడం పట్ల బద్రిసింగ్ కదిలిపోయాడు. “మాకు జరిగిన నష్టంనుండి కోలుకోవడానికి భారతదేశ ప్రజలు తగిన శక్తిని మాకు ఇచ్చారు. ఆమె మా కూతురు ఒక్కరే కాదనీ, దేశం మొత్తానికి కూతురనీ నాకు అనిపిస్తుంది. పత్రికల్లో అత్యాచారాల చదివినపుడు జీర్ణించుకోలేకపోయేవాడిని. ఇలాంటి క్రూరత్వంపై నిరసన చేయడానికి బైటికి వచ్చినవారికి మేము ఎంతో కృతజ్ఞులం” అని బద్రిసింగ్ అన్నాడు. తలిదండ్రులు ఇకనుండి తమ కొడుకలకు మహిళలను గౌరవించడం నేర్పాలని బద్రి కోరాడు. పోలీసులు ఒక్కరికీ సాధ్యం కాదనీ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై కన్నేసి ఉంచాలనీ కోరాడు.

అమ్మాయి పేరు కూడా సండే పీపుల్ పత్రిక ప్రచురించింది. అయినప్పటికీ భారత పత్రికలేవీ ఆమె పేరును వెల్లడి చేయలేదు. మరో బ్రిటన్ పత్రిక రాయిటర్స్ కి చెందిన ఇండియా విభాగం కూడా సండే పీపుల్ ఇంటర్వ్యూ విశేషాలను ప్రచురించిందిగానీ పేరు ఇవ్వలేదు. భారత చట్టాలను గౌరవిస్తూ పేరు ఇవ్వడం లేదని చెప్పింది. కనుక భారత ప్రభుత్వ చట్టాన్ని గౌరవిస్తూ ఇక్కడ కూడా పేరు ఇవ్వడం లేదు. కానీ పేరు చెప్పడానికి అమ్మాయి తండ్రి స్వయంగా ముందుకు వచ్చినందున, ఆమె పేరు మరెందరో బాధితురాళ్లకు ధైర్యాన్నీ, శక్తినీ ఇవ్వాలని కోరుకున్నందున సండే పీపుల్ ఆర్టికల్ కి లింక్ ఇస్తున్నాను.

One thought on “నా కూతురి పేరు ప్రపంచానికి తెలియాలి -బద్రిసింగ్ పాండే

  1. పాండే గారు కాబట్టి, నెలకు 150/- జీతం ఐనా సరే … పాపం చదువుకోవాలన్న కూతురికి అండగా ఉన్నాడు. అదే ఈయన దళితుడయ్యి ఉంటే, ఆ అమ్మాయికి రిజర్వేషన్ ఉండేది. మన దేశం లో రిజర్వేషన్ లు ముడ్డి కింద కోట్లు ఉన్న దలితునికి ఉంటాయి కానీ, చదువుకోవాలని ఆశ ఉన్న తెలివైన అమ్మాయి, నిరుపేద కూతురికి లేదు. చాలా గొప్ప సమానత్వం. చాలా గొప్ప రాజ్యాంగం.

    మీరు ఓవైసీ గురించి ఏమీ రాసినట్టు లేదు విశేఖర్ గారూ! మీ విశ్లేషణ చూడాలని ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s