ఉరి వద్దు, సజీవ దహనం చెయ్యండి -అమానత్ కోరిక


Photo: facenfacts.com

Photo: facenfacts.com

అమానత్/దామిని/నిర్భయ మిత్రుడు మౌనం వీడి కొన్ని చేదు నిజాలు చెప్పాడు. సాయం కోసం అరిచినా 45 నిమిషాల సేపు ఒక్క వాహనంగానీ, ఒక్క వ్యక్తిగానీ ఆగకుండా వెళ్లిపోయారని అతను తెలిపాడు. తన స్నేహితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో పోలీసులు విపరీతమైన ఆలస్యం చేశారనీ, నగ్నంగా ఉన్న తనకుగానీ, తన స్నేహితురాలికిగానీ కనీసం కప్పుకోవడానికి ఒక గుడ్డ ఇచ్చిన పాపాన పోలేదనీ అతను ఆరోపించాడు. విపరీతంగా రక్తం కారుతున్న తన స్నేహితురాలిని తానొక్కడినే ఎత్తుకుని పి.సి.ఆర్ (పోలీస్ కంట్రోల్ రూమ్) వ్యాన్ లోకి తీసుకెళ్ళాననీ, ఒక్క పోలీసుకూడా తనకు సాయం చెయ్యలేదనీ తెలిపాడు. నిందితులను ఉరితీయకూడదనీ వారిని సజీవదహనం చెయ్యాలని కోరిందనీ తెలిపాడు. అమానత్ మిత్రుడి పేరు ‘అవైంద్ర ప్రతాప్ పాండే’ అని జీ న్యూస్ చానెల్ గుర్తించింది. బాధితురాలి గుర్తింపుకు దారితీసేలా అవైంద్ర ప్రతాప్ ఇంటర్వ్యూ ప్రసారం చేసినందుకు జీ చానెల్ పై పోలీసులు కేసు నమోదు చేయడం కొసమెరుపు.

“నేను నా స్నేహితురాలిని కాపాడిఉండాలని బలీయంగా భావిస్తున్నాను” అని 28 సంవత్సరాల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవైంద్ర ప్రతాప్ జీ న్యూస్ చానెల్ తో మాట్లాడుతూ అన్నాడు. బస్సునుండి విసిరేశాక సాయంకోసం అరుస్తున్నా అనేకవాహనదారులు ఆపకుండా వెళ్లిపోయారని అతను తెలిపాడు. “విపరీతమైన చలిలో ఆ రాత్రి 20 నిమిషాలసేపు రోడ్డుపై పడి ఉన్నాము. మా ఒంటిపై బట్టలు లేవు. అనేకకార్లు, ఆటో రిక్షాలు మమ్మల్ని చూస్తూనే వెళ్ళిపోయాయి. మాకు సాయం చెయ్యడానికి ఒక్కరికీ మనస్కరించలేదు… సాయంకోసం నేను అరుస్తున్నా సరే” అని అవైంద్ర తెలిపాడు.

45 నిమిషాల తర్వాత మాత్రమే పి.సి.ఆర్ వ్యాన్ లు వచ్చాయనీ, కొన్ని వ్యాన్లు వచ్చి వెళ్లిపోయాయనీ అవైంద్ర తెలిపాడు. “మూడు పి.సి.ఆర్ వ్యాన్లు వచ్చాయి, వెళ్ళాయి. ఆసుపత్రిలో కూడా మాకు కప్పుకోవడానికి ఒక దుప్పటి ఇవ్వాలని కూడా అనుకోలేదు” అని ఆసుపత్రి వ్యక్తుల నిర్వాకం తెలిపాడని ఇండియా టుడే తెలిపింది. ముప్పావు గంట తర్వాత పి.సి.ఆర్ వ్యాన్లు వచ్చి ఆగినా ఆ చోటు ఏ పోలీసు స్టేషన్ కిందికి వస్తుందో చర్చించుకుంటూ గడిపారని, విలువైన సమయాన్ని వృధా చేశారనీ ఆయన ఆరోపించాడు. “మూడు పి.సి.ఆర్ వ్యాన్లు వచ్చాయి వెళ్ళాయి. ఏ పోలీసు స్టేషన్ కిందికి ఆ ఏరియా వస్తుందో వారు తేల్చుకోలేకపోయారు. ఆ తర్వాత మరొక పి.సి.ఆర్ వ్యాన్ వచ్చింది. ఆ సమయంలో 20 మందివరకూ అక్కడ నిలబడి ఉన్నారు. ఆమెను ఎత్తుకెళ్లి వ్యాన్ సీటుపై పడుకోబెట్టడానికి ఒక్కరూ ముందుకురాలేదు. వారి చేతులు మలినం అవుతాయనుకునారేమో” అని అవైంద్ర అన్నాడని ఫేస్ ఎన్ ఫేక్ట్స్ వెబ్ సైట్ తెలిపింది.

రోడ్డుపైన నగ్నంగా పడి ఉన్న తమకు ఎవరూ, పోలీసులతో సహా బట్టలు ఇవ్వడంగానీ, అంబులెన్స్ కి ఫోన్ చెయ్యడంగానీ చేయలేదని తెలిపాడు. “మమ్మల్ని అలా చూస్తూ ఉన్నారంతే” అని వ్యాఖ్యానించాడు. “మా స్నేహితురాలికి విపరీరంగా రక్తం కారిపోతోంది. కానీ మమ్మల్ని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఎక్కడో దూరంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు” అని చెప్పిన అవైంద్ర తీవ్రంగా గాయపడి ఉన్న దామినిని తానే పి.సి.ఆర్ వ్యాన్ వద్దకు ఎత్తుకెళ్లానని తెలిపాడు. తీవ్రంగా రక్తం కారుతుండడం వల్లనే ఆమెను ఎత్తుకువెళ్లడానికి వారు సాయం చేయలేదని అవైంద్ర అభిప్రాయపడ్డాడు. అవైంద్రని కూడా నిందితులు ఇనపరాడ్ తో తీవ్రంగా కొట్టి ఉండడం వలన అతని పరిస్ధితి కూడా బాగాలేదు. బాధితులిద్దరూ సపర్యలు పొందవలసిన స్ధితిలో ఉన్నపరిస్ధితుల్లో పోలీసులు ఏమాత్రం నడుంవంచకపోవడం చాలా ఘోరం. తమ బట్టలకు రక్తం అంటితే తామే సాక్షులుగా మారవలసి ఉంటుందని సాధారణ పౌరుడివలే వారు భావించారా లేక కేసు తమకు చుట్టుకుంటుందని భావించారో గానీ పోలీసుల ప్రవర్తన తీవ్రంగా గర్హనీయం.

“జనం ఎవరూ మాకు సాయం చేయలేదు. మాకు సాయం చేస్తే నేరానికి తాము సాక్షులుగా మారవలసి ఉంటుందని వారు భయపడ్డారేమో తెలియదు. సహాయం చేస్తే తాముకూడా పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగవలసి ఉంటుందని వారు భావించి ఉండవచ్చు” అని అవైంద్ర జనం ఉదాసీనతను తానే అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆసుపత్రి వ్యవహారంపై కూడా అవైంద్ర కొన్ని ఆరోపణలు చేశాడు. “ఆసుపత్రివద్ద కూడా మేము ఎదురుచూడవలసి వచ్చింది. వొంటిని కప్పుకోవడానికి కాసిన్ని బట్టలను నేను దీనంగా అడుక్కున్నాను. బట్టల్లు ఇవ్వమనీ, కర్టెన్ ఉన్నా ఇవ్వమనీ ఒక క్లీనింగ్ బాయ్ ని అడిగాను. అతను కొద్దిసేపు ఆగమన్నాడు. కానీ బట్టలు మాత్రం ఎవరూ ఇవ్వలేదు. ఒక అజ్ఞాతవ్యక్తిని బతిమిలాడి అతని సెల్ ఫోన్ ద్వారా మా బంధువులకు ఫోన్ చేశాను. వారికి చిన్న యాక్సిడెంట్ అయిందని మాత్రమే చెప్పి పిలిపించుకున్నాను. మా బంధువులు వచ్చాక మాత్రమే నాకు వైధ్య చికిత్స మొదలయింది” అని అవైంద్ర ఆరాత్రినాటి హృదయవిదారకమైన సంఘటనలనూ, పోలీసులూ వైద్యుల యాంత్రిక, ఉదాసీన వైఖరులను వెల్లడించాడు.

రోడ్డుపైకి విసిరేశాక బస్సుని తమపైనుండి నడిపి చంపడానికి నిందితులు ప్రయత్నించారని అవైంద్ర తెలిపాడు. “మమ్మల్ని బస్సునుండి తోసేశాక మాపైనుండి బస్సు నడిపించడానికి ప్రయత్నించారు. కానీ నేను నా స్నేహితురాలిని ఒక్క ఉదుటున పక్కకి లాగడంతో ఆమె అప్పటికి బతికిపోయింది. మేమేమో బట్టలు లేకుండా ఉన్నాం. రోడ్డుపై వెళుతున్నవారిని ఆపడానికి ప్రయత్నించాము. అనేక ఆటో రిక్షాలు, కార్లు, బైకులు మావద్దకు వచ్చేసరికి తమ వాహనాలను నెమ్మదిగా పోనిచ్చారుగానీ ఆపలేదు. 25 నిమిషాలదాకా ఎవ్వరూ ఆపలేదు. అనంతరం ఒక పెట్రోలింగ్ వాహనం వచ్చింది. వారు పోలీసులకి ఫోన్ చేశారు” అని అవైంద్ర జీ న్యూస్ కి తెలిపాడు.

పోలీసులు, కోర్టుల పనివిధానం సాధారణ పౌరుల సహజ స్పందనా గుణాన్ని ఏ స్ధాయిలో చంపేసిందో అవైంద్ర ఆక్రోశం తెలియజేస్తోంది. సహాయం చేసినందుకు మెచ్చి మెడల్స్ వెయ్యకపోయినా సాక్ష్యం పేరుతో సంవత్సరాల తరబడి ఇబ్బంది పెట్టకుండా ఉండబోమని హామీ ఉన్నట్లయితే ఆగకుండా వెళ్ళిపోయినవారంతా ఆగి ఉండేవారేనేమో. “ఎందరు దోషులు తప్పించుకుపోయినా ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదు” అన్న న్యాయసూత్రాన్ని న్యాయమూర్తులు తరచుగా వల్లిస్తుంటారు. అదే సూత్రం అనేకమంది బడా బడా నేరస్ధూలకు, అవినీతిపరులకు, పచ్చినెత్తురుతాగే హంతకులకు వరం కావడంపై వ్యవస్ధలనాయకులు ఎవరూ ఆలోచన చేసినట్లులేదు. లేదా అలా తప్పించుకోవడానికే అంతపెద్ద కంతను (లూప్ హోల్) అట్టేపెట్టుకున్నారా?!

జీన్యూస్ పై కేసు

అవైంద్ర బహిరంగ సాక్ష్యంలో పోలీసుల వ్యవహారం పచ్చిగా వెల్లడి కావడంతో వారు చేతులుముడుచుకుని కూర్చోదలుచుకోలేదు. బాధితురాలి ఐడెంటిటీనిగానీ, ఐడెంటిటీ వెల్లడి కావడానికి దారితీసే సమాచారాన్నిగానీ వెల్లడించడానికి వీలులేదన్న చట్టం వారికి అక్కరకు వచ్చింది. “ఐ.పి.సి సెక్షన్ 228-ఎ ప్రకారం జీన్యూస్ చానెల్ పై వసంత విహార్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశాం” అని ఢిల్లీ పోలీసుల ప్రతినిధి రాజన్ భగత్ చెప్పాడని ఇండియా టుడే పత్రిక తెలిపింది. అవైంద్ర ఇంటర్వ్యూ గురించి శుక్రవారం నుండే జీ చానెల్ స్క్రోలింగ్ ఇవ్వడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. తన ఐడెంటిటీని బహిరంగం చెయ్యడానికి ఆయన తానే స్వచ్ఛందంగా అంగీకరించాడని, జస్టీస్ జె.ఎస్.వర్మ ప్యానెల్ కు అతను చెప్పిందంతా తాము ప్రసారం చేస్తామనీ స్క్రోలింగ్ లో తెలిపింది. దరిమిలా పోలీసులు జీ చానెల్ పై కేసు నమోదు చేశారు. తమ స్వంత ప్రశ్నపత్రాన్ని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్.డి.ఎం) కి ఇచ్చి దానిప్రకారమే బాధితురాలి సాక్ష్యాన్ని నమోదు చేయాలని ఎస్.డి.ఏం మేనేజ్ చెయ్యడానికి, ఆమె వినకపోయేసరికి ఆమెను బెదిరించడానికి సైతం పోలీసులు ఎందుకు సిద్ధపడిందీ అవైంద్ర వెల్లడి చేసిన నిజాలు స్పష్టం చేస్తున్నాయి.

జీ న్యూస్ వెల్లడించిన వివరాల్లో మరికొన్ని

జీ న్యూస్ వెబ్ సైట్ ప్రకారం అవైంద్ర ప్రతాప్ ఈ విధంగా చెప్పాడు.

“బస్సులో ఉన్నవాళ్ళు ముందుగానే పధకం వేసుకున్నట్లు కనిపిస్తోంది. డ్రైవర్, హెల్పర్ కాకుండా మిగిలినవారు ప్రయాణికుల్లాగానే ప్రవర్తించారు. 20/- చార్జీకూడా చెల్లించాము. ఆ తర్వాత నా స్నేహితురాల్ని టీజ్ చెయ్యడం మొదలుపెట్టడంతో గొడవ మొదలయింది. వాళ్ళలో ముగ్గురిని నేనుకొట్టాను. ఇతరులు ఒక ఇనుప రాడ్ తెచ్చి నన్ను బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాను. స్పృహ కోల్పోకముందే నా స్నేహితురాలిని బస్సువెనక్కి లాక్కెళ్లారు.”

“మేము బస్సు ఎక్కినప్పటినుండి దాదాపు రెండున్నర గంటలపాటు బస్సుని తిప్పుతూనే ఉన్నారు. మేము పెద్దగా కేకలు వేస్తున్నాం. బైటౌన్నవారు వినేలా ఆరావడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ వాళు లైట్లు ఆర్పేశారు. వారిని తీవ్రంగా ప్రతిఘటించాం. నా స్నేహితురాలుకూడా వారితో పోరాడింది. నన్ను కాపాడడానికి ప్రయత్నించింది. పోలీసు కంట్రోల్ రూమ్ 100కి డయల్ చెయ్యడానికి ప్రయత్నించింది. వాళ్ళు తన మొబైల్ ను లాక్కున్నారు… బైటికి తోసేయకముందు మా మొబైళ్ళు, బట్టలు లాక్కున్నారు. తద్వారా సాక్ష్యం మాయం చెయ్యడానికి ప్లాన్ వేశారు.”

“నన్ను తలపై కొట్టారు. నేను నడవలేకపోయాను. రెండువారాల వరకూ నా రెండు చేతులనూ కదపలేకపోయాను… నన్ను మా నేటివ్ ప్లేస్ కి తీసుకెళ్లాలని మా కుటుంబం భావించింది. కానీ పోలీసులకి సాయం చెయ్యడానికి ఢిల్లీలోనే ఉండాల్ని నేను నిర్ణయించుకున్నాను. డాక్టర్లు సలహా ఇచ్చాకనే మా ఇంటికి వెళ్ళి ప్రవేటు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నాను.”

“నేను ఆసుపత్రిలో నా స్నేహితురాలిని కలుసుకున్నపుడు ఆమె నవ్వుతోంది. చేతితో రాయగలుగుతోంది. చాలా ఆశాభావంతో ఉంది. బతకకూడదని ఆమె భావించినట్లుగా నాకు ఏ క్షణంలోనూ అనిపించలేదు… నేను అక్కడ లేకపోయినట్లయితే తాను ఫిర్యాదు చేయలేకపోయేదాన్నని ఆమె నాతో అన్నది. దోషులకు ఖచ్చితంగా శిక్షపడేలా చేయాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను… తాను దృఢంగా వ్యవహరించడానికి వీలుగా తనతో ఉండాలని నన్ను కోరింది.”

“మహిళా ఎస్.డి.ఎం (సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్)కి మొదటిసారి తాను స్టేట్ మెంట్ ఇచ్చినపుడే నాకు మొదటిసారిగా ఆమెకు జరిగిందేమిటో తెలిసింది. వాళ్ళు ఆమెకు చేసిందాన్ని నేను నమ్మలేకపోయాను. పశువులుకూడా తన ఎరను వేటాడేటపుడు అంత క్రూరంగా వ్యవహరించవు.”

“ఆమె ఇదంతా ఎదుర్కొంది. నిందితులని ఉరితీయకూడదనీ వారిని సజీవంగా తగలబెట్టాలనీ ఆమె మేజిస్ట్రేట్ ని కోరింది.”

“ఎస్.డి.ఎంకి ఆమె ఇచ్చిన మొదటి స్టేట్ మెంటే కరెక్ట్. ఎంతో ప్రయత్నం చేసి ఆమె ఆ స్టేట్ మెంట్ ఇచ్చింది. స్టేట్ మెంట్ ఇస్తుండగా ఆమె దగ్గుతోంది. దానివలన ఆమెకు రక్తం కూడా కారుతోంది. ఆమె వెంటిలేటర్ మద్దతుతో ఉంది. ఆమెపై ఒత్తిడిగానీ మరొకరి జోక్యంగానీ ఆమెపైన లేవు. కానీ ఆమెపై ఒత్తిడి ఉన్నదని ఎస్.డి.ఎం చెప్పినపుడు ఆమె చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. ఒత్తిడి మధ్య ఆమె స్టేట్ మెంట్ ఇచ్చిందని చెప్పడం తప్పు.” (అవైంద్ర చెబుతున్నదానికీ గతంలో ది హిందూ రిపోర్ట్ చేసినడానికి తేడా కనిపిస్తోంది. ఆ పత్రిక ప్రకారం ఎస్.డి.ఎం ఆరోపణ తనపై ఒత్తిడి ఉన్నదనే తప్ప అమ్మాయిపై ఒత్తిడి ఉన్నదని కాదు. అమ్మాయి స్టేట్ మెంట్ ఎలా ఉన్నప్పటికీ తమ కొశ్చనీర్ ప్రకారం స్టేట్ మెంట్ తయారు చేయాలని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చినట్లుగా ఎస్.డి.ఎం ఆరోపించింది. కొశ్చనీర్ లో ఉన్న విషయాలు అమ్మాయి చెప్పిన విషయాలతో విభేదిస్తున్నందున కొశ్చనీర్ ప్రకారం తాను పోలేనని ఎస్.డి.ఎం చెప్పిందనీ, అందువలన పోలీసులు ఆమెని బెదిరించారనీ ది హిందూ తెలిపింది. ఎక్కడో గ్రహింపులో తేడా ఉన్నట్లు తోస్తున్నది.)

“ఇటువంటి సంఘటనల్లో బాధితులను సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లడానికే పోలీసులు ప్రయత్నించాలి. ప్రభుత్వ ఆసుపత్రికోసం చూస్తూ విలువైన సమయాన్ని వృధా చేయరాదు… అలాగే, కోర్టులకి వచ్చి సాక్ష్యం చెప్పకూడని విధంగా సాక్ష్యులని ఇబ్బంది పెట్టకూడదు…”

“కొవ్వోత్తులు వెలిగించి జనం ఆలోచనలని మార్చలేము… రోడ్డుపై ఉన్నవారికి సహాయం అవసరం అయినపుడు సహాయం చెయ్యాలి… ఆమె కోసం మాత్రమే నిరసన పరిమితం చెయ్యడం కాదు. రాబోయే తరాల కోసం కూడా నిరసనలు చేపట్టాలి.”

“జస్టిస్ వర్మ, జస్టిస్ లీలా సేఠ్, జస్టిస్ గోపాల్ సుబ్రమణియం లకు నేను ఒకటే చెప్పేది. మనకి అనేక చట్టాలున్నాయి. కానీ ప్రజలు పోలీసు స్టేషన్లకి వెళ్లడానికే భయపడుతున్నారు. పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేస్తారా లేదా అని వారికి అనుమానంగా ఉంది. మీరు కేవలం ఒక్క సమస్యకోసమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలని యోచిస్తున్నారు. కానీ ప్రతికేసూ ఎందుకు ఫాస్ట్ ట్రాక్ చేయకూడదు?”

“నాకు జరిగిందేమిటో నాకు మాత్రమే తెలుసు…. ఇంతవరకూ నా ట్రీట్ మెంట్ గురించి ప్రభుత్వంనుండి ఎవ్వరూ నా వద్దకు రాలేదు. ఇప్పటివరకూ నా వైద్యానికి నేనే ఖర్చు పెట్టుకున్నాను.”

“నేను ఫిర్యాదు చెయ్యడానికి నిర్ణయించుకోనట్లయితే, ఈ ఘటనను ఒక యాక్సిడెంట్ గా చెప్పి ఊరుకున్నట్లయితే, ఈ కేసు ఇంత పెద్దది అయి ఉండేది కాదు.” (అవైంద్ర చెప్పేది తన గొప్పతనం గురించి కాదు; పోలీసులు తదితర ప్రభుత్వ అంగాల గురించి.)

“వాళ్ళకి (పోలీసులకి) కార్లున్నాయి. మమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లగలిగి ఉండేవారు. మాకు ప్రతినిమిషమూ విలువైనదే. కానీ వారలా చేయలేదు. ఈ ధోరణిని ఎవరు మార్చేది?”

“ఈ సంగతి ఇంకా ఎవరికీ చెప్పలేదు. సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. ఇలాంటివి జరిగినపుడు మనల్ని మనం తరచుగా అడుగుతుంటాం. ‘నేనే దీనికి కారణమా? నేను మాల్ కి ఎందుకి వెళ్ళాను? నేనా బస్సే ఎందుకు ఎక్కాను?’ అని. రెండువారాల వరకూ నేను కనీసం మాట్లాడలేకపోయాను.”

“నా స్నేహితురాలికి ఇంకా మంచి ఆసుపత్రిలో చికిత్స చేసి ఉన్నట్లయితే, బహుశా ఆమె బతికి ఉండేది.”

“ఈ కేసులో పోలీసులు బాగా కృషి చేస్తున్నారని చెప్పాలని పోలీసులు నన్ను అడిగారు. వారి డ్యూటీ వారు చేస్తున్నందుకు క్రెడిట్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ వారివారి పని చేస్తే ఈ విషయంలో చెప్పేందుకు ఏమీ ఉండదు… మేము పోరాడవలసింది ఇంకా చాలా ఉంది. మా కుటుంబంలో లాయర్ లేకపోతే ఈ మాత్రం పోరాటం నేను చేయగలిగేవాడిని కాదు…. ఢిల్లీ పోలీసులు తమలోతాము అంతర్గతంగా తర్కించుకుని తాము మంచి కృషి చేసిందీ లేనిదీ నిర్ధారించుకోవాలి.”

“నేను ఆసుపత్రిలో వైద్యం తీసుకోవాల్సినవాడిని దానికి బదులు నాలుగు రోజులపాటు పోలీసు స్టేషన్ లో గడిపాను. … ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందని నా ఫ్రెండ్స్ తో చెప్పాను.”

“మీరు ఎవరికైనా సహాయం చెయ్యగలిగితే చెయ్యండి. కనీసం ఒక్క వ్యక్తయినా నాకారోజు రాత్రి సహాయం చేసి ఉన్నట్లయితే పరిస్ధితి మరొక విధంగా ఉండేది. మెట్రో స్టేషన్లు మూసేసి ప్రజలు తమనుతాము వ్యక్తీకరించుకోవడాన్ని ఆపనవసరం లేదు. వ్యవస్ధపైన నమ్మకం ఉంచడానికి ప్రజలకు అవకాశం ఇవ్వాలి… ఆమె మనందరినీ మేల్కొలిపింది. ఆమె పేరుతో ఈ పోరాటాన్ని కొనసాగించినట్లయితే అది ఆమెకు ఘననివాళి అవుతుంది.”

… … … వ్యవస్ధ తీరుతెన్నులపై నిశ్చితమైన అభిప్రాయాలూ ఉన్నట్లు కనిపిస్తున్న అవైంద్ర ప్రతాప్ పాండే చెప్పిన మాటలు పోలీసుల వైఖరిని ఎండగట్టేలా ఉన్నాయన్నది స్పష్టమే. పోలీసులకే కాకుండా ప్రతి పౌరుడి హృదయాన్నీ సూటిగా తాకేలా అవైంద్ర మాటలు ఉన్నాయి. సాటి మానవుడు విపత్కర పరిస్ధితిలో ఉన్నపుడుకూడా ప్రమాదకరమైన ఉదాసీన వైఖరిని కొనసాగించడం గర్హనీయం. అవైంద్ర మాటలు కొందరికైనా మేల్కొలుపు కావాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s