అమ్మాయిల గౌన్లు అశ్లీలమా? వీళ్ళు కదా రేపిస్టులకు కాపలాదార్లు!


From: kractivist.wordpress.com

From: kractivist.wordpress.com

స్కూళ్ళు, కాలేజీల అమ్మాయిలు గౌనులు ధరించడం వల్లనే వారికి సమస్యలు వస్తున్నాయనీ, కనుక విద్యార్ధినులు గౌను ధరించడం నిషేధించాలనీ రాజస్ధాన్ కి చెందిన ఒక ఎమ్మెల్యే తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాసి కలకలం సృష్టించాడు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆగ్రహించిన విద్యార్ధినులు ఆయన ఇంటిముందు నిరసన నిర్వహించడమే కాకుండా ఆయనాకొక గౌను బహూకరించారు.

అమ్మాయిల దుస్తుల ధారణపై ప్రతికూల వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలవుతున్న వారి జాబితాలో ఆళ్వార్ నగర నియోజకవర్గ ఎమ్మెల్యే బన్వరీలాల్ సింఘాల్ చేరిపోయాడు. ఆయన దృష్టిలో స్కూల్ పిల్లలు, కాలేజీ అమ్మాయిలు ధరించి గౌనుల వల్లనే అబ్బాయిల్లో పోకిరీ మనస్తత్వం తలెత్తుతోంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమ్మాయిలు గౌనులు ధరించడం నిషేధించాలనీ, గౌను బదులు సల్వార్ సూట్లు గానీ లేక కిందినుండి పైదాకా శరీరాన్ని దాచిపెట్టే విధంగా ట్రౌజర్లు (ఫ్యాంట్లు) వేసుకునేలా నిబంధనలు విధించాలనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాడు.

Bhanvari Lal Singhal (NDTV)

Bhanvari Lal Singhal (NDTV)

“ఆళ్వార్ లో అమ్మాయిలు స్కూళ్ళకి నడిచి వెళ్ళడమో లేదా వివిధ పాయింట్ల వద్ద బస్సులకోసం ఎదురు చూడడమో చేస్తుంటారు. అలాంటప్పుడే పోకిరీ వెధవలనుండి అసభ్య వ్యాఖ్యలను అమ్మాయిలు ఎదుర్కొంటారు… మహిళలపై సాంఘిక నేరాలు పెరుగుతున్నందున దాన్ని (గౌనులు ధరించడాన్ని) నిషేధించాలి. ప్యాంట్-షర్ట్ గానీ సల్వార్ సూట్లు గాని విద్యార్ధినులకు యూనిఫారంగా స్కూళ్ళు కలిగి ఉండాలి” అని బన్వరిలాల్ సింఘానియా వాకృచ్చాడని ఎన్.డి.టి.వి తెలిపింది.

సింఘాల్ ఇంకా ఏమంటున్నాడంటే “ఈ డిమాండ్ ఉద్దేశం మగవాళ్ళ ఆకలి చూపులనుండి విద్యార్ధినులను దూరంగా ఉంచడమే. అంతేకాక వేడి మరియు చలి వాతావరణంలో వారికి సౌకర్యంగా కూడా ఉంటుంది” అంటూ విద్యార్ధినులకు రక్షణ ఎలా దొరుకుతుందో విశ్లేషించాడు సింఘాల్. “ఇది తాలిబాన్ టైపు ఆలోచనేమీ కాదు. లేక అమ్మాయిల స్వేచ్ఛకు గానీ హక్కుకు గానీ ఆటంకం కలిగించడానికి కాదు. తమ సెల్ ఫోన్లతో అమ్మాయిలను ఫోటోలు తీస్తుండగా నేను స్వయంగా అనేకసార్లు అబ్బాయిలను పట్టుకున్నాను. అమ్మాయిలకి అదేమీ తెలియదు. అలాంటి ఫోటోల్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది” అని బన్వర్లాల్ వ్యాఖ్యానించాడని ది హిందూ తెలిపింది. ఇంతకీ అలా పట్టుకున్న అబ్బాయిలని ఎందుకు వదిలిపెట్టారో ఎమ్మెల్యేగారు చెప్పనేలేదు.

తన సూచన అమ్మాయిలపై అత్యాచారాలను నివారిస్తుందని సింఘాల్ చాలా గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఆయన ఎంత సిన్సియర్ గా తన సలహాపై నమ్మకం పెట్టుకున్నాడంటే ఆయనేమంటున్నాడో చూడండి. “మహిళల గౌరవం కాపాడబడేలా ప్రతి ఒక్కరూ తానుగా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలి. నేను వ్యక్తిగతంగా చేస్తున్న ప్రయత్నం ఇది” అని. అమ్మాయిల దుస్తుల ధారణ విషయంలో నియమ నిబంధనలు విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం ద్వారా మహిళలపై అత్యాచారాలు నివారించడానికీ, మహిళల గౌరవమర్యాదలు కాపాడడానికీ తన వంతు కృషి తాను చేసేశాననీ అందరూ అలాంటి కృషే చేయాలనీ ఎమ్మెల్యే హితవు పలుకుతున్నాడన్నమాట!

పితృస్వామిక వ్యవస్ధకు ఎలాంటి కాపలాదారులు దేశంలో ఉన్నారో రాజస్ధాన్ ఎమ్మెల్యే స్పష్టంగా తెలియజేశాడు. ఆయనొక్కడేనా? లెక్కించడం మొదలుపెడితే ఎందరిని లెక్కించినా మరొకడు మిగిలే ఉంటాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణగారేమో “అమ్మాయి కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతరాత్రి ప్రవేటు బస్సు ఎక్కకుండా జాగ్రత్తపడాలి… అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందంటాం. అందుకని అర్ధరాత్రి తిరుగుతామా?” అని ప్రశ్నిస్తాడు. అమ్మాయిలు మేజర్ అయ్యే వయసు తగ్గించాలని హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలా అంటాడు. ఇక డి.జి.పి స్ధాయి వ్యక్తులు కూడా పంజాబి డ్రస్ లను కూడా అశ్లీల దుస్తులన్న అభిప్రాయంతో ఉంటారు. అమ్మాయిలు ప్రోత్సహిస్తే తప్ప రేప్ లు జరగవని ఢిల్లీ పోలీసు అధికారులంతా ముక్తకంఠంతో తెహెల్కాతో వ్యాఖ్యానించిన సంగతి చెప్పనే అక్కర్లేదు.

వీళ్ళంతా చెప్పేది ఒక్కటే. అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయంటే దానికి అమ్మాయిలే కారణం. అమ్మాయిలు స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్లడమే కాక ఆ వెళ్ళడం గౌనులు వేసుకుని వెళ్ళడం, రాత్రిళ్ళు ఉద్యోగాలు చెయ్యడం, ప్రభుత్వాలు అనుమతించినవే అయినా చూసుకోకుండా ప్రవేటు బస్సులు ఎక్కెయ్యడం, పబ్ లకి వెళ్ళడం, ప్రభుత్వాలు ముద్రలువేసి విడుదల చేసినవే అయినా అబ్బాయిలతో కలిసి మద్యం తాగడం, బుర్రా బుద్ధీ లేకుండా కంప్యూటర్ కోర్సులో లేక డిగ్రీలూ పి.జీలో చదివేసి అర్ధరాత్రి, అపరాత్రి అని చూసుకోకుండా కాల్ సెంటర్లలో పని చెయ్యడం… ఎన్నని? అమ్మాయిలు చెయ్యని ఘోరం ఏమన్నా ఉందంటారా? ఇన్ని ఘోరాలు చేస్తున్నపుడు అత్యాచారాలను ప్రభుత్వాలయినా ఎన్నని నిరోధిస్తాయి అని వీరి ప్రశ్న. వీళ్ళు మొక్కుబడిగా దోషులని శిక్షిస్తామని అంటారేగానీ ఒక్కడంటే ఒక్కడయినా రేపిస్టు ఎంతటివాడయినా రేపిస్టేననీ, సమాజంలో వారికి అనుకూల పరిస్ధితులు ఉన్నాయనీ, ముందు సమాజాన్ని సంస్కరించాలనీ, ఆ సంస్కరించే పని ఎమ్మెల్యేగా, ఎం.పిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రధానంగా తమదేననీ అన్నపాపాన పోలేదు. సినిమాల్లో అశ్లీలతను నిరోధిస్తామనిగానీ, మద్యపానాన్ని నిరోధిస్తామనిగానీ వీరెవ్వరూ హామీ ఇవ్వలేకపోయారు. ఇవ్వరు కూడా.

From: NDTV

From: NDTV

‘పరిస్ధితులు బాగాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి’ అని అమ్మాయిలకు, మహిళలకు సహాయపూర్వక సలహా ఇవ్వొచ్చు. కానీ ఎవరు ఇవ్వాలి? బంధువులు, స్నేహితులు, అమ్మా, నాన్న, అన్నయ్య, అక్కయ్య, చెల్లెమ్మ…. ఇలా ఎవరైనా ఇవ్వొచ్చు. కానీ నేరాలను నివారించవలసిన బాధ్యత, నేరస్ధులనుండి ప్రజలను కాపాడే చట్టపరమైన అధికారం, బాధ్యతలను తమవద్ద ఉంచుకున్న ఎమ్మెల్యేలూ, మంత్రులు, పోలీసులు కూడా అదే సలహా ఇస్తామంటే ఎవరికి ఇస్తున్నట్లు? రక్షణ ఇవ్వవలసిన ప్రభుత్వ అంగాలన్నింటినీ చేతుల్లో ఉంచుకుని వాటిని ఉపయోగించడం మాని బాధితులకే సలహాలు ఇస్తామని చెప్పడం ఎటువంటి కర్తవ్య నిర్వహణ?

సోనియాగాంధీ స్వయంగా మహిళ. లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలు మహిళే. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా మహిళే. వీళ్ళందరికీ చట్టసభల్లో అపార అనుభవం ఉంది. ఢిల్లీ అత్యాచారం జరిగినపుడు చర్యలు తీసుకోవడం మాని “అన్యాయం, ఘోరం” అంటూ వీళ్ళే హాహాకారాలు చెయ్యడం ఏమిటి? హాహాకారాలు విని కాపాడడానికి పరుగెత్తుకెళ్లవలసిన వాళ్ళే తామే హాహాకారాలు చెయ్యడం ఏమిటి? సోనియా గాంధీ కాంగ్రెస్ అధినేత్రి మాత్రమే కాక, ప్రభుత్వంలో ప్రధానిని కూడా నియంత్రించగల శక్తిమంతురాలు. విస్తృతంగా జరుగుతున్న అత్యాచారాల నివారణకు ఆమే స్వయంగా రంగంలోకి దిగి ప్రభుత్వంలో తగిన చర్యలు మొదలుపెట్టడం మాని ‘కఠినంగా శిక్షించాలి’ అంటూ ప్రధానికి లేఖరాయడం ఏమిటి? అత్యాచారం జరిగింది కనుక అమ్మాయి శీలంపై మచ్చపడిపోయిందంటూ ప్రతిపక్ష నాయకురాలే వ్యాఖ్యానిస్తుంటే  స్త్రీలకు శీలాలు అంటగట్టడం అభివృద్ధినిరోధక మనస్తత్వమనీ, దానికి అతీతమైన వ్యక్తిత్వం మహిళలకు ఉంటుందన్న ఆధునిక ప్రజాస్వామిక విలువలను ప్రజలకు ఎవరు నేర్పిస్తారు?

లోపం ఎక్కడుందో ఇప్పుడు కాదు ఎప్పుడో స్పష్టమైపోయింది. ప్రజాసామాన్యాన్ని అదుపులో ఉంచడానికి ఉనికిలోకి వచ్చిన భూస్వామ్య, పెట్టుబడిదారీ విష సంస్కృతుల్లోనే ఛాందస భావాల పునాది దాగిఉంది. దేశాన్ని ఇంకా ఏలుతున్నది ఈ భూస్వామ్య, పెట్టుబడిదారీ పాలకులే కనుక అటువంటి వ్యవస్ధాగత లోపాన్ని సవరించే అవసరం గానీ, శక్తిగానీ నేటి పాలకులకు లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారతదేశ భూస్వామ్య, పెట్టుబడిదారీ ప్రతినిధులయిన కాంగ్రెస్, బి.జె.పి, టి.డి.పి, వై.కా.పా,(ఎ.ఐ.ఎ) డి.ఎం.కె, ఎస్.పి, బి.ఎస్.పి… ఇత్యాదిగా గల పార్టీల్లో వేటికీ మహిళలపై అత్యాచారాలను నివారించే అవసరమూ, సత్తువా లేవు. వీటికి ప్రజలపై ఆధిపత్యం కావాలి. తమ ఆధిపత్యం కోసం ప్రజలను రకరకాల పేర్లతో అణచిఉంచే సమస్త సామాజిక సాధనాలనూ కాపాడుకోవడం వీరికి అవసరం. ప్రజల్లో సగభాగమైన స్త్రీలపై ఆధిపత్యాన్నీ, అధికారాన్నీ నిరూపించుకోవడానికి వాడబడుతున్న అత్యంత శక్తివంతమైన సాధనంగా లైంగిక అత్యాచారాన్ని మార్చడంలో వీరందరికీ భాగస్వామ్యం ఉంది.

లేదంటే ఢిల్లీ అత్యాచారంపై నిరసన తెలిపేందుకు ప్రజలు తరలివస్తుంటే వారిని కుక్కల్ని తరిమినట్లు తరిమింది ఎవరు? అత్యంత అమానుషంగా జరిగిన అత్యాచారానికి ఎన్నడూ లేనివిధంగా మానవీయ స్పందనతో వేలాదిగా కదిలివచ్చిన విద్యార్ధినుల టియర్స్ (కనీళ్లు) అర్ధం చేసుకోవడం మాని టియర్ గ్యాస్ తో, వాటర్ కెనాన్లతో తరిమింది ఎవరు? హర్యానాలో వరుసగా ఒకేనెలలో డజనుపైగా అత్యాచారాలు జరిగితే సోనియా గాంధీ స్వయంగా పలకరించిన బాధితురాలి కుటుంబాన్ని ఇప్పటికీ రేపిస్టులు బెదిరిస్తున్నా వారిని కాపాడుతున్నది హర్యానా కాంగ్రెస్ ప్రభుత్వమే. బాధితురాలు, రేపిస్టు ఇద్దరూ దళితులైన చోటికే సోనియా పలకరింపులు వెళ్ళాయి తప్ప జాట్ కుల రేపిస్టుల బాధితురాళ్లను పలకరించే సాహసం సోనియా చేయలేకపోయిందంటే కారణం ఏమిటి?

హర్యానాలోగానీ మరే రాష్ట్రంలోగానీ బడుగులపై అధికారాన్నీ, ఆధిపత్యాన్నీ చెలాయించడానికీ, నిరూపించుకోవడానికీ లైంగిక అత్యాచారం ఒక పాపులర్ సాధనం అంటే అతిశయోక్తికాదు. మహిళల రక్షణ కోసం 181 హెల్ప్ లైన్ ప్రకటించిన కేంద్రం దానిని ఇంకా ఢిల్లీలోనే అమలులోకి తేలేకపోయింది. హెల్ప్ లైన్ గురించి మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వమూ ఇంతవరకూ పెదవి విప్పిన పాపాన పోలేదు. అత్యాచారాల బాధితుల కోసం తమ రాష్ట్రాల్లో కూడా మహిళల కోసం హెల్ప్ లైన్ పెట్టాలని మహిళా సంఘాలు డిమాండ్ చేయవలసి ఉండగా వారెందుకో ఈ విషయంలో నోరు మెదపలేదు. అత్యాచారాల విచారణ కోసం ఢిల్లీలో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు జంవారి 3 నుండి పనిచేయనున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆపని ఇతర రాష్ట్రాలు కూడా చేయాలని ఆర్ధికమంత్రి చిదంబరం చెప్పినా ఆ విషయంలో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఏమీ చెప్పలేదు. ఆయా రాష్ట్రాల మహిళా సంఘాలు కూడా ఆ డిమాండ్ ను అందుకున్న దాఖలాలు లేవు.

ఈ పరిస్ధితుల్లో ఎన్ని చట్టాలు వచ్చినా ఆ చట్టాలను నిర్వీర్యం అయ్యే వ్యవస్ధలోనే బతుకుతున్నాం గనుక అవన్నీ వ్యర్ధమే. ఆ చట్టాలను అమలు చేయించుకోవాలన్నా జనం మళ్ళీ పోరాటం చెయ్యవలసిందే. ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఎలాగూ చురుగ్గానే ఉన్నాయి. పాలితుల కోసం పోరాడుతున్నామన్న సంఘాలు, పార్టీలే నిర్లిప్తతతో కొట్టుమిట్టాడుతుండడం అత్యంత బాధాకరం. దారుణాలు జరుగుతున్నపుడు ప్రజలు తామంతట తాము కదిలుతున్నపుడు వీరు హడావుడి చేస్తున్నారు తప్ప తామే పూనుకుని ఉద్యమాలు నిర్మిస్తామన్న వీరి హామీలు అలాగే ఉండగా, వారి పంధా, కార్యక్రమాల పుస్తకాలు, కోల్డ్ స్టోరేజ్ లలో రెస్టు తీసుకుంటున్నాయి. అదేమంటే ప్రజలు కదలడం లేదనడం వీరికి అలవాటుగా మారిన సాకు. వాస్తవం ఏమిటంటే కదలదనిది వారే. జనం ఎప్పుడూ కదలికలోనే ఉన్నారు. ఢిల్లీ అత్యాచారానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఉవ్వెత్తున ఎగసి పోలీసు లాఠీలను ధిక్కరించిన తాజా ఉద్యమమే అందుకు సాక్ష్యం. ఇకనైనా వారు సాకులు వెతకడం మాని ప్రజలను కార్యోన్ముఖులను చేస్తే విముక్తి మార్గం ఎంతోదూరంలో ఉండబోదు.

6 thoughts on “అమ్మాయిల గౌన్లు అశ్లీలమా? వీళ్ళు కదా రేపిస్టులకు కాపలాదార్లు!

  1. నాకు తెలిసినంతవరకు ఢిల్లీలో కాలేజ్ అమ్మాయిలు ఎవరూ గౌన్‌లు వేసుకోరు. 1997లో ఢిల్లీ వెళ్ళాను. అప్పటికీ, ఇప్పటికీ ఢిల్లీ అమ్మాయిల డ్రెస్ స్టైల్‌లో మార్పు వచ్చిందని అనుకోను.

  2. ఏ విషయం పైన అయినా ఎవరి యే మాటనయినా వక్రీకరించి వ్యాఖ్యానించటం ఒక కళగా‌ మారిపోయినట్లు తోస్తున్నది. ఈ‌ వ్యాసం కూడా అందుకు మినహాయింపు కాదు.

    లైంగికదాడులను యెవరూ అమోదించరు, సహించరు. అందులో యెవరికీ‌అనుమానం అక్కరలేదు.

    స్రీల వస్త్రధారణపైన చర్చ జరగటం‌అనవసరం అన్న భావన అటుంచి యెవరైనా వారి వస్త్రధారణలో వస్తున్న పోకడల ప్రభావం గురించి మాట్లాడితేనే మహానేరం అన్న ధోరణి ఒకటి గమనికలోనికి వస్తున్నది. ఈ‌ వ్యాసకర్తగారే “సినిమాల్లో అశ్లీలతను నిరోధించటం” అనే‌విషయం ప్రస్తావించారు. మరి ఆ అశ్లీలతను వారు యెలా వివరిస్తారో? అది ఆయా సన్నివేశాల లోని స్త్రీల దుస్తుల పరంగా చెప్పటానికి అభ్యంతరం కదా? అలాగే ఆయా సన్నివేశాల లోని స్త్రీలప్రవర్తనలను తప్పుపట్టటం నేటి స్త్రీవాద ధోరణులకు వ్యతిరేకమేమో. ఇకమిగిలింది ఆయా సన్నివేశాలలోని పురుషులే కదా. అయితే అన్నిసార్లూ‌అది సరియైన మాట అవునా‌కాదా అన్నది ఆలోచించాలి.

    “మహిళలకు సహాయపూర్వక సలహా ఇవ్వొచ్చు. కానీ ఎవరు ఇవ్వాలి? బంధువులు, స్నేహితులు, అమ్మా, నాన్న, అన్నయ్య, ….” అంటూ వ్యాసకర్త గారు అన్నదీ‌ అభ్యంతరకరంగాదా? నాన్న అన్న కూడా వ్యాసకర్తగారి అబిప్రాయం ప్రకారం “భూస్వామ్య, పెట్టుబడిదారీ విష సంస్కృతుల్లోనే ఛాందస భావాల పునాది” కల వ్యక్తులే‌ కదా? కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులనుకుంటే, లైంగికదాడుల్లో అధికశాతం దగ్గరి బంధువుల నుండే అన్న మాట మరచినట్లవుతున్నది. తేలినదేమిటంటే, మగవాళ్ళెవరికీ ఆడవాళ్ళకు సలహాయిచ్చే‌ హక్కు లేదు కాక లేదు. ఏ విషయంలోనూ‌ ఆక్షేపించే‌ సాహసం వారు చేయగూడాదు కాక చేయకూడదు. అంతే.

  3. శ్యామలరావుగారూ

    స్త్రీల వస్త్రధారణ పోకడల ప్రభావం వల్లనే లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయని మీరు సూచిస్తున్నారా? మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పలేదు.

    స్త్రీల వస్త్రధారణ ప్రభావాలపై చర్చ చేయడం, స్త్రీల వస్త్రధారణ వల్లనే లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పడం రెండూ ఒకటికాదని నా అభిప్రాయం. అదీకాక ఎప్పుడూ స్త్రీల వస్త్రధారణ, దాని ప్రభావం గురించే చర్చ ఎందుకు జరుగుతుందో కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత స్త్రీలపైనే ఎందుకు ఎక్కువగా ఉంటోందో కూడా మాట్లాడుకోవాలి. అవేమీ మాట్లాడరు గానీ అత్యాచారాలు జరగకుండా ఉండడానికి స్త్రీలపై సవాలక్షా ఆంక్షలు విదించడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. చర్చలో ఉన్నవి ఆ విషయాలే తప్ప మీరు భావిస్తున్నట్లు వక్రీకరణ కాదు.

    సినిమాల్లో అశ్లీలత అనగానే మీకు మళ్లీ స్త్రీల దుస్తులే గుర్తుకొచ్చాయి సుమండీ. అశ్లీలత గురించి మీబోటి పెద్దలకు కొత్తగా నేను చెప్పేదేముంటుంది చెప్పండి? చీరకట్టుని కూడా అశ్లీలంగా చూపగల ప్రతిభ సినిమావాళ్ల సొంతం. కానీ స్కూల్/కాలేజీ పిల్లల యూనిఫారం గౌన్లకీ సినిమాల్లో అశ్లీలతకీ మధ్య సంబంధం చూడగల మీ ప్రతిభ కూడా గొప్పదే అని అంగీకరించక తప్పదు.

    >> నాన్న అన్న కూడా వ్యాసకర్తగారి అబిప్రాయం ప్రకారం “భూస్వామ్య, పెట్టుబడిదారీ విష సంస్కృతుల్లోనే ఛాందస భావాల పునాది” కల వ్యక్తులే‌ కదా?>>

    కదా. సందేహం ఎందుకు? అయితే, కాలానుగుణంగా పాత నీరుపోయి కొత్తనీరు వచ్చినట్లే, సమాజంలో కూడా పాత భావాలు పోయి కొత్త భావాలు వస్తాయని ఎవరైనా మొదట అంగీకరించాలి. అలా అంగీకరిస్తే మార్పులను ఆహ్వానించే పరిస్ధితిలో ఉన్న జనం సరికొత్త ప్రగతిశీల భావాలను ఆహ్వానిస్తారనీ, పాతలోని అనుభవాన్ని పదిలం చేసుకుని కొత్తలోని ప్రగతిని ఆహ్వానిస్తారనీ గ్రహించవచ్చు. అలా ఆహ్వానించినవారు సమాజ ప్రగతికి తోడ్పడతారు. ఆహ్వానించలేనివారు ప్రగతిని అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. వీరిరువురి మధ్య అనేక రూపాల్లో ఘర్షణ అనివార్యం. ఆ ఘర్షణ కొన్నిసార్లు సున్నితంగా ఉంటే మరికొన్నిసార్లు మొరటుగా ఉంటుంది. ఈ చర్చను ఇక్కడితో వదిలేసి మీ వ్యాఖ్య విషయానికి వస్తాను.

    కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు అందరూ నూటికి నూరు శాతం శ్రేయోభిలాషులే అయితే సమస్యే ఉండదు కదా. అలా లేని కొంత మంది వల్ల కొందరికి సమస్యలు వస్తున్నాయి. రేపిస్టుల్లో ఎక్కువమంది తెలిసినవారే అని పోలీసులు చెప్పారంటే కుటుంబ సభ్యులే అని కాదు. పక్కిల్లు, పక్క వీధి, ఒకే ఆఫీసు, ఒకే లొకాలిటీ, ఇంకా ఇతరత్రా పరిచయస్ధులు ఇలాంటివారు కూడా. అందువలన మీరు చెప్పిన వైరుధ్యం ఇక్కడ లేదని గ్రహించవచ్చు.

    >>తేలినదేమిటంటే, మగవాళ్ళెవరికీ ఆడవాళ్ళకు సలహాయిచ్చే‌ హక్కు లేదు కాక లేదు. ఏ విషయంలోనూ‌ ఆక్షేపించే‌ సాహసం వారు చేయగూడాదు కాక చేయకూడదు. అంతే.>>

    ఇది మీరు చెప్పిన వక్రీకరణ కళ.

  4. Ammaailantaa emi dhariste rape lu aagutayi? cheerala? burakhaala?
    veetini dhariste rape lu jaragatam ledaa?

    papers lo rojoo chustunnam—5 years 3years 6 years age pillalapi atyaachaaralu,
    aa pasi moggallo kooda asleelata chustunnaara?

    problem vaaru dharinche dustullonaa leka magavaari aadhipatya dhoranaa, ahankaarama, society patla chattaala patla bhayam lekapovatamaa?

    Ammyala vastradharana valle jarugutunnayi anevaaru aatma vimarsa chesukovaali.

    fashions antoo arthanagna dresslu vesukonakkaraledu. dating antoo tiragatam valla ammaayile nastapotaaru. kaani aa saaku choopi ur body our right ante voorukoru.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s