హిందూ ద్వేషంతో భారతీయుడిని పట్టాలపైకి నెట్టి చంపిన అమెరికన్ మహిళ


Erika Menendezఅమెరికాలో న్యూయార్క్ సబ్ వే లో భారతీయుడొకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. రైలుకోసం ఎదురుచూస్తున్న అతన్ని ఓ అమెరికన్ మహిళ స్టేషన్ లోకి ప్రవేశిస్తున్న రైలు ముందుకి వెనకనుండి తోసి చంపేసింది. మొదటి, రెండు కంపార్ట్ మెంట్లు అతని మీదుగా పోవడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని సునందో సేన్ గా గుర్తించారు. తనకు హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమనీ అందుకే అతన్ని చంపేశాననీ అమెరికన్ మహిళ అంగీకరించినట్లుగా న్యూయార్క్ పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 11, 2001 టెర్రరిస్టు దాడులు అనంతరం తాను హిందూ, ముస్లింలపైనా ద్వేషం పెంచుకున్నానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

31 యేళ్ళ నిందితురాలు ఎరికా మెనెండెజ్ క్వీన్స్ లో నివశిస్తుండగా 46 సంవత్సరాల సునందో సేన్ కూడా క్వీన్స్ లోనే ఒక చిన్న అపార్ట్ మెంట్ లో ఇతరులతో కలిసి నివసిస్తున్నాడు. అనేక సంవత్సరాల క్రితమే అమెరికాకి వలస వచ్చిన సునందో ఈ మధ్యనే కొలంబియా  యూనివర్సిటీ వద్ద సొంతగా ఒక ప్రింటింగ్ అండ్ కాపీయింగ్ అంగడి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. అతనికి వివాహం కాలేదనీ అతని తల్లిదండ్రులిద్దరూ చనిపోయారనీ పి.టి.ఐ తెలిపింది. తన మరణం గురించి ఇండియాలోని అతని కుటుంబానికి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ దుర్ఘటన క్వీన్స్ స్టేషన్ లో డిసెంబర్ 27 రాత్రి  జరిగింది. పట్టాలకు దగ్గరగా నిలబడి ఉన్న సేన్ ను ఊహించని విధంగా అమెరికన్ మహిళ వెనకినుండి తోసేయడంతో అతనికి తననుతాను రక్షించుకునే అవకాశం కూడా లభించలేదని తెలుస్తోంది. పక్కన ఉన్నవారికి కూడా అతన్ని కాపాడే అవకాశం దొరకలేదనీ, అంతా లిప్తపాటు కాలంలో జరిగిపోయిందనీ తెలుస్తోంది. ట్రైన్ ఢీకొట్టడం వల్ల అనేకచోట్ల తగిలిన మొద్దు గాయాల వలన (multiple blunt force trauma) సేన్ చనిపోయాడని పోలీసు అధికారి బ్రౌన్ చెప్పినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. మొదటి కంపార్ట్ మెంటు అతన్ని ఢీకొట్టగా పట్టాలపై పడిపోయాడని అతనిపై మొదటి రెండు కంపార్టు మెంట్లు వెళ్ళాయనీ పోలీసులు తెలిపారు.

సర్వైలెన్స్ ఫుటేజ్ -న్యూయార్క్ డెయిలీ

సర్వైలెన్స్ ఫుటేజ్ -న్యూయార్క్ డెయిలీ

“ఒక ముస్లింను నేను రైలు పట్టాలపైకి నెట్టాను. ఎందుకంటే నాకు హిందువులన్నా, ముస్లింలన్నా పరమ ద్వేషం. 2001లో జంట టవర్లను కూల్చివేసినప్పటి నుండీ నేను వారిని కొడుతూనే ఉన్నాను” అని మెనెండెజ్ తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నదని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. హత్యా దారుణానికి పాల్పడిన మహిళ రెండు రోజులపాటు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగింది. ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా శనివారం ఉదయం ఆమెను పట్టుకున్నారు. సాక్షుల వర్ణనల ఆధారంగా ఆర్టిస్టు చేత స్కెచ్ గీయించిన స్కెచ్ నూ, సర్వైలెన్స్ వీడియో భాగాన్నీ పోలీసులు పలుచోట్ల ప్రదర్శించారు. ఆమె గురించి సమాచారం ఇచ్చినవారికి 12,000 డాలర్ల బహుమానం కూడా ప్రకటించారు. బ్రూక్లీన్ బ్రిడ్జ్ పై ఉన్న మహిళను ఒక వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జాతి విద్వేషి మెనెండెజ్ దొరికిపోయింది.

తానే హత్య చేశానని మహిళ అంగీకరించిందని పోలీసు అధికారి పాల్ బ్రౌన్ తెలిపాడు. సేన్ ను ముస్లింగా భావిస్తూ అతన్ని రైలు ముందుకి తోశానని ఆమె పోలీసులకి తెలిపింది. “మెనెండెజ్ చేసిన అత్యంత విద్వేషపూరిత వ్యాఖ్యలను గానీ, విద్వేషంతో ఆమె పాల్పడిన చర్యలను గానీ నాగరిక సమాజం ఎన్నటికీ సహించలేదు” అని పాల్ బ్రౌన్ వ్యాఖ్యానించాడు. “స్టేషన్ లోకి ప్రవేశిస్తున్న ట్రైన్ ముందుకి ఏమాత్రం జ్ఞానం లేకుండా, అకస్మాత్తుగా ఒక వ్యక్తిని తోసేయడం అనేది సబ్ వే ప్రయాణికులకి భాయనక పీడకలలు తెప్పించే చర్య” అని ఆయన అభివర్ణించాడు.

sunando senగత 20 సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్న సునందో అమెరికన్ కలల వెంట పరుగెత్తిన భారతీయుల్లో ఒకరు. వారానికి ఏడు రోజులపాటు శ్రమిస్తాడని అతని రూమ్‌మేట్లచేత అభివర్ణించబడిన సునందో వృత్తిరీత్యా గ్రాఫిక్ డిజైనర్. “న్యూ ఆమ్‌స్టర్‌డామ్ ప్రింటింగ్ కంపెనీ” లో పనిచేసిన సునందో ఆరు నెలల క్రితమే అత్యంత ఖరీదైన లొకాలిటీ అయిన మనహట్టన్‌లో తన సొంత షాపు పెట్టుకున్నాడు. “తనకు తానే బాస్ కావాలన్నది అతని కల. సొంత వ్యాపారం మొదలుపెట్టాక ఎంతో ఉత్సాహభరితుడయ్యాడు” అని అతని మిత్రుడు సుమన్ తెలిపాడని న్యూయార్క్ డెయిలీ తెలిపింది. “ఎంత సున్నితుడు, మంచి వ్యక్తి అంటే అతను లేడంటే భరించలేకపోతున్నాను” అని మరో రూమ్‌మేట్ ఎం.డి.ఖాన్ తెలిపాడు. కలకత్తాలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని న్యూయార్క్ యూనివర్సిటిలో కోర్సు చేసాక న్యూ ఆమ్‌స్టర్‌డాం ప్రింటింగ్ ప్రెస్‌లో అహరహం శ్రమించి సొంతషాపు కలను నెరవేర్చుకున్న సునందో సేన్ ఆరునెలల్లోనే మతిలేని జాతివిద్వేషానికి ఆహుతయ్యాడు.

సెప్టెంబర్ 11, 2001 నాటి దుర్ఘటన అమెరికాలో సృష్టించిన విద్వేషపూరిత వాతావరణం ఇప్పటికీ కొనసాగుతున్నదని న్యూయార్క్ సబ్ స్టేషన్ దుర్ఘటన తెలియజేస్తున్నది. ఆనాటి దుర్ఘటనకి కారకులుగా ఆల్-ఖైదా, లాడెన్‌లపై నిందమోపిన అమెరికా, టెర్రరిజంపై ప్రపంచయుద్ధం ప్రకటించి మూడు దేశాలపై (ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా) అమానవీయ యుద్ధం కావించి కోట్లాది ప్రజల జీవితాల్లో నిప్పులు పోసి వారిని నిలువనీడ లేకుండా చేసింది. ఇపుడు నాలుగో దేశం సిరియాలో కిరాయి తిరుగుబాటు నడిపిస్తూ ఆదేశాన్ని మూడు ముక్కలు చేయడానికి యూరప్, ఇజ్రాయెల్‌లతో కలిసి నీచమైన కుట్రలు సాగిస్తోంది. ఆల్-ఖైదాపై ప్రపంచయుద్ధం ప్రకటించిన అమెరికా అదే ఆల్-ఖైదాతో కలిసి లిబియాలో ప్రభుత్వం ఏర్పరచడమే కాక సిరియాలోనూ ఆల్-ఖైదాతో అంటకాగుతూ దానికి అత్యాధునిక మిసైళ్ళు సరఫరా చేస్తూ సిరియా ప్రజలను రక్తపుటేరుల్లో ముంచెత్తుతోంది.

సెప్టెంబర్ 11, 2001 దుర్ఘటనకు కారణం అమెరికా ప్రభుత్వంలోని మితవాద శక్తులేననీ, ఈ ‘ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్’ ద్వారా ముస్లిం దేశాలపై అమెరికన్ ప్రజల్లో విద్వేషాన్ని రగిల్చి తద్వారా ముస్లిమ్, అరబ్ దేశాల్లోని ఆయిల్ వనరులను కబళించడానికే తమప్రజలపై తామే అమానుష టెర్రరిస్టు చర్యకు పూనుకున్నారని అనేకమంది పరిశోధకులు ఇప్పటికే తేల్చిచెప్పారు. ప్రపంచం నలుమూలలా చీమ చిటుక్కుమన్నా తనకు తెలిసేలా అత్యంత అధునాతన వేగు వ్యవస్ధలను ఏర్పరుచుకున్న అమెరికా రాజ్య వ్యవస్ధ కొన్ని గంటలపాటు అమెరికా ప్రధాన నగరాలపై హైజాక్ చేయబడిన విమానాలు వీరవిహారం చేస్తున్నా అమెరికన్ రాడార్లు ఎందుకు కనిపెట్టలేదని సదరు పరిశోధకులు ప్రశ్నించారు. దుర్ఘటన జరిగినపుడు ఒక స్కూల్‌లో ఉన్న జార్జి బుష్ దుర్ఘటన సమాచారం వెనువెంటనే తనకి చేరినా అరగంటపాటు నిమ్మకు నీరెత్తినట్లు స్కూల్‌లోనే ఎందుకు ఉండిపోయాడని వారు ప్రశ్నించారు.

విమానం ఢీకొన్నంతమాత్రానే వందకు పైగా అంతస్ధులు గల భవనాలు పునాదుల వరకూ నిలువునా కూలిపోయేంత బలహీనంగా నిర్మించబడ్డాయా అని వారు ప్రశ్నించారు. ఎంతపెద్ద విమానం ఢీకొన్నా అత్యంత కట్టుదిట్టంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన డబ్ల్యూ.టి.సి జంట టవర్లు పునాదులవరకూ కూలిపోవడం అసంభవం అని డిమాలిషన్ టెక్నాలజిస్టులు కూడా తేల్చిచెప్పిన సత్యం. ఒక పధకం ప్రకారం డిమాలిషన్ టెక్నాలజీతో, బాంబులతో నియంత్రిత కూల్చివేత (controlled demolition) జరిగితే తప్ప అటువంటి కూల్చివేతలు జరగడం సాధ్యం కాదని సదరు టెక్నాలజిస్టులు విప్పిచెప్పిన సత్యం. ఈ వాస్తవాలన్నీ విచారణలో తేలినప్పటికీ విచారణ నివేదిక అమెరికన్ ప్రజలకు చేరకుండా కాంగ్రెస్, సెనేట్ లు తొక్కిపెట్టాయని అనేకమంది పరిశోధకులు, విలేఖరులు, రాజకీయ నాయకులు ఆరోపణలు చేసినప్పటికీ వాటిని వెలుగులోకి రాకుండా పశ్చిమ కార్పొరేట్ (విష)పత్రికలు తొక్కిపెట్టాయన్నది దాచేస్తే దాగని సత్యం.

అసలు నిజం ఇది కాగా అనేకమంది అమెరికన్ ప్రజలు కార్పొరేట్ పత్రికల విషప్రచారాన్ని నమ్ముతూ ఇంకా బధిరాంధకారంలోనే మగ్గడం అత్యంత విచారకరం. అమెరికన్ సామ్రాజ్యవాద రాజ్యవ్యవస్ధ ప్రపంచ దేశాలపై అచ్చోసిన ఆంబోతులా తెగబడి కోట్లాది ప్రజలను అంతం కావిస్తూ, మరిన్ని కోట్లమంది బ్రతుకులను ఛిద్రం కావిస్తున్నప్పటికీ స్పందించలేని అమెరికా ప్రజలు ఏ నాగరికతకు ప్రతినిధులో ఆత్మవిమర్శ చేసుకోవాలి. సవాలక్ష అబద్ధాలతో ఒక స్వతంత్ర దేశంపై అమెరికన్ రాజులు దాడి చేసినతోడనే వారి పాపులారిటీ రేటింగ్ అమాంతం పెరుగుతోందంటే రాక్షసత్వాన్ని ఆరాధించే సంస్కృతి మధ్యయుగాల అనాగరిక విద్వేష సంస్కృతా లేక నాగరికతా శిఖరాలపై అధిష్టించిన సర్వమానవ సమానతా సంస్కృతా అన్నది అమెరికన్ ప్రజలు ఆలోచించుకోవాలి. పరదేశాలనూ, ప్రజలనూ, వారి జీవితాలనూ కబళించి చీకటిలో ముంచే అమెరికన్ సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదాన్ని తిరస్కరించే స్ధాయికి అమెరికన్ ప్రజలు చేరుకోకపోతే ప్రపంచానికి పట్టిన అమెరికా శని కొనసాగడంలో వారికీ భాగస్వామ్యం ఉన్నట్లే.

One thought on “హిందూ ద్వేషంతో భారతీయుడిని పట్టాలపైకి నెట్టి చంపిన అమెరికన్ మహిళ

 1. ఈ మధ్యన పశ్చిమ దేశాలలో (చాలా దేశాలలో )ముస్లిమ్స్ మీద ద్వేషం ఎక్కువైపోతుంది. ముస్లిమ్స్ అనుకుని హిందుస్ మీద దాడులు చేస్తున్నారు.
  ఆ మధ్యన, సిక్కులు మీద దాడులు చేసారు. వాళ్ళు కష్టపడి ప్రచారం చేసుకున్నారు మేము ముస్లిమ్స్ కాదని.
  అలాగే హిందువులు కూడా ప్రచారం చేసునే దుస్తితి వచ్చింది.
  ఏ ముస్లిం డెమోక్రటిక్ కంట్రీ చుసిన గొడవలతోనే ఉంటుంది. ఒక్క అరబ్ కంట్రీస్ తప్ప. ఎందుకంటే అక్కడ రాచరికం ఉండటం వల్లేమో.
  పాకిస్తాన్, నైజేరియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, సుడాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ట్యునీషియా, సోమాలియా, లిబియా, ఒమాన్, బర్మా ,జాంబియా,ఇంకా లిస్టు చాల ఉంది.
  ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు, ఇస్లామిక్ terrorism న్యూస్ లేకుండా ఉండదు.
  ఇది చుడండి ఇండోనేషియా లో అంటా
  A MOB attacked Alexander Aan even before an Indonesian court in June jailed him for two and a half years for “inciting religious hatred”. His crime was to write “God does not exist” on a Facebook group he had founded for atheists in Minang, a province of the world’s most populous Muslim nation. Like most non-believers in Islamic regions, he was brought up as a Muslim. And like many who profess godlessness openly, he has been punished.

  మీరు ఎంత ముస్లిమ్స్ కి సపోర్ట్ చేసినా, ప్రపంచం లో ఇస్లామఫోబియా రోజు రోజు కి పెరుతుందన్న నిజం దాయలేరు. its universal fact that, Islam was spread by sword, you can not deny this fact.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s