రేప్ కి ఆడోళ్ళే కారణం అంటున్న ఢిల్లీ పోలీసులు, తెహెల్కా పరిశోధన (పునర్ముద్రణ)


slut-walk-delhi-

(ఈ ఆర్టికల్ ఏప్రిల్ 7, 2012 తేదీన మొదటిసారి ఈ బ్లాగ్ లో ప్రచురితమయింది. అమానత్ విషాదాంతం సందర్భంగా అత్యాచారాల విషయంలో ఢిల్లీ పోలీసుల దృక్పధం ఎలా ఉన్నదో గుర్తు తెచ్చుకోవడానికి తేదీ మార్చి మళ్ళీ ప్రచురిస్తున్నాను. భారత సమాజాన్నీ, సంస్కృతినీ ఇలాంటి పుచ్చిపోయిన మెదళ్లు శాసిస్తూ, రక్షకులుగా ఉన్నంతవరకూ అత్యాచారాలు ఆగవనీ, దోషులందరికీ తగిన శిక్షలు పడవనీ తేలికగానే అర్ధం అవుతుంది -విశేఖర్)

“ఆవిడే కోరి వెళ్ళింది”

“అంతా డబ్బు కోసమే”

“ఇదో వ్యాపారం అయ్యింది”

“ఎక్కువసార్లు అంగీకారంతోనే జరుగుతాయి”

రేప్ బాధితులపైన ఢిల్లీ పోలీసు అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. ఢిల్లీ ‘జాతీయ రాజధాని ప్రాంతం’ (నేషనల్ కేపిటల్ రీజియన్ – ఎన్.సి.ఆర్) పరిధిలో గల పోలీసు ఠాణాల్లో ఉన్న అధికారులకు రేప్ బాధితుల పట్ల ఇలాంటి గొప్ప అభిప్రాయాలు ఉన్నాయి. రీసర్చ్ స్కాలర్లుగా చెప్పుకుంటూ తెహెల్కా విలేఖరులు జరిపిన ‘ఆపరేషన్’ లో ఈ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అభివృద్ధి చెందుతున్న సున్నిత సామాజిక విలువలను ఎప్పటికప్పుడు వంట బట్టించుకోవాల్సిన రాజధాని పోలీసులు, శతాబ్దాల నాటి అభివృద్ధి నిరోధక ఫ్యూడల్ భావాలతో రేప్ బాధితులతో శత్రుపూరితంగా వ్యవహరిస్తున్నారని తెహల్కా పరిశోధనలో తేలింది. రేప్ కేపిటల్ గా మారిన ఢిల్లీలో రేప్ నేరస్ధులపైన మూడొంతులు మాత్రమే నేరాలు రుజువు కావడానికి కారణం ప్రధానంగా పోలీసులేనని తేలింది.

నెల క్రితం ఒక మైనర్ బాలిక కదులుతున్న కారులో సామూహిక మానభంగానికి గురయింది. బాలిక ఐడెంటిఫికేషన్ ని వెల్లడించడం ద్వారా నోయిడా పోలీసులు అప్రతిష్ట పాలయ్యారు. ఐ.పి.సి సెక్షన్ 228-ఎ ప్రకారం రేప్ బాధితుల ఐ.డి ని వెల్లడించకూడదు. వెల్లడిస్తే రెండేళ్ల వరకూ ఖైదు విధించబడుతుంది. ఇదేమీ నోయిడా పోలీసులని అడ్డుకోలేదు. అంతే కాకుండా నోయిడా ఎస్.పి ఈ కేసులోని బాలిక క్యారెక్టర్ పైన విలేఖరుల సమావేశంలోనే అనుమానాలు వ్యక్తం చేసి పౌర సమాజాన్ని మరింత ఆగ్రహానికి గురి చేశాడు. అంతటితో ఆగకుండా గుర్ గావ్ పోలీసులు రాత్రి ఎనిమిది దాటాక వర్కింగ్ వుమెన్ సిటీలో తిరగకుండా నిషేధం విధించాలని ప్రతిపాదించారు. ఎనిమిది దాటాక బైటికి రావాలంటే లేబర్ డిపార్ట్ మెట్ పర్మిషన్ తీసుకోవాలని వారు ప్రతిపాదించారు. స్త్రీలని బైటికి రాకుండా చేసి రేప్ లు నిరోధించాలన్నది వారి ప్రతిపాదన. పోలీసులు సమర్ధవంతంగా విచారణ చేస్తారనీ, శిక్షలు ఖాయమనీ పేరు సంపాదించగలిగితే రేప్ నేరాలు జరగడానికి తక్కువ అవకాశాలు ఉండవచ్చు. దానికి బదులు మహిళల కదలికలపైనే నిషేధం విధించడానికి పోలీసులు మక్కువ చూపారు.

రేప్ కేసులు పెరగడానికి కారణం మహిళలనేనని పోలీసు అధికారులు తడుముకోకుండా చెప్పారని తెహెల్కా తెలిపింది. మహిళల వస్త్ర ధారణ,Tehelka 01 రాత్రి వేళల్లో బయట తిరగడం, పురుషులతో కలిసి పని చేయడం లాంటివల్ల రేప్ నేరాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల స్త్రీల పట్ల దారుణమైన అభిప్రాయాలని వీరు వ్యక్తం చేశారు. కార్మిక స్త్రీలపట్ల వీరి అభిప్రాయాలూ చాలా ఘోరమని తెహెల్కా కధనంలో వెల్లడయింది. అత్యాచారాలకి గురయిన అభాగినులు మొదట వచ్చేది ఎస్.ఐ/ఎస్.హెచ్.ఒ ల దగ్గరికే. వారికే ఇలాంటి అభిప్రాయాలు ఉన్నపుడు, బాధిత స్త్రీలపట్ల కనీస సానుభూతి లేనపుడు రేప్ నేరాల్లో సరయిన శాస్త్రీయ పరిశోధన జరిగడానికి అవకాశాలు ప్రాధమిక దశలోనే మూసుకుపోతాయి. ఇక నేరస్ధూలకి శిక్షలు పడడం దాదాపు అసాధ్యం. 2010 లో ఢిల్లీలో 414 కేసులు నమోదయితే అందులో 34.6 శాతం మందిపైనే నేరం రుజువయ్యింది. తప్పుల తడక ఎఫ్.ఐ.ఆర్ లు, బాధిత స్త్రీల నుండి సరిగ్గా సాక్ష్యాలను సేకరించకపోవడం, విచారణలో చిత్తశుద్ధి లేకపోవడం తదితర కారణాల వల్ల నేరస్ధులు నిర్దోషులుగా తప్పించుకుపోతున్నారు.

బాధిత స్త్రీలు పోలీసుల వద్దకు వచ్చేదే తక్కువ. (పోలీసు స్టేషన్లలో రిపోర్టయ్యే ప్రతి రేప్ కేసుకీ 50 కేసులు రిపోర్టు కాకుండా పోతున్నాయని ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ తెహెల్కా తెలిపింది) రిపోర్టు అవుతున్న కేసుల్లో కూడా 65 శాతం శిక్ష పడకపోవడం దారుణం. పోలీసు విచారణలో లోపాలను సరిదిద్దవలసిన అవసరం బాగా కనపడుతోంది. బాధిత స్త్రీకీ, పోలీసులకీ మధ్య ఉండవలసిన సున్నితమయిన నమ్మకంతో కూడిన సానుభూతి సంబంధం పోలీసుల సాంస్కృతిక వెనుకబాటుతనం వల్ల ఛిద్రం అవుతోంది. బాధిత స్త్రీలు మరింత చిత్రవధ కావడానికి కారణంగా నిలుస్తోంది. సమర్ధవంతమైన చట్టాలు ఉన్నప్పటికీ అవి పోలీసుల వెనుకబాటుతనం వల్ల ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి.

తెహెల్కా విలేఖరులు రెండు వారాల పాటు పరిశోధన నిర్వహించారు. 23 స్టేషన్లు సందర్శించారు. 30 మందికి పైగా పోలీసు అధికారులతో మాట్లాడారు. వారిలో చాలామందికి 20-30 సంవత్సరాల సర్వీసు ఉన్నది. వీరంతా ఎన్.సి.ఆర్ పరిధిలోనివాళ్ళే. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. లక్షల మంది స్త్రీలు పురుషులతో కలిసి ఇక్కడ మూడు షిఫ్టుల్లో పని చేస్తుంటారు. తమ పరిశోధనలో మహిళల పట్ల వ్యతిరేక అభిప్రాయాలూ వ్యక్తం చేయలేదని విలేఖరులు తెలిపారు. మామూలు అభిప్రాయాలని వదిలి Tehelka 02మహిళలపై చీప్ అభిప్రాయాలూ చెప్పేందుకు ప్రోత్సహించేలా మాట్లాడలేదని చెప్పారు. నిస్పాక్షికంగా అభిప్రాయాలూ సేకరించామని చెప్పారు. అయినప్పటికీ షాకింగ్ కి గురి చేసే అభిప్రాయాలూ విన్నామని తెలిపారు.

గుర్ గావ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ ప్రాంతాల్లోని డజనుపైన పోలీసు స్టేషనలోని 17 సీనియర్ పోలీసు అధికారులు స్పై కెమెరాల ముందు మహిళల పట్ల దారుణ అభిప్రాయాలూ వ్యక్తం చేశారు. ఫ్యాషన్ దుస్తులే రేప్ లకి కారణం అన్నారు. కనిపించేలా డ్రస్ లు వేసుకుంటారన్నారు. బాయ్ ఫ్రెండ్స్ తో పబ్ లకి వస్తే రేప్ లు చేయరా అనడిగారు. తాగుతారని నిందించారు. మగాళ్లలతో కలిసి పని చేస్తే అంతే అన్నారు. ‘ప్రతిసారీ ఆడవాళ్ళదే తప్పు’ అన్నదే వారి మాటల్లోని సారాంశం. వారి దృష్టిలో నిజంగా రేప్ కి గురయినవారు పోలీసు స్టేషన్లకు రారు. పోలీసులకి వచ్చేవారు ప్రాధమికంగా డబ్బులు దండుకోవడానికేనన్నది వారి నిర్ధారణ. వారికి నైతిక విలువలు లేకపోతేనే పోలీసుల దగ్గరికి వస్తారట. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు బేసికల్ గా వ్యభిచారులట. వారిని బలవంతం చేయాల్సిన అవసరం లేదట. ఒక పురుషుడితో సెక్స్ కి అంగీకరించిన స్త్రీ అతని స్నేహితులు రేప్ చేస్తే ఫిర్యాదు చేయకూడదట. రాత్రి వేళ్ళల్లో పనికి సిద్ధమైనపుడు రేప్ లు సాధ్యమని తెలుసుకోవాలట.

పోలీసు అధికారులు చెప్పేదే నిజం అయితే రేప్ లకి చాలా అవకాశాలు ఉన్నాయి. కో-ఎడ్యుకేషన్ స్కూల్ లో చదవడం వల్ల జరగచ్చు. సిటీలకి వలస రావడం వల్ల జరగొచ్చు. స్త్రీలు స్వంతంత్రంగా వ్యవహరించడం వల్ల జరగొచ్చు. సాంప్రదాయ విరుద్ధమైన ఉద్యోగాలు చేయడం వల్ల జరగొచ్చు. ఇవన్నీ రేప్ నేరాలు పెరగడానికి కారణమే. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లో బాధిత స్త్రీల పరిస్ధితి ఊహించలేము.

తూర్పు ఢిల్లీలోని ఘజియాపూర్ పోలీసు స్టేషన్ అధికారి (ఎస్.హెచ్.ఒ – స్టేషన్ హౌస్ ఆఫీసర్) సునీల్ కుమార్ ఇలా అన్నాడు “దక్షిణ ఢిల్లీలో పబ్ కి వెళ్లండి. గ్రేటర్ కైలాష్ కి వెళ్ళండి. అక్కడ అమ్మాయిలకి ఉచిత ప్రవేశం ఉంది. అక్కడ 1000 రూపాయలకి ఆ పని చేయడానికి అమ్మాయిలు సిద్ధం. వాళ్ళు తాగుతారు. సెక్స్ లో కూడా పాల్గొంటారు. ఎవడో ఒకడు బలవంతం చేసిన రోజున అది రేప్ అయిపోతుంది”. సూరజ్ పూర్ (గ్రేటర్ నోయిడా) స్టేషన్ ఎస్.హెచ్.ఒ అర్జున్ సింగ్ ఇలా అంటాడు. “అమ్మాయిలు తమ పరిమితుల్లో ఉండకపోతే, సరైన దుస్తులు వేసుకోకపోతే, అనివార్యంగా అక్కడ ఆకర్షణ ఉంటుంది. ఈ ఆకర్షణ మగాళ్లని దూకుడుగా మారుస్తుంది. ఇక వాళ్ళది చేసేస్తారు”

గుర్ గావ్, సెక్టార్ 29 అదనపు ఎస్.హెచ్.ఒ రాజ్పాల్ యాదవ్ “డార్జిలింగ్, నేపాల్ అమ్మాయిలు ఇక్కడికి వ్యాపారం కోసమే వస్తారు. డబ్బుకోసం మగాళ్లతో వెళ్తారు. తర్వాత డబ్బు సరిపోకపోతే ఆదిక రేప్ అవుతుంది” అన్నాడు. తాము మాట్లాడినా 30 మంది అధికారుల్లో 17 మంది రేప్ బాధితుల పట్ల మొరటు భావాలు వ్యక్తం చేస్తే ఐదుగురు అధికారులు సానుభీతిగా మాట్లాడారని తెహెల్కా తెలిపింది.

పదో తరగతి అబ్బాయిలు రేప్ కి పాల్పడినపుడు బాధిత స్త్రీపైన నోయిడా పోలీసులు నోరు పారేసుకున్నారు. అందుకు వారు తీవ్ర విమర్శలకిTehelka 03 గురయ్యారు. అయినప్పటికీ వారు తమ అభిప్రాయాలూ మార్చుకోలేదు. ఈ కేసులో పరిశోధనకు నాయకత్వం వహిస్తున్న నోయిడా పోలీసు అధికారి రామ్ కుమార్ మాలిక్ ఇలా అన్నాడు. “ఈ కేసులో అసలు విషయం ఏమిటంటే అమ్మాయికి వోడ్కా అలవాటుంది. వోడ్కా పార్టీ అడిగింది. ఆ తర్వాత సెక్స్ కి రు. 6000 అడిగింది. డబ్బు చెల్లించకపోవడంతో రేప్ కేసు పెట్టింది. ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ చూస్తే, నిందితుల్లో ఒకరితో సంబంధం ఉన్నట్లు వెళ్లడాయింది”. ఒక అబ్బాయితో అంగీకారంతో సెక్స్ లో పాల్గొంటే వాడి ఫ్రెండ్స్ రేప్ చెయ్యొచ్చని మాలిక్ అభిప్రాయం.

రామ్ కుమార్ మాలిక్ అమ్మాయితో ఆగలేదు. ఆమె తల్లిదండ్రులనీ, అమ్మాయి క్యారెక్టర్ నీ నిందించాడు. “ఆమె తల్లి విడాకులు తీసుకుంది. ఒక యాదవ వ్యక్తితో కలిసి ఉంటోంది. ఆమెకి 48 అయితే అతనికి 28. ఆమె ఇద్దరు కూతుళ్ళూ అలాగే తయారవుతారు కదా” అని నిందించాడు. “ఇప్పుడు 48 యేళ్ళ వాళ్ళ తల్లి యువకుడితో ఉన్నపుడు వాళ్ళు కూడా ప్రేరేపించబడతారు కదా. సెక్స్ ఆకలి లాంటిది” అని మాలిక్ అన్నాడు. విడాకులు తీసుకున్న స్త్రీల దీన పరిస్ధితిని ఇక్కడ చూడవలసి ఉంది. వివాహ వ్యవస్ధ పతనం తిరిగి స్త్రీలనే బలికోరుతోంది. దిగుమతి చేసుకున్న పాశ్చ్యాత్త విలువలు సైతం స్త్రీలను నైతిక చక్ర బంధంలో ఇరికిస్తున్నాయి. పాశ్చ్యాత్త విలువల్లోనూ పురుషులకు అంటని నైతికత, పాతివ్రత్యం విలువలు స్త్రీలని అంటి పెట్టుకుని కొనసాగుతున్నాయి.

23 యేళ్ళ పబ్ వర్కర్ రేప్ కేసును డి.ఎల్.ఎఫ్ ఫేస్-2 పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఒ జంగ్ షేర్ సింగ్ దర్యాప్తు చేస్తున్నాడు. ఆయన ఇలా అంటాడు “ఈ కేసులో ఏమీ లేదు. వాళ్ళు పిల్లలు. ‘రాజీ’ పడడానికి ఆ అమ్మాయి అబ్బాయిల్తో రెండు సార్లు మాట్లాడింది. అదంతా డబ్బు కోసమే. డబ్బుతోనే ఒప్పందాలు కుదురుతాయి”. గురు గావ్ రేప్ కేసులో పరస్పరం ఆమోదం ఉందని జగ్ షేర్ సింగ్ నిశ్చితాభిప్రాయం. “అమ్మాయిలు సహకరిస్తారండీ. సహకారం లేకపోవడం చాలా అరుదని నా అభిప్రాయం. ఈ కేసులో కూడా అమ్మాయి అంగీకారం ఉంది” అని అన్నాడు. ఈయన ధోరణి చూస్తే, రేప్ లకి అమ్మాయిలు సహకరించకపోతే అమ్మాయిలనే నేరస్దులుగా మార్చేలా ఉన్నాడు.

ఈ డి.ఎల్.ఎఫ్ రేప్ కేసు దర్యాప్తుతో సంబంధం లేని సెక్టార్-29 ఎస్.హెచ్.ఒ జగదీష్ ప్రసాద్ అభిప్రాయాన్ని కూడా తెహెల్కా రికార్డు చేసింది. ఆయన ఇలా అంటాడు “ఈ మధ్య జరిగిన డి.ఎ.ఎఫ్ కేసులో చూస్తే, అమ్మాయికి 27 సంవత్సరాలు. అబ్బాయిల వయసు 18-20 యేళ్ళు ఉంటాయి. వాళ్ళు పిల్లలు. బార్ లో వాళ్ళతో ఆ అమ్మాయి డాన్స్ చేస్తోంది. నేను చెబుతున్నా కదా ఆ అమ్మాయే వాళ్ళని రెచ్చగొట్టింది. అమ్మాయి వాళ్ళ దగ్గరికి వచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చింది.” ఇండియాలో ప్రతి సంవత్సరం 25,000 రేప్ కేసులు రిపోర్టు కావడం లేదన్న సంగతిని ఇలాంటి పోలీసు అధికారులు నమ్ముతారో లేదోనని తెహెల్కా అనుమానం వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసులే స్త్రీల సెన్సిబిలిటీస్ పట్ల సున్నితంగా లేకపోతే గ్రామీణ ప్రాంతాల పరిస్ధితిని ఏమిటని ప్రశ్నించింది.

Tehelka 04స్త్రీలు ధరించే దుస్తులు రేప్ లకి ముఖ్య కారణమని ఢిల్లీ పోలీసులు నమ్ముతున్నారు. సాంప్రదాయ బద్ధంగా దుస్తులు వేస్తుకున్న స్త్రీలు రేప్ లకి గురికారని వీరి నమ్మకం. దుస్తుల ధారణ సూచనాత్మకంగా ఉంటే వారిక సమస్యలని ఆహ్వానిస్తున్నట్లే. ఫరీదాబాద్ సెక్టార్ 31 ఎస్.హెచ్.ఒ సత్బీర్ సింగ్ ఇలా అంటాడు “అమ్మాయెవరైనా పారదర్శకంగా బట్టలు వేసుకుంటే పిల్లల్లో పోకిరీ ఆలోచనలు రావడానికి ప్రోత్సహించినట్లే. అమ్మాయిలు కురచ స్కర్టులు వేసుకుంటారు. ఊహించడానికి కూడా ఏమీ లేకుండా బ్లౌజులు ధరిస్తారు. దుపట్టాలు వేసుకోరు. శరీరాల్ని ప్రదర్శిస్తారు. పిలగాళ్ళు సహజంగానే వారి పట్ల ఆకర్షితులవుతారు కదా”. ఇదే అంశాన్ని సూరజ్ పూర్ ఎస్.ఐ అర్జున్ సింగ్ ఇలా అంటున్నాడు “అమ్మాయిలు ఎలా డ్రస్ వేసుకుంటారంటే, జనం ఆమె పట్ల ఆకర్షించబడడం ఖాయం. నిజానికి అమ్మాయే వాళ్ళని తనని ఏదో చేయాలని కోరుతుతోందన్నమాట.” ఈ లెక్కన అసలు రేప్ లు జరుగుతున్నాయాని? ఈ అనుమానం పోలీసులదే. నిజమైన రేప్ లు అరుదని పోలీసు అధికారుల నిశ్చితాభిప్రాయం.

కురచ దుస్తులు వెర్రి తలలు వేస్తున్న ఫ్యాషన్ల ఫలితం. పశ్చిమ దేశాల వెర్రి సంస్కృతిని మక్కీకి మక్కీ కాపీ కొడుతున్న ఫలితం. ఈ సంస్కృతీ పరాధీనతను సవరించడానికి ప్రభుత్వాలు కృషి చేయవలసి ఉండగా అదేమీ జరగడం లేదు. కానీ అమ్మాయిల కురచ దుస్తుల వల్ల మగాళ్లు నీతి తప్పాలా అన్న ప్రశ్న పోలీసు అధికారులు వేయకపోవడమే విచిత్రం. అదీ కాక రేప్ గణాంకాలు చూస్తే తొంభై శాతం పైన దగ్గరి సంబంధీకులే దోషులుగా ఉన్నారని ఢిల్లీ లెక్కలే చెబుతున్నాయి. నేరాలకు గల సామాజిక కారణాలను లోతుగా పరిశీలించలేని పోలీసుల అశక్తత స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు సైతం సామాజిక సర్వేలను తమ నేర పరిశోధనకు అన్వయించలేని దుస్ధితి నెలకొని ఉంది. చక్కగా దుస్తులు వేసుకుని బైటికి రావాలని ఎ.పి డి.జి.పి సూచనలు చేయడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.

రేప్ బాధితులు పోలీసు స్టేషన్లకి రావడం తేలికా, కష్టమా? కష్టమేనని నోయిడా, సెక్టార్ 39 అధికారి యోగేందర్ సింగ్ అంటున్నాడు “బాధిత స్త్రీకి పోలీసు స్టేషన్ కి రావడం ఎప్పుడూ తేలిక కాదు. తర్వాత ఎదురయ్యే ఇబ్బందికి అందరూ దడుస్తారు. మీడియా అన్నా సమాజం అన్నా భయపడతారు. నిజం చెప్పాలంటే రేప్ లని వ్యాపారం గా మార్చుకున్నవారే పోలీసుల దగ్గర ఫిర్యాదు చేస్తారు.” అదీ సంగతి. ఈ అభిప్రాయం ఉన్న అధికారి దర్యాప్తు నిష్పాక్షికంగా ఎందుకు చేస్తాడు? గుర్ గావ్ సెక్టార్ 40 ఎస్.ఐ రూప్ లాల్ “కేవలం పది శాతం కేసుల్లోనే నిజంగా రేప్ జరిగి ఉంటుంది. 10 శాతం మాత్రమే నిజాయితీగా ఫిర్యాదు చేస్తారు. మిగిలినవన్నీ…” అంటూ ఆర్ధోక్తిలో ఆపేశాడు. ఆయన అభిప్రాయం స్పష్టమే. ఓల్డ్ ఫరీదా బాద్ పోలీసు స్టేషన్ అధికారి రాజేందర్ సింగ్ ఈ అభిప్రాయాన్ని  ధ్రువపరిచాడు. “70 శాతం కేసుల్లో పరస్పర అంగీకారం ఉంటుంది. ఎవరైనా చూస్తేనో, డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోతేనో, అవి రేప్ కేసులుగా మారుతాయి” అని ఆయన అన్నాడు.

నోయిడా సెక్టార్ 24 స్టేషన్ లోని యువ అధికారి మనోజ్ రావత్ ఇలా అన్నాడు “అసలు ఎన్.సి.ఆర్ లో రేప్ లు జరుగుతున్నాయా? పేపర్లుTehelka 05 చెప్పేది కాకుండా నిజాల కోసం చూడండి. ఎన్.సి.ఆర్ లో ప్రతీదీ పరస్పర అంగీకారంతో జరుగుతున్నదే. నా వ్యక్తిగత అభిప్రాయ ఏమిటంటే ఒకటి లేదా రెండు శాతం మాత్రమే నిజంగా జరిగినవి. అవగాహన కూలిపోతే ఇక ఎగ్జాగరేషన్ మొదలవుతుంది. రెండు మూడవుతాయి.” 

గ్యాంగ్ రేపుల్లో పోలీసుల అభిప్రాయాలూ ఇంకా దారుణం. ఘజియాబాద్ లో ఇందిరాపురం  పోలీసు స్టేషన్ అధికారి ధరంవీర్ సింగ్ “పది మంది అబ్బాయిలు బలవంతంగా ఒక అమ్మాయిని ఎత్తుకురావడం చాలా అరుదు. అబ్బాయిలు ఉన్న కారులోకి ఎక్కే అమ్మాయి అమాయకురాలు కానే కాదు. ఎక్కితే గనక వాళ్ళలో ఒక అబ్బాయితోనైనా సంబంధం ఉన్నట్లే” అన్నాడు. ఒకరితో సంబంధం ఉంటే ఇంకో పది మంది రేప్ చేయడం సహజమే కదా అన్నది ధర్మ్ వీర్ నిర్ధారణ. గుర్ గావ్ సెక్టార్ 40 అధికారి రూప్ లాల్ ఇలా అంటున్నాడు. “ఇప్పుడు మనం కూర్చున్నాం. కదులుతుండగా అందరికీ ఒక్కటే డ్రింకు. అదిక జరిగి తీరుతుంది. అమ్మాయిని రాత్రంతా ఉంచుకోవాలి. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఏమని చెప్పాలి? ఒక గంట మాత్రమే బైటికి వెళ్ల్లివస్తానని చెప్పిన అమ్మాయి రాత్రంతా ఉండిపోయింది. తల్లిదంద్రులు ప్రశ్నిస్తారు. అన్నయ్య కూడా అడుగుతాడు. సమాజం ప్రశ్నిస్తుంది” అని అన్నాడు. తల్లిదండ్రులు, అన్నయ్యా, సమాజం వేసే ప్రశ్నలకి బదులు చెప్పలేక రేప్ నేరం మోపుతుందని రూప్ లాల్ నిర్ధారించేశాడు.

అయితే, నోయిడా సెక్టార్ 20 అధికారి ఆర్.కె.సిసోడియా ఒక్కరే పూర్తి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని తెహెల్కా తెలిపింది. ఆయన ప్రకారం ఎన్.సి.ఆర్ లో చాలా తక్కువ కేసుల్లో మాత్రమే తప్పుడు ఫిర్యాదులు ఉన్నాయని  తెలిపాడు. ఆయన చెప్పింది విని తెహెల్కా విలేఖరులు ఆశ్చర్యపోయామని తెలిపారు.

ఇన్స్ పెక్టర్ సునీల్ కుమార్ అయితే అమ్మాయిల స్వభావాన్ని స్కెచ్ గీసి చెప్పాడు. ముఖ్యంగా ఢిల్లీ అమ్మాయిలంటే ఆయనకి మహా చీప్. “ఢిల్లీ అమ్మాయి ఈ వేదన వద్దనుకుంటే అసలు ప్రోత్సహించదు. మీరిద్దరూ ఉన్నారు. నేనొక అమ్మాయిని. మీ ఇద్దరితో డేటింగ్ చేస్తున్నా. ఒకరితో ఫ్లిర్టింగ్ చేస్తూ ఇంకొకరిని పట్టించుకోవడం లేదనుకోండి. అప్పుడు అతను అసూయగా ఉండడం చూసి మీ దగ్గరికే వస్తాను. ఓ రోజున అతను తాగి వస్తాడు. ఇంకో ముగ్గురు స్నేహితుల్ని కూడా తేవచ్చు. అతను నాతో సెక్స్ కి ప్రయత్నిస్తాడు. నేను ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా పట్టించుకోడు. అది నా తప్పు. ఎందుకంటే నేనే వినాశనాన్ని ఆహ్వానించాను. చూడండి. అమ్మాయి రెచ్చగొట్టకపోతే… ఢిల్లీలో అసలు రేపే జరగదు” అని ఆయన తేల్చేశాడు. వీరి ప్రకారం చీర కట్టుకున్న స్త్రీలు, సల్వార్ కమీజ్ ధరించిన స్త్రీలు అసలు రేప్ కి గురికారు. కానీ గణాంకాలు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి.

Tehelka 06హద్దులు మీరుతున్న డేటింగ్ కల్చర్ లో పోలీసులకి తప్పు కనపడకపోవడం విచిత్రం. అబ్బాయి, అమ్మాయి ఇష్టపడడం, ప్రేమించుకోవడం, దగ్గరవడం అన్నీ ఒక్కటే అన్న అవగాహన నెలకొని ఉండడం ఒక సమస్య. ఇరువురి మధ్య ప్రేమ సంబంధం అభివృద్ధి చెందడంలో సంభవించే వివిధ సున్నిత దశలను ఒకదానికొకటి విభజించుకోవడంలో యువతీ యువకులు విఫలం అవుతున్నారు. ఆ విషయంలో చైతన్యవంతమైన అవగాహన కలిగించడంలో సమాజం సఫలం కావడం లేదు. సమాజమే వెనుకబాటు భావాలు కలిగి ఉన్నపుడు స్త్రీ, పురుషు సంబంధాలలోని సున్నితాంశాలు యువకులకు సరిగ్గా అర్ధం కావడం సులభమైన విషయం కాదు. సమాజం పరివర్తనా దశలో ఉన్నపుడు ప్రభుత్వాలు, నిర్దేశక వ్యవస్ధలను సమర్ధవంతంగా నిర్వహించగలగాలి. లేనట్లయితే యువతీ, యువకుల్లో ఏర్పడే అనేక సందేహాలు పరిష్కారానికి నోచుకోక అయోమయంలో అనేక తప్పటడుగులు వేస్తారు. ఈ పరిస్ధితిని గుర్తించడానికి బదులు మొత్తంగా అమ్మాయిల ప్రవర్తనలని తప్పు పడుతూ రేప్ నేరాలకి వారినే బాధ్యులని చేయడం అసంగతం.

ఇలాంటిదే మరొక సినేరియోను రూప్ లాల్ విలేఖరుల ముందుంచాడు. “ఒకమ్మాయి పుట్టినరోజు పార్టీ కోసం అడిగినప్పుడు, ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో ఒంటరిగా ఉన్నపుడు, వాళ్ళు తాగుతున్నపుడు, ఇక ఏంజరగనుందో ఆ అమ్మాయికి తెలుస్తుంది. ఆ అమ్మాయే స్వయంగా అలాంటి పార్టీకి వెళ్ళినపుడు మానభంగం జరిగిందని ఎలా ఫిర్యాదు చేయగలుగుతుంది? వాళ్ళతో కూర్చుని కలిసి తాగుతున్నపుడు దాన్ని రేప్ అని ఎలా చెబుతుంది? నువ్వు విద్యార్ధినివి. నీకంటూ సొంత బుర్ర ఉంది కదా. వాళ్ళతో కలిసి బైటికి ఎందుకు వెళ్తున్నావు?” అని అడిగాడు. అబ్బాయిలతో కలిసి తాగినా, పార్టీకి వెళ్ళినా రేప్ జరుగుతుందని రూప్ లాల్ నిర్ధారిస్తున్నాడు. అది సహజమని కూడా చెబుతున్నాడు. రేప్ తప్ప మరోక సంబంధం పార్టీలో ఉన్న అమ్మాయి, అబ్బాయిల మధ్య నెలకొనబోదని నమ్ముతున్నాడు. శారీరక సంబంధం కాకుండా ఇతరేతర సంబంధాలేవీ అమ్మాయి, అబ్బాయిల మధ్య ఉండడం అసంభవమని నమ్ముతున్నాడు. వివిధ మానసిక దశలు, సంబంధాల మధ్య ఉండే విభజన రేఖలని ఆయన ఒక్క స్టేట్ మెంట్ తో చెరిపేశాడు.

ఇంకా ఇలాంటి ప్రేలాపనలను తెహెల్కా రికార్డు చేసింది. ఈ రిపోర్టును ఎన్.డి.టి.వి ప్రచురించింది.

26 thoughts on “రేప్ కి ఆడోళ్ళే కారణం అంటున్న ఢిల్లీ పోలీసులు, తెహెల్కా పరిశోధన (పునర్ముద్రణ)

 1. మీరు పోలీసు అధికారుల్ని తప్పుపట్టడం బాలేదు. వారి అభిప్రాయాల్ని చీప్ అని కొట్టిపారేయడం అసలే బాలేదు. ఇలా అవతలివారి అభిప్రాయాల్ని అహేతుకంగా ఊరికే కొట్టిపారేసే తత్త్వం ప్రజాస్వామ్యంలో ఏ విధమైన చర్చా జరక్కుండా ఆడ్డుకుంటుంది. వారి అభిప్రాయాల్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోలేము. కానీ అందరితో పాటు వారూ సమాజంలో భాగమేననీ, సమాజసభ్యులుగా వారికీ కొన్ని విషయాల మీద కొన్ని అభిప్రాయాలుంటాయనీ, వాటిని వ్యక్తీకరించే స్వేచ్ఛ కూడా అందరు పౌరుల్లాగానే వారికీ ఉంటుందనీ, వారి అభిప్రాయాల్ని గౌరవిస్తూనే వారితో సున్నితంగా విభేదించే హక్కు మాత్రమే మనకుంటుందనీ మీరు గుర్తించాలి. పోలీసు అధికారులుగా వారికి కొంత అనుభవం ఉంటుంది. దాన్ని మనం త్రోసిపుచ్చకూడదు.

  ఇందులో కళ్ళు బైర్లు కమ్మేదేమీ లేదు. వారు వ్యాఖ్యానించినది సాధారణస్త్రీల గురించి కాదు. శీలరహితురాళ్ళయిన కొన్ని ప్రత్యేక నేరపూరిత ఉమన్ క్యారెక్టర్ల గురించి. పురుషుల్లో ఉన్నట్లే స్త్రీలలోనూ చెడ్డ క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ మాటే వారూ చెప్పారు. దాన్ని మీరు యావత్తు స్త్రీజాతిమీద హీనభావంగా జనరలైజ్ చేయడం, out-of-context గా మార్చి చూపించడం బాలేదు.

 2. ఈ బ్లాగు నచ్చిందండీ విశేఖర్ గారూ. అయితే నాకు అనిపించిన రెండు విషయాలు
  1) ఈ సర్వే లో ఈకువమంది ఆఫీసర్లకి 20 ఏల్ల పైనే అనుభవం ఉందన్నారు. ఈ లెక్కన వారి వయసు 40+ అయ్యి ఉండాలి. ఆ తరానికి చెందిన వ్యక్తుల్లో (నాకు తెలిసి ఎక్కువమందికి) కాస్త స్త్రీ స్వేచ్చా వ్యతిరేక భావాలు ఉంటాయి. అందుకే వారు నేరస్తులని శిక్షించలేని తమ అసమర్థతను స్త్రీలపైకి నెట్టేస్తున్నారు. మనకు యువ ఆఫీసర్ల అవసరం ఉందిప్పుడు.

  2) రేప్ ని స్త్రీ పాలిట అతి పెద్ద శాపంగా భావించే భావన పోవాలి. ఓ కథలో హెరో అత్యాచారానికి గురైన వ్యక్తి ని పెల్లి చేసుకుంటూ “రేప్ ని కూడా ఓ ఏక్సిడెంట్ లా” మర్చిపోయి దైనందిన జీవితం లో ముందుకు పోవాలి అంటాడు. అంటే నేను రేపులని సమర్థించడం లేదు. రేప్ కి గురైన వ్యక్తులపై మనకున్న సంకుచిత భావాలని వదిలిపెట్టాలని చెప్తున్నా.

 3. మనం ఇంగ్లిష్ మీడియా చానల్స్, పేపర్ల వార్తలకి విలువనివ్వటం తగ్గించాలి. హిందూ,పయనీర్ లాంటి పేపర్లను కొంత వరకు నమ్మవచ్చు. టాయిలేట్ పేపర్, ఆ రెండు ప్రముఖ ఇంగ్లిష్ చానల్స్ విశ్వసనీయతను ఎప్పుడో కోల్పోయాయి. ఇంగ్లిష్ పేపర్ వారైతే నెలకి ఒకసారైనా ఆదివారం ఏడిషన్లో సెక్స్ మీద ఎదో ఒక పేరు పేట్టి సర్వే ఫలితాలతో చెత్త రాయటం అలవాటు. ఇక మీడీయా వారు నీరా రాడియా టేప్ లు బయటపడిన పుడు బర్ఖా దత్ మీద ఎటువంటి చర్యను తీసుకొన్నారు? .మీరు డిల్లి కి ఒకసారి వెళ్లి చుడండి అప్పుడర్థమౌతుంది ఎవరు చెప్పింది నిజమో! మీరు స్వయంగా చూస్తే పోలిసు వారి అభిప్రాయలతో 100% ఏకీభవిస్తారు. ఇటువంటి వారు రాసే వ్యాసాలను, వారు చూపే వీడీయొలను నమ్మి, విలువల గురించి పోరాడే మీలాంటి బ్లాగర్లు వాటిని పట్టించుకోకుడదని మనవి. డిల్లి అంత చెత్త సిటి భారత దేశం లో ఉండదనిపిస్తుంది. మానవ విలువలు కనీస స్థాయిలో కనపడని ఏకైక మేట్రొ సిటి డిల్లి. పెళ్లి చేసుకొని, ప్రియుడితో కలసి ఉంట్టూ, డబ్బుకోసం మొగుడి మీద విడాకులు కేసు వేసి పీక్కతినే వారి ట్రెండ్ డిల్లిలో ఎక్కువ. అదొక సాధారణ విషయం అయిపోయింది.

  Caught in compromising position, daughter kills mother
  http://twocircles.net/node/150474

 4. వాసు గారూ, నేను వార్తలు రాసేముందు వివిధ వార్తా సంస్ధలని పరిగణనలోకి తీసుకుంటూ రాస్తున్నాను. ఒక వార్తా సంస్ధ చెప్పిన వార్తను ఇతర వార్తా సంస్ధలు చెప్పిన దానితో క్రాస్ చెక్ చేసుకుని రాస్తున్నాను. ఆ విధంగా హైప్ నివారించడానికి ప్రయత్నిస్తున్నాను. మీరన్నట్లు, టి.ఒ.ఐ, ఎన్.డి.టి.వి లాంటి మీడియా కంపెనీలు రీడర్ షిప్ కోసం సెక్స్, ఫ్యాషన్స్, సినిమాలపైన అవసరానికి మించి కేంద్రీకరిస్తున్నాయి. తామే రూమర్స్ సృష్టిస్తున్నాయి. హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ సంగతి నా దృష్టిలో ఉంది.

  ప్రస్తుత అంశం తెహెల్కా చేసిన పరిశోధన. పోలీసుల ఫొటోలతో సహా వారేమన్నారో రాసారు గనక విశ్వసనీయతని అనుమానించలేదు.

  పోలీసుల అభిప్రాయాలు నూరు శాతం నిజమా కాదా అన్నది ఒక అంశం. అసలు రేప్ నేరాల్లో వారు అనుసరించవలసిన పద్ధతులు మరొక అంశం. వాస్తవం ఏమిటన్నది నిస్పాక్షిక నేర పరిశోధన ద్వారా నిర్ధారించాలి తప్ప ముందే కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకుని నేర పరిశోధన ప్రారంభిస్తే వాస్తవాలు బైటికి రావు.

  పితృస్వామిక వ్యవస్ధలో మనం ఉన్నాం. భూస్వామ్య భావాజాలం ఇంకా భారత సమాజాన్ని డామినేట్ చేస్తోంది. భారత సమాజం ఆ వ్యవస్ధలో కొనసాగుతుండగానే ఆధునికత పేరుతో పశ్చిమదేశాల సంస్కృతిని నగరాలు దిగుమతి చేసుకున్నాయి. పాత విలువల నేపధ్యంలో పశ్చిమ సంస్కృతీ విలువలని చూడడంలో ఉండే అయోమయం, దిగుమతి విలువలని సమాజం పూర్తిగా అడాప్ట్ చేసుకోలేని పరిస్ధితిలో ఉన్న సంఘర్షణ పోలీసుల అభిప్రాయాల్లో కూడా వ్యక్తం అయింది.

  మామాలుగా అయితే భారత సంస్కృతి అయినా, పశ్చిమ సంస్కృతి అయినా రెండింటిలో పాజిటివ్ అంశాలు చాలా ఉన్నాయి. మోనోగమీ (ఒక భర్తకి ఒకే భార్య, వైస్ వెర్సా) ని ఏదో విధంగా భారత సంస్కృతి కొనసాగించగలుగుతోంది. అదే సమయంలో స్త్రీలని తక్కువ చూసే పరిస్ధితి అదింకా కొనసాగిస్తోంది. పశ్చిమ సంస్కృతిలో స్త్రీల పట్ల పాటించవలసిన సున్నితాంశాలు ప్రముఖంగా మనం చూడవలసి ఉంది. స్త్రీ పురుష సమానత్వం అంశంలో ఉదాత్త విలువలని పశ్చిమదేశాలు అభివృద్ధి చేసుకున్నాయి. (అభివృద్ధి చేసుకున్నాయంటే దానర్ధం పూర్తిగా పాటిస్తున్నాయని కాదు.) భారతీయ వ్యవస్ధ కాపాడుకుంటున్న మోనోగమీని పశ్చిమ దేశాల ఉదాత్త విలువలతో మేళవించినట్లయితే సమాజం మరింత ముందుకు వెళ్ళడానికి స్త్రీ పురుష సమానత్వం రియల్ టర్మ్స్ లో నెలకొనడానికి అవకాశం ఉంటుంది.

  అయితే పాత నీరు పోయి కొత్త నీరు వస్తున్న సంధికాలంలో అనేక అయోమయాలు నెలకొంటాయి. ఈ అయోమయం యువతీ, యువకులు, తల్లిదండ్రులులతో పాటు పోలీసు వ్యవస్ధ లాంటి పాలనా వ్యవస్ధలో కూడా మనం చూస్తున్నాం. డేటింగ్ కల్చర్ లో మనం ప్రధానంగా స్వీకరించాల్సింది ‘వివాహానికి ముందు ఇరువురి మధ్య పరస్పర అవగాహన ముఖ్యం’ అన్న అంశాన్ని. దానికి తగ్గ చైతన్యం పూర్తిగా అందక అలా అవగాహన పెంచుకునే పనిలో మరొక చివరకి యువత వెళ్లిపోతున్నారు. అలా వెళ్లకుండా సామాజిక నైతికవిలువలు ప్రతిబంధకంగా ఉండాల్సి ఉండగా అలా లేదు. సామాజిక నియమాలు ప్రధానంగా స్త్రీలని నియంత్రించడం పైనే కేంద్రీకరించాయి తప్ప స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రేరేపించేవిగా లేవు. దానితో సంధికాలంలో ఉండే అయోమయం మళ్ళీ బలహీన స్ధితిలో ఉన్న స్త్రీలపైనే ఒత్తిడి మోపుతోంది. ఈ పరిస్ధితిని పోలీసు వ్యవస్ధలో ఉండే ఉన్నతాధికారులు గ్రహించి అందుకు అనుగుణంగా నేర పరిశోధనని చేపట్టడంలో ఆధునిక విలువలని చొప్పించడానికి కృషి చేయాలి. కాని వారు సైతం మెజారిటీ అయోమయంలో కొనసాగతుండడం వల్ల వెనుకబాటు విలువల దృక్పధంతో నేరాలకి కారణాలని నిర్ధారిస్తున్నారు.

  పోలీసులు ముందే రేప్ కి కారణాల్ని నిర్ధారిస్తే ఇక దర్యాప్తు నిస్పాక్షికంగా కొనసాగదు. అదిక్కడ ప్రధానం. వేశ్యలు కనుక రేప్ చెయ్యొచ్చని భావించడం, తాగుతోంది కనుక రేప్ కి సిద్ధంగా ఉండాలనడం, పశ్చిమ సంస్కృతిని పాటిస్తున్నారు గనక శారీరక సంబంధాలకోసం బలవంతానికి గురయినా ఫిర్యాదు చెయ్యకూడదనడం ఇవన్నీ పోలీసులకి తగనివి. కేసులు తప్పుడువి అయితే అదే రుజువు చెయ్యాలి. ఇక్కడ గుర్తించవలసింది మనుషులుగా స్త్రీలకి ఉన్న హక్కులని.

  ఒకమ్మాయి వోడ్కా పార్టీ అడిగింది. తాగింది. పార్టీలో ఒకబ్బాయితో అప్పటికే శారీరక సంబంధం ఉంది. అంతమాత్రాన ఫ్రెండ్స్ రేప్ చెయ్యొచ్చనీ, చెస్తే ఫిర్యాదు చెయ్యరాదని పోలీసులు చెప్పడం సరైందేనా? ఒక అబ్బాయితో సెక్స్ లో పాల్గొనడం అమ్మాయి హక్కు. బాయ్ ఫ్రెండ్ తోనైనా సెక్స్ లో పాల్గొనాలా లేదా అన్నది అమ్మాయి నిర్ణయించుకోవాల్సిన అంశం. ఆ హక్కుని గుర్తించకుండా రెండు సార్లు సెక్స్ లో పాల్గొన్నావు కాబట్టి మూడోసారి రేప్ చేసినా ఒప్పుకో అని చెప్పడం కరెక్ట్ ఎలా అవుతుంది? బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ జరిపావు గనక, పార్టీలో తాగావు కనుక బాయ్ ఫ్రెండ్ స్నేహితులు బలవంతం చేసినా రేప్ కాదనడం ఎలా సమంజసం? పార్టీ అడిగింది కనుక, తాగింది కనుక, ఒకసారి లేదా రెండు సార్లు లెదా పది సార్లు సెక్స్ లో పాల్గొంది కనుక ఆ అమ్మాయి దిగజారిందని నిర్ధారించడం, దిగజారింది కనుక రేప్ కి ఒప్పుకోవాలనడం ఏం విలువ? వేశ్య అయినా బలవంతం చేస్తే రేప్ అవుతుందని చట్టాలున్నాయి. ఆ చట్టాలకి అనుగుణంగా పరిశోధన చేయడం మాని క్యారెక్టర్ లూజ్ గనక రేప్ కాదు అని చెప్పడం ఎలా కరెక్టు? అలా చెప్పడమే దిగజారుడని అర్ధం కావడం లేదా? స్త్రీలకి మాత్రమే నైతికత అంటగట్టడం వల్ల ఈ పరిస్ధితి తలెత్తుతోంది. ఈ పోలీసు అధికారుల్ని చూడండి. రేప్ చేసినవారు కిడ్స్ అంటున్నారు. కిడ్స్ గా ఉండగానే శారీరక సంబంధాల కోసం వెంపర్లాడుతున్న పరిస్ధితి ఏర్పడినందుకు చింతించడానికి బదులు కిడ్స్ కనుక ఆకర్షించింది స్త్రీయే అని నిర్ధారిస్తున్నారు. అన్యాయం కాదా?

  పోలీసులు ప్రధానంగా చూడవలసింది స్త్రీలపై తేలికగా నేరాలు చేయవచ్చన్న నేర ప్రవృత్తిని. అమ్మాయిల క్యారెక్టర్లని లూజ్ గా గుర్తించి, లూజ్ కనుక రేప్ చెయ్యొచ్చని రేపిస్టులు భావిస్తున్నారు. ఈ నేర ప్రవృత్తికి శిక్ష విధించడం పైన పోలీసులు కేంద్రీకరించాలి. దాన్ని వదిలి అమ్మాయిల్లో బలహీనతల్ని ఎత్తి చూపి నేర ప్రవృత్తిని జస్టిఫై చేయడం వల్ల నేరాలు పెరుగుతాయి తప్ప తగ్గవు. పోలీసుల పట్ల మరింత తేలిక భావం, మనవారే అన్న భావం నేరస్ధులకి కలుగుతుంది. ఇక రేప్ నేరాలు ఎలా నియంత్రించబడతాయి?

  ఢిల్లీ కల్చర్ పాడైపోతే అది అందరి బాధ్యత. ఒక్క అమ్మాయిలనే బాధ్యులని చేయడం కరెక్టు కాదు. అమ్మాయిలు కూడా సరిగ్గా ప్రవర్తించాలి కదా అనడగడం పాక్షిక దృష్టి. నేరాన్ని అన్ని కోణాలనుండీ పరిశీలించి పరిష్కారం వెతకడం ద్వారా మాత్రమే సరైన పరిష్కారం కనపడుతుంది. అమ్మాయిల ప్రవర్తన మాత్రమే పరిగణిస్తే ఆటోమేటిక్ గా అమ్మాయిలదే అంతా తప్పని భావిస్తారు.

 5. *ఢిల్లీ కల్చర్ పాడైపోతే అది అందరి బాధ్యత. ఒక్క అమ్మాయిలనే బాధ్యులని చేయడం కరెక్టు కాదు*

  మీతో వాదన చేయటం నా ఉద్దేశం కాదు. మీరు ఏ మెట్రొ సిటి తో పోల్చినా దేశ రాజధాని అవ్వటం మూలాన ఎంతో మంది పోలిసులు,మిలటరి వారు పహారా కాస్తుంటారు.డిల్లి లో, చుట్టుపక్కల ప్రంతాల లో జరిగే అభివృద్ది, ఊరు పెరుగుతున్న రీతి మీద అవగాహన ఉన్నవారేవరు పోలిసులను తప్పు పట్టరు. ఊహించని విధంగా త్వరితగతిన కొత్తగా అభివృద్దిచెందుతున్న గుర్గావ్(హర్యానా), నోయిడా(యు.పి.), ఫరిదాబాద్ లలో పోలిసుల నియామకం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ప్రస్తుతం ఉండే పోలిసుల పై తీవ్ర పని వత్తిడి ఉందని గుర్తుంచుకోవాలి. డిల్లి లో అడుగడుగునా పబ్లు ఉంటాయి. మాల్స్ లో అన్నిటికన్న ఎక్కువగా నడిచేవ్యాపారం పబ్ లదే . గత కొన్ని సంవత్సరాలనుంచి ఎన్ని సంఘటనలు జరిగినా పబ్ కల్చర్ కొంచెం కూడా తగ్గలేదు. రోజు రోజుకి పెరగటమే తప్ప. సామాజిక పరిస్థితులను ఎవరికి వారు తెలుసుకొని తమ పరిధిలో ఇతరులకు కష్టం కలిగించని విధంగా జీవించాలి. అంతే కాని నేను చేసేది చేస్తాను, నా రక్షణకి ప్రభుత్వం బాధ్యత వహించాలి అనటం విచక్షణ కల వ్యక్తులు ఎవరు మాట్లాడరు. వాస్తవాన్ని పరిగణలో తీసుకోకుండా వీరు అర్దరాత్రి అపరాత్రి తాగి తందానాలరికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేయటానికైతే చేయవచ్చేమో కాని, గ్రౌండ్ లేవేల్ లో పోలిసులు పట్టించుకోరు. అన్యాయం జరిగేది అందరికి కాదు. అమ్మాయిలకు కనుక వారి పరిది వారెరిగి, జాగ్రత్తగా నడచుకోవాలి. అన్నిటికన్నా హాస్యాస్పదమైనది షీల దీక్షిత్ పోలిసుల మీద చర్య తీసుకొంటామని ప్రకటించటం. ఆమే ఏ రోజుల్లో ఉందో తెలియదుగాని, డిల్లి లో పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ కి పోలిసు ఉద్యోగం చేయటానికి కొత్త తరంవారు ఎంతమందికి ముందుకు వస్తారో ఆమేకి అంచనా లేదనిపించింది.

 6. ఉన్న వారిని తీసివేస్తే కొత్తవారు పోలోమని పోలిసు శాఖలో చేరటానికి పాత భారత దేశం కాదు. బయటి రాష్ట్రలనుంచి వచ్చి ప్రభుtvam ఇచ్చే జీతాలతో డిల్లిలో ఎవ్వరు నిలదొక్కు కోలేరు. ఎప్పుడైనా మీకు వీలుచిక్కితే డిల్లికి వచ్చి మాల్స్, పబ్లు చూడండి. తల్లేవరో కూతురేవరో కనిపెట్టటం కష్ట్టమౌతుందని అర్థమౌతుంది. కల్చరల్ షాక్ కి గురవౌతారు.

 7. వాసు గారూ, నా ఉద్దేశ్యం కూడా వాదన కాదు. మీ వ్యాఖ్య రీత్యా పోలీసుల అభిప్రాయాలనూ, సంస్కృతీ పతనాన్ని కొంత వివరించడానికి ప్రయత్నం చేసాను.

  పోలీసులపైన పని ఒత్తిడి ఉంది కనుక, ప్రభుత్వాలు పోలీసుల సంఖ్యని పెంచడం లేదు గనుక, అమ్మాయిలు తమ జాగ్రత్తలో తాము ఉండాలి అన్న మీ సూచన పరిగణించదగినదే. అయితే పరిష్కారం కోసం వెతికినపుడు సమస్య లోతుల్లోకి వెళ్ళవలసి ఉంటుంది కదా. అందుకని పై విశ్లేషణ చేశాను. అందులో ఏమన్నా లోపం ఉంటే అది చెప్పండి. చర్చిద్దాం.

  ఒక్క పోలీసులే కాదు. చాలా చోట్ల వేతనాలు కాస్ట్ ఆఫ్ లివింగ్ కి అనుకూలంగా లేవు. అందరితో పాటు పోలీసుల వేతనాలు కూడా పెంచాల్సి ఉంది. సిబ్బంది సంఖ్య పెంచితే ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంది. కాని సిబ్బంది సంఖ్యని పెంచినా సమస్యలకి మూలమైన పరిస్ధితులు సమాజంలో ఉన్నపుడు అవి పెరుగుతూనే ఉంటాయి కదా.

  నేరాలని నివారించడం ఒక అంశం. అందుకోసం అన్ని వైపులా శాస్త్రీయ పరిశీలన తప్పదు. జరిగిన నేరాలను పరిశోధించే సమయంలో కూడా శాస్త్రీయ అవగాహన అవసరం. నిజానికి ఇక్కడ పోలీసులను మాత్రమే తప్పు పట్టడం సరికాదు. కాని అందరికీ అవసరం ఉన్నట్లే వారికి కూడా సరైన అవగాహన ఉండాలని కోరడం తప్పు కాదు కదా. నేర పరిశోధన కి సంబంధీంచి పోలీసుల కే ప్రధాన బాధ్యత కనుక ఆ అంశంలో పోలీసులపైవ విమర్శలు, పొగడ్తలు తప్పవు. వారి మానాన వారిని పని చేయనిస్తే పోలీసులు అద్భుతాలు చేయగలరని చాలా సార్లు రుజువు చేసుకున్నారు కూడా. ఢిల్లీలోనే జరిగిన ఫాలక్ అనే రెండేళ్ల బాలిక కేసు అందుకు ఒక ఉదాహరణ.

 8. “ఇప్పుడు మనం కూర్చున్నాం. కదులుతుండగా అందరికీ ఒక్కటే డ్రింకు. అదిక జరిగి తీరుతుంది…”

  ఇక్కడ వాక్య ప్రయోగం అర్థవంతంగా లేదనుకుంటాను. కదులుతుండగా అంటే సమావేశం ముగిసి బయటకు వెళుతుండగా అని అర్థమా?

  “ఒక అబ్బాయితో సెక్స్ లో పాల్గొనడం అమ్మాయి హక్కు. బాయ్ ఫ్రెండ్ తోనైనా సెక్స్ లో పాల్గొనాలా లేదా అన్నది అమ్మాయి నిర్ణయించుకోవాల్సిన అంశం.”

  వివాహం కాని యువతీయువకులు -18 ఏళ్లు నిండనివారు- సెక్స్‌లో పాల్గొనే హక్కు చట్టపరంగా మన దేశంలో ఉందా? కుటుంబంలో భాగంగా ఉన్న యువతీయువకులు కుటుంబానికి వెలుపల పరస్పర -శారీరక- సంబంధాలలోకి వెళ్లే హక్కు చట్టపరంగా మన దేశంలో కల్పించబడిందా అనేది మరో సందేహం.

  వివాహం కాకుండానే యుక్తవయస్సులో శారీరక సంబంధాలలోకి వెళుతున్న వారు ఏ లింగానికి సంబంధించిన వారైనా సరే.. దాని పర్యవసానాలను వ్యక్తిగతంగా మొదట తామే ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇక్కడ సామాజిక ప్రభావాలు అనేవి ద్వితీయ కోణంలోనే చూడాల్సి వస్తుందనుకుంటాను.

  పరస్పర సంబంధాలపై చైతన్యం విషయంలో సమాజంలో ఇప్పటికీ సాంప్రదాయిక భావాలే బలంగా ఉంటున్నప్పుడు, వాటిని దాటి వెళుతున్న వారు దాని దుష్పరిణామాలకు గురికాక తప్పదు.

  తాగడం తాగకపోవడం, జూదమాడటం, ఆడకపోవడం, తప్పు చేయడం, చేయకపోవడం వంటి సార్వజనీన విషయాలు వ్యక్తిగత నీతికి అతీతంగా ఉండవు. ఫలానా పని చేయకూడదు అని సమాజం, కుటుంబం యుగాలుగా నిర్దేశిస్తూ వస్తున్నప్పటికీ చేయకూడని పనులనే చేస్తూ రావడం వెనుక వ్యక్తి తన నీతిని ‘దాటడం’ కూడా ఉందనుకుంటాను.

  ఇది ఒక కోణం అయితే మరో కోణంలో ప్రస్తుతం మన కళ్లముందే శరవేగంగా వ్యాపిస్తున్న డేటింగ్ సంస్కృతి, సామాజిక, కౌటుంబిక నియమనిబంధనలన్నింటినీ దాటుకుని యువతీయువకులలో వ్యాపిస్తున్న సరి కొత్త సంబంధాలు పెట్టుబడిదారీ సమాజాభివృద్ధి సూత్రాలకు అనుగుణంగానే ఉంటున్నాయి.

  నూట యాభై ఏళ్ల క్రితమే మార్క్స్, ఎంగెల్స్‌లు కమ్యూనిస్టు ప్రణాళికలో ఇదేవిషయం చెబుతూ గడచిన సమాజాలతో పోలిస్తే పారిశ్రామిక సమాజంలో స్త్రీపురుషుల మధ్య సెక్సువల్ సంబంధాలు అత్యంత సరళ సంబంధాలుగా మారిపోతున్నాయని స్పష్టం చేశారు. పాత సమాజాల నియమ నిబంధనలన్నింటినీ తోసి రాజంటూ ఏర్పడుతున్న ఈ సరళ సంబంధాలు మరింత ఉన్నత సంబంధాలుగా మారతాయా లేదా అనేది భవిష్యత్ తరాలకే విడిచి పెట్టాలని కూడా ఎంగెల్స్ తన ‘కుటుంబం, సొంత ఆస్తి, రాజ్యయంత్రాగాల పుట్టుక’ రచనలో పేర్కొన్నాడు.

  పైగా గ్లాసెడు నీళ్లు తాగినంత సులభంగా సెక్స్‌ కోరికలను కూడా తీర్చుకోవడం యువతరంలో చాలా బలంగా వ్యాపిస్తోందంటూ లెనిన్ 20వ శతాబ్ది ఆరంభంలోనే రష్యన్ యువతరాన్ని ఉద్దేశించి చాలా స్పష్టంగా చెప్పాడు. పెట్టుబడి గత రెండు దశాబ్దాలుగా మాత్రమే అత్యంత నిర్దిష్టరూపంలో బలపడుతున్న మన దేశంలో ఈ గ్లాసెడు నీళ్ల సిద్ధాంతం కాస్త ఆలస్యంగా మన సమాజంలో బలీయంగా పాకి పోతోందేమో..

  రాజ్యయంత్రాంగం ఏనాడూ బలహీనుల పట్ల సానుభూతి వైఖరిని ప్రదర్శించింది లేదు. తెహల్కా వాళ్లు మొత్తం పురుష పోలీసు అధికారులనే ఇంటర్వ్యూ చేసినట్లుంది కాని వారు మహిళాధికారులను ఇంటర్వ్యూ చేసినా పరిశోధన ఫలితం మరోలా ఉండదనుకుంటాను. ఎందుకంటే కరప్ట్ కావడంలో, ప్రజా వ్యతిరేక దృక్పధాన్ని శరవేగంగా ఆలవర్చుకోవడంలో రాజ్య యంత్రాంగం స్త్రీ పురుష భేదాన్ని ప్రదర్శించదు. పురుషులలోకంటే మించిన పితృస్వామ్య ధోరణి ఏ రంగంలో అయినా సరే.. మహిళాధికారులలో ఘనీభవించిపోవడం మన కళ్లముందే చూస్తున్నాం.

  ఎపి డిజిపి అమ్మాయిల దుస్తుల గురించి అలా ఎందుకు వ్యాఖ్యానించి ఉంటాడో మీ కథనం చదివాక మరింత బాగా అర్థమైంది. తనూ, ఢిల్లీ పోలీసు అధికారులూ సమస్యలోని ఒక కోణాన్ని మాత్రమే దర్శించారు. తమకు అర్థమైనదాన్నే తమ ధోరణిలో ప్రకటించారు. 1860ల నాటి సివిల్ క్రిమినల్ ప్రొసీజర్‌కు అనుగుణంగానే మన పోలీస్ మెంటాలిటీ ఈనాటికీ కొనసాగుతోంది.

  “మోనోగమీ (ఒక భర్తకి ఒకే భార్య, వైస్ వెర్సా) ని ఏదో విధంగా భారత సంస్కృతి కొనసాగించగలుగుతోంది….. భారతీయ వ్యవస్ధ కాపాడుకుంటున్న మోనోగమీని పశ్చిమ దేశాల ఉదాత్త విలువలతో మేళవించినట్లయితే సమాజం మరింత ముందుకు వెళ్ళడానికి స్త్రీ పురుష సమానత్వం రియల్ టర్మ్స్ లో నెలకొనడానికి అవకాశం ఉంటుంది.”

  మీ అంతిమ సూత్రీకరణ అర్థవంతంగా ఉంది. కానీ దంపతీ వివాహం -మోనోగమీ- భవిష్యత్తులో ఇదే రూపంలో మన దేశంలో కొనసాగుతుందా…? ‘స్వాతంత్ర్యా’నంతరం భారతీయ సమాజం కన్న ఆదర్శాల కలలన్నీ కేవలం గడచిన ఇరవై ఏళ్లలోనే ధ్వంసమయిపోయాయి. పెట్టుబడి మన దేశంలో విశ్వరూపం దాల్చే కొద్దీ మన దంపతీ వ్యవస్థ కూడా తన పాత రూపాన్ని వదులుకోక తప్పదు. ఇప్పటికే దీని ప్రభావ పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 9. పత్రికల్లో చదువుతున్నపుడే షాక్ అవుతుంటా. చూసి తట్టుకోవడం కష్టమే. అందులో అనుమానం లేదు. హిందీ సరిగా రాదు గనక బాలివుడ్ సినిమాలు చూడను. కాని టి.విలో అప్పుడప్పుడూ బిట్లు కంటబడతాయి. అక్కడ కూడా పబ్ కల్చర్ కనపడుతుంది. ఇక పబ్ ల వల్ల కలుగుతున్న వైపరీత్యాలు పత్రికలు అడపాదడపా రాస్తూనే ఉన్నాయి.

  కానీ వాసు గారూ, పోలీసు ఉద్యోగాల్లో చేరడానికి ఇప్పటికీ పోలోమని వస్తూనె ఉన్నారు. నిరుద్యోగం దానికి ముఖ్య కారణం. హోం గార్డు ఉద్యోగాలకి కూడా గిరాకి బాగానే ఉంది.

 10. రాజు గారు
  కదులుతుండగా అంటె, పోలీసు అధికారి తానూ, ఇద్దరు విలేఖరులూ ఒక కారులో ఉన్నట్లు ఊహించమంటున్నాడు.

  చట్టపరమైన హక్కు మైనర్లకు ఉందా లేదా అన్నది చట్టాలు నిర్వచించలేదనుకుంటా. అది పూర్తిగా సామాజికాంశం. అంటే నైతిక నియమాలకు సంబంధించిన అంశంగానే మనం చూడాలి. కాని ఆ విషయం నేను దృష్టిలో పెట్టుకోలేదు. అమ్మాయి అబ్బాయిల మధ్య ఉండే సాధారణ సంబంధంగా పరిగణిస్తూ హక్కు విషయం రాసాను.

  వ్యక్తులుగా చూసినపుడు ఎవరి చర్యలకి వారు బాధ్యత వహించవలసిందే. అనుమానం అనవసరం. కాని వారి సంబంధాలు సామాజిక రూపం దాల్చి నేర ప్రవృత్తికి దారి తీసినపుడు, అటువంటి నేరాలు విస్తృతం అవుతున్నపుడు ఇక బాధ్యత సమాజానికీ, ప్రభుత్వాలకీ విస్తరిస్తుంది. ఆ అంశం మనం గమనించాలి. ఎటువంటి పరిస్ధితుల్లోనైనా రేప్ నేరమే.

  “……….యువతీయువకులలో వ్యాపిస్తున్న సరి కొత్త సంబంధాలు పెట్టుబడిదారీ సమాజాభివృద్ధి సూత్రాలకు అనుగుణంగానే ఉంటున్నాయి”

  ఇక్కడ కొంత జాగ్రత్త వహించాలి రాజు గారూ. ఎందుకంటే భారత దేశంలో పెట్టుబడిదారీ సమాజాభివృద్ధి దాని అసలు రూపంలో జరగడం లేదు. ఫ్యూడల్ విలువలను యధాతధంగా కాపాడుతూ ఆ పునాదిపైన పెట్టుబడిదారీ సంస్కృతి సూపర్ ఇంపోజ్ అవుతోంది. అంటే ఫ్యూడల్ పునాది పైన పెట్టుబడిదారీ సంస్కృతికి సంబంధించిన ఉపరితలం రుద్దబడుతోంది. ఈ రెండింటికీ మధ్య విపరీతమైన వ్యత్యాసం ఉంది. ఒకటి మరొకదానిని అంగీకరించదు. పునాది, ఉపరితలం రెండూ పెట్టుబడిదారీ వ్యవస్ధకి సంబంధినదే అయితే సంఘర్షణ ఉండదు. లేదా తక్కువగా ఉంటుంది. ఆ సంఘర్షణ కేవలం కొత్తదానికి పాతదానికి మధ్య వరకే పరిమితం అవుతుంది. కాని పాత వ్యవస్ధ పునాదులపై కొత్త వ్యవస్ధ ఉపరితలం ఇంపోజ్ కావడం అంటె ఘర్షణకి బదులు తిరస్కరణ ఉంటోంది. అది చాలా హింసాత్మకంగా ఉంటోంది. ఈ హింసాత్మక తిరస్కరణలో ప్రధానంగా స్త్రీలే బలవుతున్నారు. సంస్కృతి విషయంలో స్త్రీలు బలవుతుండగా ఆర్ధిక సంబంధాల విషయంలో కార్మిక వర్గం బలవుతోంది.

  మోనోగమీకి భిన్నమైన రూపం దంపతీ వివాహానికి ఉండగలదా? ఈ అంశంలో ఆప్షన్స్ చాలా చాలా తక్కువ. ఆర్ధిక సామాజిక రంగాల్లో ఇతర సంబంధాలకు అందుబాటులో ఉన్న చాయిస్ లు కుటుంబ వ్యవస్ధకి ఉన్నాయా? ఇదొక తీవ్ర చర్చాంశం.

  స్త్రీ పురుష సంబంధాలు సరళతరం కావడం అంటే? మీరు లేవనెత్తిన అంశంపైన లెనిన్ కీ, అలెగ్జాండ్రా కొల్లంటయ్ కీ తీవ్ర చర్చ నడిచింది. (ఆమె రాసిన మూడు తరాలు పుస్తకాన్ని ఓల్గా అనువాదం చేసింది. దానిపైన రంగనాయకమ్మ విమర్శ కూడా రాసింది. ‘జల్లెడకు ఎన్ని చిల్లులో అన్ని చిల్లులు’ అని. ఆ పుస్తకం ‘స్త్రీ పురుష సంబంధాలు’ కి సంబంధించినంతవరకూ బైబిల్ లాంటిది అని అప్పట్లో నాకు తోచింది.)

  తన పుస్తకాన్ని కొల్లంటయ్ తర్వాత వెనక్కి తీసుకుంది. వెనక్కి తీసుకున్న పుస్తకాన్ని ఓల్గా అనువాదం చేసి వదిలింది. సరళ సంబంధలుగా మారడం అన్న అంశానికి కొల్లంటాయ్ ఇచ్చిన అర్ధాన్ని లెనిన్ తీవ్ర స్ధాయిలో విమర్శించాడు.

 11. ఇది కూడా స్పాంలోనే ఉంది.

  ఇద్దరు యువ ఆఫీసర్లు కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెహల్కా చెప్పింది.

  మీరన్నది నిజం. స్త్రీకి శీలం ముఖ్యం అన్న సూత్రం నుండి రేప్ కి గురయిన స్త్రీలను సమాజం సాధారణంగా చూడడానికి నిరాకరిస్తోంది. రేప్ అన్నది స్త్రీకి మచ్చ కాదని అది నిజానికి రేపిస్టు శీలం పైన మచ్చ అని గుర్తించాల్సి ఉంది.

  రేప్ కి సంబంధించి గుర్తించాల్సిన ముఖ్యాంశం మరొకటి ఉంది. స్త్రీకి సంబంధించినంతవరకూ రేప్ యాక్సిడేంట్ గా చూసి మర్చిపోవలసిందే. కాని అది బాడీ అటాక్ కూడా. ఒక వ్యక్తిపైన హింసాత్మక దాడి చేయడంతో అది సమానం. ఆ రీత్యా అది నేరమే. సమాజంలో స్త్రీలకి శీలాన్ని ఆపాదించే పరిస్ధితులు ఉన్నంతవరకూ అది మానసిక హింసను కూడా కలిగిస్తుంది. ప్రత్యర్ధులపై పగ తీర్చుకోవడానికి వారి స్త్రీలను చెరబట్టడం లాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

 12. @ఎపి డిజిపి అమ్మాయిల దుస్తుల గురించి అలా ఎందుకు వ్యాఖ్యానించి ఉంటాడో మీ కథనం చదివాక మరింత బాగా అర్థమైంది.

  హ్మ్. ఇన్ని చర్చలు చూసాక డిజిపి వ్యాఖ్యల లో లోపం కొట్టొచ్చినట్లు గా కనిపిస్తున్నది. ఈ వస్త్రధారణ ని, ప్రస్తుత సమస్యను అనుసరించి ఎలా ఉండాలి అని ఖచ్చితంగా చెప్పాల్సినది ఎవరు? డిజిపి నా? పోలీసు వ్యవస్థా? ప్రభుత్వమా ? అబ్బాయిలా? రేప్ లు మాత్రమె చేస్తుపోయే అబ్బాయిలా???? తండ్రులా ?? (తల్లులు కూడా ఆడవాళ్లే కాబట్టి వారికి కూడా ఈ ప్రశ్నకు సమాధానం కావాలి మరి )

  సరే ఇదీ ప్రశ్న, రేప్ జరగకుండా ఉండాలంటే ఎలాంటి వస్త్ర ధారణ ఉండాలి ?

 13. రాజశేఖర్ గారూ, మీరు చెప్పిన అంశాల్లో ఒకటి మిస్ అయ్యాను. తెహెల్కా వాళ్లు ఇంటర్వ్యూ చేసిన వాళ్లలో ఒక లేడీ ఆఫీసర్ కూడా ఉన్నది. మీరూహించినట్లే, ఆమె కూడా మగ ఆఫీసర్లకు భిన్నంగా ఏమీ చెప్పలేదు.

 14. *పురుష పోలీసు అధికారులనే ఇంటర్వ్యూ చేసినట్లుంది కాని వారు మహిళాధికారులను ఇంటర్వ్యూ చేసినా పరిశోధన ఫలితం మరోలా ఉండదనుకుంటాను*

  అందులో ఒక మహిళా పోలిస్ అధికారి కూడా అదే భావాన్ని వ్యక్త పరచింది.

  ____________________

  వి శేఖర్,
  జిల్లా కేంద్రాలు, తాలుకాల లో పెరిగిన వారు ప్రపంచం చూసే విధానం వేరు. మీరింకా పురుష ఆధిక్యత సమాజం గురించి రాస్తుంటే నాకు నవ్వొస్తుంది. మీలాంటి వారి వ్యాసాలు చదివిన పుడు, మగవారు ఇంత అమాయకులా అనిపిస్తుంది. మగ వారికి మగవారి గురించి ఎమీ తెలియదు. వారి మీద కనీస సానుభూతి చూపకుండా, సమాజం గురించి అనవసరంగా తెగ బాధపడుతున్నారేమో అని అనిపిస్తుంది. సమాజమో అని రాసే మీరు, మగవారి కి జరిగే అన్యాయల గురించి రాసినట్టు చూడలేదు. ఆడవారు వారేమి మనం అనుకొన్నంత/ఊహించినంతా బలహీనులు,అమాయకులు కారు. ఇప్పుడు డబ్బులు రావటంtO, వారికి ఇన్ని రోజుల సంస్కృతి అవసరం లేదు.
  ఎక్కడి కో వేళ్లారు పాత కంపెనిలో నాతో పని చేసే ఒకమ్మాయి (వయసులో ఇద్దరికి 10సం||గాప్ ఉంట్టుంది), భొజనానంతరం వాకింగ్ చేస్తూ నేను నాతో పాటు మా టిం మేట్ బయలుదేరాం. అప్పుడు ఆ అమ్మాయి తాను కాలేజి రోజుల్లో ఎలా తిరిగేదో, ఆ చిత్రాలు మొదట ఎప్పుడు చూసిందో చాలా కాస్యూల్ గా (మగ వారితో సమానం అనే భావం వచ్చేరితిలో ) చెప్పటం మొదలు పెట్టింది. అప్పుడే ఆడవాళ్లు చదువుకొంటే దేశం అభివృద్ది అవుతుందని చిన్నపటినుంచి చదివింది అబ్బద్దమని తెలిసి పోయింది. అటువంటి సందర్భాలలో నాకు ఎమీ మాట్లాడాలో అర్థం కాదు. ఇక పోతే వీకెండ్ లలో వారి మిత్రురాళ్లు , అందరు కలసి ఆనందించటం ఒక కామన్ విషయం అని మాటలలో తెలిసేది. మాటలలో తల్లిదండ్రి ,కుటుంబం అనే స్ప్రుహ ఎక్కడా కనిపించదు. తాము సంపాదిస్తున్నాం. తమ జీవితం తమదే అని చాలా మంది అనుకొంటారు. ఇందులో అమ్మాయిలు అబ్బాయిలకు చేయి ఇచ్చేవారు చాలా మంది ఉంటారు. ఎవడైనా ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ పొసిషన్ లో ఉండేవాడు దొరికితే టాటా చెప్పేసేవారు ఉంటారు. అదే అమ్మాయీల కు అబ్బయిలు ఎవరైనా చేయి ఇస్తే వారిని తెగ తిడుతూ, మా ఫ్రేండ్ బ్రెక్ అప్ అయ్యింది, ఒకటే ఏడుస్తున్నాది అని అందరు ఓదార్చటానికి వేళ్లేవారు.

 15. వాసు గారూ, పురుషాధిక్య సమాజం అన్న దానిపైనే మీకు భిన్నాభిప్రాయం ఉందన్నమాట.

  జిల్లా కేంద్రాలు, తాలూకాల్లో ఉండేవారు ప్రపంచాన్ని చూసే విధానం వేరని మీరే అంటున్నారు గనుక అక్కడే నిలబడి మీ స్ధానం గురించి కూడా ఓ సారి ఆలోచించండి. ఢిల్లీలో ఉంటున్న మీ ఆలోచనకీ గ్రామాల్లో ఉంటున్న వారి ఆలోచనలకీ తేడా ఉంటుంది గదా. ఎందుకని?

  భారత దేశం ఇంకా డెబ్బై శాతం గ్రామాల్లోనే ఉంటోంది. వారంతా ఢిల్లీ కల్చర్ లో లేదు గదా? అలాంటపుడు భారత దేశం ప్రధానంగా ఏ సమాజంలో ఉంది? అంతా ఢిల్లీ కల్చర్ లోనే ఉందా?

 16. *భారత దేశం ఇంకా డెబ్బై శాతం గ్రామాల్లోనే ఉంటోంది. వారంతా ఢిల్లీ కల్చర్ లో లేదు గదా? అలాంటపుడు భారత దేశం ప్రధానంగా ఏ సమాజంలో ఉంది? అంతా ఢిల్లీ కల్చర్ లోనే ఉందా?*
  మంచి ప్రశ్న. భారత దేశం ఇంకా డెబ్బై శాతం గ్రామాల్లోనే ఉంది కదా అని, పట్టణ ప్రజలు గ్రామా లలో నివసించే వారి జీవన శైలిని ఎవరు అనుకరించాలనుకోరు. ఇంకా చెప్పాలి అంటే పల్లేల లో నివసించేవారు పట్టణలాకి వెళ్లడానికి మొగ్గు చూపటం అనేది గత దశాబ్దాల పాటుగా కొనసాగే ట్రెండ్. దీనిని ఆధారం చేసుకొని మాట్లాడితే పురుషాదిక్యత అనేది కరిగి పోతున్న పెద్ద మంచుకొండ లాంటిది. కొండ ఆనవాలు ఇంకా కనిపిస్తున్నాది కదా అని దానిని మీరు ఇంకా గట్టికొండ అనుకొరాదు. మీరు చూస్తూండగానే ఆ మంచు కొండ ఊహించని వేగంతో కరిగి, కాళ్ల క్రింద చల్లని నీరు గా తగలవచ్చు.

  మగవారు అష్టకష్టాలు పడి ప్రపంచాన్ని మీరు ఈ రోజు చూస్తున్న విధంగా అభివృద్ది చేశాడు. అతని కష్ట్టానికి తగిన ప్రతిఫలం సాహిత్యం లో స్థానం దొరికిందనుకోను. మీ రొక్కసారి నిజాయితిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. గుంటూరు జిల్లాకు చెందిన రైతులు అప్పును తిరిగి చెల్లించలేక పోతే, అప్పిచ్చిన వారు తమ భార్యల గురించి చెడ్డగా మాట్లాడుతున్నారని, కిడ్నిలమ్ముకొని అప్పును తిరిగి చెల్లించారని జాతియ చానల్ లో చూపించారు. ఇటువంటి త్యాగాలను కుటుంబం కొరకు, సునాయాసంగా చేస్తారు. పి.చిదంబరం నక్సల్ ఎరీ వేతలో భాగం గా చతిస్ గడ్ అడవులలోనికి మిలటరిని పంపితే, పూర్తి బేటాలియన్ (70మంది కి పైగా) అక్కడ జరిగిన పోరాటం లో చనిపోయారు. రైతులు గా, సైనికులుగా ఎంతో మంది మగవారు చనిపోతే వారి గురించి మగవారి కోణం లో ఎవరైనా ఆలోచించారా? ఎంతసేపటికి అటువంటి సంఘటనలు సమాజం లో రోజువారి సంఘటనలుగా చూస్తారు.
  ఈ క్రింది సంఘటనలంటివి పేపర్లో ఎన్నో వస్తూంటాయి, ఎంతో సామాజిక స్ప్రుహ ఉన్న మీలాంటి రచయితలు మగవారికి ఎంత మద్దతు ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. కనీసం ఎప్పుడైనా మీబ్లాగులో ఇటువంటి వాటిని ప్రచూరించాలని, ఖండిచాలని వామపక్ష భావాలు కల మీలాంటివారికి (రాజు గారు) ఒక్కసారైనా అనిపించలేదా? అలా అనిపించక పోవటానికి గల కారణాలు, మీరు ఆత్మ విమర్శచేసుకోవాలి అని కోరుకొంట్టున్నాను.
  భర్త హత్యకు గూండాలను ఆశ్రయించిన మహిళపై అత్యాచారం
  http://mallreddypall-sathoshamani.blogspot.in/2012/04/blog-post_03.html

 17. గ్రామలను కించపరచటం నా ఉద్దేశం కాదు గాని, ఎవ్వరికి ఇప్పుడు గ్రామాలంటే పెద్ద ప్రేమలేదు. వ్యవసాయం ఎంత దెబ్బ తింట్టున్నా 70% ప్రజలు ఉన్నారు కదా అని ప్రభుత్వాం వారిమాటలు వింట్టున్నాదా? ఉచిత స్కిములతో వారిని ఆకట్టుకొంట్టుంది. ప్రశ్నించే మధ్య తరగతి వారు ఉండే పట్టణ, సిటిలలోనే పోలిసులు చట్టం అనే మాటలు ఎక్కువగా వినిపించేది. పోలిసులు ప్రభుత్వం లో భాగం కనుకనే వారి మాటలపై మీడీయా ఒక ప్రోగ్రాం చేస్తే, జాతియ చానల్స్ చూపటం, ప్రభుత్వం తెగ బాధపడి పోవటం జరిగి పోయింది.. అదే ఇన్ని రోజులుగా ఎంతమంది రైతులు (మగవారు)ఆత్మ హత్యలు దేశ వ్యాపతంగా చేసుకొంటు ఉంటే ఎక్కడైనా చలనం వచ్చిందా. మగవారి మీద ప్రపంచం సాను భుతి చూపకపోయినా, కనీసం మీరైనా చూపుతారని ఇంత రాశాను.

 18. Vasu గారు ,

  @అప్పుడే ఆడవాళ్లు చదువుకొంటే దేశం అభివృద్ది అవుతుందని చిన్నపటినుంచి చదివింది అబ్బద్దమని తెలిసి పోయింది.

  వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఏమి తప్పు ఉందని మీరు ‘ఇటువంటి’ నిందారోపణ చేస్తున్నారు ఆడవారిపై ? మీరు సమాధానం చెప్పగలరా!!!!!

 19. *వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఏమి తప్పు ఉందని *

  మౌళి గారు,

  మీరు వేసిన ప్రశ్నను చదివి ఆశ్చర్యపోయాను. మీరు ప్రవర్తనకు, దేశాభివృద్దికి సంబందం ఎమీటని అడిగి ఉంటే అర్థవంతంగా ఉండేదెమోగాని, వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఏమి తప్పు ఉందని అంటె, ఎమీ చెప్పగలం. నేటి భారతం, దేశంలో దొగలు పడ్డారు, ప్రతిఘటన సినేమాలు చూసి ప్రేరణ పొందిన తరం వాళ్లం. ఆ అమ్మాయిలా యం టి వి లో వచ్చే రోడిస్ చూస్తూ పెరిగిన వాళ్లం కాదు గదా! సహజంగా ఎవరైనా ఆడవారు పక్కన ఉన్నపుడు, ఫౌల్ లాంగ్ వేజ్ మాట్లాడటమనేది, చదువుకొన్న సంస్కారం, సభ్యత గల మగవారు చేసే పనికాదు. అలా మాట్లడితే తప్పేమిటని ఎవరైనా అడ్డంగా వాదించటం మొదలుపెడితే ఎమీ చెప్పగలం?వాళ్లు అని మీరు ఎంతో మంది ఉన్నట్లు రాసిన అప్పుడు అక్కడ ఉన్నది ఇద్దరు అబ్బాయిలు, ఆ అమ్మాయి మాత్రమే! మీ వ్యాఖ్య ద్వారా, బహుశా రాష్ట్రానికి దూరంగా కొన్ని సంవత్సరాలు ఉట్టుండటం మూలాన తెలుగు వారి లో వస్తున్న మర్పులను గమనించ లేక పోయానేమో అని అర్థమైంది.

  ఈ టపా ఒపెన్ కావటానికి 15 నిముషాల పైన పడుతున్నాది. ఇది వరకే శేఖర్ గారి తో ఈ ప్రాబ్లం గురించి చెప్పాను కుడా. బహుసా ఈ టపాకి ఇదే నా చివరి వ్యాఖ్య కావచ్చు.

 20. మీరు పోలిసు ఉద్యోగాలకు లకు డిమాండ్ ఉందని రాస్తున్నారు. డిల్లిలో మీకు కారు లేకపోతే పక్కింటి వారు కనీసం పలకరించరు. బయట నుంచి వచ్చి ఇక్కడ ప్రభుత్వమిచ్చే జీతాలకు పని చేయటమంటే ఎంతో గతి లేని వారై ఉంటె తప్ప వీలు పడదు. అటువంటి వారి నుంచి అత్యుతమ్మ సేవలు ఆశించటం ధర్మం కాదు. వారు ఉత్తం నగర్ అనే ప్రాంతం లో ఎక్కువగా నివసిస్తూంటరు.డిల్లిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రఫిక్ ,సెక్యురిటి మొద|| కొత్త ఉద్యోగాలను ప్రైవేట్ వారికి కాంట్రాక్ట్ ఇచ్చెసారు. బాంక్ లో ఫ్రాడ్ జరగటం వలనా 2 లక్షలు డబ్బులు పోయాయి అని పోలిస్ స్టెషన్ లో కంప్లైంట్ ఇవ్వటానికి పోతే వారు తీసుకోలేదు. బాంక్ వారికి అది ఫార్మాలిటి, కేసు ఇంవెస్టిగేట్ చేయటానికి అని చెప్పినా వారు కంప్లైంట్ తీసుకోవటానికి ఒప్పుకోలేదు. అది పరిస్థితి. ప్రభుత్వమే విఫలం చెందిన వ్యవస్థలో ఉంట్టున్నామని గుర్తించుకోవాలి. అవినితి విషయం లో, కార్మికుల సమ్మే విషయంలో, చట్టాల పరిరక్షణ విషయం లో ప్రభుత్వ వైఫల్యం గురించి నోరు మెదపకుండా ఉండే ఇంగ్లిష్ మీడీయా వారు, మహిళలలకు జరిగే అన్యాయాల పైన మాత్రం తాము చాలా ప్రొగ్రెసివ్ అనుకొని, ఈ దేశాన్ని ఇంగ్లాండ్ లాగా, అమేరికా దేశాలలోని ప్రజల హక్కులు, స్వేచ్చా లతో మన దేశాన్ని పోలుస్తూ ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు. వారికి ఇటువంటి స్టింగ్ ఆపరేషన్స్ ఒక టైం పాస్ అనిపిస్తుంది. అమేరికా, లండన్ల లో చదివాము కదా అని గర్వము. ఈ మధ్య అది బాగా తలకెక్కింది. భారత దేశ వాస్తవ పరిస్థితి ని ఎమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రోగ్రాములలో ప్రశ్నలు గుప్పిస్తుంటారు.

 21. వాసు గారూ, ఓపెన్ కావడానికే పావు గంట పడుతోందా? నేను ఐ.ఇ లో కూడా ఓపెన్ చేసి చూశాను. మీరు చెప్పిన వ్యాఖ్యల సమస్య నాకు రాలేదు. ఒకవేళ స్పీడ్ సమస్య అయి ఉంటుందేమో కదా. నాది బ్రాడ్ బాండ్ కనెక్షన్. అందువల్ల త్వరగా ఓపెన్ అవుతోందా? ఈ రోజుల్లో బ్రాడ్ బాండ్ కాకుండా మరొక కనెక్షన్ లేదు కనక మీదీ బ్రాడ్ బాండే అయిండాలి. ఈ సమస్యకి కారణం ఫలానా అయుండవచ్చని మీ దృష్టిలో ఏమన్నా ఉందా? వర్డ్ ప్రెస్ వాళ్ళని అడిగి చూస్తాను.

 22. వాసు గారూ, పోలీసులపై పని ఒత్తిడి ఉండి ఉండవచ్చు. కాని, కనీసం కేసు నమోదు చెయ్యటానికి కూడా తిరస్కరిస్తే ఎలా? అంత బిజీయా వారు? అలా అయితే అదే విషయం సర్వే లో చెప్పొచ్చు. ప్రభుత్వానికి నివేదించవచ్చు. కాని కేసు నమోదు చెయ్యకుండానే నేరాన్ని అమ్మాయిల వ్యక్తిత్వానికి ఆపాదించడం ఎంతవరకు సబబు? గ్రౌండ్ లెవెల్ లో వారు ఉండక్కరలేదు, ఉండలేరు కూడా, కాని న్యాయ నిర్ణయం తమ చేతుల్లోకి తీస్కోడానికి వీల్లేదు, అందులోనూ ఇది క్రిమినల్ కేసు కాబట్టి.

  అందరు పోలీసులూ అలా ఉంటారు అని అనను. కాని ఎక్కువమంది పోలీసులు ఇలా ఉండే ప్రాంతం నిలదొక్కుకోలేదు.

 23. చాలా బాగా రాశారు టపా. పోలీసు అధికారుల వ్యాఖ్యలను యథాతథంగా ఇవ్వటం వల్ల విషయ వివరణ సాధికారికంగా సాగింది. దీటైన వ్యాఖ్యలతో అర్థవంతమైన చర్చ జరిగింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s