మృ(మ)గత్వాన్ని ధిక్కరించి, రాజ్యాధిపత్యాన్ని వణికించిన సాహసి ఇక లేదు


Dhilli death 2యావత్భారతదేశాన్ని అశ్రుధారల్లో ముంచుతూ ఆ సాహసిక యువతి తుదిశ్వాస విడిచింది. క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా ఆరుగురు మగవాళ్ళు అత్యంత హేయమైన రీతిలో ఆడిన పాశవిక మృత్యుక్రీడలో ఆమె ఆవిసిపోయి సెలవు తీసుకుంది. శరీరాన్ని నిలిపి ఉంచే వివిధ అవయవాలు విషతుల్యమైన రక్తం ధాటికి ఒక్కొక్కటీ కూలి సోలిపోగా కుటుంబసభ్యుల మధ్యా, పేరు మోసిన వైద్యుల మధ్యా శాశ్వతంగా కన్నుమూసింది. పోతూ పోతూ అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న నాగరీక మానవుల మానవత్వాన్ని పరిహసించి పోయిందామె.

“ఆమెను బతికించడానికి మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలోని ఎనిమిది మంది స్పెషలిస్టుల బృందం సకల ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ రెండు రోజుల్లో ఆమె పరిస్ధితి క్షీణిస్తూనే వచ్చింది. ఆమె శరీరానికీ, మెదడుకీ తీవ్రమైన గాయాలు తగలడం వల్ల ఆమె అవయవాలు విఫలం అయ్యాయి. అనేక ప్రతికూల పరిస్ధితులతో సుదీర్ఘంగా పోరాడడంలో ఆమె అత్యంత సాహసోపేతంగా వ్యవహరించింది. కానీ అధిగమించడానికి వీలులేని అత్యంత కష్టతరమైన బాధ, వేదనలకు ఆమె శరీరం తట్టుకోలేకపోయింది. మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు మరియు సిబ్బంది ఆమె కుటుంబంతో కలిసి నివాళి ఆర్పీస్తోంది” అని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ సి.ఇ.ఒ డాక్టర్. కెవిన్ లో తెలిపాడు.

శుక్రవారం సాయంత్రానికే పరిస్ధితి బాగా క్షీణించిందనీ, ఆమె బ్రతకడం కష్టం అని అప్పటికే తేలిపోయిందనీ ది హిందూ తెలిపింది.  గురువారం ఉదయం సింగపూర్ ఆసుపత్రిలో చేర్చేనాటికి అమ్మాయి ఆరోగ్యం క్లిష్టంగా మారింది. రెండురోజుల పోరాటం అనంతరం శనివారం ఉదయం 2:15 గంటలకు తుదిశ్వాస విడిచిందని పత్రిక తెలిపింది. చనిపోయిన అనంతరం నిర్దిష్ట లాంఛనాల నిమిత్తం ఆమె విగత శరీరాన్ని సింగపూర్ జనరల్ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. శనివారం సాయంత్రానికి బాధితురాలి విగత శరీరారాన్ని ఇండియాకి తేవచ్చని రాయబార అధికారులు తెలిపారు.

డిసెంబరు 21 న విద్యార్ధినుల నిరసన -ఫొటో: ది హిందూ

డిసెంబరు 21 న విద్యార్ధినుల నిరసన -ఫొటో: ది హిందూ

సింగపూర్ లో భారత రాయబారి టి.సి.ఏ రాఘవన్ ప్రకారం బాధితురాలు చివరివరకు తెలివిగానే ఉంది. “ఈ అనుకోని పరిణామంతో ఆమె కుటుంబం తీవ్రంగా కదిలిపోయింది. కానీ అత్యంత మెరుగైన చికిత్స ఆమెకు అందించారని వారు గ్రహించారు. చివరికి ఆమెకి తగిలిన గాయాల తీవ్రత భరించశక్యం కాలేదు” అని రాఘవన్ తెలిపాడు. చివరి సమయాల్లో ఆమె కుటుంబ సభ్యులు గోప్ప ఓపికనూ, ధైర్యాన్నీ ప్రదర్శించారని ఆయన తెలిపాడు.

ఆరుగంటల పాటు సాగిన విమాన ప్రయాణం అమ్మాయికి తీవ్ర బాధాకరంగా మారిందని ‘ది హిందూ’ తెలియజేసింది. విమాన ప్రయాణ కాలంలో అమ్మాయి రక్తపోటు బాగా పడిపోయిందని తెలియజేసింది. దానితో డిసెంబర్ 27 ఉదయానికి ఆసుపత్రిలో చేరే సమయానికి అమ్మాయి ఆరోగ్యం బాగా క్షీణించిన పరిస్ధితిలో ఉన్నది. అమ్మాయిని సింగపూర్ తరలించడానికి నిర్ణయించడంపై కొందరు వైద్య నిపుణులు వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను సింగపూర్ తీసుకెళ్ళడం వల్లనే చనిపోయిందని చెప్పడం సరికాదని దాదాపు నిపుణులంతా అంగీకరిస్తున్నట్లుగా పత్రికలు తెలిపాయి.

సంతాపం

అమ్మాయి మృతి చెందడం పట్ల దేశంలో అనేకమంది ప్రముఖులు సంతాపం తెలిపారు. అమ్మాయి పోరాటం వృధాపోదని సోనియా గాంధీ భరోసా ఇచ్చింది. రాజకీయ నాయకులు, పౌరులు సంకుచిత ప్రయోజనాలు పక్కనపెట్టాలని ప్రధాని మన్మోహన్ కోరాడు. ఈ పాశవిక దాడిపై వ్యక్తమయిన భావోద్వేగాలనూ, నిరసనలనూ నిర్మాణాత్మక చర్యలవైపుకి మళ్లించాలని ప్రధాని కోరాడు. అయితే ఆపని చేయాల్సింది ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి మాత్రమే. 23 యేళ్ళ బాధితురాలు భారతదేశ సాహసపుత్రిక అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడాడు. తన గౌరవం కోసం చివరి నిమిషం వరకూ పోరాడిన అమ్మాయి అత్యంత స్ధైర్యవంతురాలని ఆయన ప్రస్తుతించాడు. ప్రజల శాంతిగా ఉండాలని కోరాడు. చట్టాలను కఠినతరం చేస్తున్నామని హోమ్ మంత్రి తెలిపాడు.

ఒక యువ జీవితాన్ని అత్యంత పాశవిక పరిస్ధితుల మధ్య క్రూరంగా లాక్కున్నారని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రకటించాడు. ఒక కూతురినీ, ఒక సోదరినీ కోల్పోయింది ఒక కుటుంబం మాత్రమే కాదనీ ఈ రోజు ప్రతి భారతీయుడూ తమకొక తీవ్రమైన నష్టం జరిగిందని భావిస్తున్నారనీ, తన జీవితం కోసం ధైర్యసాహసాలతో పోరాడిన ఒక సాహసిక హృదయంతో ప్రతిఒక్కరూ తమను తాము ఐడెంటిఫై చేసుకుంటున్నారనీ అన్సారీ అన్నాడు. అన్సారీ పలుకులు ప్రత్యక్షర సత్యాలు. ‘నాకు బతకాలని ఉంది’ అంటూ ఆమె తన సోదరులను కోరిన కోరిక ఇపుడు కోట్లాది అక్కలు, చెల్లెళ్ల నాలుకలపై ప్రతిధ్వనిస్తోందని చెబితే అది అతిశయోక్తి కాబోదు.

జంతర్ మంతర్ వద్ద షీలా దీక్షిత్ ఘొరావ్ -ఫొటో: ది హిందూ

జంతర్ మంతర్ వద్ద షీలా దీక్షిత్ ఘొరావ్ -ఫొటో: ది హిందూ

ప్రజాగ్రహాన్ని చవిచూసిన షీలాదీక్షిత్

ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ జంతర్ మంతర్ వద్ద ప్రజల ఆగ్రహాన్ని చవిచూసింది. చనిపోయిన బాధితురాలికి నివాళులు అర్పించడానికి జంతర్ మంతర్ వద్ద వందలమంది ప్రజలు గుమికూడారు. షీలా దీక్షిత్ కూడా తాను కూడా నివాళులు ఆర్పిస్తానంటూ అక్కడికి వచ్చింది. అయితే ప్రజలు ఆమెను అక్కడ ఉండడానికి ఒప్పుకోలేదు. బాధితురాలి మరణాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపించారు. ఆమెను చుట్టుముట్టి అక్కడినుండి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని అక్కడ కొద్దిసేపు ఉండనివ్వాలని పోలీసులు వాదించినప్పటికీ ప్రజలు ఒప్పుకోలేదు. చేసేది లేక పోలీసుల రక్షణ మధ్య హడావుడిగా ఒక కొవ్వొత్తి వెలిగించి షీలా దీక్షిత్ అక్కడినుండి వెళ్లిపోయింది.

“ఒకరి మరణాన్ని రాజకీయం చేయాలని ఎవరైనా కోరుకుంటారా? నిరసనలు మొదటిసారి మొదలయినపుడు ఆమె ఎందుకు రాలేదు? ఆమె ఇంటిముందు నిరసన చేస్తుంటే మమ్మల్ని పోలీసులచేత గెంటివేయించింది కూడా” అని ఒక నిరసనకారుడు చెప్పాడని ది హిందూ తెలిపింది.

ఇదిలా ఉండగా ఢిల్లీ పోలీసులు ఆందోళనల భయంతో వణికిపోతున్నారు. వందల సంఖ్యలో ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్ పరిసరాలను చుట్టుముట్టి కాపలా కాస్తున్నారు. రాజ్ పధ్, విజయ్ చౌక్ లతో సహా సెంట్రల్ విస్టా మొత్తాన్ని పోలీసులు ఆక్రమించారు. ఇండియా గేట్ కి వెళ్ళే దారులన్నీ మూసేశారు. కమల్ అట్టాటర్క్ మార్గ్ కూడా మూసేశామనీ, ప్రయాణీకులు ఈ మార్గాల్లోకి రావద్దని పోలీసు అధికారులు ప్రకటించారు. సెంట్రల్ ఢిల్లీ లోని పది మెట్రో స్టేషన్లు అన్నింటినీ మూసేశారు. ఎప్పుడు తెరుస్తారో చెప్పడం లేదు. ప్రగతి మైదాన్, మండి హౌస్, బారఖంబా రోడ్, రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్, రేస్ కోర్స్, జోర్ భాగ్, ఖాన్ మార్కెట్ తదితర మెట్రో స్టేషన్లను మూసేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఇంత విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్న కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను చూస్తే ప్రజా ఉద్యమాల పట్ల వారికి ఉన్న భయం ఏమిటో అర్ధం అవుతోంది. మరో విధంగా చూస్తే ప్రజా ఉద్యమాలతో తప్ప ఈ ప్రభుత్వాలు భయపడవని కూడా అర్ధం చేసుకోవచ్చు.

4 thoughts on “మృ(మ)గత్వాన్ని ధిక్కరించి, రాజ్యాధిపత్యాన్ని వణికించిన సాహసి ఇక లేదు

 1. వెంటనే స్పందించి విపులమైన సమాచారం అందించారు.

  జాతి సంతాపంలో భాగం పంచుకుంటూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కొత్త సంవత్సరం వేడుకలను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఈ తరహా స్పందన విస్తృతస్థాయిలో వ్యక్తమవుతోంది.

  >> ఇంత విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్న కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను చూస్తే ప్రజా ఉద్యమాల పట్ల వారికి ఉన్న భయం ఏమిటో అర్ధం అవుతోంది. మరో విధంగా చూస్తే ప్రజా ఉద్యమాలతో తప్ప ఈ ప్రభుత్వాలు భయపడవని కూడా అర్ధం చేసుకోవచ్చు.>> మీ వ్యాఖ్య నూరుశాతం వాస్తవం!

 2. ||కూతురు ప్రశ్న||

  ఒక దృశ్యానికేసి చూపుతూ మర్మాంగమంటే ఏమిటని
  ఏడేళ్ళ కూతురు అడిగిన ప్రశ్నకు
  దూరంగా ఉదయం నుండి తిరుగుతున్నాను

  ఒక్కో పూవునూ ఏరి కూర్చి కథా మాలికలను
  దిగంతాలకు పరిచినట్టో

  ఒక దృగ్విషయపు లోతులకు దూకి
  పొరలను తొలుచుకొని కాంతియానం చేసినట్టో కాదు కదా

  అదే పనిగా ఎవరూ చెప్పకపోయినా
  సరిగా కూర్చోవాలనీ దాచ్చుకున్నట్టుగా తిరగాలనీ తన చుట్టూ ఉన్న వారిలోనే తప్పుక తప్పుక తిరుగుతూ
  జీవన క్రియలనూ జీవితాన్నీ సాగించాలనీ
  నేర్చుకుంటున్న నా బిడ్డ అడిగిన ప్రశ్నకు నా దగ్గర మాటలు లేవు

  దుఃఖం కూడా స్థంభించి లోపలి అరలలో దగ్ధమవుతున్న మంట
  పేగులు తెగి దేహం ఒరుసుకపోతూ స్థల కాలాదులను అధిగమించి విస్తరించే గాయపు స్పృహ

  మెదడు రసి కారుతున్న పుండులా జిగటలు వారుతోంది

  ఈ రోజును పెగల్చుకపోయే ఒకలాంటి మౌనంతో మూసి ఉంచగలను గానీ
  బహుశ కొన్నాళ్ళకు ఆమెకు ఇలా చెబుతాను

  తల్లీ, ఇది పవిత్ర భూమి
  అయితే ఇక్కడ యోనులలో తాగి పడేసిన సీసాలను జొనుపుతారు

  స్త్రీలను తల్లిగా చెల్లిగా పూజించడంతో పాటుగా
  మర్మాంగాలను కర్రలు, కడ్డీలు పెట్టి తిప్పినా కుతి తీరని మార్మిక రంద్రాంశాలుగా తలపోస్తారు

  గఢీలలో తెలియని కోటగోడల ఆవల

  సత్యాహింసలను ప్రబోధించిన మహాత్ముల శిలాహృదయాల ముందర
  బరిబాతల భయ విహ్వల విహంగమై ముడుచుక ముడుచుక పోయి నీ దేహం వందే మాతరమని నినదించి ప్రాధేయపడింది

  గుజరాత్ కాషాయపు నడి బజార్లలో కశ్మీర్ ప్రాయపు విచ్చిత దేహాంగాలలో తలవొంచని ఈశాన్యపు గాలులలో
  దేశభక్తి మువ్వన్నెల జెండాగ మురిసి మన గగనాలను అలంకరించింది

  పట్టెడు మెతుకులు అడిగినపుడో
  ఒక విశ్వాసం ఊపిరిగా నిలబెట్టినపుడో పట్టి పట్టి పాలిండ్లను పిసికి బాలింతతనానికి పరీక్షలు పెట్టింది

  ఒకటేమిటి, దేశమే ఒక ప్రశ్నగా మారి సందేహం వచ్చిన ప్రతీసారీ
  తనను తాను పోల్చుకోవలసివచ్చిన ప్రతి సందర్భమూ
  తొడల మధ్యన ఆవిరులెత్తే ఉన్మాదపు మృగయానందమై చిందులు వేసింది

  ఒకరిద్దరు కాదు
  ఒక్క సందర్భమూ కాదు

  ఈ పూటకు దహించి నిలుచుని చీల్చుక పోయే జీవితపు క్షణాలను అనుభూతికి తెచ్చిన మన సగం ఆకాశమని తనకు జవాబు చెబుతాను

  ఒక కాలానికి
  రాజ్యమే నగ్నతను సింగారించుకున్న అంగమని తను తెలుసుకుంటుంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s