ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన అమానత్ (అసలు పేరు కాదు) ను సింగపూర్ లోని ‘మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్’ కి తరలించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయమే తప్ప తాము తీసుకున్న వైద్య నిర్ణయం కాదని అమానత్ కి వైద్యం చేసిన డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం వైద్యం కోసమే సింగపూర్ తరలింపు నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. బాధితురాలి ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నదనీ, ఆమె శరీర అవయవాలు పని చేయడం లేదనీ, ఆమె మెదడుకు కూడా గాయం తగిలిందనీ సింగపూర్ నుండి వస్తున్న వార్తలను బట్టి డాక్టర్ల ఆరోపణ నిజమే అయినట్లు కనిపిస్తోంది.
అమానత్ ను సింగపూర్ కి తరలించడానికి ముందు ప్రభుత్వం సంప్రదించిన వైద్య నిపుణులు చెప్పిందాని ప్రకారం అమానత్ ను విమానంలో సింగపూర్ తీసుకెళ్లడానికి తగిన ఆరోగ్యంతో ఉన్నదా లేదా అని మాత్రమే తమను అడిగారనీ, తీసుకెళ్లాలన్న నిర్ణయం మాత్రం తమది కాదని చెప్పారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. “మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆమెని తీసుకెళ్ళడం క్షేమకరం అవునా కాదా అని మాత్రమే” అని వైద్య నిపుణుల బృందంలోని ఒక సభ్యుడు (ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ వైద్యుడు) తెలిపాడని పత్రిక తెలిపింది. ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ తో పాటు గోవింద్ వల్లబ్ పంత్ హాస్పిటల్ డాక్టర్లు, సఫ్దర్ జంగ్ హాస్పిటల్ వైద్యులు అందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడి ప్రపంచంలోనే అత్యుత్తమైన వైద్యాన్ని అందిస్తున్నప్పటికీ సింగపూర్ తరలించవలసిన అవసరం ఏమిటని డాక్టర్లు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తున్నది.
“సింగపూర్ తరలించడం వలన వైద్య చికిత్సలో ఉన్న లోపాలు సవరించవచ్చన్న ఆలోచనకు అవకాశమే లేదు. ఆమెకు అత్యంత మెరుగైన చికిత్సను ఇక్కడ ఇస్తున్నాము” అని వైద్యనిపుణులు తెలిపారు. స్వతంత్ర వైద్య నిపుణులు సైతం ప్రభుత్వం తనంత తానుగా వైద్య సంబంధిత నిర్ణయాలు తీసుకోవడం పట్ల నిరసన తెలియజేస్తున్నారు. “రక్తంలోనూ, శరీరంలోనూ ఇన్ఫెక్షన్ ఉండి, హై గ్రేడ్ జ్వరంతో బాధపడుతూ వెంటిలేటర్ పై ఉన్న ఒక క్లిష్టమైన రోగిని ఇంత అర్జెంటుగా సింగపూర్ కి తరలించవలసిన అవసరం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు” అని ‘సర్ గంగారామ్ హాస్పిటల్’ లో ‘శరీర అవయవాల మార్పిడి మరియు గాస్ట్రో సర్జరీ’ విభాగానికి ఛైర్మన్ గా పని చేస్తున్న డాక్టర్. సమీరన్ నంది వ్యాఖ్యానించాడు. “ఈ నిర్దిష్ట కేసులో పేగు మార్పిడి చేయవచ్చునో లేదో పరీక్షించడానికే వారాల కొన్ని సమయం పడుతుంది. అద్భుతంగా పనిచేస్తున్న సౌకర్యవంతమైన ఆసుపత్రినుండి ఇంత హడావుడిగా తీసుకెళ్లిపోవలసిన అవసరం ఏమిటి? చూడబోతే ఇది రాజకీయ నిర్ణయం లాగానే కనపడుతోంది” అని డా. సమీరన్ వ్యాఖ్యానించాడు.
మంగళవారం రాత్రి 5 నిమిషాలపాటు అకస్మాత్తుగా అమానత్ గుండె కొట్టుకొనే రేటు పడిపోయిన తర్వాత ఆమెను అక్కడినుండి తరలించాలన్న నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమానత్ గుండె రేటు పడిపోయినపుడు సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వారు బైటి నిపుణులను పిలిపించి తిరిగి మామూలు స్ధితికి తెప్పించగలిగారు. బుధవారం రాత్రి బులెటిన్ ప్రకారం: అమానత్ వెంటిలేటర్ లేకుండా ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడుతోంది; ఇన్ఫెక్షన్ తో పోరాడుతోంది; కాలేయం పని మందగించింది. ది హిందూ పత్రిక ప్రకారం అమానత్ వైద్య పరిస్ధితి క్షీణిస్తుండడంతో ఆమెను తరలించే విషయాన్ని ప్రధాని మన్మోహన్ మంగళవారం రాత్రే చర్చించారని ప్రభుత్వంలోని అత్యున్నతవర్గాలు తెలిపాయి. అవకాశం ఉంటే అమానత్ ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని అప్పటికే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చి ఉంది. భారత ప్రభుత్వ అధికారుల సూచనలతో సింగపూర్ రాయబార కార్యాలయం అమానత్ ని తరలించడానికి తగిన ఏర్పాట్లను వేగంగా చేసింది. వీసా తదితర సదుపాయాలను కల్పించి అమానత్ తో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా వసతి సౌకర్యాలు కల్పించడానికి భారత అధికారులు వేగంగా ఏర్పాట్లు చేశారు.
పోలీసుల ప్రకారం అమానత్ కు శరీరంలోపల చాలా తీవ్రమైన గాయాలు ఏర్పడ్డాయి. బస్సులు, ట్రక్కుల టైర్లు విప్పి, బిగించడానికి ఉపయోగించే జాకీని తిప్పేందుకు వాడే L ఆకారంలోని రాడ్ ను ఆమె మర్మాంగంలోకి చొప్పించడం వలన తీవ్రస్ధాయిలో లోపలి అవయవాలు నష్టపోయింది. వినడానికి కూడా హ్రదయవిదారకంగా ఉన్న ఇటువంటి అమానుషమైన హింసను అనుభవించినప్పటికీ అమానత్ స్పృహ వచ్చాక తనకు బతకాలని ఉందని చెప్పడమేకాక అందుకోసం స్ధైర్యంతో డాక్టర్ల బాధాకరమైన చికిత్సను సహించి తట్టుకుని ఇన్నాళ్లూ నిలిచినందుకు వేనవేల విధాలుగా అభినందనీయురాలు. ఎంతోగొప్ప మానసిక స్ధైర్యమ్ ఉంటే తప్ప నిండా 23 యేళ్ళ జీవితానుభవం లేని యువతి ఇలాంటి అమానుషత్వాన్ని సహించి కూడా డిప్రెషన్ కి లోనుకాకుండా ఉండడం అసంభవం.
అమానత్ ని సింగపూర్ కి తరలించినప్పటికీ ఆమెకు మరింత మెరుగైన పద్ధతిలో చికిత్స చేయవచ్చన్న విషయంలో డాక్టర్లు నమ్మకంగా లేరు. “ఇప్పటి దశలో అవయవ మార్పిడి సాధ్యం అయ్యే సమస్యేలేదు. మొదట ఇన్ఫెక్షన్ ని నియంత్రించాలి. రోగిని (ఆటుపోట్లు లేకుండా) స్ధిరీకరించాలి. రోగిని బైటికి తరలించడం ఎందుకో నాకు అర్ధం కాలేదు. భారతదేశంలోని ఇతర పెద్ద ఆసుపత్రిలన్నింటివలేనే క్లిష్టమైన రోగులకి చికిత్స ఇవ్వడానికి అత్యద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి, డాక్టర్లూ ఉన్నారు” అని ప్రైమస్ ఆసుపత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్. కౌశల్ కాంత్ మిశ్రా అన్నాడని ది హిందూ తెలిపింది. “ఇక్కడ ప్రధానమంత్రికే చికిత్స అందించి ఆపరేషన్ చేయగా లేనిది ఒక రోగిని సింగపూర్ తరలించవలసిన నిర్దిష్ట అవసరం ఎమొచ్చింది? ప్రభుత్వం చెబుతున్నది నమ్మశక్యంగా లేదు” అని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ కి చెందిన మరొక సీనియర్ డాక్టర్ వ్యాఖ్యానించాడు.
“రోగిని తరలించడానికి వెంటిలేటర్ సౌకర్యం మాత్రమే అవసరం. రోగి ప్రయోజనం దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోగిని తరలించే నిర్ణయాన్ని అంగీకరించారు” అని తరలింపు కోసం సంప్రదించిన డాక్టర్లలో ఒకరైన ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ డాక్టర్ ఎం.సి.మిశ్రా (జె.పి.ఎన్. ఆపేక్స్ ట్రౌమా సెంటర్ అధిపతి) తెలిపాడు. అయితే పేగు మార్పిడి ఇప్పుడప్పుడే సాధ్యం కాదని ఆయన తెలిపాడు. “ఆమె ఇంకా క్లిష్టంగానే ఉంది. అవయవమార్పిడి సర్జరీ చాలా సమయం పడుతుంది. మూడు గంటలు పడుతుంది. ఇప్పుడున్న వైద్య పరిస్ధితిలో రోగి దానిని తట్టుకోగలదని చెప్పలేము” అని మిశ్రా తెలిపాడు.
మొత్తం మీద చూస్తే అమానత్ ను సింగపూర్ తరలించడం వలన ఆమెకు అదనంగా ఒనగూరే ఆరోగ్య ప్రయోజనం ఏమీ లేదు. పైగా ప్రయాణభారం అదనంగా పడుతుంది. మరి అమానత్ తరలింపు వలన ఎవరికి ప్రయోజనం? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఏ పత్రికా సాహసించడం లేదు.
ప్రభుత్వ పెద్దలు మాత్రం అమానత్ తరలింపు రాజకీయ నిర్ణయం కాదనీ, పూర్తిగా వైద్య నిర్ణయమేననీ టి.వీల్లో కనపడి చెబుతున్నారు. విదేశీ మంత్రి ఖుర్షీద్ అదే చెప్పాడు. హోమ్ మంత్రి షిండే కూడా అదే చెప్పాడు. శుక్రవారం అయితే ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ సుప్రీం సోనియా గాంధీ ప్రత్యేకంగా విలేఖరులతో మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు. పనిలోపనిగా ఆమె త్వరగా కోలుకోవాలని వారిద్దరూ ఆకాంక్షించారు.
విషమం
ఇదిలా ఉండగా అమానత్ పరిస్ధితి విషమించిందని సింగపూర్ నుండి వార్తలు వస్తున్నాయి. తనకి మెదడుకి గాయం తగిలిందనీ, ఊపిరితిత్తులలో, పొత్తికడుపులో ఇన్ఫెక్షన్ సోకిందనీ, గుండె సమస్యలు కొనసాగుతున్నాయనీ మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రి వైద్యులు చెప్పినట్లు పత్రికలు తెలిపాయి. గురువారం అంబులెన్స్ విమానం లో తెచ్చినప్పటినుండి ఆమె ఐ.సి.యు లో ఉన్నదని ఆసుపత్రి సి.ఇ.ఓ డా. కెల్విన్ లో తెలిపాడు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అమానత్ కి మూడు సర్జరీలు జరిగాయి. సర్జరీల్లో గాంగ్రీన్ సోకిన పేగు భాగాన్ని తొలగించారు. తెలుగు చానెళ్ల ప్రకారం శుక్రవారం అర్ధరాత్రికల్లా ఆమె అవయవాలు సరిగా పని చేయడం లేదు. డాక్టర్ల చికిత్సకు అవయవాలు స్పందించడం లేదు.
“ఆమె పరిస్ధితి విషమించిందని తన కుటుంబ సభ్యులకు తెలిపాము. వారు ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు ధైర్యాన్ని ఇస్తున్నారు… ఈ క్లిష్ట సమయంలో భారత హై కమిషన్ కూడా ఆమె వద్దనే ఉన్నారు. మా వైద్య బృందం కూడా ఆమెకు సాధ్యమైనంత ఉన్నత వైద్యాన్ని ఇస్తున్నాము” అని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రి డాక్టర్లు చెప్పారని ఎన్.డి.టి.వి తెలిపింది. 12 రోజులుగా అనేక ప్రతికూల పరిస్ధితులతో పోరాడుతున్న అమానత్ విషయంలో అద్భుతాలు జరగాలని కోరుకుందాం.
అమనత్ హిందుదెసం లొ నే ఉండి చనిపొతె ఢిల్లి ప్రజలు రెచ్చి పొథరని ముందు జగ్రథ్థగ సింగపూరు పంపించివెసరు గని వ్యైద్యం కొసం ఎంతమత్ర్ము కదు అని న అభిప్రయము.
ఇది వ్రస్తున్నప్పటికి అమానత్ చనిపొఇంది.
ఢిల్లి ప్రజల అగ్రహం మీరు చుస్తుంతరు ఈపటికి