అమ్మాయిలు డేటింగ్ చేస్తే అత్యాచారానికి అర్హులవుతారా?


Photo: Technorati

Photo: Technorati

(ఈ టపా దీనికి ముందరి టపా కింద మిత్రుడు ప్రవీణ్ రాసిన వ్యాఖ్యలకు సమాధానంగా పాఠకులు గ్రహించగలరు)

స్త్రీవాదిననీ, మార్క్సిస్టుననీ చెప్పే మిత్రుడు చేసిన వ్యాఖ్యల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. పైగా తన అభిప్రాయాలతో ఏకీభవిస్తేనే స్త్రీవాది మరియు మార్క్సిస్టు అవుతారన్నట్లుగా చెప్పడం ఇంకా అభ్యంతరకరంగా ఉంది.

మిత్రుడు చెప్పిందాన్నిబట్టి చూస్తే, ఆయన దృష్టిలో డేటింగ్ అంటే శారీరక సంభోగమే తప్ప మరొకటి కాదు. స్త్రీలు డేటింగ్ చేయడం తనకి నచ్చదు. ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తూ బస్సెక్కింది గనక ఆమెను బస్సులో ఉన్నవాళ్లు రేప్ చేసినా పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. మార్క్సిస్టులైతే ఇలా ప్రత్యేకంగా ఆర్టికల్స్ రాయనక్కర్లేదు. “మా శరీరాన్ని మాకు నచ్చిన మగవాళ్ళకి అప్పగించుకుంటాము, మాకు నచ్చని మగవాళ్ళు మాత్రం మమ్మల్ని అక్కాచెల్లెళ్ళతో సమానంగా చూడాలి” అని అనుకునే రకం స్త్రీలని అర్థం చేసుకోవడం తనకి సాధ్యం కాదు.

ఇవన్నీ కమ్యూనిస్టు భావాలు కాకపోగా పూర్తిగా అప్రజాస్వామిక భావాలు. పెళ్లిళ్లకు ప్రేమే పునాదిగా ఉండాలని నమ్మితే అలాంటి ప్రేమ కలగడానికి యువతీ, యువకులు ఒకరినొకరు మాట్లాడుకోవాలి. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవాలి. ఆ క్రమంలో ఇద్దరూ కలిసి ఇష్టమైన చోట్లకు వెళ్తారు. ఆ వెళ్లడం బస్సుపై వెళ్లొచ్చు, టూ వీలర్ పై వెళ్లొచ్చు. కారులో వెళ్లొచ్చు. అది వారి ఇష్టానికి సంబంధించినది. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి నమ్మకం కలిగితే శారీరకంగా కూడా కలిస్తే కలవొచ్చు. అది కూడా వారిద్దరి ఇష్టాఇష్టాలకి సంబంధించిన విషయం. మరొకరు జోక్యం చేసుకునే హక్కుగానీ, తప్పని చెప్పే అధికారం గానీ ఎవరికీ ఉండదు.

ఒకవేళ శారీరకంగా కలవడం కూడా జరిగిన తర్వాత రోజుల్లో ఇద్దరిలో ఒకరు (మగవ్యక్తే అనుకుందాం) మోసగాడని తెలిసిందనుకుందాం. అప్పటికైనా నిజం తెలిసినందుకు సంతోషించి యువతి అతనితో కట్ చేస్తుంది. మరొక మంచి వ్యక్తి తారసపడేవరకూ ఆమె ఎదురు చూస్తుంది. ఈసారి శారీరక వ్యవహారాలేమీ పెట్టుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేసి సరైన భాగస్వామిని ఎంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. అలాంటి యువతిని ఇంకే యువతితోనూ సంబంధం లేని మరొక యువకుడు ప్రేమించి పెళ్లిచేసుకుంటే అందులో ఘోరం ఏమన్నా జరిగినట్లా? ఆ అమ్మాయి ఆ యువకుడిని మోసం చేసినట్లా? పెళ్లికి ముందే ఇలా తానొక వ్యక్తివల్ల మోసపోయాయనీ, నమ్మి శారీరకంగా కూడా కలిసామనీ ఆ అమ్మాయి చెప్పినా ఆ మరో యువకుడు పట్టించుకోకుండా పెళ్లిచేసుకుంటే అదేమన్నా జరగకూడని వ్యవహారమా? మిత్రుడు రాసిన అభిప్రాయాలను బట్టి చూస్తే జరగకూడనిదే అని తాను భావిస్తున్నట్లుగా ఉంది.

అబ్బాయికయినా, అమ్మాయికయినా తమ శరీరాలపై తమకే పరిమితమైన హక్కు ఉంటుంది. జీవిత భాగస్వామికి కూడా ఇష్టం లేకుండా చేయి వేయలేనంత హక్కు అది. (వెనుకబడిన సమాజం సంగతి కాసేపు అలా ఉంచుదాం) ఆ హక్కుకి సదరు మిత్రుడు అభ్యంతరం చెబుతున్నారు. ఎంత తీవ్రంగా అభ్యంతరం చెబుతున్నారంటే అత్యంత అమానుషంగా సామూహిక అత్యాచారం జరిగినా పట్టించుకోనక్కర్లేదు అని చెప్పేటంతగా. ఒక అమ్మాయిపై దుర్మార్గం జరిగితే ఏ కారణంవల్లనైనా సరే, దానిని పట్టించుకోనక్కర్లేదని చెప్పడం ఏమిటసలు? ఒక అత్యాచారాన్ని సీరియస్ గా పట్టించుకోనక్కర్లేదనీ చెప్పేది స్త్రీవాదం ఎందుకవుతుంది? ఇందులో తాను చూసిన స్త్రీవాదం ఏమిటి? తన వాదనలో మార్క్సిజం తర్వాత సంగతి, స్త్రీవాదం సైతం ఏమాత్రం లేకపోగా దానికి పూర్తిగా భిన్నమైన తత్వం ఉంది. ఇలా తోచిన లేదా నచ్చిన అభిప్రాయాలు వ్యక్తపరిచి వాటినే మార్క్సిజంగా చెలామణీ చేయడం సరికాదు.

“స్త్రీకి శరీరం ఉంది దానికి వ్యాయామం కావాలి; మెదడు ఉంది, దానికి జ్ఞానం కావాలి; హృదయం ఉంది దానికి స్పందన కావాలి” అని చలం చెప్పిన సంగతి మిత్రుడికి గుర్తుంటే తాను రాసిన మాటలు రాసి ఉండేవారు కాదు.

మిత్రుడు ప్రవీణ్ ఇలా రాశారు. “ఆ అమ్మాయి శరీరం ఆమె ఇష్టం కనుక ఆమె డేటింగ్ చేస్తుందని మీరు అనొచ్చు. ఆ రౌడీగాళ్ళు కూడా తమ బిహేవియర్ తమ ఇష్టం అనుకుని రేప్‌లు చేస్తారు. నీతి అనేది తమకి ఒకలాగ, ఇతరులకి ఇంకొకలాగ వర్తించాలని అంటే దాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు” అని.

అమ్మాయి తన ఇష్టంతో కలవడానికీ, రౌడీ వెధవ బలవంతంగా అత్యాచారం చెయ్యడానికి మిత్రుడు పెట్టిన పోలిక పరమ అభ్యంతరకరం. రెండింటికీ మధ్య తేడా తెలియనంతగా ఒకరి పరిజ్ఞానం ఉండడం బాధాకరం కాగా దానిని మార్క్సిజంగా చెప్పడం  ఇంకా శోచనీయం. అమ్మాయికి తన శరీరంపై గల హక్కుకీ, రౌడీ వెధవకి సంఘవ్యతిరేక స్వభావంతో పరులపై చేయివేసే హక్కుకీ మధ్య తేడా చూడలేకపోవడం ఏమిటసలు? స్త్రీవాదం అంటే సామాజిక ఆచరణలో నిజంగా చూడగలగడమా లేక స్త్రీవాదినని చెప్పుకోవడానికి నాలుగు మాటలు స్త్రీలకు అనుకూలంగా చెప్పడమా?

అమ్మాయికి ఒక అబ్బాయిపై ఇష్టం కలగడం, అతనితో కలవాలనిపించడం పూర్తిగా ఆమెకు మాత్రమే చెందిన హక్కు. ఆ తర్వాత మోసపోతే ఆ భారాన్ని ఆ అమ్మాయే మోస్తుంది తప్ప కమ్యూనిస్టులో, స్త్రీవాదులో కాదు. ఆ అమ్మాయి నమ్మి మోసపోతే, మోసం తెలిసి తనకు జరిగిన అన్యాయంపై పోరాటానికి సిద్ధపడితే, అబ్బాయి మోసం చేసే ఉద్దేశ్యంతోనే సంబంధంలోకి దిగితే అలాగని మహిళా సంఘాలు, ఇతర సంఘాలు నమ్మితే అప్పుడు అలాంటి అమ్మాయిలకి మహిళా సంఘాలు, ఇతర సంఘాలూ,  స్త్రీవాదులూ  మద్దతుగా నిలిచి పోరాటంలో సహకరిస్తారు. ఎందుకంటే అమ్మాయిలని తేలికగా మోసం చేయగల పురుషాధిక్య వ్యవస్ధలో మనం ఉన్నాం గనుక. అలాంటివారికి  సహకరించే ఉద్దేశ్యం ఎవరికైనా లేకపోతే అది వారి ఇష్టం. అది వారి సామాజిక అవగాహననీ, స్త్రీవాదం మార్క్సిజంల పట్ల వారి సంసిద్ధతనీ మాత్రమే తెలియజేస్తుంది.

అత్యాచారాన్ని పరువు మర్యాదలకు సంబంధించిన విషయంగా మిత్రుడు చెబుతున్నట్లుగా ఉంది తప్ప మరొకరు చెబితే తాను ఖండిస్తున్నట్లుగా తన వ్యాఖ్యాల్లో లేదు. స్త్రీలకి శీలాన్ని అంటగడుతున్నట్లుగా తన మాటలు ఉన్నాయి. (ఆ ఆభిప్రాయం నిజానికి తనకి లేకపోయి ఉండవచ్చు.) వెనుకబాటు సమాజంలో ఉన్నాము గనుక శీలసూత్రాలని పాటించాలన్నట్లుగా ఆ మాటలు ఉన్నాయి. ఒకవైపు శీలం కి సంబంధించిన భావనలు భూస్వామ్య సమాజ భావనలని చెబుతూనే వాటికి అనుగుణమైన వాదన చేస్తున్నారు.

“ఈశాన్య రాష్ట్రాలలో భారత సైనికులు గిరిజన స్త్రీలపై చేసే రేప్‌లు రోజూ జరుగుతుంటాయి. వాటి గురించి ఎవరూ సీరియస్‌గా ఆలోచించరు. ఈ ఘటనలో రేప్‌కి గురైంది ఒక మెడికల్ కాలేజ్ విద్యార్థిని కాబట్టి మన దేశ వ్యాప్తంగా అభివృద్ధి నిరోధక భావజాలాన్ని నమ్మేవాళ్ళందరూ బాధపడిపోతున్నారు, రేప్ చేసినవాళ్ళకి ఉరి శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు” అని మిత్రుడు వ్యాఖ్యానించారు.

ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులు జరిపే అత్యాచారాలపై బాధపడకపోతే ఢిల్లీ అత్యాచారాలపై బాధపడే హక్కు ఉండదా? ‘ఢిల్లీలోనే కాదు, ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులే అత్యాచారాలు చేస్తున్నారు. వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కనుక వాటిపై కూడా ఉద్యమాలు చేయాలి’ అని చెప్పినా, అలా ఆకాంక్షించినా అర్ధం ఉంటుంది. అలా కాకుండా అక్కడ స్పందించలేదు కనుక ఇక్కడ కూడా స్పందించొద్దని వాదించడం సబబుకాదు. పైగా గతంలో ఎన్నడూ లేనంతగా ఒక అత్యాచారంపై అప్పటికప్పుడు స్పందించి కేంద్రప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాల మెడలు వంచగలిగిన ఉద్యమం రగిలినందుకు బహుధా సంతోషించాలి.

ఢిల్లీలో కేవలం స్త్రీలపై అత్యాచారాలను విచారించడానికే 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఆగమేఘాలపై ఏర్పాటు చేయించగలిగిన ఉద్యమం ఇది. ఒక్క ఢిల్లీలోనే కాక ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధంగా అత్యాచారాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆర్ధికమంత్రి చేత ఆదేశాలిప్పించిన ఉద్యమం ఇది. ప్రభుత్వంలో పెద్ద పెద్ద తలకాయలను ఉరుకులు పరుగులు పెట్టించి డిమాండ్లన్నింటినీ ఒప్పించిన ఉద్యమం ఇది. ఉద్యమకారులపై వాటర్ కెనాన్లతో, టియర్ గ్యాస్ తో విరుచుకుపడినందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ స్వయంగా ఆపాలజీ చెప్పించిన ఉద్యమం ఇది. గ్రీన్ హంట్ పేరుతో గిరిజన ప్రజలను ఊచకోత కోయిస్తున్న చిదంబరం, పెద్దపెట్టున అనూహ్యంగా చెలరేగిన ఉద్యమాన్ని చూసి ఆశ్చర్యచకితుడై ‘ఇంత ఊహించలేదు, పాఠాలు నేర్చుకున్నాం’ అని లెంపలు వేయించిన ఉద్యమం ఇది. అలాంటి ఉద్యమాన్ని చూసి సంతోషించాలి గానీ, అభివృద్ధి నిరోధకర భావజాలం గలవాళ్లు అంటూ ఉద్యమకారులను ఈసడించుకున్న పద్ధతి తీవ్ర అభ్యంతరకరం. కమ్యూనిస్టులు, నక్సలైట్లు చేస్తేనే ఉద్యమం లేదంటే కాదన్న అభిప్రాయం ఉంటే దాన్ని మార్చుకోవడం అవసరం.

అత్యాచారాలకి మరణ శిక్ష విధించాలనడం తొందరపాటుతనం. అందులో ఆలోచనగానీ అవగాహన యేమీ లేదు. అత్యంత ఘోరమైన రీతిలో జరిగిన సామూహిక అత్యాచారం పట్ల కోపోద్రిక్తులయిన ప్రజలు తాత్కాలిక ఆగ్రహంతో, కసితో ఇచ్చిన నినాదం అది. కోపం తగ్గి, ఆలోచన పెరిగితే ఆ నినాదాన్ని ఇచ్చినవారే ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. సాధారణ ప్రజలు కాకుండా, ఒక రాజకీయ లక్ష్యంతోనో, లేక ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి తద్వారా ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించడానికి పాలక, ప్రతిపక్ష పార్టీల్లోని అవాంఛనీయ శక్తులు ప్రయత్నిస్తేనో… అలాంటి సమయాల్లో కూడా ఇలాంటి డిమాండ్లు ప్రజల్ని రెచ్చగొట్టడానికి తలెత్తవచ్చు. అలాంటి డిమాండ్లను వాటికి ఉన్న పరిమితుల్లోనే గుర్తించాలి తప్ప పాలకులమల్లే వాటిని సాకుగా చూపి మొత్తం ప్రజాఉద్యమంపైనే ప్రతికూల వ్యాఖ్యలు చేయడం, అపఖ్యాతిపాలు చెయ్యడం ఉచితం కానేకాదు.

ఈ మాటలు మిత్రుడిని గాయపరిస్తే ఆ ఉద్దేశ్యం నాకు లేదని గమనించగలరు. స్త్రీలకి వారి శరీరాలపై వారికి ఉండే హక్కులనీ, భాగస్వామిని ఎంచుకోవడంలో వారికి ఉండే హక్కునీ, స్త్రీలు కూడా శారీరక కోర్కెలు కలిగి ఉండి వాటిని తనవాడనుకున్నవాడి దగ్గర వ్యక్తం చేసుకునే హక్కునీ అవహాళన చేసే వాతావరణం సమాజంలోనూ, బ్లాగుల్లోనూ వ్యాపించి ఉంది. అందువలన కాస్త వివరంగా రాయడం జరిగింది.

-విశేఖర్

46 thoughts on “అమ్మాయిలు డేటింగ్ చేస్తే అత్యాచారానికి అర్హులవుతారా?

 1. వెనుకబడిన సమాజంలో మగవాళ్ళని నమ్మకూడదని అన్నాను కానీ ఈ వెనుకబాటుతనం కొనసాగాలని అనలేదే. నా మాటలకి అర్థాలే మార్చేస్తున్నారే. 1997లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అప్పట్లో నా వయసు 14 ఏళ్ళు, నా ప్రియురాలి వయసు 18 ఏళ్ళు. ఇద్దరం దగ్గర బంధువులమే. కానీ వయసు పేరు చెప్పి ఆమె నా ప్రేమని అంగీకరించలేదు. నిజంగా వెనుకబాటుతనాన్ని కొనసాగాలని కోరుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకోరని తెలిసీ నా కంటే వయసులో పెద్దైన అమ్మాయిని ఎందుకు ప్రేమించాను? ఇప్పుడు నా వయసు 30 ఏళ్ళు. నాకు ఇంకా పెళ్ళి కాలేదు. మా కులంవాళ్ళు వయసు, ఎత్తు లాంటి వాటితో పాటు ఇంటి పేర్లూ, గోత్రాల పేర్లని కూడా పట్టించుకోవడం వల్ల నాకు ఇప్పటికీ పెళ్ళి సంబంధం దొరకడం లేదు. సామాజికంగా అభివృద్ధి నిరోధకమైన నమ్మకాల వల్ల నష్టపోయినవాళ్ళలో నేనూ ఒకణ్ణి. అటువంటప్పుడు అభివృద్ధి నిరోధక నమ్మకాలని సమర్థించి నన్ను నేను ఇంకా లోతైన గోతిలోకి నెట్టుకుంటానా?

 2. శేఖర్ సర్…….. మీరు చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మీ వ్యాఖ్యలు చూసైనా స్త్రీలు కూడా మనుషులే… వారికి కూడా మానసిక, శారీరక స్పందనలు ఉంటాయని కొందరైనా గ్రహించాలని కోరుకుంటున్నా…….

 3. ఈ బొమ్మ చూస్తే నేను ఏ పరిస్థితిలో ఉన్నానో అర్థమవుతుంది: http://praveensarma.in/data/documents/Untitled.jpg
  ఈ పరిస్థితిలో ఉన్న నేను సామాజికంగా అభివృద్ధి నిరోధకమైన నమ్మకాలని సమర్థిస్తానని అనుకుంటున్నారా?

 4. మనోజ్ గారు, దాదాపు నాలుగేళ్ళ క్రితం నేను చదివిన వ్యాఖ్య ఇది:
  >>>>>
  ఒక పబ్ పది మంది కడుపు నింపవచ్చు కానీ వేల మంది అమ్మాయిల జీవితాలకు చెడు చెయ్యవచ్చు. ఎవడికి అయినా అమ్మాయిలతో పబ్‌లకు వెళ్ళాలని ఉంటుంది కానీ పబ్‌లో కలిసిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం మాత్రం అరుదైన విషయమే కదా! మన సమాజంలో ఆడా మగలను ఒకే విధంగా చూసే స్థాయికి మనం ఇంకా ఎదగలేదు … ఈ విషయంలో స్వాతంత్రం అనే మాటకు అర్ధం వెతకడం వృధా .
  >>>>>
  ఈ వ్యాఖ్య నాకు ఇప్పటికీ గుర్తుంది కాబట్టే నేను సోకాల్డ్ స్వేచ్ఛా జీవితాన్ని నమ్మకూడదు అని వ్రాసాను. అలా వ్రాసినందుకు నన్నే భూస్వామ్య భావజాల విశ్వాసి అని అన్నారు విశేఖర్ గారు.

 5. ప్రవీణ్ గారూ, మీరు భూస్వామ్య భావాల విశ్వాసి అన్న అభిప్రాయం నాకు లేదు. ఆర్టికల్ లో రాసినట్లుగా గత టపా కింద మీరు రాసిన వ్యాఖ్యల్లో వ్యక్తమయిన అభిప్రాయాలకు స్పందనగా నేనీ టపా రాసాను. ఢిల్లీ అత్యాచారం బాధితురాలు పబ్ కి వెళ్లలేదు. ఆమె తన ఫ్రెండ్ తో కలిసి సినిమాకి వెళ్లి వస్తోంది. ఒకవేళ పబ్ కి వెళ్లి వస్తున్నా అత్యాచారానికి అర్హురాలు కాదు.

  దిగుమతి చేసుకున్న సంస్కృతినే ఆధునికతగా భావిస్తున్న యువత అనేక తప్పటడుగులు వేస్తోంది. ఆ తప్పటడుగులే సమాజానికి కొలబద్ద కాదు. ప్రతి సంస్కృతిలోనూ మంచి, చెడు రెండూ ఉన్నట్లే పశ్చిమ దేశాల సంస్కృతిలో కూడా నేర్చుకోవలసినవి ఉన్నాయి. స్త్రీలపై శీలభారాన్ని మోపే దశను పశ్చిమ దేశాలు చాలావరకు అధిగమించాయి. అది పాజిటివ్ అంశం. కాని భాగస్వాములను అర్ధం చేసుకోవడం, వారి కష్టాలలో భాగం పంచుకోవడం మాని స్వేచ్ఛ పేరుతో కాస్త కష్టానికే భాగస్వాములను మారుస్తూ పోవడం నెగిటివ్ అంశం. ఇలా అనేక + లూ, – లూ అన్ని సంస్కృతుల్లోనూ ఉన్నాయి.

  పబ్ అనేది పూర్తిగా పశ్చిమ దేశాల ఆచారాలకూ, అలవాట్లకూ, వాతావరణానికీ అనుగుణంగా ఉనికిలోకి వచ్చిన ఒక స్ధలం. దానిని మక్కీకి మక్కీగా భారతదేశ ఉన్నత తరగతిగా చెప్పుకునే ధనికవర్గాలు దిగుమతి చేసుకుని ఆధునికతగా మురిసిపోతున్నారు. పాలకుల భావాలే పాలితుల భావాలుగా మారతాయి కనుక అన్ని తరగతులూ అలవాటు చేసుకుని తాగి తందనాలాడుతున్నారు. దీనికీ స్త్రీల స్వేచ్ఛకీ ముడి పెట్టి, పబ్ సంస్కృతి కేవలం స్త్రీల వల్లనే వచ్చినట్లుగా చెప్పడం సరికాదు కదా.

  మంచి, చెడులను అంచనావేసేటపుడు కమ్యూనిస్టులు ఒక అడుగు ముందే ఉండాలి తప్ప ప్రజల పేరు చెప్పి వెనకనే ఉండిపోకూడదని నా అభిప్రాయం.

 6. ప్రవీణ్ గారూ ! ఈ అత్యాచారం దుర్ఘటనకు సంబంధించి మీ స్పందనా, వాదనా దారుణంగా ఉన్నాయి. సమర్థించుకోవటానికి కాకుండా, మీ అవగాహన లో పొరపాటుందేమో అని తరచి చూసుకోవటానికి ప్రయత్నించండి.

  >> “ఆ అమ్మాయి శరీరం ఆమె ఇష్టం కనుక ఆమె డేటింగ్ చేస్తుందని మీరు అనొచ్చు. ఆ రౌడీగాళ్ళు కూడా తమ బిహేవియర్ తమ ఇష్టం అనుకుని రేప్‌లు చేస్తారు. నీతి అనేది తమకి ఒకలాగ, ఇతరులకి ఇంకొకలాగ వర్తించాలని అంటే దాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు” >>

  ఇంత అమానవీయంగా, అవసవ్యంగా రాయగలరా ఎవరైనా?

  డేటింగ్ కీ, అత్యాచారానికీ ముడిపెడుతూ వాదిస్తున్న మీకూ, మోరల్ పోలీసింగ్ చేసే సంస్కృతీ రక్షకులకూ తేడా ఉందా- విధ్వంసాలకు దిగటంలో తప్ప?

 7. మీ [at]live[dot]in అడ్రెస్‌కి వ్యక్తిగత ఈ-మెయిల్ పంపాను, చదవండి. నేనేమీ ప్రజల పేరు చెప్పి వెనుకబాటుతనాన్ని కోరుకోవడం లేదు. అక్రమ సంబంధాల వల్ల స్వేచ్ఛ రాదు అనే విషయం మాత్రం బ్లాగుల్లో చాలా సార్లు వ్రాసాను. మేనత్త వరసైన స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకునేవాడు కూడా పెళ్ళి విషయానికి వచ్చే సరికి తనకి మరదలు వరసైన అమ్మాయే కావాలంటాడు, మేనత్త వరసైన స్త్రీ తనకి అక్కరలేదని అంటాడు. అక్రమ సంబంధాల వల్ల స్త్రీ-పురుష సంబంధాలలోని సంకుచిత నమ్మకాలు మారవు అని ఇక్కడే అర్థమైపోతుంది. డేటింగ్ విషయానికి వస్తే, ఇండియాలో కేవలం పెళ్ళికి ముందు అర్థం చేసుకోవడానికే డేటింగ్ చేస్తారనే భ్రమలు నాకు లేవు. ఈనాడు పేపర్‌లో ఆ అమ్మాయి తన బాయ్-ఫ్రెండ్‌తో కలిసి డేటింగ్ చేస్తూ తిరిగి వస్తుండగా రేప్ జరిగిందని చదివినట్టు గుర్తుంది. అందుకే నేను డేటింగ్‌ని విమర్శిస్తూ వ్రాసాను.

 8. ప్రవీణ్ గారూ

  మీ విశాల హృదయం అభినందనీయం. అందులో సందేహం లేదు. శీలానికి సంబంధించిన వెనుకబాటు భావాలు మీకు లేవని మీరు ఇచ్చిన బొమ్మ లింక్ చెబుతోంది. ఇలాంటి భావాలు మీరు గతంలో వ్యక్తం చేయగా కూడా నేను చదివాను. అయితే:

  ఉనికిలో ఉన్న భావాలు, ఆధునిక భావాలు ఇలా బేరీజు వేసుకునేటపుడు కొన్ని తికమకలు కలుగుతాయి. అలాంటి తికమకలు కలిగినపుడు ఏది అత్యున్నత ప్రజాస్వామిక స్వభావాన్ని కలిగి ఉంది అని ప్రశ్నించుకుని దానికి తగిన సమాధానం ఇచ్చుకుంటే తికమక చాలావరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది.

  ఉనికిలో ఉన్న విలువల్లో కొన్ని కొనసాగవలసినవీ, మరికొన్ని రద్దు కావలసినవీ ఉంటాయి. ఒక భావన లేదా ఒక విలువ ఈ రెండింటిలో దేనికిందకి వస్తుంది అని నిర్ణయించుకునే దగ్గర జాగ్రత్తపడకపోతే మనమే వెనుకబాటు భావాలు/విలువలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. మీరా జాగ్రత్త పాటించాలని నా కోరిక.

  డేటింగ్ చేసేవారంతా నిజంగా అర్ధం చేసుకోవడానికీ, ప్రేమించుకోవడానికే ప్రయత్నిస్తున్నారని అనుకోనవసరం లేదు. ఎందుకోసం డేటింగ్ చేసినా అందులో ఇద్దరూ ఇష్టంగానే చేస్తున్నారు గనక ఆ హక్కు వారికి ఉన్న విషయం మొదట గుర్తించాలి. ఆ తర్వాత సమాజ పరిస్ధితుల రీత్యా అమ్మాయిలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇతరులు సలహా ఇవ్వవచ్చు. కాని ఆంక్ష విధిస్తే అది సరికాదు.

  విఫలం అవుతున్న ప్రేమ వివాహాలు ఉన్నాయి. సఫలం అవుతున్న అరేంజ్డ్ వివాహాలు ఉన్నాయి. కాని సమాజం పురోగమించేకొద్దీ ప్రేమ వివాహాలవైపే జనం మొగ్గు చూపుతారు. కాని దానికి సమాజ పురోగమనం మొదటి షరతు. సామాజిక విలువలు స్తంభన స్ధితిలో కొనసాగేకొద్దీ అందులోని బలహీనులు మరింతగా నష్టపోతారు. దంపతీ వివాహ వ్యవస్ధలో స్త్రీలు బలహీనస్ధితిలో ఉన్నారు గనక సమాజం ముందుకు వెళ్లకపోతే (విప్లవం రాకపోతే) స్త్రీలే ఎక్కువగా నష్టపోతారు. అలాగే సమాజం ముందుకు వెళ్లకపోతే దళితులే ఎక్కువగా నష్టపోతారు. ఈ విధంగా… అన్నమాట.

 9. విశేకర్ గారు,

  Hats off. ప్రవీన్ గారు తన వాక్యాలను సమర్దిస్తూ తన ప్లస్ లో పోస్టు పెట్టారు. నాలుగు చివాట్లు పెడదాం అంటే ఎవరూ కామెంట్లు రాయకుండా ఆ పోస్ట్ ను లాక్ చేసారు.

 10. ఇష్ట ప్రకారం చేసే ఏ పనినైనా స్వేచ్ఛ అని అనుకుంటే ఇష్ట ప్రకారం గంజాయి పొగ పీల్చడాన్ని కూడా స్వేచ్ఛ అని అనుకోవాలి. ఈ లాజిక్ ప్రకారమైతే డ్రగ్ ఎడిక్ట్స్‌ని అరెస్ట్ చేసే హక్కు చట్టానికి లేదు, డ్రగ్స్‌ని నిషేధించాలని డిమాండ్ చేసే హక్కు మనకి లేదు. మగవాడు డేటింగ్ చేసే ఏ స్త్రీనైనా ఎంగిలి అరిటాకుని చూసినట్టు చూస్తాడని తెలిసి కూడా డేటింగ్ పేరుతో పిలిచే మగవాళ్ళని నమ్మే స్త్రీలని విమర్శించకపోతే ఎలా?

 11. మగవాడు డేటింగ్ చేసే ఏ స్త్రీనైనా ఎంగిలి అరిటాకుని చూసినట్టు చూస్తాడని తెలిసి కూడా డేటింగ్ పేరుతో పిలిచే మగవాళ్ళని నమ్మే స్త్రీలని విమర్శించకపోతే ఎలా?

  I think this is a very rude statement. Not all men are the same and not all women think like that. I’ve noticed you’ve very anachronistic views on women. It is upto the people to make their own personal decisions. You cannot be the moral judge of someone else’s life.

  ఇష్ట ప్రకారం చేసే ఏ పనినైనా స్వేచ్ఛ అని అనుకుంటే ఇష్ట ప్రకారం గంజాయి పొగ పీల్చడాన్ని కూడా స్వేచ్ఛ అని అనుకోవాలి.
  Yes, it is technically ‘freedom’.

  ఈ లాజిక్ ప్రకారమైతే డ్రగ్ ఎడిక్ట్స్‌ని అరెస్ట్ చేసే హక్కు చట్టానికి లేదు, డ్రగ్స్‌ని నిషేధించాలని డిమాండ్ చేసే హక్కు మనకి లేదు.
  Isn’t alcohol itself a drug? But the govt encourages its consumption. Should Alcohol addicts be arrested too? Why the distinction between so called ‘drugs’ and liquor? (Side argument).

  It is not upto a govt or a dominant sect of the society ( in this case male gender) to set the moral standards and be the moral judges. If thats the case, inter-racial marriages and inter-caste marriages were illegal/looked down in the past. Is that still morally taboo in the current society? Culture and social values change over the time and its best to let them evolve naturally. Dating may be frowned upon now, but it might be very common in the coming generations.

  I’ve read many comments written by you in the past, especially on women and I think you should re-consider your strong views.

 12. మన ఇండియాలో డేటింగ్ సంస్కృతి పబ్ కల్చర్ కంటే భిన్నమైనది కాదు. ప్రతి మగవాడూ అమ్మాయితో డేటింగ్ చెయ్యాలని అనుకుంటాడు కానీ డేటింగ్ చేసిన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి ఏ మగవాడూ ఒప్పుకోడు. డేటింగ్ సంస్కృతిలోనే ఆడ-మగ సమానత్వం లేదు. సమానత్వం లేని చోట స్వేచ్ఛ అనే పదానికి అర్థం వెతకడం వృథా. డేటింగ్ చెయ్యడం తప్పు కాదని అనిపిస్తే మీ కుటుంబాలకి చెందిన స్త్రీలని కూడా డేటింగ్ చెయ్యమని ఎంకరేజ్ చెయ్యండి. అంతే కానీ పైపై కబుర్లు చెప్పొద్దు. మీకు ఐదేళ్ళ క్రితం జరిగిన స్టోరీ ఒకటి చెపుతాను. అప్పట్లో యాహూ గ్రూప్స్‌లో పెళ్ళికి ముందు సెక్స్ గురించి చర్చ జరిగింది. ఆ చర్చలు జరుగుతోన్న సమయంలో నేను ఇలా అన్నాను “డబ్బులు తీసుకుని సెక్స్ చేస్తేనే అది వ్యభిచారం అవుతుంది కానీ డబ్బులు తీసుకోకుండా సెక్స్ చేస్తే అది వ్యభిచారం అవ్వదు” అని. నేను అలా అనడం వల్ల బి.ఆర్.బాపూజీ (రంగనాయకమ్మ గారి భర్త) నన్ను తీవ్రంగా విమర్శించారు. అదే సమయంలో JUBV ప్రసాద్ అనే ఆయన ఇలా అన్నాడు “రంగనాయకమ్మ గారు పెళ్ళికి ముందు సెక్స్‌కి వ్యతిరేకం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోకముందు చేసే సెక్స్‌కి మాత్రం వ్యతిరేకమే” అని. ఇండియాలో డేటింగ్ చేసేవాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత లేదా చేసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా డేటింగ్ చేస్తారని అనుకోను. ఇక్కడి వాళ్ళు symbol of prestige కోసం గర్ల్ ఫ్రెండ్‌ని మెయింటెయిన్ చేసి డేటింగ్ చేస్తారు, అంతే. కైలాసగిరి, కంబాలకొండ లాంటి పార్క్‌లలో కనిపించేవి అటువంటి జంటలే. “పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోక ముందు చేసే సెక్స్ మాత్రం తప్పు” అని అనుకుంటే ఇండియాలో జరుగుతోన్న డెటింగ్ కూడా తప్పనే అనుకోవాలి.

 13. Read this link: http://www.facebook.com/praveena.kolli/posts/4133331573570
  >>>>>
  ఇలాంటివి అసలు వివక్షే కాదు, ఆడదాన్ని సెక్సువల్ ఆబ్జక్టుగా చూసే విధానమే కాదు అని ఇప్పటికీ మెజారిటీ మహిళలు నమ్ముతున్న దేశంలో రేప్ మాత్రమే హింసగా పరిగణించబడుతుంది. మూలాల్ని మార్చడం మరిచి మనం చట్టం ఏదో చేసేస్తుందని భ్రమపడుతున్నాం. ముందు మనుషులు మారాలి, అప్పుడు పరిస్థితులు మారతాయి,చట్టం చేసినా దాని ఫలితం ఉంటుంది.
  >>>>>
  అంగాంగ వర్ణనల పాటలని లింగ వివక్షగా పరిగణించనివాళ్ళు రేప్‌ని మాత్రమే లింగ వివక్షగా పరిగణిస్తున్నారు అని కత్తి మహేశ్ అనే ఆయన వ్రాస్తే ఆయన్ని మెచ్చుకున్నారు. డేటింగ్ చేసిన స్త్రీని ఎంగిలి అరిటాకుతో సమానంగా చూసే విధానాన్ని లింగ వివక్షగా పరిగణించనివాళ్ళు రేప్‌ని మాత్రం లింగ వివక్షగా ఎందుకు పరిగణిస్తున్నారు అని నేను అడిగితే నా వ్యాఖ్య అభ్యంతరకరం అని అంటున్నారు. నేను చెప్ప్పినవి కూడా నిజాలే. కాకపోతే డైరెక్ట్‌గా అర్థమయ్యే భాషలో నిజాలు మాట్లాడాను, అంతే.

 14. విశేఖర్ గారు, రంధ్రాన్వేషణలు చేస్తే నేను మీ వస్త్రానికి ఉన్న రంధ్రాలని కూడా బయట పెట్టగలను. గతంలో నేను బి.ఆర్.బాపూజీ గురించి వ్రాసిన ఒక వ్యాఖ్యని మీరు కావాలని పబ్లిష్ చెయ్యలేదు సరికదా, ఆయన గురించి తెలుసుకోవడం ఎవరికీ అవసరం లేదని చెప్పి మిమ్మల్ని మీరు సమర్థించుకున్నారు. బి.ఆర్.బాపూజీ రంగనాయకమ్మ గారి మొదటి భర్త కాదు, రెండో భర్త. ఇది నిజమే. ఈ విషయం తెలుసుకుంటే వచ్చే నష్టం ఏమిటి? మీరు పాతకాలపు భావవాదిలాగ భర్త చనిపోయిన స్త్రీలు లేదా భర్త నుండి విడిపోయిన స్త్రీలు రెండో పెళ్ళి చేసుకోకుండా ఏ డాక్టర్ ఉద్యోగమో, టీచర్ ఉద్యోగమో చేసి పిల్లల్ని పోషించాలని నమ్ముతున్నారా? మీరు అలా అనుకోబట్టే కదా బి.ఆర్.బాపూజీ గురించి తెలుసుకోవడం ఎవరికీ అవసరం లేనిది అని మీరు అనుకున్నారు. మీరు నా గురించి పోస్ట్ పెట్టి నేను అభివృద్ధి నిరోధక నమ్మకాలని నమ్ముతున్నానని ప్రచారం చేస్తే గతంలో మీరు అప్రూవ్ చెయ్యని వ్యాఖ్య యొక్క స్క్రీన్‌షాట్‌ని కూడా నేను బయట పెట్టగలను. మార్క్సిజం, స్త్రీవాదం విషయంలో ఎవరి నిజాయితీ ఎంతో అర్థమైపోతుంది.

 15. విశేఖర్ గారు,
  మీ స్పందన, తదుపరి వ్యాఖ్యలూ చదివాను.
  ప్రవీణ్ గారి వ్యక్తిగత సమస్యకు నా సానుభూతి. ఒక రకంగా ఆది వ్యక్తిగత సమస్య కాకపోవచ్చు కూడా.

  కాని తను చాలా సందర్భాలలో సెల్ప్ గోల్ వేసుకోవడంపైనే ప్రావీణ్యత సాధిస్తున్నారేమో అనిపిస్తోంది. ఢిల్లీలో జరిగిన దారుణాన్ని ఎవరికి ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా ఖండిస్తున్నారే తప్ప దాన్ని శల్యపరీక్ష చేయడానికి ఎవరూ సాహసించడంలేదు. ఆ పని ప్రవీణ్ చేశారు. మనం ఏ పునాదిపై ఉన్నామన్నది ఒక్క క్షణం మర్చిపోతే వెయ్యేళ్ల వెనక్కు పోతామనేది నిజం.

  తన భావజాలాన్ని పక్కన పెట్టండి. తన మాటలు చాలా తేడాగా ఉంటున్నాయి. మాట జారితే ఏమవుతుందో బొత్స గారి ఉదంతం చూసినా అర్థమవుతుంది. ఇలాంటి విషయాల్లో నోరు జారితే రాష్ట్రపతి కొడుకైనా సరే శంకరగిరి మాన్యాలు పట్టిపోవలసిందే.

  కాని ప్రవీణ్ తన మాటల్నివెనక్కు తీసుకుంటారని నాకయితే అనిపించలేదు. పశ్చాత్తాపం ఆయన డిక్షనరీలో ఉన్నట్లు లేదు.

  పైగా తన వ్యాఖ్యను సమర్థించుకోవడానికి ఈనాడు వార్తనే అరువు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి దారుణ ఘటనలపై నోరు జారితే, కలం జారితే ఈనాడే కాదు ఏనాడు అయినా సరే బోనెక్కవలసిందే.
  సమాజ గమనంలో భూస్వామ్య భావజాలం కంటే బూర్జువా భావజాలం మిన్న. దాంట్లోని మంచి చెడ్డల విచక్షణ తర్వాతి విషయం.

  ఆడవాళ్లకు రాత్రి తొమ్మిదన్నర తర్వాత వీధుల్లో ఏం పని అన్న బొత్స గారి వ్యాఖ్య అసలు సిసలు భూస్వామ్య భావజాలానికి ప్రతీక. దానికి అటూ ఇటూగా ఎవరు మాట్లాడినా మనలోని భూస్వామి తొంగిచూసినట్లుందే తప్ప మరొక అర్థం కనిపించదు.

  ఇండియా ఏకకాలంలోనే అనేక శతాబ్దాలలో జీవిస్తున్నట్లుందని ఇటీవలే అరుంధతీరాయ్ ఒక ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సంగతిని ఆర్.ఎస్.రావు గారు ముప్పయ్యేళ్లకు ముందే తనదైన శైలిలో చెప్పారు.

  అక్రమ సంబంధం అనే మాటను తెలుగు సమాజంలో ఏ స్త్రీవాది కూడా గత పాతికేళ్లుగా వాడుతున్నట్లు లేదు. పత్రికలలో కూడా ఈ పదప్రయోగాన్ని పరమ అభ్యంతరకరమైనదిగా చూస్తున్నారు. కాని ప్రవీణ్ మాత్రం అలవోకగా ఇలాంటి పదాలను వాడేస్తుంటారు. వివాహేతర సంబంధం ఎందుకు అక్రమసంబంధం కాదో అర్థం కావాలంటే మనం మళ్లీ ఎంగెల్స్ రాసిన “కుటుంబం, సొంత ఆస్తి, రాజ్యావిర్భావ మూలాలు” పుస్తకం చదవాల్సిందే.

  అత్యాచారం ఆధిపత్య ఆయుధంగా ఆధునికకాలంలో కూడా ఎలా కొనసాగుతోందో కింది కథనంలో పొందుపర్చారు. వీలైతే చూడగలరు.

  Rape As Weapon of Domination: The Clout of Caste And Class in India
  http://revolutionaryfrontlines.wordpress.com/2012/12/27/rape-as-weapon-of-domination-the-clout-of-caste-and-class-in-india/

 16. ప్రవీణ్ గారూ, సిస్టం వద్ద లేను. అందువలన వ్యాఖ్యల ప్రచురణ ఆలస్యం అయింది.

  మీరొక సంగతి గుర్తించాలి. నేను మీపైన రంధ్రాన్వేషణ చెయ్యడానికిగానీ, లేదా మీగురించి ఉన్నవీ లేనివీ ప్రచారం చెయ్యడానికి గానీ ఈ టపా రాయలేదు. మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు స్పందనగా మాత్రమే రాసాను. ఆ విషయం ఇప్పటికి రెండు సార్లు చెప్పాను. ఇది మూడోసారి.

  అత్యాచారం విషయంలో మీ అభిప్రాయాలు సవ్యంగా లేవని నేనే కాకుండా ఇతర మిత్రులు కూడా చెబుతున్నారు. కనుక మీరు ఆ విషయంపై దృష్టి సారించండి. మార్క్సిస్టులు విమర్శలకు ఎప్పుడూ భయపడరాదు. పైగా ఆహ్వానించాలి. ఆత్మవిమర్శకు ఎల్లవేళలా సిద్ధపడాలి. ఒక విమర్శ చేయగానే కోపం తెచ్చుకుని పాతవి ఏవో ఉన్నాయనీ వాటిని బైటపెడతానని బెదిరింపులకు దిగడం సరికాదని మీకూ తెలిసిన విషయమే. మీరు బైటపెడతానన్నవి ఇంకా ఏమైనా ఉంటే పెట్టండి. నాకయితే సమస్యేమీ లేదు.

  బాపూజీ గారు ఇప్పుడుగానీ పాత సందర్భంలోగానీ చర్చలో లేరు. అందువలన వారి వ్యక్తిగత విషయాలు ఇక్కడ అనవసరమని చెప్పాను. మీ వ్యక్తిగత విషయాలు కూడా బ్లాగుల్లో ప్రస్తావించొద్దని మీకు కూడా అనేకసార్లు సలహా ఇచ్చాను. ఇందులో మరో ఉద్దేశ్యం ఏమీ లేదు. గమనించగలరు.

 17. Mr Rajasekhar, even I did criticise Botsa’s statement.
  బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే “ఖాళీగా ఉన్న ఒక ట్రైన్‌లో ఒక దొంగ ఒక ప్రయాణికుణ్ణి కొట్టేసి సెల్‌ఫోన్ లాక్కుంటే అది ప్రయాణికుని తప్పే కానీ దొంగ తప్పు కాదు” అన్నట్టు ఉన్నాయి. “స్వాతంత్ర్యం వచ్చింది కదా అని అర్థ రాత్రి కూడా తిరగడమేనా” అని అడిగాడు. ఆ అమ్మాయి అర్థ రాత్రి పూట తిరగలేదు. నిబంధనలకి విరుద్ధంగా తిరుగుతోన్న ఒక స్కూల్ బస్‌ని ప్రయాణికుల బస్ అనుకుని ఎక్కింది. ఇక్కడ నిబంధనలకి విరుద్ధంగా తమ డ్రైవర్‌కి వేరే పనుల కోసం బస్‌ని వాడుకోవడానికి అనుమతిచ్చిన ఆ స్కూల్ నిర్వహకులది అసలు తప్పు.

 18. స్త్రీ-పురుష సంబంధాల విషయంలో సంకుచిత నమ్మకాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. ఆ మధ్య ఒక సినిమాలో హీరో చేత “అరిటాకు ముల్లు మీద పడినా, ముల్లు అరిటాకు మీద పడినా అరిటాకుకే రంధ్రం పడుతుంది కానీ నా పంచెకి రంధ్రం పడదు” అనే డైలాగ్ పలికించారు. ఆ డైలాగ్‌పై ఒక్క మహిళా సంఘం వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పలేదంటే మన మహిళా సంఘాల చైతన్యం ఏ స్థాయిలో ఉందో అర్థం కావడం లేదా? No one gets irate by such culture. If some one speaks truth, it generate irate in people against him.

 19. ఈ పోస్ట్ చూస్తే మీకేమీ అనుమానం రావడం లేదా? http://chaduvari.blogspot.in/2009/01/blog-post_29.html వ్యాఖ్యలు గమనిస్తే ఈ పోస్ట్ రచయిత ఇది పెట్టినదే నన్ను తిట్టడానికి అని అర్థమైపోతుంది. అప్పట్లో మంగళూరు పబ్‌పై శ్రీరామ సేన చేసిన దాడిని విమర్శిస్తూ వ్రాయడం వల్ల జనం నన్ను తిట్టారు. ఇప్పుడు అదే జనం నేను మోరల్ పోలిసింగ్ చేసేవాళ్ళని సమర్థిస్తున్నానని అంటున్నారు.

 20. And also read these verses written by the same blogger.
  >>>>>>>>>>
  ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కొత్త సంవత్సరం (2009 కాదు, రెండేళ్ళ కిందట) సందర్భంగా ముంబైలో నడివీధిలో, అర్థరాత్రి, వేలాది మంది మధ్య, ఆడవాళ్ళ గుడ్డలు లాగేసిన బీభత్సం గురించి మీరు వినే ఉంటారు. ఇలాంటి సంఘటనలు నాకు తెలిసి రెండేళ్ళు జరిగాయి. తాగి తందనాలాడే గుంపు లోకి, ఆడవాళ్ళు, తాము కూడా తాగి వస్తే అలాంటి సంఘటనలు జరక్కుండా ఉంటాయా? సంస్కారం అనేది అందరికీ ఒకటే -కాదన్ను. కానీ, కుసంస్కారం కారణంగా, అసభ్యత కారణంగా చివరికి నష్టం కలిగిందెవరికి? క్రికెట్ ఆటలకోసమని ఆడే వాళ్ళను తెచ్చి ప్రేక్షకులకు విందు చెయ్యబోయారు. ప్రేక్షకులు మాతో అసభ్యంగా ప్రవర్తించారని వాళ్ళు గోలెట్టారట. ప్రేక్షకులు వాళ్ళమీద చేతులెయ్యడం తప్పే.. కానీ వాళ్ళు రెండు పీలికలడ్డం పెట్టుకుని గంతులేస్తే గదా అది జరిగింది! ఈ ముక్క చెప్పినదానికి నేను తాలిబన్‌నా? వాళ్ళు స్త్రీలు కాబట్టి వాళ్ళను స్త్రీల చేత కొట్టించాలి, అన్నారు, అలా చేస్తే తప్పు కాదా?
  >>>>>>>>>>

  And also read my verses
  >>>>>>>>>>
  నేనేమీ ఆ అమ్మాయిపై జరిగిన రేప్‌ని సమర్థించడం లేదు. రేప్ చెయ్యడం తప్పైనప్పుడు వీధి వ్యభిచారిని రేప్ చెయ్యడం కూడా తప్పే అవుతుంది. కానీ అమ్మాయిలు తమకి డేటింగ్ చేసే హక్కు ఉందనీ, తమని రేప్ చేసే హక్కు మాత్రం మగవాళ్ళకి లేదనీ అంటే మగవాళ్ళు అర్థం చేసుకోరు. డేటింగ్ చెయ్యడం తప్పు కాదు అనే భావన ఉన్నప్పుడు “నువ్వు వాడితో కలిసి పది రోజులు డేటింగ్ చేశావు, నువ్వు నాకు పది నిముషాలు సెక్స్ సుఖం ఇవ్వలేవా” అని అడుగుతూ ఒక మగవాడు ఒక ఆడదాన్ని రేప్ చెయ్యడని గ్యారంటీ లేదు.
  http://streevimukti.mlmedia.net.in/do-you-think-that-rapists-should-be-hanged-to
  >>>>>>>>>>

  Do you find any fault in my verses even after reading these examples?

 21. కానీ అమ్మాయిలు తమకి డేటింగ్ చేసే హక్కు ఉందనీ, తమని రేప్ చేసే హక్కు మాత్రం మగవాళ్ళకి లేదనీ అంటే మగవాళ్ళు అర్థం చేసుకోరు.

  ప్రవీణ్ గారూ మీరిక్కడ జనరలైజ్ చేస్తున్నారు. మగవాళ్ల విషయం వదిలేయండి. మీ విషయం ఏమిటి? ప్రపంచంలో ఏ న్యాయశాస్త్రం దీన్ని సమర్థిస్తుందో ఒకసారి తెలుసుకుని చెప్పగలరా? డేటింగ్ చేసే హక్కు, రేప్ చేసే హక్కు ఒకటేనా? ఇంతకూ మీరు ఏ మగవాళ్ల తరపున మాట్లాడుతున్నారు?

  అవతల ఆమె చావుబతుకుల మీద కొట్టుకులాడుతోంది. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి మరీ ఇంతగా మగవాళ్ల పట్ల వకాల్తా పుచ్చుకోవడం సమంజసమేనా?
  సానిదానికయినా మనసుంటుందని గురజాడ వందేళ్ల క్రితం కన్యాశుల్కంలో అన్ని మాట కూడా మర్చిపోయారా?

  ఈ చర్చ ఇలా కొనసాగించడం కూడా భావ్యం కాదేమో

  మనందరం కలిసి శ్రీరామసేన దళంలో చేరిపోతే బాగుంటుదనుకుంటా

  నా చివరి వ్యాఖ్య ఎవరికయినా భాధ కలిగిస్తే సారీ

 22. విశేఖర్ గారు,
  మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే ప్రవీణ్ వ్యాఖ్యలకు అర్ధం మీకు వివరిస్తాను. అతని భావాలకు తగిన విధంగా వ్యక్తపరచడం అతనికి ఇంకా రావడం లేదు.

  ఎపుడయినా మార్పు కోరుకునే వ్యక్తులే ముందుగా మారాలి అన్న విషయం గుర్తుంచుకోండి. స్త్రీలు పురుషులతో సమానంగా హక్కులకోసం పోరాడుతున్నపుడు పురుషులతో సమానంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. బాధ్యతలు వద్దు హక్కులే కావాలి అంటే రావు.

  అర్ధరాత్రి వరకూ తిరుగుతాము, మా డ్రెస్ లు మాఇష్టం అనేవారు ఏదయినా జరిగినపుడు కూడా అదే విధంగా స్పందించాలి. పూనం పాండే ని సన్నీలియోన్ లను అనుకరిస్తూ డ్రెస్ లు వేసుకునే వారు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారు తమ మీద అత్యాచారం జరిగిందని ఎపుడూ అనరు, గోల చేయరు. మనం ఒకరిని అనుకరిస్తున్నామంటే వారిలాగే వ్యవహరించాలి.

  రేఖ లాంటి వారు , కరీనాకపూర్ లు వేసుకున్న డ్రెస్ ల కంటే ఘోరమైన డ్రెస్ లు బయట వేయరు. వారి బాధలకు ఎవరూ గొంతెత్తడం లేదే ? జయాబచ్చన్ కి అమితాబ్ లకు అత్యాచార భాధితురాలి గురించి మాట్లాడే అర్హత ఉందా ?

  ఆడవాళ్ళు ఇష్టమైతే డేటింగ్ అంటారు ఇష్టం లేకపోతే అత్యాచారం అంటారు. వారి నాలుకలకు రెండువైపులా పదును ఉంటుంది. అందరూ పురుషులను అంటారు కానీ వారు రాముని లాగా అమాయకులు. శూర్పణక కైతే ముక్కు చెవులు కోస్తారు సీత కైతే గీత గీస్తారు. శూర్పణక ని నిలువరించాలంటే ఒక గీత గీసి ఉండవచ్చు కదా ? రామ లక్ష్మణులే మొదట హింసని మొదలు పెట్టారు. కష్టం వస్తే రామునికి చెప్పుకోవాలి కానీ రాముడే దగ్గరుండి హింసించితే రామభక్తులు హింసించరా ? మేము ఎవరికి మొరపెట్టుకోవాలి ? అందుకే ఏదయినా జరిగినపుడు సినిమా ఏక్టర్ ల లాగానే వ్యవహరించాలి. హక్కుల కోసం పోరాడకూడదు. అన్నీ భరించాలి. అది కూడా చేతకాకపోతే సీత ని ఆదర్శంగా తీసుకుని వీలయితే భూమిలోకి వెళ్ళిపోవాలి.

 23. రాజశేఖర్ గారు, నేను మగవాళ్ళని సమర్థించడం లేదు. వెనుకబాటు నమ్మకాలని నమ్మేవాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉంటారు. భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకోకుండా, కేవలం కుంకుమ, గాజులు పెట్టుకునే హక్కు తమకి వచ్చింది కనుక అదే అభివృద్ధికరమైన మార్పు అని అనుకునేవాళ్ళు ఉన్నారు. అభివృద్ధి అనేది ఏమాత్రం లేని డేటింగ్ లాంటి వాటి సంగతి ఏమిటి? పది మంది అమ్మాయిలతో డేటింగ్ చేసిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలు ఒప్పుకుంటారు కానీ పది మంది అబ్బాయిలతో డేటింగ్ చేసిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఏ అబ్బాయీ ఒప్పుకోడు. డేటింగ్ వల్ల స్త్రీ-పురుష సంబంధాలు మారే అవకాశం ఏమాత్రం లేనప్పుడు అందులో ఏదో ప్రోగ్రెస్ ఉందని భ్రమపడడం వృథా. ఒక అమ్మాయి తనకి కాలేజ్‌లో పరిచయమైన అబ్బాయితో పది నెలలు డేటింగ్ చేసింది. అదే కాలేజ్‌లో పరిచయమైన ఇంకొక అబ్బాయి ఆమెని కేవలం పది నిముషాల పాటు రేప్ చేశాడు. ఇష్టపడి చేసే సెక్స్ (డేటింగ్) అనేది పది నెలలు చేసినా శీలం పోదు కానీ ఇష్టం లేని సెక్స్ (రేప్) అనేది పది నిముషాలు జరిగినా శీలం పోతుంది అని అంటే ఆ వాదన అగ్నిహోత్రావధానులు లాంటి మూర్ఖులకి మాత్రమే అర్థమవుతుందేమో.

 24. విశేఖర్ గారు,

  ప్రవీణ్ తన చుట్టూ ఉన్న చాల సమస్యలను కలిపి మాట్లాడుతున్నారు. అదే సమయం లో స్త్రీ వాదం ను స్త్రీలను కేవలం గుడ్డిగా సమర్ధించడానికి కాక వారి సమస్యలకు మూల కారణం పై చర్చిస్తున్నాడు..

  డేటింగ్ చేసిన అమ్మాయి , అంతకుముందు బాయ్ ఫ్రెండ్ మరియు ఈ అమ్మాయి ఎంత మంచివారయినా విడిపోవాల్సిన పరిస్థితి వస్తే అతను మరల పెళ్లి చేసుకోవాలని ప్రోత్సహించే మనం, అమ్మాయితో అదే విధం గా జెనరల్ గా ఉండకపోవచ్చు. ఉన్నా తన ముందు రిలేషన్ లో ఉన్న వ్యక్తి కన్నా ఉత్తముడి కోసమే వెదుకుతుంది . అది చాలా కష్టమైన ప్రాసెస్. అబ్బాయి మాత్రం జస్ట్ తనకి నచ్చిన ఇంకో అమ్మాయి ( మరీ విశాల భావాలు లేకున్నా పర్లేదు ) కనిపించగానే చేసుకొంటాడు. ఈ అంతరాన్ని ప్రశ్నిస్తున్నాడు ప్రవీణ్, అదే సమయం లో అమ్మాయిలూ ఈ పరిస్థితి ని అర్ధం చేసికొని డేటింగ్ కి దూరం ఉండాలి అని ఆసపడుతున్నాడు. వివాహం కాకుండా,జరిగే శారీరక సంభందాలను డేటింగ్ అని కాక ఒక విధం గా రేప్ తో పోల్చుతున్నాడు. ముఖ్యం గా డేటింగ్ పేరుతొ మోసం చేసే వాళ్ళని. వాళ్లకి, రెప చేసే వాళ్లకి తేడా ఏముంది అని ప్రశ్నిస్తున్నాడు.

  డేటింగ్ ని మీరు నిర్వచిస్తున్నారు. అతను విస్లేషిస్తున్నాడు , రెండు అవసరమే.

 25. కాగితాల మీద వ్రాయబడుతోన్న వ్రాతలకీ, వాస్తవికంగా జరుగుతోన్న ఘటనలకీ మధ్య వైరుధ్యాన్ని గమనించకపోతే సమాజం గురించి అర్థం కాదు. స్కూల్ పుస్తకాలలో వ్రాసేవాటిని నిజ జీవితంలో ఆచరించరు. ఉదాహరణకి స్కూల్ పుస్తకాలలో భర్త చనిపోయిన స్త్రీని పెళ్ళి చేసుకోవడం తప్పు కాదని వ్రాస్తారు. కానీ నిజ జీవితంలో ఒక మహిళా మంత్రిణి భర్త చనిపోయిన తరువాత కుంకుమ తీసేసి, తాను మహిళా సాధికారికత కోసం కృషి చేస్తున్నానని చెప్పుకుంటోంది. ఆమెకి మహిళా సాధికారికత అంటే ఏమిటో కూడా తెలియదు అనేది నిజం. స్కూల్ పుస్తకాలలో వ్రాసే నీతులనే ఆచరించనివాళ్ళు పత్రికలలో వ్రాసే డేటింగ్ లాంటి వాటిని నిజ జీవితంలో నమ్ముతారా? సెక్స్ అనేది వినకూడని పదం కాదనీ, పెళ్ళికి ముందు డేటింగ్ చెయ్యడం తప్పు కాదని స్వాతి లాంటి పత్రికలలో వ్రాస్తే అందరూ చదువుతారు. కానీ ఆ వ్రాతలు చదివేవాడు కూడా పెళ్ళికి ముందు ఇంకొకడితో సెక్స్ చేసిన స్త్రీని పెళ్ళి చేసుకోడు. డేటింగ్ విషయంలో మోసపూరితమైన భావనలు ఉన్నాయని తెలిసి కూడా డేటింగ్‌ని నమ్మడం ఒక ఫార్స్ అయితే మార్క్సిస్ట్‌లమని చెప్పుకునేవాళ్ళు & స్త్రీవాదులమని చెప్పుకునేవాళ్ళు దాన్ని నమ్మడం ఇంకా ఫార్స్ అవుతుంది.

 26. 1999లో జరిగిన ఒక ఘటన గురించి చెపుతాను. నల్లగొండ జిల్లాలో లంబాడీ కులానికి చెందిన ఒక కుటుంబంవాళ్ళు అప్పటి ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి వోట్లు వెయ్యలేదనే కారణంతో స్థానిక తెలుగు దేశం నాయకుడు & కార్యకర్తలు ఆ కుటుంబానికి చెందిన స్త్రీలపై సామూహిక అత్యాచారం చేశారు. అప్పట్లో తెలుగు దేశం పార్టీయే అధికారంలో ఉండడం వల్ల ఆ అత్యాచారం చేసినవాళ్ళకి శిక్ష పడలేదు. చేతబడి చేసింది అనే అనుమానంతో ఒక మహిళని బట్టలు ఊడదీసి ఊరంతా ఊరేగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కేసులన్నిటిలోనూ అన్యాయానికి గురయ్యేది లో క్లాస్ మహిళలే అయ్యి ఉంటారు కనుక వీటి గురించి ఎవరూ పట్టించుకోరు. ఒక మెడికల్ కాలేజ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగినప్పుడు మాత్రం అది దేశ వ్యాప్తంగా ఒక పెద్ద వార్త అవుతుంది.

  పల్లెటూరిలో ఒక దళిత మహిళ చేతబడి చేసిందనే అనుమానంతో ఆమెని ఊరంతా నగ్నంగా ఊరేగిస్తే పట్టణాలలో ఉండే జనం దాని గురించి పట్టించుకోరు. “పల్లెటూరివాళ్ళు అడవి మనుషులు కనుక వాళ్ళ నమ్మకాలు కూడా అడవి స్థాయిలోనే ఉంటాయి” అని పట్టణాలలో ఉండేవాళ్ళు అనుకుంటారు. పట్టణంలో ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ చదివే ఒక విద్యార్థినిపై రేప్ జరిగినప్పుడు మాత్రం ఆ అన్యాయం తమకి కూడా జరగొచ్చు అనే భయం పుడుతుంది.

 27. డేటింగ్ చేసేవాళ్ళపై జరిగే అత్యాచారాలని నేను సమర్థించను. శీలం మీద నమ్మకం లేని స్త్రీపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి తనని రేప్ చేసినవాణ్ణి కేవలం ప్రైవసీ ఇన్‌ట్రూజన్ కేస్ కింద అరెస్ట్ చెయ్యమని చెప్పాలి. Gay rightsని సమర్థించే మగవాణ్ణి ఒక gay రేప్ చేస్తే ఆ పని చేసిన gayని కూడా కేవలం ప్రైవసీ ఇన్‌ట్రూజన్ కేస్ కింద అరెస్ట్ చెయ్యాలి కానీ రేప్ కేస్ కింద అరెస్ట్ చెయ్యకూడదు. శీలం మీద నమ్మకం లేనివాళ్ళపై రేప్ జరిగితే అది వాళ్ళ ప్రైవసీకి మాత్రమే భంగం కలిగిస్తుంది కానీ కొత్తగా శీలం పోవడం అనేది జరగదు.

 28. ప్రవీణ్ గారు, ఆ వ్యక్తుల పేర్లు ఇక్కడ వద్దని కోరుతున్నాను. వారికి అంత విలువ ఇవ్వడం దండగ. అందువలన పేరు (సర్వనామంతో సహా) తొలగించాను. మీరేమిటో మీ వ్యాఖ్యలు, టపాలే చెబుతాయి తప్ప మరొకరి వ్యాఖ్యలు కాదు. తప్పుగా అర్ధం చేసుకోవడం సాధారణంగా జరిగేదే కనుక ఆ వైపు నుండి మీరు వివరిస్తే సరిపోతుందని నా సూచన.

 29. Unknown గారు, ప్రవీణ్ గారి పైన మీరు చేసిన వ్యాఖ్య వ్యక్తిగతంగా తప్పు ఎంచేలా, తనను కించపరిచేలా ఉన్నది.

  భార్య, కూతుళ్లు, అక్కలు, చెల్లెళ్లు ఉన్నవారు కూడా అనేకమంది మహిళలను చిన్న చూపు చూసే భావాలు వ్యక్తం చేయడం తెలిసిన విషయమే. కనుక సింగిల్ గా ఉండడానికి సామాజిక భావాలకు సంబంధం కలపడం సరికాదనుకుంటాను. వ్యక్తిగత అంశాల్ని కాకుండా చర్చలోని విషయాలపై చర్చించగలరు.

  మౌళి, నీహారిక గార్లు కూడా ప్రవిణ్ గారే అన్నట్లుగా మీరు చెబుతున్నట్లు కనిపిస్తోంది. అది నిజం కాదు. వారు వేరు వేరని గ్రహించగలరు.

 30. విశేఖర్ గారు, ఆ అజ్ఞాత గారు ఫేస్‌బుక్‌లో ఏదో చదివి ఇంకేదో ఊహించుకుంటున్నారు. గూగుల్ ప్లస్, ఫేస్‌బుక్ అనేవి ఉన్నవి వ్యక్తిగత విషయాలు వ్రాసుకోవడానికే. ఆ అజ్ఞాత ఫేస్‌బుక్‌లో నా పోస్ట్‌లు చదివి ఉంటాడు. అవి చదివి paranoia (అనుమానం)కి లోనై ఉంటాడు. అందుకే అతను నా మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నాకు ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్ళి కాలేదు, నిజమే. మా కులానికి చెందిన అమ్మాయిలందరూ నా కంటే డబ్బున్నవాణ్ణే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు, నిజమే. అంతమాత్రానికే నేను ఆడవాళ్ళందరినీ ద్వేషించే రకమా? సమాజ స్వభావం ఎలా ఉంటే మానవ స్వభావం అలా ఉంటుందని మార్క్సిస్ట్‌లందరికీ తెలుసు. నాకు సామాజిక పరిస్థితులపై అసంతృప్తి ఉన్న మాట నిజమే కానీ నేను ఆడవాళ్ళని ద్వేషించే రకం కాదు. సమాజం గురించి ఇంత తెలిసీ కేవలం ఆడవాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటే నాకు ఏమీ రాదు. గతితార్కిక-చారిత్రక భౌతికవాదం చదివిన నేను సమాజాన్ని ఈమాత్రం అర్థం చేసుకోలేనా? గతితార్కిక భౌతికవాదం నిజంగా అర్థమైనవాడు ఎవడూ మనిషి ప్రవర్తనకి సంబంధించిన అంశాన్ని సమాజం నుంచి వేరు చేసి చూడడు.

 31. మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన మగవాళ్ళైనా ఆర్థికంగా ఏమీ లేని కుటుంబాలకి చెందిన స్త్రీలని పెళ్ళి చేసుకోరు. అలాగని స్త్రీలు పురుషుల మీద ద్వేషం పెట్టుకుంటున్నారా?

 32. అజ్ఞాత గారు, మీరు prejudice చెయ్యకుండా నిజాలు తెలుసుకుంటే మంచిది. రాయగడలో మా పక్కింటిలో ఉండే కమ్మవాళ్ళ అబ్బాయిని బలంగిర్ జిల్లాలో ఉండే కమ్మవాళ్ళ అమాయికి ఇచ్చి పెళ్ళి చేశారు. అతనికి ప్రభుత్వ ఉద్యోగం లేదు. అతను చేసేది వడ్డీ వ్యాపారం. అప్పులు తీసుకునేవాళ్ళు వడ్డీలు సరిగ్గా కట్టరు. అతనేమీ అంత డబ్బున్నవాడు కాకపోయినా అతనికి పెళ్ళి సంబంధం సులభంగానే దొరికింది. ఒరిస్సాలోని కమ్మవాళ్ళలో ఎక్కువ మంది వ్యవసాయం చేసేవాళ్ళే. వాళ్ళలో గవర్న్‌మెంట్ ఉద్యోగుల సంఖ్య తక్కువ కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం లేనివానికైనా తమ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యడానికి ఒప్పుకుంటారు. నా పరిస్థితి వేరు. మా బంధువులు అందరూ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లలోనూ, బ్యాంక్‌లలోనూ, రైల్వేలలోనూ పని చేస్తున్నారు. అందుకే వాళ్ళ అమ్మాయిని నాకు ఇవ్వకపోయినా వాళ్ళకి పెళ్ళి సంబంధం దొరుకుతుందని అనుకుంటున్నారు. డబ్బు సంబంధాలు వాళ్ళని అలా ఆడిస్తున్నాయి. ఇక్కడ నేను డబ్బు సంబంధాలనే వ్యతిరేకిస్తాను కానీ స్త్రీలని ద్వేషించాల్సిన అవసరం నాకేమిటి?

 33. ప్రవీణ్ గారు, Unknown గారు చాలా స్పష్టంగా ఎట్టి మినహాయింపు లేకుండా అపాలజీ చెప్పారు. తాను రాసిన మూడు వాక్యాల్లో రెండు సార్లు పశ్చాత్తాపం ప్రకటించారు. దానిని హుందాగా స్వీకరించడం మీ ధర్మం. అది మానేసి ‘నిజాలు తెలుసుకుంటే మంచిది’ అని హెచ్చరిక లాగా మీరు రాయడం బాలేదు. కొన్ని మర్యాదలు మీకింకా అలవడినట్లు లేదని రాజు గారు కొన్ని సార్లు సందేహం వెలిబుచ్చారు. అలాంటి సందర్భాలే కొన్ని పాఠాలు మనకు నేర్పుతాయి. అప్రమత్తంగా ఉండి వాటిని నేర్చుకోవడం మన ధర్మమే కాదు, అవసరం కూడా.

 34. Sir, Mr Praveen actually I didn’t see any Facebook page or any google plus page of you. You mention some where else about your personal stuff and also mentioning about cast many times some around this blog.
  That’s why I mention about your personal stuff which is posted by you some around
  This blog. But, strong comments about personal stuff is offensive, so I just said apologies
  I want to give you an advice/request what ever(no offense but I want to say this to my blog friend and also please keep in mind this not a counter comment)

  World is big, it’s almost impossible to get something as you like,
  But you can change things( even friend ship or love ) almost any thing as you like,

 35. “World is big, it’s almost impossible to get something as you like,
  But you can change things( even friend ship or love ) almost any thing as you like”

  Great and lightning sentence!

  ఎంత మంచి వ్యాఖ్యో.. కాంతిస్పోరకమైన మెరుపువాక్యం కూడా. ఇష్టమైనవి పొందలేకపోవచ్చు కాని ఇష్టమైనవాటిని మార్చవచ్చు.

  అజ్ఞాతగారి పశ్చాత్తాపం అంతకంటే విలువైంది. అది హృదయంలోంచే వచ్చిందనుకుంటున్నా. ఈ విషయంలో అయినా వారు తన ఉనికిని బయట పెట్టిఉంటే చాలా బాగుండేది.

  “కొన్ని మర్యాదలు మీకింకా అలవడినట్లు లేదని రాజు… కొన్ని సార్లు సందేహం వెలిబుచ్చారు.”

  ఇది మర్యాదలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు విశేఖర్ గారూ, తాను విశ్వసిస్తున్న భావజాలానికి అనుగుణమైన వ్యక్తీకరణకు సంబంధించి ప్రవీణ్ కొన్ని సందర్బాల్లో ఎక్కడో తప్పటడుగు వేస్తున్నారనేదే నా అభిప్రాయం.

  ఒకే ఒక ఉదాహరణ..

  డేటింగ్ చేసే హక్కు, అత్యాచారం చేసే హక్కు రెండింటికీ సమాన స్థాయి నిస్తున్నట్లుగా ఈ కథనంలోనే తను గతంలో వ్యాఖ్యానించారు.

  నిజంగానే మార్క్సిస్టులు డేటింగును తీవ్రంగా వ్యతిరేకించాలి అనుకుంటే కూడా దానిపట్ల మన వ్యక్తీకరణ అనేది హద్దు మీరకూడదు. మన ఉనికినే రద్దు చేసుకునేలా దాన్ని అత్యాచార హక్కుతో ముడిపెట్టకూడదు.

  ఈ రెండూ ఒకటి కాదని తనకు తెలుసు కానీ రాతలో దానికి బిన్నమైన పంథాలో వెళ్లారు.

  పోతే.. …ప్రవీణ్ వ్యక్తిగత సమస్యలను తనే బయటపెట్టారు కనుక తనకు సంపూర్ణ సహానుభూతి.

  అజ్ఞాతగారి పై వ్యాఖ్యే తన సమస్యకు పరిష్కారం.

  కాని ఉద్యమ వాతావరణంలో తను పని చేస్తున్నట్లయితే తన వివాహ సమస్య ఇంత సుదీర్ఘకాలం పాటు పరిష్కారం కాకుండా ఉండేది కాదు.

  తన కులంలో అమ్మాయిలు తనను ఇష్టపడటంలేదు అన్నదే ప్రతి సందర్భంలోనూ హైలెట్ చేస్తూ ఉన్నారు తప్పితే ఇతరత్రా కులేతర సంబంధాలకు తను ప్రయత్నిస్తున్నట్లు కనిపించటం లేదు. లేదా ప్రయత్నించీ విఫలమయ్యారేమో మరి.

  ఉద్యమాలతో సంబంధం లేకుంటే సరి.. కాని ప్రజాసంఘాలతో సంబంధంలో ఉండి ఉన్నా తన వివాహ సమస్య ఇంత సుదీర్ఘంగా కొనసాగేది కాదనిపిస్తోంది. అలాగని ప్రజా సంఘాలు మ్యారేజీ బ్యూరోలుగా ఉన్నాయనే అర్థంలో ఇక్కడ ప్రస్తావించటం లేదు.

  ప్రవీణ్ వ్యక్తిగత సమస్యను ఇక్కడ చర్చనీయాంశంగా చేయడం భావ్యం కాదనుకుంటే నా వ్యాఖ్యలోని కింది భాగం ప్రచురించకండి.

 36. పురుషాధిక్యత వల్ల తమకి లాభం ఉందనుకునేవాళ్ళలో స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీ ఎంత డబ్బు సంపాదించినా ఆమె తన కంతే డబ్బున్న పురుషుణ్ణే పెళ్ళి చేసుకోవాలనే రూల్ పురుషాధిక్య సమాజంలో ఉంది. ఆడది మగవాని కంట్రోల్‌లో ఉండేలా చూడాలంటే ఆమెకి సొంత సంపాదన ఉన్నా కూడా ఆమె మగవాని మీద ఆధారపడేలా చెయ్యాలి. అందుకే ఆడది తన కంటే ఎక్కువ సంపాదించేవాణ్ణే పెళ్ళి చేసుకోవాలని రూల్ పెట్టారు. ఈ రూల్ వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. కలెక్టర్ ఉద్యోగమో, తహసీల్దార్ ఉద్యోగమో చేసే స్త్రీలకి తమ కంటే డబ్బున్న పురుషులు దొరకడం కష్టం. ఆ ఉద్యోగాలు చేసే స్త్రీలు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోవడం లేదా స్త్రీలు కావాలని ఆ ఉద్యోగాలకి వెళ్ళకపోవడం జరుగుతుంది. ఈ రూల్ వల్ల పురుషులకి కూడా కొన్ని సార్లు సమస్యలు వస్తాయి. ఒక పురుషుని బంధువులందరూ ప్రభుత్వ ఉద్యోగులూ, బ్యాంక్ ఉద్యోగులూ & రైల్వే ఉద్యోగులూ. కానీ ఆ పురుషునికి ప్రభుత్వ ఉద్యోగం దొరకలేదని అతని బంధువులు తమ అమ్మాయికి అతనికి ఇచ్చి పెళ్ళి చెయ్యడానికి ఒప్పుకోకుండా అతన్ని నపుంసకుణ్ణి చూసినట్టు చూశారు. ఇటువంటి భావజాలం స్త్రీలనీ, పుట్టుకతోనే ఆడ-మగ కాకుండా పుట్టినవాళ్ళనీ కించపరిచే భావజాలం అని తెలిసినా ఆర్థిక ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఈ భావజాలంతోనే ఆ అబ్బాయిని వెక్కిరించారు. ఇంత దారుణంగా బంధువుల నిరాదరణకి గురైన పురుషునికి బాధ కలగడం అనేది సహజం. కానీ నేను స్త్రీలని ద్వేషించే స్థాయికి దిగజారలేదు.

  పురుషాధిక్యతకి కర్త, కర్మ, క్రియలలో ప్రధాన పాత్ర పోషించేది మగవాళ్ళే. “నువ్వు వాణ్ణి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే నిన్ను మళ్ళీ ఇంటిలోకి రానివ్వను, నువ్వు మా దగ్గరే ఉంటే నిన్ను గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చి పెళ్ళి చేస్తాను” అని తండ్రి తన కూతురిని బెదిరించి, simultaneousగా ఆర్థిక ప్రయోజనం ఆశ చూపితే ఆ అమ్మాయి తన ప్రియుణ్ణి వదిలేసి తల్లితండ్రుల దగ్గర ఉండడానికే preference ఇస్తుంది. ఇది తండ్రి చేసిన తప్పా లేదా కూతురు చేసిన తప్పా? పలాస దామోదర్ విషయంలో కూడా అలాగే జరిగింది. అతను ప్రైవేట్ కాలేజ్‌లో లెక్చరర్‌గా పని చేసేవాడు. అతని ప్రియురాలి తల్లితండ్రులు ఆమెని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్ళి చేస్తామన్నారు. అతనికి ప్రభుత్వ ఉద్యోగం లేకపోవడంతో ఆ విరక్తిలో అతను ఉన్మాదిగా మారి అమ్మాయి యాసిడ్ పోశాడు. ప్రియురాలి తల్లితండ్రులు డబ్బు మనుషులు అయినప్పుడు ప్రియురాలి మీద యాసిడ్ పోస్తే ఏమి లాభం? కానీ విరక్తి వల్లో, ఉన్మాదం వల్లో అతను ఆ విషయం ఆలోచించలేకపోయాడు. యాసిడ్ దాడికి గురైన అమ్మాయిని చూసినా నాకు ఏడుపు వస్తుంది, దామోదరం లాంటి వాళ్ళ పరిస్థితి చూసినా నాకు ఏడుపు వస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s