(కార్టూన్: ది హిందూ నుండి)
–
50 ఓవర్ల పరిమిత క్రికెట్ ఆట నుండి శాశ్వతంగా విరమించుకుంటున్నట్లు భారతీయుల ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు. ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ ఆటలో ఆయన 50 సెంచరీలు పూర్తి చేసుకోవాలన్న అభిమానుల కోరిక నెరవేరకుండానే వన్ డే ఆట నుండి తప్పుకుంటున్నట్లు సచిన్ ప్రకటించడం అభిమానులకు ఒకింత నిరాశ కలిగించినా శ్రేయోభిలాషులైన క్రికెట్ పెద్దలు అభినందనలు తెలియజేశారు. భారతదేశ క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించాక సచిన్ రిటైర్మెంట్ ప్రకటించవచ్చన్న ఊహాగానాలకు తెరదించుతూ ఆటలో కొనసాగిన సచిన్ 50 సెంచరీల మార్క్ పై కన్నేసినట్లు అంతా భావించారు. అయితే మీదపడిన వయసు, కుర్రాళ్ళకు అవకాశాలు, ‘గదిలో ఏనుగు’ లా మారే ప్రమాదం పెరగడం… ఇత్యాది కారణాలరీత్యా విరమించుకోవడమే బెటర్ అని సచిన్ భావించినట్లుంది. వండే లు, టెస్ట్ మ్యాచుల్లో మొత్తం మీద వంద శతకాలు పూర్తి చేసినందున శతక శతకాల సంతృప్తి సచిన్ కీ, అభిమానులకీ మిగిలింది.
క్రికెట్ ఆటలో హిమాలయాల ఎత్తున కనిపించే సచిన్ టెండూల్కర్ దేశము-సమాజము-ప్రజలు విషయంలో మాత్రం పిల్లాడి కంటే అధ్వాన్నం. రాజ్యసభ సభ్యుడుగా నామినేట్ అయినపుడు కూడా ప్రజల గురించీ, వారి సమస్యల గురించీ, సామాజిక తీరు తెన్నుల గురించీ ఒక ముక్క కూడా మాట్లాడలేని సచిన్ సమాజంలో ఏ స్ధానంలో నిలబడి ఉన్నట్లు? ఆట దృష్ట్యా చూస్తే సచిన్ గొప్పవాడే గానీ, సమాజంలో ఒక వ్యక్తిగా చూస్తే అత్యంత అజ్ఞాని మరియు బాధ్యతలేని వ్యక్తి. వినియోగదారీ వ్యాపార సరుకుల కోసం అనేక వ్యాపార సంస్ధలకు ‘ఎండార్స్ మెంట్’ ఇచ్చిన సచిన్ ఆ సరుకుల వలన ప్రజలపైనా వారి ఆరోగ్యాలపైనా పడే ప్రభావాన్ని గురించి ఆలోచించలేదు.
కూల్ డ్రింకుల్లో ప్రమాదకరమైన స్ధాయిలో విషపదార్ధాలు ఉన్నాయని పరిశోధనలు తేల్చినపుడు కూల్ డ్రింక్స్ కోసం సచిన్ ఇచ్చిన ప్రకటనలు చర్చకు వచ్చాయి. కూల్ డ్రింక్స్ ప్రజల ఆరోగ్యాన్ని హరించడమేకాక రైతుల పంటలకు ఉపయోగపడవలసిన భూగర్భ జలవనరులను కూల్ డ్రింక్స్ కంపెనీలు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నాయి. అవి ఫ్యాక్టరీలు నెలకొల్పిన చోట చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తాగునీరు అందుబాటులో లేకుండా పోయింది. పంటలు నీరు అందక ఎండిపోయాయి. కేరళ లాంటి రాష్ట్రాల్లో కూల్ డ్రింక్స్ కంపెనీల జలదోపిడీపై ప్రజలు ఆందోళనలు చేశారు. కోర్టులు ప్రజలకు అనుకూలంగా తీర్పులిచ్చినా ప్రభుత్వాల మద్దతుతో లిటిగేషన్లతో కాలం వెళ్ళబుచ్చుతుండడంతో ప్రజలకు నష్టం జరుగుతూనే ఉంది. ఈ విషయాలన్నీ ప్రస్తావించి కూల్ డ్రింక్స్ కంపెనీలకు మీరు ఇస్తున్న ఎండార్స్ మెంట్లను ఉపసంహరించుకుంటారా అని సచిన్ ని ప్రశ్నించినపుడు “అదేమీ నాకు తెలియదు” అని సచిన్ చెప్పి తప్పించుకున్నాడు. ఈ దేశ పౌరుడుగా ఈ దేశ ప్రజలకు కలుగుతున్న నష్టం గురించి పట్టించుకోవలసిన బాధ్యతను సచిన్ ఆ విధంగా నిర్దయగా విస్మరించాడు.
కూల్ డ్రింక్స్ ఎండార్స్ మెంట్స్ రూపంలో సచిన్ కి వచ్చిపడుతున్న వందల కోట్ల డబ్బు ప్రజల కష్టార్జితం. అదేమీ సచిన్ కి ఆయాచితంగా వచ్చిపడలేదు. ఆటకోసం బోర్డు చెల్లించే కోట్ల రూపాయలకు ఎండార్స్ మెంట్ల ఆదాయం అదనం. అసలు బెత్తెడు, కొసరు బారెడు. సచిన్ ఖాతాల్లో కూల్ డ్రింక్స్ కంపెనీలు కుమ్మరించే డబ్బంతా ప్రజలనుండి వసూలు చేసేవే. ఈ దేశ జలవనరులనుండి నీటిని తోడి తీసి అందులో కాసింత సోడా, రంగునీళ్లు కలిపి జనానికి తాగబోయించడం ద్వారా కూల్ డ్రింక్స్ కంపెనీలు వేల కోట్లు ఆర్జిస్తున్నాయి. తమ అనైతిక వ్యాపారానికి ప్రచారం చేసిపెట్టినందుకుగాను అవి తమ లాభాల్లో అత్యంత చిన్నమొత్తాన్ని కృతజ్ఞతతో సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళకు సమర్పించుకుంటున్నాయి.
పెద్ద పెద్ద మొత్తాల్లో సచిన్, ధోనీ లాంటివాళ్లు ఎండార్స్ మెంట్లు కొట్టేసినప్పుడల్లా పత్రికలు తాటికాయంత అక్షరాల్లో హెడ్డింగులు పెట్టి వార్తలు ప్రచురిస్తాయి. అదేదో దేశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే వార్త అయినట్లుగా విశ్లేషణలు రాసేస్తాయి. సచిన్, ధోనీ లాంటివాళ్లు అల్లంత ఎత్తుకు ఎదిగిపోయి భారత కీర్తి ప్రతిష్టలను దిగాంతాలకు వ్యాపింపజేసినట్లు రాసుకుని మురిసిపోతూ ప్రజలను కూడా మురిసిపోమ్మంటాయి. తీరా చూస్తే ఈ ఎండార్స్ మెంట్ల వల్ల జరిగేది సచిన్, ధోనీలను చూసి పిల్లలూ, పెద్దలూ రంగునీళ్లు తాగి ఆరోగ్యాలు పాడుచేసుకోవడం, సచిన్ ధోనీల ఖాతాల్లో వందల కోట్లు, కూల్ డ్రింక్స్ కంపెనీల ఖాతాల్లో వేల కోట్లు చేరిపోవడం.
ఈ రంగునీళ్ళ బదులు జనం కొబ్బరి నీళ్ళు తాగితే బోలేడు ఆరోగ్యం. ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదించే తాజా కొబ్బరినీళ్ళకు మించిన ఆరోగ్యప్రదాయని ఇంకేది ఉంటుంది? కొబ్బరి నీళ్ళు తాగడం వలన ఒక్క తాగినవారికే కాక లక్షలాది కొబ్బరి రైతులకు కూడా లాభమే. దేశానికి వెన్నెముక అని చెప్పే భారతీయ రైతుకీ కాసింత డబ్బులు సమకూర్చే కొబ్బరి నీళ్ళు తాగడం శ్రేయస్కరమా లేక జనం డబ్బు వేల కోట్లలో దేశంబైటికి తరలిపోవడానికి దారితీసే కూల్ డ్రింక్స్ తాగడం శ్రేయస్కరమా? ఈ ప్రశ్న సచిన్ ని అడిగితే ‘అదేమీ నాకు తెలియదు’ అన్న సమాధానం వస్తుంది. వందల కోట్ల ప్రకటనల ఆదాయం అతనిచేత అలాంటి అమాయకపు మాటలు పలికిస్తుంది.
కూల్ డ్రింక్స్ కంపెనీలు ఇవ్వజూపే కోట్ల చెల్లింపులను తృణప్రాయంగా నిరాకరించే క్రీడాకారులు ఒకరిద్దరు లేకపోలేదు. వారిలో ఆంధ్ర ప్రదేశ్ షటిల్ బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ఒకరు. ఆల్ ఇంగ్లండ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నాక గోపీ చంద్ పట్ల వ్యాపార సంస్ధలకు సహజంగానే క్రేజ్ పెరిగిపోయింది. పెప్సీ కంపెనీ యధావిధిగా ఆయన వద్దకి వచ్చి ఎండార్స్ మెంట్ కోరింది. కోటి రూపాయలు ఫీజుగా ఇవ్వజూపింది. అప్పటికే కూల్ డ్రింక్స్ లో పురుగుమందులు, ఇతర విష పదార్ధాలు తుట్టెలు తుట్టెలు ఉన్నట్లు కొన్ని స్వచ్ఛంద సంస్ధలు రుజువు చేశాయి. ఆ నేపధ్యంలో పెప్సీ ఆఫర్ ని గోపి చంద్ నిరాకరించాడు. డబ్బు చాల్లేదేమోనని కంపెనీ కోటిన్నరకి ఫీజుని పెంచింది. “నేను తాగని దాన్ని తాగమని జనానికి ఎలా చెప్పమంటారు?” అని ప్రశ్నించి గోపీచంద్ పెప్సీ ఆఫర్ ని మళ్ళీ తిరస్కరించాడు. ఈ పని సచిన్, ధోనీ…. ఇత్యాదులు ఎన్నటికైనా చెయ్యగలరా?
(సచిన్ ఆటకి నేనూ అభిమానినే -విశేఖర్)
పెప్సీ ఆఫర్ ని గోపీచంద్ తిరస్కరించాడని ఇప్పటివరకూ నాకు తెలీదు. సొంత అకాడమీ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న గోపీ ఈ పెప్సీ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించటం నిజంగా గొప్ప విషయమే!
సచిన్ విషయానికొస్తే… అపార కీర్తి ప్రతిష్టలకు ఉబ్బితబ్బిబ్బవకుండా ఆటమీదే దృష్టి నిలపడం పాజిటివ్ కోణం. ఇలాంటి కోట్ల మందిపై ప్రభావం చూసే వ్యక్తులకు సామాజిక అవగాహన కూడా ఉంటేనా… అనిపిస్తుంటుంది.
వేణు గారికి, ఈ సంగతి చాలామందికి తెలియదు. గోపీ చంద్ తో సాన్నిహిత్యం ఉన్న జాతీయస్ధాయి బాడ్మింటన్ అంపైర్ ఒకరు నాకు తెలుసు. ఆయన ద్వారా నాకీవిషయం తెలిసింది.
అవును. ఆటమీదే దృష్టి నిలపడం పాజిటివ్ కోణం. కాని దానికి ప్రత్యామ్నాయం సచిన్ కి లేదు కదా?! ఆ మాటకొస్తే చాలామంది లబ్దప్రతిష్టులైన క్రీడాకారులు ఆటమీద దృష్టి నిలిపినందువల్లనే గొప్ప క్రీడాకారులు కాగలిగారు.
మనకి తెలుగులో ఒక నానుడి ఉంది : “అంత లావుగా ఉన్నావు తేలు మంత్రం తెలీదా” అని. నిజానికి దీని సందర్భం, అంత ఆరోగ్యంగా ఉన్నావు (ఒక విషయంలో ప్రావీణ్యం అన్నమాట) మిగతావిషయాలు తెలీవా అని. ఇక్కడ మనం తెలుసుకోవలసినది, మనకి అంతరాంతరాల్లో వ్యక్తులు అందంగా ఉన్నా, ఒకదాంట్లో నిష్ణాతుడైనా (ఉదాహరణకి సినిమా హీరోలు, క్రీడాకారులూ మొదలైనవారు.)పేరున్నవంశంలో పుట్టినా, వాళ్ళకి మిగతా అన్నిటిలోనూ కూడా, సహజంగానో లేక దాని పర్యవసానంగానో, ప్రావీణ్యం కలిగి ఉంటారనే అపోహ ఉంటుంది. చాలా మందికి ఒక్క అంశంలో ఎంత ప్రావీణ్యత ఉంటుందో, ఇతర అంశాలలో ప్రాధమిక అవగాహన కూడ ఉండదు. అయినా సరే వాళ్లని కీర్తించడమో, ఓట్లు వేసి గెలిపించడమో చేస్తుంటాం, మన కష్టాలన్నిటికీ వాళ్ళు సమాధానాలు కనుక్కోగలరనే ఆశతో,అపోహతో. సచిన్ పట్ల ప్రజలకున్న క్రేజని, రాజకీయలబ్దికి వాడుకుందికి ప్రయత్నం చేస్తున్నాది కాంగ్రెసు పార్టీ. దేశభక్తి వేరు, వ్యక్తిగత విజయాలు వేరు. చాలా సందర్భాలలో రెండింటికీ పొంతన ఉండదు. వ్యక్తులకి అంత కమిట్ మెంటూ ఉండదు.