ఢిల్లీ వీధుల్లో మగమృగాలు, మరణశయ్యపై గ్యాంగ్ రేప్ బాధితురాలు


అత్యాచారంపై జె.ఎన్.యు విద్యార్ధుల నిరసన

అత్యాచారంపై జె.ఎన్.యు విద్యార్ధుల నిరసన

దేశ చరిత్రను ఆడపిల్లల కన్నీళ్లతో రాయవలసిన దుర్దినాలు వర్ధిల్లుతున్నాయి. ఒక్కో మానభంగం ఒక్కో కొత్త అధ్యాయానికి అర్హత పొందుతూ పశుత్వ ప్రదర్శనలో కొత్త రికార్దులు సృష్టిస్తున్నాయి. దేశరాజధానే అందుకు నిరంతరవేదికగా మారిపోయింది. 23 సంవత్సరాల పారమెడికల్ విద్యార్ధిని ఢిల్లీలో కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన దారుణం సభ్యసమాజం శాశ్వత వంధత్వం కోరుకునేదిగా ఉంది. మగ మృగాల పశుత్వాన్ని ప్రతిఘటించినందుకు పొత్తికడుపులో పిడి గుద్దులు ఎదుర్కొని పేగులు చితికిపోయి చావుబతుకుల మధ్య ఒక ఆడపిల్ల కొట్టుమిట్టాడుతోంది. ఆమెను కాపాడవచ్చిన బాయ్ ఫ్రెండ్ ను ఇనుపరాడ్లతో బాదడంతో అతనికీ గాయాలయ్యాయి. ఆడపిల్లలపై అత్యాచారాలు దేశానికి కొత్తయినట్లు పార్లమెంటులో గౌరవనీయమైన ప్రజాప్రతినిధులు ఇంకోసారి కొత్తగా గుండెలు బాదుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి రోజువారీ విచారణ చేసి దోషులను శిక్షిస్తామని కేంద్ర హోమ్ మంత్రి వారికి గట్టి హామీ ఇచ్చాడు. అధికారం, డబ్బుల అండ లేనట్లు కనిపిస్తున్న నిందితులకు శిక్ష అపుడే ఖరారయినట్లు కనిపిస్తోంది.

ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ ప్రకారం “అమ్మాయి పరిస్ధితి చాలా సీరియస్ గా ఉంది.” కానీ నిన్నటి (సోమవారం) కంటే కొంత మెరుగు. “నిన్నటికంటే ఈ రోజు ఆమె పరిస్ధితి కొంత మెరుగ్గా ఉంది. ఆమె చేతనస్ధాయి (conscious level) నిన్నటి కంటే చాలా మెరుగయింది. ఆదివారం ఆమెకు సర్జరీ చేశాము” అని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. బి.డి.అధాని చెప్పాడని ‘ది హిందూ’ తెలిపింది. అయితే మంగళవారం సాయంత్రానికి అమ్మాయి పరిస్ధితి విషమించింది. పూర్తిగా వెంటిలేటర్ సహాయంతో ఊపిరి తీసుకుంటోంది. డాక్టర్లు అనుక్షణం ఆమెను పరిశీలిస్తున్నారు.

బస్సు డ్రైవర్ రామ్ సింగ్, అతని సోదరుడు ముకేష్, జిమ్ ఇనస్ట్రక్టర్ వినయ్ శర్మ, పళ్లవ్యాపారి పవన్ గుప్త లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కమిషనర్ ప్రకారం రామ్ సింగ్, శర్మ, గుప్తలను ఢిల్లీలోనే అరెస్టు చేయగా ముకేష్ ను రాజస్ధాన్ లో అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఆయన విలేఖరులకు తెలిపాడు. కానీ ముగ్గురు పరారీలో ఉన్నారని ఆయన కోర్టులో చెప్పాడు. మిగిలినవారిని పట్టుకోవడానికి బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్ధాన్ లకు పోలీసు బృందాలను పంపినట్లు తెలుస్తోంది. మొత్తం ఏడుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీస్ కమిషనర్ కోర్టు సాక్ష్యం ద్వారా స్పష్టం అవుతోంది.

“రామ్ సింగ్ ఆ రాత్రి బస్సు నడపడం లేదు. బస్సు ద్వారక వెళ్తోందని అరిచి చెబుతూ అతను ఈ జంటను బస్సులోకి ఆహ్వానించాడు. బస్సు కదిలాక వారు అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆమె స్నేహితుడు వారి ప్రవర్తనకు అభ్యంతరం చెబుతూ అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నించాడు. దానితో అతన్ని తీవ్రంగా కొట్టారు. అబ్బాయిని కొడుతున్నపుడు అతన్ని కాపాడడానికి అమ్మాయి ప్రయత్నించింది” అని పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ విలేఖరులకు చెప్పాడు. బస్సుని ముకేష్ నడుపుతుండగా సింగ్, ఇతరులు అమ్మాయిని బస్సు వెనక్కి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారని ఆయన తెలిపాడు.

బస్సు వాస్తవానికి ఒక స్కూల్ బస్. డ్రైవర్ రామ్ సింగ్ ఆదివారం బస్సును చట్టవిరుద్ధంగా వ్యాపారం కోసం వాడుకున్నాడు. కమిషనర్ ప్రకారం సంఘటనల వరుస క్రమం ఇలా ఉంది. ఆర్.కె.పురం నుండి ఐ.ఐ.టి గేట్ దాకా తీసుకెళ్తామని చెప్పి రామాధర్ అనే కార్పెంటర్ ని బస్సులో ఎక్కించుకున్న నిందితులు 8:30 PM ప్రాంతంలో మునిర్కా చేరుకోకముందు అతన్ని దోచుకుని బైటికి గెంటేశారు. మునిర్కాలో ప్రయాణీకుల బస్సని, ద్వారక వెళ్తుందని చెబుతూ బాధిత జంటను వారు ఎక్కించుకున్నారు.

రాత్రిపూట ఆ సమయంలో ఎందుకు ప్రయాణిస్తున్నారంటూ ఇంజనీర్, మెడికోల జంటను నిందితులు ప్రశ్నించారు. ఏం చేయబోతున్నారని నర్మగర్భంగా ప్రశ్నించారు. అమ్మాయి స్నేహితుడు అది వారికి అనవసరం అని చెప్పి ఊరుకున్నాడు. ఆ సమాధానం వారికి నచ్చలేదు. అతన్ని అక్కడే కొట్టడం మొదలుపెట్టారు. అతని తలపై మోదుతూ కొడుతుండడంతో అమ్మాయి వారికి అడ్డువెళ్లింది. దానితో ఆమెను కూడా కొట్టారు. ఆమెను బస్సు వెనక్కి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రకారం ఆమెను పొత్తికడుపుపై పదే పదే పిడిగుద్దులు కురిపించడంతో ఆమె పేగులు చితికిపోయాయి. పేగులకు ఎంత తీవ్రంగా గాయం అయిందంటే పేగులోని కొంత భాగాన్ని డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు. ఆమె ఒంటిపై గాయాన్ని బట్టి ఇనుప రాడ్ ను ఆమె మర్మావయవంలో చొప్పించినట్లు అనుమానిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు.

అబ్బాయిని చితకబాది, అమ్మాయిని అత్యాచారం చేశాక ఇద్దరి బట్టలను ఊడదీసి బైటికి విసిరేశారు. అతను గొంతు పేగుల్చుకుని సాయం కోసం కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు గమనించి పోలీసులకు ఫోన్ చేశారు. అప్పటికే అమ్మాయి స్పృహ కోల్పోయింది. విపరీతంగా రక్తస్రావం అవుతోంది. వారిని ఆసుపత్రిలోకి చేర్చాక ఉదయం ఒంటిగంట ప్రాంతంలో అతను పోలీసుల వద్ద ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేశాడు.

ఇద్దరినీ బైటికి విసిరేశాక రామ్ సింగ్ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. గ్యాంగ్ లోని ఇతర సభ్యులను వారి వారి ఇళ్లవద్ద దింపి నోయిడాలోని ఓనర్ ఇంటివద్ద బస్సును పార్క్ చేశాడు. సాక్ష్యాలను మాయం చెయ్యడానికి బస్సుని శుభ్రంగా కడిగాడు. తర్వాతరోజు సోమవారం రామ్ సింగ్ బస్సుని యధావిధిగా ఆర్.కె.పురం వద్దకి తీసుకెళ్ళాడు. అక్కడ బస్సుకోసం ఎదురు చూస్తున్న పోలీసులకి చిక్కాడు. “బస్సుని శుభ్రం చేశారు. కానీ మాకు సరిపోయినంత ఫోరెన్సిక్ సాక్ష్యాలు దొరికాయి. గోళ్ళ రక్కుడు, డి.ఎన్.ఎ, వెంట్రుకలు ఇంకా అలాంటివి చాలా దొరికాయి” అని కమిషనర్ తెలిపాడు. సోమవారం నిందితులంతా తమ రోజువారీ రొటీన్ లో పడిపోయారని ఆయన తెలిపాడు.

పోలీసుల ప్రకారం బస్సును త్వరగా కనిపెట్టడం వల్లనే నిందితులు కూడా త్వరగా దొరికిపోయారు. అమ్మాయి స్నేహితుడు బస్సు గురించిన కరెక్ట్ సమాచారం ఇవ్వడం వల్లనే బస్సుని త్వరగా కనిపెట్టామని పోలీసులు చెప్పారు. “వాహనం తెల్లరంగులో ఉందని అతను చెప్పాడు. బస్సుపైన యాదవ్ అని ఉందని చెప్పాడు. అది లగ్జరీ బస్సు లాంటిది” అని కమిషనర్ చెప్పాడు. బాధితురాలి స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు బస్సును కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రవాణా విభాగం సమాహాయంతో తెల్ల బస్సులు 370 వరకూ కనుగొన్నారు. తర్వాత యాదవ్ అనే ఇంటిపేరుతో ఉన్న యాజమానుల వివరాలను సేకరించారు. యాదవ్ పేరుతో ఇద్దరే యజమానులు ఉన్నారు.

“మేము మొదటి వ్యక్తి వద్దకు వెళ్ళినపుడు తన బస్సు కాదని చెప్పాడు. ఆ తర్వాత దినేష్ యాదవ్ వద్దకి వెళ్లాము. ఈ పని తన డ్రైవరే చేసి ఉంటాడని ఆయన చెప్పాడు” అని కమిషనర్ చెప్పాడు. సోమవారం మధ్యాహ్నానికి ఆర్.కె.పురం లోని సెక్టార్ 3 లో బస్సు దొరికింది. ఫోరెన్సిక్ సాక్ష్యాల ద్వారా బస్సు అదేనని పోలీసులు రూఢి చేసుకున్నారు. బస్సుకి ఉన్న ముందు గేటు ద్వారా బాధితులను బైటికి తోసినట్లు ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా తెలిసిందని వారు చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలోనే ఇంత ఘోరమైన  అత్యాచారం జరగడం ఏమిటని ఇరు సభల్లో గౌరవ సభ్యులు ఆందోళన ప్రకటించారు. ‘రేప్ ల రాజధాని’గా ఢిల్లీ ఇప్పటికే పేరు పొందిన సంగతి వీరు మరిచిపోయారు. స్త్రీలపై అత్యాచారాలు దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న సంగతిని కూడా వీరు మరిచిపోయారు. ఢిల్లీలో అత్యాచారాలు ఆపడానికని చెబుతూ కొన్ని చర్యలను కేంద్ర హోమ్మంత్రి రాజ్యసభలో ప్రకటించాడు. ఈ చర్యలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే వారి హామీల్లోని డొల్లతనమ్ ఆ హామీలే చెబుతున్నాయి.

బి.పి.ఒ (బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్ సోర్సింగ్) పరిశ్రమలో పనిచేసే అమ్మాయిల కోసం కొత్త బస్సులను చేస్తారట. బి.పి.ఒ అమ్మాయిలని ఇకనుండి వారి ఇళ్ల గేట్ల వద్దనే దింపే ఏర్పాటు చేస్తారట. బి.పి.ఒ అమ్మాయిలు ప్రయాణించే రూట్లలో మరిన్ని పోలీసు సెక్యూరిటీ వహానాలను తిప్పుతారట. ఈ చర్యలపట్ల విద్యార్ధులు, మహిళలు ఇప్పటికే పెదవి విరిచేశారు. అత్యాచారానికి గురయిన అమ్మాయి బి.పి.ఒ కి చెందిన అమ్మాయే కాదు. కానీ హోమ్ మంత్రి ప్రకటన అంతా బి.పి.ఒ అమ్మాయిల రక్షణ చుట్టే తిరిగింది. రాజధానే కాక, దేశంలోని అన్నీ ప్రాంతాల్లోనూ మహిళల రక్షణ లేదన్న సంగతి హోమ్ మంత్రి ప్రకటన విస్మరించింది. మొత్తం పురుషాధిక్య వ్యవస్ధలోనే సమస్యకు మూలం ఉన్న సంగతిని పక్కకునెట్టి బి.పి.ఒ అమ్మాయిల సమస్య స్ధాయికి ఒక వ్యవస్ధాగత సమస్యను కుదించివేయడానికి దేశ హోమ్ మంత్రి ప్రయత్నం చేశాడు.

పాలక పక్షాన్ని ఇంకోసారి ఇరుకున పెట్టే సమస్యగా ప్రతిపక్షాలకు ఢిల్లీ సంఘటన అక్కరకు వచ్చింది. పార్టీలన్నీ ఉమ్మడిగా సభలో ఘటనపై ఆందోళన, నిరసన వ్యక్తం చెయ్యడం ఒక విధంగా సానుకూల పరిణామమే కావచ్చు. సభలో చర్చ జరగడం వలన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నెలకొల్పడానికి ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దానివల్ల నిందితులకు త్వరలో శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కానీ స్త్రీలపై అత్యాచారాల సమస్య వ్యక్తిగతమైనదో, ఒకే కేసుకో పరిమితమైన ఐసోలేటేడ్ సమస్యో కాదనీ అంతకంటే పెద్దదయిన వ్యవస్ధాగత మౌలిక సమస్య ఇదనీ మంత్రులకూ, పార్లమెంటు సభ్యులకూ తెలియనిదేమీ కాదు. రేపిస్టులకు ఉరిశిక్షలు వేయాలనీ, శిక్షలు పెంచాలనీ, రేప్ ని హత్యాప్రయత్నంతో సమానంగా చూడాలనీ పార్లమెంటు సభ్యులు చెబుతూ సభలో ఆవేశకావేశాలు ప్రదర్శించేబదులు స్త్రీ, పురుషుల మధ్య ఆర్ధిక అంతరాలు తొలగించేలా వ్యవస్ధను పునర్నిర్మించగలిగితే స్త్రీలోకానికే కాక మొత్తం సమాజానికే ఉపయోగం. మొత్తం సభ్యుల్లో 7 శాతం కూడా మహిళలులేని పార్లమెంటు అందుకు పూనుకోవడం అసాధ్యం. మహిళలకు పార్లమెంటులో కేవలం 33 శాతం రిజర్వేషన్ ఇచ్చే బిల్లుకే గతిలేదు. ఇక ఆర్ధిక సమానత్వం కలలోని మాట!

సైకో పాత్ లు తప్ప ఇంత ఘోరమైన హింసాత్మక అత్యాచారానికి పాల్పడరని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. ‘మగాడి తర్వాతే ఆడది’ అంటూ అన్నిచోట్లా బోధించే సమాజంలో శారీరకంగా బలంలేని ఒక ఆడపిల్ల బుద్ధిగా మగాడి ఆధిపత్యానికి లొంగడంమాని సాధ్యమైనంత గట్టిగా ప్రతిఘటించినపుడు సైకోపాత్ లు తేలిగ్గానే పుట్టుకొస్తారని డాక్టర్లకు ఎపుడు తెలుస్తుంది? మగాడి సామాజిక స్ధాయి అండగా ఉంటే వారి తరపు ఆడవారికి కూడా ఆధిపత్యం వచ్చినట్లుగానే, తిరగబడే ఆడపిల్లకి తోడువెళ్తే మగాడైనా శిక్షార్హుడే. ఆ క్షణంలో మగాధిపత్యం గెలిచి తీరాలి, ఆడ బానిసత్వం రుజువు కావాలి! అందుకే ఢిల్లీ బస్సునుండి బాధితురాలితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా వివస్త్రలుగా రోడ్డు మీదికి విసిరివేయబడ్డాడు. మగాడిపై ఆధిపత్యం రుజువు చేసుకోవలసిన అవసరం వస్తే అతన్ని కొడతారు, హింసిస్తారు. అదే ఆడదానిపై కోపం తీర్చుకోదలిస్తే, ఆమెపై ఆధిపత్యం రుజువు చేసుకోవలసి వస్తే కొట్టడంతోనే అది ఆగదు. మానభంగం జరుగుతుంది. అందుకే “A Rape is more about power and domination than sex.” ఈ నిజం తెలియకపోతే మానభంగాలకు పరిష్కారం ఆడవారి దుస్తుల్లోనూ, ఆడవారి ప్రవర్తనలోనూ, నిందితులకు శిక్షలు విధించడంలోనూ చూడడం కొనసాగుతుంది.

7 thoughts on “ఢిల్లీ వీధుల్లో మగమృగాలు, మరణశయ్యపై గ్యాంగ్ రేప్ బాధితురాలు

 1. ఈ సంఘటన అమానుషం , పాశవికం ! కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ అభాగ్య యువతి తన తల్లి తో ” అమ్మ నాకు బ్రతకాలని ఉంది ” అన్నది ! ఇది హృదయ విదారకరం
  వేగం గా పోయే బస్సులోనుంచి క్రిందకు తోస్తే ప్రాణాలు పోతాయనుకున్న ఈ పాశావికుల అంచనాలను వమ్ము చేస్తూ ,తీవ్రం గా గాయ పడిన ఆ యువతి ‘ప్రియుడు ‘ ఇచ్చిన ఆధారాల సాయం తో పట్టుకోవడం జరిగింది, నిందితులను ! తమను ఎవరూ పట్టుకోలేరని , ఎంత ధైర్యం , ఆత్మ విశ్వాసం ఉండి ఇట్లాంటి హీనమైన పనులు చేయ గలుగుతున్నారు వీళ్ళు , అందులో దేశ రాజధాని లో ! ఇక మిగతా దేశం లో సంగతి ?!!!

 2. ఈ దుర్ఘటనకు సంబంధించి అన్ని కోణాలనూ స్పృశిస్తూ రాశారు. ‘మాన భంగం’ అనే మాటకు బదులు (శారీరక) అత్యాచారం అని రాసివుంటేనే బాగుండేది.

  సైకోపాత్ లు పెచ్చరిల్లే వ్యవస్థ మూల కారణాలనూ, అంతరాలనూ పట్టించుకుని తీరాలి. లేకపోతే సరైన పరిష్కారం సుదూరమే. దీన్నొక stray incident గా భావిస్తూ దోషులకు ఉరిశిక్షలు వేయాలనే ఆవేశాలు కొద్దిరోజుల్లోనే పాలపొంగులా చల్లారిపోతాయి. దోషులకు మరణశిక్ష అనే పరిష్కారం బాధితుల ప్రాణాలకే ముప్పు..

 3. వేణు గారూ,

  ‘మానభంగం’ ‘అత్యాచారం’ ఈ రెండు పదాలు ఒకే అర్ధాన్ని ఇవ్వనందున ఒకోసారి తప్పదేమో అన్న అవగాహనతో ‘మానభంగం’ అని రాశాను.

  అత్యాచారం అన్న పదం ఇతర నేరాలకు కూడా వర్తించే సాధారణ పదం. అది అమ్మాయిలపై/స్త్రీలపై మాత్రమే జరిగేది కాదని నాకనిపిస్తుంది. బహుశా లైంగిక అత్యాచారం అంటే సరిపోతుందేమో.

  రేప్ అని రాయకుండా ఉండడానికి ప్రయత్నించాను. కానీ టైటిల్ పెద్దది కాకుండా అదే సమయంలో ఆర్టికల్ సారాంశాన్ని సాధ్యమైనంతగా తెలిపేదిగానూ, జరిగిన ఘోరాన్ని తెలిపేదిగానూ ఉండాలంటే ‘గ్యాంగ్ రేప్’ అని రాయక తప్పింది కాదు.

 4. మీకు డిల్లి కల్చర్ గురించి పెద్దగా తెలిసినట్లు తెలుస్తున్నాది. మీరు ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో డిల్లి ని సందర్శించారా? డిల్లి గత కొన్ని సం|| విపరీతం గా అభివృద్ది చెందింది. అక్కడ మధ్య తరగతివర్గం దగ్గర రియల్ ఎస్టేట్ బూం వలన విపరీతంగా డబ్బులు వచ్చి చేరాయి. వాళ్ళు కారు లేకుండా ఎవరు తిరగరు. డిల్లి సంస్కృతిని మనదేశం లో ఇతర ప్రాంతాల సంస్కృతితో పోలికేలేదు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వలసలు విపరీతంగా పెరిగాయి. నార్త్ ఇండియాలో బీహార్,యు పి, రాజస్తాన్,బెంగాల్,హిమాచల్ ప్రదేశ్ మొద|| ప్రాంతాల నుంచి కనీస చదువు సంధ్యా లేని వారు ఇబ్బడి ముబ్బడి గా డిల్లి కీ రోజు చేరుతుంటారు. కొంతమంద్ని పగలు రాత్రి కాల్ సెంటర్ల వాహనాలను తోలుతూంటారు. రోజుకి కనీసం 14 గం|| ఆగకుండా పనిచేస్తూంటారు. వాళ్ళకొచ్చే జీతం చాలి చాలనిది. వాళ్లు ఉండే ఇళ్లను ఊహించలేం. ఇక అదే సమయంలో డిల్లి లో ఉన్న సంపద ప్రదర్శన మిగాతా సిటిలతో పోలిస్తే చాలా ఎక్కువ. అక్కడ జరిగే పార్టిలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఒక వైపు తీవ్ర దరిద్రం, మరోక వైపు విపరీతమైన సంపదా పోగుపడటం వలన మధ్య తరగతి ప్రజలు కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా ఉన్నవారిలాగా నటిస్తూ, వచ్చిన డబ్బులన్నిటిని ఖర్చు చేస్తూ జీవిస్తూంటారు. ఈ రోజుల్లో వ్యభిచారం అనేది అక్కడ చాలా సాధారణం అయిపోయింది. అది కూడా చదువుకొనే వారు చేస్తున్నారు. విలువలు తక్కువ విలాసాలు ఎక్కువ. అది డిల్లి జీవితం.

  అడుగడుగునా విలువలు లేని చోట క్లీనర్లు,డ్రైవర్ల పని చేసుకొనే వారినుంచి ఉన్నత ప్రవర్తన ఎలా ఆశిస్తాం? ఒకరిద్దరు సైకాలజి బాగా లేని వాళ్ళు ఇటువంటి పని చేస్తే, మిగతావారు కూడా అవకాశం వచ్చింది కదా! అని రెచ్చిపోయారేమో అని అనిపిస్తుంది. మనదేశం లో పల్లెలు,వ్యవసాయం నాశనం చేస్తూ వలసలు ప్రోత్సహించే ప్రభుత్వం దాని వలన జరిగే ఇతర సంఘటనలను ఊహించలేకపోతున్నాదని అర్థమౌతుంది. మనదేశం లో ప్రతి రాజకీయపార్టి వారు వలసల పైన అవగాహన ఏర్పరచుకోవాలి. కనీసం ఇక నైనా ముందు జాగ్రత్తలు తీసుకొంటే ఇటువంటిసంఘటనలు జరగవు. ఆమధ్య హైదరాబాద్ లో మా దూరపు బంధుల లో ఒక మహిళను పీక కోసి చంపటం జరిగింది. చంపినవాడు బంగారం నగలు తీసుకొని ఉడాయించాడు. పోలిసుల యంక్వైరి లో తేలిందేమిటంటే వాడు పక్కన అపార్ట్ మెంట్ లో ఇల్లు కట్టే కూలి పనికి వచ్చి , ఈమే ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు దూరి, ఆమేను చంపి బాంబే కి ఉడాయించాడు.

  వలసల మీద ఒక ప్రభుత్వం చర్చలు జరపాలి, ప్రజలను చైతన్య పరచాలి.
  http://www.thesundayindian.com/te/story/sex-is-a-candy/7/699

 5. ఆ కూలివాడు బీహార్ కి చెందినవాడు. పక్కన అపార్ట్ మెంట్ కడుతూంటే సాధరణం గా అక్కడ పని చేసే కూలివారి వ్యక్తిగత వివరాలను పట్టించుకోము. 20మంది కూలివాళ్ళు అక్కడ పనిచేస్తున్నామౌ కొంటారేగాని. వాడు ఏ వూరివాడు? ఎటువంటి అలవాట్లు ఉన్నాయి? అంట్టూ గుణగణాలు ఆరాతీయం కదా! అదే కూలి వాడు, ఇమే భర్త రోజు ఎన్ని గంటలకు ఆఫీసుకు పోతారు, ఏ సమయం లో వంటరిగా ఉంట్టుంది అన్నిటిని అక్కడ పనిచేస్తూ గమనించి సందుచూసుకొని బంగారం దొంగతనం చేయటమే కాక, ఆమేను చంపన అవసరం లేకపోయినా చంపిపోయాడు. మనుషుల ప్రవర్తన చాలా ఊహించని విధంగా మారుతున్నాది. అది గమనించాలి.

 6. అత్యాచారం అనే మాట ఇలాంటి సందర్భాలలో సరిపోయే పదం. ఆంధ్రప్రదేశ్‍లోని మహిళా సంఘాలు కూడా ఇవే పదాన్ని ఉపయోగిస్తున్నాయి.

 7. రేప్‌లని వ్యతిరేకించే విషయంలో మోసపూరితమైన భావనలు ఉన్నాయి. ఈ మధ్య ప్రతి వాడూ రేప్ చేసినవాళ్ళకి మరణ శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నాడు. రేప్ అనేది హత్యతో సమానమైతే డేటింగ్ అనేది ఆత్మహత్యతో సమానం అవుతుంది కదా. అటువంటప్పుడు డేటింగ్ చేసినవాళ్ళని ఆత్మహత్యాయత్నం కేస్ కింద ఎందుకు అరెస్ట్ చెయ్యకూడదు? నేనేమీ రేప్‌లని సమర్థించడం లేదు. పది నిముషాల సెక్స్ సుఖం కోసం ఒక అమ్మాయిని రేప్ చేసి, ఆమె తమ మీద కంప్లెయింట్ ఇవ్వకుండా చెయ్యడానికి ఆమెని హత్య చేసేవాళ్ళని చూస్తే చిన్నప్పుడు తాగిన పాలు కూడా కక్కేంత వికారం పుడుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఢిల్లీలో ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డేటింగ్ చేసి తిరిగొస్తుండగా రేప్ జరిగింది. ఆ అమ్మాయి డేటింగ్ చెయ్యడం తప్పని ఆందోళనకారులు ఎవరూ అనుకోలేదు కానీ రేప్‌ని మాత్రం హత్యతో సమానమైన నేరంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. నేనేమీ ఆ అమ్మాయిపై జరిగిన రేప్‌ని సమర్థించడం లేదు. రేప్ చెయ్యడం తప్పైనప్పుడు వీధి వ్యభిచారిని రేప్ చెయ్యడం కూడా తప్పే అవుతుంది. కానీ అమ్మాయిలు తమకి డేటింగ్ చేసే హక్కు ఉందనీ, తమని రేప్ చేసే హక్కు మాత్రం మగవాళ్ళకి లేదనీ అంటే మగవాళ్ళు అర్థం చేసుకోరు. డేటింగ్ చెయ్యడం తప్పు కాదు అనే భావన ఉన్నప్పుడు “నువ్వు వాడితో కలిసి పది రోజులు డేటింగ్ చేశావు, నువ్వు నాకు పది నిముషాలు సెక్స్ సుఖం ఇవ్వలేవా” అని అడుగుతూ ఒక మగవాడు ఒక ఆడదాన్ని రేప్ చెయ్యడని గ్యారంటీ లేదు. ప్రతి మగవాడూ ఒక ఆడదానితో డేటింగ్ చెయ్యాలని అనుకుంటాడు,. కానీ ఇంకొకడితో డేటింగ్ చేసిన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి ఏ మగవాడూ ఒప్పుకోడు. డేటింగ్‌కి సామాజిక ఆమోదం ఉన్నా, లేకపోయినా డేటింగ్ చేసిన స్త్రీలని పెళ్ళి చేసుకోవడానికి మగవాళ్ళు ఒప్పుకోరు. ఒకప్పుడు నేను డేటింగ్‌ని సమర్థించేవాణ్ణి. కానీ నాగరాజారావు అనే ఆయన వ్రాసిన ఒక వ్యాఖ్య చదివిన తరువాత నా అభిప్రాయం మారిపోయింది. ఆయన ఓ సారి ఇలా అన్నారు “ప్రతి మగవానికీ ఒక అమ్మాయితో తిరగాలని ఉంటుంది. కానీ తనతో కలిసి తిరిగిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఏ మగవాడూ ఒప్పుకోడు” అని. ఈ వ్యాఖ్యే నన్ను బాగా ఆలోచింపచేసింది. అప్పటి నుంచీ నాకు స్త్రీ-పురుష సంబంధాల గురించి మాట్లాడిన ప్రతి సారీ భయం వేస్తోంది “మనం ఎటర్నల్‌గా ఇటువంటి భావజాలపరమైన వెనుకబాటుతనంలోనే ఉండిపోతామా?” అని. ఈ డేటింగ్‌లూ, పెళ్ళి లేని సహజీవనాల కంటే పెళ్ళి చేసుకోవడమే ఎంతో మేలు అనిపిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s