మధ్యప్రాచ్యం: టర్కీకి అమెరికన్ పేట్రియాట్, సిరియాకి రష్యన్ ఇస్కందర్


ఇస్కందర్ క్షిపణి

ఇస్కందర్ క్షిపణి

మధ్యప్రాచ్యం (Middle-East) లో ఉద్రిక్తతలు ప్రమాదకరమైన స్ధితికి చేరుతున్నాయి. సిరియాలో కిరాయి తిరుగుబాటుని రెచ్చగొడుతూ ముస్లిం టెర్రరిస్టులను ప్రవేశపెడుతున్న టర్కీకి అమెరికా పేట్రియాట్ క్షిపణులను సరఫరా చేసినందుకుగాను రష్యా ప్రతిచర్యలు చేపట్టింది. అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న క్షిపణి రక్షణ వ్యవస్ధ (Missile Defence System) కి కూడా దొరకని అత్యంత అధునాతనమైన ‘ఇస్కందర్’ క్షిపణులను సిరియాకి సఫరా చేసింది. టర్కీ కోరికపై పేట్రియాట్ క్షిపణులను అమెరికా సరఫరా చేశాక ‘అతి చేయవద్దంటూ’ టర్కీని రష్యా హెచ్చరించిన మరుసటి దినమే ఇస్కందర్ క్షిపణులు సిరియా గడ్డపై కాలు మోపాయి.

టర్కీకి పేట్రియాటిక్ మిసైళ్ళు అందించడానికి నాటో అంగీకరించిన కొన్ని గంటల్లోనే ఇస్కందర్ మిసైళ్ళను రష్యా అందజేసినట్లు తెలుస్తోంది. సుపీరియర్ క్వాలిటీ కలిగిన క్షిపణులుగా భావించే ఇస్కందర్ లు సెకనుకు 1.3 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయనీ, 280 మైళ్ళ లోపు లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలవనీ డిఫెన్స్ పత్రికలు చెబుతాయి. పరిస్ధితిని మరింతగా క్షీణింపజేయవద్దని రష్యా టర్కీ దేశాన్ని హెచ్చరించిందని ‘ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్’ కి చెందిన మీడియా సంస్ధ మాష్రెఘ్ ని ఉటంకిస్తూ ‘గ్లోబల్ రీసెర్చ్’ తెలిపింది. అయితే పేట్రియాటిక్ క్షిపణులు సరఫరా చేయాలని టర్కీ నాటోని కోరడంతో రష్యా ‘ఇస్కందర్’ క్షిపణులను సిరియాకు అందజేసింది. సిరియా రేవు పట్టణం టార్టస్ లో మకాం వేసి ఉన్న రష్యా యుద్ధ నావలు ఇస్కందర్ క్షిపణులను సిరియా భూభాగంపై దించినట్లు తెలుస్తున్నది.

ఉపరితలం నుండి ఉపరితలం మీదికి ప్రయోగించే ఇస్కందర్ క్షిపణి ఇప్పటివరకూ అభివృద్ధి అయిన ‘క్షిపణి రక్షణ వ్యవస్ధలు’ వేటికీ దొరకదనీ, ఇతర క్షిపణులు దానిని నాశనం చెయ్యలేవనీ మాష్రెఘ్ వార్తా సంస్ధ తెలిపింది. యూరప్ రక్షణ కోసం ‘క్షిపణి రక్షణ వ్యవస్ధ’ ను నిర్మిస్తానని అమెరికా కొద్ది నెలల క్రితం ప్రకటించినప్పుడు రష్యా తీవ్రంగా ప్రతిస్పందించింది. యూరప్ రక్షణ పేరుతో తమ రక్షణకు భంగం కలిగిస్తే సహించేది లేదనీ, ముఖ్యంగా పోలాండ్ లో క్షిపణి రక్షణ వ్యవస్ధను నెలకొల్పవద్దనీ రష్యా అమెరికాను హెచ్చరించింది. పోలండ్ లో క్షిపణి రక్షణ వ్యవస్ధను నెలకొల్పితే దగ్గరలో బాల్టిక్ సముద్రంలో తాను ఇస్కందర్ క్షిపణులను నెలకొల్పాల్సి ఉంటుందనీ రష్యా హెచ్చరించింది. అలాంటి ఇస్కందర్ క్షిపణులను సిరియాకు సరఫరా చేయడాన్ని బట్టి రష్యా సిరియా రక్షణకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదీ అర్ధం చేసుకోవచ్చు.

రష్యా స్పందనకు తీవ్ర కారణాలే ఉన్నాయి. సిరియాలో ప్రత్యక్ష సైనిక జోక్యం చేసుకునే వైపుగా అమెరికా నేతృత్వంలో నాటో ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో రష్యా దానికి తగిన విధంగా స్పందిస్తున్నది. సిరియాతో ప్రత్యక్ష యుద్ధానికి నాటో సిద్ధం అవుతున్నదని సూచిస్తూ నాటో దేశాల అధికారులు వివిధ స్ధాయిల్లో ప్రకటనలు చేశారు. ప్రత్యక్ష యుద్ధానికి సిరియా రసాయన ఆయుధాలను సాకుగా నాటో సిద్ధం చేస్తున్నది. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ వద్ద సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి దాడిచేసినట్లుగానే సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ వద్ద రసాయన ఆయుధాలు ఉన్నాయనీ చెప్పి దాడి చేసేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తున్నది.

పేట్రియాట్ మిసైల్

పేట్రియాట్ మిసైల్

అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా ఈ మేరకు గట్టి సూచనలు ఇచ్చాడు. “సిరియా పాలకులు రసాయన ఆయుధాలు ఉపయోగించడానికి సిద్ధపడి ఉన్న స్ధితిలో మేము కేవలం ఆందోళన చెందుతూ కూర్చోము… అస్సాడ్ ఈ రసాయనాయుధాలను తన ప్రజలపైనే ప్రయోగించే ఘోర తప్పిడానికి పాల్పడితే దానికి తగిన పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే స్పష్టం చేశాడు” అని లియోన్ పెనెట్టా అన్నాడు. అయితే అస్సాద్ పై చేసిన ఆరోపణకు పెనెట్టా సాక్ష్యాలేవీ ఇవ్వలేదు. పైగా అందుకు విరుద్ధంగా సిరియా అధికారులు అనేకసార్లు ప్రకటించారు కూడా.

డిసెంబర్ 7 తేదీన సిరియా ఉప విదేశీ మంత్రి ఫైసల్ మిక్దాద్ ఇలా ప్రకటించాడు “సిరియా పదోసారి, వందోసారి నొక్కి చెబుతోంది. మా వద్ద అలాంటి ఆయుధాలు ఉన్నట్లయితే వాటిని ప్రజలపై ప్రయోగించబోము. మేము ఆత్మహత్యకు పాల్పడబోము.” ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ తో పాటు గడాఫీ, తాలిబాన్ ఇంకా అనేక ఇతర అమెరికా శత్రువులపై కూడా ఇలాగే అబద్ధాలు ప్రచారం చేసి యుద్ధాలు రుద్దిన చరిత్ర అమెరికాది. అమెరికా అబద్ధాలను సృష్టించి వదిలితే దానిని చిలవలు పలవలు చేసి ప్రచారం చేయడం పశ్చిమ కార్పొరేట్ పత్రికల వంతు. సిరియా యుద్ధం కోసం అమెరికా పాలకులు తమ ప్రజలను కూడా అభూత కల్పనలతో సిద్ధం చేస్తున్నారు. తప్పుడు హెడ్ లైన్లతో ఉనికిలోలేని భయాలను అమెరికన్ల మెదళ్ళలోకి చొప్పిస్తున్నారు.

డిసెంబర్ లోనే ఐరాస సిరియానుండి తమ సిబ్బందిని వెనక్కి పిలిపించింది. సిరియాలో ఘర్షణలు తీవ్రం కావడాన్ని కారణంగా చెబుతూ కొద్దిమంది మినహా అందరినీ ఉపసంహరిస్తున్నట్లు ఐరాస ప్రకటించింది. తద్వారా త్వరలోనే మిలటరీ జోక్యం తధ్యమన్న సూచనను ఐరాస చేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెంటగాన్ ప్రతినిధి సిరియాపై దాడికి సిద్ధం అవుతున్నామని చెప్పినట్లు సి.ఎన్.ఎన్ వార్తా సంస్ధ డిసెంబర్ 6 న తెలిపింది. “పూర్తిస్ధాయి బలగాల మోహరింపుకు మేము తయారుగా ఉన్నాం” అని పెంటగాన్ ప్రతినిధి లిటిల్ చెప్పాడని సి.ఎన్.ఎన్ తెలిపింది. తగిన ఆదేశాలు వస్తే పూర్తిస్ధాయి యుద్ధానికి తగిన పేలుడు సామాగ్రి ఆ ప్రాంతంలో మావద్ద సిద్ధంగానే ఉందని కూడా లిటిల్ చెప్పాడు. 10,000 దాడి బలగాలు, 70 ఫైటర్ బాంబర్లు, 17కి పైగా యుద్ధ నౌకలు, పేట్రియాట్ మిసైళ్ళు (జర్మనీ, నెదర్లాండ్స్ కూడా టర్కీకి పేట్రియాటిక్ మిసైళ్ళు ఇస్తున్నామని ప్రకటించాయి), హై ఆల్టిట్యూడ్ రక్షణ వ్యవస్ధ మొదలయిన బలగాలు సిద్ధంగా ఉన్నాయని పెంటగాన్ తెలిపింది.

అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ కూడా మిలట్రీ ఘర్షణ రానున్నదని పరోక్షంగా సూచిస్తున్నది. సంబంధిత పక్షాలన్నీ సిరియా ఘర్షణ పరిష్కారానికి తగిన ప్రయత్నాలను తీవ్రం చేయాలని ఆమె డిసెంబర్ 7న ప్రకటించింది. ఫ్రాన్సు కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఫ్రెంచి మిలట్రీ సలహాదారులు సిరియాలో తిరుగుబాటుదారులను స్వయంగా కలిసినట్లు ఫ్రాన్స్ పత్రిక లే ఫిగరో కొద్ది రోజులక్రితం ప్రకటించింది. అమెరికా, బ్రిటన్ సలహాదారులు కూడా సిరియా రెబెల్స్ నాయకులను కలిసినట్లు పత్రికలు తెలిపాయి.

డిసెంబర్ 4 తేదీన నాటో విదేశాంగ మంత్రులు బ్రసేల్స్ లో సమావేశం అయ్యారు. టర్కీకి తాము తోడు ఉంటామని ప్రకటించారు. టర్కీ ఎదుర్కోనే ఎలాంటి బెదిరింపునైనా ఐక్యంగా తిప్పికొడతామని శపధం చేశారు. కానీ టర్కీని ఇంతవరకూ ఎవరూ బెదిరించనే లేదు. టర్కీయే టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చి సిరియాలోకి పంపుతోంది. కుర్దులపై దాడి పేరుతో సిరియాపై దాడులు చేసింది కూడా. టర్కీపై దాడి చేసి కోరికోరి యుద్ధాన్ని తననెత్తిపై తెచ్చుకునే పిచ్చిపనికి సిరియా పూనుకోదు. సిరియాయే స్వయంగా నాటో కూటమి దేశమైన టర్కీపై దాడి చేస్తే తాము స్పందించాలన్నది నాటో కోరిక. తమ కోరికకు తగినట్లుగా పరిస్ధితులను కృత్రిమంగా సృష్టించడానికి నాటో ఇలాంటి అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నది.

సిరియాలో మిలట్రీ జోక్యం చేసుకోవడానికి నాటో నాయకత్వం వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు జర్మనీ పత్రిక ‘సడ్యూశ్చ్ జీటంగ్’ చెప్పినట్లుగా ‘వరల్డ్ క్రంచ్’ పత్రిక డిసెంబర్ 6న తెలిపింది. తాము ఇసుకలో తలదూర్చి ఊరుకోమని నాటో అధిపతి రాస్ముస్సేన్ చెప్పాడని వరల్డ్ క్రంచ్ తెలిపింది. లిబియా తరహాలో సిరియాపై ‘నో ఫ్లై జోన్’ అమలు చేసి ఆ తర్వాత తామే యుద్ధవిమానాలతో విరుచుకుపడే వ్యూహాన్ని నాటో రచిస్తున్నట్లు తెలుస్తున్నది. తాము శత్రువులుగా చెప్పే దేశాలతో నేరుగా యుద్ధానికి తలపడే సాహసానికి నాటో ఎన్నడూ పూనుకోలేదు. ఐరాసను వినియోగించి నో-ఫ్లై జోన్ ని అమలు చేయడం, సామూహిక మారణాయుధాల తనిఖీ పేరుతో తమకు ప్రమాదం తెచ్చే ఆయుధాలు వైరి దేశం వద్ద లేకుండా జాగ్రత్తపడడం తద్వారా వైరి దేశాల రక్షణ వ్యవస్ధలన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ తర్వాత మహా వీరుల్లాగా దాడి చేసి జబ్బలు చరుచుకోవడం నాటోకి ఉన్న పిరికి అలవాటు. సిరియా విషయంలోనూ అదే ఎత్తుగడకి నాటో సిద్ధపడ్టుతున్నదని నాటో అధిపతి ప్రకటనలు చెబుతున్నాయి.

మరో లిబియాను అనుమతించబోమని రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ పదే పదే ప్రకటిస్తున్న నేపధ్యంలో సిరియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని చెప్పవచ్చు. డిసెంబర్ ఆఖరున గానీ, జనవరిలో గానీ సిరియాపై నాటో దాడి చేయవచ్చని కూడా కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. అదే జరిగితే అలాంటి యుద్ధంలో ఇరాన్, హిజ్బోల్లా (లెబనాన్)లు ఏదో విధంగా జొరబడడం ఖాయం. సిరియా అధ్యక్షుడు కూలిపోవడం అంటే ఇరాన్, హిజ్బొల్లాలకు నమ్మకమైన మిత్రుడు లేనట్లే. తద్వారా ఇజ్రాయెల్ ఆధిపత్యానికీ బాటలు వేసినట్లే. అంతకంటే ముఖ్యంగా ఇరాన్ పై అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ సాగించనున్న యుద్ధంలో అవి ముందుగానే కొంతమేరకు పైచేయి సాధించినట్లు. అంతేకాకుండా మధ్యప్రాచ్యంలో రష్యా, చైనాల ప్రయోజనాలకు ఎసరు వచ్చినట్లే. అందుకే ఆ పరిస్ధితిని నివారించడానికి రష్యా, చైనాలు కూడా తమ శక్తులను కూడదీసుకుంటున్నాయి. సిరియా యుద్ధం వాస్తవానికి అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లు ఒక పక్కా, రష్యా, చైనా, ఇరాన్ లు ఒకపక్కా మోహరించి ఉన్న ప్రాక్సీ యుద్ధం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s