టీచర్లు చితకబాదడంతో స్కూల్ పిల్లాడు మృతి


అస్లాన్ అన్సారి (వీడియో ఫుటేజి: న్యూస్ ఎక్స్)

అస్లాన్ అన్సారి (వీడియో ఫుటేజి: న్యూస్ ఎక్స్)

పదేళ్ళ స్కూల్ పిల్లాడిని ఇద్దరు టీచర్లు దారుణంగా కొట్టడంతో అబ్బాయి చనిపోయాడు. ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న అస్లాన్ అన్సారీ చేసిన తప్పుకూడా ఏమీ లేదు. స్కూల్ లో ఉన్న బకెట్ ని ఎవరో పగలగొట్టారని అస్లాన్ నవంబర్ 16న టీచర్లకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేశాక అక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు అస్లాన్ నే కొట్టడం మొదలుపెట్టారు. బకెట్ పగలకొట్టింది తాను కాదని పిల్లాడు వేడుకుంటున్నా వినకుండా అస్లాన్ ని చితగ్గొట్టారు. దానితో అతను ఆసుపత్రి పాలయ్యాడు. దెబ్బట్లు తీవ్రంగా ఉండడంతో మంగళవారం అస్లాన్ మృతి చెందాడని పోలీసులు చెప్పారు.

మధ్యప్రదేశ్ లోని బేటుల్ జిల్లా పతఖేడలో సంఘటన జరిగింది. టీచర్ల చేతుల్లో చావుదెబ్బలు తిన్న అస్లాన్ ఇంటికెళ్ళి తల్లిదండ్రులకి విషయం చెప్పాడు. తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్ళి తమ పిల్లాడిని ఎందుకు కొట్టారని టీచర్లు అడిగారు. దెబ్బలకు చికిత్స చ్యించాలని టీచర్లు వారికి 200 రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది. ఆ తర్వాత అస్లాన్ ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని పి.టి.ఐ తెలిపింది.

రోజులు గడిచినా ప్రభుత్వాసుపత్రిలో పిల్లాడు కోలుకోలేదు. దానితో అస్లాన్ ని నాగపూర్ కి తరలించారు. కానీ అప్పటికే అస్లాన్ పరిస్ధితి సీరియస్ అయింది. టీచర్ల దెబ్బలకి అస్లాన్ వెన్నెముక బాగా దెబ్బతింది. మెడ ఎముక కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. పదేళ్ళ పిల్లాడిని ఇద్దరు టీచర్లు కలిసి పశువుల్లా బాదడంతో పసి దేహం తట్టుకోలేకపోయింది. ఎదుగుతున్న శరీరం కావడంతో ఎముకలు తేలిగ్గా విరిగిపోయినట్లు కనిపిస్తోంది.

సీరియస్ పరిస్ధితిలో ఉన్న అస్లాన్ కి చికిత్స చేయలేమని నాగపూర్ డాక్టర్లు చెప్పడంతో అతన్ని భోపాల్ లోని హామీదియా ఆసుపత్రికి తరలించారు. అస్లాన్ అక్కడే మంగళవారం చనిపోయాడు. అస్లాన్ ని కొట్టిన టీచర్లలో ఒకరు బిర్జు కుమార్ సొనారియా ని పోలీసులు అరెస్టు చేశారు. మరో టీచర్ విజయ్ రామ్ భగత్ పరారీలో ఉన్నాడు.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలని కొడుతున్న కేసులను గత కొన్ని నెలలుగా అధిక సంఖ్యలో పత్రికలు నివేదిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్రవేట్ స్కూల్ లో విద్యార్ధి చేత యూరిన్ తాగించిన టీచర్ ఉదంతం నవంబర్ 23న వెలుగులోకి వచ్చింది. ఒకటో తరగతి చదివుతున్న ఆంజనేయరెడ్డి క్లాసు జరుగుతుండగా అర్జెంటుగా యూరిన్ కి వెళ్లాల్సి వచ్చింది. టీచర్ ని అడగలేక సమీపంలో ఉన్న గ్లాసులో పోసి పక్కన ఉంచాడు. తోటి విద్యార్ధులు టీచర్ కి ఫిర్యాదు చేయడంతో ఆమె (సత్యగౌరి) అయిదేళ్ల ఆంజనేయరెడ్డికి కఠిన శిక్ష వేయాలనుకుంది. శిక్షవేసే పేరుతో క్లాసులో అందరిముందు అబ్బాయిచేతే యూరిన్ ని తాగించింది. ఎందుకాపని చేశాడో తెలుసుకుని మందలించి వదిలేయడం మాని అనాగరిక శిక్షకు టీచర్ పూనుకుంది. తర్వాత రోజు పిల్లాడు స్కూల్ కి వెళ్లనని మొరాయించేవరకూ తల్లిదండ్రులకు విషయం తెలియలేదు. తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ కి వెళ్ళి నిలదీసినా సమాధానం చెప్పకపోవడంతో విషయం పోలీసుల వరకూ వెళింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన ఈ ఘటనపై విద్యాధికారులు విచారణ చేస్తున్నట్లు ప్రకటించారు. స్కూల్ గుర్తింపు రద్దుకి డి.ఇ.ఓ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

బెంగాల్ లో ప్రఖ్యాతి పొందిన శాంతినికేతన్ స్కూల్ లోనూ జులైలో ఇలాంటి సంఘటనే జరిగింది. పక్కతడిపే అలవాటు మానిపించేందుకు ఐదో తరగతి విద్యార్ధినిచేత యూరిన్ తాగించామని శాంతినికేతన్ అధికారులు చెప్పడం ఒక వింతయితే దానిని సమర్ధిస్తూ పత్రికల్లో కూడా కొందరు వాదనలు చేయడం మరో వింత. కొంతమంది మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ని కూడా గుర్తుకితెచ్చి మరీ సమర్ధించారు. ఆ తర్వాత జులైలోనే తమిళనాడులోని ఒక స్కూల్ లో 14 యేళ్ళ విద్యార్ధి చేత ముగ్గురు టీచర్లు యూరిన్ తాగించిన ఆరోపణలు వచ్చాయి. అయితే గుట్కా అలవాటుతో ఉమ్మి వేయడానికి పదేపదే క్లాసు బైటికి వెళుతున్న ఆ విద్యార్ధిని కొట్టినందుకే అతను తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడని తర్వాత ఉపాధ్యాయులు చెప్పారు. తన చెడు అలవాటు తల్లిదండ్రులకి తెలియకుండా ఉండడానికి టీచర్లపైకి తప్పు నెట్టాడని వారు చెప్పారు. కానీ విద్యార్ధిని కొట్టినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

డిసెంబర్ 2 న కాకినాడలో మరో సంఘటన జరిగింది. తప్పుగా ప్రవర్తిస్తున్నాడని భావించిన టీచర్ మూడో తరగతి పిల్లాడిని బెత్తంతో కొట్టాడు. ఎంత గట్టిగా కొట్టాడో గాని చేతి ఎముక ఫ్రాక్చర్ అయింది. తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చెయ్యడంతో జిలా విద్యాధికారి దృష్టికి కూడా విషయం వెళ్లింది. స్కూల్ గుర్తింపును డి.ఇ.ఓ రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటన జరిగినందుకు ఆ స్కూల్ గుర్తింపును అప్పటికే ఒకసారి రద్దు చేశారట. స్కూల్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి, విద్యా సంవత్సరం నష్టం అనీ, విద్యార్ధులకి కష్టం అనీ చెప్పి స్టే తెచ్చుకున్నారట.  అయినా స్కూల్ వారికి బుద్ధి రాకపోయింది.

ఇలాంటి ఘటనలు భారత దేశానికి కొత్త కాకపోయినా బాలల హక్కుల పట్ల గతంలో కంటే చైతన్యం పెరగడంతో వెలుగులోకి రావడం ఎక్కువయింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలని కొట్టకూడదన్న అవగాహన కూడా గతంలో కంటే పెరగడంతో ఘటనలు వెలుగులోకి రావడం పెరిగింది. కాని ఈ చైతన్యం సామాజికమార్పుని కోరునేది కానందున దానివల్ల అద్భుత మార్పులేవీ సాధ్యం కాదు. ఉపాధ్యాయులు విద్యార్ధులను కొట్టకుండా నిరోధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక చట్టాన్ని ప్రతిపాదించింది. పార్లమెంటు దానిని ఆమోదించాక అమలులోకి వస్తుంది. ఆ చట్టం వచ్చాకయినా స్కూళ్ళు, టీచర్ల ఆలోచనాధోరణిలో మార్పు వస్తే అది పరిమితంగానే ఉంటుంది. ప్రజల్లో వ్యాప్తిలో ఉన్న భావజాలంలో మార్పు రాకుండా చట్టాలు ఎన్ని వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు.

7 thoughts on “టీచర్లు చితకబాదడంతో స్కూల్ పిల్లాడు మృతి

 1. ఇలాంటి దుచర్యలకు పాల్పడిన వాళ్ళను నాకయితే వెంటనే చంపివేయాలన్నంత కొపం ఒస్తుంది. ఆ తల్లితండ్రులు ఇలాంటి వాటిపైన ఎందుకు ఉదాసీనంగా ఉన్నారొ నాకయితే అర్దం కాలేదు. ప్రవేట్ బడుల్లొ చెప్పే ఉపాద్యాయులు చాలావరకు (ఉమెన్స్)10వ తరగతి లేదా ఇంటర్ వరకు చదివిన వాళ్ళే మీకు నమ్మకం కలగటం లేదా? నావెంట రాండి ఇలాంటి బడులు పదుల సంఖ్యలొ చుపిస్తాను. వాళ్ళపని ప్రదానంగా బట్టీపట్టించి మార్కులకై సాదన చేయించడం. అది వాళ్ళకు అర్దం అయిందా లేదా అనేది అనవసరం. కొంతమందికి మార్కులు రానప్పుడు ఈ ఉపాద్యాయులే మార్కులు వేచి తల్లితండ్రులకు పొగ్రెస్ కార్డ్లు పంపుతారు. ఆ తల్లితండ్రులు కుడా అలాంటి వారే మార్కులు వస్తె చాలు పాటం ఎంతవరకు అర్దమైదనేది అనవసరం.

  ఈ ఉపాద్యాయులకు లేని మూడత్వం అంటూ లేదు. అన్ని సాంఘీక దురాశాలన్నీ పాటిస్తారు. అంతకన్నా మూర్ఖులైన తల్లితండ్రులు గతంలొ అయితే మావాణ్ణి కొట్టందంటూ అప్పగించేవారు. ఇప్పుడైతే లేదు. బడుల పెట్టుబడిదారీ వర్గం ప్రవేట్ బడులంటే ఒక వ్యమొహం కల్పించారు.దానికి తగినట్లుగా ప్రబుత్వ బడులు అద్వానంగా తయరైనాయి.

 2. సుందరం గారూ, మావాడ్ని కొట్టండని అప్పగించే తల్లిదండ్రులకి ఇప్పుడూ కొదవలేదు. పిల్లలని కొట్టొద్దని చెప్పడానికి వెళ్తే కొట్టయినా చదివించండని వస్తున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారని టీచర్లు చెబుతుంటారు. విద్యార్ధి సంఘాల వాళ్లు కూడా అలాంటి పేరెంట్స్ గురించి చెబుతుంటారు. మీరు చెప్పిన ప్రవేటు బడుల వ్యామోహం పిల్లలకి ఆ విధంగా కూడా శాపమే.

 3. సుందరం గారూ..మీరు చెప్పింది నిజమే. పదో తరగతో, ఇంటరో చదివిన వాళ్లూ….పిల్లల సైకాలజీ గురించి, అసలు పాఠాలు ఎలా చెప్పాలో తెలీకుండానే పంతుళ్లుగా అనేక మంది ప్రైవేటు స్కూళ్లలో ఉన్నారు.
  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే….ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు డిగ్రీలు, బీఈడీలు చదివి తర్వాత అనేక పరీక్షలు రాసి పోస్టుకు ఎంపికవుతారు. అంటే వాళ్లు ప్రైవేటు స్కూళ్లలో టీచర్ల కన్నా తెలివైన వారు, ఉన్నత విద్యావంతులని తెలుస్తోంది. కానీ తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వం పాఠశాలలంటే చిన్న చూపు చూస్తారు. కారణం ఏమిటంటే, ఆ మాత్రం అరకొర చదువుతోనే పాఠాలు చెప్పుతున్న ప్రైవేటు టీచర్ల మాదిరి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు జరగవు. ప్రభుత్వం ఏదో ఏటా అరకొరగా నిధులు కేటాయిస్తుంది తప్ప…అవసరాల మేరకు కాదు.

  ఓ రకంగా విద్యారంగం నుంచి ప్రభుత్వం తప్పుకునేందుకు ఎప్పటినుంచో కుట్ర జరుగుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వం పాఠశాలల్ని క్రమంగా నిర్వీర్యం చేసి..పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేలా పరోక్షంగా ప్రభుత్వమే సహకరిస్తోంది. తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కదా. అలా తల్లిదండ్రుల ఇంగ్లీష్ మీడియం వెర్రిని ప్రైవేటు స్కూళ్లు సొమ్ము చేసుకుంటున్నాయి.

 4. ఇంగ్లిష్ మీడియంలో చదివినవాళ్ళకి నిజంగా ఇంగ్లిష్ వచ్చని నేను అనుకోను. ముఖ్యంగా syntax, pronunciation, phonology, morphology లాంటివి రానేరావు. ఉదాహరణకి cot, caught ఈ రెండు పదాలనీ ఒకే phone(స్వరం)తో పలికేస్తుంటారు. తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించడం సాధ్యం కాని ‘తోడల్లుడు్’ లాంటి పదాలకి ‘co-brother’ లాంటి పేర్లు వ్రాసి ఇది ఇండియన్ ఇంగ్లిష్ అని చెప్పుకుంటుంటారు. మనం స్కూల్‌లో నేర్చుకున్న ఇంగ్లిష్ వింటే యూనివర్సిటీలో ఇంగ్లిష్ చదివిన ప్రొఫెసర్‌లు నవ్వుతారు. ఈ విషయం తెలిసినా ఇంగ్లిష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని పిల్లలని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లకి పంపించడం జరుగుతోంది.

 5. ఇది అమానుషమైన చర్య ! బోధన మాట అటుంచి , పిల్లల ప్రాణాలు తీస్తున్నారు, ఈ నర రూప రాక్షసులు !
  ఎప్పుడూ వివిధ మీడియాలో , పత్రికలలో , పిల్లలను హింసించడం వల్ల జరుగుతున్న పరిణామాలను సెన్సేషనల్ గా వేయడమే తప్పించి , నేరస్తులను ఏ విధం గా శిక్షించినదీ , అసలు శిక్షించారా లేదా అనే విషయం అసలు ఫాలో అవరు, చేయరు.
  కఠినం గా శిక్షలు వేయడం ఒక నివారణ చర్య అయితే ,పిల్లలను , భయ పెట్టి , బ్లాక్ మెయిల్ చేసి , వారి నోళ్ళు మూయిస్తున్న వారిని గురించి తప్పని సరిగా , వారి తల్లి తండ్రులకు చెప్పే ట్టు వారికి సలహా ఇవ్వాలి ప్రతి స్కూల్ లోనూ !
  కాక పొతే , చాలా మంది తల్లి దండ్రులు వారే , తమ పిల్లలను తీవ్రం గా భయ పెట్టి , మందలించి స్కూళ్లకు పంపుతూ ఉండడం తో , పిల్లలు సహజం గానే భయ పడతారు ఎవరికి చెప్పడానికైనా ! ఇది చాలా విచార కరమైన విషయం.
  ప్రతి టీచరు నూ ఉద్యోగం ఇచ్చే ముందు , వారి మానసిక పరిణితి ని కూడా విశ్లేషణ చేయడం నిర్బంధం చేయాలి ! ఎందుకంటే , there is enough evidence to state that the ” abused become the abusers ” ! అంటే ఈ టీచర్లు వారి వారి జీవితాలలో హింస అనుభవించి , వారి ” పగ, ద్వేషాలను ”
  తమకు ” అందుబాటులో ” ఉన్న అమాయక పసి పిల్లల మీద హింస రూపం లో అట్లా తీర్చు కుంటున్నారు !

 6. ప్రైవేటు స్కూళ్ళలో పనిచేసే వారి వేతనాలు తక్కువ..నిత్యం అసంతృప్తి గా ఉంటారు..తమకున్న ఇరిటేషన్ స్కూల్లో పిల్లల మీద చూపిస్తారు…కొంత మంది ప్రభుత్వ స్కూళ్ళలో పనిచెసే టీచర్లూ అంతే…వాళ్లకున్న చిరాకులను పిల్లల పై ప్రదర్శిస్తారు…

 7. పూర్వం బతకలేక బడి పంతులు అని ఓసామెత ఉండేది. అంటే తమ చదువుకు ఏ ఉద్యోగం దొరక్కపోతే… ( ఆ రోజుల్లో ఉద్యోగం అంటే ఏ బ్రిటీష్ దొర దగ్గర గుమాస్తానో, లేదంటే ఏదో సహాయకుని పదవి. ) వీధిలో బడి మొదలు పెట్టేవారు. ఈ రోజుల్లో లాగా ఫీజులు కూడా ఉండేవి కావు. తల్లిదండ్రుల స్తోమతను బట్టి ఒక పైసానో, రెండు పైసలో ఇచ్చేవారు. ఆ రోజుల్లో అదే ఎక్కువ. మళ్లీ ఏ దసరాకో పిల్లలతో సహా వీధీ వీధి తిరిగి…అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లలకు చాలు పప్పు బెల్లాలు. ..అంటూ అంతో ఇంతో వసూలు చేసేవారు.

  అలా తమ జీవితంపై అసంతృప్తి కొంత, ఆ నాటి భూస్వామ్య భావజాలం కొంత కలిగి ఉన్న నాటి పంతుళ్లు..పిల్లలను దారుణంగా కొట్టేవారు. ఎంతగా అంటే చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడ దీయడం. గోడ కుర్చీని గంటలు గంటలు వేయించడం. (ఈ గోడ కుర్చీ 90 ల్లో నాకు అనుభవమే.) ఇలా కఠిన శిక్షలు విధించేవారు. అలా కొడితేనే చదువు బాగా వస్తుందని పాపం తల్లిదండ్రులూ నమ్మేవారు. ఈ శిక్షలు తట్టుకోలేకే చాలా మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం మానేసేవారట. అసలు బడి పేరు చెబితేనే భయపడి జ్వరాలు వచ్చే వాళ్లూ ఉండేవారట ఆరోజుల్లో. ఇలా అదే భావజాలం నేటికీ వారసత్వంగా వచ్చింది. పిల్లలను శిక్షిస్తేనే చదువు వస్తుందని నమ్మే వారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు.

  స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని బ్రిటీష్ విధానాలు యధావిధిగా కొనసాగినట్లు గానే…విద్యా విధానం కూడా ఏ మార్పు లేకుండా కొనసాగింది. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఎటువంటి విద్యావిధానం కావాలనే దానిపై అసలు స్పష్టత లేదు. స్వతంత్రం వచ్చిన ఇరవై ఏళ్లకు మొదటి విద్యా విధానం-1968తో తీసుకొచ్చారు.

  అదీ కాక మనదేశంలో ఎవరైనా టీచర్ కావచ్చు. పది మధ్యలో మానేసిన వాడు…తొమ్మిది దాకా పాఠాలు చెపుతాడు. అదీ ఏదో ఇంటిదగ్గర ట్యూషన్ కాదు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు పాఠశాలల్లోనే. ఇంటర్ ఫెయిలైతే పదో తరగతికి,
  డిగ్రీ పూర్తైతే ఇంటర్ కీ, చివరకు ఇంజనీరింగ్ లో కూడా… అదే సంవత్సరం పూర్తైన వాళ్లూ….ఫస్టియర్ వాళ్లకు క్లాసులు చెపుతున్నారు.
  ” విద్యార్థి అంటే ఎవరు, శిశువుకు ఎంత జ్ఞానం ఉంటుంది. పిల్లలకు ఏ విధంగా పాఠాలు చెప్పాలి ” అనే విషయాలు తెలీకుండానే , ఎటువంటి శిక్షణ లేకుండానే టీచర్లు అవుతారు. అదీ కాక విద్య నేర్చుకునే దశలో మొదటి మూడు నాలుగు సంవత్సరాలు చాలా కీలకం. ఈ దశలోనే పిల్లలకు చదువు పట్ల, సమాజం పట్ల సానుకూల దృక్పథం కలిగించాలి. చదువనేది భారమైన పని కాదని….సరదాగా సాగిపోయేలా ఉండేలా చెప్పాలి. కానీ ప్రాధమిక పాఠశాలలనైతే పట్టించుకున్న నాథుడే ఉండడు.

  పల్లెటూళ్లలో గేదెలు కాసే వాళ్లు ఉంటారు. గేదెలని రోజంతా మేపే తీరిక లేని వాళ్లవి…. ఊరందరి గేదెలని వాళ్లే మేతకు తీసుకెళ్తారు. వాటిలో వెళ్లిన గేదెలకు సరైన మేత దొరకదు, నీళ్లు దొరకవు, ఏదో పేరుకే గుంపులో వెళ్లి సాయంత్రం అయ్యాక ఇంటికి వస్తాయి. అవి ఇంటికి రాగానే మళ్లీ వాటి యజమాని మేత వేయాల్సిందే.

  ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల పిల్లల పరిస్థితి అలాగే తయారైంది. ఏదో పేరుకో బడికి వెళ్లడం, రావడం. అంతే.

  డబ్బున్న వాళ్లైతే కొంచెం మంచి స్కూళ్లకు పంపిస్తారు. డబ్బు లేని కూలీనాలీ పిల్లల పరిస్థితి గుంపులో గోవిందా. అంతే.

  ఇటువంటి దారుణ పరిస్థితుల మధ్య కూడా ఎవరో ఒకరిద్దరు అంకిత భావం కలిగిన టీచర్లు ఉంటారు. పిల్లలకు అంతో ఇంతో బోధిస్తారు. వాళ్ల వల్లే ఆ పాఠశాలలు మనుగడ సాగిస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s