నార్వేలో కొడుకుని కొట్టి జైలుపాలయిన తెలుగు అమ్మా నాన్నలు


Photo: Andhraheadlines.com

Photo: Andhraheadlines.com

రెండు సామాజిక వ్యవస్ధల కుటుంబ విలువల మధ్య ఉన్న వైరుధ్యాలు ఒక యువ తెలుగు విద్యాధిక జంటను జైలుపాలు చేశాయి. ప్రఖ్యాత భారత సాఫ్ట్ వేర్ సేవల కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ ఉద్యోగి చంద్ర శేఖర్, కంపెనీ కోసం నార్వే వెళ్ళి ఊహించని పరిణామాల వల్ల క్షోభను అనుభవిస్తున్నాడు. ఎదుగుదల క్రమంలో నేర్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్న 7 యేళ్ళ కుమారుడిని అదుపులో పెట్టే క్రమంలో చంద్రశేఖర్ తండ్రిగా అదుపు తప్పాడని నార్వే కోర్టులు భావించి 18 నెలల జైలు శిక్ష విధించగా, అతని భార్య అనుపమకి 15 నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. పోలీసుల ఆరోపణలు నిజం కాదనీ, తాము చెప్పేది వినకుండా శిక్ష వేశారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

వల్లభనేని చంద్రశేఖర్ 18 నెలల క్రితమే నార్వే వెళ్ళాడు. తాను పనిచేసే టి.సి.ఎస్ సంస్ధ అతన్ని నార్వే పంపింది. భార్య ఇద్దరు పిల్లలతో పాటు నార్వే వెళ్ళిన చంద్ర శేఖర్ పెద్దబ్బాయివల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడని తెలుస్తోంది. పక్క తడపడం, స్కూల్ లో బొమ్మలను ఇంటికి తేవడం, ఇంకా అలాంటివి. పక్క తడపడం ఆపకపోతే తనను ఇండియాకి తిరిగి పంపేస్తామని తల్లిదండ్రులు తనను బెదిరించారని పెద్దబ్బాయి గత ఫిబ్రవరిలో స్కూల్ టీచర్లకు చెప్పాడట. దీనినిబట్టి బాబు అలవాట్లను మానిపించడానికి చంద్రశేఖర్, అనుపమలు కూడని పద్ధతులు అనుసరించినట్లు భావించవలసి వస్తోంది. తాము అలా చేయలేదని వారు చెప్పినా కోర్టు వారి వాదనను పట్టించుకోలేదు.

7 సంవత్సరాల సాయి శ్రీరామ్ శరీరంపై కాల్చిన వాతలు ఉన్నాయనీ, మచ్చలు ఉన్నాయనీ నార్వే కోర్టు ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. అబ్బాయి శరీరంపై బెల్టుతో కొట్టిన వాతలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ ఆరోపణలు నిజం కాదని చంద్ర శేఖర్, అనుపమలు చెబుతున్నారు. బాబు శరీరంపై ఉన్న వాతలకు, మచ్చలకు వారు ఏమి కారణం చెప్పారో పత్రికలేవీ చెప్పలేదు. కాల్చిన వాతలు, బెల్టు గాయాలకు కారణం తల్లిదండ్రులే అయిన పక్షంలో వారు నిస్సందేహంగా ఖండనార్హులే. ఉన్నత చదువులు నేర్పే బిడ్డల శిక్షణా పద్ధతులను సైతం ఉల్లంఘించి వారలా ప్రవర్తించడం అత్యంత బాధాకరం. కానీ ఆ పేరుతో సంవత్సరన్నర పాటు సాయి శ్రీరామ్ కి తల్లిదండ్రుల సంరక్షణను దూరం చేసే హక్కు ఒక పరాయి రాజ్యానికి ఎక్కడినుండి వస్తుంది?

ఎన్నో వైరుధ్యాలు

ఎన్.డి.టి.వి ప్రకారం నార్వే కోర్టు మంగళవారం శిక్ష ప్రకటించడానికి ముందు ఆ దేశంలోని పిల్లల సంక్షేమ సేవల సంస్ధలు కోర్టు ఆదేశాలమేరకు శ్రీరామ్ ని ఎనిమిది వారాల పాటు తామే చూస్తామని పట్టుకెళ్లిపోయారు. కానీ వారు శ్రీరాంని చూడలేకపోయారు. పిల్లలను ఎలా చూడాలని వారు సుద్దులు చెబుతూ పుస్తకాలు రాసుకున్నారో ఆ పద్ధతుల్లో శ్రీరాంని కేవలం ఎనిమిది వారాల పాటయినా సంరక్షించలేకపోయారు. మళ్ళీ తిరిగి అనుపమ, చంద్రశేఖర్ ల వద్దకే పిల్లాడిని వదిలి వెళ్లారు. అలా తిరిగి తల్లిదండ్రులవద్ద వదిలి వెళ్లడానికి వారు ఒక గంభీరమైన కారణం చెప్పారు. “Attention-deficit hyperactivity disorder” అనే లక్షణం వలన తాము చూడలేకపోయామని వారు ప్రకటించారు. అంటే పిల్లాడికి కావలసిన అటెన్షన్ అతని తల్లిదండ్రులే ఇవ్వగలరని, తాము అట్టహాసంగా ఏర్పరుచుకున్న పిల్లల సంక్షేమ సంస్ధలు ఇవ్వలేవని వారు ఒప్పుకున్నట్లే. ఇక జైలు శిక్ష బాబుకి ఏ న్యాయం చేస్తుంది?

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిల్లాడి వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో తమకు సహాయం చేయాలని చంద్రశేఖర్, అనుపమలు నార్వే ప్రభుత్వ అధికారులను కోరారు. ప్రవర్తనకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతున్న సాయి శ్రీరామ్ ని సాకడంలో సహాయం చేయాలని వారు కోరారు. ఆశ్చర్యం ఏమిటంటే సహాయం చెయ్యడానికి నార్వే అధికారులు నిరాకరించారు. వారు నార్వేలో శాశ్వతంగా నివాసం ఉండే పౌరులు కానందున పిల్లల పెంపకం కోసం అందుబాటులో ఉండే నార్వే ప్రభుత్వ సేవలు చంద్రశేఖర్, అనుపమలకు ఇవ్వలేమని చెప్పారు. పిల్లాడి పెంపకం కోసం సాయం చెయ్యడానికి నిరాకరించే పౌరసత్వ చట్టం ఆ పిల్లాడి ఫిర్యాదుతో తల్లిదండ్రులను శిక్షించడానికి మాత్రం ఎలా అంగీకరిస్తుంది?

చంద్రశేఖర్ కుటుంబం గత జులైలో పిల్లల్ని తీసుకుని ఇండియాకి వచ్చింది. ఇక్కడికి వచ్చాక నార్వే కోర్టు వారికి నోటీసులు పంపింది. తమముందు హాజరు కావాలని వారిని కోరింది. అక్కడికి వెళ్ళాక నార్వే పోలీసులు దంపతులిద్దరినీ అరెస్టు చేశారు. శిక్షవేయకముందే ఎందుకు అరెస్టు చేశారని పత్రికలు అడిగితే ఇండియాకి తిరిగి వెళ్లిపోతారన్న అనుమానంతో అరెస్టు చేశామని ప్రాసిక్యూటర్లు చెప్పారు. పిల్లలు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఈ చట్టాలు, కోర్టులు ఇలాంటి విషయాల్లో ఎంత అన్యాయంగా, అర్ధరహితంగా, మూర్ఖంగా వ్యవహరిస్తాయో ఈ వ్యవహారం చెబుతోంది. దేశాన్నీ, ప్రజలని దోచుకుతినే కేసుల్లో మాత్రం ఇవే కోర్టులు ఎంతో బలహీనంగా వ్యవహరిస్తాయి. అసలు చట్టాలన్నీ దోచుకుతినేవాళ్ళ కోసమే అన్నట్లుగా వారికి అనుకూలంగా ఉండే నీతులూ, సూక్తులూ వల్లిస్తాయి. రాజ్యాధికారాన్ని పరిరక్షించడానికి ఏర్పడ్డ చట్టాలు, కోర్టులు ఆ రాజ్యాన్ని గుప్పిట్లో పెట్టుకున్న వర్గాలకోసం పనిచేయడంలో ఆశ్చర్యం ఏముంది గనుక?

కళ్యాణ చక్రవర్తి అనే సైకియాట్రిస్టు సాయి శ్రీరామ్ కి గత మూడు నెలలుగా చికిత్స అందిస్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు “నార్వే లాయర్లకు నేను కొన్ని రిపోర్టులని ఫాక్స్ చేశాను. తల్లిదండ్రులు పక్కన ఉన్నంతవరకూ అద్వితీయమైన మెరుగుదల చూపించిన పిల్లాడు వారు వెళ్లిపోయాక శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా బాగా కృశించిపోయాడని నేను ఆ రిపోర్టుల్లో చెప్పాను.” (ఎన్.డి.టి.వి). ఈ లెక్కన జైలుశిక్ష ద్వారా కోర్టులు సాయి శ్రీరామ్ కి ఏ విధంగా సాయం చేస్తున్నాయో అర్ధం అవుతోంది.

నార్వే ప్రాసిక్యూటర్లు చెప్పే విషయాలు చూస్తే చంద్రశేఖర్, అనుపమలపై కోసం వస్తుంది. విద్యాధికులై ఉండీ ఇంత ఘోరంగా ప్రవర్తించారా అని కోపంతో కూడిన ఆశ్చర్యం వేస్తుంది. ఉన్నత చదువులు వారికి ఏమి నేర్పినట్లు అని బాధ కలుగుతుంది. కానీ వారిని శిక్షించే పేరుతో ఈ చట్టాలు ఎవరినైతే రక్షించామని భావిస్తున్నాయో ఆ పిల్లాడినే శిక్షిస్తున్నాయి.

కేసులో జోక్యం చేసుకోవడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది. ఒక ప్రవేటు కుటుంబం విదేశీ రాజ్యం మద్య ఉన్న వివాదంలో జోక్యం చేసుకోబోమని విదేశీ మంత్రి ఖుర్షీద్ ప్రకటించాడు. దానిని బట్టి జోక్యం వల్ల ఇబ్బంది పడతామని తెలియజేసే నిజాలు కేసులో ఉన్నాయని ప్రభుత్వం భావిస్తున్నదని అర్ధం చేసుకోవచ్చు. కానయితే, కొట్టడం నిజమే అయితే, పిల్లాడిపైన కక్షతోనో, పిల్లాడిని వదిలించుకోవాలన్న కోపంతోనో లేదా ఇతరత్రా సామాజిక నేరపూరితమైన దృష్టితోనో అలా జరగలేదని అర్ధం అవుతూనే ఉంది.

ఈ సంకట పరిస్ధితిని అర్ధం చేసుకుని తదనుగుణంగా వ్యవహరించే దృష్టి చట్టాలు, కోర్టులకు ఉండదు. మనసుతో, హృదయంతో, ముందుచూపుతో వ్యవరించేపనికి చట్టాలు, కోర్టులు పూనుకోవు. అక్కడ జరిగేదంతా యాంత్రికం. “పిల్లాడిని కొట్టడం నిజం, దానికి సాక్ష్యాలున్నాయి. కనుక చట్టం ప్రకారం శిక్ష వేయాలి” కోర్టులు ఇంతవరకే చేయగలవు. ‘పిల్లాడి భవిష్యత్తు, ఆ భవిష్యత్తులో అతనికి అందవలసిన భావోద్వేగపరమైన తోడు (emotional attachment), ఆ తోడుని ఇచ్చే ఏకైక తల్లిదండ్రులు దూరమైతే కలిగే నష్టం’ ఇవేవీ చట్టంలో లేనపుడు పిల్లాడికి నిజమైన న్యాయం జరిగే అవకాశం లేదు. కుటుంబ సంబంధాల్లోకి చట్టం, కోర్టులు మితిమీరి జొరబడితే ఇలాంటి పరిస్ధితే దాపురిస్తుంది.

సామాజిక వ్యవస్ధల అంతరం

గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం, సంస్కృతుల్లోనూ, సామాజిక వ్యవస్ధల్లోనూ ఉన్న తేడా. భారత దేశం అభివృద్ధి చెందిన దేశం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇక్కడ పూర్తిగా వేళ్లూనుకోలేదు. ఇక్కడి పెట్టుబడిదారులు అభివృద్ధి చెందకుండా బ్రిటిష్ వలసదారులు అడ్డుకున్నారు. దాని వలన భారత దేశంలో భూస్వామ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. వలసదారులు ప్రవేశపెట్టిన పెట్టుబడిదారీ సంబంధాలు, దేశీయంగా కొనసాగుతున్న భూస్వామ్య సంబంధాలు భారతదేశం యొక్క లక్షణాలుగా ఉన్నాయి. పోనీ పరిమితుల్లో ఉన్న పెట్టుబడిదారులయినా స్వతంత్రంగా వ్యవహరిస్తూ వెనుకబడిన భూస్వామ్య సంబంధాలను నాశనం చేసి సామాజిక వ్యవస్ధను తదుపరి అభివృద్ధి దశకు తీసుకువెళ్లే నిబద్ధత ఉన్నవారా అంటే కానే కాదు. వారి రంది అంతా ఈ అర్ధ భూస్వామ్య సామాజిక వ్యవస్ధను కాపాడుతూనే దానిద్వారా కొనసాగుతున్న కుల, మత వెనుకబాటు సంబంధాలను అడ్డుపెట్టుకుని తమ ఆర్ధిక ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడమే.

ఇలాంటి వెనుకబాటు సామాజిక వ్యవస్ధలో సామాజిక సంబంధాలు, కుటుంబ విలువలు కూడా వెనకబడే ఉంటాయి తప్ప ఆధునికత్వాన్ని సంతరించుకోవు. ఉన్నత చదువులు నేర్చుకుని విదేశాలు వెళ్ళినా, ఇక్కడే మెట్రోల్లో ఉన్నత ఉద్యోగాలు వెలగబెడుతున్నా, మరే స్ధాయికి వెళ్ళినా కులాల కంపులో మురిగిపోయేది దీనివల్లనే. భారత సామాజిక వ్యవస్ధ ఈ పరిమితుల్లో ఉన్నంత కాలం ప్రజల వేషభాషల్లో మార్పులు రావచ్చేమో గానీ, సంస్కృతీ సంబంధాల్లో, కుటుంబ సంబంధాల్లో, చివరికి పిల్లల పెంపకంలో కూడా పాతభావాలనే పట్టుకుని వేళ్లాడుతారు. అందుకే పిల్లల్ని కొట్టకూడదు అంటే వారి మంచికోసమే కదా అని గాఢంగా నమ్ముతారు. బెల్టుతో కొట్టినా, బెత్తంతో చితకబాదినా అది వారి మంచికోసమే అని నమ్మి ఆచరిస్తారు. భార్యని కొట్టడం భర్త హక్కు అని నమ్ముతారు. అది నేరం అనిచెబితే తెగ ఆశ్చర్యపడిపోతారు. పోలీసు అధికారులు, మంత్రులు, ఎమ్మేల్యేలు కూడా ఇలాంటి వెనుకబాటు భావాలనే నమ్మి కాపాడుతారంటే దానికి కారణం వారు కూడా భారత సామాజిక వ్యవస్ధలో భాగస్వాములే కనుక. పై వర్గాలకు ఈ వ్యవస్ధ ఇలాగే కొనసాగడం వల్ల లాభం. అభివృద్ధి చెందితే నష్టం. ఇక వారు లాభాన్ని వదిలి నష్టాన్ని ఎందుకు కోరుకుంటారు?

నార్వే పరిస్ధితి ఇందుకు భిన్నం. అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్ధ తనకు అనుకూలమైన అభివృద్ధిని తెస్తూ దానికి అనుగుణంగా భావజాలాన్ని కూడా అభివృద్ధి చేసుకుంది. పెట్టుబడిదారీ అభివృద్ధికి భూస్వామ్యం అడ్డం కొడుతుంది. భూస్వామ్య భావజాలం ఆటంకాలు సృష్టిస్తుంది. అందువలన భూస్వామ్య వ్యవస్ధనూ, దాని భావాజాలాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసి అన్నీ వ్యవస్ధల్లోనూ పెట్టుబడిదారీ అభివృద్ధికి అనుకూలమైన భావజాలాన్ని సృష్టించుకుంది. అలాంటి వ్యవస్ధలోకి అర్ధ భూస్వామ్య విలువలతో ప్రవేశించే భారతీయులు సహజంగానే సమస్యలను ఎదుర్కొంటారు.

తల్లిదండ్రులయినా పిల్లలని కొట్టడం నేరం, భర్తయినా భార్యని కొట్టడం నేరం, జీవిత భాగస్వామి అయినా ఇష్టం లేకుండా భార్యను తనతో గడపాలని బలవంతం చేస్తే మానభంగం అని చట్టాలు రూపొందించుకునే విధంగా కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, సామాజిక వ్యవస్ధలు అభివృద్ధి అయిన చోటికి అందుకు బాగా భిన్నమైన సామాజిక విలువలు ఉన్న భారతీయులు ప్రవేశిస్తే రెండు విలువల మధ్యా ఘర్షణ అనివార్యం. చంద్రశేఖర్, అనుపమలు కేవలం వ్యక్తులు మాత్రమే. కానీ వారిపై ఆధిపత్యం చెలాయించినది మాత్రం ఒక దేశం. దానికి చట్టం, పోలీసులు, కోర్టులు అంతా అండగా ఉన్నారు. ఆ రాజ్యంతో వ్యక్తులు ఎలా గెలవగలరు? అందుకే ఓడిపోయి మౌనంగా రోదిస్తున్నారు. పై కోర్టుకి వెళ్ళినా భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప వారికి విముక్తి దొరకడం గగనంగా కనిపిస్తోంది.

ఈ విశ్లేషణ నార్వే సామాజిక వ్యవస్ధను ఉన్నతీకరించడానికీ, భారత సామాజిక వ్యవస్ధను తక్కువ చేయడానికి కాదు. ఇరు దేశాల సామాజిక వ్యవస్ధల మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించాలన్నదే ప్రధాన సూచన. గుర్తించాక భారత సామాజిక వ్యవస్ధ అభివృద్ధి ఎందుకు స్తంభనకు గురయిందో ఈ సందర్భంగానైనా తర్కించుకోవలసిన అవసరం ఉంది. వెనకబడ్డామా అని పౌరుష పడడం కంటే ముందుకు వెళ్లడానికి అడ్డంకులు ఏమిటో గుర్తించి వాటిని తొలగించుకోవలసిన అవసరం ఉంది. నిజానికి నార్వే సామాజిక వ్యవస్ధకీ, అది అభివృద్ధి చేసుకున్న వివిధ పాలనా వ్యవస్ధలకీ అనేక పరిమితులు ఉన్నాయి. అక్కడి వ్యవస్ధ కూడా ఇంకా అభివృద్ధి  చెందవలసిన అవసరం చాలానే ఉంది. పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యవస్ధే అయి ఉన్నట్లయితే పిల్లాడికి తల్లిదండ్రులను దూరం చేసే పిచ్చిపనికి పూనుకుని ఉండేది కాదు.

13 thoughts on “నార్వేలో కొడుకుని కొట్టి జైలుపాలయిన తెలుగు అమ్మా నాన్నలు

 1. Child rights violationని అంత చిన్న సమస్య అనుకోలేము. “చదవకపోతే నువ్వు హొటెల్‌లో పని చేస్తావు” అని అంటూ హొటెల్‌లో పని చేసే బాలకార్మికులని నన్ను చూపించేవాడు మా నాన్న. “రేపు నేను పరీక్షలలో ఫెయిల్ అయితే నాకు అదే గతి పడుతుందని అనుకుని నేను ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటి” అనే సందేహం మా నాన్నకి రాలేదు. “పిల్లలని ఎవరు చూస్తారు” అనే కారణంతో ఈ తల్లితండ్రులని బయట ఉంచినా పిల్లల జీవితాలు ప్రమాదంలోనే పడతాయి.

 2. “దానిని బట్టి జోక్యం వల్ల ఇబ్బంది పడతామని తెలియజేసే నిజాలు కేసులో ఉన్నాయని ప్రభుత్వం భావిస్తున్నదని అర్ధం చేసుకోవచ్చు”

  భారత ప్రభుత్వం అలా చేవచ్చినట్లు వ్యవహరించటం హర్షించదగ్గ విషయం కాదు. అసలికి ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చేవచ్చచ్చి, చేషట్టలుడిగి పోయింది.ఈ ప్రభుత్వాం అంత చెత్త ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదు. మైనారిటి ప్రభుత్వం నడిపిన దేవ గౌడా,చంద్రశేఖర్ లు ప్రధానులుగా కొన్ని రోజులు, కొన్ని విషయాలలో సమర్ధవంతంగా ప్రవర్తించారు. అదే సింగ్ గారు వ్యాపారానికైతే అన్ని గేట్లు తెరచి, దేశ పరువు ప్రతిష్టలు రక్షణ వ్యవహారంలో ఆత్మ విశ్వాసం కోల్పోయి, ప్రజలు నువ్వు వద్దో అని మొర పేడుతున్నా కొనసాగుతున్నాడు.
  కేరళలో ఇటాలి దేశస్థులు మత్స్యకారులను అన్యాయం గా చంపితే, ఆదేశం వారి పౌరులను విడిపించుకోవటానికి మనదేశం పైన ఎంత వత్తిడి తెచ్చింది. అది కూడా అన్యాయంగా చంపిన కేసును సిగ్గు ఎగ్గూ లేకుండా వారిపౌరులకు మద్దతు నిస్తూ, సహకారం అందించటానికి ఇటలి దేశం ఆఘమేఘాల పైన ఎలా ముందుకు వచ్చింది. మన ప్రభుత్వం వారికి సహకరించి తరించాలని ఎంత ఉవ్విళ్ళూరింది. అటువంటి కేసులతో పోలిస్తే మరి ఈ కేసు సోదిలోకి కూడా రాదు. దీని గురించి నిలదీయ గలిగే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదా? మాల్దివుల కేసులో మటుకు జి.యం.ఆర్. కు అన్యాయం జరిగిందని ఖుర్షిద్ మాట్లాడుతాడా?
  ఈ కేసులో డబ్బులు లేకపోవటం వలన మన నాయకులు ఆసక్తిని చూపలేదనిపిస్తుంది.

  మీరు రాసిన దానిలో నార్వే పైన కొద్దిగా సాఫ్ట్ కార్నర్ చూపారు. వారిదేదో చాలా గొప్ప లా అండ్ ఆర్డర్ ఉన్నదేశమమనే భావన ధవ్నిస్తున్నాది. ఈ యురోప్ దేశాలవారి గొప్పతనాన్ని ఇక ఏ మాత్రం భారతీయులు లెక్క చేయకుడదు. మొన్న ఐర్లాండ్ లో అబార్షన్ సంగతి చూశాం కదా. నా ప్రాణం రక్షించండని ఆమే ప్రాధేయపడినా, వారు క్రైస్తవ మత మూర్ఖత్వంతో నిండు గర్భిణి ప్రాణం బలి గొన్నారు. అదే సంఘటన ఎవరైనా ఒక తెల్ల వాడికి మనదేశంలో జరిగి ఉంటే వాళ్ళు మన దేశాన్ని ఎంతో వెనుకబడిన అనాగరిక దేశంగా ప్రతి పేపర్ లో బి బి సి మొదలుకొని టాయిలేట్ పేపర్ వరకు కుప్పలు తెప్పలుగా వ్యాసాలు రాసి మానవతం లేని దేశం గా చిత్రికరించి ఉండేవారు. ఇప్పుడు చూడండి ఆ హాస్పిటల్ లో అబార్షన్ కొరకు ఆమే పెట్టుకొన్న అర్జిని రిపోర్ట్స్ నుంచి మాయం చేశారు. అది తప్ప మిగతా వన్ని రిపోర్ట్స్ లో ఉన్నాయి. మరి ఆదేశం లో ఉన్న ప్రాసెస్ ఎమీటి? వాళ్ల మీదకు వస్తే రిపోర్ట్స్ మాయం చేసి స్కాంలు చేస్తారు. వీరికి ఉన్న నీతి నిజాయితి ఎమిటో తెలియటంలేదా?

 3. మీరు మార్క్సిస్ట్ అయ్యుండీ ఆ తల్లితండ్రులకి అనుకూలంగా వ్రాయడం బాగాలేదు. పిల్లలని బెల్ట్‌తో కొట్టి చదివిస్తే పిల్లలు పెద్దైన తరువాత హై-ప్రొఫైల్ ఉద్యోగులై డబ్బులు సంపాదించి తీసుకొస్తారని ఆశపడే తల్లితండ్రులు లిమిటేషన్స్ గురించి ఆలోచించరు. ఇది నాకు స్వయంగా ఎదురైన అనుభవం. చిన్నప్పుడు నేను మా నాన్న ఒక్కడే మూర్ఖుడని అనుకున్నాను. అలాంటి మూర్ఖులు మరి కొంత మంది ఉన్నారని తరువాత తెలిసింది.

 4. పిల్లవానికి వాతలు పెట్టిన తల్లిదండ్రులు క్షమార్హులు కాదు. వాతలు తినడం అదీ సరంక్షించాల్సిన తల్లిదండ్రుల వద్దే హీనాతిహీనం. ఇక్కడ భారతీయతా, మరో దేశభక్తి ముసుగేసుకొని తల్లిదండ్రులను వెనుకేసుకురావడం మంచిది కాదు.
  అభం శుభం తెలియని పసిపిల్లవాడు వాతలు, బెల్టుతో దెబ్బలు తిన్నా పర్వాలేదు గానీ అన్నీ తెలిసిన పెద్దలు అందుకు పద్దెనిమిది నెలలు జైల్లో వుండటం ఎలా అన్యాయం?
  ఇది రెండు సామాజిక వ్యవస్థల మధ్య వైరుధ్యం కాదు. చట్టానికి లోబడం, గౌరవించడం తెలియనితనం. పిల్లవానికి వాతలు పెట్టి దండించని ఏ భారతీయ చట్టం లేదా మతం చెబుతోంది?

  నార్వే పోలీసులు వున్నాయని చెబుతున్న వాతలు, మచ్చలు అబద్దాలా? న్యాయస్థానం అవి చూడకుండానే గుడ్డిగా శిక్ష వేస్తుందా? నార్వేకి, నార్వే పోలీసులకు ఈ తల్లిదండ్రులేమయినా శత్రువులా?

  ” కానీ ఆ పేరుతో సంవత్సరన్నర పాటు సాయి శ్రీరామ్ కి తల్లిదండ్రుల సంరక్షణను దూరం చేసే హక్కు ఒక పరాయి రాజ్యానికి ఎక్కడినుండి వస్తుంది?”
  మీరిలా అమాయకత్వం ఒలగబోయడం బాగాలేదు. ఏ దేశ పౌరుడైనా నివసిస్తున్న దేశ చట్టాలకు లోబడి వుండాల్సిందే! అది భారతదేశమైనా, నార్వే అయినా! నార్వే చట్టం ప్రకారం వారు శిక్షార్హులు. ఇందులో ఇక పరయి రాజ్యం, స్వంత రాజ్యం అనేదానికి తావెక్కడ?

  ” అందుకే పిల్లల్ని కొట్టకూడదు అంటే వారి మంచికోసమే కదా అని గాఢంగా నమ్ముతారు. బెల్టుతో కొట్టినా, బెత్తంతో చితకబాదినా అది వారి మంచికోసమే అని నమ్మి ఆచరిస్తారు. భార్యని కొట్టడం భర్త హక్కు అని నమ్ముతారు. అది నేరం అనిచెబితే తెగ ఆశ్చర్యపడిపోతారు.”
  ఇది నిజం. పర్యవసనమే శిక్ష. అందుకు మనం చంకలు గుద్దుకోవక్కరలేదు. మనం చేయలేని పని పరాయి దేశం చేసిందని సంతోషపడాలి. దీనితోనైనా కొద్ది మంది తల్లిదండ్రుల్లోనైనా మార్పు వస్తుందేమొ చూద్దాం!

 5. మనోహర్ గారు,

  భారత ప్రభుత్వం చేవచచ్చి ఉందనడంలో సందేహం లేదు. మత్స్యకారుల హత్య విషయంలో చట్టాల్లో తగిన అవకాశం లేకపోయినా హంతకులను తామే విచారిస్తామని ఇటలీ అదే పనిగా ఒత్తిడి తెచ్చి పూర్తిగా కాకపోయినా బెయిల్ ఇప్పించుకోవడం వరకైనా సఫలం అయింది. భారత ప్రభుత్వం అసలా ప్రయత్నమే చేయలేదు. శ్రీరామ్ తల్లిదండ్రులతో టచ్ లో ఉన్నామని చెప్పడం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదు. అదే జి.ఎం.ఆర్ విషయంలో మాత్రం గట్టిగా ఒత్తిడి తెస్తోంది. జి.ఎం.ఆర్ ధనవంతుడు గనక, తృణమో పణమో ముడుతుంది గనక ఆయన కోసం పరుగులు పెడతారు. చంద్రశేఖర్ కుటుంబానికి ఆ శక్తిలేదు గనక వెనకా ముందూ చూస్తారు. మీ ఈ విశ్లేషణలో వాస్తవం ఉంది.

  మనదేశంతో పోలిస్తే నార్వే సాపేక్షికంగా అభివృద్ధి చెందిన దేశం. సామాజికంగా కూడా మహిళల, పిల్లల హక్కుల రక్షణకు చట్టాలు చేసుకునేంతగా అభివృద్ధి చెందిన దేశం. అయితే అది సాపేక్షికంగా మాత్రమే. అది ఆదర్శవంతమైన దేశమన్న అభిప్రాయం నాకు లేదు. కానీ, ఇరు దేశాల సంస్కృతీ, సమాజాల్లో ఉన్న తేడాను పరిగణించకపోతే అది తప్పవుతుంది. వ్యక్తులంతా సమాజం మలిచినవారే. సమాజాన్ని మలిచే ప్రక్రియ పైవర్గాల చేతుల్లో ఉంది. వారికి అవసరమైన పరిమితుల మేరకే చట్టాలు, సూత్రాలు చేస్తారు తప్ప పౌరులందరి సర్వతోముఖాభివృద్ధికి ధనికవర్గాల చేతుల్లో ఉండే పాలకులు కట్టుబడరు. ఆ విధంగా నార్వే అభివృద్ధికి అనేక పరిమితులు ఉన్నాయి. ఈ విషయాన్ని నేను ఆర్టికల్ లో చెప్పాను.

  మన దేశంలో పిల్లలను కొట్టినందుకు తల్లిదండ్రులను శిక్షించే చట్టాలు లేవు. విద్యార్ధులను కొట్టినందుకు టీచర్లను దొషులుగా చేసే చట్టాలు కూడా లేవు. విద్యార్ధులను కొట్టకుండా టీచర్లను నిరోధించడానికి కేంద్రం ఈ మధ్యనే ఒక చట్టాన్ని ప్రతిపాదించింది. ఎల్.కె.జి పిల్లల్ని కూడా వాతలు తేలేలా కొట్టే స్కూళ్ళు ప్రతి సందులో కనిపిస్తాయి. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి వాళ్ళ కొడుక్కి నాలుగేళ్ళు. ఆ అబ్బాయిని టీచర్లు వాతలు తేలేలా ఎక్కడంటే అక్కడ కొడుతుంటే వారం క్రితమే టీచర్లని నేనే హెచ్చరించి వచ్చాను. కొడితేనే పిల్లలు దారిలో పడతారు అనే భావాజాలం ఇప్పటికీ భారతదేశంలో విరివిగా ఉంది. దానివల్ల నార్వే లాంటి చట్టాలు చేయడానికి ప్రభుత్వాలు కూడా సాహసించవు. ఈ సామాజిక పరిస్ధితుల్లో ఉండే తేడాలని చూడకపోతే ఆయా సంఘటనలపట్ల సరైన నిర్ధారణకు రాలేము.

  యూరోపియన్ దేశాల గొప్పతనం ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు. నిజానికి ఆ దేశాల వలస ఆక్రమణల వల్లనే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో అభివృద్ధి స్తంభించిపోయింది. ఆర్ధిక అభివృద్ధి వల్లనే సామాజిక అభివృద్ధి సాధ్యం అవుతుందని గుర్తుపెట్టుకుంటే భారత దేశ ఆర్ధిక అభివృద్ధిని బ్రిటన్ అడ్డుకోవడం వల్లనే సామాజిక అభివృద్ధి కూడా తగినంతగా ముందుకు సాగలేదని గ్రహించవచ్చు. ఆ విధంగా యూరోపియన్ దేశాలు నేరస్ధ రాజ్యాలే తప్ప గొప్ప రాజ్యాలు కాదు. బైటి దేశాల జోక్యం లేనట్లయితే ఏ దేశ ప్రజలైనా తమంతట తాము అభివృద్ధి చెందే శక్తిని కలిగి ఉంటారు. ఇండియా, చైనా, అరబ్ దేశాల నాగరికతలు యూరోపియన్ నాగరికతల కంటే ప్రాచీనమైనవి. యూరోపియన్ల స్వార్ధం, వలస దురాక్రమణలు ఆ దేశాల అనాగరికతనే చెబుతాయి తప్ప అభివృద్ధిని కాదు.

  ఐర్లండ్ విషయంలో కూడా మీరు చెప్పింది నిజం. ఆ ఘటనే ఇక్కడ జరిగితే చిలవలు పలవలు చేసేవారు. అలా చేయగల శక్తి వారి మీడియాకి ఉంది.

 6. ప్రవీణ్ గారు

  సంఘటనని అన్నీ కోణాల్లో చూస్తూ విశ్లేషించడమే మార్క్సిజం చేసే పని. ముఖ్యంగా సామాజికార్ధిక కోణాలనుండి వివిధ వ్యక్తులను, సమాజాలనూ, సంఘటనలను విశ్లేషించాలని మార్క్సిజం చెబుతుంది. నార్వే ఘటనను ఆ విధంగా చూడడానికి నేను ప్రయత్నించాను.

  తల్లిదండ్రులు అమూర్త జీవులు కాదు. వారు తాము నివసించే సమాజాల భావజాలాలకి బందీలై ఉంటారు. తమ చుట్టూ ఉన్న పరిస్ధితులకు భిన్నంగా ఆలోచించే పరిజ్ఞానం అందరికీ ఉండదు. ఇక సమాజం గీసే గీతలను అధిగమించి అభ్యుదయకరంగా ప్రవర్తించే పరిస్ధితి ఎందరికి ఉంటుంది? వ్యక్తులను అంచనా వేసేటపుడు వారు నివసించే సమాజాల పరిమితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. సమూల మార్పులు రావాలంటే విప్లవాలే పరిష్కారం అని మీకు వేరే చెప్పాలా?

 7. చరసాల గారు

  నేరమూ, శిక్ష అనేవి లీనియర్ అంశాలు కావని నా అభిప్రాయం. చట్టాల్లో పొందుపరిచి ఉండే నేరాలన్నింటికీ మక్కీకి మక్కీ అభియోగాలు మోపి, శిక్షలు వేస్తూ పోతే జైళ్ల బయట కంటే లోపలే ఎక్కువమంది ఉంటారు. “మనలో పాపం చేయనివాడు…” అన్న పాట చెప్పినట్లు రాయివేసే అర్హత ఉన్నవారు ఎవరూ మిగలరు. నేరాలు అనేవి నిర్దిష్ట సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్ధుతుల నేపధ్యంలో జరుగుతాయి. ఆ పరిస్ధితులను పరిగణించకపోతే తప్పు జరిగింది కాబట్టి శిక్ష తప్పదన్న లీనియర్ అనాలసిస్ కి వచ్చే అవకాశం ఉంటుంది. (మనోహర్ గారికి ఇచ్చిన సమాధానం ఒకసారి చూడగలరు.)

  ఈ కేసులో చూసుకుంటే పిల్లవాడి ద్వారా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించుకోవడంలో జరిగిన తప్పిదం వలన నేరం జరిగింది. నార్వేలో చట్టం ఉందిగనుక అది నేరం అయింది. కానీ భారతదేశంలో అటువంటి చట్టాలు లేవు గనుక అదిక్కడ నేరం కాదు. సామాజిక వ్యవస్ధల వైరుధ్యాలు జైలు శిక్షకు ఒక కారణమని నేను అందుకే చెప్పింది. చంద్రశేఖర్, అనుపమలు నార్వేలో పుట్టి పెరిగినట్లయితే అక్కడి సామాజిక అలవాట్లు, భావజాలం, చట్టాలు… వీటికి తగినట్లు నడుచుకుని ఉండేవారు.

  భారతీయత, దేశభక్తి ల గురించి నేను చెప్పలేదనుకుంటా. తల్లిదండ్రులను వెనకేసుకు వచ్చింది కూడా లేదు. అలాగే పిల్లలని కొట్టినా ఫర్వాలేదని కూడా ఆర్టికల్ లో చెప్పలేదు. పైగా అది సరికాదని కూడా చెప్పాను. పిల్లవానికి వాతలు పెట్టి దండించమని ఏ భారతీయ చట్టం లేదా మతం చెప్పిందో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేను గానీ అలా దండించడం నేరం అని చెప్పే చట్టాలు మాత్రం ఇక్కడ లేవు. చట్టాలు లేక అలాంటివి ఎక్కడయినా పోలీసుల దాకా వస్తే వారు కొట్టడాన్ని నేరంగా చెప్పే సాధారణ సెక్షన్లు పెడుతున్నారని ఈ మధ్యాహ్నమే హై కోర్టు లాయర్ ఒకరు టి.వి5 లో చెబుతుంటే విన్నాను.

  మీకో విషయం చెప్పాలి. స్కాండినేవియన్ దేశాలు పిల్లల చట్టాలతో అతిగా స్పందిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఒకసారి చీవాట్లు పెట్టింది. దండించే తల్లిదండ్రులనుండి పిల్లలను కాపాడమంటే అర్ధం పిల్లలను తల్లిదండ్రులనుండి వేరు చేయమని కాదనీ, అలా వేరుచేస్తే చాలా కేసుల్లో పిల్లల హక్కులకే నష్టం వస్తోందనీ ఐరాస వ్యాఖ్యానించింది. పిల్లల హక్కుల్లో తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు కూడా ఒకటనీ ఒక హక్కుని కాపాడబోయి మరో హక్కును తీసేయడం సరికాదనీ ఐరాస చెప్పింది. కనుక నార్వే చట్టాలపైన, ఆ చట్టాల అమలుపైనా అతిగా ఆశలు పెట్టుకోనవసరం లేదు.

  శిక్ష అనేది నేరాలు జరగకుండా నివారించడానికే తప్ప బాధితుల తరపున రాజ్యం ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. వివిధ దేశాల సామాజిక దశలకు అనుగుణంగా చట్టాలు ఉనికిలోకి వస్తాయి. ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని ఊహించుకుని దానికి అనుగుణంగా చట్టాలు చేస్తే అలాంటి చట్టాలే నేర స్వభావాన్ని సంతరించుకునే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా చట్టాలు, కోర్టులు చేసేదంతా మంచే అన్న నమ్మకం నాకు లేదు.

  అమాయకత్వం గురించి: ఆర్టికల్ లో చెప్పినట్లు ఒకానొక మానసిక సమస్యతో బాధపడుతున్న పిల్లాడి పెంపకంలో సాయం చెయ్యమని తల్లిదండ్రులు కోరితే దానికి నార్వే ప్రభుత్వం నిరాకరించింది. వారు నార్వే పౌరులు కాదు గనక సహాయం చెయ్యలేమని అక్కడి ప్రభుత్వం చెప్పింది. కానీ అదే పౌరులు కానివారికి నేరచట్టాన్ని వర్తింపజేసింది. అదేమీ న్యాయం అన్నదే నా ప్రశ్న. నేను కాదు, సహాయం నిరాకరించడం ద్వారా తాను పరాయి రాజ్యాన్నని నార్వేయే చెప్పింది.

  రాజ్యమూ, పౌరుల మధ్య సమూల మార్పులు తెచ్చే విప్లవాలతోనే పరిష్కారం అయ్యే మౌలిక వైరుధ్యం ఉంది. అందుకే రాజ్యాల ప్రస్తావన తెచ్చాను. వివరణ ఆర్టికల్ పరిధిలో లేనందున ఇవ్వలేదు.

 8. విశేఖర్ గారూ,
  మీ అనాలసిస్ తో చాలా మట్టుకు నేను ఏకీభవిస్తున్నాను. ఏ దేశపు చట్టమైనా పరిపూర్ణమనీ లోపాలు లేనిదనీ ఎవరూ చెప్పలేరు. ఏదైనా దేశంలో నివసిస్తున్న వ్యక్తి ఏ దేశపు పౌరుడైనా సరే అతిధేయ దేశపు చట్టాలకు లోబడి వుండాల్సిందే!
  నా బాధ ఏమిటంటే ఈ సమస్యమీద స్పందిస్తున్నవారు పిల్లలను భాధించడమనేది అతి మామూలు విషయమన్నట్లూ నార్వే కక్షగట్టి ఇదంతా చేస్తున్నట్లూ భావిస్తున్నారు. అది సరి కాదు. మంచో చెడో వారు వారి చట్టాలని బట్టి బోతున్నారు. ఆ కేసులో భారతీయ దంపతుల స్థానంలో నార్వే దంపతులున్నా శిక్షలు అలానే వుంటాయి. TCSలో పనిచేస్తున్న software engineerకి అక్కడి చట్టం తెలియదని నేననుకోను. మన ఇంట్లో జరిగింది బయటకు ఎలా తెలుస్తుందనే ధీమా! ఇంత ధీమాగా నేనెందుకు చెప్పగలుగుతున్నాను అంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను గనుక.

  అతి ఏదైనా మంచిది కాదు. కానీ ఇక్కడ నేనిది అతి అనుకోవటం లేదు. మన మీడియా చేస్తున్నదే అతి అనిపిస్తున్నది. కారణం మీరు విశ్లేశించిందే! సమస్యను మన వాతావరణంలోనుండీ పరికిస్తే ఇది చాలా చిన్న సమస్య అనిపిస్తుంది. కానీ అది ఇక్కడ పెద్ద నేరం. నిజం చెప్పాలంటే మీరన్నట్లు ఇలాంటి నేరాలకు శిక్షలు వేస్తూ పోతే చాలా మందిని జైల్లో పెట్టాల్సివుంటుంది. అయితే ఇలాంటి ఒక్క కేసు చాలా మంది ప్రవర్తనలో మార్పు తెస్తుందని నా ఆశ.

  ఇక ప్రభుత్వం సహాయం చెయ్యడానికి నిరాకరణ గురించి. కొన్ని కొన్ని సహాయాలు పౌరులకు మాత్రమే పరిమితం. మన దేశంలో పరాయి దేశస్తుడికి ఎంత బీదవాడఈనా రేషన్ కార్డు ఇచ్చి వృద్దాప్య పించను ఇస్తామా (చట్ట ప్రకారం)? అలా సహాయం అందలేదని ఎవరైనా రేషన్ షాపులో దొంగతనానికి ఎగబడితే చట్టం శిక్షించకుండా వుంటుందా? సహాయం అందనంత మాత్రాన మిగతా చట్టాలనుండీ వ్యక్తులకు మినహాయింపు రాదు.

 9. శేఖర్ గారన్నట్టుగా ఈ విషయంలో చాలా వైరుధ్యాలతో పాటుగా ఇంకా సున్నితమైన విషయాలు కూడా ముడి పడి ఉన్నాయి. భారత్, నార్వే దేశాలలోని చట్టాలలో ఉన్న తేడా, పిల్లల పెంపకం గురించిన వ్యవహారంలో అభిప్రాయబేధాలు, వీటితో పాటుగా పిల్లవాడి వ్యవహారం- దాని పట్ల తల్లి తండ్రులు, నార్వే ప్రభుత్వం ప్రతిస్పందించిన తీరు కూడా ఇక్కడ కనపడుతున్నాయి.

  పిల్లలతో వ్యవహరించిన తీరుకు శిక్షకు గురైన దంపతులు ఒక అంశమైతే, అసలే ఆందోళనాపరమైన సమస్యలతో ఉన్న పిల్లవాడు తల్లితండ్రులకు దూరంగా ఎలా ఉండగలడన్న ప్రశ్న మరొక అంశంగా కనపడుతుంది.

  ఏది ఏమైనా పిల్లలకు ఉపయోగకరంగా తమ చట్టాలు ఉండాలని నార్వే భావించి ఉన్నట్లయితే పిల్లవాడితో పాటుగా తల్లిదండ్రులకు కూడా మానసిక నిపుణునితో తగిన కౌన్సిలింగ్ ఇప్పించి ఉండేది. చట్టాలు అమలు విషయంలో యాంత్రికతతో కూడిన అతి కనిపిస్తుంది.

 10. చరసాల గారూ,

  చట్టాలు, కోర్టులకు పరిమితులు ఉంటాయనీ, సామాజిక సమస్యలను, కుటుంబ సమస్యలను అవి పూర్తిగా పరిష్కరించలేవనీ మీ వ్యాఖ్యలోనూ స్ఫురిస్తోంది. మీరు చెప్పినట్లు ఈ కేసు అనేకమంది ప్రవర్తనలో మార్పుతెచ్చే అవకాశం లేకపోలేదు. కానీ దానికంటే ముఖ్యమైనది సామాజిక చింతనలో రావలసిన మార్పు. ఇది ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. చదువుతో పాటు ఇతర మార్గాల ద్వారా ఆవేర్ నెస్ కలుగజేసే శక్తి ప్రభుత్వాలకి ఉంటుంది. కానీ అలాంటి నిబద్ధత వాటికి ఉండడం షరతు.

  సహాయం అందనంత మాత్రాన ఇతర చట్టాలనుండి మినహాయింపు కోరలేమన్నది నిజమే. ఇక్కడకూడా నేను చెప్పిన రెండు సమాజాల వైరుధ్యాంశం తొంగి చూస్తోంది. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించేవైపుగా అంతర్జాతీయ సంస్ధలు కృషి చేయాలని భావించడం తప్ప ఇప్పుడు చేసేదేమీ లేదు.

 11. ఈ అంశం మీద చాలా చోట్ల చర్చలు చూశాను. కానీ ఇంత లోతుగా…సామాజిక వ్యవస్థల మధ్య అంతరం అనే కోణంలో మీ బ్లాగ్ లోనే చూశాను. ఈ సమస్యలో మీరు చూపిన కోణం కూడా ఆలోచింపజేసేలా ఉంది.
  చట్టానికి కళ్లులేవు అన్నట్లుగా… నార్వే గుడ్డిగా చట్టాలు అమలు చేస్తోంది తప్ప…ఈ కేసులో నేపథ్యాన్ని అర్థం చేసుకోవడంలో, ఘటన పూర్వ పరాలు. అనంతర పర్యవసానాలు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడంలో విఫలమైందనే చెప్పొచ్చు.
  చంద్రశేఖర్ కుటుంబీకులు హైకోర్టులో అప్పీలు చేసుకుంటామని చెప్పారు కనుక మన కేంద్ర ప్రభుత్వం…ఇప్పటికైనా వారికి వీలైన సాయం చేస్తే బాగుంటుంది.
  మొత్తంగా పిల్లల పెంపకానికి సంబంధించి, విదేశీ చట్టాల గురించి మన దేశం పునరాలోచించుకునేలా చేయడంలో ఈ కేసు ఓ కీలక ఘటనగా చెప్పుకోవచ్చు.

  తమ ఉద్యోగస్తులను విదేశాలకు పంపే మల్టీ నేషన్ కంపెనీలు….అక్కడి చట్టాల గురించి వారికి అవగాహన కల్పించే విషయంలో ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి.

 12. విశేఖర్ గారు, చిన్నప్పుడు నాకు మార్కులు కొంచెం పెరిగినా “నేను నిన్ను బెల్ట్‌తో కొట్టడం వల్లే నువ్వు ఇంత చదివావురా” అని చెప్పి మా నాన్న తనని తాను సమర్థించుకునేవాడు. మా నాన్న ఏ సామాజిక పరిస్థితిలో పుట్టి పెరిగాడో నాకు తెలుసు. మా తాతయ్య మా నాన్నకి LLB చదవడానికి కూడా రూపాయి ఇవ్వకుండా ఇనుప పెట్టేలో బంగారు నగలు & వెండి నాణేలూ దాచుకునేవాడు. అయినా మా నాన్న ఎలాగోలాగ LLB పూర్తి చేశాడు. నేను స్కూల్‌లో చదువుకునే రోజుల్లో నేను పాకెట్ మనీ అడుగుతాననే భయంతో నేను అడగకముందే మా నాన్న నన్ను కొట్టేవాడు. అది అతనికి తన తండ్రి నుంచు సంక్రమించిన ప్రవర్తనా లక్షణం అని నాకు తెలిసింది. కానీ తంద్రి మీద ఉన్న కోపాన్ని కొడుకు మీద చూపించడమే నాకు విరక్తి కలిగించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s