ఇరాన్ మందులు అమెరికాకి రక్ష, అమెరికా ఆంక్షలు ఇరాన్ కి శిక్ష


షరియాతి హాస్పిటల్, టెహ్రాన్ -ఫొటో: వాషింగ్టన్ పోస్ట్

షరియాతి హాస్పిటల్, టెహ్రాన్ -ఫొటో: వాషింగ్టన్ పోస్ట్

ఇరాన్ తయారు చేసిన ఔషధాలు ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులను కాపాడుతుంటే, అమెరికా ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు లక్షలాది ఇరానియన్ రోగులను చంపేస్తున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో పాము కాటుకి గురయిన అమెరికా సైనికులకి ఇరాన్ తయారు చేసిన విరుగుడు ఔషధాలు తప్ప మరో గతి లేదని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. ఆదివారం ప్రచురించిన ఒక రిపోర్ట్ లో పత్రిక ఈ సంగతి తెలిపింది. నైరుతి ఆసియా ప్రాంతానికి ప్రత్యేకమైన పాముల కాట్లకు గురవుతున్న అమెరికా సైనికుల ప్రాణాలు దక్కించుకోవాలంటే ఇరాన్ శాస్త్రజ్ఞులు పరిశోధించి తయారు చేసిన విరుగుడు ఔషధం మరింత అవసరమని అమెరికా రక్షణ విభాగం అధికారులు కోరుతున్నారని పత్రిక తెలియజేసింది.

ఆక్సస్ కోబ్రా, హేలీస్ పిట్ వైపర్ మొదలయిన పాములు ఆఫ్ఘనిస్ధాన్ లో తిష్టవేసిన దురాక్రమణ అమెరికా బలగాలను బలితీసుకుంటున్నాయి. “అమెరికా సెంట్రల్ కమాండ్ జారీ చేసిన వైద్యపరమైన మార్గదర్శకాల ప్రకారం ఇరానియన్ సంస్ధ ‘రజి వేక్సిన్ & సీరం రీసర్చ్ ఇనిస్టిట్యూట్’ తయారు చేసిన ఔషధాలు విష వ్యతిరేక చికిత్సకు అత్యంత అవసరం” అని ఒక అమెరికా అధికారిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. “ఇరానియన్ తయారీ యాంటీ వెనిన్ ధేరపీ అత్యుత్తమమైనది” అని దక్షిణ ఆఫ్ఘనిస్ధాన్ లో బ్రిటిషర్లు నడుపుతున్న ‘కేంప్ బేషన్ ఆసుపత్రి’ మెడికల్ డైరెక్టర్ కల్నల్ రాబ్ రస్సెల్ తెలిపాడని పత్రిక తెలిపింది. ఈ ఆసుపత్రి అమెరికా సైనిక స్ధావరం ‘కేంప్ లేదర్నెక్’ కి పక్కనే ఉందని తెలుస్తోంది.

వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రకారం అమెరికా తయారు చేసిన విష విరుగుడు ఔషధాలు ఆఫ్ఘనిస్ధాన్ లో ఎందుకూ కొరగాకుండాపోయాయి. ఈ ఔషధాలని అమెరికా అత్యున్నత సంస్ధ ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్.డి.ఎ) ఆమోదం పొందినవే అయినా ఆఫ్ఘన్ లో పనికిరాలేదు. “ఆఫ్ఘన్ పాము కాట్లకు ఈ ఔషధాలు పనిచేయవు” అని పత్రిక తెలిపింది.

ఇరానియన్ సంస్ధ ‘రజి వేక్సిన్ & సీరం రీసర్చ్ ఇనిస్టిట్యూట్’ అధికారులు అమెరికాకి తమ ఔషధాలు సరఫరా చేయడానికి వ్యతిరేకంగా ఏమీలేరు. రోగులను కాపాడడానికే తాము ఔషధాలు తయారు చేస్తున్నామనీ, రోగులు ఇరానియన్లయినా, అమెరికన్లయినా తమకు ఒకటే అనీ వారు చెప్పారని ప్రెస్ టి.వి తెలిపింది. “ప్రాణాలు కాపాడడానికి మేము ఈ మందులు తయారు చేస్తున్నాం. వ్యక్తులు ఇరానియనా, ఆఫ్ఘనా లేక అమెరికనా అనేది అనవసరం. అతను అమెరికా సైనికుడైనా సరే, ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడామంటే అది మాకు ఎంతో సంతోషం” అని ఇరానియన్ సంస్ధలో ప్రధాన పరిశోధకుడు డాక్టర్ హాది జారే అన్నాడు.

ఫొటో: ప్రెస్ టి.వి

ఫొటో: ప్రెస్ టి.వి

అంతర్జాతీయ చట్టాలను అడ్డంగా ఉల్లంఘిస్తూ అమెరికా విధించిన అమానవీయ ఆంక్షలు లక్షలాది ఇరానియన్ రోగుల ఉసురు తీస్తున్నాయి. ఇరాన్ కి మందులు ఎగుమతి చేసే కంపెనీలు అమెరికా ప్రభుత్వం నుండి ప్రత్యేక లైసెన్సులు పొందాలని అమెరికా ఆంక్షలు విధించింది. ఈ లైసెన్సులు పొందేందుకు ఎదురయ్యే సవాలక్షా నిబంధనల వలన ఎగుమతులకు ఎవరూ ముందుకు రావడం లేదు. దానితో పసి పిల్లలకు పాలాడబ్బాలు దొరకడం కూడా ఇరాన్ లో కష్టంగానూ, ప్రియంగానూ మారింది. ఇరాన్ తో వాణిజ్యం చేసే కంపెనీలకు అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరగకుండా అమెరికా, యూరప్ లు అడ్డుకుంటున్నాయి. ఇరాన్ ఆయిల్ ని కొనుగోలు చేయడానికి ఇండియాకి కూడా ఇదే సమస్య ఎదురుకావడంతో ఇరానియన్ ఆయిల్ దిగుమతులను ఇండియా బాగా తగ్గించుకుంది. దానివలన చౌకయిన, నాణ్యమైన క్రూడాయిల్ దిగుమతులను ఇండియా కోల్పోయింది. సరిగ్గా ఇదే పరిస్ధితి వలన ఇరాన్ కి ఔషధాలు ఎగుమతి చేయడానికి కంపెనీలకు మార్గం లేకుండా పోయింది.

ధలమేసియా, హీమోఫీలియా, కిడ్నీ వ్యాధులు, మల్టిపుల్ స్కెలేరోసిస్, కేన్సర్ మొదలయిన జబ్బులకు ఔషధాలు దిగుమతి చేసుకోవడం ఇరాన్ కి అత్యవసరం. ఈ మందులు తయారు చేసే కంపెనీలు అమెరికా ఆంక్షల వలన ఇరాన్ వాణిజ్యాన్ని మానుకున్నాయి. ఈ విషయం తెలియజేస్తూ ఇరాన్ అధికారులు, వివిధ ఛారిటీ సంస్ధలు ఐరాస అధిపతి బాన్-కి-మూన్ కి గత ఆగస్టులో లేఖ రాశాయి. అమెరికా చట్ట వ్యతిరేక ఆంక్షల వలన కనీసం 6 మిలియన్ల రోగులకు మందుల అందడం లేదనీ, ఆంక్షల వల్ల ఇరానియన్ ప్రజల ప్రాణాలకు కలుగుతున్న ప్రమాదాన్ని నివారించాలని అవి కోరాయి. ఈ సంగతిని ఐరాస అధిపతి తన తదుపరి నివేదికలో ప్రస్తావించాడు కూడా. ఇరాన్ లో మానవతా చర్యలపై ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని బాన్ తన నివేదికలో తెలిపాడు. “ఇరాన్ కి ఆహారం, మందులు సరఫరా చేయడానికి లైసెన్సులు పొందిన కంపెనీలకు కూడా చెల్లింపులు పొందడానికి ఇతర దేశాల్లో బ్యాంకులు సహకరించడం లేదు. చెల్లింపులు చేయడం చాలా కష్టంగా ఉంది” అని బాన్ కి మూన్ తన నివేదికలో తెలపడాన్ని బట్టి ఇరానియన్ ఆంక్షల ద్వారా అమెరికా ఎవరిని టార్గెట్ చేసుకున్నదో గ్రహించవచ్చు.

అమెరికా ఆంక్షలు ఇరాన్ ప్రజలకు ఎంత ప్రాణాంతకంగా మారాయంటే అమెరికా పత్రికలు కూడా ఆంక్షలవల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను సమతూకం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సలహాలు ఇస్తున్నాయి. మానవతా పరిధులను దాటి అమెరికా విధించిన ఏకపక్ష ఆంక్షలు చివరికి ఇరాన్ ని ఏకాకి చేసేందుకు అమెరికా వేస్తున్న ఎత్తుగడలకు దాని మిత్రుల్లో కూడా మద్దతు లేకుండా పోయే ప్రమాదం ముంచుకొచ్చిందని లాస్ ఏంజలిస్ టైమ్స్ పత్రిక విశ్లేషించింది. ఆ మేరకు అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తునారని సదరు పత్రిక అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ ప్రజలకు, వారి ప్రయోజనాలకు ఎంతగా నష్టం వాటిల్లుతున్నప్పటికీ ఇరాన్ మాత్రం అమెరికా సైనికులకు ఔషధాలు సరఫరా చేయడానికి సుముఖంగా ఉంది. సామ్రాజ్యవాద దేశాల పాలకులతో పోలిస్తే ఇరాన్ జాతీయ పాలకులకు ఉన్న సాపేక్షిక ప్రజానుకూల దృక్పధాన్ని ఇది తెలియజేస్తున్నది. జాతీయ శక్తులను సామ్రాజ్యవాద శక్తులతో పోలిస్తే మెరుగైన స్ధానంలో నిలిపే లక్షణాలలో ఇది ఒకటి కావచ్చు. ఇరాన్ ప్రజల ఔషధ ప్రయోజనాలను చెరబట్టినట్లే భారత ప్రజల ఆయిల్ ప్రయోజనాలను కూడా అమెరికా చెరబట్టింది. రెండు స్వతంత్ర దేశాలయిన ఇండియా, ఇరాన్ ల మధ్య ఆయిల్ వాణిజ్యాన్ని నియంత్రించడానికి అమెరికా పూనుకోవడం దానికి భారత పాలకులు తలఒగ్గడాన్ని బట్టి ఇరాన్, ఇండియా పాలకుల స్వభావాల మధ్య వైరుధ్యం ఏమిటో తెలుస్తున్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s