తమిళనాడులో ప్రమాదకర ధోరణి, దళితుల అణచివేతకు ఐక్యమవుతున్న కులశక్తులు


Dharmapuri caste violence 04ధర్మపురి జిల్లాలో జరిగిన కులాంతర వివాహం, అనంతరం జరిగిన గృహ దహనాలు దళిత వ్యతిరేక కులదురహంకార శక్తుల ఐక్యతకు మార్గం వేసినట్లు కనిపిస్తోంది. అత్యంత వెనుకబడిన కులం (ఎం.బి.సి) గా తమిళనాడు ప్రభుత్వం గుర్తించిన వన్నియార్ కులసంఘాన్ని పునాది చేసుకుని దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటనను అణచివేసేందుకు కులరాజకీయ శక్తులు కుట్రలు చేస్తున్నాయి. వన్నియార్ కులతత్వం ఆధారంగా ఆవిర్భవించి బలపడిన పి.ఎం.కె అనే రాజకీయ పార్టీ ఇటువంటి తీవ్ర అభివృద్ధి నిరోధకమైన ఎజెండాను తమిళనాడులో ప్రవేశపెట్టి సమాజ ప్రగతిని ఆటంకపరచడానికి పూనుకుంది. దేశవ్యాపితంగా దశాబ్దాల తరబడి సాగిన దళితుల ఊచకోతలను నిరోధించడానికి వీలుగా దళిత ఉద్యమాలు సాధించుకున్న ఎస్.సి/ఎస్.టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరుగార్చడానికి ఈ స్వార్ధశక్తులు ప్రయత్నాలు ప్రారంభించాయి.

పి.ఎం.కె వ్యవస్ధాపక నాయకుడు రామదాస్ ఆదివారం దళితులకు వ్యతిరేకంగా వివిధ మధ్యస్ధాయి కులాలను సమావేశపరిచాడు. సమావేశంలో ఆయన దళితకులాల ప్రజలపై విషం కక్కుతూ విద్వేషపూరిత ప్రసంగం చేశాడు. దళితేతర సంస్ధలు ఒకటి కావాలనీ, ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల నిరోధక చట్టం నీరుగార్చడానికి ఉద్యమాలు చేపట్టాలనీ ఆయన పిలుపిచ్చాడు. ‘షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం 1989’ చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్ చేశాడు. దళిత యువత తప్పుడు ఫిర్యాదులు చేసి సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారనీ, బోగస్ ప్రేమలతో ఇతర కులాల అమ్మాయిలకు వలవేస్తున్నారనీ అసంబద్ధ ఆరోపణలు చేశాడు.

“ఇతర కులాల అమ్మాయిలను ఆకర్షించడానికి వాళ్ళు జీన్స్, టీ షర్ట్ లు ధరించి, ఫ్యాన్సీ కళ్ళజోళ్ళు పెట్టుకుని తిరుగుతారు” అని రామదాస్ దళిత యువకులపై పచ్చి విద్వేషాన్ని ప్రకటించుకున్నాడు. తమ వాదనకు మద్దతుగా పెటాకులయిన పెళ్లిళ్ల లెక్కలను వల్లిస్తూ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. విడిపోయిన జంటల, విఫలమయిన వివాహాల లెక్కలను తెలియజేస్తూ సదరు కులాంతర పెళ్లిళ్లన్నీ ప్రేమతో జరిగినవి కావనీ కులపరమైన కుట్రలతో జరిగినవనీ, అందుకే అవి విజయవంతం కాలేదనీ తీర్మానం అభివర్ణించింది. దళిత అబ్బాయిలతో ఇతర కులాల అమ్మాయిలు వివాహం చేసుకోవడాకి వ్యతిరేకంగా రామదాస్ సమావేశంలో మరోసారి ప్రకటన చేశాడు.

PMK leader Ramadoss -Photo: The Hindu

PMK leader Ramadoss -Photo: The Hindu

ధర్మపురి కులాంతర వివాహానికి ప్రతీకారంగా వందలాది దళితుల ఇళ్లను దోచుకుని తగలబెట్టిన సందర్భంగా తాను కులాంతర వివాహాలను వ్యతిరేకించలేదని దబాయించిన రామదాస్ ఆదేనోటితో మళ్ళీ కులాంతర వివాహాలపై విషం కక్కాడు. కులాంతర వివాహాలపైనే మద్రాసు హైకోర్టు మాజీ జడ్జిలతో విచారణ చేయించాలనేవరకూ రామదాస్ దళితవ్యతిరేక పైత్యం ప్రకోపించింది. సమాజంలో కులం తప్ప మరొక సామాజిక విలువే లేదన్నట్లుగా రామదాస్ కులపిచ్చి నీచస్ధాయిలో వ్యక్తీకృతమయింది. రామదాస్ దళిత వ్యతిరేక కులపిచ్చి ఎంతగా ప్రకోపించిందంటే కూలాంతర వివాహాలపై ఆయనకి ఉన్న వ్యతిరేకత కేవలం అమ్మాయిలు దళితేతరులైతేనే. దళితేతర అబ్బాయిలు దళిత అమ్మాయిలను వలలో వేసుకున్నా ఆయనకి అభ్యంతరం లేదు. ఇలాంటి అధములను కూడా భారతదేశ రాజకీయ వ్యవస్ధ చేరదీసి గౌరవప్రదమైన స్ధానం, హోదా కట్టబెట్టడమే భారత దేశానికి పట్టిన దౌర్భాగ్యం కావచ్చు.

పి.ఎం.కె నాయకత్వంలో జరిగిన దళిత వ్యతిరేక సమావేశంలో ప్రధానంగా మధ్యస్ధాయి సామాజిక హోదా కలిగిన కులాలు పాల్గొన్నాయని ‘ది హిందూ’ తెలిపింది. పి.ఎం.కె ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రకటించే వన్నియార్ కులం అత్యంత వెనుకబాటు కులం (Most Backward Caste) గా తమిళనాడు ప్రభుత్వం గుర్తించింది. ధర్మపురి కులాంతర వివాహం అనంతరం ఈ కులం వారు అంత కక్ష్యతో దళితుల ఇళ్లపై దాడి చేయడానికి కులాంతర వివాహం కంటే సామాజికార్ధిక కారణాలు ముఖ్య పాత్ర పోషించాయని ‘ది హిందూ’ తో సహా అనేకపత్రికలు విశ్లేషించిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

సామాజికార్ధిక కారణాలు

తమిళనాడు సామాజిక విశ్లేషకుల ప్రకారం ధర్మపురి వన్నియార్లు ఇటీవలివరకూ దళితులకంటే ఆర్ధికంగా పైస్ధాయిలో ఉన్నవారే. వారి ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వారి వ్యవసాయ కమతాల ద్వారా వచ్చిన ఆదాయం వన్నియార్లకు ఒకమేరకు మధ్యతరగతి జీవన స్ధాయిని ఇటీవలివరకూ కల్పించాయి. అయితే వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం, వర్షాధార పంటలు అంతకంతకూ లాభసాటి కాకపోవడంతో వారు తమ పోలాలను కౌలుకు ఇచ్చుకుని ఆ ఆదాయంతో సరిపెట్టుకున్నారు. స్వంతగా సాగు చేసుకున్నవారికి కూడా ఆర్ధిక ఎదుగులకు కొద్దిపాటి పొలాలు పెద్దగా సహకరించింది లేదు.

అయితే దళితుల పరిస్ధితి ఈ మధ్యకాలంలో సాపేక్షికంగా మెరుగయింది. కొద్దిపాటి చదువులతో వారు బెంగుళూరు, కోయంబత్తూరు లాంటి నగరాలకు వలసవెళ్లి ఉపాధి వెతుక్కున్నారు. కొందరు ఐ.టి.ఐ లాంటి చదువులతో వృత్తినైపుణ్యం సంపాదించి స్వంతగానో, ఉపాధి ద్వారానో ఆర్ధిక స్ధితిని మెరుగుపరుచుకున్నారు. తమ కుటుంబాలను ధర్మపురిలో ఉంచి పట్టణాల్లో చాలీ చాలని గదుల్లో, తినీ తినకా డబ్బులు కూడపెట్టుకుని కుటుంబాలకు పంపారు. ఆ విధంగా పిల్లలను చదివించుకుంటూ ఆస్తులు సమకూర్చుకున్నారు. ఈ క్రమంలో వారు వాహనాలు సమకూర్చుకున్నారు. ఇళ్ళలో ఫ్రిజ్, టి.వి, మిక్సీ లాంటి ఆధునిక వస్తుసామాగ్రి సమకూర్చుకున్నారు. కొంతమంది ద్విచక్ర వాహనాలు, అద్దె టాక్సీలు కూడా సమకూర్చుకోగలిగారు. వెళ్లమీద లెక్కించగల కుటుంబాలు ఏ.సి లు సైతం సమకూర్చుకున్నారు. రిజర్వేషన్లు ద్వారా అందుబాటులోకి వచ్చిన చదువులు, గుమాస్తా ఉద్యోగాలు కూడా ఇక్కడి దళితులకు ఆర్ధిక లబ్దిని సమకూర్చాయి.

దళితుల ఆర్ధిక వృద్ధి పొరుగునే ఉండే వన్నియార్ లాంటి మధ్యస్ధాయి కులాల జనానికి కన్నుకుట్టింది. నిన్నటివరకూ తమ పొలాల్లోనే కూలీలు చేసుకుని, వంగి వంగి దండాలు పెట్టుకుంటూ బతికిన దళితులు ఈరోజు స్వంతంగా ఆర్ధిక పరిస్ధితులను మెరుగుపరుచుకోవడం సహజంగానే ఈర్ష్యాసూయలను రేకెత్తించింది. తమిళనాడులో రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం కొన్ని దశాబ్దాలుగా వన్నియార్, దళిత కులాల మధ్య పి.ఎం.కె లాంటి శక్తులు వైరాన్ని రెచ్చగొట్టిపెట్టాయి. ఈ వైరం కూడా ధర్మపురిలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలను ఏర్పరిచింది.

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. కులాంతర వివాహం జరిగిన నాధం కాలనీ, దాని చుట్టుపక్కల గ్రామాల్లో గతంలో మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీలు (నక్సలైట్ పార్టీలు) గట్టి పునాదిని కలిగిఉన్నాయి. వారి ప్రభావం ఉన్నంతవరకూ ఇక్కడ వన్నియార్, దళితకులాలు అత్యంత ప్రశాంతమైన సహజీవనం సాగించాయి. నక్సలైట్ పార్టీల అండతో ఈ కులాల ప్రజలు వడ్డీదోపిడీలనూ, భూస్వామ్య ఆధిపత్యాలను ఎదిరించి నిలిచారు. గౌరవప్రదమైన సామాజిక సంబంధాలతో సహకార జీవనం సాగించారు. (అందువల్లనే కూతురి కులాంతర వివాహాన్ని సహించలేక ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాక ఇక్కడ కులవిద్వేష దాడులు జరిగినపుడు మొదట పోలీసులు ఆశ్చర్యపోయారు. పోలీసు అధికారులు ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రస్తావించారు.) ఆ తర్వాత ప్రభుత్వాలు క్రూర నిర్బంధాన్ని ప్రయోగించడం, ఎన్ కౌంటర్లలో పదులకొద్దీ కార్యకర్తలు చనిపోవడంతో నక్సలైట్ ఉద్యమం అంతరించింది. ఆ స్ధానాన్ని క్రమంగా పి.ఎం.కె లాంటి కుల సంఘాలు, విద్వేషపూరిత రాజకీయాలు ఆక్రమించుకున్నాయి.

ప్రగతిశీల భావజాలం స్ధానంలో విద్వేషపూరితమైన ప్రగతినిరోధక భావజాలం ప్రవేశించడంతో ప్రజల సామాజిక ఆలోచనలు కూడా వెనకకు ప్రయాణించాయి. కుల విద్వేష రాజకీయాల్లోనే అస్తిత్వం కలిగిఉన్న పార్టీలు, సంఘాలు ఈ పరిస్ధితి క్షీణించడానికి యధాశక్తి దోహదం చేశాయి. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా ఓట్ల కోసం వీరికి సహాయ సహకారాలు అందించాయి. ఫలితంగా ధర్మపురిలోని సామాన్య వన్నియార్ ప్రజలు దళితుల కొత్త ఆర్ధిక ప్రాభవంపై ద్వేషం పెంచుకున్నారు. నాధం కాలనితో పాటు మరో రెండు కాలనీలపై వారు జరిపిన దాడిలో ఈ ద్వేషం స్పష్టంగా వ్యక్తీకృతం అయింది.

టార్గెట్ చేసుకుని ఒక పద్ధతి ప్రకారం ఆస్తులను, వాహనాలను ధ్వంసం చేసి దహనం చేశారని జాతీయ ఎస్.సి, ఎస్.టి కమిషన్ అధికారి కాలనీల సందర్శన అనంతరం పత్రికలకు తెలిపాడు. నలభైకి పైకా ద్విచక్ర వాహనాలను తగలబెట్టారనీ, ఫ్రిజ్, మిక్సీ, వాషింగ్ మిషన్, బట్టల బీరువా లను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని తగలబెట్టారని ఆయన తెలిపాడు. విద్యార్ధుల స్కూల్, కాలేజీ సర్టిఫికేట్ లను వెతికి తెచ్చి కుప్పపోసి తగలబెట్టారని తెలిపాడు. చివరికి గ్యాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులను కూడా వదలకుండా తగలబెట్టారని తెలిపాడు. డబ్బు, నగలతో పాటు ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్గెట్లను దోచుకున్నారని తెలిపాడు. దళితుల కొద్దిపాటి ఆర్ధిక ప్రగతి, ఇతర అత్యంత వెనుకబడ్డ కులాలకు సైతం ఎంతగా విద్వేషాన్ని పెంచిందో ఈ దోపిడి, దహనాలు తెలియజేస్తున్నాయి.

అయితే ఏ కులంవారైనా శ్రమజీవులు, పేదలు స్వతహాగా కుల విద్వేషాలకు దూరంగా ఉంటారు. వీరిలోని సహజసిద్ధమైన సహజీవన తత్వాన్నీ, సహకార జీవనాన్నీ ధ్వంసం చేస్తున్నవారు, విద్వేష బీజాలు నాటుకోవడానికి ప్రధాన కారకులుగా ఉన్నవారు ఆధిపత్య వర్గాల రాజకీయ ప్రయోజనాలకు కట్టుబడిఉన్న శక్తులేనన్నది నిర్వివాదాంశం. ప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్ధలో ప్రతి ఒక్కరి ఓటుకీ విలువ వచ్చిచేరినందున ఆ ఓటు కోసం రాజకీయ పార్టీలు ప్రతి చిన్నా, పెద్దా అవకాశాన్ని వినియోగించుకునేందుకు తయారవుతున్నారు. అధికారం కోసం, దానిద్వారా వచ్చే ఆస్తుల కోసం అవి కులాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా ఓటు బ్యాంకులను స్ధిరపరచుకుంటున్నారు.

ఈ ఆస్తుల యజ్ఞంలో భారత నాగరిక సమాజం అభివృద్ధి చేసుకున్న సెక్యులర్, సమానత్వ విలువలు నిలువునా సమాధి అవుతున్నాయి. అందులో భాగంగా ప్రఖ్యాతిపొందిన సంఘ సంస్కర్తల ద్వారానైతేనేమీ, కమ్యూనిస్టు, నక్సలైటు పార్టీల వల్లనైతేనేమీ లేదా అంబేద్కర్ లాంటి దళిత సామాజిక వేత్తలవల్లనైతేనేమీ అభ్యుదయ సామాజిక శక్తిగా మన్ననలు అందుకున్న కులాంతర వివాహ వ్యవస్ధ ఈరోజు రాక్షసీకరించబడుతున్న దుర్గతి దాపురించింది. రామదాస్ లాంటి పచ్చి కులవిద్వేష రాజకీయులు ఇంత ధైర్యంగా కులాంతర వివాహాలపై బహిరంగంగానే విషం కక్కగలుగుతున్నాడంటే పైన చెప్పిన సామాజికార్ధిక కారణాలతో పాటు కమ్యూనిస్టు, విప్లవ శక్తుల దయనీయ వైఫల్యం కూడా ముఖ్య కారణమే. అత్యంత శక్తివంతమైన సిద్ధాంతాన్నీ, ఉద్యమాల నిర్మాణాలకు అవసరమైన నిర్మాణ సూత్రాలనూ చేరువలో ఉంచుకుని కూడా విప్లవకారులు, మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలు, కమ్యూనిస్టు పార్టీలు కనీస ఉద్యమాలకు సిద్ధపడకపోవడం నేరసమానం.

6 thoughts on “తమిళనాడులో ప్రమాదకర ధోరణి, దళితుల అణచివేతకు ఐక్యమవుతున్న కులశక్తులు

  1. కుల వ్యవస్థ చాలా కంప్లెక్సెడ్ ఇష్యూ. మొన్న నేను ఒరిస్సాలోని మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళాను. మా పెద్దమ్మ గారు & మా అన్నయ్య మాట్లాదుకుంటోంటే విన్నాను. బాకురుగూడ గ్రామంలో ఒక మంగలి కులస్తుడు దొమ్మరి స్త్రీని పెళ్ళి చేసుకున్నాడని దొమ్మరివాళ్ళూ, మంగలివాళ్ళూ కొట్టుకున్నారు. వాళ్ళ మాటలు విన్న తరువాత మా అన్నయ్యని ఒక ప్రశ్న అడిగాను “దొమ్మరి (దొంబా)వాళ్ళు ఒరిస్సాలో అత్యంత వెనుకబడిన కులంవాళ్ళు కదా, వాళ్ళకి కులం గురించి అంత పట్టింపులు ఉంటాయా? ఉంటే బ్రాహ్మణులకి ఆ స్థాయిలో కుల పట్టింపులు ఉంటాయి కానీ దొమ్మరివాళ్ళకి ఉండవు కదా?” అని. అప్పుడు మా అన్నయ్య ఇలా సమాధానం చెప్పాదు “పల్లెటూర్లలో అయితే ఉంటాయి కానీ టౌన్‌లలో ఉండవు” అని. టౌన్‌లో మనకి చాలా మంది వ్యక్తిగతంగా పరిచయమవుతారు. వాళ్ళందరి కులం పేరు అడిగే సమయం మనకి ఉండదు. పల్లెటూర్లలో అయితే గ్రామంలో రెండుమూడు కులాలవాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఫలానావాళ్ళ కులం పేరు సులభంగా తెలిసిపోతుంది.

    దీని గురించి మాట్లాడుకుంటున్న సమయంలో మా పెద్దమ్మగారు మరికొన్ని విషయాలు చెప్పారు. మా నాన్నగారు & పెదనాన్నగారు పుట్టిన ఊరిలో ఒకప్పుడు మా కులంవాళ్ళు కూడా దొమ్మరివాళ్ళని నమ్మేవాళ్ళు కాదట. మేము గిరిజనులం. పట్టణాలలో అగ్రకులాలవాళ్ళు మా కులంవాళ్ళని నమ్మరు. కానీ గ్రామాలలో మా కులంవాళ్ళు మా కంటే తక్కువ కులమైన దొమ్మరివాళ్ళని నమ్మేవాళ్ళు కాదు. మా నాయనమ్మ (నాన్న, పెదనాన్నల అమ్మ) & తాతమ్మ (నాయనమ్మవాళ్ళ అత్త) తమ ఇంటికి దొమ్మరివాళ్ళు వస్తే ఇంటిని నీళ్ళతో శుభ్రం చేసేవాళ్ళు. అదే రాష్ట్రంలోని సియాలి అనే గ్రామంలో మాకు ఇంకో తాతమ్మ గారు ఉండేవారు. ఆవిడ కాపులని కూడా నమ్మేవారు కాదు. నిజానికి కాపులది మా కులం కంటే ఆర్థికంగా ముందున్న కులమే. కానీ సియాలు గ్రామంలో కాపు కుటుంబాల కంటే మా కుటుంబం ఆర్థికంగా ముందుండేది. అందువల్ల మా తాతమ్మగారు కాపు కులానికి చెందిన పని మనుషులని వంటగదిలోకి రానిచ్చేవారు కాదు. డబ్బు ఒక్కటే మనిషి యొక్క ఆర్థిక స్థాయిని నిర్ణయిస్తే అతువంటప్పుడు కులం పేరు చెప్పుకోవడం ఎందుకు? అది శుద్ధ దండగ.

  2. తమిళ నాట రాజకీయ చరిత్రను పరిశీలిస్తే దేశానికి పట్టిన దరిద్రనికి ప్రధాన కారణాల మూలాలు అక్కడ దొరుకుతాయి. ఒక్కప్పుడు బ్రిటిష్ వాడి చంకనాకిన ఈ వర్గాలు, కుల వ్యవస్థకు బ్రాహ్మణులను రెస్పాన్సిబుల్ గా చేసి, వాళ్లు చాలా అభ్యుదయ వాదులమని ఫీలయ్యేవారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టి లోని బ్రాహ్మణులు పోరాడారు. అదే పెరియర్ గారు మాకు స్వాతంత్రం వద్దు, మమ్మల్ని మీరే పాలించండి అని బ్రిటిష్ వారి జాబు రాశాడు. స్వాతంత్రంవచ్చాక రెండు మూడు కులాలవారు తప్పించి, అన్నికులాల వారు వెనుకబడినవారు ప్రకటించుకొన్నారు. 60సం|| సుమారు 70% రిసార్వేషన్స్ అనుభవిస్తున్నారు. పేద బ్రాహ్మణులకు ఆర్ధిక స్థోమత ఆధారంగా కొద్దిపాటి రిసర్వేషన్ పదిసం|| కిందట అడిగితే, యునివర్సిటిలోని ప్రొఫెసర్ల సంఘం నిర్ద్వంద్వంగా దానిని తిరస్కారించారు. కొన్ని కులాలవారికి డబ్బులు పుట్లు పుట్లుగా ఉన్నా రిసర్వేషన్ సౌకర్యం మాత్రం నిర్లజ్జగా అనుభవిస్తున్నారు. వారికి ఆత్మ విమర్శ అనేదే లేదు. అటువంటి తమిళ నాడులో ఇప్పటికి బ్రాహ్మణులమీద పడి ఇంకా ఏడూస్తూండటం చూసి చాలా ఆశ్చర్య పోయాను. అదే వీరు దళితుల సమస్యను కొంచెం సానుభూతితో అర్థం చేసుకొని మాట్లాడిన ఒక్క బిసి కులం వాడిని అక్కడ పనిచేస్తున్నపుడు చూడలేదు. వాళ్లంతా చాలా ఉన్నత కులాలవారని వారి భావన. వారితో పోలిస్తే తెలుగు వారు ఎంతో ఉత్తములనిపిస్తుంది. తమిళులంటే నే తలకాయనొప్పి బాచ్. ఎన్నో రకాల భావాలు, నమ్మకాలు, స్వార్ధం, భాషాభిమానం అన్ని కలగలసి ఒకవిధమైన కంఫ్యుసేడ్ గాంగ్ గా అనిపిస్తారు.

  3. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం దేశవ్యాప్తంగా దుర్వినియోగమవుతోంది. వాటిల్లో 90 శాతం అనవసరంగా పెట్టిన కేసులే. దాని మీద ఇంతకాలానికి కనీసం ఒక్కఱైనా గొంతెత్తడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.

  4. దుర్వినియోగం అనే పేరుతో నిజానికి ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల చట్టాన్ని నీరు గార్చడానికి మొదట్నుండీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో పెరుగుతూ పోతున్న కుల దాడుల కేసుల్ని బట్టే ఆ చట్టాన్ని సమర్ధవంతంగా ఉపయోగపపెట్టలేదనడానికి రుజువు. కుల నిర్మూలనకి ప్రయత్నాలు మాని అత్యాచారాల నిరోధ చట్టాలని తప్పు పట్టడం, ఆ చట్టాలకి వ్యతిరేకంగా మాట్లాడడం చేస్తూ రామదాస్ లాంటి వాళ్లు కులాధిపత్యాన్ని ఇంకా పెంచడం కోసం కుట్రల చేస్తున్నారు. ఆ కుట్రలకి విద్యావంతులు మద్దతు ఇవ్వడం ఎంతమాత్రం క్షమార్హం కాదు. సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేని కులాల మురికిని వదిలించుకోవడం మాని సాధ్యమైన అన్ని రూపాల్లో దానికి వంత పాడడం నాకు చాలా ఏహ్య భావాన్ని కలిగిస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s