అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను చీత్కరిస్తూ పాలస్తీనాకు ఐరాసలో స్ధానం -1


welcome Palestine

ప్రపంచ పోలీసు అమెరికా, జాత్యహంకార ఇజ్రాయెల్ ల బెదిరింపులను చీత్కరిస్తూ ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితిలో చారిత్రాత్మక తీర్పును ప్రకటించాయి. పాలస్తీనా దేశానికి ఐక్యరాజ్యసమితిలో సభ్యేతర పరిశీలక రాజ్యం (non-member observer state) గా గుర్తింపునిస్తూ ఐరాస సాధారణ సభ (General Assembly) భారీ మెజారిటీతో నిర్ణయించింది. ఐరాసకు ఇచ్చే నిధుల్లో భారీ కోత విధిస్తామనీ, పాలస్తీనాకు ఇస్తున్న సహాయాన్ని కూడా ఆపేస్తామనీ అమెరికా అత్యున్నత స్ధాయిలో తీవ్రంగా సాగించిన బెదిరింపులను ప్రపంచ దేశాలు పెడచెవిన పెట్టాయి. ప్రపంచ ఆర్ధిక, వాణిజ్య, ద్రవ్య, రాజకీయ సంస్ధలను తన గుప్పెట్లో పెట్టుకుని పోలీసు పెత్తనాన్ని సాధించిన అమెరికా మొఖంపై చాచిపెట్టి కొట్టిన చెంపదెబ్బ పాలస్తీనా తీర్మానం రూపంలో దానికి ఎదురైన ఓటమి. పాలస్తీనా భూభాగం గాజాను ఆర్ధికంగా, భౌగోళికంగా, మిలట్రీపరంగా చుట్టుముట్టి వేలాది చావులకూ, గాయాలకూ, అంగవైకల్యాలకూ, రోగాలకూ కారణంగా నిలిచిన జాత్యహంకార ఇజ్రాయెల్ అమానుషత్వానికి నాగరిక ప్రపంచం తెలిపిన తిరస్కరణ పాలస్తీనా తీర్మానం గెలుపు.

138 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా అమెరికా, కెనడాలతో సహా 9 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 41 దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు. బ్రిక్స్ దేశాలుగా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం ఒక కీలక పరిణామం. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ సాగించే అమానుష  దాడులకు, హత్యలకు, యుద్ధ నేరాలకూ ఎటువంటి మినహాయింపు లేకుండా ప్రపంచ వేదికలన్నింటిపైనా మద్దతు ఇచ్చే అమెరికా దుర్మార్గపూరితమైన సామ్రాజ్యవాద విధానాలకు ఐరాస తీర్మానం చెంపపెట్టు. అమెరికా ప్రపంచాధిపత్యం ఒక్కో అడుగూ కూలిపోతున్నదని చెప్పేందుకు పాలస్తీనా తీర్మానం రూపంలో ఎదురైన ఓటమి ఒక గట్టి సూచన.

చరిత్రాత్మకం

పాలస్తీనా అరబ్బుల గడ్డపై 65 సంవత్సరాల క్రితం బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా లాంటి పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు కుట్ర చేసి ఇజ్రాయెల్ దేశాన్ని స్ధాపించిన నవంబర్ 29 తేదీనే చారిత్రాత్మక తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది. ఇప్పటివరకూ పాలస్తీనాకు ఐరాస లో పరిశీలక హోదాను మాత్రమే కలిగిఉంది. ఈ తీర్మానంతో సభ్యత్వంలేని పరిశీలక ‘దేశం’గా పాలస్తీనా ఐరాసలో గుర్తింపు పొందింది. ఐరాసలో లభించిన తాజా హోదా ద్వారా పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ అనునిత్యం సాగించే దురహంకార మిలట్రీ దాడులకూ, హత్యలకూ వివిధ ప్రపంచ వేదికలపై ఆ దేశాన్ని బాధ్యురాలని చేసే అధికారం పాలస్తీనాకు లభిస్తుంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఇజ్రాయెల్ దుశ్చర్యలను యుద్ధనేరాలుగా ఫిర్యాదు చేసే అధికారం, అవకాశం లభిస్తుంది.

అయితే ఇవన్నీ చరిత్రాత్మకమే అయినా సంకేతాత్మకం మాత్రమే. వాస్తవానికి ఇజ్రాయెల్ యుద్ధనేరాలను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఫిర్యాదు చేసే దమ్ము, ధైర్యం, పాలస్తీనా ఆధారిటీ నాయకుడు మహమ్మద్ అబ్బాస్ కి లేదు. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో అమెరికా, ఇజ్రాయెల్ అదిరింపులు, బెదిరింపులకు తలొగ్గుతూ పాలస్తీనా అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న మహమ్మద్ అబ్బాస్ కి పాలస్తీనా ప్రయోజనాల కోసం ఎన్నడూ నిర్ణయాత్మకంగా పోరాడిన చరిత్ర లేదు. పైగా పాలస్తీనా భూభాగంలో మెజారిటీ భాగాన్ని ఇజ్రాయెల్ కి అప్పగించి అత్యంత పరిమితమైన భూభాగంతో దేశాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ అమెరికా, ఇజ్రాయెల్ లను రహస్యంగా దేబిరించిన చరిత్ర ఆయనకి ఉన్నది.

అంతర్జాతీయ దేశాల మద్దతుతో పాలస్తీనా ఆధారిటీ వ్యవస్ధాపక అధ్యక్షుడు యాసర్ అరాఫత్ పరిమితుల్లోనే అయినా సాపేక్షికంగా నిర్ణయాత్మకంగా పోరాడడంతో ఆయన హత్యకు గురయ్యాడు. అరాఫత్ కు అనేక నెలలుగా కొద్ది కొద్దిగా విషం ఇచ్చి చంపించింది ఇజ్రాయెల్ పాలకులేనన్నది ఇపుడు బహిరంగ రహస్యం. పాలస్తీనా పోరాట నాయకులను బాంబుదాడులతో, విష ప్రయోగాలతో హత్యలు చేసిన, చేయించిన నీచ చరిత్ర ఇజ్రాయెల్ సొంతం. (సహజ కారణాలతోనే అరాఫత్ చనిపోయాడని చెప్పి ఆయనను పూడ్చిపెట్టినప్పటికీ అంతర్జాతీయ ఒత్తిడితో ఆయన శరీర భాగ్కాలకు తిరిగి పోస్టు మార్టం చేయడానికి కొద్ది రోజుల క్రితమే ఆయన సమాధిని తవ్వి తీశారు.) అరాఫత్ మరణానంతరం అమెరికా, ఇజ్రాయెల్ దేశాల పూర్తిమద్దతుతో పాలస్తీనా ఆధారిటీ నాయకత్వం చేపట్టిన మహమ్మద్ అబ్బాస్ తన ప్రజలకు విద్రోహం చేయడంలోనూ, ప్రజల ప్రయోజనాలను ఇజ్రాయెల్ కాళ్లదగ్గర నిలపడంలోనూ పేరెన్నికగన్నాడు.

గాజా దాడి, మారిన పరిస్ధితులు

పాలస్తీనా దళారీ పాలకవర్గాల ప్రతినిధి అయిన అబ్బాస్ పాలస్తీనా ప్రజల పోరాట చైతన్యాన్నీ, పటిమనూ ఎప్పటికప్పుడు నీరుగార్చి పక్కదారి పట్టించడానికే ఎక్కువగా కృషి చేశాడు. అలాంటి అబ్బాస్ కూడా కి ఐరాస తీర్మానం గెలుపు ఒకింత ప్రతిష్టను తెచ్చిపెట్టింది. అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ లు పాలస్తీనాకు సహాయాన్ని నిలిపివేస్తూ తీర్మానాన్ని తయారు చేసి చర్చకు పెట్టినప్పటికీ తరుముకు వచ్చిన జాతీయ, అంతర్జాతీయ పరిస్ధితుల నేపధ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ ల నమ్మినబంటు -మహమ్మద్ అబ్బాస్ ఐరాస లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు చొరవ తీసుకోక తప్పలేదు. గాజా ప్రజలపై 8 రోజులపాటు ఇజ్రాయెల్ సాగించిన అమానుష యుద్ధం, తదనంతర పర్యవసానాలు అబ్బాస్ చొరవను ప్రేరేపించాయనడం సబబుగా ఉంటుంది.

నవంబరు 14 నుండి 8 రోజులపాటు అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ దేశం హమాస్ పాలనలో ఉన్న గాజా పై వాయు, జల, భూ తలాలనుండి సాగించిన యుద్ధాన్ని తిప్పికొట్టడంలో హమాస్ విజయం సాధించింది. అయితే ఇది మిలట్రీ విజయం కాదు. ఎనిమిది రోజుల దాడిలో పిల్లలు స్త్రీలతో సహా 150 మందికి పైగా పాలస్తీనీయులు మరణించగా గతంలో లేనివిధంగా మీడియా పైకూడా దాడులు జరపడానికి ఇజ్రాయెల్ తెగించింది. మీడియా భవనాలతో సహా ప్రభుత్వ భవనాలు, పౌర నివాసాలు, ధ్వంసం అయ్యాయి. గాజన్లు కొద్ది నెలల క్రితమే నిర్మించుకున్న ఒక్కగానొక్క స్టేడియంను జాత్యహకంకార సైన్యం కక్షగట్టి మరీ నాశనం చేసింది. మీడియాను టార్గెట్ చేసుకుని జరిపిన ఇజ్రాయెల్ బాంబుదాడిలో బి.బి.సి విలేఖరి ఒకరు కాలు పోగొట్టుకోవలసి వచ్చింది.

ఈ యుద్ధంలో మిలట్రీపరంగా హమాస్ కి విజయం దక్కనప్పటికీ దౌత్యపరంగా, గొప్ప విజయాన్ని దక్కించుకుంది. మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రాధామ్యాలు మారిన ఫలితమిది. అరబ్ వసంతం పర్యవసానంగా ట్యునీషియా, ఈజిప్టు, లిబియాలలో ముస్లిం బ్రదర్ హుడ్ తో పాటు ఆల్-ఖైదా లాంటి టెర్రరిస్టు సంస్ధల వెనుక ఉన్న పాలకవర్గాలు అధికరంలోకి రావడం, వారు అమెరికా, ఇజ్రాయెల్ లతో రాజీపడడంతో మధ్యప్రాచ్యంలో బలా బలాల పొందికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు ముస్లిం బ్రదర్ హుడ్ సోదర సంస్ధ అయిన హమాస్ కి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరించింది. తన ప్రపంచాధిపత్యం కొనసాగడానికి మధ్యప్రాచ్యంలోని సెక్యులర్ ప్రభుత్వాలను కూలదోసి తానే యుద్ధం (global war on terror) ప్రకటించిన అత్యంత అభివృద్ధి నిరోధకరమైన ముస్లిం మతఛాందస వర్గాలతో అధికారాన్ని పంచుకోవడానికి అమెరికా సిద్ధపడిన ఫలితంగా హమాస్ కు నూతన మిత్రులు లభించారు.

మారిన పరిస్ధితుల నేపధ్యంలో ఒకపక్క ఇజ్రాయెల్ దాడులు జరుగుతుండగానే మరోపక్క కతార్, ఈజిప్టు పాలకులు గాజా సందర్శించి హమాస్ కు అంతర్జాతీయ స్ధాయిలో గౌరవప్రదమైన హోదా దక్కడానికి దోహదపడ్డారు. గాజాకు మిలియన్ల కొద్దీ డాలర్ల సహాయాన్ని కతార్ పాలకులు తమ గాజా పర్యటనలో ప్రకటించారు. అనంతరం అరబ్ లీగ్ కూడా రంగంలోకి దిగింది. యుద్ధం కొనసాగుతుండగానే, ఈజిప్టు ప్రధాని గాజా సందర్శించిన మరుసటిరోజే ట్యునీషియా విదేశీ మంత్రి కూడా గాజా పర్యటించివెళ్ళాడు. అరల్ లీగ్ పిలుపుతో ఈజిప్టు, మొరాకో, పాలస్తీనా, ఇరాక్, సూడాన్, కతార్, లెబనాన్, జోర్డాన్, టర్కీ దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్తంగా గాజా పర్యటించి గాజా ప్రజలకు మద్దతు ప్రకటించారు. వీరిలో కతార్, ఈజిప్టు, ట్యునీషియాల నుండి వచ్చిన మద్దతు హమాస్ కి ముఖ్యమైనది. ముస్లిం బ్రదర్ హుడ్ గానీ, దాని సోదర సంస్ధలు గానీ ఈ దేశాల్లో అధికారం నెరుపుతుండడం దానికి కారణం. ఈ నేపధ్యంలోనే దశాబ్దాలుగా తమకు ఆశ్రయం కల్పించిన సిరియా సెక్యులర్ పాలకులను విద్రోహులుగా చిత్రీకరించి తప్పుడు ఆరోపణలు చేయడానికి హమాస్ తెగించింది. సిరియా రాజధాని డమాస్కస్ నుండి కతార్ రాజధాని దోహా కు హమాస్ నాయకులు తమ స్ధావరాన్ని మార్చుకుని తామే నమ్మకద్రోహులుగా అవతరించారు. ఆ విధంగా సిరియా ప్రజలకు విద్రోహం తలపెట్టడంతో పాటు గాజా ప్రజల భవిష్యత్తు ప్రయోజనాలను కూడా హమాస్ తాకట్టుపెట్టే విధంగా వ్యవహరిస్తూ వ్యూహాలను మార్చుకుంది. హమాస్ లో వచ్చిన ఈ మార్పు భవిష్యత్తులో ఏవైపుకి దారితీయనున్నదో పరిశీలించవలసి ఉంది.

ఈజిప్టు మద్దతు

ఇజ్రాయెల్ యుద్ధ నేరాలు గాజా ప్రజలకు కొత్త కాదు. ఈసారి గాజా యుద్ధంలో ఈజిప్టు నుండి వచ్చిన మద్దతు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. అమెరికా మద్దతుతో ఈజిప్టులో అధికారం నెరపుతున్న ముస్లిం బ్రదర్ హుడ్ ఎనిమిది రోజుల యుద్ధకాలంలో తమ సోదర సంస్ధ హమాస్ కు అంతర్జాతీయ స్ధాయిలో నైతిక మద్దతు సమకూర్చింది. దూకుడుగా రోజువారీ ప్రకటనలు జారీ చేయడం ద్వారా ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్శి పాలస్తీనా ప్రజల పోరాటానికి తోడు నిలిచాడు. గతంలో లేని విధంగా ఈజిప్టు ద్వారా గాజా ప్రభుత్వానికి అంతర్జాతీయ వేదికలపైనా, పశ్చిమ కార్పొరేట్ మీడియాలోనూ ప్రచార మద్దతు లభించడం కొత్త పరిణామం.

మాజీ నియంత హోస్నీ ముబారక్ పాలనలో గాజాను పాలిస్తున్న హమాస్ కి గానీ, వెస్ట్ బ్యాంక్ ని పాలిస్తున్న పాలస్తీనా ఆధారిటీ కి గానీ ఈజీప్టు నుండి ఈ విధమైన బహిరంగ మద్దతు ఎన్నడూ దొరకలేదు. అమెరికా, ఇజ్రాయెల్ లకు పూర్తిస్ధాయి తొత్తుగా వ్యవహరించిన ముబారక్ పాలస్తీనా ప్రజల అణచివేతలోనూ, గాజా మిలట్రీ ముట్టివేతలోనూ క్రియాశీలకంగా వ్యవహరించాడు. గాజాతో గల రఫా సరిహద్దును మూసేసి గాజా ప్రజలకు సరుకులు రవాణా కాకుండా అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ కు సహాయం చేశాడు. గాజాపై ఇజ్రాయెల్ విధించిన సర్వ ముట్టడిలో క్రియాశీలకంగా తోడ్పడ్డాడు. ముస్లిం బ్రదర్ హుడ్ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్ధితి కొంతమేరకు తిరగబడింది. ఈజిప్టునుండి దౌత్యపరంగా, నైతికంగా, ఇంకా ఇతరత్రా కూడా మద్దతు లభించడమే కాక, కతార్ నుండి ఆర్ధిక సహకారం లభిస్తుందన్న హామీ లభించడం గాజా పాలకులకు ఇజ్రాయెల్ దాడి తర్వాత సమకూరిన విజయం.

ఈ పరిణామాలు గాజాను పాలిస్తున్న హమాస్ ను ఏకాకితనం నుండి బైటపడేశాయి. అంతే కాకుండా సెక్యులర్, లిబరల్ రాజకీయాలు ఉన్నట్లు భావించే పాలస్తీనా ఆధారిటీ తో హమాస్ కి ఉన్న వైరుధ్యంలో హమాస్ ని తాత్కాలికంగానైనా విజేతగా నిలిపాయి. అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ లు హమాస్ ను టెర్రరిస్టు సంస్ధగా ఇన్నాళ్లూ ముద్రవేస్తూ వచ్చాయి. అమెరికా, యూరప్ ల ఒత్తిడితో హమాస్ ను ఐరాస కూడా టెర్రరిస్టు సంస్ధగా ముద్ర వేసింది. యాసర్ అరాఫత్ ప్రాభవాన్ని తట్టుకోలేక ఆయన నాయకత్వంలో పాలస్తీనా ప్రజల పోరాట పటిమను నీరుగార్చే కృషిలో భాగంగా హమాస్ ఎదుగుదలకు పరోక్షంగా సహకరించిన ఇజ్రాయెల్, అమెరికాలు అనంతరం హమాస్ ను టెర్రరిస్టు సంస్ధగా ముద్రవేసి పాలస్తీనీయుల న్యాయబద్ధ పోరాటాన్ని టెర్రరిస్టు పోరాటంగా ముద్రవేయడంలో సఫలం అయ్యాయి. ఆ విధంగా అంతర్జాతీయంగా పాలస్తీనా ప్రజలకు అందిన మద్దతును గణనీయ స్ధాయిలో పక్కదారి పట్టించాయి.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు

హమాస్ కి పరోక్షంగా సహకరించిన ఎత్తుగడతో అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ జాత్యహంకార రాజ్యం ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టగలిగాయి. పాలస్తీనా ప్రజల జాతీయోద్యమాన్ని టెర్రరిస్టు ఉద్యమంగా ముద్రవేయడం, యాసర్ అరాఫత్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఎదిగిన పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పి.ఎల్.ఒ) సంస్ధను బలహీనపరచడం అనే రెండు లక్ష్యాలను అవి సాధించాయి. ముస్లిం బ్రదర్ హుడ్ నేతృత్వంలోని మతఛాందస ప్రభుత్వాలను గానీ, ఆల్-ఖైదా లాంటి టెర్రరిస్టు సంస్ధలను గానీ అమెరికా ఏ లక్ష్యం కోసం చేరదీసి మద్దతు ఇస్తుందో పాలస్తీనా ప్రజల పోరాటం ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తుంది.

నికరమైన జాతీయ భావాలు కలిగిన పి.ఎల్.ఒ లాంటి సంస్ధలతో వ్యవహరించడం కంటే ఎటువంటి చారిత్రక అవగాహన, అభ్యుదయ భావజాలం, ప్రజల ప్రయోజనాల పట్ల కనీస నిబద్ధతా లేని ముస్లిం మతఛాందస సంస్ధలతోనూ, టెర్రరిస్టు వ్యవస్ధలతోనూ వ్యవహరించడమే అమెరికా సామ్రాజ్యవాదానికి తేలిక. జాతీయ భావాలతో పోరాడే పోరాట సంస్ధలను ప్రజలనుండి వేరు చేయడం కష్టతరం. జాతీయ శక్తులను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం కూడా అమెరికా సామ్రాజ్యవాదులకు కష్టం. కానీ ముస్లిం మతఛాందస శక్తులను రాక్షసీకరించి, వారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టడం సులువు.

సద్దాం హుస్సేన్, మౌమ్మర్ గడాఫీ, బషర్ అస్సాద్ తదితర జాతీయ నిబద్ధత కలిగిన శక్తులు సామ్రాజ్యవాదంతో రాజీపడే అవకాశాలు చాలా తక్కువ. దళారీ బూర్జువా శక్తులు అయితే తప్ప వారు సామ్రాజ్యవాద ఆధిపత్యానికి తల వంచరు. జాతీయతా భావాలతో నిండి ఉండే ప్రజాసామాన్యం వారికా శక్తిని ఇస్తారు. కాని సెక్టేరియన్ దృక్పధాలతో నిండి ఉండే మతఛాందస శక్తుల భావాలకు ప్రజలను కూడగట్టి ఐక్యంగా నిలిపి ఉంచే శక్తిగానీ, కనీసం తమ ప్రయోజనాల కోసమైనా చివరికంటా నిలబడగల నిబద్ధతగానీ ఉండవు. తమ స్వార్ధ ప్రయోజనాలు ఎక్కడ నెరవేరితే అక్కడ నిలబడడానికి వారు సిద్ధంగా ఉంటారు. మతాన్ని అడ్డుపెట్టుకుని ఎంత హింసాత్మకంగానైనా తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే వారికి తెలిసిన న్యాయం. నాగరికతల ఘర్షణ (clash of civilizatiohns) పేరుతో ముస్లిం టెర్రరిజం పై ప్రపంచ యుద్ధ ప్రకటించిన అమెరికా సామ్రాజ్యవాదులు అదే వరుసలో లిబియా, ట్యునీషియాలలో ఆల్-ఖైదా లాంటి టెర్రరిస్టు శక్తులతో మిలాఖతై దళారీ ప్రభుత్వాలను ఏర్పరచడానికి అందుకే సుముఖంగా ఉంటారు.

… … …ఇంకా ఉంది

2 thoughts on “అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను చీత్కరిస్తూ పాలస్తీనాకు ఐరాసలో స్ధానం -1

  1. వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది. వివరణాత్మాకంగా కూడా ఉంది.

    మహ్మద్ అబ్బాస్ పాలస్తీనా అధారిటీకి అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే సోషలిస్టు విశ్లేషకులు ఆయనను మరో హమీద్ కర్జాయ్ గా పేర్కొన్నారు. మహమ్మద్ అబ్బాస్ కూడా కర్జాయ్ లాగే దిగుమతి అయిన వ్యక్తి. సామ్రాజ్య వాద శక్తులు తమ ప్రయోజనాల కొరకు ఏరికోరి, ఆయనను పాలస్తీనా అధారిటీ అధ్యక్షునిగా ఎంపిక చేయడంలో ప్రధాన పాత్ర వహించాయి. నిజానికి పాలస్తీనా అధారిటీ అప్పటికే తన ప్రాభవాన్ని, ప్రజలపై ప్రభావాన్ని కోల్పోయి ఉంది. ఈ క్రమం అరాఫత్ నాయకునిగా ఉన్నప్పుడే జరిగింది. ఇక ఇప్పుడు పాలస్తీనా అధారిటి నుండి ఎక్కువగా ఏమీ ఆశించలేము. ఇదంతా జరిగి ఒక ఒక దశాబ్ధకాలంపైగా అయినప్పటికీ, ఈ దశాబ్ధ కాలంలో పాలస్తీనాలోనూ, మొత్తం మధ్య ప్రాచ్యం, దాని చుట్టూరా ఉన్న అరబ్ దేశాలలోనూ జరిగిన మార్పులను చూస్తే ఆశ్చర్యము, గందరగోళమూ కలుగుతుంది. అరబ్ దేశాలలో జరిగిన అధికార మార్పిడులు, వీటన్నిటి నేపథ్యంలో హమాస్ సంపాదించిన మద్దతు, తిరిగి వీటి వెనుక నీడగా కనిపించే అమెరికా హస్తం ఆందోళన కలిగిస్తుంది. హమాస్ నాయకత్వంలో పాలస్తీనా ప్రజల భవిష్యత్తుతో పాటుగా, భౌగోళికంగా దాని చుట్టూ ఉన్న అరబ్ దేశాలలో బలంగా తయారవుతున్న మతవాద శక్తులు, “నాగరికతల మధ్య పోరాటం” అనే వాదాన్ని, భవిష్యత్తుకు సంబంధించిన ఊహా మాత్రమైన అంచనాను అమెరికా ఆశీస్సులతో నిజం చేయనున్నాయా అన్న భయం కలుగుతుంది.

    ఈ నేపథ్యంలో, సామ్రాజ్య వాదమంటేనే యుద్ధం అని లెనిన్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. అమెరికాకు ఒక శత్రువు కావాలి. బూచి లాంటి శత్రువు. ఆ బూచిని చూపించి ప్రపంచ ప్రజలకు తానొక సంరక్షకునిగా ప్రకటించుకునే సందర్భమొకటి కావాలి. అలాంటి బూచినీ, సందర్భాన్నీ ఒక ప్రణాళికగా, రాజనీతిగా అమెరికా తయారు చేస్తుంది. పాటిస్తుంది. ఇట్టాంటి దుర్మార్గాన్ని, ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి సామ్రాజ్య వాదమొక్కటే చేయగలదు.

    వీటన్నింటికీ తోడు అంతర్గత సంక్షోబాల నేపథ్యంలో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా దేశాలు, వీటితో పాటుగా చైనా అనుసరిస్తున్న ఎత్తుగడలు రసవత్తరంగా ఉన్నాయి. వీటి ఆచరణలో ప్రజాస్వామిక ఆకాంక్షల కన్నా అక్కడి పాలక వర్గాల ఆకాంక్షలే ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. కాబట్టి వీటి మద్దతును స్థిరమైనదిగా, ప్రజాస్వామ్య అవగాహనతో కూడుకున్నదిగా భావించలేము. రాజనీతిని పాటించడంలో మన దేశానికి నెహ్రూ హయాం నుండి ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా మనం భావిస్తుంటాం కానీ అది నిర్ణీత సమయాల్లో గోడమీది పిల్లిలాగా ఉండి, సామ్రాజ్య వాదానికి నమ్మిన బంటుగానే వ్యహరిస్తూ ఉందన్నది వాస్తవం. కాబట్టి మన దేశ మద్ధతును కూడా సందేహస్పదంగానే చూడవలసి ఉంటుంది. అంతేకాక గడచిన కొన్ని దశబ్ధాల కాలంగా మధ్య ప్రాచ్యంలో వస్తున్న మార్పులపై విమర్శనాత్మక వైఖరి అంటూ ఏమీ ప్రకటించని మన దేశ వ్యవహారాన్ని కూడా ఈ సందర్భంగా పరిగణన లోనికి తీసుకోవలసి ఉంటుంది. ఇక బ్రెజిల్ మద్దతును దీనికి భిన్నంగా భావించాలి. బ్రెజిల్ లో ఉన్న వామపక్ష ప్రభుత్వ కూటమికి అమెరికా సామ్రాజ్య వాదంపై పై వాటి కన్నా భిన్నమైన అవగాహన ఉంది. అంతే కాక దక్షణ అమెరికాలో సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయోగాలు ప్రపంచ ప్రజలకు ఊరటను కలిగిస్తున్న సందర్భంలో బ్రెజిల్ ను వీటి నుండి భిన్నంగా చూడవలసి ఉంటుంది.

    చివరగా, యునైటెడ్ నేషన్స్ లో పాలస్తీనా ప్రస్తుత స్థానం వల్ల పొందే లబ్ది గురించి కూడా ఆలోచించాల్సి ఉంది. ఈ స్థానం, అనునిత్యమూ మారడానికి వీలున్న ఇతర సామ్రాజ్య వాద దేశాల వైఖరులతో ముడి పడి ఉంది. వీటి పైనే ఐక్యరాజ్య సమితిలో అది పొందే మద్దతు, బలాబలాలూ వెల్లడవుతాయి. ఇట్టాంటి బలహీనమైన పునాది పైన పాలస్తీనాకు ఇక్కడ నుండి ఏమైనా ఒరగబెట్టడానికి వీలవుతుందేమోనని ఊహించడం ఎక్కువే అవుతుంది. అయితే ఇట్టాంటి విపత్కర పరిస్థితులలోనూ అది ఒక చిన్న గొంతుకగా పనికి వస్తుందేమోనని ఒక చిన్న ఆశను కాంక్షించడంలో తప్పు లేదు.

    ఎక్కడైనా ప్రజాస్వామిక శక్తులు బలపడడం, అవి ప్రజలలో విశ్వాసాన్ని ప్రోది చేయగలగడం వల్ల మాత్రమే సామ్రాజ్య వాదాన్ని ఎదుర్కోవడం సాధ్య పడుతుంది. కానీ ఇప్పటి పరిస్థితులలో ఇలాంటి స్థితిని మనం ఆశించగలమా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s