అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను ఓడిస్తూ ఐరాసలో పాలస్తీనా -2


ఐరాస జనరల్ అసెంబ్లీలో మహమ్మద్ అబ్బాస్, పాలస్తీనా జెండా -ఫొటో: ది హిందూ

ఐరాస జనరల్ అసెంబ్లీలో మహమ్మద్ అబ్బాస్, పాలస్తీనా జెండా -ఫొటో: ది హిందూ

హమాస్ x ఫతా

మహమ్మద్ అబ్బాస్ నేతృత్వంలోని ఫతా ‘పాలస్తీనా ఆధారిటీ’ పేరుతో వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని పాలిస్తుండగా, నిన్నటివరకూ డమాస్కస్ లోనూ, ఇపుడు దోహా లోనూ ఆశ్రయం పొందుతున్న ఖలేద్ మాషాల్ నేతృత్వంలోని హమాస్ గాజా ను పాలిస్తోంది. అరాఫత్ బతికి ఉన్నంతవరకూ పి.ఎల్.ఓ (పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్) కింద ఒకే నిర్మాణంలో ఉన్న ఫతా, హమాస్ లు ఆయన మరణానంతర పరిణామాల ఫలితంగా బద్ధ శత్రువులుగా మారిపోయాయి. గాజాలో ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికల్లో హమాస్ గెలిచి ప్రభుత్వం ఏర్పరిచినప్పటికీ దానిని టెర్రరిస్టు ప్రభుత్వంగా అమెరికా, ఇజ్రాయెల్ లు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని హమాస్ గుర్తించకపోవడమే దానికి కారణం.

2006 గాజా ఎన్నికల్లో హమాస్ విజయం సాధించాక రెండు గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. అంతర్యుద్ధంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. గాజాలో ప్రతిపక్షంగా ఉండడానికి బదులు ఫతా అక్కడినుండి పూర్తిగా ఉపసంహరించుకున్నది. ఇజ్రాయెల్ ను ఒక దేశంగా కూడా హమాస్ గుర్తించదు. తాను ఒకందుకు ప్రోత్సహించిన హమాస్ చివరికి మేకులా మారడంతో హమాస్ పై ఇజ్రాయెల్ కత్తికట్టింది. గాజాను సైనికంగా, వాణిజ్యపరంగా చుట్టుముట్టి సరిహద్దు మార్గాలను మూసివేసి గాజా ప్రజలను అన్నివిధాలుగా హింసించడం మొదలుపెట్టింది. నిత్యావసర సరుకులు కూడా అందకుండా చేస్తూ పిల్లల్లోనే కాక, పెద్దల్లో కూడా పోషకార లోపం పెరగడానికి లక్ష్యంగా పెట్టుకుంది. గాజాను ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా అందుకే అభివర్ణిస్తారు.

అబ్బాస్ ను గుప్పెట్లో పెట్టుకున్న అమెరికా, ఇజ్రాయెల్ లు తమకు ప్రమాదకరంగా పరిణమించే డిమాండ్లు చెయ్యకుండా ఫతాను ఇన్నాళ్లూ అదుపులో ఉంచగలిగారు. నిధులు అందజేసి అబ్బాస్ నేతృత్వంలోని పాలకవర్గ గ్రూపును అవి సంతృప్తిపరచడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ జియోనిస్టులు ఆ లక్ష్యాన్ని సాధించాయి. అయితే పాలస్తీనా ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్లు తీవ్ర అణచివేతకు గురవడం కొనసాగుతోంది. ఈ పరిస్ధితుల్లో ఇజ్రాయెల్ చేతుల్లో అమానవీయ అణచివేతకు గురవుతున్న గాజా ప్రజల దుర్భర పరిస్ధితులు ప్రపంచం దృష్టిలో ప్రధానంగా ముందుకు వచ్చాయి. గాజా దిగ్బంధనాన్ని ఛేదించి అక్కడి ప్రజలకు సరుకులు అందజేయడానికి అనేక అంతర్జాతీయ ప్రయత్నాలు జరగడం, వాటిని ఇజ్రాయెల్ పరమ హింసాత్మకంగా అణచివేయడం జరిగడంతో గాజా ప్రజలకు మద్దతు పెరిగింది.

2007 డిసెంబర్, 2008 జనవరి నెలల్లో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన అమానుష దాడిలో 1400కి పైగా గాజా పౌరులు మరణించాక ఇజ్రాయెల్ దౌష్ట్యం పచ్చిగా లోకానికి వెల్లడయింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ అమానుషమైన యుద్ధ నేరాలకు పాల్పడిందని ఐరాస నియమించిన రిచర్డ్ గోల్డ్ స్టోన్ కమిటీ నిర్ధారించింది. 2009 లో టర్కీ నుండి సరుకులతో, అంతర్జాతీయ శాంతి ప్రచారకులతో, పాలస్తీనా అనుకూల కార్యకర్తలతో స్వచ్ఛందంగా బయలుదేరిన వెళ్ళిన ఓడల వరుసపై అంతర్జాతీయ జలాల్లోనే ఇజ్రాయెల్ సైన్యం హింసాత్మకంగా దాడి చేసింది. 9 మంది నిరాయుధ టర్కీ దేశస్ధూలను కాల్చి చంపింది. దీనిపై కూడా అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తం అయింది. ఈ అంతర్జాతీయ

ఐరాస అధిపతి బాన్ కి మూన్ తో అబ్బాస్ -ఫొటో: ది హిందూ

ఐరాస అధిపతి బాన్ కి మూన్ తో అబ్బాస్ -ఫొటో: ది హిందూ

ఛీత్కారాలను ఇజ్రాయెల్ గానీ, అమెరికా గానీ ఎన్నడూ పట్టించుకోలేదు. కానీ గాజా ప్రజలకు అనుకూలంగా ప్రపంచవ్యాపితంగా విస్తృతమైన సానుభూతి పెల్లుబుకింది. ఆ సానుభూతి కాస్తా క్రమంగా హమాస్ కు మద్దతుగా కూడా అనివార్యంగా రూపుదిద్దుకుంది. వివిధ దేశాల్లో పాలస్తీనా ప్రజల పోరాటానికి విస్తృత మద్దతు సమకూరడానికి దానిని హమాస్ సొమ్ము చేసుకోవడానికి అవకాశం లభించింది.

ఈ పరిస్ధితి ఫతా ను ఆత్మరక్షణలో పడవేసింది. అంతర్జాతీయ  స్ధాయిలో హమాస్ కి రోజు రోజుకీ మద్దతు పెరుగుతుండగా మహమ్మద్ అబ్బాస్ రాజీ ధోరణివల్లా, ఇజ్రాయెల్ తో కుమ్మక్కయినందు వల్లా ఫతా ప్రతిష్ట మసకబారింది. వెస్ట్ బ్యాంక్ లో ఎన్నికల గడువు ముగిసి ఏళ్ళు గడిచినా ఎన్నికలు జరపడానికి అబ్బాస్ నిరాకారించడానికి కారణం ఆయన పలుకుబడి తగ్గిపోవడమే కారణమని పత్రికలు, విశ్లేషకులు అనేకమంది అభిప్రాయపడుతున్నారు. కొద్ది నెలల క్రితం ఫతా, హమాస్ ల మధ్య ఈజిప్టు మధ్యవర్తిత్వంలో ఒక ఒప్పందం కుదిరినప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. ఈ లోపు గాజా యుద్ధం వలన హమాస్ ప్రతిష్ట మరోసారి మారుమోగడంతో పాలస్తీనా జాతీయోద్యమానికి కట్టుబడి ఉన్నట్లు నిరూపించుకునే అవకాశాన్ని ఐరాస ఓటింగు అబ్బాస్ కి కల్పించింది.

ఐరన్ డోమ్, ఇరాన్ యుద్ధం 

ఫతా, హమాస్ ల వైరం గతంలో లాగా తీవ్ర స్ధాయిలో లేదు. కానీ ఇరు సంస్ధల మధ్య స్నేహ సంబంధాలు కూడా లేవు. ఘర్షణలు జరగనందుకు సంతృప్తిపడే పరిస్ధితి మాత్రమే కొనసాగుతున్నది. ఐరాసలో పాలస్తీనాకు “సభ్యేతర పరిశీలక దేశం” హోదా ఇవ్వడానికి జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగిన సందర్భం ఇరు గ్రూపులూ ఏదో మేరకు ఒకటి కావడానికి అవకాశం కల్పించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఫతాతో పాటు  గాజాలో పని చేస్తున్న ముస్లిం సంస్ధలు హమాస్, ఇస్లామిక్ జిహాద్  కూడా ఆహ్వానించాయి. ఈజిప్టు మధ్యవర్తిత్వంలో హమాస్-ఇజ్రాయెల్ ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గాజా ప్రజలకు సంతోషం కలిగించగా ఇజ్రాయెల్ కు మాత్రం నిరుత్సాహాన్ని కలిగించిందని పత్రికలు రాస్తున్నాయి. గాజా యుద్ధం వలన ఇజ్రాయెల్ కు తగినంతగా లాభం కలగక పోవడమే దానికి కారణం.

నవంబర్ 2012 గాజా యుద్ధం వలన ఇజ్రాయెల్ కి ఏ విధంగానూ లాభం కలగలేదని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. అయితే అది పూర్తి నిజం కాదు. ఎందుకంటే గాజా యుద్ధం ద్వారా ఇజ్రాయెల్ కి ముఖ్యమైన మిలట్రీపరమైన లాభం కలిగిందని ఇతర పత్రికలు లెక్కించాయి. అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న ‘ఐరన్ డోమ్’ అనే రక్షణ వ్యవస్ధను పరీక్షించడానికి తాజా గాజా యుద్ధాన్ని జియోనిస్టులు వాడుకున్నారని అనేక పత్రికలు ససాక్ష్యాలతో వెల్లడి చేశాయి. గాజా మిలిటెంట్లు ప్రయోగించే రాకెట్ల నుండి రక్షణ పొందడానికి ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ ను నిర్మించింది. దానికి కావలసిన సాంకేతిక, ఆయుధ, ధన సహాయాలను అమెరికాయే ఇజ్రాయెల్ కి సమకూర్చింది. (ఐరన్ డోమ్ అంటే ఇనప కప్పు కాదు. ఆ స్ధాయిలో పనిచేసే ఎలక్ట్రానిక్ ఆయుధ వ్యవస్ధ అని అర్ధం. రాకెట్ దాడులను ముందే పసిగట్టి వాటిని లక్ష్యం చేరకుండా పక్కకు మళ్లించడం, రాకెట్ లను ధ్వంసం చెయ్యడం దాని లక్ష్యం.)

నవంబరు 14 తేదీనుండి ఇజ్రాయెల్ పూర్తిస్ధాయి యుద్ధాన్ని ప్రారంభించడానికి కొన్ని వారాలముందునుండే ఇజ్రాయెల్ గాజాపై నేరుగా బాంబులు జారవిడిచి పిల్లలను, వికలాంగులను చంపేసింది. దానికి ప్రతిగా గాజా నుండి పదులు, ఆ తర్వాత వందల సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయెల్ పైకి ప్రయోగించబడ్డాయి. రాకెట్ దాడిలో హమాస్, ఇస్లామిక్ జీహాద్ సంస్ధలు పాల్గొన్నాయి. రాకెట్ దాడిని విస్తృత స్ధాయిలో ఆకర్షించడం అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధ లక్ష్యాల్లో ఒకటని గ్లోబల్ రీసర్చ్ తో పాటు అనేక సంస్ధలు విశ్లేషించాయి. అందుకు తగిన సాక్ష్యాలను కూడా ఆ పత్రికలు వెల్లడి చేశాయి. ప్రముఖ ఇజ్రాయెల్ పత్రిక హారెట్జ్ కూడా అందులో ఒకటి. తాజా గాజా యుద్ధానికి ఇజ్రాయెల్, అమెరికా లు పెట్టిన పేరు ‘ఆపరేషన్ పిల్లర్ ఆఫ్ డిఫెన్స్.’ ఐరన్ డోమ్ పనితనాన్ని పరీక్షించడం గాజా యుద్ధ లక్ష్యాల్లో ఒకటని చెప్పడానికి ఈ పేరే సాక్ష్యం అని సదరు పత్రికలు తెలిపాయి.

పాలస్తీనా రాకెట్ దాడిలో కేవలం ఒక్క ఇజ్రాయెల్ సైనికుడు మాత్రమే మరణించగా గాజాలో కొద్దిమంది మిలిటెంట్లతో పాటు 40 మందికి పైగా పిల్లలు కూడా మరణించారు. స్త్రీలు, పిల్లలతో కలిసి 150 మందికి పైగా పాలస్తీనీయులు మరణించారని పత్రికలు తెలిపాయి. దాడికి కొద్ది వారాలముందు ఇజ్రాయెల్ లో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా మిలట్రీ డ్రిల్లు నిర్వహించాయి. ఐరన్ డోమ్ పనితనాన్ని పరీక్షించడం కూడా ఈ డ్రిల్లులో భాగం. డ్రిల్లులో భాగంగా ఐరన్ డోమ్ ని పరీక్షించాలంటే రాకెట్ దాడి జరగాలి. అది కూడా పెద్ద ఎత్తున జరగాలి. పెద్ద ఎత్తున రాకెట్ దాడి జరిగితేనే ఐరన్ డోమ్ పనితనం పూర్తిస్ధాయిలో పరీక్షించడం సాధ్యం అవుతుంది. ఈ లక్ష్యం కోసం మొదట ఒక వికలాంగుడిని, ఆ తర్వాత పిల్లలను ఇజ్రాయెల్ బాంబుదాడులతో చంపేసింది. నవంబరు 14 తేదీన హమాస్ కమాండర్ అబ్దుల్ జబారి కారుపై బాంబులు వేసి చంపేయడంతో హమాస్ తన పరిమితుల్లోనే తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇరాన్ అందజేసిన సుదూర లక్ష్యిత ఫజర్-5 మిసైల్ ను ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ మీదికి పేల్చాక యుద్ధం తీవ్రరూపం దాల్చింది.

ఇజ్రాయెల్ దాడిలో 40కి పైగా పిల్లలు చనిపోయారు -ఫొటో: బోస్టన్

ఇజ్రాయెల్ దాడిలో 40కి పైగా పిల్లలు చనిపోయారు -ఫొటో: బోస్టన్

సముద్రం నుండి, ఆకాశం నుండీ, భూతలం నుండీ ఇజ్రాయెల్ సైన్యం జెట్ ఫైటర్లు, మిసైళ్ళు, హెలికాప్టర్లతో చేసిన దాడిలో పదుల సంఖ్యలో గాజా పౌరులు మరణిస్తున్నప్పటికీ అమెరికా, యూరప్ లు ఇజ్రాయెల్ కు మద్దతుగా వరుస ప్రకటనలు జారీ చేశాయి. మీడియా భవనాలపైనా, ప్రభుత్వ కార్యాలయాలపైనా దాడి చేసినా అవి తెలియానట్లు నటించాయి. హమాస్ కమాండర్ హత్యతోనే యుద్ధం మొదలయిందన్న నిజాన్ని అవి కప్పిపుచ్చాయి. గాజా నుండి వచ్చే రాకెట్లనుండి ఆత్మరక్షణ పొందే హక్కు ఇజ్రాయెల్ కి ఉందని సిగ్గులేకుండా ప్రకటించాయి. ఇజ్రాయెల్ ప్రారంభించిన పాలస్తీనా పౌరుల హత్యకూ, ప్రభుత్వ కమాండర్ హత్యకూ ప్రతిస్పందించే హక్కూ, తమను తాము కాపాడుకునే హక్కూ గాజా ప్రజలకు, ప్రభుత్వానికి ఉందన్న నిజాన్ని అవి ఏ క్షణంలో కూడా అంగీకరించలేదు.

గాజా పౌరులు 150 మందికిపైగా మరణించినా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు వారి మరణాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. బి.బి.సి, సి.ఎన్.ఎన్, న్యూయార్క్ టైమ్స్, బ్లూమ్ బర్గ్ లాంటి పత్రికలు ఐరన్ డోమ్ పనితనాన్ని రిపోర్ట్ చేయడానికే ఎక్కువ ఆసక్తి ప్రదర్శించాయి. బి.బి.సి ప్రకారం గాజా నుండి మొత్తం 1506 మిసైళ్ళు ప్రయోగించగా వాటిని అడ్డుకోవడానికి ఐరన్ డోమ్ 573 సార్లు స్పందించి 421 మిసైళ్లను విజయవంతంగా అడ్డుకుంది. పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ఈ లెక్కను రోజువారీగా నివేదించడం ద్వారా ఇజ్రాయెల్, అమెరికాల ఉద్దేశ్యాలను పరోక్షంగా తెలియజేశాయి. ఐరన్ డోమ్ విజయవంతం అయిందని కూడా ఒకరిద్దరు ఇజ్రాయెల్ మంత్రులు ప్రకటించారు.

కానీ ఐరన్ డోమ్ విజయవంతం అయిందని చెప్పినప్పటికీ అది కేవలం స్వల్పదూరాలను లక్ష్యం చేసుకునే చిన్నపాటి మిసైళ్లను మాత్రమే ఆపగలిగిందనీ, శక్తివంతమైన, సుదూర లక్ష్యిత మిసైళ్లను ఆపలేకపోయిందని పక్షపత్రిక ఫ్రంట్ లైన్ తెలిపింది. దానినిబట్టి వ్యూహాత్మకంగా చూస్తే ఐరన్ డోమ్ పరీక్ష ఇజ్రాయెల్, అమెరికాల ఆయుధశక్తిని చూపి ఇరాన్, హమాస్ లను బెదరగొట్టడానికంటే అవి మరింత ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవడానికి ఉపయోగపడినట్లయింది. ఆ విధంగా కూడా గాజా యుద్ధం ఇజ్రాయెల్ కి ఉపయోగపడలేదని పలువురు విశ్లేషించారు. గాజా యుద్ధం ద్వారా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు మరో ప్రయోజనాన్ని ఆశించాడు. తాను హమాస్ ని నిలువరించే కరకు మిలట్రీ మనిషినని నిరూపించుకుని జనవరి 2013 ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ఆయన ప్రయత్నించాడని పత్రికలు తెలిపాయి. ఆఎత్తు పారిందో లేదో తెలియదుగానీ దానికిబదులు ఈజిప్టు మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో హమాస్ పై ఇజ్రాయెల్ పైచేయి సాధించలేదనీ, ఈజిప్టు, అమెరికాల అండతో హమాసే ఇజ్రాయెల్ పై పైచేయి సాధించిందనీ ప్రతిపక్షాలనుండి నెతన్యాహు విమర్శలను ఎదుర్కొన్నాడు.

అంతర్జాతీయ ఆటలో గినియా పందులు పాలస్తీనా ప్రజలు

అయితే ఐరన్ డోమ్ ఒక్క గాజా మిసైళ్ళ కోసమే అనుకుంటే పొరబాటు. గాజా యుద్ధంలో ఐరన్ డోమ్ ని పరీక్షించినప్పటికీ డోమ్ అసలు లక్ష్యం ఇరాన్ యుద్ధం. మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రయోజనాలకు బద్ధ విరుద్ధంగా ఉన్న ఇరాన్ ని లక్ష్యంగా చేసుకుని అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లు అనేక యేళ్లుగా వ్యూహాలు పన్నుతున్నాయి. ఆ వ్యూహాల్లో భాగంగా ఇరాన్ అణుబాంబు తయారు చేసుకోకుండా రాజకీయ, వాణిజ్యం యుద్ధాన్ని అవి నడుపుతున్నాయి. ఇరాన్ మిత్ర దేశం సిరియాలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించడానికి అక్కడ కిరాయి తిరుగుబాటు నడుపుతున్నాయి. ఇరాన్ తో యుద్ధం వస్తే గనుక ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడడం ఖాయం. ఆ మేరకు ఇరాన్ పాలకులు అనేక హెచ్చరికలు చేశారు. ఇరాన్ దాడులనుండి రక్షణ పొందే ఉద్దేశ్యంతో నిర్మించుకున్న ఐరన్ డోమ్ ను పరీక్షించడానికి అమెరికా, ఇజ్రాయెల్ లకు గాజా ప్రజలను గినియా పందులుగా ఉపయోగించుకున్నారన్నమాట!

అయితే యుద్ధాన్ని ప్రారంభించడమే అమెరికా, ఇజ్రాయెల్ లు చేయగలవు. యుద్ధాన్ని తన ప్రయోజనాల మేరకు పరిమితం అయేలా నియంత్రించడం దానిని మొదలుపెట్టినవారి చేతుల్లో ఉండడం సాధ్యం కానిపని. గాజా యుద్ధంలోనూ అదే జరిగింది. యుద్ధం ద్వారా హమాస్, అంతర్జాతీయ ప్రతిష్టను, ఈజిప్టు మద్దతునూ, కతార్ ఆర్ధిక సహాయ హామీని పొందకుండా అవి అడ్డుకోలేకపోయాయి. గాజా యుద్ధం ద్వారా హమాస్, ఫతా, ఇరాన్, ఈజిప్టు, కతార్ లు కూడా తమతమ ప్రయోజనాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేశాయి. ఇందులో హమాస్, ఫతా, ఇరాన్ లు చేసిన ప్రయత్నాలను సామ్రాజ్యవాద ప్రయోజనాలను, అమెరికా, ఇజ్రాయెల్ ల దమననీతినీ ప్రతిఘటించే కృషిలో ఉనికి కోసం చేసిన ప్రయత్నాలుగానే చూడాలి. అమెరికా, ఇజ్రాయెల్ లది ఆధిపత్య ప్రయోజనం అయితే, పాలస్తీనా, ఇరాన్ లది ఆత్మరక్షణా ప్రయత్నం. ఇరాన్ తయారీ ఫజర్-5 మిసైల్ ను హమాస్, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, మరో ముఖ్యపట్టణం జెరూసలేంల మీదికి ప్రయోగించిందంటే దానర్ధం ఐరన్ డోమ్ ను పరీక్షీంచే పనికి ఇరాన్ కూడా పూనుకుందని పరిమిత అర్ధంలో భావించవచ్చు.

యుద్ధ విరమణ కోసం మధ్యవర్తిత్వం నెరపడం ద్వారా ఈజిప్టు మధ్య ప్రాచ్యంలో తన ప్రాముఖ్యతను రుజువు చేసుకుంది. తద్వారా అమెరికాతో మరింత బలంతో బేరమాడే శక్తిని ఈజిప్టు దళారీ పాలకులు సంపాదించారు. వాస్తవానికి ఈజిప్టు మధ్యవర్తిత్వం అమెరికాకు కూడా అవసరమే. అమెరికా, ఇజ్రాయెల్ లు లక్ష్యంగా పెట్టుకున్న పరిమిత ప్రయోజనాలకు మించి యుద్ధం విస్తరీంచినట్లయితే మొదటికే మోసం వస్తుంది. సిరియాలో సాగిస్తున్న కిరాయి తిరుగుబాటు నుండి అంతర్జాతీయ దృష్టి పక్కకు మళ్లుతుంది. పరిస్ధితిని ఉపయోగించుకుని ఇజ్రాయెల్ తన ప్రాంతీయ లక్ష్యాలను, ముఖ్యంగా పాలస్తీనా ప్రజల పోరాటాన్ని తీవ్ర స్ధాయిలో అణచివేసే ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు తెగిస్తే అది అమెరికా ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా అంతర్జాతీయంగా పెల్లుబుకే నిరసన, ఆగ్రహాలను నియంత్రించే బాధ్యత, ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను తలకెత్తుకునే బాధ్యత అమెరికాకి అదనంగా వచ్చి చేరతాయి. సిరియా కిరాయి తిరుగుబాటు నేపధ్యంలో రష్యా, చైనాలు పరిస్ధితిని తమకు అనుకూలంగా మార్చుకోకుండా నివారించేందుకు అమెరికా అధికంగా శ్రమపడాల్సి వస్తుంది. అమెరికా ఆధిపత్య ప్రయోజనాలు క్రమంగా బలహీనపడుతున్న పరిస్ధితుల్లో పరిస్ధితి చేయిదాటినా ఆశ్చర్యం లేదు. ఈ కారణంతో అమెరికా గాజా యుద్ధవిరమణకు హమాస్ ని ఒప్పించే బాధ్యతకు ఈజిప్టును అర్జెంటుగా పురమాయించింది.

ఈజిప్టుతో పాటు కతార్ ని కూడా అమెరికా రంగంలోకి దించింది. ఇజ్రాయెల్ దాడులు జరుగుతుండగానే కతార్ ప్రభుత్వ నేత ఒకరు గాజా పర్యటించి హమాస్ కి మద్దతు తెలిపాడు. రానున్న 10 సంవత్సరాల్లో 500 మిలియన్ డాలర్లు గాజాకు సహాయం చేస్తామని ఆయన ప్రకటించాడు. పనిలోపనిగా పాలస్తీనా ప్రజల పోరాటానికి కూడా మద్దతు ప్రకటించాడు. అయితే కతార్ ఆర్ధిక సహాయం ఉత్తినే ప్రకటించలేదు. ఇజ్రాయెల్ పై పోరాటం వల్ల ఫలితం లేదనీ, ఏదో విధంగా రాజీపడి సర్దుబాటుకు ప్రయత్నించాలని ఆయన హమాస్ కి నచ్చజెప్పాలని చూసినట్లు కొన్ని పత్రికలు తెలిపాయి. కతార్ రాయబారానికి హమాస్ ఎలా ప్రతిస్పందించిందీ పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. కతార్ ప్రతిపాదనను హమాస్ ఒప్పుకోలేదన్న అనిర్ధిష్ట సమాచారం తప్ప వివరాలు తెలియలేదు. కతార్ రంగప్రవేశం సిరియా కిరాయి తిరుగుబాటుతో కూడా ముడిపడి ఉంది. సిరియా ప్రభుత్వ కూల్చివేతకు క్రియాశీలంగా ప్రయత్నిస్తున్న దేశాల్లో కతార్ ఒకటి.

అమెరికా, ఇజ్రాయెల్ వైరుధ్యాలు

సిరియాలో ముస్లిం బ్రదర్ హుడ్ అధికారంలోకి రావడంపై ఇజ్రాయెల్ కి కొన్ని అనుమానాలున్నాయి. ఒక పద్ధతంటూ లేని ఇస్లాం టెర్రరిస్టు పాలకులు ఇజ్రాయెల్ వ్యతిరేకతను ఎంతవరకు అదుపులో ఉంచగలవన్నదే ఇజ్రాయెల్ అనుమానం. ఇజ్రాయెల్ అనుమానానికి పునాది అమెరికా అంతర్గత వైరుధ్యాలలో ఉన్నది. పాలస్తీనాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ, దురహంకార చేష్టలు మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమనీ, కనుక దానిని అదుపులో ఉంచాలనీ మాజీ సి.ఐ.ఏ బాస్ డేవిడ్ పెట్రాస్ గట్టిగా వాదించాడు. వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనా నివాసాలనూ, జలవనరులను అడ్డూ అదుపూ లేకుండా దురాక్రమించుకుంటున్న ఇజ్రాయెల్ విధానాలు అమెరికా ప్రయోజనాలకు చేటు తెస్తాయని, మధ్యప్రాచ్యంలో ముస్లిం టెర్రరిస్టు మిలిటెంట్లను అమెరికాకి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడకుండా అడ్డుకోవడం కష్టంగా మారుతుందని పెట్రాస్ వాదించాడు. తదనుగుణంగా ఆయన ఇజ్రాయెల్ వ్యతిరేక నివేదిక కూడా ఇచ్చాడు.

అమెరికా, ఇజ్రాయెల్ వార్ గేమ్స్ కు ఆట స్ధలం గాజా

అమెరికా, ఇజ్రాయెల్ వార్ గేమ్స్ కు ఆట స్ధలం గాజా

డేవిడ్ పెట్రాస్ నివేదిక ఇజ్రాయెల్ కి ఆగ్రహం కలిగించింది. అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ లలోని ఇజ్రాయెల్ అనుకూల లాబీని ప్రేరేపించిన ఫలితంగా డేవిడ్ పెట్రాస్ ను అక్రమ సంబంధం ఆరోపణలతో ఇంటికి పంపారని ప్రముఖ మార్క్సిస్టు-లెనినిస్టు విశ్లేషకుడు జేమ్స్ పెట్రాస్ విశ్లేషించాడు. అక్రమ సంబంధాలు అమెరికా ప్రభుత్వ నేతలకు కొత్తకాదనీ, అమెరికా పాలకవర్గ ప్రయోజనాల వైరుధ్యాలను పరిష్కరించుకోవడం కోసం గిట్టనివారిని అక్రమ సంబంధాలను అడ్డుపెట్టుకుని ఇంటికి పంపడం కూడా కొత్తకాదనీ జేమ్స్ పెట్రాస్ తెలిపాడు. అమెరికాలోని పాలకవర్గ కుమ్ములాటలే డేవిడ్ పెట్రాస్ అవమానకరంగా సి.ఐ.ఏ పదవికి రాజీనామా చేయడానికి దారితీసిందని జేమ్స్ వివరించాడు. ఈ కుమ్ములాటల్లో ఇజ్రాయెల్ లాబీ చొరబడ్డాక తలలు తెగిపడడం అనాదిగా వస్తున్న ఆచారమేనన్నది జేమ్స్ పెట్రాస్ అభిప్రాయం.

డేవిడ్ పెట్రాస్ కొనసాగింపు ఇజ్రాయెల్ కి ఇష్టం లేదు. దానికి కారణం ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్య ప్రయోజనాలు. కానీ డేవిడ్ పెట్రాస్ కొనసాగింపు అమెరికా ప్రయోజనాలకు లాభకరం. అయితే ఇజ్రాయెల్ ఆగ్రహానికి అమెరికా రాజకీయాల్లో చాలా శక్తి ఉన్నది. అమెరికా రాజకీయార్ధిక వ్యవస్ధలో ఇజ్రాయెల్ లాబీకి ఉన్న శక్తి ఇంకెవరికీ లేదు. అందువల్ల ఇజ్రాయెల్ ఆగ్రహాన్ని తృప్తిపరచడానికి ఒబామా డేవిడ్ పెట్రాస్ ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. డేవిడ్ పెట్రాస్ ని త్యాగం చేసినప్పటికీ ఆయన ప్రతిపాదించిన వ్యూహాన్ని మాత్రం ఒబామా వదులుకోలేడు. వదులుకున్నట్లయితే ఈజిప్టు, లిబియా, ట్యునీషియా, సిరియాలలో అమెరికా రెచ్చగొట్టిన కిరాయి తిరుగుబాట్లకు అర్ధమే ఉండదు. కతార్, సౌదీ అరేబియాలను రెచ్చగొట్టి సిరియాలో దింపిన ప్రయోజనం నెరవేరదు.

కానీ పెట్రాస్ వ్యూహం ఇజ్రాయెల్ కి నిరంతరం సమస్యగానే ఉంటుంది. ప్రతికూల పాలకుల మధ్యలో, అమెరికాపై ఆధారపడి ఉనికిని కొనసాగించవలసి వస్తుంది. సిరియా, లిబియా, ఈజిప్టులలో సెక్యులర్ పాలకుల వల్ల ఇన్నాళ్లూ తానెంత భద్రంగా బతికిందీ బహుశా ఇజ్రాయెల్ కి ఇపుడు అర్ధం అయి ఉండాలి. విశాల దృష్టిలో ప్రస్తుత పరిస్ధితి అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాల మధ్య ఘర్షణ తలెత్తే విధంగా ఏర్పడి ఉన్నది. ఈ వైరుధ్యాన్ని ఇజ్రాయెల్ గతంలో హై ప్రొఫైల్ హత్యల ద్వారా, అమెరికాలో తీవ్ర లాబీయింగ్ ద్వారా పరిష్కరించుకుంది. భవిష్యత్తులో ఇలాంటి హత్యలు, కుట్రలు మరిన్ని జరిగినా ఆశ్చర్యం లేదు. మరింతమంది అమెరికా అధికారులు పదవీ భ్రష్టులు కావచ్చు. ఇజ్రాయెల్ లాబీ చురుకుదనం ఫలితంగా అమెరికా అత్యున్నత గూఢచార, పోలీసు సంస్ధలు తమలోతాము ఘర్షించుకునే పరిస్ధితి తలెత్తింది. సి.ఐ.ఏ (మాజీ) బాస్ డేవిడ్ పెట్రస్ తన గర్ల్ ఫ్రెండ్ కి పంపిన ఈ మెయిళ్లను దర్యాప్తు చేసి వీధికి లాగింది ఎఫ్.బి.ఐ. ఈ దర్యాప్తుకు నాయకత్వం వహించిన ఎఫ్.బి.ఐ ఏజెంటు పచ్చి యూదు దురహంకారి అని పరిశోధనాత్మక జర్నలిస్టులు వెల్లడి చేశారు. మరో గూఢచార సంస్ధ ఎన్.ఐ.ఏ అధిపతి కూడా డేవిడ్ పెట్రాస్ రాజీనామాలో కీలకపాత్ర పోషించాడు. ఇవన్నీ అమెరికా పాలక గ్రూపుల్లోని అంతర్గత వైరుధ్యాల తీవ్రతనూ, అమెరికా సామ్రాజ్యవాద పాలనా వ్యవస్ధలోని సాపేక్షిక ప్రశాంతతను చెల్లాచెదురు చేయడంలో ఇజ్రాయెల్ కి గల శక్తినీ తెలియజేసే విషయాలు.

ఇటువంటి సంక్లిష్ట అంతర్జాతీయ పరిస్ధుతుల నేపధ్యంలో పాలస్తీనాకు ఐక్యరాజ్యసమితిలో సభ్యేతర పరిశీలక దేశం హోదా లభించింది. గాజా యుద్ధం ద్వారా హమాస్ కి లభించిన ప్రతిష్టను, న్యాయబద్ధతనూ (legitimacy) ఐరాస ఓటింగ్ ద్వారా ఫతా సమతూకం చేయగలిగింది. ఐరాసలో నూతనంగా సంపాదించిన హోదా ద్వారా సంకేతాత్మక లబ్దిని పాలస్తీనా ప్రజలు పొందినప్పటికీ హమాస్, ఫతా ల ప్రతిష్టల పోరులో వారి వాస్తవ ప్రయోజనాలు వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది. పాలస్తీనా ప్రత్యేక దేశంగా రూపొందడంలో ఐరాస హోదా ఒక కీలక అడుగే కావచ్చు. కానీ హమాస్, ఫతాల నిర్ణయాత్మక సంసిద్ధత వల్లనే అది ఆచరణలోకి వస్తుంది. ఈజిప్టు, కతార్ లాంటి అమెరికా సామ్రాజ్యవాద తొత్తుల స్నేహంతో హమాస్ ఎప్పటికీ పాలస్తీనా ప్రజలకు సరైన నాయకత్వం ఇవ్వలేదు.

సద్దాం, గడాఫీ, బషర్ అస్సాద్ లాంటి కీలక సెక్యులర్ జాతీయ శక్తులు ఉనికిని కోల్పోయాక, అమెరికా అడుగులకు మడుగులోత్తే అబ్బాస్ నేతృత్వం పాలస్తీనా పోరాటాన్ని మరింత బలహీనపరుస్తుందే తప్ప ముందుకు సాగదు. అసలు సిసలయిన అరబ్ జాతీయోద్యమమే పాలస్తీనా ప్రజలకు కనీస భవిష్యత్తును గ్యారంటీ చేయగలుగుతుంది. ఈ ఉద్యమంలో అరబ్ దేశాల ప్రజలంతా ఐక్యంగా పోరాడవలసి ఉంటుంది. ఇజ్రాయెల్ దమననీతిని ఎదుర్కొనే శక్తి సరిహద్దులకు అతీతంగా ఐక్యమయ్యే అరబ్ జాతీయోద్యమానికి మాత్రమే ఉంది. లేదా మార్క్సిస్టు-లెనినిస్టు శక్తులు పుంజుకుని కార్మికవర్గ తిరుగుబాటుని విజయవంతం చేయగలిగితే ఒక్క పాలస్తీనా ప్రజలకే కాకుండా అరబ్ దేశాల ప్రజలందరికీ విముక్తిమార్గాన్ని చూపుతుంది. నిజానికి ఇదే సరైన మార్గం. అయితే అదింకా సుదూర స్వప్నమే.

… … …అయిపోయింది

7 thoughts on “అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను ఓడిస్తూ ఐరాసలో పాలస్తీనా -2

  1. సంక్షోబాన్ని విస్తరింప జేయడం, యుద్ధాన్ని వ్యాపింప జేయడం సామ్రాజ్య వాద లక్షణం. పరస్పర వైరుధ్యాలతో నెలకొని ఉన్న సందర్భాన్ని చాలా వివరంగా అధ్యయనంతో మీరు వివరించారు. అభినందనలు

  2. <>

    నాకు ఇంకో మార్గం కనిపిస్తోంది. తృతీయ ప్రపంచ దేశాలుగా చెప్పుకునే భారత్, తదితర దేశాలు సంఘటితంగా నిలబడి ఒక ప్రభావ వంతమైన శక్తిగా అవతరించినపుడు…సామ్రాజ్య వాదుల ఆటలు కట్టిపెట్టక తప్పదు. కాకుంటే ఆ దేశాల్లో వెన్నెముక ఉన్న పాలకులు రావాలి.
    ఏదేమైనా…….
    వంద ఏనుగులను తిన్న రాబందు…ఒక్క గాలి వానకు కూలిపోతుందన్నట్లు…..
    ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలను తన ప్రయోజనాల కోసం బలి చేస్తున్న అమెరికా సామ్రాజ్య వాదులకు ఏదో ఒకో రోజు పతనం తప్పదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s