ఫేస్ బుక్ అరెస్టు: ఎస్.పి సస్పెన్షన్, జడ్జి బదిలీ


రేణు శ్రీనివాసన్, షహీన్ ధడా (ఫొటో: ది హిందూ)

ఫేస్ బుక్ వ్యాఖ్యలను పట్టుకుని ఇద్దరు అమ్మాయిలను అరెస్టు చేసిన కేసులో తలలు తెగిపడుతున్నాయి. సుప్రీం కోర్టు మాజీ జస్టిస్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు బహిరంగ హెచ్చరిక పర్యవసానంగా దేశ వ్యాపితంగా న్యాయ వర్గాలలో కూడా కాక పుట్టించిన ఫేస్ బుక్ అరెస్టు భారత ప్రజాస్వామ్య సౌధం బండారాన్ని బైటపెట్టే పరిస్ధితి తలెత్తడంతో బలి పశువుల తలలు దొర్లి పడుతున్నాయి. ధాణే జిల్లా ఎస్.పి (రూరల్) తో పాటు ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ కాగా, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బదిలీ అయ్యాడు. పోలీసు అధికారులపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

బాల్ ధాకరే అంతిమ యాత్ర సందర్భంగా ముంబై బంద్ చేయించడాన్ని ముంబై అమ్మాయి షహీన్ ధడా ఫేస్ బుక్ వ్యాఖ్య ద్వారా నిరసించగా ఆమె స్నేహితురాలు రేణు శ్రీనివాసన్ ఆ వ్యాఖ్యను లైక్ చేసింది. ప్రజాస్వామిక సూత్రాలను తమకు తప్ప ఎవరికీ వర్తించవని భావించే శివ సైనికులు ఫేస్ బుక్ వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయగా వెనకాముందూ చూడకుండా పోలీసులు వారిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆర్.జి.బగాడే అమ్మాయిల అరెస్టుకు దారితీసిన వివిధ సెక్షన్ల అమలులోని ఉచితానుచితాలు పరిశీలించకుండా వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపుతూ ఆదేశాలు ఇచ్చాడు. అనంతరం వారిని బెయిల్ పై విడుదల చేశాడు.

సీన్ రివర్స్

ఈ వార్త దేశవ్యాపితంగా సంచలనం సృష్టించింది. అప్పటిదాకా ధాకరే మరణంపై తెగ కన్నీళ్లు కార్చేస్తున్న మీడియా ధోరణి ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. ధాకరే సంస్మరణ ముగిసిపోయి ప్రజాస్వామిక స్వేచ్ఛా సూత్రాల స్మరణ మొదలయింది. జస్టిస్ కట్జు ‘ది హిందూ’ పత్రికలో రాసిన “నేనెందుకు ధాకరేకు నివాళులు అర్పించలేను?” అన్న వ్యాసం ఈ ప్రజాస్వామిక సూత్రాల స్మరణకు కావలసిన మందుగుండు సామాగ్రిని అందించింది. ‘ది హిందూ’ ఒరవడిని ఇతర పత్రికలు కూడా అందిపుచ్చుకుని పోలీసుల తీరుపైనా, కోర్టు మందబుద్ధి పైనా విమర్శలు గుప్పిస్తూ ఏకిపారేశాయి.

అప్పటిదాకా చరిత్రాత్మక శివాజీ పార్క్ లో ధాకరే సమాధి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని చర్చిస్తున్న కొన్ని పత్రికలు చర్చను షహీన్, రేణుల భావ ప్రకటనా స్వేచ్ఛ పైకీ, ఐ.టి చట్టం దుర్వినియోగం పైకీ మళ్లించాయి. ఇంత జరిగినా షహీన్ బాబాయి క్లినిక్ పైన శివ సైనికులు సాగించిన విధ్వంసంపై నోరెత్తినవారు లేరు. పదో, ఇరవయ్యో అరెస్టులు జరిగాయి గానీ శివసేన చేత ప్రవేశపెట్టబడిన ప్రజాస్వామ్య విధ్వంసక రాజకీయాలనూ, భయోత్పాతపూరితమైన టెర్రరిస్టు రాజకీయాలనూ చర్చించి నిశ్చయాత్మకంగా తిరస్కరించిన పత్రికలూ, చానెళ్లూ బహు తక్కువ. అలాంటి చర్చ ఒక్క హిందూ పత్రిక మాత్రమే చేయగలిగింది.

తప్పుడు సెక్షన్లు

“అమ్మాయిలపై తప్పుడు సెక్షన్లు బనాయించారు. వారిపైన అంత హడావుడిగా చర్యలు తీసుకోవలసిన అవసరం లేదు” అని మహారాష్ట్ర హోమ్ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ అన్నాడు. అమ్మాయిలపై బనాయించిన ఆరోపణల్లో వేటిని ఉపసంహరించుకోవచ్చో సీనియర్ అధికారులు విచారించి నిర్ణయిస్తారని ఆయన ప్రకటించాడు. అమ్మాయిల అరెస్టు న్యాయ వర్గాల్లో కూడా చర్చోపచర్చలకు దారితీసింది. అమ్మాయిలకు రిమాండ్ విధించి ఆనక బెయిల్ ఇవ్వడం ద్వారా దయాగుణాన్ని ప్రదర్శించే బదులు మేజిస్ట్రేట్ బగాడే వారిని ఆరోపణలనుండి విముక్తి చేసి ఉంటే బాగుండేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. తప్పుడు సెక్షన్ల కింద వారిని అరెస్టు చేసిన విషయాన్ని మేజిస్ట్రేట్ గ్రహించి తదనుగుణంగా వ్యవహరించి ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు.

షహీన్, రేణులపైన ఐ.పి.సి సెక్షన్ 295(ఎ) (ఉద్దేశ్యపూర్వకంగా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి మతాలను అవమానించడం), సెక్షన్ 505(2) (వివిధ వర్గాల మధ్య శతృత్వాన్నీ, ద్వేషాన్నీ రెచ్చగొట్టడం) లను పోలీసులు నమోదు చేశారు. కంప్యూటర్ ని దుర్వినియోగం చేసినందుకు ప్రయోగించే ఐ.టి చట్టాన్ని కూడా బనాయించారు. ఈ చట్టాలేవీ షహీన్, రేణు లకు వర్తించవనీ, బంద్ చేసే హక్కు శివసేనకు ఎలా ఉందో, బంద్ ను నిరసించే హక్కు కూడా వారికి ఉన్నదనీ అనేకమంది వ్యక్తులు, సంస్ధలు, సంఘాలు, మీడియా వివిధ పద్ధతుల్లో, మార్గాల్లో అభిప్రాయాలు తెలిపారు. కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ సైతం అమ్మాయిల అరెస్టు చట్టవిరుద్ధం అని వ్యాఖ్యానించక తప్పలేదు.

ధానే రూరల్ ఎస్.పి రవీంద్ర సేంగావ్కర్, సీనియర్ ఇనస్పెక్టర్ శ్రీకాంత్ పింగిల్ లను సస్పెండ్ చేసినట్లు హోమ్ మంత్రి ప్రకటించాడు. వారిపైన అంతర్గత విచారణ జరుగుతుందని తెలిపాడు. అత్యంత తక్కువ సమయంలో ఆ విచారణ పూర్తవుతుందని ఆయన హామీ ఇచ్చాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు అదనపు ఎస్.పి సంగ్రామ్ నిషాంధర్ ను రాతపూర్వకంగా హెచ్చరించామని మంత్రి ఆర్.ఆర్.పాటిల్ తెలిపాడు. ఉన్నతాధికారులైన ఐ.జి.పి, అడిషనల్ డి.జి.పి లు ఇచ్చిన ఆదేశాలను ఎస్.పి రవీంద్ర పాటించలేదనీ, అమ్మాయిలను అరెస్టు చేయనవసరం లేదన్న వారి సలహాను పెడచెవిన పెట్టాడనీ పాటిల్ తెలిపాడు. తప్పుడు సెక్షన్లు నమోదు చేసి, తప్పుడు రికార్డులు సృష్టించినందుకు శ్రీకాంత్ ను సస్పెండ్ చేశామని ఆయన తెలిపాడు.

అంతకుముందు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బగాడే ను బదిలీ చేస్తున్నట్లు బోంబే హై కోర్టు ప్రకటించింది. ఈ మేరకు హై కోర్టు రిజిస్ట్రార్ సోమవారం ఒక ప్రకటన పత్రికలకు జారీ చేశాడు. “పాల్ఘార్ జె.ఎం.ఎఫ్.సి ఆర్.జి.బగాడే ను ఇందుమూలంగా జలగావ్ లోని అదే హోదాకు వెనువెంటనే బదిలీ చేయడమైనది” అని రిజిస్ట్రార్ ప్రకటన పేర్కొందని ‘ది హిందూ’ తెలిపింది.

ఐ.టి చట్టాన్ని ప్రయోగించే ముందు ఇకనుండి న్యాయ సలహా తీసుకుంటామని హోమ్ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ పత్రికలకు తెలిపాడు. ఐ.టి చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండడానికి పోలీసులకు ప్రత్యేకంగా వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తామని తెలిపాడు.

ప్రజాస్వామ్యం ఇక భద్రమే

కేంద్ర మంత్రి, రాష్ట్ర హోమ్ మంత్రి, పోలీసు ఉన్నతాధికారులు, కోర్టులు తదితర రాజ్యాంగబద్ధ వ్యవస్ధలు, వ్యక్తులు అంతా ఇపుడు లెంపలు వేసుకోవడం మొదటి పరిశీలనలో సంతోషం కలిగించే విషయం. ప్రజాసామిక సూత్రాల పట్ల వారికి కూడా అంతో ఇంతో గౌరవం ఉందని ఈ లెంపకాయలు తెలియజేస్తున్నాయి కనుక అది ప్రజా సామాన్యానికి, ప్రజాస్వామ్య ప్రియులకు సంతోషం కలిగించే విషయమే. అయితే అదంతా ఈ ఒక్క కేసుకే పరిమితం అన్న సంగతి గ్రహింపుకు వస్తే సంతోషం బదులు విచారం కలుగుతుంది. షహీన్, రేణు లపైకి తప్పు నెట్టడానికి ఏ విధంగా చూసినా అవకాశం లేకపోవడంతో పైనుండి కిందిదాకా లెంపలు వేసుకోక తప్పని పరిస్ధితి ఎదురయింది.

అమ్మాయిలు టెర్రరిస్టులు అని చెప్పలేరు; పాకిస్తానీయులు అనీ చెప్పలేరు; దేశ ద్రోహులు అని చెప్పడానికి కాశ్మీర్ లోనో, ఈశాన్య రాష్ట్రాల్లోనో వారు లేరు; మావోయిస్టులని అసలే చెప్పలేరు. కుట్రలు చేసి ఇవన్నీ బనాయించడానికి తగిన సమయాన్ని కూడా జస్టిస్ కట్జు లాంటివారు, ది హిందూ లాంటి పత్రికలు ఇవ్వలేదు. ఇక అమెరికా నుండో, ఇజ్రాయెల్ నుండో వత్తిడులు వచ్చే రూటు లేదు. ధాకరే ప్రతిపాదించిన భూమిపుత్రుల సిద్ధాంతానికి కూడా అమ్మాయిలు దొరికినట్లు లేరు. జరిగిన సంఘటన భారత పాలకవర్గాలు గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్య వ్యవస్ధ యొక్క సాధారణ మూలాలను నిలదీసి ప్రశ్నించే విధంగా జరిగిపోయింది. పెద్దలు, పిన్నలు; పత్రికలు, చానెళ్లు; ప్రజాసంఘాలు, పార్టీలు మొదలైనవారంతా సామాన్య ప్రజలకు ప్రాధమిక హక్కులు లేని సంగతిని పచ్చిగా విప్పి చూపే విధంగా ఆ సంఘటన జరిగిపోయింది. పొద్దున లేస్తే ప్రజల హక్కులను అడ్డంగా ఉల్లంఘించే పార్టీలు, వ్యక్తులు కూడా తమ గుండెలు చీల్చి ప్రజాస్వామ్య దేవతను ప్రదర్శించుకోవాల్సిన పరిస్ధితి దాపురించింది.

ఏమయితేనేం! భారత పాలకులకు ప్రజాస్వామిక సూత్రాల పట్ల ఉన్న గౌరవాన్ని మరొకసారి చాటుకునే అమూల్య (ఖర్చులేని) అవకాశాన్ని షహీన్, రేణులు కల్పించారు.  బతుకు బధ్రతను డిమాండ్ చేస్తున్న కూడంకుళం గ్రామ ప్రజలపై వారు దేశ ద్రోహం కేసులు పెట్టి జైళ్ళలో కుక్కినా ప్రజాస్వామ్యం బధ్రమే ఇక! పోస్కో కంపెనీ కోసం ఒరిస్సా గ్రామ ప్రజల తమలపాకు తోటలను లాక్కుని, అదేమని అడిగినందుకు వారిపై కూడా సెడిషన్ కేసులు మరిన్ని సంవత్సరాలు కొనసాగించినా ప్రజాస్వామ్యానికీ, ప్రజలకు వచ్చిన ముప్పేమీ లేదు! జిందాల్ కంపెనీ కోసం బెంగాల్ లాల్ ఘర్ గిరిజనుల భూములనూ, జార్ఘండ్, ఛత్తీస్ ఘడ్ గిరిజనుల గుడిసెలను పెళ్లగించి అక్కడినుండి తరిమికొట్టినా ప్రాధమిక ఆస్తిహక్కులకు భంగం ఏమీ రాదు. కాలవలు, ఆనకట్టల పేరుతో మహారాష్ట్రలో పవార్ వంశీయులు పదేళ్లుగా  70,000 కోట్ల రూపాయల ప్రజాధనం బొక్కినా అదంతా ప్రజలకు చేరినట్లే. లక్షల కోట్ల అవినీతిని బైటికి లాగిన కాగ్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్ధలకు కూడా ప్రధానమంత్రే స్వయంగా దురుద్దేశ్యాలను అంటగట్టినా ఇక్కడ రాజ్యాంగ సంస్ధలకు గౌరవం ఉన్నట్లే.

ఎన్ని జరిగితేనేం? లక్షల కోట్లు దేశం దాటితేనేం? వాల్ మార్ట్, పోస్కో, జనరల్ ఎలక్ట్రిక్, వాల్ స్ట్రీట్ ఫైనాన్సిఃయల్ టైకూన్స్ ఇత్యాది వ్యాపార కంపెనీలకు ఎర్రతివాచీ పరిచి వెల్కం బోర్డులు కడితేనేం? షహీన్, రేణు లకు ఫేస్ బుక్ లో ధాకరే అంతిమయాత్రపై నిరసన చెప్పే హక్కు పునరుద్ధరించబడింది, అదే చాలు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని డబ్బా కొట్టుకోవడానికి ఇంతకంటే రుజువు అవసరమా?

6 thoughts on “ఫేస్ బుక్ అరెస్టు: ఎస్.పి సస్పెన్షన్, జడ్జి బదిలీ

 1. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత నేను ఏడవలేదు. ఈ నిజం నేను గూగుల్ ప్లస్‌లో వ్రాసాను. అందు వల్ల జగన్ అభిమానులు నా మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి “ఇతడు రాజశేఖరరెడ్డి అభిమానుల మనోభావాలని దెబ్బతీశాడు” అని కంప్లెయింట్‌లో వ్రాస్తే ఎలా ఉంటుంది? వంగవీటి రంగా లాంటి వీధి రౌడీలని కూడా హీరోలని చేసిన చరిత్ర మన పత్రికలకి ఉంది. అటువంటి పత్రికలకి రాజశేఖరరెడ్డినో, థాకరేనో హీరోలని చెయ్యడం కష్టమా?

 2. ప్రముఖులు చనిపోయినప్పుడు పత్రికలు ఎలాంటి ఓవర్ యాక్షన్ చేస్తాయో, రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు కూడా అలాంటి ఓవర్ యాక్షన్ చేశాయి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని పేరు చెప్పుకుని బ్యాంక్ నుంచి లక్షల రూపాయలు ఋణం పొందిన మా తాతయ్యే రాజశేఖరరెడ్డి మరణ వార్త విన్న తరువాత ఏడవలేదు. కానీ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత అతని వల్ల రూపాయి లాభం కూడా పొందని కూలీవాళ్ళు గుండె ఆగి చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. థాకరే చనిపోయినప్పుడు జనం స్వచ్ఛందంగా షాప్‌లు మూసేశారు అనే వార్త కూడా ఇలాగే పత్రికలు సృష్టించిన హైప్ ప్రోపగాండా తప్ప ఇంకొకటి కాదు.

 3. @ ప్రవీణ్ గారూ…అవునండి…ఈ మీడియా తిమ్మిని బమ్మి…బమ్మిని తిమ్మి చేయగలదు. జగన్ గురించి…జగన్ కేసుల గురించి అవసరానికంటే ఎక్కువగా ప్రచారం చేసింది తెలుగు మీడియా. ఆ మధ్య అన్ని తెలుగు పత్రికల్లోనూ ప్రతిరోజూ జగన్ ది పెద్ద ఫోటోతో…వార్తలు వచ్చేవి. ఆ విధంగా ఆయనకు ఉచితంగా పబ్లిసిటీ చేసి పెట్టాయి.
  తర్వాత నాలుక్కరుచుకుని ఈ మధ్యే వైఖరి మార్చుకున్నాయి. ఈ విషయంలో జగన్ చాలా లాభపడ్డాడు.

  ఒక వ్యక్తి చనిపోయినా..లేదన్నా ప్రమాదంలో పడినా జనం స్పందించే విధానం ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇందులో కచ్చితంగా మీడియా పాత్రకూ చాలా అవకాశం ఉంది. అది ఆ వ్యక్తి చనిపోయిన తీరును బట్టి కూడా ఉంటుంది.

  ఉదాహరణకు వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్తుగా మరణించడంతో చాలా మందిని బాధపెట్టింది. అదే వైఎస్…గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఉండకుంటే… లేదా ఆరోగ్యకారణాలతోనో మరణించి ఉంటే ఇదే జనం ఇంతగా స్పందించేవారు కాదేమో.

  కిషన్ జీ లాంటి నాయకుణ్ని దారుణంగా చంపినపుడు….ఉద్యమ కారులు తప్ప సమాజం పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే జనానికి కిషన్ జీ కన్నా వైఎస్ గురించే బాగా తెలుసు.

  @ ఇక అసలు విషయానికొస్తే ఈ ముంబై సంఘటన తర్వాతనైనా అధికారులు కళ్లు తెరుస్తారని ….కొంతమందిని సంతృప్తి పరచడం కోసం అమాయకులను, నిర్దోషులను వేధిస్తే…. చివరకు తామేనన్న సంగతి గ్రహిస్తే మేలు.

 4. గూగుల్ ప్లస్‌లో దీని గురించి చర్చ జరిగింది. జరగని ఆత్మహత్యలని జస్టిఫై చెయ్యడానికి “అందరి మానసిక పరిస్థితి ఒకేలా ఉండదు” అనే సమాధానం చెప్పారు. ఎంత విరక్తి చెందినవాడైనా తనకి రూపాయి కూడా ప్రయోజనం కలిగించని ఒక ఫాక్షనిస్ట్ మీద అభిమానంతో ఆత్మహత్య చేసుకుంటాడా?

 5. భౌతిక పునాదులకి విరుద్ధంగా ఏమీ జరగదు. ఆత్మహత్య చేసుకునేవాడైనా భౌతిక అవసరంతో సంబంధం లేని ఏదో speculation కోసం ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోను.

 6. వైఎస్ …తప్పి పోవడం మరణం…అప్పట్లో ఒక్కసారిగా ఉత్కంట రేపి సానుభూతి వాతావరణం కలుగజేసింది. ఆత్మ హత్యలు ఇలాంటి సడెన్ /డెత్ షాకింగ్ న్యూస్ లప్పుడు రెండు మూడు వినేవే…కానీ సామూహికంగా చావడం అంటూ ఉండదు కదా…తర్వాతి సహజ మరణాలనీ ఆ ఖాతాలో జమ కట్టే సారు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s