చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ, మమత బెనర్జీ వంచనా శిల్పం


Photo: The Hindu

చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇంతకాలం చెబుతూ వచ్చిన మమత బెనర్జీ తన ఉద్దేశాలు వేరే ఉన్నాయని వెల్లడి చేసుకుంది. పార్లమెంటు సమావేశాల మొదటిరోజునే, సాధ్యంకాని అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించి భంగపాటుకు గురయినట్లు దేశ ప్రజలకు సందేశం ఇచ్చిన త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక సమయంలో వెన్ను చూపుతోంది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు అనుమతించే బిల్లుపై ఓటింగ్ కు ప్రతిపక్షాలు పట్టుపడుతుండగా, ఓటింగ్ అవసరం లేకుండా చేసే కుట్రలో కాంగ్రెస్ కు సహకారం ఇవ్వడానికి త్రిణమూల్ ముందుకు వచ్చింది. తద్వారా రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లపై తాను చూపుతున్న వ్యతిరేకత పరమ బూటకమని చెప్పేసింది. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, మమత బెనర్జీ తో జరిపిన రహస్య సమావేశం వృధా పోలేదన్న సందేశం కూడా మమత ఇచ్చినట్లయింది.

బి.జె.పితో సహా అనేక ప్రతిపక్ష పార్టీలు రిటైల్ ఎఫ్.డి.ఐ ల బిల్లుపై ఓటింగ్ తో కూడిన చర్చ జరపాలని పట్టుబడుతున్నాయి. తమ డిమాండ్ ని ఆమోదించాలని కోరుతూ అవి తాజా పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తున్నాయి. రిటైల్ ఎఫ్.డి.ఐ ల బిల్లుని ప్రతిపాదించే ముందు ఏకాభిప్రాయం సాధిస్తామన్న తన వాగ్దానాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓటింగ్ కి ఒప్పుకునేదాకా పార్లమెంటు సమావేశాలను జరగనిచ్చేది లేదని చెబుతూ సమావేశాలను అడ్డుకుంటున్నాయి. ప్రభుత్వం ఓటింగ్ తో కూడిన చర్చకు నిరాకరిస్తున్నది. చర్చకు అనుమతిస్తాము కానీ ఓటింగ్ జరపబోమని చెబుతోంది.

ఈ పరిస్ధితుల్లో త్రిణమూల్ కాంగ్రెస్, డి.ఎం.కె, సమాజ్ వాదీ, బి.ఎస్.పి పార్టీలు ఓటింగ్ నిర్ణయాన్ని స్పీకర్ మీరాకుమార్ కి వదిలేయడానికి అంగీకరించినట్లు కాంగ్రెస్ ప్రతినిధి సందీప్ దీక్షిత్ పత్రికలకు తెలిపాడు. సోమవారం ప్రభుత్వం జరిపిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు ఆ పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయని దీక్షిత్ తెలిపాడు. ఈ నిర్ణయం ద్వారా సదరు పార్టీలు తాము ఎటువైపు నిలబడి ఉన్నాయో చెప్పకనే చెప్పాయి. సభలో 80 మంది ఎం.పి ల బలం ఉన్న ఈ పార్టీలు సహకరిస్తే రిటైల్ ఎఫ్.డి.ఐ ల బిల్లును ఆమోదింపజేసుకోవడం పభుత్వానికి నల్లేరు మీద నడకే.

ఓటింగ్ లేకుండా రిటైల్ ఎఫ్.డి.ఐలపై చర్చ జరపడానికే లోక్ సభ స్పీకర్ మొగ్గు చూపుతుందని చెప్పేందుకు రాజకీయ పరిజ్ఞానం ఏమీ అవసరం లేదు. బహుళజాతి కంపెనీలకు మేలు చేసేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉన్నపుడు, ప్రభుత్వానికి భిన్నంగా లోక్ స్పీకర్ వ్యవహరించే అవకాశం లేదు. అలాంటపుడు ఏ నిబంధన కింద చర్చ చేయాల్సిందీ నిర్ణయించే అధికారాన్ని స్పీకర్ కి అప్పజెపితే ఆమె ప్రభుత్వానుకూల నిర్ణయం తీసుకుంటుందే తప్ప ప్రజానుకూల నిర్ణయం తీసుకోదు. ఆ విషయం తెలిసి కూడా స్పీకర్ కే నిర్ణయం అప్పజెప్పడానికి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకోవడం రిటైల్ ఎఫ్.డి.ఐ లపై ఆమె పార్టీ అసలు వైఖరిని తెలియజేస్తున్నది.

“సమావేశంలో ఏకాభిప్రాయం రానప్పటికీ, రిటైల్ ఎఫ్.డి.ఐ ల అంశాన్ని  ఏ నిబంధన కింద చర్చించాలన్న విషయం స్పీకర్ కి వదిలి పెట్టాలని మెజారిటీ ఎం.పి లు ఇష్టపడడం సంతృప్తి కలిగీస్తోంది. నా అభిప్రాయంలో మెజారిటీ ఎం.పి లు -300 నుండి 325 వరకూ ఉంటారని నా అంచనా- స్పీకర్ కే నిర్ణయాన్ని అప్పజెప్పాలని భావిస్తే అలాగే చేసి సభ సజావుగా జరిగేందుకు సహకరించాలి” అని సందీప్ దీక్షిత్ పత్రికలతో అన్నాడు.

స్పీకర్ కి నిర్ణయాన్ని వదిలిపెట్టాలని భావిస్తున్న డి.ఎం.కె, ఎస్.పి, తృణమూల్ కాంగ్రెస్ లు తాము రిటైల్ ఎఫ్.డి.ఐ లకు వ్యతిరేకమని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని మార్చుకోవడం ప్రభుత్వానికి ఇపుడు పెద్ద రిలీఫ్. ఎస్.పి, డి.ఎం.కె పార్టీల గోడ మీద పిల్లి వాటం ఇప్పటికీ అనేకసార్లు రుజువయింది. చివరి నిమిషం వరకూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టుబట్టి తమ రహస్య లక్ష్యాలు (కోర్టు కేసుల నుండి ఆర్ధిక ప్రయోజనాల వరకూ అందులో ఉంటాయి) సాధించుకున్నాక తమపట్టుని ఒక్కసారిగా సడలించుకోవడం, ప్రజా వ్యతిరేక బిల్లులు ఆమోదం పొందడంలో పూర్తి సహకారం అందించడం ఆ పార్టీల ట్రేడ్ మార్క్ రాజకీయం. తృణమూల్ పార్టీ నిర్ణయమే మరీ ఘోరం. రిటైల్ ఎఫ్.డి.ఐ ల విషయమై అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించి కూడా తీరా కీలక సమయం వచ్చేటప్పటికి పూర్తిగా వెనుతిరగడం దారుణం.

డి.ఎం.కె పార్టీ ఇప్పటికే గోడ మీద నుండి ప్రభుత్వం వైపుకి దూకేసిందని చానెళ్లు చెబుతున్నాయి. ఎఫ్.డి.ఐ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు డి.ఎం.కె అధినేత కరుణానిధి చెప్పాడని ‘ది హిందూ’ పత్రిక కూడా ‘న్యూస్ ఫ్లాష్’ లో తెలియజేస్తున్నది.

బాటమ్ లైన్ ఏమిటంటే ఒకవేళ వోటింగ్ నిబంధనతో చర్చకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ మూడు పార్టీల 80 మంది ఎం.పి లు ప్రభుత్వాన్ని బైటపడేయడం దాదాపు ఖాయంగా చెప్పుకోవచ్చు. అందుకు అనేకమార్గాలను భారత పాకకవర్గాలు ఇప్పటికే అభివృద్ధి చేసుకున్నాయి. 80 మంది ఎం.పిలు ఓటింగ్ లో పాల్గొనకుండా సభలో నుండి వాకౌట్ చేయవచ్చు. లేదా ఓటింగ్ లో పాల్గొనకుండా విరమించుకోవచ్చు. అదీ కాకపోతే ఇంకేడన్నా కొత్త మార్గం కూడా కనిపెట్టవచ్చు. అంతిమంగా రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించడం ఖాయంగా కనిపిస్తోంది. అదెలా జరుగుతుందన్నదే వార్త తప్ప జరుగుందా లేదా అన్నది వార్త కాదు. మరి కొద్ది రోజుల్లో నాలుగున్నర కోట్ల భారతీయ కుటుంబాలను వీధిపాలు చేసి, వాల్ మార్ట్ లాంటి బడా కంపెనీలకు బిలియన్ల కొద్దీ లాభాల రాశులను పంచడానికి దారితీసే నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా ఆమోదం పొందనున్నది.

2 thoughts on “చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ, మమత బెనర్జీ వంచనా శిల్పం

  1. అవసరానికి అనుగుణంగా వేషాలు మార్చడం…మమతా బెనర్జీకి ఇవాళే కొత్త కాదు.

    అసలు బెంగాల్ ఎన్నికలకు ముందు ఉన్న మమతకు, ఇవాళ ముఖ్యమంత్రి మమతకు ఎంతో తేడా ఉంది. అధికారంలోకి వచ్చేదాకా…మావోయిస్టులకు అనుకూలంగా….ఏరు దాటాక మావోయిస్టులను పిట్టలను కాల్చినట్లు కాల్చిన ఘనత వారిది. కార్టూనిస్టులను జైలు పాలు చేసి… ఆఖరుకు పత్రికా సమావేశాల్లోనూ తనను ప్రశ్నించిన వారిని మావోయిస్టులని ముద్రవేసిన గొప్ప మనసు దీది ది.

    ఇటీవలి కాలంలో తృణమూల్ పై తీవ్ర వ్యతిరేక రావడం. త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికలు…ఇలా అనేక సమీకరణాల నేపథ్యంలో ప్రజల్లో మద్దతు పెంచుకునేందుకు మమత కాంగ్రెస్ కు అధికారికంగా గుడ్ బై చెప్పారు. అంతే తప్ప పాశ్చాత్య దేశాలకు అనుకూల వైఖరి విషయంలో మమత ఓ ఆకు ఎక్కువే చదివారు.
    ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, తృణమూల్ పార్టీలవి ఉత్తుత్తి బెదిరింపులే తప్ప వాటితో తమకు ఎటువంటి ముప్పు రాదని….కాంగ్రెస్ పెద్దలకు తెలుసు. ఒక వేళ వచ్చినా వారి కొమ్ములు వంచడం హస్తం పార్టీ కి కష్టం కాదు.

    మీరన్నట్లు అంతా పెద్ద బూటకం. దొంగ నాటకం

  2. వెనుకబడిన తరగతులకు తరతరాలు గా అన్యాయం జరిగిందని, దానిని భర్తి చేయటానికి వారి తరపున నాయకత్వం వహిస్తామని ఢంకా భజాయించే ములాయం,మాయవతి, కరుణా నిధి మొదలైనవారు ఈ రిటైల్ వ్యాపారాన్ని ఎలా సమర్ధిస్తారు? ఒక సారి వారిని అనుమతిస్తే మనం వారి పీడను వదిలించుకోవటం అంత సామాన్యమైన విషయం కాదు. బడా వ్యాపారులకు మద్దతు నిచ్చే కాంగ్రెస్ వాల్ మార్ట్ ను తేవటానికి ఒప్పుకొనేదేపో, మరి ఈ బలహీన వర్గాల నాయకులు ఎలా ఒప్పుకొంటారు? అందులోనూ కీలలకమైన ఈ బిల్లు విషయంలో వారికి కొంచెం కూడా పేద మధ్యతరగతి వర్గాల విషయం పట్టదా? ఇప్పతివరకు వారు చేసిన సహాయం ఎమో గాని, ఉన్నదానిని కూడా పేద,మధ్య తరగతి వర్గాలనోటి దగ్గర నుండితీసేస్తున్నారు. బి జె పి థింక్ టాంక్ ఇప్పటికే ఈ పెట్టుబడులు ఎలా ప్రభావం చూపుతాయో లెక్కలు కట్టి, ఎన్నోవ్యాసాలు రాశారు. ఈ విషయం లో ఆపార్టినే నయంగా ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s