అజ్మల్ కసబ్ ఉరి శిక్ష అమలు


Photo: The Hindu

26/11 గా ప్రస్తావించే ముంబై మారణహోమంలో పాల్గొన్న అజ్మల్ కసబ్ ను ఉరి తీశారని పత్రికలు తెలిపాయి. కసబ్ ఉరితీతను మహారాష్ట్ర హోమ్ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ధృవీకరించాడని ‘ది హిందూ’ తెలిపింది. మారణ హోమానికి నాలుగు సంవత్సరాలు నిండడానికి ఐదు రోజులకు ముందు అజ్మల్ కసబ్ ఉరికంబం పై శిక్ష అనుభవించాడు. కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నవంబరు 8 తేదీన తిరస్కరించడంతో కసబ్ ని ఉరి తీయడానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

“అవును. ఈ రోజు (బుధవారం) ఉదయం 7:30 గంటలకు యెరవాడ సెంట్రల్ జైలులో కసబ్ ను ఉరి తీశారు” అని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికామ్ చెప్పాడని ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తాసంస్ధ తెలియజేసింది. టెర్రరిస్టు దాడుల కేసును ప్రభుత్వం తరపున వాదించిన న్యాయ బృందానికి ఉజ్వల్ నాయకత్వం వహించాడు.

పాకిస్తాన్ మిలట్రీ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ పర్యవేక్షణలో 11 మంది టెర్రరిస్టులు ముంబైలో అడుగుపెట్టి నవంబరు 26 నుండి 29 వరకూ మారణహోమం సృష్టించారు. భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్ లో పదిమంది చనిపోగా కసబ్ ఒక్కడే ప్రాణాలతో పట్టుబడ్డాడు. భారతీయులతో పాటు విదేశీయులను కూడా కలిపి మొత్తం 166 మంది చనిపోయిన ఈ మారణహోమాన్ని ఐ.ఎస్.ఐ ప్రత్యక్షంగా, శాటిలైట్ ఫోన్ల ద్వారా పర్యవేక్షించిందనీ, అందుకు తగిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయనీ భారత ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది. సాక్ష్యాలను పాక్ ప్రభుత్వానికి ఇచ్చినట్లు భారత్ తెలిపినప్పటికీ పాకిస్ధాన్ నుండి ఇంతవరకు ఒక్క నిందితుడు కూడా భారత్ కు పంపబడలేదు.

ముంబై మారణహోమానికి తగిన ఏర్పాట్లు చేసిన డేవిడ్ హెడ్లీ అమెరికా ప్రభుత్వ నిర్బంధంలో ఉన్నాడు. ఆయనని పూర్తి స్ధాయిలో విచారించడానికి తగిన అనుమతిని భారత అధికారులకు అమెరికా ఇవ్వలేదు. హేడ్లీని విచారించకుండా ఉండడానికి భారత ప్రభుత్వ అధికారులతో అమెరికా బేరసారాలు జరిపిందని వికీలీక్స్ వెల్లడించిన అమెరికన్ డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. హేడ్లీ విచారణకు అనుమతి ఇవ్వాలని అమెరికాను కోరకుండా పూర్తిగా మిన్నకుండడం తమకు కష్టమనీ, ప్రజలు అందుకు ఒప్పుకోరనీ, కాకపోతే విచారణకు అనుమతి ఇచ్చాక విచారణ చేసినట్లు నాటకం ఆడతామనీ భారత అధికారులు చెప్పారనీ, అందుకు తగిన ఒప్పందం కూడా కుదిరిందనీ వికీలీక్స్ కేబుల్స్ ద్వారా వెల్లడయింది. ఈ విషయాన్ని ‘ది హిందూ’ గతంలో తెలియజేసింది.

ఈ నేపధ్యంలో చూసినపుడు ముంబై మరణహోమానికి కారకులయిన వారిని శిక్షించడంలో అమెరికా, భారత్ ప్రభుత్వాలు ఎంతమేరకు సిద్ధపడిందీ అనుమానాలు తలెత్తాయి. ఈ అనుమానాలను గుడ్డిగా కొట్టేవేయడమే తప్ప తగిన కారణాలతో నివృత్తి చేసినవారు లేరు. డేవిడ్ హేడ్లీ వాస్తవానికి పూర్వాశ్రమంలో సి.ఐ.ఎ తరపున పనిచేసిన గూఢచారి అని కూడా పత్రికలు వెల్లడి చేశాయి. దానితో ముంబై మారణహోమంలో సి.ఐ.ఎ పాత్రపై కూడా అనుమానాలు ఏర్పడ్డాయి. తమకోసం పనిచేసిన వ్యక్తి కనకనే అతనిని విచారించకుండా భారత అధికారులను నిరోధించడానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నించి సఫలం అయిందని గ్లోబల్ రీసెర్చ్ సంస్ధ తెలియజేసింది.

ఈ విషయాలన్నీ పరిశీలించినపుడు ముంబై మారణహోమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారికి విద్వేషపూరితమైన ముస్లిం మతఛాందసత్వ సెంటిమెంట్లు ఉన్నప్పటికీ దానికి ఆదేశాలు ఇచ్చినవారికి ఉన్న కారణం మత విద్వేషం కాదనీ, ప్రపంచ ఆధిపత్యం కొనసాగడం కోసం పన్నిన జియో పోలిటికల్ వ్యూహంలో భాగంగా భారతప్రజల అభిప్రాయాలను, సెంటిమెంట్లను నిర్దిష్ట దిశలో ప్రభావితం చేయడానికే ఈ మారణహోమాన్ని జరిపారనీ వివిధ పరిశోధనాత్మక సంస్ధలు, వ్యక్తులు సూచిస్తున్నారు. ఇందులో కసబ్ లాంటివారు పావులేననీ వారు చెబుతున్నారు.

ప్రపంచాధిపత్య వ్యూహం కోసం తన కేంద్ర స్ధానాన్ని మధ్యప్రాచ్యం నుండి ఆసియాకు మార్చినట్లు ఒబామా ప్రకటించిన నేపధ్యంలో ఈ సూచనలోని నిజానిజాలను అంచనా వేయవచ్చు. ఆర్ధికంగా పోటీగా ఎదిగిన చైనాను నిలవరించేందుకు ఆ దేశాన్ని సైనికంగా ఇప్పటికే అమెరికా చుట్టుముట్టిన నేపధ్యంలో కూడా సదరు సూచనను అంచనావేయవచ్చు. చైనాను నిలవరించే కుట్రల్లో అమెరికా  భారత్ ను మిత్రుడుగా స్వీకరించినందున రానున్న కాలంలో భారత ప్రజలకు గడ్డురోజులే ఎదురుకానున్నాయి.

5 thoughts on “అజ్మల్ కసబ్ ఉరి శిక్ష అమలు

 1. చివరి రెండు పేరాలలో మీరు రాసిన విషయాలు అనేక వాస్తవాలను, అభిప్రాయాలనూ, విశ్లేషణలను గుర్తుకు తెస్తున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్‍పై దాడి గురించిన ప్రస్తావన కూడా వస్తున్నది. అరుంధతీ రాయ్ పార్లమెంట్ పై దాడిని మీరన్నట్లుగానే ఒక మతం ప్రజలను న్యూనతపడేట్టుగా చేసే ప్రణాళికలోభాగంగా జరిగిన నాటకం(ఫార్స్) అన్నట్టుగా గుర్తు. ఈ విషయాన్ని కూడా ఇక్కడ జోడించి ఉంటే బాగుండేది.

  ఆసియా కేంద్రంగా అమెరికా రాజకీయాలను నడపడానికి నిర్ణయించుకున్నట్టుగా మీరు చేసిన వ్యాఖ్యను రాజకీయాలతో మిళితం చేసి వివరించి ఉంటే బాగుండేది. అదేవిధంగా పాకిస్తాన్‍కు, టెర్రరిస్టు గ్రూపులకూ ఉన్న సంబంధం, అమెరికాకూ పాకిస్థాన్‍కు ఉన్న సంబంధం, అమెరికాకూ, భారత్‍కూ ఉన్న మైత్ర్తి – ఈ నేపథ్యంగా వివరంగా రాయవచ్చేమో చూడండి.

 2. దేశ రాజకీయాలపరంగా చూస్తే, కసబ్ ని ఉరి తీయడం ద్వారా UPA ప్రభుత్వం తెలివైన పనే చేసినట్లనిపిస్తుంది. ఎందుకంటే, కసబ్ BJP పార్టీకి కామధేనువు లాంటి వాడు. ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్ అతన్ని ఉరి తీయకుండా బిర్యానీ పెట్టి మేపుతుందనీ, (ఈ వాదన ఎంత మతి లేనిదో ఒక పాత పోస్టు లో రాసి ఉన్నాను – http://andamainacheekati.blogspot.in/2011/11/blog-post.html) ఈ దేశంలో హిందువులకు రక్షణ కల్పించాలంటే BJP అధికారంలోకి రావాల్సిందేననీ ప్రగల్బాలు పలుకుతూ దీని నుండి కూడా ఓట్లు రాబట్టుకోవడానికి BJP ప్రయత్నించేది.

  UPA కసబ్ ని ఉరి తీయడం ద్వారా, BJP మ్యానిఫెస్టో నుండి ఓ అంశాన్ని తొలగించినట్లైంది. ఇన్నాళ్ళూ కసబ్ స్మరణ చేసిన BJP నాయకులు, ఇతన్ని ఉరి తీయంగానే ఇప్పుడు అఫ్జల్ గురు నామస్మరణ మొదలు పెట్టారు.

  ఆర్థిక పాలనా పరమైన విధానాల పరంగా NDAకి తనకంటూ ప్రత్యేక సిద్ధాంతాలంటూ లేవు. దాని విధానాలన్నీ కాంగ్రెస్ నుండి కాపీ కొట్టినవే. కాబట్టి ప్రజల నుండి ఓట్లు రాబట్టాలంటే దానికి కసబ్, అఫ్జల్, అయోధ్య లాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ ఏదో ఒకటి కావాల్సిందే. భవిష్యత్తులో ఇలా BJPకి వరంగా మారే అవకాశం ఉన్న చార్మినార్ వివాదం గురించి నిన్న హిందూ లో ప్రముఖంగా వచ్చిన వార్తను చూశారా. దీని గురించి నా బ్లాగ్లో కొంత రాసి ఉన్నాను – http://andamainacheekati.blogspot.in/2012/11/blog-post.html. have a look if possible. Thanks.

 3. అమెరికా పాకిస్తాన్‌కి ఎప్పటి నుంచో ఆయుధాలు అమ్ముతోంది. ఇండియాలో ఉగ్రవాదం పెరిగితే ఇండియాకి సహాయం చేస్తామని చెప్పి ఇండియాకి ఆయుధాలు అమ్ముతుంది అమెరికా. అమెరికా ఇలా రెండు దేశాలతోనూ గేమ్ ఆడుతోందని తెలిసినా “అమెరికా అధినాయకత్వంలోని గ్లోబలైజేషన్ వల్లే మాకు ఐటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయి” అని చెప్పి అమెరికాని సమర్థించేవాళ్ళు ఉన్నారులే.

 4. కసబ్ ఉరిపై దేశం యావత్తూ “సంతృపి” ప్రకటిస్త్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి గుజరాత్ మారణ కాండలో వేలాది మందిని అత్యంత దుర్మార్గంగా చంపినందుకుగానూ నిందితులకు ఇట్టాంటి శిక్ష ఏమీ పడినట్టుగా లేదే.

 5. @నాగరాజు: మీరు ప్రస్తావించిన అంశాలు గతంలో వివిధ సందర్భాల్లో రాసి ఉన్నాను. ఉరి శిక్ష అమలు సందర్భంగా వాటిని వాదనగా వివరంగా ప్రస్తావించడం, మరో కొసకు దారి తీస్తుందని, చెయ్యలేదు. మరో సందర్భంలో రాయడానికి ప్రయత్నిస్తాను. (ఇప్పటికే ఇద్దరు వెధవలు బూతులు రాసారు.)

  @చీకటి: భాగ్యలక్ష్మి ఆలయం గొడవ పై మీ లింక్ చూసాను. నేనూ నిన్ననే కొంత రాసాను. వేరే పనిలో ఉండి పూర్తి చేయలేకపోయాను.

  @ప్రవీణ్: అవును. అమెరికా రగిల్చే ప్రాంతీయ తగువుల్లో ఆయుధ వ్యాపారం కూడా ఒక ప్రయోజనంగా ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s