ఫేస్ బుక్ లో ధాకరే బంద్ వ్యతిరేకించిన మహిళల అరెస్టు, ఉగ్రుడయిన జస్టిస్ కట్జు


పాల్ఘర్ కోర్టు నుండి బైటికి వస్తున్న షహీన్, రేణు (ఫొటో: ది హిందూ)

ధాకరే అంతిమ యాత్ర కూడా ముంబై ప్రజలకు విద్వేషంలోని మరో కోణాన్ని చవి చూపింది. ధాకరే అంతిమయాత్ర కోసం ముంబై బంద్ పాటించడం వ్యతిరేకిస్తూ ఫేస్ బుక్ లో సందేశం ఉంచిన అమ్మాయితో పాటు ఆ సందేశాన్ని లైక్ చేసిన మరో అమ్మాయిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల చర్యపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అమ్మాయిల అరెస్టుకు పాల్పడిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ కోరుతూ ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ కి ఈ మెయిల్ పంపాడు. ఐదు గంటల తర్వాత కూడా తనకే సమాధానం రాకపోవడంతో తగిన స్పందన కోరుతూ మరో ఈ మెయిల్ పంపాడు.

ధాకరే అంతిమయాత్ర కోసం బంద్ పాటించనవసరం లేదని షహీన్ ధడా అనే మహిళ ఫేస్ బుక్ లో సందేశం ఉంచింది. బంద్ పాటించడానికి  బదులు భగత్ సింగ్, సుఖ్ దేవ్ లను మనం గుర్తుకు తెచ్చుకోవాలని సదరు సందేశం కోరింది. “భగత్ సింగ్, సుఖ్ దేవ్ లను మనం గుర్తు చేసుకోవాలి” అని షహీన్ సందేశం కోరినట్లు ‘ది హిందూ’ తెలిపింది. షహీన్ సందేశానికి ‘లైక్’ చేసిన ఆమె స్నేహితురాలు రేణు కూడా అరెస్టయింది. సందేశం ఉంచిన కొద్ది సేపటికే శివసైనికులు 40 మంది విధ్వంసానికి తెగబడ్డారు. షహీన్ బాబాయికి చెందిన కంటి ఆసుపత్రిపై ఆదివారం దాడి చేసి ధ్వంసం చేశారు.

మతపరమైన భావోద్వేగాలను గాయపరించినందుకు మహిళలను అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం ప్రకటించారు. శివ సేన నాయకుడొకరు ఫిర్యాదు చేయడంతో మహిళలను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. అయితే ఆసుపత్రి విధ్వంసానికి కారకులయినవారు ఎవరూ అరెస్టు కాలేదు. మహిళలకు సోమవారం బెయిల్ మంజూరయింది.

“విత్ ఆల్ రెస్పెక్ట్, ప్రతిరోజూ వేలమంది చనిపోతుంటారు. అయినా ప్రపంచం ముందుకు సాగుతూనే ఉంటుంది” అని 21 సంవత్సరాల షహీన్ తన ఫేస్ బుక్ సందేశంలో పేర్కొంది. “కేవలం ఒకే ఒక రాజకీయ నాయకుడు సహజ మరణం చెందడం తోటే ప్రతిఒక్కరూ పిచ్చోడై పోవాలి. వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మేము బలవంతంగా ఆమోదిస్తున్నామే తప్ప ఇష్టంతో కాదు. మనం ఇప్పడున్నట్లు స్వేచ్ఛగా బతకడానికి కారకులయిన అమరవీరులు భగత్ సింగ్, ఆజాద్, సుఖ్ దేవ్ తదితరులకు గౌరవం ప్రకటించిగానీ, రెండు నిమిషాల మౌనం పాటించి గానీ ఎంతకాలం అయింది? గౌరవం అనేది సంపాదించుకుంటాం, ఇస్తాం కానీ బలవంతంగా సంపాదించగలిగేది మాత్రం కాదు. ఈ రోజు ముంబై బంద్ పాటిస్తుందంటే అది భయంతోనే తప్ప గౌరవంతో కాదు.” షహీన్ సందేశం పూర్తి పాఠం ఇదే.

పోలీసుల అత్యుత్సాహం పట్ల జస్టిస్ కట్జు తీవ్ర అభ్యంతరం తెలిపాడు. మహిళల అరెస్టు విషయమై పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఘాటుగా ఈ మెయిల్ ద్వారా లేఖ రాశాడు. “ఒక బంద్ కి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తే మతపరమైన భావోద్వేగాలు దెబ్బతింటాయని చెప్పడం పరమ అనుచితం అని నా మనసుకు తోస్తున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛ గ్యారంటీ చేయబడిన ప్రాధమిక హక్కు. మనం ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నామే గాని ఫాసిస్టు నియంతృత్వంలో కాదు. నిజానికి ఈ అరెస్టే నేరపూరితమైన చర్యగా నాకు కనిపిస్తోంది. ఎందుకంటే, సెక్షన్ 341, 342 ల ప్రకారం ఏ నేరమూ చేయనివారిని తప్పుడు పద్ధతుల్లో అరెస్టు చేయడం, తప్పుడు పద్ధతుల్లో నిర్బంధించడం నేరం” అని జస్టిస్ కట్జు తన లేఖలో పేర్కొన్నాడని ‘ది హిందూ’ తెలిపింది.

పత్రికల వార్తలు నిజమే అయితే మహిళల అరెస్టుకు ఆదేశాలు ఇచ్చినవారితో పాటు వాటిని అమలు చేసిన పోలీసులను కూడా అరెస్టు చేయాలని జస్టిస్ కట్జు ముఖ్యమంత్రి చనాన్ కి రాసిన లేఖలో కోరాడు. అరెస్టుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులను సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలనీ, చార్జి షీటు నమోదు చేసి క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించాలనీ కోరాడు. అది జరగనట్లయితే ఆయన ప్రమాణం చేసిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని ప్రజాస్వామిక పద్ధతుల్లో నడపడంలో ముఖ్యమంత్రి విఫలం అయినట్లు భావించవలసి ఉంటుందని కట్జు హెచ్చరించాడు.

అయితే జస్టిస్ కట్జు ముఖ్యమంత్రికి ఈ మెయిల్ పంపిన 5 గంటల తర్వాత కూడా ఆయనకి ఎలాంటి తిరుగు టపా అందలేదు. దానితో తన లేఖపై ఏ చర్య తీసుకున్నదీ తనకు తెలియలేదని చెబుతూ ఆయన మరో లేఖను ముఖ్యమంత్రికి పంపాడు. ముఖ్యమంత్రి చవాన్ కట్జు నుండి వచ్చిన ఈ మెయిల్ ను అడిషనల్ ఛీఫ్ సెక్రటరీ (హోం) అమితాబ్ రాజన్ కి పంపినట్లు కట్జు కి తెలియడంతో ఆయన మరింతగా ఆగ్రహం చెందాడు. “మీరు నా ఈ మెయిల్ కి రిప్లై ఇవ్వలేదు. కానీ ఎవరో నాకు తెలియని, నా లేఖకు స్పందించాలన్న మర్యాదకూడా తెలియని  అమితాబ్ రాజన్ అనే వ్యక్తికి ఫార్వర్డ్ చేశారు. ఆయన నాకేమీ ప్రత్యుత్తరం రాయలేదు. ఈ విధంగా ఉదాసీన వైఖరితో ఈ అంశాన్ని పరిగణించడం మరింత తీవ్రమైన విషయమని గ్రహించండి! ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛా సూత్రమే ప్రమాదంలో పడిపోయింది. మీరు ఏ చర్య తీసుకున్నదీ తెలుసుకోవడానికి దేశం మొత్తం ఎదురు చూస్తోంది. కాబట్టి, ఈ విషయంలో ఏమీ చేయదలచిందీ నాకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని కట్జు తన రెండవ ఈ మెయిల్ లో పేర్కొన్నాడు. (ముఖ్యమంత్రికి కట్జు రాసిన రెండు ఈ మెయిళ్లను ఇక్కడ చూడవచ్చు.)

ఆర్టికల్ 19(1)(ఎ) గ్యారంటీ చేసిన భావ ప్రకటనా స్వేచ్ఛ మహారాష్ట్రలో ఉనికిలో ఉన్నదా లేదా అని కట్జు ప్రశ్నించాడు. మౌనంగా ఉండడం ప్రత్యామ్నాయం కాకూడదని, మహిళలు అక్రమంగా అరెస్టు అయిన తీరు దేశం మొత్తాన్ని ఆగ్రహింపజేసిందని ఆయన వ్యాఖ్యానించాడు. ఫేస్ బుక్ లో ఏ మాత్రం ఉపద్రవం కలిగించలేని విషయం పట్ల అరెస్టుకు తెగబడడంపై వివరణ ఇవ్వాలని కోరాడు. రాష్ట్ర యంత్రాంగాన్ని ఈ విధంగా అక్రమ పద్ధతులకు పాల్పడిన పోలీసులపైనా, ఇతర అధికారుల పైనా ఏమి చర్య తీసుకున్నదీ తెలియజేయాలని కూడా జస్టీస్ కట్జు కోరాడు.

అరెస్టు పట్ల ప్రజల్లో నిరసన వ్యక్తం కావడంతో అరెస్టుపై విచారణ చేయవలసిందిగా మహారాష్ట్ర డి.జి.పి సంజీవ్ దయాళ్ ఆదేశించాడు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టినట్లు మోపిన సెక్షన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు పోలీసులు ప్రకటించారు. వివిధ తరగతుల ప్రజల మధ్య శతృత్వాన్ని రెచ్చగొట్టినట్లు సెక్షన్ నమోదు చేశారు. మహిళలపై కేసులు నమోదు చేసినప్పటికీ కంటి ఆసుపత్రిని విధ్వంసం చేసినవారిపై కేసులు పెట్టినట్లు పత్రికలు చెప్పలేదు.

2 thoughts on “ఫేస్ బుక్ లో ధాకరే బంద్ వ్యతిరేకించిన మహిళల అరెస్టు, ఉగ్రుడయిన జస్టిస్ కట్జు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s