నగ్నత్వం కాదు, ముస్లిం అస్తిత్వమే ఎం.ఎఫ్ హుస్సేన్ పై దాడులకు కారణం


(రచయిత: నాగరాజు అవ్వారి)

ఎం.ఎఫ్.హుస్సేన్ ఆధునిక చిత్రకారుడు. ఆయన చిత్రాలలో రూపం రీత్యా క్యూబిజం వంటి అనేక ఆధునిక ధోరణులు కనిపిస్తాయి. అయితే భావజాల రీత్యా సంపూర్ణంగా ఆధునికుడని ఆయనను ఒప్పుకోవడం కష్టం. ఏ రకమైన భావజాలానికీ ఆయన ప్రాతినిధ్యం వహించకపోవడం దీనికి కారణం. ప్రత్యేకంగా ఏ ఒక్క భావజాలానికీ ప్రాతినిధ్యం వహించక పోవడంవల్ల ఆయన చిత్రాలలో రూపంలోనూ, సారంలోనూ అనేక రకమైన ధోరణులు కనపడతాయి.

ఆరెస్సెస్ ఆయన పట్ల తీసుకున్న వైఖరికి ప్రత్యేకమైన కారణాలున్నాయి. “హిందూత్వ”కు తను మాత్రమే నిజమైన ప్రతినిధిగా లోకం గుర్తించాలనే దుగ్దతోనూ, సాంస్కృతిక రంగంలోనూ, భావజాలరంగంలోనూ నాజీలను పోలిన ఆచరణాత్మక కార్యక్రమంతోనూ ఆయన మీద దాడికి పూనుకున్నాయి. ఇది ముస్లీమ్ మైనారిటీల ఉనికి, వ్యక్తీకరణల మీద ప్రతీకాత్మకమైన దాడి. వారికి ఒక హెచ్చరిక.

ఎం.ఎఫ్ హుస్సేన్ గీసిన హిందూ దేవతల చిత్రాలు రూపంలో ఆధునికమైనవైనా, అవి ప్రతిబింబించే భావజాలరీత్యా, పురాణాలలోనూ, స్తోత్ర పాఠాలలోనూ స్త్రీని చిత్రీకరించిన ధోరణులకు భిన్నమైనవి కావు. పురాణాలూ, స్తోత్ర పాఠాలూ స్త్రీని నిర్ద్వంద్వంగా శక్తి స్వరూపిణిగా గుర్తిస్తాయి. అదే సమయంలో అంగాంగ వర్ణనకూ పూనుకుంటాయి. ఇది ఒక సంక్లిష్టమైన భూస్వామ్య భావజాల చిత్రం. ఇలాంటి దానితో సరిపోలిన లక్షణం ఆయన చిత్రాలలో కనిపిస్తుంది. ఆ రకంగా ఆయన ఈ చిత్రాలలో “హిందూ” భూస్వామ్య భావజాలానికి దగ్గరవాడే కానీ వ్యతిరేకమైనవాడు కాడు.

కళా సాహిత్య రంగాలలోని ప్రతీ అంశానికీ, వ్యక్తీకరణకీ భిన్నమైన, పరస్పర వ్యతిరేకమైన వ్యాఖ్యానాలు రావడానికీ, అనేక రకాలుగా అభిప్రాయ పడడానికీ ఆస్కారం ఉంది. వారి వారి ప్రయోజనాలు, నేపథ్యాలు, రాజకీయాలు దీనికి ఆలంబనగా ఉంటాయి.

ఎం. ఎఫ్. హుస్సేన్ చిత్రాలలో నగ్నత్వం భూస్వామ్య భావజాల అంశం. ఆరెస్సెస్ కు ఉన్న వ్యతిరేకత ఆయన ముస్లీం కావడంతో మాత్రమే ముడిపడి ఉంది. ఇక మిగిలిన విషయాలు (కళ గురించి) మిడిమిడి ఙ్ఞానంతో మనం మాట్లాడుకునేవే అవుతాయి.

అయితే, కళా సాంస్కృతిక రంగాలలో నగ్నత్వం గురించిన చర్చ నైతికతా పరిధులలో చేయడం కూడని పని. నగ్నత్వాన్ని ప్రదర్శించడంలో మన దగ్గరా నిషేధం ఏమీ లేదు. ప్రాచీన కళలో మనవద్ద కూడా అది ఉంది. అజంతా, ఎల్లోరా శిల్ప కళలోనూ, కామసూత్రలోనూ, సంస్కృత కావ్యాలు, ప్రబంధాలలోనూ ఇలా ఒకటా రెండా అని కాకుండా ప్రాచీన, మధ్య యుగాల కళా సాంస్కృతిక సాహిత్య రంగాలన్నింటిలోనూ ఇది గౌరవ ప్రదమైన స్థానం సంపాదించుకున్నది.

ఆంధ్రమహా భాగవతం రాసిన పోతన, భోగినీ దండకం రాసాడు. శ్రీనాధుడు, పెద్దనామాత్యుడు వంటి వారు రాసిన వాటికి ఆక్షేపణ లేకపోయింది. ఇంకా వాటి వలన వారి గౌరవం ఇనుమడించింది. పెద్దన ప్రవరుని వృత్తాంతం, శ్రీనాధుని రచనలు వాటి శృంగార ఘట్టాలతో సహా పిల్లలు చదువుకుంటున్నారు. (ఇటీవల కొంతమంది తెలుగు పండితులు వీటిని పిల్లలకు ఎలా చెప్పాలని వాపోయారు.)

వీటన్నింటినీ పక్కన పెట్టి హుస్సేన్ మీదపడడానికి కారణం ఆయన ముస్లీం అస్తిత్వమే.

నిజానికి ఆరెస్సెస్ చేస్తున్న పని ఒక మూసలో ఒదగని అనేక భావధారలనూ, సంప్రదాయాలనూ, ఆచార వ్యవహారాలనూ ఒక చట్రంలోకి తేవడానికి ప్రయత్నించడమే. వలస వాద పాలనా కాలంలో ఈ పని మొదలయింది. ఆంగ్లేయులు ఈ దేశంలోకి రాగానే వారికున్న వనరులతో, తమ అధికారుల అవసరాల కోసం మన దేశ చరిత్రను రాయడానికి పూనుకున్నారు.

తొలి చరిత్రపుస్తకాన్ని స్మిత్ రాసాడు. దానిలో ఆయన భారత దేశ చరిత్రను హిందూ యుగం, మహ్మదీయుల యుగం, ఆధునిక యుగంగా విభజన చేసాడు. హిందూ యుగం స్వర్ణ యుగం అన్న ధోరణీకి అక్కడే బీజం వేసాడు. ఆ కాలంలో పాలకులుగా ఉండి తమ విస్తరణను అడ్డుకున్నందుకుగాను మహ్మదీయుల మీద విషాన్ని చిమ్మాడు. ఈ చరిత్ర గ్రంథం తర్వాత తర్వాత ఒక ధోరణికి పునాదయింది. జాతీయోధ్యమకాలంలో రాజకీయాలలో తిలక్ వంటి నాయకుల ద్వారా, సాంస్కృతిక రంగంలో దయానంద సరస్వతి వంటి వారి ద్వారా “జాతి“ అనే పదబంధం దేశంలోని మెజారిటీ జనాన్ని ఉద్దేశించే “హిందూ” పదానికి పర్యాయ పదమైంది. పెట్టుబడిదారీ యుగంలోకి జనాన్నీ నడిపించడానికి యూరప్ లో చోదక శక్తిగా పని చేసిన “జాతి” అనే భావన మన దేశంలో విరూపమై, మతతత్వ రాజకీయాలకూ, ఆరెస్సెస్ ఆవిర్భానికి ఉపకరించింది.

ఇలాంటి భావనను తనదైన భావజాలంతో వ్యతిరేకించిన వాడు అంబేడ్కర్. ఆయన ’హిందు”అనే పదం ఉనికిని ప్రశ్నించలేదు కానీ హిందూమత సారం కులాధిపత్యం అని అన్నాడు. డెబ్భై, ఎనభైలనుండి చరిత్ర, భావజాల రంగాలలో జరిగిన అభివృద్ధి “హిందూ“ అనే పదం ఉనికినే ప్రశ్నించడానికి వీలుకలిగించింది. శ్రమ సంస్కృతిని కలిగి ఉన్న వివిధ కులాల ప్రజానీకానికీ, శ్రమకు దూరంగా ఉన్న భ్రాహ్మణీయ సంస్కృతికీ ఏమీ సంబంధం అని ప్రశ్నించడం మొదలయింది. అంటే ఆరెస్సెస్ లేవనెత్తే సామూహిక “హిందూ” భావననే వీరు సవాల్ చేయడం మొదలు పెట్టారన్న మాట. (నేను హిందువునెట్లయిత –కంచె ఐలయ్య పుస్తకం చూడండి.)

ఇంకా పైన అన్నట్లుగా ఆనేక భావధారలతోనూ, అనేక సంప్రదాయాలతోనూ, ఆచారవ్యవహారాలతోనూ ఇక్కడ వర్ధిల్లిన మత భావజాలం వైపునుండి కూడా ఆరెస్సెస్ గుత్తాధిపత్యానికి ప్రశ్నలు ఎదురయ్యాయి. బసవని సంప్రదాయం, ఇంకా తమది ఒక ప్రత్యేకమైన శాఖగానూ, విశిష్టమైనవిగానూ తమను తాము భావించుకునే మత సంప్రదాయాలు ఆరెస్సెస్ ను అంగీకరించడం లేదు (“ది లాస్ట్ బ్రాహ్మిన్” ఒక సారి చదవండి. ఇది ఆరెస్సెస్ ను ప్రచ్చన్న క్రైస్తవంగా, బ్రాహ్మణీయతకు వ్యతిరేకమైనదిగా వర్ణిస్తుంది). అయితే మతం అధికారంతోనూ రాజకీయాలతోనూ, పైరవీలతోనూ, లంపెన్ స్వభావంతోనూ ముడిపడి ఉన్నందున ఆరెస్సెస్ చుట్టు మూగే స్వాములు, మఠాధిపతులకు కొదవలేదు. తాజాగా జంటనగరాలలో హల్ చల్ చేస్తున్న పరిపూర్ణానంద స్వామి ఇట్టాంటి వాడే.

ఆరెస్సెస్ తో పోరాటంలో భావజాలానికి ఎనలేని పాత్ర ఉంది. శ్రమకూ, భ్రాహ్మణియ భావజాలానికీ పోటి పెట్టడం, చరిత్ర నుంచీ, సంస్కృతి నుంచీ విసృతంగా సోదాహరించడం ద్వారా హిందువులందరూ సోదరులే అనే దొంగ నినాదపు రంగు బహిరంగం చేయవచ్చు.

3 thoughts on “నగ్నత్వం కాదు, ముస్లిం అస్తిత్వమే ఎం.ఎఫ్ హుస్సేన్ పై దాడులకు కారణం

  1. భూస్వామ్య సంస్కృతిలో స్పష్టత అనేది ఎన్నడూ లేదు. బైబిల్‌లో ఇన్సెస్ట్ చెయ్యడం తప్పు అని వ్రాయబడి ఉంది. అదే గ్రంథంలో దావీద్ కొడుకు అబ్సలోమ్ తన తండ్రి ఉంపుడుగత్తెలతోనే తిరుగుతున్నట్టు కథలు ఉన్నాయి. బ్రిటిష్‌వాళ్ళ కాలంలో ఇండియాలో విధవా వివాహాలపై నిషేధం ఉండేది కానీ వేశ్యావృత్తిపై నిషేధం లేదు. అప్పట్లో మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలలో ప్రతి పట్టణంలోనూ భోగం వీధులు ఉండేవి. భర్త చనిపోయిన స్త్రీని పెళ్ళి చేసుకోవడం పాపం అని అనుకున్న మగమహారాజులు పది మందితో పడుకునే భోగకాంతల దగ్గరకి వెళ్ళడం పాపం అని అనుకోలేదు. ఇదంతా వ్రాస్తోంటే నాకు తాపీ ధర్మారావు గారి రచనలు గుర్తొస్తున్నాయి. మన సంప్రదాయాలలోని అపసవ్యతలని బయట పెట్టిన రచయితలలో ఆయన ఒకరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s