సి.ఐ.ఎ మాజీ బాస్ గర్ల్ ఫ్రెండ్ గుప్పెట్లో లిబియా దాడి రహస్యం


ఫొటో: ది టెలిగ్రాఫ్

సి.ఐ.ఎ మాజీ బాస్ డేవిడ్ పెట్రాస్ రాజీనామాకి దారి తీసిన రాయబారి హత్య అమెరికా ఆధిపత్య వర్గాల రాజకీయాలను కుదిపేస్తున్నది. డేవిడ్ పెట్రాస్ గర్ల్ ఫ్రెండ్ పాలా బ్రాడ్వెల్ కంప్యూటర్ లో సి.ఐ.ఎ రహస్య పత్రాలు దొరికినట్లు బ్రిటిష్ పత్రిక ఇండిపెండెంట్, అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు వెల్లడించడంతో సెక్స్ కుంభకోణం విస్తృతి అమెరికా పాలకవర్గాలకు దడ పుట్టిస్తోంది. డేవిడ్ పెట్రాస్ ఆఫ్ఘన్ యుద్ధ కమాండర్ పదవి నుండి తప్పుకుని సి.ఐ.ఎ బాధ్యతలు స్వీకరించాక ఆఫ్ఘన్ కమాండర్ గా బాధ్యత స్వీకరించిన జార్జి అలెన్ కూడా ఇపుడు అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జిల్ కెల్లీ అనే మహిళకు రెండు సంవత్సరాల కాలంలో 20,000 నుండి 30,000 పేజీల వరకూ ఈ మెయిళ్ళు పంపినట్లు ఎఫ్.బి.ఐ విచారణలో వెల్లడి అయినట్లు పశ్చిమ కార్పొరేట్ పత్రికలు తెలిపాయి.

ఇరాక్ యుద్ధ కమాండర్ గా ఆ తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతిగా ఆ తర్వాత ఆఫ్ఘన్ యుద్ధ కమాండర్ గా అనంతరం సి.ఐ.ఎ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన డేవిడ్ పెట్రాస్ గతవారం అవమానకర రీతిలో అక్రమ సంబంధం ఆరోపణలపై రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. డేవిడ్ పెట్రాస్ రాజీనామా తర్వాత కూడా ఈ సెక్స్ కుంభకోణం ముగియకపోగా మరిన్ని తలలను కూల్చేవైపుగా పురోగమిస్తున్నది. పెట్రాస్, బ్రాడ్వెల్ ల సంబంధాల వల్ల రహస్య పత్రాలేవీ బైటికి వెళ్లలేదని అమెరికా ప్రభుత్వం, ఎఫ్.బి.ఐ, సి.ఐ.ఎ లు చెప్పినప్పటికీ అది నిజం కాదనీ బ్రాడ్వెల్ నుండి స్వాధీనం చేసుకున్న లాప్ టాప్ కంప్యూటర్ లో రహస్య డాక్యుమెంట్లు ఉన్నట్లు ఎఫ్.బి.ఐ కనుగొందనీ వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలు వెల్లడించాయి.

జిల్ కెల్లీ ఫిర్యాదు

ఇండిపెండెంట్, వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికల ప్రకారం పెట్రాస్, పాలా బ్రాడ్వెల్ ల సంబంధం బైటికి రావడానికి కారణం జిల్ కెల్లీ ఎఫ్.బి.ఐ కి చేసిన ఫిర్యాదు. ఈమె ధంపాలోని మెక్ డిల్ ఎయిర్ ఫోర్స్ (ఇది అమెరికా సెంట్రల్ కమాండ్ కి కేంద్ర కార్యాలయం) వద్ద సైనికుల కోసం సోషల్ ఈవెంట్స్ నిర్వహించేదని తెలుస్తోంది.

Petraus family friend Jil Kelly -Photo: Daily Mail

జిల్ కెల్లీ కుటుంబం డేవిడ్ పెట్రాస్ కి ఫ్యామిలీ ఫ్రెండ్. (జిల్ కెల్లీ కవల సోదరికీ ఆమె భర్తకీ మధ్య వారి పిల్లవాడి కస్టడీ కి సంబంధించిన వివాదం కేసులో పెట్రాస్, జాన్ అలెన్ లు ఇద్దరూ సాయం చేశారు) జిల్ కెల్లీతో పెట్రాస్ కి ఉన్న సాన్నిహిత్యాన్ని పాలా బ్రాడ్వెల్ ఇష్ట పడలేదు. దానితో ఆమె మరో పేరుతో జిల్ కెల్లీకి బెదిరింపు ఉత్తరాలు (ఈ మెయిల్స్) రాయడం మొదలు పెట్టింది.

పెట్రాస్ తనవాడనీ, ఆయనకి దూరంగా ఉండాలనీ బ్రాడ్వెల్ బెదిరించింది. ఈ బెదిరింపులు ఎవరు చేస్తున్నారో జిల్ కెల్లీకి తెలియలేదు. తనను ఎవరో బెదిరిస్తున్నారని చెబుతూ ఆమె ఎఫ్.బి.ఐ కి ఐదారు నెలల క్రితం ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ గా భావించి మొదలుపెట్టిన ఎఫ్.బి.ఐ విచారణలో ఊహించని విధంగా పెట్రాస్, బ్రాడ్వెల్ లు సాగించిన సెక్స్ సంభాషణలు, వారి సంబంధం వివరాలు బైటికి వచ్చాయి. పెట్రాస్, బ్రాడ్వెల్ ల విషయం నెలల క్రితమే ఎఫ్.బి.ఐ దృష్టికి వచ్చినప్పటికీ, అది అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ దృష్టికి వచ్చినప్పటికీ వారు కాంగ్రెస్, సెనేట్ ల దృష్టికి తీసుకురాలేదని పలువురు రిపబ్లికన్ పార్టీ ఎం.పి లు ఇపుడు ఆరోపిస్తున్నారు. ఒబామా ఎన్నికల ప్రయోజనాలు కాపాడడానికే ఇలా జరిగిందన్నది వారి ఆరోపణ.

అయితే ఎఫ్.బి.ఐ ని కలవర పెట్టింది పెట్రస్, బ్రాడ్వెల్ ల సంబంధం కాదు. బ్రాడ్వెల్ కంప్యూటర్ లో సి.ఐ.ఎ రహస్య పత్రాలు కనపడడంతో ఎఫ్.బి.ఐ అధికారులు కలవరపాటుకి గురయ్యారు. ఇందులో బెంఘాజీ లో కాన్సలేట్ ముసుగులో ఉన్న సి.ఐ.ఎ రహస్య స్ధావరానికి సంబంధించిన వివరాలు, రాయబారి హత్య వివరాలు ఉన్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. దానితో వారి విచారణ బ్రాడ్వెల్ బెదిరింపులనుండి జాతీయ భద్రతా ఉల్లంఘన వైపుకి మళ్ళింది. అధ్యక్ష ఎన్నికల రోజు (నవంబర్ 6) సాయంత్రం వారు నేషనల్ ఇంటలిజెన్స్ సంస్ధ అధిపతి జేమ్స్ క్లాపర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన సలహాతో డేవిడ్ పెట్రాస్ నవంబర్ 10 తేదీన రాజీనామా చేశాడు.

సి.ఐ.ఎ రహస్య స్ధావరంలో బందీలు

అక్టోబర్ 26 తేదీన పెట్రాస్ గర్ల్ ఫ్రెండ్ (ఈమెను పెట్రాస్ భార్యగా కొన్ని కార్పొరేట్ పత్రికలు సంబోధిస్తున్నాయి) పాలా బ్రాడ్వెల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్ లో ఒక ఉపన్యాసం ఇచ్చింది. అమెరికా కాన్సలేట్ గా చెబుతున్న బెంఘాజీ భవన సముదాయం వాస్తవానికి సి.ఐ.ఎ స్ధావరమనీ అందులో లిబియా మిలిటెంట్లు ఇద్దరు బందీలుగా ఉండడంతో వారిని విడిపించుకోవడానికి ఆ భవనాలపై దాడి చేశారనీ బ్రాడ్వెల్ ఆ ఉపన్యాసంలో వెల్లడించడం సంచలనానికి దారితీసింది. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రకారం ఆమె ఇలా పేర్కొంది.

Now, I don’t know if a lot of you heard this, but the CIA annex had actually, um, had taken a couple of Libyan militia members prisoner and they think that the attack on the consulate was an effort to try to get these prisoners back. So that’s still being vetted.

The challenging thing for General Petraeus is that in his new position, he’s not allowed to communicate with the press. So he’s known all of this — they had correspondence with the CIA station chief in, in Libya. Within 24 hours they kind of knew what was happening.

బందీలను విడిపించుకోడానికే దాడి జరిగినట్లు సి.ఐ.ఎ కి తెలుసనీ, సి.ఐ.ఎ అధిపతి పెట్రాస్ కి కూడా ఆ విషయం తెలుసనీ బ్రాడ్వెల్ స్పష్టం చేసింది. ఫాక్స్

US Attorney General Eric Holder

న్యూస్ చానెల్ కూడా ఇంటలిజెన్స్ సంస్ధలను ఉటంకిస్తూ ఆ విషయాన్ని రూడి చేసిందని వాషింగ్టన్ పోస్ట్ తెలియజేసింది. దాడి జరిగినప్పుడే కాకుండా అంతకుముందు కూడా సి.ఐ.ఎ స్ధావరంలో అనేకమంది మిలిటెంట్లను బందీలుగా ఉంచారనీ బ్రాడ్వెల్ తెలిపింది. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం చూసినా, అమెరికా చట్టాల ప్రకారం చూసినా అమెరికా కాన్సలేట్ ముసుగులో విదేశీయులను బందీలుగా ఉంచుకోవడం నేరం. అది యుద్ధ నేరం కూడా. అమెరికాకి బైట సి.ఐ.ఎ జైళ్లను నడపడాన్ని నిషేదిస్తూ ఒబామా డిక్రీ జారీ చేసినందున బందీలను ఉంచుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే. అయితే ఈ విషయాన్ని ఎత్తిచూపుతున్నవారు ఇపుడు ఎవరూ లేరు. బ్రాడ్వెల్ ప్రసంగాన్ని సి.ఐ.ఎ మొదట కొట్టివేసింది. అయితే పెట్రాస్, బ్రాడ్వెల్ ల సంబంధం వెల్లడి కావడంతో బ్రాడ్వెల్ ప్రసంగం విషయాలు వాస్తవమేనని లోకానికి రుజువయింది.

పెట్రాస్, బ్రాడ్వెల్ ల సంబంధం ఇపుడు అమెరికా అటార్నీ జనరల్ ఎరికి హోల్డర్ మెడకు చుట్టుకుంది. కొన్ని నెలల ముందే వీరి విషయం తెలిసినప్పటికీ ఆయన కాంగ్రెస్, సెనేట్ లకు ఎందుకు చెప్పలేదని సదరు సభల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. నవంబర్ 6 ఎన్నికలు ముసిగేవరకూ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడం పట్ల వారు అభ్యంతరం చెబుతున్నారు. ఒబామా ఎన్నిక ప్రయోజనాలు కాపాడడానికే ఎరిక్ తో పాటు ఎఫ్.బి.ఐ కూడా ఈ విషయాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తున్నారు. అయితే బ్రాడ్వెల్ కుంభకోణం ఇంతకంటే పెద్దదేనని గ్లోబల్ రీసెర్చ్ లాంటి సంస్ధలు చెబుతున్నాయి. బెంఘాజీలో రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్ హత్యకు దారి తీసిన విషయాలపై సి.ఐ.ఎ, వైట్ హౌస్ లు మొదటినుండీ అబద్ధాలు చెప్పడంతో అమెరికా చట్ట వ్యతిరేక యుద్ధాల రహస్యాలు కూడా ఈ కుంభకోణం ద్వారా త్వరలో వెల్లడి అవుతాయని గ్లోబల్ రీసెర్చ్ తెలిపింది.

2 thoughts on “సి.ఐ.ఎ మాజీ బాస్ గర్ల్ ఫ్రెండ్ గుప్పెట్లో లిబియా దాడి రహస్యం

  1. ‘స్లం డాగ్ మిలియనీర్’ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. Women and Money are the two things that ruined many lives. పై ఉదంతం దీన్ని మరో సారి నిరూపించింది.

  2. ఒకనాటి విషకన్యలనైనా, నేటి బ్రాడ్వెల్ లాంటివాళ్ళనైనా ప్రత్యర్థులపై ప్రయోగించే పరిస్థితుల గురించి ఆలోచించాలి!

    Women and Money / Wine and Woman – ఇలాంటి పదబంధాలు భూస్వామ్య సంస్కృతినుంచే వచ్చాయి. మెదడు, ఆలోచనా శక్తి, వ్యక్తిత్వం … ఇవేమీ లేని. అవసరం లేని వినియోగ- భోగ వస్తువుగా స్త్రీలను భావించే దృష్టి. డబ్బుతో, మద్యంతో స్త్రీని కూడా సమానం చేసే దృష్టి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s