సవిత ప్రాణం బలితీసుకున్న అబార్షన్ వ్యతిరేక కేధలిక్ చట్టం


ఫోటో: ది హిందూ

ఐర్లండ్ దేశ కేధలిక్ చట్టాలు అబార్షన్ కి అనుమతించక పోవడంతో భారత సంతతి యువతి సవిత హలప్పనవర్ ప్రాణాలు కోల్పోయింది. తాను హిందూ యువతిననీ కేధలిక్ చట్టాలు తనకు వర్తింపజేయొద్దనీ కోరినప్పటికీ చట్టం దృష్టిలో నేరస్ధులుగా మారడానికి డాక్టర్లు ముందుకు రాలేదు. దానితో ఇంకా రూపమే తీసుకోని జీవాన్ని రక్షించే పేరుతో ఉనికిలోకి వచ్చిన అనాగరిక చట్టానికి రెండు ప్రాణాలూ బలైపోయాయి. 31 సంవత్సరాల సవిత దుర్మరణం సంగతి బైటికి పొక్కడంతో వేలాది ప్రజలు స్త్రీలకు అబార్షన్ హక్కుని నిరాకరించే చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ నిరసనలు తెలిపారు. ఐర్లండ్ ప్రభుత్వం ఇపుడు తీరిగ్గా విచారణకు ఆదేశించింది.

సవిత స్వయంగా పళ్ల డాక్టర్. 17 వారాల గర్భవతి అయిన సవిత అక్టోబర్ 28 తేదీన తీవ్రమైన నడుము నొప్పితో ఆసుపత్రిలో చేరింది. తనకు అబార్షన్ చేయాలని అనేకసార్లు ఆమె తన కన్సల్టెంట్ ను కోరింది. కానీ అందుకు ఆమె నిరాకరించింది. “ఆమె ఏమన్నదంటే దురదృష్టవశాత్తూ ఇది కేధలిక్ దేశం కనుక తానాపని చేయలేనని. తాను కేధలిక్ ని కాననీ, హిందువుననీ సవిత ఆమెకి చెప్పింది. తనకు చట్టాన్ని వర్తింపజేయొద్దని కోరింది. ‘సారీ, దురదృష్టవశాత్తూ ఇది కేధలిక్ దేశం. పిండం బతికి ఉండగా అబార్షన్ చేయకూడదని ఇక్కడి చట్టం చెబుతుంది’ అని ఆమె చెప్పేసింది” అని సవిత భర్త ప్రవీణ్ హలప్పనవర్ చెప్పినట్లు ది హిందూ తెలియజేసింది.

తన భార్యకు అబార్షన్ చేసినట్లయితే తప్పకుండా బతికే ఉండేదని ప్రవీణ్ ఆక్రోశిస్తున్నాడు. శిశువు జననంలో తల్లి, దండ్రుల సహజ భౌతిక పాత్రను చూడడానికి నిరాకరించిన మతమూర్ఖ చట్టం పూర్తిగా ప్రాణమే పోసుకోని అర్ధ ప్రాణాన్ని కాపాడలేకపోగా, ఒక నిండు ప్రాణాన్ని అన్యాయంగా బలితీసుకుంది. సంతోషంతో తుళ్లిపడుతున్న ఒక యువజంటను విడదీసి వారి కలల సౌధంలో ఒంటరితనాన్ని నింపింది.

“శనివారం (అక్టోబర్ 20) రాత్రి అంతా మారిపోయింది. ఆమెకి నడుము నొప్పి మొదలవడంతో యూనివర్సిటీ ఆసుపత్రికి కబురు పంపాము… సవిత గుండె వేగంగా కొట్టుకుంటోందని బుధవారం రాత్రి పన్నెండున్నరకి నాకు ఫోనొచ్చింది. ఆమెను ఐ.సి.యు కి తరలించారు. ఆ తర్వాత అంతా చెడ్డ కాలమే. శుక్రవారానికల్లా ఆమెకు తీవ్రంగా జబ్బు చేసిందని చెప్పారు.” అని ప్రవీణ్ తెలిపాడు. ఆదివారం, అక్టోబర్ 28 న సవిత చనిపోయింది. సెప్టికేమియా వ్యాధితో చనిపోయిందని అటాప్సీ ద్వారా డాక్టర్లు నిర్ధారించారు.

“4 నెలల పిండాన్ని కాపాడడానికి 30 యేళ్ళ నాకూతురిని చంపేశారు. ఇదేమి న్యాయం, చెప్పండి… మేము హిందువులం, క్రైస్తవులం కాదు” అని సవిత తల్లి మహాదేవి ప్రశ్నిస్తోంది. వైద్యపరమైన నిర్లక్ష్యం, ఐరిష్ అబార్షన్ చట్టాలు… ఈ రెండింటి వలన తన కూతురు చనిపోయిందని సవిత తండ్రి అందనప్ప యలగి చెప్పాడు. కడుపులో ఉండగానే పిండం చనిపోవడంతో సర్జరీ చేసి దానిని తొలగించారు. ఆ తర్వాత కొద్ది గంటలకే సెడేషన్ ఇచ్చి ఐ.సి.యు కి తరలించారని సవిత భర్త తెలిపాడు. అక్టోబర్ 27 నాటికి సవిత గుండె, కిడ్నీలు, కాలేయం పనిచేయడం మానేశాయి. మరునాటికల్లా ఆమె చనిపోయిందని ప్రకటించారు. రక్తం విషతుల్యం కావడంతో సవిత చనిపోయిందని అటాప్సీలో తేలింది.

ఐర్లండ్ లో అబార్షన్ వ్యతిరేక చట్టాలు చాలా కఠినమైనవి. అన్నిమతాల్లాగే కేధలిక్ మతం కూడా పిల్లలు దేవుడిచ్చిన వారనీ, కనుక ఎంత అనారోగ్యమైనా అబార్షన్ చేసుకునే హక్కు స్త్రీలకు లేదనీ చెబుతుంది. తమను తాము కేధలిక్ దేశంగా చెప్పుకునే ఐర్లాండ్ దానికి అనుగుణంగానే స్త్రీల వ్యక్తిగత, వ్యక్తిత్వ హక్కులను తొక్కిపెట్టి మతాన్నీ, మత సూత్రాలనూ కాపాడే బాధ్యతను ప్రధానంగా స్త్రీలపైనే మోపింది. అబార్షన్లను అధికారికంగా నిషేధించింది. గర్భం కొనసాగడం వల్ల గర్భిణికి ప్రమాదం సంభవించే పరిస్ధితిలో అబార్షన్లను చట్టబద్ధం చేయాలని 1992లో సుప్రీం కోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. ఆ రూలింగ్ ను ఐర్లాండ్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కోర్టు రూలింగ్ తర్వాత ఐదు ప్రభుత్వాలు మారినా చట్టం సవరించడానికి అవన్నీ నిరాకరించాయి. ఫలితంగా ఆసుపత్రుల్లో అబార్షన్ లు జరగడం అసాధ్యంగా మారింది.

దానితో అబార్షన్ కోరుకునే ఐర్లాండ్ స్త్రీలు పక్కదేశాలకు వెళ్లిపోతారు. ఐరిష్ మహిళలు దాదాపు 4,000 మంది వరకూ అబార్షన్ కోసం పక్కనే ఉన్న ఇంగ్లండ్ వెళ్తారని పత్రికలు తెలిపాయి. అత్యవసర పరిస్ధితులు ఏర్పడినప్పుడు ఇలా పక్క దేశం వెళ్ళే సమయం ఉండదు. తల్లి ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నపుడు అబార్షన్ చేసుకునేందుకు ఆమెకు గల హక్కును కాపాడడంలో ఐర్లాండ్ చట్టాలు విఫలం అవుతున్నాయని యూరోపియన్ మానవ హక్కుల కోర్టు గతంలో విమర్శించింది. దాని ఫలితంగా చట్ట సవరణకు సిఫార్సులు చేయవలసిందిగా కోరుతూ ఐర్లాండ్ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది.

తల్లి ప్రాణాలకు ప్రమాదం వచ్చిన పరిస్ధితుల్లో అబార్షన్ కు అనుమతించేలా చట్టాన్ని ప్రతిపాదిస్తూ వామపక్షాల సభ్యులు ఈ సంవత్సరం పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు చట్టంగా మారకుండా పార్లమెంటు అడ్డుకుంది. “గాల్వే యూనివర్సిటీ ఆసుపత్రి వారు తీవ్రమైన ప్రమాదాన్ని నివారించడానికి కూడా అబార్షన్ చేయడానికి నిరాకరించడంతో ఒక మహిళ చనిపోయింది. ఇలాంటి పరిస్ధితి అసలెప్పుడూ తలెత్తదని (పార్లమెంటులో) వాదించారు. ఆమె ఆకస్మిక అబార్షన్ కి గురయింది. ఒక మహిళ ప్రాణం కంటే నిలబడలేని పిండానికే ప్రాధాన్యత ఇచ్చారు. దానితో దురదృష్టవశాత్తూ, ఊహించగలిగినట్లుగానే సెప్టికేమియాతో ఆమె చనిపోయింది” అని బిల్లుని ప్రతిపాదించిన పార్లమెంటు సభ్యుల్లో ఒకరైన క్లేర్ డేలీ తెలిపాడు.

సవిత మరణానికి దారితీసిన పరిస్ధితులను నిరసిస్తూ ఐర్లాండ్, ఇంగ్లండ్ లలో ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. సవిత మరణించిన వార్త ప్రపంచం అంతా వ్యాపించింది. వివిధ దేశాల నుండి ఖండన ప్రకటనలు వెలువడ్డాయి. రెండు వేలకు మందికి పైగా ప్రజలు డబ్లిన్ లోని పార్లమెంటు ముందు ప్రదర్శన నిర్వహించారు. దానితో ఐర్లాండ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రెండు బృందాలతో దర్యాప్తు చేయిస్తున్నట్లు ప్రకటించింది. సంఘటనపై విచారణ చేసే బృందంతో పాటు ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ విభాగాలకు చెందిన స్వతంత్ర నిపుణులతో దర్యాప్తు చేయిస్తామని, ఆరోగ్య సేవల విభాగం, ఆసుపత్రి వారూ ఈ విచారణలు చేస్తారని ఆరోగ్య మంత్రి జేమ్స్ రీలే తెలిపాడు.

ప్రజా వ్యవస్ధలను నియంత్రించే ప్రభుత్వాలు అవసరమైన చోట్ల కూడా మతం మూఢత్వాన్ని వదిలిపెట్టడానికి నిరాకరిస్తూ, తమ మూఢత్వాన్ని చట్టాల్లోకి కూడా ప్రవహింపజేస్తే ఫలితం ఏమిటో సవిత ఉదాహరణ తెలియజేస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s