కాగ్ ని బలహీనపరచడానికి ప్రభుత్వం ప్రయత్నం? -కార్టూన్


కార్టూన్: ది హిందూ

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (CAG – కాగ్) రాజ్యాంగ బద్ధ సంస్ధ. ఎకౌంటింగ్ లెక్కలతో పాటు ప్రభుత్వ విధానాల ఫలితాలను కూడా ఆడిట్ చేసే హక్కు (దీనినే పెర్ఫార్మెన్స్ ఆడిట్ అని పిలుస్తున్నారు) కూడా కాగ్ కి ఉంది. గత రెండు మూడేళ్లుగా కోర్టులతో పాటు కాగ్ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. దానితో ప్రభుత్వాలు నడుపుతున్న పెద్దల అవినీతి ఘనకార్యాలు పచ్చిగా వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తుల అవినీతితో పాటు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల అసలు స్వరూపం కూడా కాగ్ ద్వారా ప్రజలకు తెలుస్తోంది. 1,76,000 కోట్ల 2జి స్పెక్ట్రమ్ అవినీతి, 1,85,000 కోట్ల బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం మొదలైన కుంభకోణాల వెల్లడిలో కాగ్ నివేదికల పాత్ర కీలకంగా మారింది. 2జి స్పెక్ట్రమ్ అవినీతిని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించిందంటే అందులో కాగ్ నివేదిక పాత్ర కీలకం. ప్రభుత్వాల విధానాలు ప్రవేటు కంపెనీల లాభాలను పెంచడానికే తప్ప ప్రజల ప్రయోజనాల కోసం ఉద్దేశించడం లేదని ఈ కుంభకోణాల ద్వారా రుజువయింది. దానితో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వాలు నడుపుతున్న ఆధిపత్య వర్గాలపై ప్రజల్లోని అనేక సెక్షన్లకు అనుమానాలు తలెత్తాయి. దాని ఫలితంగానే అన్నా, కేజ్రీవాల్ లాంటి వారు ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ప్రజలనుండి విస్తృత మద్దతు వ్యక్తం అయింది.

ఈ మద్దతు ఇలాగే కొనసాగితే ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. ప్రభుత్వాలు నడుపుతున్న వర్గాల రాజకీయ చెల్లుబాటుతనం కనుమరుగవుతుంది. ఇది అంతిమంగా ప్రజలు మరిన్ని ఉద్యమాలలోకి దూకడానికి, వ్యవస్ధలో పెనుమార్పులు జరగడానికి బాటలు పరుస్తుంది.  ఇది ఆధిపత్య వర్గాలకు ఇష్టం ఉండదు. ప్రజలు ఎంతగా చైతన్యవంతులయితే పాలక వర్గాలకు అంతగా రోజులు దగ్గరపడతాయి. తమకు రోజులు దగ్గరపడడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? అందుకే పాలకవర్గాలు తాము గొప్పగా చెప్పుకునే రాజ్యాంగ వ్యవస్ధల్లోనే సర్ధుబాట్లకు, సవరింపులకు పూనుకుంటున్నారు. రాజ్యాంగ సంస్ధలను బలహీనపరచడానికి దారులు వెతుకుతున్నారు. శేషన్ లాంటి వ్యక్తి చేతికి ఎలక్షన్ కమిషన్ వెళ్ళాకనే దానికి ఉన్న శక్తి ఏమిటో తెలిసి వచ్చింది. దానితో ఒక వ్యక్తి బదులు ఎలక్షన్ కమిషన్ లోకి ముగ్గురు వ్యక్తులను పాలకవర్గాలు ప్రవేశపెట్టాయి. అదే కోవలో తమని అమితంగా ఇబ్బందిపెడుతూ రహస్యంగా ఉంచుకున్న తమ ఆదాయ మార్గాలను బైటికి లాగుతున్న కాగ్ లోకి మరో ఇద్దరినీ చొప్పించి ముగ్గురు సభ్యుల కమిటీగా మార్చాలని ప్రభుత్వం తలపెట్టింది. కాగ్ ను బహుళ సబ్యుల కమిటీగా మార్చి ముగ్గురిని నియమించడానికి ఆలోచిస్తున్నామని రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి నారాయణ స్వామి చేసిన ప్రకటన అందులో భాగమే.

ఒకరి స్ధానంలో ముగ్గురిని నియమిస్తే కాగ్ మరింత శక్తివంతంగా మారుతుందా లేక బలహీనపడుతుందా అన్నది ఎలా తెలుస్తుంది? కాగ్ పని తీరుకి రాజ్యాంగం కొన్ని నియమ నిబంధనలు రూపొందించి కొన్ని బాధ్యతాయుత అధికారాలను కట్టపెట్టింది. రాజ్యాంగం ఉద్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఈ అధికారాలను వినియోగిస్తూ పని చేసినట్లయితేనే కాగ్ పని ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. ప్రజల ప్రయోజనాలకు ఎంతగా కట్టుబడి ఉంటే కాగ్ శక్తి అంతగా ప్రజలకు తెలుస్తుంది. అలాకాక పాలకుల లక్ష్యాలకు అనుగుణంగా పని చేయడానికి నిర్ణయించుకుంటే కాగ్ ఎంత శక్తివంతంగా ఉన్నా దానివల్ల ఉపయోగమే ఉండదు. కాగ్ శక్తివంతంగా ఉన్నదీ లేనిదీ దానికి అప్పజెప్పిన అధికారాలతో పాటు అందులో పనిచేసే వ్యక్తుల ప్రజానుకూల దృక్పధం కూడా నిర్ణయిస్తుంది. ప్రభుత్వంలోని ఏ అంగం అయినా అంతిమంగా ప్రజల ప్రయోజనాలకు ఉద్దేశించినదే. అయినప్పటికీ పోలీసులు, కోర్టులు, బ్యూరోక్రసీ లాంటి అనేక అంగాలు అనేక సందర్భాల్లో ప్రజావ్యతిరేక పద్ధతులు అనుసరిస్తున్న విషయాన్ని చూస్తున్నాం. కాగ్ కూడా అదే దారిలో ఉంటే దానికి ఎన్ని అధికారాలు ఇచ్చినా, ఎంతమందిని కూర్చోబెట్టినా వ్యర్ధమే.

One thought on “కాగ్ ని బలహీనపరచడానికి ప్రభుత్వం ప్రయత్నం? -కార్టూన్

  1. తమకు అనుకూలంగా మార్చుకోవడానికి…రాజ్యాంగ వ్యవస్థలనే బలహీనపరచాలనుకోవడం శోచనీయం. ఎలక్షన్ కమీషన్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే కదా..తమ సహచరుల పనితీరుపై మాజీ సీఈసీ గోపాలస్వామి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి సంచలనం సృష్టించింది. సమావేశంలో చర్చించే అంశాలను మధ్యలో బాత్ రూమ్ కు వెళ్లి ఫోన్ చేసి చెపుతున్నారని గోపాలస్వామి ఆరోపించారు. బహుశా రేపు కాగ్ ను కూడా అలాగే చేయాలని మన్మోహన్ పరివారం ఆలోచన అనుకుంటా.
    వ్యవస్థలను బలహీనపరచుకంటే పోతే…ఆ పాపం ఈ దేశ ప్రజలందరూ భరించక తప్పదు. ఇప్పటికే కర్నాటక( బళ్లారి )లో అటువంటి దుష్పరిపణామాలను చూస్తున్నాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s