ఈ ఎం.ఎఫ్.హుస్సేన్ చిత్రంలో నగ్నత్వం ఉందా?


ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ ఈ చిత్రాన్ని గీశాడు. 2009 సంవత్సరంలో మార్చి 8 తేదీన అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా డెక్కన్ క్రానికల్ పత్రిక ఈ చిత్రాన్ని ప్రచురించింది. భారతదేశ మహిళల స్త్రీత్వం యొక్క సారం వారి శక్తే (Essence of Indian womenhood is shakti) అని ఎం.ఎఫ్.హుస్సేన్ ఈ చిత్రానికి శీర్షికగా పెట్టాడు. భారత దేశ మహిళల శక్తికి దుర్గా దేవిని ప్రతీకగా చూపిస్తూ హుస్సేన్ ఈ బొమ్మని గీసినట్లు చూస్తే అర్ధం అవుతుంది. డెక్కన్ క్రానికల్ పత్రిక చెప్పినట్లు ఈ చిత్రం భారత మహిళలకు నివాళి. ఇందులో నగ్నత్వం ఏమీలేదు. కాకపోతే భారత మహిళ చీర బదులు పంజాబీ డ్రస్ ధరించినట్లుగా హుస్సేన్ చూపించాడు.

మహిళలపై వివక్ష ను ప్రస్తావించినప్పుడల్లా భారత స్త్రీ శక్తి స్వరూపిణి అనీ, ఆది పరాశక్తి అనీ, కాళిక అనీ, ఆ తల్లనీ, ఈ తల్లనీ చెప్పి అసలు సమస్య అయిన వివక్షను దాటవేయడం చాలామందికి ఉన్న అలవాటు. మహిళా వివక్ష గురించి ఎం.ఎఫ్.హుస్సేన్ అభిప్రాయం ఏమిటో తెలియదు గానీ, ఈ బొమ్మలో మాత్రం భారత మహిళా శక్తి స్వరూపిణి అని మాత్రమే చెప్పాడు. అయితే కొంతమేరకు మైధాలజీని వదిలిపెట్టి వాస్తవంలోకి వచ్చి చీర బదులు పంజాబీ డ్రస్ కట్టాడు. ఆధునిక భారతీయ మహిళ అని చెప్పడానికి చీర బదులు ఆధునిక దుస్తులని ధరింపజేశాడు. హిందూ సంస్ధలకి అదే తప్పయింది.

పంజాబ్ కూడా భారతదేశంలోనిదే. పంజాబీ స్త్రీలు కూడా భారతీయ మహిళలే. అయినప్పటికీ ఈ చిత్రంపై కూడా హిందూ మత సంస్ధలు ఆందోళన చేశాయి. అందరూ గీసినట్లు చీర కాకుండా ప్యాంటు, టీ షర్ట్  ధరించినట్లు దుర్గాదేవిని చూపించారని, ఇది హిందూ దేవతను అవమానించినట్లేననీ హిందూ మతసంస్ధలు ఆరోపించాయి. సాధారణంగా దుర్గాదేవి తల చుట్టూ పసుపు రంగులో కాంతి ఉంటుందనీ ఆమెను అవమానించడానికి నలుపు రంగుని హుస్సేన్ గీశాడనీ ఆరోపించాయి. పత్రిక కార్యాలయానికి వెళ్ళి గొడవ చేసాయి.

పచ్చరంగులో ఉన్న పైట స్పష్టంగా కనపడుతున్నప్పటికీ ఆ దుస్తులను ఫ్యాంటు, చొక్కా గా చూడడానికే మత సంస్ధలు ఇష్టపడ్డాయి. ప్యాంటు, చొక్కాగా చూస్తేనే గొడవ చేయడానికి ఆస్కారం ఉంటుంది గనక అలాగే చూశాయి. అంటే ఇక్కడ ఏదో విధంగా తగాదా సృష్టించి లబ్ది పొందడమే ప్రధాన ఉద్దేశ్యం తప్ప వాస్తవ స్పందన కాదని స్పష్టం అవుతోంది. బట్టలు లేకపోతే నగ్నత్వం అని గొడవ చేస్తారు. చీర బదులు ఇతర దుస్తులు ధరింపజేస్తే మరొకటి చెప్పి గొడవ చేస్తారు. చివరికి ఇదంతా ఎక్కడికి పోతుందంటే దేశంలో నివసించేవారంతా హిందూమతాన్ని అవలంబించాలి. చిత్రకారులంతా హిందూ సాంప్రదాయ రీతులనే అనుసరించాలి. ప్రజలంతా ఎట్టి మినహాయింపు లేకుండా హిందూ మతసంస్ధలు ఏది నీతి అనిచెబితే దానినే అనుసరించాలి. మొత్తం సమాజమే సహజ పరిణామక్రమాన్ని కోల్పోయి పాచిపట్టి కంపులో మునిగిపోవాలి. తాము బురదలో కుళ్లిపోతూ బైట ఉన్నవారిని కూడా బురదలోకి లాగడం అన్నమాట!

చిత్రకారుల దృక్కోణం సాధారణ దృక్కోణానికి భిన్నంగా ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రణ ఆధునిక చిత్రకళలో ఒక ధోరణి. ఉన్నది ఉన్నట్లు, చూసింది చూసినట్లు గీయడం ఒక ధోరణి అయితే, ప్రతీకాత్మకంగా ఊహిస్తూ గీయడం మరొక ధోరణి. ఆమాటకొస్తే మనం ఇన్నాళ్లూ చూస్తున్న ఆయా దేవతల రూపాలు కూడా అప్పటి కవుల, చిత్రకారుల ఊహలే తప్ప అవేవీ వాస్తవ చిత్రణ కాదు.  కవి రాసిన గీతాలకు వివిధ సంగీత రీతులు వివిధ బాణీలు ఎలా కడతాయో వివిధ చిత్రకారులు వివిధ రీతుల్లో తమ ఊహలకు చిత్రరూపాన్ని ఇస్తారు. ఆయా సంస్కృతులను బట్టి ఈ చిత్రరూపాలు వివిధ సాంప్రదాయ రీతులను సంతరించుకున్నాయి.

ఆ సాంప్రదాయ రీతులు ఎప్పుడూ గిరి గీసుకుని కూర్చోలేదు. కాలానుగుణంగా అనేకమార్పులకు లోనవుతూ వచ్చాయి. ప్రజల జీవన విధానంలోనూ, ఆర్ధిక, సామాజిక సంబంధాల్లోనూ వస్తున్న మార్పులను బట్టీ, అనేకానేక సంస్కృతులు పరస్పరం ఘర్షించుకుంటూ, రాజీపడుతూ సరికొత్త రీతులను ఆవిష్కరిస్తున్న కొద్దీ చిత్రకళలో కొత్తకొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కళారంగంలో వస్తున్న మార్పులనూ, కొత్తగా ప్రవేశిస్తున్న ధోరణులనూ అలాగే అర్ధం చేసుకోవాలి తప్ప మార్పులను గుడ్డిగా నిరాకరించడం, సంస్కృతీ పరిరక్షణ పేరుతో విధ్వంసానికి పాల్పడడం ఎంతమాత్రం క్షమార్హం కాదు. నిలవ ఉన్న నీరు పాచిపట్టినట్లే మార్పులకు నోచుకోని సంస్కృతి అభివృద్ధిలేక ప్రజలచేత త్యజించబడుతుంది. ప్రజల ఆదరణే ఏ సంస్కృతికి అయినా అంతిమ గీటురాయి తప్ప వ్యక్తులూ, సంస్ధలూ జారీచేసే నియంతృత్వ ఆజ్ఞలు కాదు.

19 thoughts on “ఈ ఎం.ఎఫ్.హుస్సేన్ చిత్రంలో నగ్నత్వం ఉందా?

 1. ఎం.ఎఫ్.హుస్సేన్ ఆధునిక చిత్రకారుడు. ఆయన చిత్రాలలో రూపం రీత్యా క్యూబిజం వంటి అనేక ఆధునిక ధోరణులు కనిపిస్తాయి. అయితే భావజాల రీత్యా సంపూర్ణంగా ఆధునికుడని ఆయనను ఒప్పుకోవడం కష్టం. ఏ రకమైన భావజాలానికీ ఆయన ప్రాతినిధ్యం వహించకపోవడం దీనికి కారణం. ప్రత్యేకంగా ఏ ఒక్క భావజాలానికీ ప్రాతినిధ్యం వహించక పోవడం వల్ల ఆయన చిత్రాలలో రూపంలోనూ, సారంలోనూ అనేక రకమైన ధోరణులు కనపడతాయి.

  ఆరెస్సెస్ ఆయన పట్ల తీసుకున్న వైఖరికి ప్రత్యేకమైన కారణాలున్నాయి. “హిందూత్వ”కు తను మాత్రమే నిజమైన ప్రతినిధిగా లోకం గుర్తించాలనే దుగ్దతోనూ, సాంస్కృతిక రంగంలోనూ, భావజాలరంగంలోనూ నాజీలను పోలిన ఆచరణాత్మక కార్యక్రమంతోనూ ఆయన మీద దాడికి పూనుకున్నాయి. ఇది ముస్లీమ్ మైనారిటీల ఉనికి, వ్యక్తీకరణల మీద ప్రతీకాత్మకమైన దాడి. వారికి ఒక హెచ్చరిక.

  ఎం.ఎఫ్ హుస్సేన్ గీసిన హిందూ దేవతల చిత్రాలు రూపంలో ఆధునికమైనవైనా, అవి ప్రతిబింబించే భావజాలరీత్యా, పురాణాలలోనూ, స్తోత్ర పాఠాలలోనూ స్త్రీ ని చిత్రీకరించిన ధోరణులకు భిన్నమైనవి కావు. పురాణాలూ, స్తోత్ర పాఠాలూ స్త్రీని నిర్ద్వంద్వంగా శక్తి స్వరూపిణిగా గుర్తిస్తాయి. అదే సమయంలో అంగాంగ వర్ణనకూ పూనుకుంటాయి. ఇది ఒక సంక్లిష్టమైన భూస్వామ్య భావజాల చిత్రం. ఇలాంటి దానితో సరిపోలిన లక్షణం ఆయన చిత్రాలలో కనిపిస్తుంది. ఆ రకంగా ఆయన ఈ చిత్రాలలో “హిందూ” భూస్వామ్య భావజాలానికి దగ్గర వాడే కానీ వ్యతిరేకమైన వాడు కాడు.

  కళా సాహిత్య రంగాలలోని ప్రతీ అంశానికీ, వ్యక్తీకరణకీ భిన్నమైన, పరస్పర వ్యతిరేకమైన వ్యాఖ్యానాలు రావడానికీ, అనేక రకాలుగా అభిప్రాయ పడడానికీ ఆస్కారం ఉంది. వారి వారి ప్రయోజనాలు, నేపథ్యాలు, రాజకీయాలు దీనికి ఆలంబనగా ఉంటాయి.

  శేఖర్ గారూ, ఎం. ఎఫ్. హుస్సేన్ చిత్రాలలో నగ్నత్వం(మీరు లేదనే వైపు స్టాండు తీసుకుంటున్నట్టుగా ఉంది) భూస్వామ్య భావజాల అంశం. ఆరెస్సెస్ కు ఉన్న వ్యతిరేకత ఆయన ముస్లీం కావడంతో మాత్రమే ముడిపడి ఉంది. ఇక మిగిలిన విషయాలు (కళ గురించి) మిడిమిడి ఙ్ఞానంతో మనం మాట్లాడుకునేవే అవుతాయి.
  మీరు పెట్టిన టైటిల్ హుస్సేన్ చిత్రాలలోని నగ్నత్వాన్ని వెతికే వైపు తీసుక పోయేదిగా ఉంది. కాబట్టి చర్చను సాంస్కృతిక,భావజాల రంగాలలో ఆరెస్సెస్ నిర్వహించాలనుకుంటున్న, నిర్వహిస్తున్న పాత్రకు గురిపెడితే బాగుంటుంది.

 2. నాగరాజు గారూ, నగ్నత్వానికి వ్యతిరేకంగాగానీ అనుకూలంగా గానీ స్టాండ్ తీసుకోవడం నా ఉద్దేశ్యం కాదు. అలా తీసుకోవడం వ్యర్ధ ప్రయత్నం. అది దేనికీ ఉపయోగపడదు. నగ్నత్వం అనే టాబూని ఇతర దేశాల్లో అధిగమించడం మనం చూడవచ్చు. ఆర్టిస్టుల చిత్రాల్లోనే కాక న్యూడిజం, నేచురిజం లాంటి సామాజిక రూపాల్లోనూ నగ్నత్వాన్ని అధిగమించే ప్రయత్నాలు పశ్చిమ దేశాల్లో మనకు కనిపిస్తాయి.

  ప్రాచీన యూరోపియన్ చిత్రాల్లో నగ్నత్వం అవిభాజ్య భాగంగా ఉంటూ వచ్చింది. మైకెలాంజిలో చిత్రాల్లో దేవుడు లెదా దేవుని ప్రతినిధుల బొమ్మల కూడా స్త్రీ పురుష భేదం లేకుండా నగ్నంగా చిత్రించడం తెలిసిందే. ఆయా చిత్రాలను పశ్చిమ దేశాలవారు నెత్తిన పెట్టుకున్నారే గానీ మతం పేరుతో, నమ్మకాల పేరుతో విధ్వంసాలకు పాల్పడలేదు. ఆ విధంగా చూసినపుడు నగ్నత్వం పై ఉన్న వ్యతిరేక భావజాలం భూస్వామ్యానికి సంబంధించినదే అని చెప్పగలమా? బహుశా అక్కడా, ఇక్కడా భూస్వామ్య భావాజాలాలకు ఉన్న ప్రత్యేకతలుగా దీన్ని చూడాలేమో.

  హుస్సేన్ చిత్రాలపైన హిందూ మతతత్వ సంస్ధలు ప్రధానంగా చేసిన ఆరోపణ దేవతలను నగ్నంగా చూపారన్నదే. నగ్నత్వం చుట్టూ అల్లుకున్న మూఢత్వం ఇక్కడ బలంగా ఉండడం అందుకు కారణం కావచ్చు. అందువల్లనే నగ్నత్వం వద్ద చర్చ మొదలుపెట్టాలని ఆ టైటిల్ పెట్టాను. కళాకారుల చిత్రాలను అంచనా వేసేటపుడు వల్గారిటీపట్ల అభ్యంతరం చెప్పొచ్చు గానీ, నగ్నత్వం అసలు సమస్య కాకూడదని నా అభిప్రాయం.

 3. అవును కదా శేఖర్ గారూ..ఆ మాటకొస్తే ప్రాచీన శిల్పాలు, చిత్రాలు అనేకం నగ్నంగానే ఉన్నాయి. నగ్నంగా చిత్రించడం అనేది ఏ దేశ శిల్పాల్లోనైనా, చిత్రాల్లోనైనా కనిపిస్తుంది. బహుశా అందులో కొంత ఫిలాసఫీ కూడా ఉండొచ్చునేమో.
  అంతెందుకు హిందూ మతానికి చెందిన కొన్ని స్తోత్రాలను ( కుచోన్నతే..లాంటి వర్ణనలు ) యథాతథంగా అనువదిస్తే…బూతులుగానే కనిపిస్తాయి. కానీ వాటిని బూతుగా కాక….భక్తిపరంగానే చూస్తారు కదా.. కనుక అసభ్యంగా, చిత్రిస్తే అభ్యంతర పెట్టాలి కానీ..
  ఏదో ఒక వంక దేవులాడుకొని నగ్నంగా ఉన్నాయనడం సమంజసం కాదు.

 4. మానవ సమాజం పుస్తకంలో రంగనాయకమ్మ గారు వ్రాసారు “ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటే నడుము పక్క భాగం, వెకున భాగం స్పష్టంగా కనిపిస్తాయనీ, అంత కంటే ప్యాంట్-షర్ట్‌లు వేసుకోవడమే మేలనీ”. మత చాంధసవాదులకి “బట్టలు శరీరాన్ని ఎంత వరకు కప్పుతాయి” అనే విషయం అనవసరం. ఆడవాళ్ళు ఆధునిక దుస్తులు వేసుకుంటే వాళ్ళు చూడలేరు.

 5. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ లింక్ చూడవచ్చు
  http://daily.bhaskar.com/article/LIF-husain-the-man-behind-the-midas-brush-2173782.html

  The legendary painter went on to become the highest paid painter in India when his single canvas titled ‘Battle of Ganga and Jamuna: Mahabharata’ fetched up to $2 million at Christie’s auction in 2008.
  Husain also sealed a deal of $21 million for 100 paintings that he agreed to create for Bombay-based Guru Swarup Srivastava on the theme, ‘Our Planet Called Earth’.
  Husain known to walk barefoot had an expensive line up of cars. From Bentley to Jaguar to Mercedes to Rolls Royce, apparently the painter had been the proud owner of all of them, including the Bugatti Veyron. Yes! He spent some of his fortune on world’s most expensive and most desired cars. And, the best part being that only five rich and famous people in the Middle East own a Bugatti Veyron and M F Husain was one among them.
  If rumors are to be believed then, it is said that Husain once walked into a Bentley showroom, picked a car and paid for it with the swipe of the card. Where the senior managers rushed to take a look at the customer, considering that even Sheikhs of Arabia pay in installments.
  Though the painter didn’t get to stay in India but he did live a lavish life

 6. నిజమే, కళా సాంస్కృతిక రంగాలలో నగ్నత్వం గురించిన చర్చ నైతికతా పరిధులలో చేయడం కూడని పని. నగ్నత్వాన్ని ప్రదర్శించడంలో మన దగ్గరా నిషేధం ఏమీ లేదు. ప్రాచీన కళలో మన వద్ద కూడా అది ఉంది. అజంతా, ఎల్లోరా శిల్ప కళలోనూ, కామసూత్రలోనూ, సంస్కృత కావ్యాలు, ప్రబంధాలలోనూ ఇలా ఒకటా రెండా అని కాకుండా ప్రాచీన, మధ్య యుగాల కళా సాంస్కృతిక సాహిత్య రంగాలన్నింటిలోనూ ఇది గౌరవ ప్రదమైన స్థానం సంపాదించుకున్నది.

  ఆంధ్రమహా భాగవతం రాసిన పోతన, భోగినీ దండకం రాసాడు. శ్రీనాధుడు, పెద్దనామాత్యుడు వంటి వారు రాసిన వాటికి ఆక్షేపన లేకపోయింది. ఇంకా వాటి వలన వారి గౌరవం ఇనుమడించింది. పెద్దన ప్రవరుని వృత్తాంతం, శ్రీనాధుని రచనలు వాటి శృంగార ఘట్టాలతో సహా పిల్లలు చదువుకుంటున్నారు. (ఇటీవల కొంతమంది తెలుగు పండితులు వీటిని పిల్లలకు ఎలా చెప్పాలని వాపోయారు.)

  వీటన్నింటినీ పక్కన పెట్టి హుస్సేన్ మీదపడడానికి కారణం ఆయన ముస్లీం అస్తిత్వమే.

  నిజానికి ఆరెస్సెస్ చేస్తున్న పని ఒక మూసలో ఒదగని అనేక భావధారలనూ, సంప్రదాయాలనూ, ఆచార వ్యవహారాలనూ ఒక చట్రంలోకి తేవడానికి ప్రయత్నించడమే. వలస వాద పాలనా కాలంలో ఈ పని మొదలయింది. ఆంగ్లేయులు ఈ దేశంలోకి రాగానే వారికున్న వనరులతో, తమ అధికారుల అవసరాల కోసం మన దేశ చరిత్రను రాయడానికి పూనుకున్నారు.

  తొలి చరిత్రపుస్తకాన్ని స్మిత్ రాసాడు. దానిలో ఆయన భారత దేశ చరిత్రను హిందూ యుగం, మహ్మదీయుల యుగం, ఆధునిక యుగంగా విభజన చేసాడు. హిందూ యుగం స్వర్ణ యుగం అన్న ధోరణీకి అక్కడే బీజం వేసాడు. ఆ కాలంలో పాలకులుగా ఉండి తమ విస్తరణను అడ్డుకున్నందుకుగాను మహ్మదీయుల మీద విషాన్ని చిమ్మాడు. ఈ చరిత్ర గ్రంథం తర్వాత తర్వాత ఒక ధోరణికి పునాదయింది. జాతీయోధ్యమకాలంలో రాజకీయాలలో తిలక్ వంటి నాయకుల ద్వారా, సాంస్కృతిక రంగంలో దయానంద సరస్వతి వంటి వారి ద్వారా “జాతి “అనే పద బంధం దేశంలోని మెజారిటీ జనాన్ని ఉద్దేశించే “హిందూ” పదానికి పర్యాయ పదమైంది. పెట్టుబడిదారీ యుగంలోకి జనాన్నీ నడిపించడానికి యూరప్ లో చోదక శక్తిగా పని చేసిన “జాతి” అనే భావన మన దేశంలో విరూపమై, మతతత్వ రాజకీయాలకూ, ఆరెస్సెస్ ఆవిర్భానికి ఉపకరించింది.

  ఇలాంటి భావనను తనదైన భావజాలంతో వ్యతిరేకించిన వాడు అంబేడ్కర్. ఆయన ’హిందు”అనే పదం ఉనికిని ప్రశ్నించలేదు కానీ హిందూ మత సారం కులాధిపత్యం అని అన్నాడు. డెబ్భై, ఎనభైలనుండి చరిత్ర, భావజాల రంగాలలో జరిగిన అభివృద్ధి “హిందూ “అనే పదం ఉనికినే ప్రశ్నించడానికి వీలుకలిగించింది. శ్రమ సంస్కృతిని కలిగి ఉన్న వివిధ కులాల ప్రజానీకానికీ, శ్రమకు దూరంగా ఉన్న భ్రాహ్మణీయ సంస్కృతికీ ఏమీ సంబంధం అని ప్రశ్నించడం మొదలయింది. అంటే ఆరెస్సెస్ లేవనెత్తే సామూహిక “హిందూ” భావననే వీరు సవాల్ చేయడం మొదలు పెట్టారన్న మాట. (నేను హిందువునెట్లయిత -కంచెఐలయ్య పుస్తకం చూడండి)

  ఇంకా నేను పైన అన్నట్లుగా ఆనేక భావధారలతోనూ, అనేక సంప్రదాయాలతోనూ, ఆచారవ్యవహారాలతోనూ ఇక్కడ వర్ధిల్లిన మత భావజాలం వైపునుండి కూడా ఆరెస్సెస్ గుత్తాధిపత్యానికి ప్రశ్నలు ఎదురయ్యాయి. బసవని సంప్రదాయం, ఇంకా తమది ఒక ప్రత్యేకమైన శాఖగానూ, విశిష్టమైనవిగానూ తమను తాము భావించుకునే మత సంప్రదాయాలు ఆరెస్సెస్ ను అంగీకరించడం లేదు (“ది లాస్ట్ బ్రాహ్మిన్” ఒక సారి చదవండి. ఇది ఆరెస్సెస్ ను ప్రచ్చన్న క్రైస్తవంగా, బ్రాహ్మణీయతకు వ్యతిరేకమైనదిగా వర్ణిస్తుంది). అయితే మతం అధికారంతోనూ రాజకీయాలతోనూ, పైరవీలతోనూ, లంపెన్ స్వభావంతోనూ ముడి పడి ఉన్నందున ఆరెస్సెస్ చుట్టు మూగే స్వాములు, మఠాధిపతులకు కొదవలేదు. తాజాగా జంటనగరాలలో హల్ చల్ చేస్తున్న సహజానందస్వామి ఇట్టాంటి వాడే.

  ఆరెస్సెతో పోరాటంలో భావజాలానికి ఎనలేని పాత్ర ఉంది. శ్రమకూ, భ్రాహ్మణియ భావజాలానికీ పోటి పెట్టడం, చరిత్ర నుంచీ, సంస్కృతి నుంచీ విసృతంగా సోదాహరించడం ద్వారా హిందువులందరూ సోదరులే అనే దొంగ నినాదపు రంగు బహిరంగం చేయవచ్చు.

 7. నాగరాజు గారు, హిందూ జాతీయవాదానికి మూలాలు దయానంద సరస్వతిలో లేవు. దయాననంద సరస్వతి after all తన తండ్రి భావ జాలంతో విభేదించి ఇంటి నుంచి పారిపోయి సన్యాసిగా మారిన వ్యక్తి. అతనేమీ రాందేవ్ బాబాలాగో, మహేష్ యోగిలాగో భోగ విలాసాలతో బతకలేదు. శూద్రులు జంధ్యాలు వేసుకోవాలనీ, వేద మంత్రాలు చదవాలనీ దయానందుడు బోధించేవాడు. కానీ RSSవాళ్ళు ఈమాత్రం సంస్కరణవాదాన్ని కూడా అంగీకరించరు. RSSవాళ్ళు మను ధర్మ శాస్త్రాన్ని ప్రామాణిక గ్రంథంగా భావిస్తారు. కానీ పల్లెటూర్లలో చాలా మందికి మనుధర్మ శాస్త్రం అంటే ఏమిటో తెలియదు. విద్య, వైద్యం లాంటి సౌకర్యాలని అందించే క్రైస్తవ మిషనరీల సేవలు చూసి పల్లెటూరివాళ్ళు క్రైస్తవ మతంలోకి మారిపోతున్నా RSSవాళ్ళు తమ మనువాద అజెండాతో మత మార్పిళ్ళని ఆపలేకపోతున్నారు.

  కుల వ్యవస్థ మాయమవ్వడం కేవలం RSSవాళ్ళకే కాదు, సెక్యులర్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌కి కూడా ఇష్టం లేదు. జవహార్ లల్ నెహ్రూ కాలం నుంచీ కాంగ్రెస్ తమది సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటోంది. కానీ ఆ పార్టీ దళితుల కోసం పెద్దగా చేసినది ఏమీ లేదు. రిజర్వేషన్‌లు ఇచ్చి కొద్ది మంది దళితులకి అవకాశాలు కల్పించడమే దళితులకి కాంగ్రెస్ చేసిన గొప్ప మేలు. కాంగ్రెస్ పార్టీలో పని చేసిన ఒక ఆర్య సమాజికుడు ‘అంటరానితన నిర్మూలన ఉద్యమం’ కోసం డబ్బులు అడిగితే పార్టీ డబ్బులు ఇవ్వలేదు. కానీ సంఘ సంస్కరణ అనేది తమ అజెండాలో లేని హిందూ మహాసభ అనే సంస్థకి ‘అంటరానితన నిర్మూలన బాధ్యతని అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. శ్యాం ప్రసాద్ ముఖర్జీ 1951లో కాంగ్రెస్ నుంచి విడిపోయి జన సంఘ్ అనే మతతత్వ పార్టీ పెట్టినప్పుడు అందులో హిందూ మహాసభ కార్యకర్తలే ఎక్కువగా చేరారు. “చెప్పు తినే కుక్క చెరుకు తీపినెరుగదు” అన్నట్టు ఉగ్ర హిందూత్వవాదులకి సంఘ సంస్కరణ గురించి ఎంత చెప్పినా అది వాళ్ళ చెవికి ఎక్కదు.

 8. నేను రాసిన వ్యాఖ్యలో సహజానంద అనే పేరుకు బదులుగా పరిపూర్ణానంద అని చదువుకోగలరు. అద్వైతాన్ని బోధించే ఈయన తాజాగా చార్మినార్ దగ్గర బాగ్యలక్ష్మి ఆలయ వివాదంతో వార్తల్లో ఉన్నాడు.
  నా కవిత్వం బ్లాగ్minnalpoery.blogspot.com

 9. ప్రవీణ్ గారూ
  దయానంద సరస్వతి ఏం పనులు చేసాడూ అన్న చర్చకు నేను పోలేదు. దేశంలోని మెజారిటీ ప్రజానీకాన్ని “హిందువులు” అని పిలవడానికి తగిన భావజాల ప్రాతిపదికకూ, ఒక నిర్మాణానికీ ఆయన కారకుడయ్యాడన్నదే నా భావన

 10. “విద్య, వైద్యం లాంటి సౌకర్యాలని అందించే క్రైస్తవ మిషనరీల సేవలు చూసి పల్లెటూరివాళ్ళు క్రైస్తవ మతంలోకి మారిపోతున్నా ”

  చర్చ్ మీద ఒక ఆరోపణ ఉంది. మొదట తెల్లవాడు రాజ్య విస్తరణలో భాగంగా, కొత్త ప్రాంతాలను దేశాలను ఆక్రమించుకొనే క్రమంలో అక్కడిస్థానికులను నిర్దాక్షిణ్యంగా నరికి పోగుపెడతాడు. చచ్చిన వాళ్లు చచ్చిపోగా, కన్ను,కాలు, చేయి మొదలైన అంగాలు తెగి, దెబ్బతిన్న క్షతగాత్రులను సేవలు చేయటానికి, ఈ యుద్దంవలన అక్కడి ప్రజలలో కలిగిన కసి, కోపం, ద్వేషం చల్లార్చటానికి చర్చ్ ని రంగంలోకి దిప్పుతాడు అని .
  ఆఫ్రికాకి కి చెందిన డేస్మండ్ టు టు అనే ఒక నల్ల బిషప్, నోబుల్ ప్రైజ్ విన్నర్ మాటల్లో
  “When the missionaries came to Africa, they had the Bible and we had the land. They said “let us close our eyes and pray.” When we opened them, we had the Bible, and they had the land.”

  శేఖర్ గారు,

  మీరు కేపిటలిజం వ్యతిరేకులు. మీరు రాసే విశ్లేషణలో కేపిటలిస్ట్లు, అమేరికా మొద|| అగ్రరాజ్యలు తమ ఆధిపత్యం వివిధ రూపాలలో అంటే ఐ.యం.యఫ్. మొద|| సంస్థల ద్వారా కొనసాగేటందుకు ఏర్పాటు చేసుకొంటాయనే విషయం చాలా సార్లు రాశారు. అది ప్రపంచ వార్తలు చదివేవారికి తెలిసిన విషయం కూడాను. కాని వీరే అగ్రరాజ్యాల వారి ఆధిపత్యానికి పైకి కనపడకుండా ఇంకొక పెద్ద సంస్థ సహాయపడుతూంటుంది. దానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతిదేశంలో లెక్కలేనన్ని ఆస్తులు, మనుషులు ఉన్నారు. అది మరేదో కాదు చర్చ్. సాధారణంగా మనదేశం వారు చర్చ్ ను ఒక ఆధ్యాత్మిక కోణంలో చూస్తాము. కాని చర్చ్ అగ్ర రాజ్యాలు ప్రపంచాన్ని తమ గుప్పిట పెట్టుకోవటానికి వేసే ఎత్తులు,జిత్తులు, వ్యూహాలలో భాగస్వామిగా పని చేసిన చరిత్ర ఉంది. అంతెందుకు రష్యాలో కమ్యునిజం వైపుకు ప్రజలు ఆకర్షితులుగా కాకుండా ఉండటానికి, ఆరోజుల్లో కేపిటలిస్ట్ దేశాలైన అమేరికా దాని మిత్ర పక్షాలు చర్చ్ ద్వారా పేదలకు డబ్బులు, తిండి గింజలు సరఫారా చేసి వారిని పోరాటాలలో పాల్గొన నీయకుండా దేవుడిని నమ్ముకొవటం వలన జీవితం సుఖ శాంతులతో బాగుంట్టుందనే భ్రమను కల్పించేవారు . ఈ పనిని చర్చ్ ఇప్పటికి కొనసాగిస్తున్నాదని ఆమధ్య తెహల్కా మేగ్ జైన్ లో వచ్చిన ఆర్టికల్ లో చదివాను.

 11. sri గారూ

  చర్చిని ఆధ్యాత్మిక కోణంలో నేనెప్పుడూ చూడలేదు. అగ్రరాజ్యాల ఆధిపత్యానికి చర్చి సహాయ పడుతోందన్న మీ పరిశీలనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మతం ఎప్పుడూ ఆధిపత్య వర్గాల ప్రయోజనాలనే నెరవేర్చింది తప్ప శ్రామిక ప్రజల ప్రయోజనాలను కాదు. మీరు ఉటంకించిన డెస్మండ్ టు టు కొటేషన్ ప్రత్యక్షర సత్యం. పైసా ప్రయోజనం లేని ఆధ్యాత్మికతను శ్రామిక ప్రజలకి ఇచ్చి, భౌతిక సంపదలను ఆధిపత్య వర్గాలకు అప్పజెప్పడమే మతాలు చేసే పని. ఆ పనిని మతాలన్నీ నెరవేరుస్తున్నాయి.

  చర్చిని విమర్శించినా, మసీదుని విమర్శించినా లేదా మరో హిందూ మతాన్ని విమర్శించినా ఆ విమర్శలో ప్రజల ప్రయోజనాలు ఉండాలి. మతాల పరిధిని దాటి ప్రజానుకూల దృక్పధాన్ని కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే అటువంటి విమర్శకీ, విశ్లేషణకీ తప్పనిసరిగా విలువ ఉంటుంది. ఇందులో ఒకరి ఇష్టాయిష్టాలతో పనిలేదు. గమనించగలరు.

 12. I am not justifying Christian missionaries. ఒక వ్యక్తి తన చిన్నప్పుడు ఆర్థిక కారణాల వల్ల చదువుకోలేకపోయాడు. కానీ పెద్దైన తరువాత క్రైస్తవ మిషనరీలు ఉచిత విద్య అందించడం చూశాడు. అతను పట్టణానికి నలభై కిలో మీటర్లు దూరాన ఉండడం వల్ల ఏదైనా సమస్య వస్తే ఆసుపత్రికి పరిగెత్తడం కష్టమయ్యే పరిస్థితి ఉంది. అతని గ్రామంలోనే క్రైస్తవ మిషనరీవాళ్ళు ఆసుపత్రి పెట్టి ఉచిత వైద్య సేవలు అందించడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తికి హిందూ మత గ్రంథాలలో ఏముందో తెలియదు, మత గ్రంథాలలో ఏముందో హిందూ పండితులు అతనికి చెప్పలేదు. ఈ పరిస్థితిలో అతను క్రైస్తవ మత బోధకుల ఉపన్యాసాలలో కొన్ని బైబిల్ వచనాలు విని అతను క్రైస్తవ మతంలోకి మారిపోవడం విచిత్రం కాదు.

  RSSవాళ్ళు తమ అజెండా మనుధర్మశాస్త్రం అని చెప్పుకుంటున్నారు. మనుస్మృతిలో ఏముందో ఇప్పుడే కాదు, రెండు వేల సంవత్సరాల క్రితం కూడా చాలా మందికి తెలియదు. ఆ గ్రంథంలో స్త్రీల గురించీ, శూద్రుల గురించీ చాలా చెత్తగా వ్రాయబడి ఉంది. “శూద్రుడు బ్రాహ్మణుని పక్కన కూర్చుంటే అతని పిరుదులు చీల్చాలనీ, భర్త చనిపోయిన స్త్రీ కటిక నేల మీద కాకుండా మంచం మీద పడుకుంటే స్వర్గంలో ఉన్న ఆమె భర్త ఆత్మ క్షోభిస్తుందనీ” ఇలా శూద్రుల గురించీ, స్త్రీల గురించీ చాలా చెత్తగా వచనాలు వ్రాసారు. ఈ గ్రంథంలో ఏమి వ్రాసి ఉందో బయట పెట్టే ధైర్యం పండితులకి ఇప్పుడే కాదు, రెండు వేల సంవత్సరాల క్రితం కూడా ఉండే అవకాశం లేదు. దయానంద సరస్వతి అనే సంఘ సంస్కర్త ఉండేవాడు. అతను మను ధర్మశాస్త్రంలో ఏముందో బయటపెట్టాడు. కానీ అతను వేదాలని ప్రామాణిక గ్రంథాలుగా భావించాలని అన్నాడు. అన్ని మతాలలాగే హిందూ మతం కూడా ఊహాజనితమే. తమ వ్యక్తిగత ప్రయోజనాలకి విరుద్ధం అని అనిపించేవాటిని ఏ మతవాదులైనా అంగీకరించరు. ఆ విషయాలని తమ మతానికి చెందిన పండితులు చెప్పినా కూడా అంగీకరించరు. దయానంద సరస్వతి వాదనలని మనువాదులు అంగీకరించలేదు. ఇప్పుడు కూడా మనువాదులు దయానందుణ్ణి తిడుతుంటారు. మనుధర్మశాస్త్రంలో ఏముందో బయట పెట్టే ధైర్యం హిందూ మత పండితులకి లేదు, మనుస్మృతిపై వచ్చే విమర్శలని అంగీకరించే స్థితిలో కూడా వాళ్ళు లేరు. ఇలా దోబూచలాడుతూ మత మార్పిళ్ళని ఆపగలిగే పరిస్థితి లేదు.

 13. నాగరాజు గారు, హిందూ మతం అస్తిత్వంలో ఉండగలగడానికి దయానందుడు కారణం అని అనుకోను. నేను LLB పరీక్షలకి ప్రిపేర్ అవుతూ అనుకోకుండా గుప్తుల చరిత్ర చదవడం వల్ల నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. గుప్త సామ్రాజ్యం పుట్టక ముందు మన దేశంలో కుల వ్యవస్థ అంత బలంగా లేదు. అప్పట్లో స్త్రీలకి చదువుకునే అవకాశం ఉండేది, భర్త చనిపోయిన స్త్రీలకి రెండో పెళ్ళి చేసుకునే అవకాశం కూడా ఉండేది. గుప్త సామ్రాజ్యం బలపడిన తరువాత కుల వ్యవస్థ బలపడింది, స్త్రీలు చదువుకోవడాన్ని నిషేధించారు, భర్త చనిపోయిన స్త్రీలు పిల్లల్ని చూసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని నియమం పెట్టారు. గుప్త వంశస్తులు మొదట్లో వైష్ణవ, శైవ మతాలని విశ్వసించేవాళ్ళు. కానీ చివరి దశలో ఆ వంశస్తులు బౌద్ధ మతంలోకి మారిపోయారు. హూణ వంశస్తులు గుప్త సామ్రాజ్యంపై దాడులు చేస్తున్న సమయంలో గుప్తులు బౌద్ధ మతంలోకి మారి శాంతి స్థాపన మంత్రం జపించారే కానీ సైన్యాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నించలేదు. హూణ వంశస్తులతో పాటు గుప్తుల కింద సామంత రాజులుగా పని చేసినవాళ్ళు కూడా గుప్త సామ్రాజ్యం పై దాడులు చెయ్యడం వల్ల ఆ సామ్రాజ్యం సులభంగానే పతనమైంది. గుప్తులు బౌద్ధం పేరుతో శాంతి మంత్రం జపించకుండా ఉండి ఉంటే ఆ సామ్రాజ్యం ఎక్కువ కాలం అధికారంలో కొనసాగి ఉండేది. ఇండియాలో బౌద్ధ మతం అంత సులభంగా ఎందుకు ఓడిపోయిందో నాకు అప్పుడు అర్థమైంది. హిందూ మతం ధర్మ స్థాపన కోసం హత్యలు చెయ్యడం కూడా తప్పు కాదని బోధిస్తుంది. ఆత్మరక్షణ కావాలనుకునేవాళ్ళకి హిందూ మతంలోనే ఎక్కువ భద్రత ఉన్నట్టు అనిపిస్తుంది. హిందూ మతంలో కులవ్యవస్థ, వైధవ్యం లాంటి ఎన్ని దురాచారాలు ఉన్నా కేవలం భద్రత కోసం ఈ మతాన్ని నమ్మేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందుకే బౌద్ధ, జైన మతాలు హిందూ మతాన్ని ఓడించలేకపోయాయి.

 14. Mr Visekhar, Can you write an article about Ranganayakamma’s theses on Ambedkar and Budhism?

  Reading the history of Mouryan Era again: Buddhism did not oppose slavery in fact. But it advocated that masters should not beat slaves and they should treat them well. I think that Ambedkar is not aware about the history of Budhism. So, he upheld it.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s