సి.ఐ.ఎ బాస్ రాజీనామాకి అక్రమ సంబంధం కారణం కాదా?


David Petraeus with Paula Broadwell -Photo: Business Insider

సి.ఐ.ఎ బాస్ డేవిడ్ పెట్రాస్ నవంబర్ 10 (శుక్రవారం) న అకస్మాత్తుగా రాజీనామా చేశాడు. ఒక మహిళా విలేఖరితో ఆయనకి ప్రవేట్ అఫైర్ ఉన్న విషయం ఎఫ్.బి.ఐ విచారణలో బైటికి వచ్చిందనీ, అందువల్ల జాతీయ భద్రతకు ముప్పు వచ్చే పరిస్ధితిని తప్పించడానికి పెట్రాస్ రాజీనామా చేశాడని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆయన రాజీనామాను ఒబామా మరోమాటకు తావులేకుండా ఆమోదముద్ర వేసేశాడు. యుద్ధాల్లో పెట్రాస్ సేవలను కార్పొరేట్ పత్రికలు ఒకపక్క కొనియాడుతూనే ఆయన చేసిన పిచ్చిపని క్షమార్హం కాదని నోళ్ళు నొక్కుకున్నాయి. అయితే మరికొన్ని పత్రికలు ఆయన రాజీనామాకి కారణం అఫైర్ కాదని తేల్చేస్తున్నాయి.

పెట్రాస్ రాజీనామాతో పాలా బ్రాడ్వెల్ అనే మహిళా విలేఖరి గురించి ప్రపంచం కొత్తగా చర్చిస్తోంది. “ALL IN: THE EDUCATION OF GENERAL DAVID PETRAEUS” అనే టైటిల్ తో ఈ సంవత్సరం మొదట్లో ఆమె రాసిన డేవిడ్ పెట్రాస్ ఆటో బయోగ్రఫీ విడుదలయింది. పెట్రాస్ ఈ-మెయిళ్లను చూడడానికి పాలా ప్రయత్నించిందనీ, ఒకవేళ నిజంగా చూసినట్లయితే అమెరికా జాతీయ భద్రత తీవ్రమైన ప్రమాదంలో పడేదనీ ‘న్యూయార్క్ టైమ్స్’, ‘నేషనల్ పోస్ట్’ లాంటి పత్రికలు వార్తలు ప్రచురించాయి. పెట్రాస్ అక్రమ సంబంధాన్ని అడ్డుపెట్టుకుని శత్రువులు బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందనీ కనుక ఆయన రాజీనామా ధర్మసమ్మతమేనని పత్రికలు విశ్లేషించాయి.

అయితే పెట్రాస్ మెయిళ్ళు చూశాక అమెరికా పౌరురాలు పాలా ఏ ఘోరానికి పాల్పడి ఉండేదో, అలాంటి అవకాశం ఆమెకి ఉందో లేదో ఏ పత్రికా చెప్పలేదు. ఎన్.బి.సి న్యూస్ వార్తా సంస్ధ ప్రకారం పాలా పై విచారణ జరుగుతోంది. విచారణ జరిగినా పెట్రాస్, పాలా లపైన నేరారోపణ ఏమీ జరగదని కూడా విచారణకు ముందే ఎన్.బి.సి న్యూస్ చెప్పేసింది. ఇదిలా ఉండగా తాను ఘోరమైన తప్పు చేశానని పెట్రాస్ స్వయంగా ఒప్పుకున్నట్లు పత్రికలు తెలిపాయి.

జార్జి బుష్ డిఫెన్స్ కార్యదర్శిగా ఇరాక్ దురాక్రమణ యుద్ధంలో ఓటమినుండి అమెరికాని గట్టెక్కించిన వీరుడుగా, వ్యూహకర్తగా పెట్రాస్ ని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు కీర్తిస్తాయి. ఒబామా అధ్యక్షరికంలో ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధాన్ని కూడా పెట్రాస్ పర్యవేక్షించాడు. అమెరికా దురాక్రమణలో ఆఫ్ఘన్ ప్రజల మరణాలను తగ్గించడానికి పెట్రాస్ పధకాన్ని రూపొందించి అమలుచేశాడన్న కలికితురాయిని కూడా పెట్రాస్ కీర్తి కిరీటంలో పశ్చిమ కార్పొరేట్ పత్రికలు తురిమాయి. అలాంటి గొప్ప పెట్రాస్ అత్యంత అవమానకరంగా అక్రమ సంబంధం కారణం చూపి రాజీనామా చేయడం నమ్మలేని విషయం. సెప్టెంబర్ 11, 2012 తేదీన లిబియా నగరం బెంఘాజీలో హత్యకి గురయిన అమెరికా రాయబారి క్రిష్టఫర్ స్టీవెన్స్ మరణం పెట్రాస్ రాజీనామాకు దారి తీసిందని బిజినెస్ ఇన్సైడర్, గ్లోబల్ రీసెర్చ్, వాషింగ్టన్ బ్లాగ్ లాంటి పత్రికలు సూచిస్తున్నాయి.

లోగుట్టు

టెలిగ్రాఫ్ పత్రిక ప్రకారం బెంఘాజిలో అమెరికా కాన్సలేట్ గా చెప్పిన భవన సముదాయం వాస్తవానికి కాన్సలేట్ కాదు. ఈ భవనాలను రహస్య గూఢచార కేంద్రంగా సి.ఐ.ఎ వినియోగిస్తోంది. లిబియా నుండి ఇస్లామిక్ (ఆల్ ఖైదా) టెర్రరిస్టులు సిరియా కిరాయి తిరుగుబాటులో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు. ఈ టెర్రరిస్టుల సరఫరాను సి.ఐ.ఎ బెంఘాజి నుండే పర్యవేక్షిస్తున్నదని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించినట్లు టెలిగ్రాఫ్ తెలిపింది. (వాల్ స్ట్రీట్ జర్నల్ కధనం చూడాలంటే సబ్ స్క్రిప్షన్ ఉండాలి. అందువల్ల ఆ లింక్ ఇవ్వడం లేదు.) కాన్సలేట్ గా చెప్పిన భవనాల్లో 30 మంది సిబ్బంది ఉండగా వారిలో 7 గురు మాత్రమే విదేశాంగ శాఖ (రాయబార) సిబ్బంది. మిగిలినవారంతా సి.ఐ.ఎ సిబ్బందే. బెంఘాజి నుండి జరిగే సి.ఐ.ఎ కార్యకలాపాలను దాచిపెట్టే ఉద్దేశ్యంతో బెంఘాజీ సేఫ్ హౌస్ లో చంపబడ్డ సి.ఐ.ఎ సిబ్బంది శవాలను స్వీకరించడానికి కూడా సి.ఐ.ఎ డైరెక్టర్ డేవిడ్ పెట్రాస్ రాలేదని టెలిగ్రాఫ్ తెలియజేసింది.

మరో విషయం ఏమిటంటే బెంఘాజీలోని సో కాల్డ్ అమెరికా కాన్సలేట్ పై విధ్వంసక దాడి జరుగుతున్న విషయం కొద్ది నిమిషాల్లోనే అధ్యక్షుడికి తెలిసింది. బెంఘాజి దాడి దృశ్యాన్ని మానవరహిత డ్రోన్ విమానాలు అందించిన వీడియో లింక్ ల ద్వారా ఒబామా దాదాపు లైవ్ లో స్వయంగా వీక్షించాడని xrepublic.net తెలిపింది. ఆయన ఆదేశాలిస్తే 20 నిమిషాల్లోనే ఫైటర్ జెట్ లు తమ రాయబారికి సాయంగా వెళ్ళి ఉండేవి. ఎసి-130 గన్ షిప్ లు, ప్రత్యేక బలగాలు రెండు గంటల్లో బెంఘాజిని  చేరేవి. అయితే దాడిలో జోక్యం చేసుకోరాదని ఒబామా రాజకీయ నిర్ణయం తీసుకోవడంతో దాడి నిర్విఘ్నంగా కొనసాగింది. అమెరికా బలగాలు జోక్యం చేసుకున్నట్లయితే స్టీవెన్స్ బతికేవాడన్న గ్యారంటీ ఏమీలేకపోయినా జోక్యం చేసుకోకుండా ఉండడానికే అమెరికా నిర్ణయించాడన్నది గమనించవలసిన విషయం.

కారణం స్పష్టమే. సి.ఐ.ఎ అధికారుల శవాలను తీసుకోవడానికి పెట్రాస్ ఎందుకు రాలేదో బెంఘాజి దాడిలో కూడా అందుకే అమెరికా జోక్యం చేసుకోలేదు. అమెరికా కాన్సలేట్ గా చెప్పిన బెంఘాజి కార్యాలయం సి.ఐ.ఎ సాగిస్తున్న రహస్య టెర్రరిస్టు కార్యకలాపాలకు ముసుగుగా ఉపయోగపడుతోంది. బెంఘాజి పై విరుచుకుపడినట్లయితే సి.ఐ.ఎ కవర్  బద్దలు కావడం ఎంతోసేపు పట్టదు. ప్రపంచాధిపత్య రాజకీయాలలో అమెరికా, యూరప్, రష్యా తదితర శక్తుల మధ్య ఉన్న వైరుధ్యాల రీత్యా బెంఘాజి గుట్టుని బైటపెట్టడానికి ముందుకు ఉరికే శక్తులు బోలెడు. అధ్యక్ష ఎన్నికల సంరంభం మంచి ఊపులో ఉన్న నేపధ్యంలో చూసినా ఒబామా గెలుపు అవకాశాలు పదిలంగా కొనసాగడం కోసం గోప్యం అవసరం అయింది.

మరో సంగతి. రాయబార కార్యాలయం ముసుగులో క్రిస్టఫర్ స్టీవెన్స్ సిరియా కిరాయి తిరుగుబాటు కోసం టెర్రరిస్టులను రిక్రూట్ చేస్తున్నాడని ఈజిప్టు భద్రతాధికారులను ఉటంకిస్తూ WND వెబ్ సైట్ చెబుతోంది. సిరియా కిరాయి తిరుగుబాటు కోసం సౌదీ అరేబియా సాగిస్తున్న టెర్రరిస్టుల రిక్రూట్ మెంట్ కి అమెరికా రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్ కీలక వ్యక్తి (key contact). లిబియాతో పాటు ఇతర ఉత్తరాఫ్రికా దేశాలనుండి ముస్లిం టెర్రరిస్టులను సేకరించి టర్కీ ద్వారా సిరియాలోకి పంపే కార్యక్రమానికి స్టీవెన్స్ పర్యవేక్షకుడు కాగా సౌదీ అరేబియా ఫైనాన్షియర్.

అమెరికా, యూరప్, సౌదీ అరేబియా, కతార్, యు.ఎ.ఇ తదితర దేశాల ప్రత్యక్ష, పరోక్ష మద్దతు, సహకారంతో సిరియాలో సాగుతున్న కిరాయి తిరుగుబాటు ఇపుడు పశ్చిమ సామ్రాజ్యవాదులకు ప్రధాన కార్యక్రమం. ఈ కార్యక్రమం అంతిమ లక్ష్యం ఇరాన్ ను లోబరుచుకోవడం. ఇరాన్ దండయాత్రకు ముందు ఇరాన్ మిత్ర దేశం సిరియాలో అనుకూల ప్రభుత్వాన్ని నిలపడానికి అమెరికా, యూరప్ లు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రభుత్వం ఎంత అభివృద్ధి నిరోధకం అయినా పర్వాలేదు. ఎంత మతఛాందసంతో ఉన్నా పర్వాలేదు. ఎంత విధ్వంసక సెక్టేరియన్ దృక్పధంతో ఉన్నా పర్వాలేదు. సద్దాం, గడాఫీ, బషర్, ఖోమైనీ లాంటి జాతీయ దేశభక్తి శక్తులతో వ్యవహరించడం కంటే ఆల్-ఖైదా లాంటి ముస్లిం మతఛాందస శక్తులతో వ్యవహరించడమే అమెరికా, యూరప్ లకి తేలిక. ఇరాక్, ఇరాన్, సిరియా, లిబియా లాంటి దేశాల్లో జాతీయ ప్రభుత్వాలు ఎంత బలహీనంగా ఉంటే పశ్చిమ సామ్రాజ్యవాదులకు అంత ఉపయోగం. అందుకే అవి దశాబ్దాలుగా తాము పెంచిపోషిస్తున్న టెర్రరిస్టులకు ఈ దేశాల ప్రభుత్వాలను అప్పజెప్పడానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నాయి. (ఈ విశ్లేషణలో చూసినపుడు ఇస్లామిక్ టెర్రరిజం వాస్తవంలో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యూహాత్మక మిత్రుడుగా కనిపిస్తే అదే నిజం.)

కనుక, సిరియా కిరాయి తిరుగుబాటుకి టెర్రరిస్టు మిలిటెంట్లను సరఫరా చేస్తున్న బెంఘాజీ కార్యాలయ అసలు కార్యకలాపాలను గోప్యంగా ఉంచడం అమెరికా అవసరం. అయితే ఈ లోపు కొత్త ప్రమాదం ముంచుకొచ్చింది. అదేమంటే సి.ఐ.ఎ బాస్ వచ్చే గురువారం అమెరికా ప్రతినిధుల సభ (కాంగ్రెస్), సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీల ముందు బెంఘాజీ దాడి గురించి అధికారికంగా సాక్ష్యం ఇవ్వవలసి ఉంది. ఈ సాక్ష్యం కొనసాగితే బెంఘాజీ దాడి విషయమై అమెరికా ప్రజలనుండి కీలక వాస్తవాలను ఒబామా ప్రభుత్వం దాచిపెట్టిన సంగతి బైటికి వచ్చే అవకాశం ఉందని బిజినెస్ ఇన్సైడర్ తెలియజేసింది. ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ మీడియా రారాజు రూపర్ట్ మర్డోక్ కూడా ఈ వాదనతో ఏకీభవించినట్లు బిజినెస్ ఇన్సైడర్ తెలిపింది.

ఇపుడు పెట్రాస్ రాజీనామా చేశాడు కనుక ఆయన సాక్ష్యం ఇవ్వలేడు. పెట్రాస్ స్ధానంలో ఒబామా తాత్కాలికంగా నియమించుకున్న సి.ఐ.ఎ డిప్యూటీ డైరెక్టర్ మైక్ మోరేల్ సాక్ష్యం ఇవ్వనున్నాడు. బిన్ లాడేన్ ని వేటాడిన బృందానికి ఈయన నాయకుడని, సద్దాం మారణాయుధాల అబద్ధపు కధకు ఈయనే రచయిత అనీ బిజినెస్ ఇన్సైడర్ తెలిపింది. పెట్రాస్ ని తప్పించి నమ్మకస్ధుడైన మోరేల్ ని నియమించడం ద్వారా ఇంటలిజెన్స్ కమిటీల ముందు ఇబ్బందిని ఒబామా తప్పించుకోనున్నాడని సదరు పత్రిక సూచిస్తోంది.

ఈ కధనంలో మిస్సింగ్ లింక్ లు లేకపోలేదు. మరిన్ని వాస్తవాలు వెల్లడయితే ఈ ఖాళీలు పూరించబడతాయేమో మునుముందు తెలియాలి. ఎవరు ఎందుకు రాజీనామా చేసినా ఈ కధనంలో గుర్తించవలసిన ప్రధాన అంశం అమెరికా విదేశాంగ విధానం. ప్రపంచాధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం, తద్వారా పశ్చిమ కార్పొరేట్ కంపెనీల లాభదాహాన్ని నిరంతరం తీర్చడం కోసం ఎన్ని సిగ్గుమాలిన పనులకైనా అమెరికా తెగిస్తుందని, భర్త ఇద్దరు పిల్లలతో బతుకుతున్న పాలా బ్రాడ్వెల్ కుటుంబాన్ని రోడ్డుకి లాగడానికైనా వెనకాడదనీ దీని ద్వారా తెలుస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s