అన్నా హాజరే, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల నేతృత్వంలో దాదాపు సంవత్సరం క్రితం అట్టహాసంగా ప్రారంభమయిన ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ ఇపుడు క్రియాశీలక మద్దతుదారులు లేక మూలపడింది. నాయకత్వం చెరోదారి పట్టడంతో ఐ.ఎ.సి కి ఇపుడు దిశ లేకుండా పోయింది. దారులు చీలినప్పటికీ ఒకేవైపుకి ప్రయాణం కొనసాగితే లక్ష్యం వద్దనయినా కలుసుకోవచ్చు. చివరి పోరాటంలోనైనా భుజం భుజం కలపొచ్చు. ‘మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే’ అని చీలిక సమయంలో ప్రకటించిన ఇరు వర్గాలు ఇపుడా స్ఫూర్తిని ప్రదర్శించడం లేదు. రాజకీయాలు మొత్తంగానే భ్రష్టుపట్టి పోయాయి కనుక రాజకీయ పార్టీ ఆలోచనే వద్దని వాదిస్తున్న అన్నా పక్షం తమ లోక్ పాల్ డిమాండ్ ని తిరిగి రాజకీయ పార్టీలు నడిపే ప్రభుత్వాల ముందే పెట్టాలన్న ప్రాధమిక అంశాన్ని విస్మరించింది.
భ్రష్టుపట్టిన రాజకీయ పార్టీలు లోక్ పాల్ చట్టాన్ని నీరుగారుస్తున్నాయి గనక అవినీతి వ్యతిరేక పార్టీని స్ధాపించాలన్న ఆలోచన సమకాలీన వ్యవస్ధ పరిమితుల్లో అనివార్యమైన తార్కిక పరిణామం. చేతనైతే రాజకీయ వ్యవస్ధ పునాదులు కదిలించేలా ప్రజా ఉద్యమాన్నైనా నిర్మించగలగాలి లేదా ఉద్యమకారులు రాజకీయాలనైనా తమ చేతుల్లోకి తీసుకోగలగాలి. స్పష్టమైన తాత్విక దృక్పధంతో దీర్ఘకాలిక లక్ష్యాన్ని రూపొందించుకుని ఎన్నో కష్టాలకు ఓర్చుకుని, ఎంతో ఓపికతో పనిచేస్తే తప్ప రాజకీయ వ్యవస్ధ పునాదులు కదిలించడం అసాధ్యం. లేదా ఇప్పటి సామాజికార్ధిక వ్యవస్ధ పరిధిలోనే రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ లాగా ఏదో ఒక చోట పని మొదలుపెట్టడం మరొక పద్ధతి. కాంగ్రెస్ వ్యతిరేకత పలచబడుతుందన్న భయంతో మరో అవినీతి పార్టీ అయిన బి.జె.పికి పరోక్షంగానైనా మద్దతుగా నిలవడం ఉద్యమానికి ఆత్మహత్యా సదృశం. లోక్ పాల్ బిల్లు ఆమోదాన్ని వాయిదావేయడంలో కాంగ్రెస్ కి బి.జె.పి అందించిన హృదయపూర్వక సహకారమే దీనికి సాక్ష్యం.
అవినీతి వ్యతిరేక ఉద్యమానికి అన్నా, కేజ్రీవాల్ లు డబుల్ బ్యారెల్ గన్ మాదిరిగా దిశానిర్దేశం చేసిన పరిస్ధితి ఇపుడు తారుమారైంది. ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ (ఐ.ఎ.సి) అనే అవినీతి వ్యతిరేక యుద్ధ ట్యాంకుకి చేరోవైపు వ్యతిరేకదిశలో వారిపుడు నిలబడి ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరు బాణం సంధించి వదిలినా మరొకరి గుండెల్లోనే నేరుగా దిగడం ఖాయం. వారినలా నిలబెట్టడంలో రాజకీయ పార్టీలు సఫలం అయ్యాయి. ఉద్యమకారుల్లో పలువురు ఉద్యమానికి ద్రోహం చేస్తూ రాజకీయ పార్టీలతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడంతో ఉద్యమాన్ని బలహీనపరచడం రాజకీయ పార్టీలకు ఇంకా తేలికయింది. అనేక ఉద్యమాలను బలహీనపరిచి తనలో కలిపేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుభవం మరోసారి అక్కరకు రావడంతో అన్నా, కేజ్రీవాల్ ఎడమొహం, పెడమొహంగా తేలారు.
సమూల మార్పు తలపెట్టకుండా సమకాలీన ప్రజావ్యతిరేక దోపిడీ వ్యవస్ధ పరిధిలో ఏ చిన్న మార్పుకూడా సాధ్యం కాదని ఐ.ఏ.సి ఉద్యమగతి మరోసారి నిరూపించింది.
–
i don’t like this cartoon