‘మాదే స్నాన’ ఇపుడు ఎంగిలాకులపై కాదట!


Source: The Hindu

కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్య దేవాలయంలో జరుగుతున్న కుల దురాచారంలో ఇక ఎంగిలాకులను ఉపయోగించరు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకనుండి ‘ఎవరూ ఆరగించని’ ప్రసాదాన్ని ఆకుల్లో పెట్టి ఆరుబయట పరిస్తే ఆచారం పాటించదలిచినవారు వాటిపై పడి దొర్లొచ్చు. సుబ్రమణ్య ఆలయంలో కులాధిపత్య దురాచారాన్ని అడ్డుకోవాలని ఆలయంలో బ్రాహ్మణులు మాత్రమే ప్రసాదాన్ని ఆరగించే సౌకర్యాన్ని రద్దు చేయాలనీ హై కోర్టులో దాఖలయిన ఫిర్యాదుకు ఈ విధంగా పరిష్కారం లభించింది. పిటిషనర్లు కూడా సవరించిన దురాచారానికి ఆమోదం చెప్పడంతో వివాదాన్ని కోర్టు కూడా పక్కన పెట్టేసింది.

దక్షిణ కన్నడ జిల్లాలో కుక్కే సుబ్రమణ్య దేవాలయంలో శతాబ్దాలుగా ఓ దురాచారం నడుస్తోంది. మూడురోజుల పాటు జరిగే ఒక ఆచారంలో బ్రాహ్మణులు దేవాలయంలో కూర్చుని భోజనాలు చేస్తారు. వారు తిన్నాక ఎంగిలాకులని అక్కడే వదిలేస్తారు. ఆ తర్వాత ఇతర కులాల భక్తులు ఆ ఆకులపై పడి దొర్లుతారు. అలా దొర్లితే చర్మ వ్యాధులు తగ్గిపోతాయనీ, పుణ్యం వస్తుందనీ భక్తులు నమ్ముతారు. వినడానికి (చదవడానికి) కూడా అసహ్యంగా తోస్తున్న ఈ ఆచారం శతాబ్దాలుగా సాగుతుండగా దానిని ప్రభుత్వాలు, ఆలయ ధర్మకర్తలు, ప్రభుత్వాధికారులు శ్రద్ధగా కాపాడుతూ వస్తున్నారు. బి.బి.సి ప్రకారం మాలే కుడియా అనే గిరిజన తెగవారు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారని చెప్పగా ఇతరులు కూడా పాటిస్తున్నారని భారత పత్రికలు తెలిపాయి. అనేకమంది విద్యాధికులు సైతం ఈ ఆచారాన్ని పాటించడమే ఒక వింత.

ఈ ఆచారాన్ని రద్దు చేయాలని బి.సి కుల వేదికలు ఉద్యమాలు నిర్వహించాయి. ఉద్యమంలో భాగంగా గత సంవత్సరం అధికారులకు విజ్ఞాపన పత్రం సమర్పించి వస్తున్న ఉద్యమ నాయకులపై గత సంవత్సరం దాడి చేసి చితగ్గొట్టారు. (ఆ వార్తను ఈ బ్లాగ్ లోనే ఇక్కడ చూడవచ్చు.) నిడుమామిటి మఠానికి చెందిన వీరభద్ర చన్నమళ్ళ స్వామి ఆచారాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. ఇంకా ఇతరులు కూడా ఈ వ్యాఖ్యాన్ని దాఖలు చేసినవారిలో ఉన్నారు.

పిటిషన్ ని విచారిస్తూ కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ కె.ఎం.నటరాజ్ ప్రభుత్వం తరపున హాజరై వివరణ ఇచ్చాడు. ‘మాదె స్నాన’ ఆచారం ప్రాచీనకాలం నాటి మతనమ్మకమనీ, అనేకమంది భక్తులు నిష్టతో ఆచరిస్తున్నారని కనుక దానిని పూర్తిగా రద్దుచేయలేమనీ నటరాజ్ కుండబద్దలు కొట్టాడు.  ప్రభుత్వ సంస్ధ అయిన రాజ్య ధార్మిక పరిషత్ సంబంధిత సెక్షన్లతో విస్తృతంగా చర్చలు చేసిందనీ ఆ చర్చలమేరకు ఆచారాన్ని సవరించదలిచామనీ చెప్పాడు. “వేలమంది భక్తుల సెంటిమెంట్లతో కూడిన సమస్య ఇది. తమ పాపాలతో పాటు చర్మ వ్యాధులు కూడా తొలగిపోతాయన్న నమ్మకంతో భక్తులు తమంతట తామే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. పరిషత్ అనేక మతపెద్దలను సంప్రదించింది. సవరించిన రూపంలో ఈ ఆచారాన్ని కొనసాగించాలని నిర్ణయించింది” అని నటరాజ్ కోర్టుకి తెలిపాడు.

సవరించిన మోడల్ ప్రకారం భక్తులు ఇక బ్రాహ్మణులు తినేసిన ఎంగిలాకులపైనే దొర్లుతామని చెప్పకూడదు. దానికి బదులు ఆలయ నైవేద్యాన్ని నేరుగా గర్భ గుడి నుండి ఆలయం బైటి ప్రదేశానికి తెస్తారు. అక్కడ ప్రసాదాన్ని తెచ్చింది తెచ్చినట్టు ఆకులపై పెట్టి ఉంచుతారు. ఇక భక్తులెవరైనా ప్రసాదం ఉంచిన ఆకులపై దొర్లవచ్చు. ఈ సవరణ ప్రతిపాదించింది పెజావర్ మఠం ఆచార్యుడు శ్రీ విశ్వేశ్వ తీర్ధ స్వామీజీ అని తెలుస్తోంది. స్వామీజీ ప్రతిపాదనకు సంబంధిత గ్రూపులన్నీ అంగీకరించడంతో ప్రత్యేక చట్టాన్ని తెచ్చే అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి తప్పింది.

ఆలయంలో బోజన పంక్తిలో కుల వివక్ష పాటించరాదని కూడా నిర్ణయించారు. ఈ ఆచారం పాటించే రోజుల్లో బ్రాహ్మణులకు కూడా ఆలయంలో గానీ, బైటగానీ భోజనాలు పెట్టడం నిషేధిస్తారు. ఆలయ పూజారులుగానీ, ధర్మకర్తలు గానీ ఇకనుండి ఆలయంలోనూ బైటా కులాలవారీగా భోజన పంక్తులు నిర్వహించకూడదు. చీఫ్ జస్టిస్ విక్రమ్ జిత్ సేన్, జస్టిస్ బి.వి.నాగరత్న లతో కూడిన డివిజన్ బెంచి ముందు ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి పిటిషన్ దారులు కూడా అంగీకరించడంతో కోర్టు కేసు విచారణ అంతటితో ముగిస్తున్నట్లు ప్రకటించింది.

డెక్కన్ క్రానికల్ పత్రిక ప్రకారం మాదే స్నాన కులాల మధ్య వివక్ష పాటించడానికి ఉద్దేశించినది కాదని ప్రభుత్వం ఒక వింత వాదన చేసింది. అయితే నిమ్న కులాలవారు భోంచేసిన ఎంగిలాకులపైన కూడా అగ్రకులాలవారు పొర్లుతున్నారా అని ప్రశ్నించడంతో అడ్వకేట్ జనరల్ కి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. బ్రాహ్మణులు తినేసిన ఎంగిలాకులపై దొర్లమని  తామెవరినీ బలవంత పెట్టలేదని సగం సమాధానం చెప్పి ఊరుకుంది. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఒత్తిడి చేస్తే ‘కుల్కుండా పశువుల సంత’ ను మొత్తంగా రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కుల వివక్షను పాటిస్తున్న అనారోగ్యకర ఆచారం ‘మాదె స్నాన’ ను ఎందుకు రద్దు చెయ్యారని పిటిషన్ దారులు అడిగినప్పటికీ ప్రభుత్వం నుండి సమాధానం రాలేదు.

4 thoughts on “‘మాదే స్నాన’ ఇపుడు ఎంగిలాకులపై కాదట!

  1. ఎంత బ్రాహ్మణులు తినేసిన ఎంగిలాకులైతే మాత్రం, వాటిని పవిత్రం అనుకుని అంత సులభంగా వాటి మీద దొర్లేస్తారా? ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం.

  2. Dorlara..dorlimcharaa..?pujalu aacharalu..vrathalu cheyimchukonevade lekapote…assalu emivundadu..so..brahmalanu dveshimchadam kadu..so..,tappu brahmanuladi kadu,,cheyimchu kone vade lekapote..vaalla avasaram vumdadu..KiranD.S.P.@Kakinada

  3. వసంత కుమార్ గారూ మీ వ్యాఖ్య కొంత అర్ధం అయింది, కొంత కాలేదు. బహుశా మక్కా లాంటి చోట్లకు ఆడవాళ్లని నిషేధించారు కదా దానిపై కూడా రాయండని చెబుతున్నట్లున్నారు. నాకు సలహా ఇచ్చే అవకాశం వస్తే అసలు మక్కాకే వెళ్లనవసరం లేదని నేను సలహా ఇస్తాను. అవసరం లేని అలాంటి యాత్రా బంధనాల్లో వారు లేకపోవడమే నాకు సంతోషం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s