దళితుడిని పెళ్ళాడితే దళిత కాలనీలు తగలబడతాయ్!


Source: roundtableindia.com

ఓ అగ్రకుల యువతి దళిత యువకుడిని వివాహం చేసుకున్నందుకు యువతి తండ్రి ఆత్మహత్య చేసుకోగా, యువతి కులస్ధులు మూకుమ్మడిగా దాడి చేసి దళితుల కాలనీని తగలబెట్టిన దుర్మార్గం తమిళనాడులో చోటు చేసుకుంది. కులం పరువుకోసం దళితుల ఇళ్లను తగలబెట్టిన ఈ సో కాల్డ్ అగ్రకులస్ధులు తగలబెట్టిన ఇళ్ళలో దోపిడీకి తెగబడి తమ పరువు ఎంత పాతాళంలోకి దిగబడి ఉందో చెప్పకనే చెప్పుకున్నారు. సాంస్కృతిక అభివృద్ధిలో ఉత్తరభారతం కంటే ముందున్నాయని చెప్పే దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ అదే వెనుకబాటుతనం కొనసాగుతోందని తాజా ఘటన ద్వారా స్పష్టం అవుతోంది.

కృష్ణాపురం పోలీసు స్టేషన్ పరిధిలో దివ్య (20) అనే యువతి ఇళవరసన్ (23) పేరుగల యువకుడిని నెల క్రితం పెళ్లి చేసుకుంది. యువతి తల్లిదండ్రులు పెళ్ళికి ఇష్టపడకపోవడంతో ఇద్దరూ ఒక గుడిలో పెళ్ళి చేసుకున్నారు. యువతి తరపు బంధువులు దాడి చేస్తారన్న భయంతో వారిద్దరూ సేలం రేంజి డి.ఐ.జి రక్షణ కోరారు. నూతన జంటకు రక్షణ కల్పిస్తానని డి.ఐ.జి హామీ ఇచ్చినప్పటికీ అదేమీ నేరవేరలేదు. కాలనీలోని అగ్ర కులస్ధులు సమావేశమై అనధికార విచారణ నిర్వహించి అమ్మాయిని వెంటనే తెచ్చి అప్పజెప్పాలని దళిత కుటుంబానికి హెచ్చరిక చేశారు.

అయితే అమ్మాయి తన వివాహాన్ని రద్దు చేసుకోవడానికి ఒప్పుకోలేదు. తాను యువకుడిని ప్రేమించాననీ అతనితోనే జీవితం గడుపుతానని స్పష్టం చేసింది. దానితో అమ్మాయి తండ్రికి విరక్తి తన్నుకొచ్చింది. తాను తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చిన కుల, వంశ ప్రతిష్టలు తన కళ్ళముందే పేకమేడల్లా కూలిపోవడం ఆయన గుండె తట్టుకోలేకపోయింది. అమ్మాయిని తన గొప్ప కులంలోని వ్యక్తికే పెళ్లి చేసి వంశ ప్రతిష్టను మరింత వృద్ధిచేసుకోవాలన్న ఆయన ఆశలను కులాంతరవ వివాహం ద్వారా కన్నకూతురే తగలబెట్టినట్లు ఆయనకు తోచింది. నాధం దళిత కాలనీకి దగ్గర్లోనే గల సెల్లంకొట్టయ్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడని ‘ది హిందూ’ తెలిపింది.

అమ్మాయి తండ్రి ఆత్మహత్యతో ఆగ్రకులస్ధుల పరువు, ప్రతిష్టల సమస్య మరోసారి సంఘటిత రూపం తీసుకుంది. ఆత్మహత్యపై పెల్లుబుకిన కుల సానుభూతి కులదురహంకారంగా రూపు మార్చుకుని వీధుల్లో నర్తించింది. విగత శరీరంతో సహా ధర్మపురి-తిరుపత్తూర్ రోడ్డుపైన 2000 మంది వరకూ రాస్తారోకోకి తెగబడ్డారు. ఒకవైపు రాస్తారోకో జరుగుతుండగానే మరో గుంపు అన్నానగర్ లోని నాధం కాలనీలో జొరబడి దళితుల గుడిసెలను తగలబెట్టారు. కొండంపట్టి ఓల్డ్ మరియు న్యూ కాలనీల్లోని దళితుల ఇళ్లను కూడా తగలబెట్టారు. ఒక పక్క ఇళ్లను, ఇళ్లముందు ఉన్న వాహనాలనూ తగలబెడుతూ మరో పక్క అవే గుడిసెల్లో దూరి దోపిడీలు సాగించారని ‘ది హిందూ’ తెలిపింది. దళిత యువకుడు వివాహ సంబంధానికి పనికిరానివాడిగా భావించే ఈ సో కాల్డ్ అగ్రతనం, ఆ దళితులు కష్టంతో సమకూర్చుకున్న వస్తు సామాగ్రిని దోచుకోవడానికి మాత్రం నిరభ్యంతరంగా సిద్ధపడిపోయింది. తమ అగ్రతనం ఒట్టి నేలబారుతనమేనని ఆ విధంగా వారు నిరూపించుకున్నారు.

గుడెల్లో ఉన్న మహిళలు, పిల్లలు ఆత్మరక్షణ కోసం పరుగులు తీశారు. సెంగల్ పట్టి గ్రామంలో రక్షణ తీసుకున్నారు. కొద్ది మంది మాత్రమే పోలీసులు అక్కడ ఉండడంతో అల్లర్లు, దోపిడీల రూపంలో సాగిన అగ్రకుల దురహంకార వికృత నర్తనకు అడ్డుకట్ట వేయలేకపోయారు. సాయంత్రం 4:45 కి మొదలయిన దోపిడీలూ, దహనాలు రాత్రి 7 గంటల వరకూ కొనసాగిందని పత్రిక తెలిపింది. కృష్ణ గిరి ఎస్.పి ఆదేశాలతో మరిన్ని పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాక మాత్రమే దహన కార్యక్రమం ముగిసింది. రాస్తా రోకో వల్ల అగ్నిమాపక వాహనాలు సమయానికి చేరకపోవడంతో గుడిసెల దహనం యధేచ్చగా సాగింది.

దుండగులు రోడ్డుపై అనేక చోట్ల ట్రాఫిక్ గుర్తులను పీకేశారు. పెద్ద పెద్ద రాళ్ళను, చెట్ల దిమ్మలను రోడ్డుపైన అడ్డంగా పడేశారు. ఒకవైపు దళితుల గుడిసెల్ని తగలబెడుతూ, మరోవైపు ఆ దహనాన్ని ఆపడానికి బయలుదేరిన వాహనాలను రాస్తారోకోతో అడ్డుకోగల తెంపరితనం, దురహంకారం, లగ్జరీ ఈ దేశంలో ఎవరికి ఉంటుంది? ఒక పధకం ప్రకారం సాగిన ఈ కులోన్మాద వికృత చేష్టలను ఆపడానికి ఐదు జిల్లాలనుండి పోలీసు బృందాలు రావలసి వచ్చిందంటే భారతదేశ సామాజిక జీవనంలో కుల అణచివేతకు ఏ స్ధాయిలో మద్దతు కొనసాగుతున్నదీ అర్ధం చేసుకోవచ్చు.

గుడిసెలు తగలబడ్డాక దళితులకు నిలవనీడ కూడా లేకుండా పోయింది. మూడు కాలనీల్లో ఇళ్ళు కోల్పోయిన దళితులు కట్టుబట్టలతో రాత్రంతా చలిలో, పోలీసుల రక్షణలో గడపవలసి వచ్చింది. నాయక్కన్ కొట్టై, సెల్లాన్ కొట్టై గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దళితులకు ధైర్యం ఇవ్వడానికి ఐదు జిల్లాలనుండి నాలుగొందలకు పైగా పోలీసులను రప్పించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా రప్పించారు. ఇప్పటివరకూ పాతికమందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మిగతవారిని అరెస్టు చేయడానికి ఏళ్లూ పూళ్లూ పట్టడం, విచారణ ప్రహసనంలో తప్పించుకోవడానికి దోషులకు సవాలక్ష అవకాశాలు అందుబాటులోకి రావడం భారతదేశ కులదురహంకారులు అనధికారికంగా, వ్యవస్ధాగత బలిమితో సాధించుకున్న తిరుగులేని హక్కు.

ఇంత జరగడానికి కారణం కేవలం ఒకే ఒక కులాంతర వివాహం. కులాంతర వివాహాలు విస్తృతంగా జరిగితే దేశంలో కులనిర్మూలన జరుగుతుందని రాజ్యాంగ రచయిత అంబేద్కర్ ఆశించాడు. కానీ కులాల బలం వాటికి మూలమైన అర్ధ భూస్వామ్య ఆర్ధిక వ్యవస్ధలోనే ఉన్నపుడు కులాంతర వివాహాలు ఎలా సాధ్యం? పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

42 thoughts on “దళితుడిని పెళ్ళాడితే దళిత కాలనీలు తగలబడతాయ్!

 1. ఒక్క కులాంతర వివాహం ఇంత ఘోరానికి కారణమయిందంటే.. ఇది ఆధునిక సమాజం ఎలా అవుతుంది? కుల దురహంకారం సామూహిక రూపంలో ఎంత హింసా దౌర్జన్యాలు సృష్టించగలదో ఇలాంటి సంఘటనలు ప్రతిసారీ రుజువు చేస్తున్నాయి.

  కార్టూన్ చాలా అర్థవంతంగా ఉంది!

 2. అంబేద్కర్ కులాలు మాత్రమే పోవాలన్నాడు. మతం పోవాలని అనలేదు. ఆర్థిక అసమానతలు పోవాలని కూడా అనలేదు. దయానంద సరస్వతి ఎలాంటి సాధారణ సంస్కర్తో, అంబేద్కర్ కూడా అలాంటి సాధారణ సంస్కర్త. అటువంటప్పుడు అందేద్కర్ థీసిస్ వల్ల కులం ఎలా పోతుంది?

  పల్లెటూరిలో వ్యవసాయం చేసుకునే దళితుని కొడుకు ఏదో ఒక విధంగా చదువుకుని రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం సంపాదించాడనుకుందాం. అతను పని చేసే ఆఫీస్‌లో అతనికి బ్రాహ్మణుల అమ్మాయి పరిచయమై, ఆ పరిచయం ప్రేమగా మారిందనుకుందాం. అప్పుడు బ్రాహ్మణుల అమ్మాయి దళిత యువకుణ్ణి కులాంతర వివాహం చేసుకోవడం జరుగుతుంది. కానీ పల్లెటూరిలో ఊరి చివర గుడిసెలోనో, పట్టణంలోని మురికివాడలోనో ఉండే దళితుణ్ణి బ్రాహ్మణుల అమ్మాయి కులంతో సంబంధం లేకుండా పెళ్ళి చేసుకోవడం జరగదు.

  కేవలం “కులాంతర వివాహాలు చేసుకోండి” అని స్కూల్ పుస్తకాలలో వ్రాసినంతమాత్రాన కులాంతర వివాహాలు జరగవు అనేది నిజం

 3. విషాదమేమిటంటే బాధించేవారూ, భాధింపబడే వారూ ఇద్దరూ తమతమ ఉద్యమాలలో కులవ్య్వస్థను పెంచిపోషించాలని శక్తి వంచన్లేకుండా కృషి చేస్తున్నారు కానీ కుల రహిత సమాజానికి నదుంకట్టట్లేదు.

 4. ద్రవిడ పార్టిలు పెరియార్ రామాస్వామి నాయకత్వం లో చేసిన ఉద్యమాల ఫలితం తమిళ నాడులో పెను మార్పులు తీసుకు వచ్చిందని చెప్తూంటారే? మరి ఇన్ని సం|| డి.యం.కె. పార్టి పాలించినా అక్కడ మార్పు రాలేదా? ముఖ్యంగా దళితుల జీవితాలపై న పెరియార్ గారి ఉద్యమ ప్రభావం ఎమీ లేదా?

 5. మీరు రాసిన విషయాలతో పాటుగా రాతలో కనిపించే మీ కంఠస్వరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

  మీరు రాసిన విషయాన్నే పాఠాంతరంగా ఇలా కూడా చెప్పుకోవచ్చు.

  తమ కంటే దిగువ కులస్తున్ని తమ కూతురు వివాహం చేసుకున్నందుకు గాను ఒక తండ్రి తనకు సామాజికంగా గుర్తింపును, ఉనికిని ఇచ్చిన తన కులంతో ఇక ముందు తన సంబంధాలను ఎలా కొనసాగించాలో తేల్చుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

  ఒక మనిషి మరణం వల్ల కలిగిన దుఃఖంతో పాటుగా, వ్యవస్థీకృతమైన కులాధిపత్యపు దుర్మార్గం కలగలిసి దళిత కులస్తుని ఇంటితో పాటుగా, సాటి కులస్తుల ఇండ్లు కూడా దాడికి గురయ్యాయి. దుండగులు ఇళ్ళను తగల పెట్టి దొరికిన వస్తువులను దోచుకున్నారు.

  ఈ ఉన్మాదం వెర్రి తలలు వేసి, దాన్ని ఆపడానికి వందల కొలది పోలీసు బలగాలు కావలసి వచ్చింది.
  ………………………………………………………………………………

  ఇక్కడ చెప్పలనుకున్నది ఏమిటంటే, అర్థ భూస్వామ్య సమాజంలో “కులం బలం తెలిసిన వాళ్ళు” ఇలాంటి సందర్భాలలో, అవి వ్యవస్థీకృతమైన సామూహిక హననంగా మారకుండా వ్యక్తిగతస్థాయిలో ఆత్మ హత్యలుగా మాత్రమే పరిమితమయితే అవి ఒక స్థాయి వ్యక్తీకరణగా అర్థం చేసుకోవాలి.

  అయితే చాలా సందర్భాలలో ఇవి పైన చెప్పినట్లుగా రెండవ స్థాయికి (సామూహిక హననం) మారడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది.

  ఇలా రెండవ స్థాయికి చేరినపుడు వచ్చి చేరే వివిధ సమీకరణలు సంఘటనను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకొంటాయి. ఈ సందర్భంలో సమస్యని పై నుండి కిందికి మాత్రమే అర్థం చేసుకుంటారు. అంటే, సమాజంపై కులానికి ఉన్న పట్టు, దానితో ముడి పడి ఉన్న వివిధ బలాలు, అది వ్యవహరించే తీరు- ఇట్లా ఉంటుంది అర్థం చేసుకొనే పద్ధతి.

  సంఘటన అలా కాక- మొదటి స్థాయికి మాత్రమే పరిమితమై పోయినట్లైతే కొంచెం సానుభూతితో, ఒక మనిషి ఆత్మహత్యను అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తారు. అంటే కిందినుంచి పైకి- సమాజంలో ఒక యూనిట్ ‍గా ఉన్న ఒక మనిషికి సమాజానికి ఉన్న బంధాన్ని, ఆ బంధం మధ్య సంఘర్షణ ఏర్పడితే మనిషిలో ఏర్పడే ఒంటరితనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అన్న మాట.

  ఈ రెండూ కలిసి జరిగినపుడు పైన చెప్పిన రెండింటిలో ఏదో ఒక స్థాయిలో అర్థం చేసుకోవడం, దానికి సంబంధించిన భావోద్వేగ ఒత్తిళ్ళకు లోను కావడం మామూలు మనుషులలో సాధారణమే. కానీ మార్క్సిస్టులు పునాదికీ ఉపరితలానికీ నడుమ గతితర్కాన్ని అధ్యయనం చేసే వాళ్ళు కాబట్టి పైన చెప్పిన రెండు స్థాయిలనూ కలగలిపి అర్థం చేసుకోవలసి ఉంటుంది.

  అప్పుడు విశేఖర్ గారి విశ్లేషణలోలాగా తండ్రి ఆత్మ హత్యను చెప్పేటప్పుడు వ్యంగ్యం ఉండదు. దాని కొనసాగింపయిన హననంపై మాత్రం న్యాయమైన ఆగ్రహం ఉంటుంది (ఇది తన విశ్లేషణలో ఉంది).

 6. నాగరాజు గారు

  నా భాష్యానికి మీరిచ్చిన పాఠాంతరం కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. బహుశా సంఘటనలో ఉన్న ఓ కొత్త అంశం మీ విశ్లేషణకి తోడ్పడి ఉండవచ్చు.

  కుల దురహంకారం తన ఆధిపత్యాన్ని బల ప్రయోగంతో రుజువు చేసుకోవడానికి ప్రయత్నించడమే నేటివరకూ తెలిసినది. అలా కాక అగ్రకుల అభిజాత్యం ఆత్మన్యూనతకు గురై మీరు చెప్పిన వ్యక్తిగత స్ధాయిలో తనను తాను బలితీసుకోవడం నా వరకు కొత్త విషయం.

  ఆత్మహత్య, గృహ దహనాలు అనేవి నెల రోజులకు పైగా సాగిన సంఘర్షణకు కొనసాగింపుగా ఇపుడు మనముందు ఉన్నాయి. ఈ ఘర్షణ ఒక్క ఆత్మహత్యతో మాత్రమే మొదలు కాలేదు. నెల క్రితం అమ్మాయి ప్రేమించిన అబ్బాయి వెంట రావడం, కుటుంబం ఆమె కోసం వెతకడం, విడతీస్తారన్న భయంతో జరిగిన గుళ్ళో పెళ్ళి, ఆ తర్వాత కులాగ్రహంతో యువకుడి కుటుంబానికి బెదిరింపులు, హెచ్చరికలు, కంగారూ కోర్టు విచారణ, అయినా వినని అమ్మాయి. ఇవన్నీ జరిగాకనే ఆత్మహత్య, గృహదహనాలు, దొంగతనాలు.

  కనుక మీరు చెప్పినట్లు ఆత్మహత్య మొదటి దశ కాదు. సాధారణ అణచివేత పద్ధతుల ద్వారా కూతురిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు విఫలం అయ్యాక మాత్రమే ఆత్మహత్య చోటుచేసుకుంది. సాధారణ అణచివేత విఫలమై, అర్ధ భూస్వామ్యం సమకూర్చిన అగ్ర కుల అభిజాత్యం వ్యక్తిగత స్ధాయిలో పై చేయి సాధించలేకపోవడంతో, సామూహిక బలిమి అప్పటికి చేరువలోకి రాక… జరిగినదే ఆత్మహత్య. ఇటువంటి ఆత్మహత్యకు సానుభూతి ఇవ్వడం గతితార్కిక పరిశీలనలో సాధ్యమేనా?

  సంఘటనల గతిని విరుద్ధ శక్తుల సంఘర్షణల పర్యవసానాలుగా చూడడం గతితర్కం. దళిత యువకుడి ఆత్మ గౌరవం, పురుషాధిక్యతను తిరస్కరించిన ఒక అమ్మాయి స్వయం నిర్ణయ ప్రకటన రెండూ ఒక్కటై సమాజంలో తమవద్దకు చేరిన సాధారణ ఉపరితల సాంస్కృతిక చైతన్యాన్ని అందిపుచ్చుకుని అర్ధ భూస్వామ్య కుల, పురుషాహంకార అణచివేతను తిరస్కరించాయి. ఈ సంఘర్షణలో ఓడిపోయిన ఒక పీపీలికం ఆత్మహత్యను తలపెట్టింది.

  తప్పనిసరిగా ఓటమికి గురికావలసిన, ఉనికిని కోల్పోవలసిన ఈ పీపీలికానికి అభివృద్ధికర భావజాలంలో చోటులేదు. మారనయినా మారాలి, లేదా ఉనికినైనా కోల్పోవాలి. ఇలాంటి పీపీలికాలు ఎన్ని ఉనికిని కోల్పోతే సామాజిక గమనం ముందుకి సాగాలి?

  ఉనికిని కోల్పోవలసిన ఒక చిన్న అభివృద్ధి నిరోధకర శక్తి బలహీనపడి, ఒక పతన విలువకోసం తనను తాను ఆత్మార్పణ చేసుకుంటే దానిని నేను వ్యంగ్యపరిచాను. నా వ్యంగ్యం నిజానికి ఒక కోణంలో గౌరవ ప్రకటన కూడా. ఏ మాత్రం గౌరవానికి అర్హతలేని పతన విలువకి ఆ మాత్రం గౌరవమే ఎక్కువేమో.

  సామాజిక పురోగమన చక్ర గమనం నిర్దాక్షిణ్యంగానే ఉంటుంది. నిర్దాక్షిణ్య గమనాన్ని తెలిపే మాటలు మాత్రం ఎందుకు సానుభూతిని నింపుకోవాలి? పురోగమన దిశకు మద్దతుగా సాగుతున్న వేనవేల త్యాగాలే లెక్కలో లేవు. ఇక పతన విలువల పీపీలికాల కోసం సానుభూతినీ, సానుకూలతనీ ఖర్చుపెట్టుకోవడం పరమ దండగే కదా!

 7. శేఖర్ గారూ, “కులం గాడి అంత్య క్రియలు” రాసిన కోకు, తన చరిత్ర వ్యాసాలలో కులం మనిషికి గుర్తింపును, అస్థిత్వాన్నీ ఇచ్చిందని అంటాడు. కులం లేకపోతే మనిషి సమూహం నుండి వేరయితే కలిగే భయానికి, ఒంటరితనానికీ లోనవుతాడని తను వివరణ ఇస్తాడు. భూస్వామ్య, అర్థ భూస్వామ్య సమాజాల్లో కులానికి ఉన్న పట్టును అర్థం చేసుకొనే పద్ధతి ఇది.

  చారిత్రక భౌతిక వాద పద్ధతిలో కులానికి ఉన్న పట్టును ఇలా అర్థం చేసుకోవాలి. అది కేవలం వ్యవస్థీకృతమైన ఆధిపత్య నిర్మాణం మాత్రమే కాదు. భావజాలం కూడా. నిర్దిష్ట చారిత్రక దశలో అది మనిషిని తననోక సమూహంలో భాగంగా చూసుకొనేందుకు వీలు కలిగిస్తుంది. అందుకే కులం మనగలిగింది. లేకుంటే అది ఎప్పుడో ఉనికిని కోల్పోయేది.

  ఆధిపత్య నిర్మాణాలేవైనా అవి కేవలం పై నుండి రుద్దినవైనట్లయితే వాటిని విదిలించి కొట్టడం తేలిక. కానీ వాటి ఉనికితో మనిషి ఉనికి కూడా ముడి పడి ఉన్నట్లయితే వాటితో పోరాడడం చాలా కష్టం. కులం ఇలాంటి సామాజిక నిర్మాణం.

  మీరు ఇచ్చిన వివరణతో నాకు విబేధమేదీ లేదు. కులం పోవాలి. ఇది మంచి ఆకాంక్ష. కానీ దాన్ని ద్వేషించడంతోటే అది పోదు. సమాజం మీద కులానికి ఉన్న అదుపును గుర్తించడంతో పాటుగా, మనిషికి కులానికీ ఉన్న సంబంధాన్ని గుర్తించడం గతితార్కికమవుతుంది. దీని గురించి చెప్పడానికే నేను ప్రయత్నించాను.

 8. కులం మనిషికి భద్రతా భావాన్ని ఇస్తుందంటే నేను నమ్మను. నేను స్వానుభవంతో చెపుతున్నాను. పల్లెటూర్లలో అయితే అది నిజం కావచ్చు కానీ పట్టణాలలో మాత్రం కాదు. నా గురించి నా బంధువులే పట్టించుకోరు. ఇక నా కులంవాళ్ళు ఎలా పట్టించుకుంటారు? మొన్న వైజాగ్‌లో జరిగిన ఒక కాన్‌ఫరెన్స్ కోసం హైదరాబాద్ నుంచి ఒక బ్లాగర్ వైజాగ్ వస్తే ఆయన్ని నేను కలిసాను. “నువ్వు కుల వ్యవస్థ గురించి బ్లాగులలో వ్రాస్తుంటావు కదా, ఈ రోజులలో నిజంగా కులాలు ఉన్నాయంటావా?” అని ఆయన అడిగాడు. “కులాలు ఉన్నాయి కానీ బహిరంగంగా కులం పేరు అడగరు” అని సమాధానం చెప్పాను. కుల వ్యవస్థ అనేది క్విక్ పాయిజన్‌లాగ కాకుండా స్లో పాయిజన్‌లాగ పని చేస్తోంది.

 9. దయానంద సరస్వతి అగ్రవర్ణ బ్రాహ్మణ మతధర్మాన్ని “హిందూ” మతంగా మార్చి “హిందూ మతం” అనే పేరును వ్యాపితమూ, ఆమోదితం చేసిన సామాజిక మత చింతనా పరులలోని తొలి వ్యక్తులలో ఒకరు. బ్రాహ్మణ మతంలో నాలుగు వర్ణాలే ఉంటాయి. పంచమ వర్ణం ఔట్ క్యాస్ట్. కానీ దయానంద సరస్వతి లాంటి వారి పుణ్యమా అని పంచమ వర్ణం కూడా హిందూ మత చట్రం లోకి తీసుక రాబడింది. అందుకే దయానంద సరస్వతిని బ్రాహ్మణ మతాన్ని రివైవ్ చేసి, సమకాలీనం చేసిన వ్యక్తిగా చెప్తారు. వలస పాలన కాలంలో దళితులు ఎక్కడ ఇతర మతాల వైపు తమ చూపును తిప్పుతారోనని చేసిన “సంస్కరణ” ఇది.

  అంబేడ్కర్ మతాన్ని అర్థం చేసుకున్న పద్ధతి “ఆధునిక”మైనది. దళితులను, వెనుక పడిన వారిని సామాజికంగా అగ్రవర్ణాల వారితో సమానంగా నిలబెట్టడానికి వారికి ఆర్థికంగా, సామాజికంగా రాజ్యపు దన్ను ఉండాలని భావించాడు. కులాంత వివాహాలను కూడా కులాన్ని బలహీనం చేసే సాధనాలుగా ఆయన నమ్మాడు. మతం అవసరాన్ని ఆయన బలంగా విశ్వసించాడు. “హిందూ” మత పుట్టుకలోనే అసమానత ఉన్నందున బౌద్ధాన్ని తీసుకున్నాడు.

  అసమానత మీద ఆధారపడిన రాజ్యం మీద నమ్మకం, మతం తప్పని సరి అని అనుకోవడం, కులాన్ని అర్థం చేసుకోవడంలో ఆధునిక(మోడర్నిటి)భావజాలం మీద ఆధార పడడం ఆయనకున్న పరిమితులు.

  పాత దాన్ని పేరు మార్చి విస్తృత పరిచిన దయానంద సరస్వతికి, అంబేద్కర్ కు ఇక పోలిక ఎక్కడ ఉంది.

  కులాంతర వివాహాల వరకే తీసుకున్నా ఆర్య సమాజపు ఆచరణలో అవి ఉన్నట్లుగా నేను వినలేదు. ఇక ఎక్కడ పోలిక.

  అందుకే దయానంద సరస్వతి, ఆర్య సమాజం జనం ఊసులో లేకుండా పోయాయి. అంబేద్కర్ ఒక ప్రజాస్వామిక వాదిగా, సామాజిక చింతనా పరునిగా నిలిచి ఉన్నారు.

 10. నాగరాజు గారు, మన ఇండియాలో మార్క్సిజంపై వ్యతిరేకత ఎక్కువగా ఉండడానికి కులమో, మతమో కారణం అనడానికి ఆధారాలు లేవు. “ఎవరి ఇంటిని వాళ్ళే చక్కబెట్టుకోవాలి, సమాజాన్ని ఉద్ధరించక్కరలేదు” అనే పాప్యులర్ వైయుక్తికవాద భావం వ్యాప్తిలో ఉంది. “డబ్బున్నవాళ్ళందరూ మంచివాళ్ళు. పేదవాళ్ళు సోమరిపోతులు. వాళ్ళు డబ్బు సంపాదించడం చేతకాక సమాజం మీద ద్వేషం పెట్టుకుంటారు” లాంటి అభిప్రాయాలు కులంతో గానీ మతంతో గానీ సంబంధం లేకుండా ఉంటాయి. ఇలాంటి భావజాలంతో పోలిస్తే కులం, మతం అనేవి చిన్న సమస్యలు. దోపిడీ సంబంధాలనీ, వైయుక్తికవాద కుళ్ళు భావజాలాన్ని ప్రశ్నించకుండా కేవలం కులం మీదో, మతం మీదో పడి ఏడిస్తే ఆ ఏడుపు విన్నవాళ్ళు ఎలా పట్టించుకుంటారు?

  “ఇండియాలో ఇప్పటికీ కులాంతర వివాహాలు ఎందుకు జరగడం లేదు?” అనే ప్రశ్న విషయానికి వద్దాం. కుల సమాజంలోనైనా, కులం లేని సమాజంలోనైనా ఎవరైనా తెలిసిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంటారు కానీ ముక్కూముఖం తెలియని వ్యక్తిని పెళ్ళి చేసుకోరు. ఒక అమ్మాయి తనకి ఫేస్‌బుక్‌లో పరిచయమైన అబ్బాయితో స్నేహం చేసి, అతను పిలిచాడని వెళ్తే, అతను ఆమెని రేప్ చేసిన వార్తలు గురించి చదివాము. ముక్కూముఖం తెలియని వ్యక్తితో స్నేహం చేస్తేనే ఇలాంటివి జరుగుతాయని తెలిసినప్పుడు ఇక పెళ్ళి చేసుకునే ధైర్యం మాత్రం ఎలా ఉంటుంది? విజయనగరం జిల్లాలో కాపులూ, వెలమలూ వేరువేరు గ్రామాలలోనే ఉంటారు. కాపువానికి కాపువానితోనే పరిచయాలు ఎక్కువగా ఉంటాయి కనుక కాపుల అబ్బాయికి కాపుల అమ్మాయితోనే పెళ్ళి సంబంధం సులభంగా కలుస్తుంది. ఈ పరిస్థితిలో తనకి తెలియనివాళ్ళు ఎక్కువగా ఉన్న వెలమల గ్రామానికి వెళ్ళి పెళ్ళి చూపులు చూడాల్సిన అవసరం ఉంటుందని కాపుల అబ్బాయి ఎలా అనుకుంటాడు? పట్టణంలోని ఆఫీస్‌లో అయితే వేరువేరు కులాల నుంచి మాత్రమే కాదు, వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చినవాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఎక్కడో కడప జిల్లాలో పుట్టి, శ్రీకాకుళం జిల్లాలో పెరిగిన కరణం మల్లేశ్వరికి హర్యాణాకి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడి అతన్ని పెళ్ళి చేసుకుంది. పల్లెటూరిలో అయితే కులాంతర వివాహం చేసుకోవడానికి ఇన్ని అవకాశాలు ఉండవు కదా.

 11. మన ఇండియాలో అన్ని ప్రాంతాల సామాజిక పరిస్థితులూ ఒకేలాగ లేవు అనే విషయం ఇక్కడ నాగరాజు గారు గుర్తుంచుకోవాలి. పల్లెటూరివాళ్ళందరూ తమ కులంవాళ్ళని kinsmen (రక్త సంబంధీకులు)గా చూస్తారని నేను అనుకోను. మా అమ్మమ్మ గారి ఊరిలో కాపులు ఎక్కువ. ఆ ఊరి జనాభా రెండు వేలే. కానీ ఆ ఊరిలో ఒక వీధిలో ఉండే ఒక ఇంటి పేరు గల కాపులు ఇంకో వీధిలో అదే ఇంటి పేరు ఉన్న కాపులతో తమకి సంబంధం లేదనే చెప్పుకుంటారు. కానీ అదే జిల్లాలోని గిరిజన గ్రామాలలో అలా కాదు. ఇంటి పేరు ఒకటైతే అన్నయ్య అనో, చిన్నాన్న అనో వరసలు కలుపుకుంటారు. ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందని గిరిజన ప్రాంతాలలోని పరిస్థితినీ, ఉత్పత్తి శక్తులు కొద్దిగా అభివృద్ధి చెందిన పల్లపు ప్రాంతాలలోని పరిస్థితినీ ఒకేలా చూడలేము.

 12. నాగరాజు గారు, హిందూ మతమైనా, ఇంకో మతమైనా అది ఊహాజనితమే కానీ వాస్తవికం కాదు. అంటరానితనం వల్ల దళితులు హిందూ మతం వదిలి క్రైస్తవ మతంలోకి చేరిపోతున్నారని తెలిసినా కూడా పల్లెటూర్లలో అగ్రకులాలవాళ్ళు దళితులని అంటరానివాళ్ళుగానే చూస్తున్నారు. దళితులని మనుషులుగా చూసి, వాళ్ళు మతం మారాల్సిన అవసరం లేకుండా చేసి, హిందూ మతాన్ని పదిలంగా పరిరక్షించుకుందామనే భావన పల్లెటూర్లలోని అగ్రకులాలవాళ్ళలో లేదు. పల్లెటూర్లలో దళితులు మతం మారితే అగ్రకులాలవాళ్ళు అభ్యంతరం చెప్పరు. కానీ దళితులు మతం మారిన తరువాతైనా, మతం మారకముందైనా అగ్రకులాలవాళ్ళ బావుల దగ్గర నీళ్ళు తోడుకుంటే దళితులపై దాడులు జరుగుతాయి. ఇక్కడ మతం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కంటికి కనిపించే లోకం గురించే ఆలోచిస్తున్నారు. “దళితులు కూడా హిందువులే, భారతీయులందరిదీ ఒకటే రక్తం” లాంటి వచనాలు RSS, భజరంగ్ దళ్ లాంటి ఉగ్రవాద హిందూ సంస్థలవాళ్ళు పలుకుతారు. పల్లెటూర్లలో కనిపించేది కుల ఉగ్రవాదమే కానీ మత ఉగ్రవాదం కాదు.

 13. నాగరాజు గారు, కుల సమస్యని realismలో చూడాలి కానీ romanticismలో కాదు. పల్లెటూర్లలో మను ధర్మమే అమలవుతోందని ఒక టివి చానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో కంచ ఐలయ్య గారి శిష్యులు అంటే “పల్లెటూరివాళ్ళకి మను ధర్మ శాస్త్రం అంటే ఏమిటో తెలుసా” అనే సందేహం నాకు వచ్చింది. వీళ్ళు మార్క్సిజంని పూర్తిగా తిరస్కరించి, కుల సమస్యని వర్గ దృక్పథంతో అర్థం చేసుకోకుండా మత దృష్టితో మాత్రమే చూస్తున్నారు. ఈ విషయంలో మార్క్సిస్ట్‌లు తమని విమర్శిస్తారని ముందే ఊహించిన వీళ్ళు “వర్గం మారొచ్చు కానీ కులం మారడానికి అవ్వదు” అని స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు.

  మార్క్సిస్ట్‌నని చెప్పుకుంటూ ‘మార్క్సిజంకి వ్యతిరేకమైన భావజాలం కూడిన గాంధీ వేషం’ వేసుకునే గద్దర్ కూడా ఈ విధంగా ఆలోచించే రకమే. మొన్న లక్ష్మీపేటలో తూర్పుకాపు కులస్తులు భూమి కోసం దళితులని హత్య చేస్తే అది బ్రాహ్మణవాద హత్యాకాండ అని అంటూ గద్దర్, కత్తి పద్మారావులు పేపర్‌లలో ప్రకటనలు ఇచ్చారు. అక్కడ హత్యాకాండ చేసినవాళ్ళు కూడా రెండుమూడు ఎకరాలు కంటే ఎక్కువ భూమి లేని పేదరైతులే. ఆ standard of livingలో ఉన్నవాళ్ళకి బ్రాహ్మణవాదం అంటే ఏమిటో తెలియదు. దళితులని ఆ గ్రామం నుంచి తరిమేస్తే తాము క్లెయిమ్ చేసిన భూమి తమకి వస్తుందని అనుకుని అక్కడ హత్యాకాండ జరిపారు. దీన్ని ఒక ఆర్థిక సమస్యగా చూడకుండా దీన్ని బ్రాహ్మణవాద కోణంలో చూశారు ఆ ఇద్దరు దళిత మేతావులు. ఇలాంటి వాళ్ళని చూస్తోంటే దళితవాదం కూడా వాస్తవికతకి దూరమైన రొమాంటిక్ మోడ్‌లో నడుస్తోన్న ఉద్యమం అని అనిపిస్తోంది.

 14. ఇక పతన విలువల పీపీలికాల కోసం సానుభూతినీ, సానుకూలతనీ ఖర్చుపెట్టుకోవడం పరమ దండగే కదా!
  చాల దారుణమండి.
  How can you say that the man who committed suicide is as much knowledgable as you?
  He is just a ordinary common man! That’s why he did the 1st action any father would have done. How many ppl do you think would act differently? Nearly 90% of the people will oppose a love marriage not only in this nation but also in many other countries.
  May be he is just afraid of the society and ppl around him. May be he doesn’t have the courage to go against the tide. Afterall who has? How many of us have?
  If you think ppl like him dont deserve to live, please note that nearly 80% of the population on this earth should commit suicide right now.

 15. అజయ్ గారూ, మీరు ఉటంకించిన వాక్యం సాధారణ అవగాహన కోసం రాసినది కాదు. గతి తార్కిక చారిత్రక భౌతికవాద దృక్పధంతో సంఘటననూ, నా రాత ధోరణినీ విశ్లేషించిన నాగరాజు గారికి సమాధానంగా దాన్ని రాశాను. ఆ వాక్యం ఒక తాత్విక విశ్లేషణలో భాగంగా రాసినది. దానిని విశ్లేషణనుండి విడదీసి చూస్తే మీరు తీసుకున్న అర్ధం వచ్చే అవకాశం ఉంది. కానీ నా ఉద్దేశ్యం అది కాదు.

  పిపీలికం అన్న వ్యాఖ్యానం అమ్మాయి తండ్రిని వ్యక్తిగతంగా ఉద్దేశించినది కాదు. ఆయనగారి భౌతిక ఉనికిని నేనసలే ఉద్దేశించలేదు. భావజాలపరమైన ఉనికిని మాత్రమే నేను ఉద్దేశించాను. కొత్తనీరు వచ్చినపుడు పాత నీరు పోయినట్లే, కొత్త అభివృద్ధికర భావజాలం సమాజంలో ప్రవేశించినపుడు పాత అభివృద్ధి నిరోధకర భావజాలం ఉనికిని కోల్పోవలసిందే. ఆ అర్ధంలో మాత్రమే పిపీలికం ఉనికి గురించి చెప్పాను.
  కులం వెనుకబాటు సమాజాల లక్షణం. కులాంతర వివాహానికి తలపెట్టడం అంటే ఆ లక్షణాన్ని తిరస్కరించి అభివృద్ధికరమైన ప్రగతిశీలమైన సమాజం యొక్క సమానత్వ భావాన్ని ఆహ్వానించడం. సమానత్వం నెలకొనాలంటే కుల, మత, లింగ వివక్షలన్నీ సమాజం నుండి పోవలసిందే. (అది ఎలా సాధ్యం అన్నది మరొక సంగతి.) నా వ్యాఖ్యను అలానే చూడగలరు.

  ఏ తండ్రయినా అదే మొదట చేస్తారని చెప్పడం కరెక్ట్ కాదనుకుంటా. ఉత్తర భారతంలో చూస్తూనే ఉన్నాం. కొంత జంటని వెతికి పట్టుకుని తమ అల్లుడితో పాటు కూతురిని కూడా చంపేస్తున్నారు. వివాహంలోకి వచ్చిన దళితుల కుటుంబాలను కూడా చంపేయడం, మాయం చేయడం, బహిష్కరించడం చేస్తున్నారు. ఖాప్ పంచాయితీల పరువు హత్యలు పెరిగిపోతున్నాయి కూడా.

  ప్రేమ పెళ్లిళ్లను తొంభై శాతం దేశాల్లో వ్యతిరేకిస్తారనడం కూడా వాస్తవ దూరమే. వివాహాలకి సంబంధించి చాలా దేశాల్లో చాలా ప్రజాస్వామిక భావాజాలం ఉంది. గిరిజన తెగల సంస్కృతి కొనసాగుతున్న చోట్ల స్త్రీలకి బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య జీవనం అందుబాటులో ఉంది. ఆ పరిస్ధితి భారత గిరిజన తెగల్లో కూడా చూడవచ్చు. గోదావరి, విశాఖ జిల్లాల ఏజన్సీల్లో పెళ్లి తర్వాత కూడా స్త్రీ, పురుషుల సంబంధాలకు అడ్దుపెట్టని సంస్కృతి వివిధ రూపాల్లో మిగిలి ఉంది. అలాంటి ప్రజాస్వామిక సంస్కృతికి నాగరీకులు అసహ్యకరమైన పేర్లు పెడితే పెట్టవచ్చు గాక!

  సామజిక సంబంధాలు అభివృద్ధి దశలోకి వేళ్లేటపుడు పాత దశలు అడ్డం పడతాయి. సంస్కృతి నాశనం అవుతోందన్న పేరుతో పురోగతిని అడ్డుకుంటాయి. ఈ సంఘర్షణలో భాగంగానే హత్యలు, దహనాలు జరుగుతున్నాయి. అందులో భాగమే తమిళనాడు ఘటన కూడా. ఇవన్నీ ఒకరి ఇష్టా ఇష్టాలతో ఆగేవి, కొనసాగేవి కావు.

 16. నాగరాజు గారు, నేను దయానందుని భావజాలం గురించి చదివాను. అతను తన తండ్రి భావజాలంతో విభేదించి సంఘ సంస్కర్తగా మారాడు. దయానందుని భావజాలానికీ, అంబేద్కర్ భావజాలానికీ మధ్య తేడా ఉంది, నిజమే. దళితులు వేద మంత్రాలు చదవాలనీ, జంధ్యాలు వేసుకోవాలనీ దయానందుడు బోధించాడు. ఆర్య సమాజికులు ఒక గ్రామంలో దళితుల చేత జంధ్యాలు వెయ్యిస్తే జంధ్యాలు వేసుకున్నందుకు అగ్రకులస్తులు దళితుల వీపుల మీద ఎలా వాతలు పెట్టారో అంబేద్కర్ తన రచనలలో వ్రాసాడు. కానీ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని సమర్థించాడు. అది పైకి హిందూ మతం కంటే ఉన్నతమైన మతంలాగ కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది గాంధేయవాదంలాగ ఊహాత్మక శాస్త్రం (speculative philosophy). “రాచరికాలు ఉండొచ్చు కానీ రాచరిక ప్రభువులు అహింసా ధర్మాన్ని ఆచరించాలి” అని అనడం అప్పటి పరిస్థితిలో అది అభివృద్ధికరమైన భావజాలమే కావచ్చు. కానీ ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని, ఆ ముసుగులో పోలీసులు-తుపాకులని నమ్ముకుని హింస చేసే ఇప్పటి పాలకవర్గాన్ని ఓడించడానికి ఆ భావజాలం సరిపోదు. అందుకే అంబేద్కర్‌వాదానికీ, ఆర్య సమాజికులవాదానికీ మధ్య ఉన్న తేడా ఆ రెండిటిలో ఒక దాన్ని అంత గొప్పదిగా చేసేది కాదని నమ్ముతాను.

  ఈ లింక్ కూడా చదవండి: http://4proletarianrevolution.mlmedia.net.in/168040779

 17. నాగరాజు గారు, విభేదం ఉన్నదని నేననుకోలేదు. మీ వ్యాఖ్యలు విషయ విశ్లేషణను మరింత సుసుంపన్నం కావిస్తున్నాయి. అవసరమైన సరికొత్త కోణాలను చర్చలోకి తెస్తున్నాయి. తరచుగా గతి తార్కిక అవగాహనలోని సులభ గ్రాహ్యతను పాఠకులకు పరిచయం చేస్తున్నాయి. అది అవసరం. కొనసాగించగలరు.

 18. పరువు హత్యలనడం వల్ల ఆ హత్య చేసిన వాళ్ళకు సానుభుతినీ, సమర్దననూ, ఇస్తుంది పాపం పరువుకొసం హత్య చేశాడు అనే విధంగా .ఆ విధంగా చుసుకుంటే ప్రతి హత్య వెనుకా ఒక కారణం వుంటుంది అన్నింటికీ సానుభూతి చుపవలసి వుంటుంది. భావజాలంలొ గతానికీ, ఇప్పటికీ మార్పు వచ్చినప్పటికీ అది పరిమితంగనే.ఆర్దిక తారతమ్యంలొ మార్పు వస్తె భవిష్యత్తు తరాలలొ అంతగా కులాలకు ప్రముఖ్యత నివ్వరు.

 19. కులం సామాజిక భద్రతా భావాన్ని ఇస్తుందనే నాగరాజు గారి వ్యాఖ్యని నేను అంగీకరించలేకపోతున్నాను. నేను పుట్టినది మధ్య తరగతి కుటుంబంలో. నా జీవితంలో వచ్చిన గొడవలన్నీ డబ్బుకి సంబంధించిన గొడవలే. నేను డాక్టర్‌ని లేదా ఇంజినీర్‌ని అయ్యి డబ్బులు సంపాదించడానికి రెస్ట్ లేకుండా చదవాలని చిన్నప్పుడు మా నాన్న కొట్టిన బెల్ట్ దెబ్బలూ, పెద్దైన తరువాత మా చిన్నాన్న కుటుంబంతో వచ్చిన ఆస్తి గొడవలూ, వ్యాపారం చేసిన రోజులలో చిల్లర బేరాలు ఆడే కస్టమర్లతో గొడవలూ వగైరా ఇవన్నీ. కులం పేరు నాకు చాలా మంది అడగలేదు. కొంత మంది అడిగినా నేను చెప్పలేదు. నేను చెప్పకపోయినా వాళ్ళు ఏమీ అనుకోలేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే వ్యక్తివాద సమాజంలో కులం గురించి మాత్రం ఆలోచిస్తారని నేను అనుకోను. నా వ్యక్తిగత సమస్యల గురించి నా బంధువులకి చెప్పినప్పుడు “ఇంటిలోని విషయాలు బయట చెప్పకూడదు” అని అంటూ నన్ను డిస్కరేజ్ చేశారు. మా నాన్న ఎలాంటివాడో తెలిసే అలా మాట్లాడారు. నాలుగు మంచి మాటలు చెప్పి నాలో విశ్వాసం కలిగించడానికి కూడా వాళ్ళకి బద్దకం వేసింది. సొంత బంధువులే అక్కరకి రాని చుట్టాలలాగ ప్రవర్తించడం చూసినప్పుడు ఇక కులంవాళ్ళు మన కోసం ఏదో చేస్తారనే భ్రమ కలగదు.

  కులం అనేది గుర్తింపునైతే ఇస్తుంది. కానీ ఉన్న భయాలని పోగొట్టదు, భవిష్యత్‌లో భయాలు రావనే గ్యారంటీ ఇవ్వదు.

 20. అభిప్రాయాలు అనేవి ఎదురైన అనుభవాల వల్ల కలుగుతాయి కానీ బలవంతం వల్ల కలగవు. మనిషి జీవితంపై సామాజిక కట్టుబాట్ల ప్రభావం ఇంత ఉంటుంది అనే నాగరాజు గారి థీసిస్‌ని నేను ఒక రకంగా అర్థం చేసుకోగలను. వేలుపిళ్ళై ప్రభాకరం పుట్టినది చేపలు పట్టే కులానికి చెందిన కుటుంబంలో. అతను చేపలు పట్టే కులానికి చెందినవాడు కావడం వల్ల అగ్రకుల తమిళులు అతన్ని హీనంగా చూసేవాళ్ళు, అతను తమిళుడు కావడం వల్ల సింహళీయులు కూడా అతన్ని హీనంగా చూసేవాళ్ళు. అతను ఆ వాతావరణంలో పుట్టి పెరగడం వల్ల పెద్దైన తరువాత కరడుగట్టిన జాతీయవాది అయ్యాడు. కానీ నా పరిస్థితి వేరు. నేను గిరిజనుణ్ణైనా చిన్నప్పుడు నేను కలిసి తిరిగినది అగ్రకులాలకి చెందిన పిల్లలతోనే. నాకు ఎన్నడూ కుల వివక్ష ఎదురవ్వలేదు.

  పల్లెటూర్లలోని స్కూల్‌లలో మధ్యాహ్న భోజనానికి దళిత స్త్రీలు వంట చేశారని అగ్రకులాలవాళ్ళు తమ పిల్లలకి స్కూల్‌లో భోజనం తినొద్దని చెప్పిన ఘటనలు చూస్తున్నాము. కానీ పట్టణాలలో ఒక దళిత రాజకీయ నాయకుని కొడుకు పెట్టిన రెస్టారెంట్‌కి కులంతో సంబంధం లేకుండా అందరూ వెళ్ళి బిర్యానీలు లాగించెయ్యడం కనిపిస్తుంది. పట్టణ వాతావరణంలో పుట్టి పెరిగినవానికి “పల్లెటూర్లలో దళిత స్త్రీలు చేసిన వంటలు ముట్టుకోరు” అనే వార్త వినిపించినప్పుడు అది అతనికి అగ్నిహోత్రావధానుల కాలం నాటి చాదస్తంలా కనిపిస్తుంది. “పల్లెటూరివాళ్ళు ఇంత సెన్స్ లేని వాళ్ళా?” అని అడుగుతాడు. కానీ పల్లెటూర్లలో పుట్టి పెరిగినవాళ్ళకి ఆశ్చర్యం కలగదు. పరువు హత్యల విషయం అయినా ఇంతే. నా రక్త సంబంధీకులలోనే ఒకడు “బ్రాహ్మణునికి సారా వ్యాపారం చేసే కులానికి చెందిన స్త్రీ వల్ల పుట్టిన అమ్మాయిని” పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళ గ్రామంలో ఎవరూ అతన్ని వెలివెయ్యలేదు. ఆ గ్రామంలో ఉన్నవాడు హర్యాణాలో జరుగుతోన్న పరువు హత్యల గురించి వార్త వింటే “అంత మతిలేనివాళ్ళు ఉంటారా?” అని అడుగుతాడు. అలా అడగడం అడిగేవానికి వ్యంగ్యంలాగ అనిపించదు కదా.

 21. అయ్యా నేను చదుకున్న మేరకూ, అర్థం చేసుకున్న వరకూ

  1. వాస్తవాలు వేరు. వాస్తవికత వేరు.

  2. మన సమాజం కుల వర్గ సమాజం
  3. మనం అనుకునే “హిందూ” మత పునాది కులం. కులం పునాదిని ఆధారంగా చేసుకొని, ఎప్పటికప్పుడు సమాజంలో వచ్చిన మార్పులకనుగుణంగా రివైవ్ చేసుకోవడం వల్లనే ఈ మతం తన రెలవెన్స్ పోగొట్టూకోకుండా కొనసాగుతోంది.

  4. వలస పాలన కాలం నుండి “హిందూ” మతం ప్రతిపాదించిన, ప్రతిపాదిస్తున్న సంస్కరణలు రూపంలో కుల స్వభావానికి దూరంగా ఉన్నట్టుగా కనపడుతూ, సారంలో మాత్రం తన యధా స్థితిని కొనసాగిస్తున్నాయి. 5. మన అర్థ భూస్వామ్య సమాజంలో ఇవన్నీ గతి తార్కిక సంబంధం ఉన్న అంశాలు.

  స్థూలంగా ఈ అవగాహనతోనే నేను వ్యాఖ్యలను రాసాను.

 22. ఏ వైరుధ్యాలనైనా జాగ్రత్తగా అంచనా వెయ్యాల్సిందే. కుల వైరుధ్యాల విషయానికి వస్తే, అవి ప్రాంతానికి ఒకలాగ & ఊరికి ఒకలాగ కూడా ఉంటాయి. వంద గుడిసెలు ఉన్న గిరిజన గ్రామంలో ఒక బ్రాహ్మణుడు గుడిసె వేశాడు. ఆ చుట్టు పక్కల కూడా అన్నీ గిరిజన గ్రామాలే ఉన్నాయి. పౌరోహిత్య కార్యక్రమాల కోసం ఆ బ్రాహ్మణుని దగ్గరకి వెళ్ళేవాళ్ళందరూ గిరిజనులే. ఆ స్థితిలో ఆ బ్రాహ్మణుడు తన వృత్తిపరమైన patronage కోసం గిరిజనులందరితోనూ గౌరవంగానే మాట్లాడుతాడు కానీ వాళ్ళని కులం తక్కువవాళ్ళనో, అడవి మనుషులనో అగౌరవంగా చూడడు. “బ్రాహ్మణులు శూద్రులని హీనంగా చూస్తుంటారనీ, పంచములని పందులుగా చూస్తుంటారనీ, ఆ బ్రాహ్మణుణ్ణి తరిమి కొట్టాలనీ” ఎవరో సంస్కర్త వచ్చి చెపితే అక్కడ ఎవరూ పట్టించుకోరు. ఒక పల్లపు ప్రాంతంలోని గ్రామంలోనైనా ప్రజలు వ్యవసాయం చేస్తూ, చాలీచాలని ఆదాయంతో ఏవో సమస్యలతో ఉంటూ ఉన్నప్పుడు కులం ఒక్కటే పెద్ద సమస్య అన్నట్టు మాట్లాడినా ప్రజలు పట్టించుకోరు. ఓసారి లెనిన్ అన్నాడు “కేవలం దేవుడు లేడు, దెయ్యాలు లేవు అని వాదించినంతమాత్రాన ప్రజలలో మూఢ నమ్మకాలు పోవు. ముందు ప్రజల భౌతిక అవసరాలు తీర్చి, క్రమంగా ప్రజలలో మూఢ నమ్మకాలని నిర్మూలించడానికి కూడా ప్రయత్నించాలి” అని. కులం విషయంలో మనం చెయ్యాల్సింది అది.

  హిందూ మతం విషయానికి వస్తే, హిందూ మత గ్రంథాలలో ఏముందో చాలా మంది హిందువులకి తెలియదు. ఈ మతంలో పండితులు మాత్రమే మత గ్రంథాలు చదువుతారు కానీ సాధారణ భక్తులు మత గ్రంథాలు చదవరు. మను ధర్మ శాస్త్రం గురించి హిందూ పండితులని అడిగితే ఇలా సమాధానం చెపుతారు “మనువు ఏమి వ్రాసాడో చాలా మందికి తెలియదు, ఈ రోజులలో ఎవరూ మను ధర్మాన్ని ఆచరించడం లేదు, కనుక మను ధర్మం పేరు చెప్పి హిందూ మతాన్ని విమర్శించడం అనవసరం” అని. కానీ కంచ ఐలయ్య లాంటి దళిత మేతావులు “పల్లెటూర్లలో కులం కట్టుబాట్లు బలంగా ఉండడానికి కారణం మను ధర్మమే” అని వాదిస్తారు. వాళ్ళు వర్గం గురించి పట్టించుకోరు. కుల వ్యవస్థకి వర్గ సమాజం(ఆర్థిక అసమానతల సమాజం)తో ఉన్న సంబంధం విషయంలో మార్క్సిస్ట్‌లు తమని ప్రశ్నిస్తారని అనుమానం వస్తే “వర్గం మారొచ్చు కానీ కులం మారడానికి అవ్వదు” అని ముందే చెప్పేస్తారు. మార్క్సిజం కొత్తగా చదివినవాళ్ళు కూడా తెలియకతెలియక కొన్ని సార్లు కంచ ఐలయ్య లాంటి మేతావులు తవ్వే గోతుల్లోకి దిగిపోతుంటారు.

 23. కుల వైరుధ్యాలని అంచనా వేసేటప్పుడు ‘కుల వ్యవస్థకి నిజ జీవితంలో ఎంత వరకు రిలవెన్స్ ఉంది‌’ అనే విషయాన్ని పరిశీలించాలి. భౌతికవాద దృష్టితో కుల వ్యవస్థని పరిశీలించాలంటే ముందు ఇది చెయ్యాలి. ‘భావవాదం అనేది ఉన్నప్పుడు దాని ప్రభావం సమాజంపై అంతో, ఇంతో ఉంటుంది‌’ అనే పాయింట్ ఆధారంగా కుల వ్యవస్థని పరిశీలించలేము. కుల వైరుధ్యాల కంటే వర్గ వైరుధాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఒక మధ్యతరగతి బ్రాహ్మణురాలు ఒక మధ్యతరగతి దళితుణ్ణి కులాంతర వివాహం చేసుకోవడం జరుగుతుంది కానీ ఆమె గుడిసెలో ఉండే బ్రాహ్మణుణ్ణి పెళ్ళి చేసుకోవడం జరగదు.

 24. ప్రవీణ్ గారు, మీ మాటలలో స్వవచో వ్యాఘాతం ఉంది. ఒక సారి కులాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు అంటారు. దాని పక్కనే పరువు హత్యల గురించి ఆశ్చర్య పోతారు. ఒక కుటుంబంలోనే ఒకరినొకరు పట్టించుకోని పరిస్థితి ఉంది ఇక పక్క వాడి కులం గురించి ఎవరు ఆలోచిస్తారు అంటారు. మతం మారినా దళితుల పరిస్థితి ఏమీ మారకుండానే ఉంది అంటూ బావుల దగ్గర నీళ్ళూ తోడుకోలేని పరిస్థితి గురించి వాపోతారు.

  ఒక పద్ధతి అంటూ లేకపోవడం వల్ల జరుగుతున్న అనర్ధం ఇది. వీటన్నింటినీ మీరే ఒకసారి తరచి చూసుకోండి. సంవిధానం(మెథడాలజీ) అంటూ లేకుండా జార్గాన్ ఉపయోగించి మాట్లాడుతూ మిమ్మల్ని మీరు గందరగోళ పరుచుకోకుండా ఉండాలంటె అధ్యయనం అవసరం

 25. కులం అనేది పైకిపైకి చెప్పే కబురు. స్వార్థం అనేది వ్యక్తిగత ప్రయోజనం మీద కేంద్రీకృతమయ్యి ఉంటుంది. ఎంత కులం పేరు చెప్పుకున్నా స్వార్థం అనేది వ్యక్తి కేంద్రకంగానే ఉంటుంది కానీ కుల కేంద్రకంగా ఉండదు. కుల పట్టింపులు ఉన్నవాడు కూడా నిత్యం వాటినే పట్టుకుని వేలాడడు. ఎందుకంటే ఆ పట్టింపుల వల్ల జీవితంలో రూపాయి ప్రయోజనం కూడా రాదు. ఇటువంటి పరిస్థితిలో ఎవడైనా తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఆత్మహత్య చేసుంటే ఆశ్చర్యమే కలుగుంది.

  కుల సమాజంలో కుల పట్టింపులు అందరిలోనూ ఒకే స్థాయిలో ఉండవు. అందుకే కొన్ని చోట్ల కులాంతర వివాహాలు చేసుకునేవాళ్ళని చూసీచూడనట్టు వదిలెయ్యడం, కొన్ని చోట్ల ఆ వివాహాలు చేసుకున్నవాళ్ళని పరువు హత్యలు చెయ్యడం జరుగుతోంది. ఈ విషయం చెప్పడంలో అస్పష్టత ఏమీ లేదు.

 26. కుల వ్యవస్థ అనేది హిందూ మతం నుంచి పుట్టిందని పల్లెటూర్లలో చాలా మందికి తెలియదు. ఊరిలో నూటికి తొంబై మంది కులాన్ని నమ్ముతున్నారు కనుక మేము కూడా కులాన్ని నమ్ముతున్నాము అని చెప్పుకునేవాళ్ళే ఎక్కువ. అటువంటప్పుడు మతం మారడం వల్ల కులం ఎలా పోతుంది? కనుక “మతం మారినవాళ్ళని కూడా అగ్రకులాలవాళ్ళ బావులలో నీళ్ళు తోడుకోనివ్వడం లేదు” అని నేను వ్రాసిన వ్యాఖ్యలో అస్పష్టత ఏమీ లేదు. కులం అనేది మతం కంటె ఆర్థిక అసమానతలతో ఎక్కువ సంబంధం ఉన్న విషయం.

 27. “కుల వ్యవస్థ అనేది హిందూ మతంలోనే ఉంది కానీ ఇంకే మతంలోనూ లేదు” అనే విషయం చదువుకున్నవాళ్ళకి తెలుసు కానీ సాధారణ పల్లెటూరివాళ్ళకి తెలియదు. అటువంటప్పుడు పల్లెటూరివాళ్ళు మతం మారిన తరువాత కూడా కుల ఐడెంటిటీ వదులుకోవడం జరగదు, మతం మారినవాళ్ళపై కుల వివక్ష ఆపెయ్యడం కూడా జరగదు.

  చారిత్రక భౌతికవాదం చదివిన మార్క్సిస్ట్‌కీ, స్కూల్ పుస్తకాలలో సాధారణ చరిత్ర చదివిన వ్యక్తికీ మధ్య చరిత్ర అవగాహనలో ఎంత తేడా ఉంటుంది? పట్టణాలలో ఉంటూ మత గ్రంథాలు చదివినవాళ్ళకీ, పల్లెటూర్లలో ఉంటూ మత గ్రంథాలు చదవనివాళ్ళకీ మధ్య మతంపై అవగాహనలో అంతే తేడా ఉంటుంది. “పల్లెటూర్లలో మతం మారినవాళ్ళని కూడా అగ్రకులాలవాళ్ళ బావుల దగ్గర నీళ్ళు తోడుకోనివ్వడం లేదు కాబట్టి కులం కంపు కడిగినా పోనంత బలంగా ఉంది” అని అంటే అది పూర్తిగా మెటాఫిజికల్ అవగాహన అవుతుంది కానీ గతితార్కిక అవగాహన అవ్వదు.

  దళితుడు మతం మారినంత మాత్రాన అతను పంది మాంసం తినడం మానేస్తాడా?, చిరిగిపోయిన చొక్కా వేసుకోవడం మానేస్తాడా?, కాళ్ళకి చెప్పులు లేకుండా నడవడం మానేస్తాడా?! మతం మారడం వల్ల దళితుల జీవన ప్రమాణాలు ఏ రకంగా మారుతాయి? వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారకుండా వాళ్ళని తమతో సమానంగా చూడగలగడానికి అగ్రకులాలవాళ్ళు ఎలా సిద్ధపడతారు?

 28. FYI, నాగరాజు గారు అనుకుంటున్నట్టు మతం కాలానుగుణంగా మారడం లేదు. మత గ్రంథాలలో ఏముందో చాలా మందికి తెలియదు కాబట్టి మతం గురించి ఒక్కొక్కడూ ఒక్కో రకంగా భాష్యం చెపుతాడు. ఒకడు హిందూ మతానికి కుల వ్యవస్థే ఊపిరి అని అంటాడు, ఇంకొకడు కుల వ్యవస్థ ఉండకూడదు కానీ చతుర్వర్ణ వ్యవస్థ ఉండాలని అంటాడు, ఇంకొకడు చతువర్ణ వ్యవస్థ కూడా ఉండకూడదని అంటాడు, ఇంకొకడు కుల వ్యవస్థ ఉండాలి కానీ అంతరానితనం మాత్రమే పోవాలని అంటాడు. ఇప్పుడు కొత్త రకం మూఢ నమ్మకాలు వచ్చాయి. ఒక OC కులంవాళ్ళు ఇంకో OC కులంవాళ్ళని కులాంతర వివాహం చేసుకోవచ్చు కానీ BC కులంవాళ్ళని కులాంతర వివాహం చేసుకోకూడదని కొందరు అంటారు. SC, ST, BC, OC అనేవి కేవలం రిజర్వేషన్‌ల కోసం ఏర్పాటు చేసిన విభజనలు కానీ అవేమీ మతం ఏర్పాటు చేసిన విభజనలు కావు. కొన్ని ప్రాంతాలలో OCలు కూడా దళితులలాగే గుడిసెలలో నివసించడం నేను ప్రత్యక్షంగా చూశాను, కొన్ని ప్రాంతాలలో దళితులు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి మేడలు కట్టడం కూడా చూశాను. మత గ్రంథాలలో ఏముందో తెలియనప్పుడు ఒక వ్యక్తి “OCలు ఇతర OCలని కులాంతర వివాహం చేసుకోవచ్చు కానీ BCలని కులాంతర వివాహం చేసుకోకూడదు” లాంటి హాస్యాస్పద ప్రతిపాదనలు చేసినా ఆశ్చర్యం కలగదు.

  ఒక వ్యక్తి మత గ్రంథాలు చదివినా, చదవకపోయినా ఐడెంటిటీ ప్రకారం అతన్ని ఫలానా మతస్తుడనే అంటారు. మార్క్సిజం విషయం అలా కాదు. మార్క్సిస్ట్‌నని చెప్పుకునేవాడు కులం, కట్నం లాంటి సంప్రదాయక ఆచారాలని ఆచరిస్తే మార్క్సిజమే ఓడిపోతుంది. అతను మార్క్సిజం పూర్తిగా తెలిసీ అటువంటి పనులు చేసినా, కొద్దికొద్దిగా తెలిసీ అటువంటి పనులు చేసినా ఓడిపోయేది మార్క్సిజమే. మతం విషయం అలా కాదు. మతం అనేది ఒక ఊహాజనిత శాస్త్రం. మతంలో లాజిక్ అనేది ఉన్నా, లేకపోయినా అది ఊహలు అనే పునాదుల మీద నిలబడుతుంది. ప్రతి మనిషి యొక్క భౌతిక అవసరాలు తీరినప్పుడు, మతం లాంటి ఊహాజనిత నమ్మకాలని నమ్ముకునే అవసరం లేని రోజు వస్తే, అప్పుడు మతం మాయమవుతుంది. అంతే కానీ కేవలం నాస్తిక ప్రచారాల వల్ల మతం మాయమవ్వదు.

 29. ప్రవీణ్ గారూ ఉనికిలో ఉన్న ప్రతీదీ మార్పుకు గురవుతుందన్నది మార్క్సిస్టు ప్రాథమిక సూత్రం. మరి మీరు మతం మార్పుకు లోను కాకుండా అలాగే ఉంటుందంటున్నారు. ఇదెలా సాధ్యం. మీరు చెప్పిన దాని ప్రకారం మతం మారకుండా ఉన్నదంటే అది ఉనికిలో లేదనే మార్క్సిజం ప్రకారం అర్థం.

 30. మనిషిని భావం కంటే భౌతికతే ఎక్కువగా ప్రభావితం చేస్తుందని మార్క్సిస్ట్‌లందరికీ తెలుసు. మతం అనేది నిజ జీవితంతో సంబంధం లేని అభౌతిక విషయం. మనిషి కేవలం మతం ప్రకారం నడుచుకోడు. తన అవసరానికి అనుగుణంగా మత నియమాలని మలచుకుంటాడు. హిందూ మతానికి చెందిన కొన్ని గ్రంథాలలో భర్త చనిపోయిన స్త్రీ సతీ సహగమనం చెయ్యాలని వ్రాయబడి ఉంది, కొన్ని గ్రంథాలలో భర్త చనిపోయిన స్త్రీ రెండో పెళ్ళి చేసుకోవచ్చు అని వ్రాయబడి ఉంది. కానీ భర్త చనిపోయిన స్త్రీకి శిరోముండనం చెయ్యాలని (గుండు గియ్యాలని) ఏ గ్రంథంలోనూ వ్రాయలేదు. అయినా బ్రాహ్మణులు భర్త చనిపోయిన స్త్రీలని ముండలు (శిరోముండనం చెయ్యబడిన స్త్రీలు) అని అంటుంటారు. “ఇద్దరు వ్యక్తులు నిలబడి నాన్‌సెన్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఎంతైనా మాట్లాడుకోవచ్చు” అని ఎంగెల్స్ అన్నాడు. ఎంగెల్స్ చెప్పిన ఈ కోట్ నిజమని బ్రాహ్మణాచారాలు చూస్తే అర్థమైపోతుంది. నాకు తెలిసినంత వరకు పరిణామ క్రమంలో మారినది క్రైస్తవ మతం ఒక్కటే. క్రైస్తవ మతం మొదట్లో అప్పటి పాలక వర్గాన్ని వ్యతిరేకించింది. రోమన్ చక్రవర్తులు ఆ మతాన్ని అణచివెయ్యడానికి ప్రయత్నించిన తరువాత ఆ మతం పాలక వర్గాన్ని సమర్థించి తన అస్తిత్వాన్ని కాపాడుకుంది. క్రైస్తవ మతం పాలక వర్గ అనుకూల మతంగా మారిన తరువాత రోమన్ చక్రవర్తులే ఆ మతాన్ని బాగా పాట్రొనైజ్ చేసి, ఆ మతం యూరోప్ అంతటా విస్తరించేలా సహాయం చేశారు.

 31. విశ్వాసాలు అనేవి (అవి మత విశ్వాసాలైనా) ఎప్పుడూ మానవ స్వభావం ఆధారంగానే ఉంటాయి. మానవ స్వభావం మారినప్పుడు అవి మారుతాయి. అవేమీ స్వతంత్రంగా (వాటంతట అవే) మార్పు చెందవు.

 32. ఉనికిలో ఉన్న ప్రతీ మతమూ పరిణామము చెందుతుంది. బుద్ధుడు ప్రవచించిన బౌద్ధం ఇప్పడు ఉనికిలో ఉన్న బౌద్ధం ఒకటి కాదు. ఆర్యుల కాలం నాటి బ్రాహ్మణ మతం ఇప్పటి హిందూ మతం ఒక్కటి కావు. ఇస్లాంలో పుట్టుకొచ్చిన వివిధ శాఖలు తమను తాము మహ్మద్ కు నిజమైన వారసులుగా చెపుకున్నవే. రోమ్ కాలంలో పుట్టిన క్రైస్తవం ఆ తర్వాత అనేక శాఖలయింది. మతసంస్కరణ ఉద్యమాలకు చోటు కలిగించింది. మహావీరుడు చెప్పిన సూత్రాలు, ఆచరణ అనేక మార్పులకు, పాఠాంతరాలకు గురయ్యాయి. ఇలా ప్రతీ మతమూ మార్పుకు లోనవుతూనే ఉంది. వీటన్నింటినీ బట్టి మార్పు ఒక్కటే శాశ్వతం అని సూత్రీకరించ వచ్చు.
  పరస్పర ఘర్షణలో ఒకటి రెండవుతుంది. ఉనికిలో ఉన్న ప్రతీదీ మార్పుకు గురవుతుంది.

 33. ప్రవీణ్, మానవ స్వభావం విషయమై నాగరాజు గారు అడిగిన ప్రశ్నకు క్లుప్తంగా గానీ, వివరంగా గానీ నేరుగా సమాధానం ఇవ్వగలరా? మరో అంశం ప్రస్తావించకుండా చెప్పగలరేమో చూడండి.

 34. I am on phone now and it is difficult to type telugu through phone. Mr Nagaraju claimed that religion changes according to time generation. While religious beliefs depend on human nature, they change according to human nature and they do not change independently.

  Buddhism was pure vegetarian religion in past but now, almost all of the Buddhists including Lamas are non-vegetarians. Food preference is very small issue compared to class antagonism. Who will bother about issues such as food preference etc while there are many other severe issues? So, Buddhism failed to promote superstructural moralities such as pure vegetarianism etc. It is natural collapse of Buddhism and there is nothing positive transition in it. So, I didn’t agree with Mr Nagaraju’s thesis on Buddhism. Even Islam can be interpretated in multiple ways like Hinduism. So, I didnt even agree with his thesis on Islam.

  I will write later. Presently, my computer’s USB drive is not working and I am depending on phone for internet.

 35. మత గ్రంథాలలో ఏముందో చాలా మందికి తెలియదు కాబట్టే మతానికి రకరకాలుగా interpretations అర్థాలు చెప్పడం సాధ్యమవుతోందని నేను ఇప్పటికీ నమ్ముతాను. నేను మను ధర్మశాస్త్రం చదివాను. అందులో చతుర్వర్ణ వ్యవస్థ ఉండాలని వ్రాయబడి ఉంది కానీ కుల వ్యవస్థ ఉండాలని వ్రాయబడలేదు. ఇప్పటి మనువాదులు (వాళ్ళకి మను ధర్మశాస్త్రంలో ఏముందో తెలుసని అనుకోను) కుల వ్యవస్థనే సమర్థించడం కనిపిస్తోంది. మను ధర్మశాస్త్రంలో శూద్రుల గురించి చాలా చెత్తగానే వ్రాయబడి ఉంది. శూద్రుల గురించి చెత్తగా వ్రాయబడిన ఆ వ్రాతలు చతువర్ణ వ్యవస్థ యొక్క జస్టిఫికేషన్ కోసం వ్రాయబడినవి. అవి కుల వ్యవస్థ యొక్క జస్టిఫికేషన్ కోసం వ్రాయబడలేదు. అయినా మను ధర్మశాస్త్రం పేరు చెప్పి కుల వ్యవస్థని జస్టిఫై చేసేవాళ్ళు ఉన్నారు. మను ధర్మశాస్త్రం ఎప్పుడు వ్రాయబడినదో తెలియదు. ఒక చరిత్రకారుడు అది 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడినదని అంటాడు, ఇంకో చరిత్రకారుడు అది 3000 సంవత్సరాల క్రితం వ్రాయబడినదని అంటాడు. మినిమమ్ 2000 సంవత్సరాలని లెక్క వేసుకుందాం. ఈ 2000 సంవత్సరాలలో మను ధర్మశాస్త్ర గ్రంథంలో ఎలాంటి మార్పులూ, చేర్పులూ జరగలేదు. దయానంద సరస్వతి అనే సంఘ సంస్కర్త మను ధర్మశాస్త్రంలో మార్పులు చెయ్యాలని అన్నాడు. కానీ ఏ మార్పులు చెయ్యాలో సూచించకుండానే చనిపోయాడు.

  మతంతో సంబంధం లేకుండా సంప్రదాయాలలో మాత్రం మార్పులు వచ్చాయి. wife swapping (ఒకడి భార్యతో ఇంకొకడు పడుకోవడం) యూరోప్‌లోనే కాదు, ఒకప్పుడు ఆంధ్ర దేశంలో కూడా ఉండేది. ఆ ఆచారం నిషేధించబడినది. తాపీ ధర్మారావు గారు వ్రాసిన రవికెల పండగ కథ చదివితే ఈ విషయం అర్థమవుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s