అమెరికా రాయబారి హత్యతో ఉనికిని చాటుకుని పురోగమిస్తున్న గడాఫీ అనుకూల ‘గ్రీన్ రెసిస్టెన్స్’ -1


US ambassador John Christopher Stevens -Telegraph

ప్రపంచ వాణిజ్య సంస్ధ జంట టవర్లపై దాడులు జరిగి సెప్టెంబర్ 11, 2012 తో 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. అదే రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు లిబియాలో రెండో అతి పెద్ద పట్టణమైన బెంఘాజిలో అమెరికా రాయబారి కార్యాలయంపై విధ్వంసకర దాడులు జరిగాయి. దాడిలో అమెరికా రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్ దుర్మణం చెందాడు. సంవత్సరం పైగా లిబియా ప్రజలపైనా, ప్రభుత్వంపైనా నాటో యుద్ధ విమానాల సాయంతో ముస్లిం టెర్రరిస్టు సంస్ధలు సాగించిన విధ్వంసకాండకీ, సామూహిక జనహననానికీ క్రిస్టఫర్ స్టీవెన్స్ ప్రత్యక్ష వ్యూహకర్త. అతని చావు లిబియా ప్రజల్లో సంతోషాతిరేకాలు నింపితే పశ్చిమ సామ్రాజ్యవాద పాలనా వ్యవస్ధల్లో ఆందోళన రేకెత్తించింది.

గడాఫీ దుష్టపాలననుండి లిబియాను విముక్తి చేశామని చెప్పుకున్న తర్వాత అత్యంత ముఖ్యమైన రాయబారి మిలట్రీ దాడిగా చెప్పదగిన దాడిలో దుర్మరణం చెందడంతో మొదట పశ్చిమ సామ్రాజ్యవాద ప్రభువుల నోళ్లకు మాటలు కరువయ్యాయి. అమెరికాతో సహా అనేకదేశాలు, పత్రికలు తమ తమ ప్రయోజనాల దృక్కోణాలను అనుసరించి తలా ఒక ప్రకటన చేశాయి. అయితే వాస్తవానికి ఇది గడాఫీ విధేయులు ‘తహ్లూబ్’ అనే సంస్ధ నీడలో జరిపిన దాడి అనీ, గడాఫీ మరణం తర్వాత నుండి నాటో దురాక్రమణకు వ్యతిరేకంగా వారు దేశవ్యాపితంగా చురుకైన ప్రతిఘటన ఇస్తున్నారని తర్వాత్తర్వాత వెల్లడయింది. గ్రీన్ రెసిస్టెన్స్ గా పిలవబడుతున్న తహ్లూబ్ మిలిటెంట్లు గడాఫీ మద్దతుదారులకు నిలయమయిన సిర్టే, బాని వాలిద్ పట్టణాలు కేంద్రంగా లిబియా అంతటా గణనీయమైన స్ధాయిలో ప్రతిఘటనను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిఘటన అసలు లేనేలేదని నమ్మడానికీ, నమ్మించడానికీ పశ్చిమ సామ్రాజ్యవాదాలు శతధా ప్రయత్నిస్తున్నాయి.

అవకాశవాద ప్రకటనలు

దాడి అనంతరం కొంత తెప్పరిల్లాక ఇది మిలిటెంట్ల అవకాశవాద దాడి అని అమెరికా మొదట ప్రకటించింది. ఒక యూదు దురహంకారి రూపొందించిన ముస్లిం వ్యతిరేక సినిమా ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ కు నిరసనగా తమ రాయబార కార్యాలయం ముందు గుమికూడిన ప్రజలు అవకాశం చూసుకుని దాడి చేశారని అధ్యక్షుడు ఒబామా ప్రకటించాడు. లిబియాలో నాటో ప్రతిష్టించిన బ్యూరోక్రాట్లు విదేశీ టెర్రరిస్టుల దుష్కార్యం అని ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు కొందరు ‘ఇది ఆల్-ఖైదా చేసిన దాడి’ అని ప్రకటించారు. సి.ఎన్.ఎన్ లాంటి పత్రికలు కూడా ఆల్-ఖైదాపై గురిపెట్టాయి. బ్రిటన్ గార్డియన్ పత్రిక ‘ఒక సంఘటిత టెర్రర్ నెట్ వర్క్ చేసిన దాడి’ అని పేర్కొంది. టర్కీ ప్రభుత్వం అయితే ఇంకొంత దూరం పోయి సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ జరిపించిన దాడి అని ప్రకటించింది.

ఇజ్రాయెల్ ప్రభుత్వం లెబనాన్ హిజ్బోల్లా చేసిన దాడి అని ప్రకటించింది. ‘గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్’  (గల్ఫ్ దేశాల కూటమి) ఇరాన్ చేయించిన దాడి అని ప్రకటించింది. అనేకమంది ప్రగతి కాముకులు, ప్రత్యామ్నాయ వార్తా సంస్ధలు ‘సామ్రాజ్యవాద కుట్రలు తిప్పికొట్టిన ఫలితంగా బెంఘాజీ ఇస్లామిస్టులు చేసిన హత్య’గా పేర్కొన్నారు. లండన్ లో ఈక్వడార్ ఎంబసీ పై బ్రిటన్ ప్రభుత్వం జరిపిన పోలీసు దాడికి అమెరికా మద్దతుగా ఉన్నందుకు జరిగిన దాడి అని వికీలీక్స్ ప్రకటించింది. జూన్ 4, 2012 తేదీన లాడెన్ అనుచరుడయిన ‘అబు యాహ్యా అల్-లిబి’ (లిబియాలో జన్మించాడు) ని అమెరికా డ్రోన్ పాకిస్ధాన్ లో చంపేసిందనీ దానికి ప్రతీకారంగానే ఆల్-ఖైదా స్టీవెన్స్ ను చంపిందని కొన్ని పత్రికలు ప్రకటించాయి. ఇవన్నీ ఆయా దేశాలు, సంస్ధలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా పరోక్షంగా వ్యక్తం చేసిన కోరికలని ఇక్కడ అర్ధం చేసుకోవచ్చు.

ఆల్-ఖైదా పాత్ర!?

ఇన్ని రకాల ప్రకటనల మధ్యలో ఒబామా కూడా ‘టెర్రరిస్టు దాడి’ అనే వాదన వద్ద ప్రస్తుతం స్ధిరపడ్డాడు. ఒబామా మారిన ప్రకటనల వెనుక ఆయన ఎన్నికల ప్రయోజనాలు ఉన్నాయి. పధకం ప్రకారం జరిగిన దాడి అని చెబితే అది టెర్రరిస్టులు చేసిన దాడి అయినా ఒబామా ప్రభుత్వ వైఫల్యంగా దానిని అమెరికా ప్రజల్లో ప్రచారం చేయడానికి ఒబామా ప్రత్యర్ధి రోమ్నీకి అవకాశం దొరుకుతుంది. కానీ రోమ్నీ మరో అవకాశం దొరకబుచ్చుకున్నాడు. అమెరికన్ల టెర్రరిస్టు భయాన్ని సొమ్ము చేసుకోవడానికి ‘ఇది ఆల్-ఖైదా టెర్రరిస్టులు చేసిన దాడి అయినప్పటికీ ఎన్నికలకోసం లిబియాలో టెర్రరిస్టుల ఉనికిని ఒబామా నిరాకరిస్తున్నాడని’ రోమ్నీ ప్రచారం మొదలుపెట్టాడు. దానితో ఒబామా కూడా (ఆల్-ఖైదా అని చెప్పకుండా) టెర్రరిస్టు చర్య గా ప్రకటించాడు. ఒబామా, రోమ్నీ లు ఏమి చెప్పినా అంతిమ పరిశీలనలో అవన్నీ లిబియాలో వాస్తవ పరిస్ధితినుండి పక్కకు మళ్లించేవే.

నిజానికి ఆల్-ఖైదా దాడి అని చెప్పడానికి ఏ విధంగా చూసినా అవకాశం లేదు. ఆల్-ఖైదా అనేది అమెరికా, బ్రిటన్ లు 1980 లనుండి పెంచి పోషించిన కిరాయి సైనికుల సంస్ధ. మాజీ అధ్యక్షుడు రీగన్ ఆల్-ఖైదా టెర్రరిస్టులను హీరోలుగా స్వాతంత్ర్యపోరాట యోధులుగా అభివర్ణించడం గుర్తుకు తెచ్చుకోవలసిన విషయం. అమెరికా, బ్రిటన్ లు ఆల్-ఖైదా మిలిటెంట్లకు ఒక గురుతర బాధ్యతను అప్పజెప్పాయి. తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాల్లో చొరబడి విధ్వంసక చర్యలతో ప్రభుత్వాలను అస్ధిరం చెయ్యడం ఆల్-ఖైదా పని. బాల్కన్స్, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా, సిరియా, చెచెన్యా, సోమాలియా, సూడాన్ మొదలైన దేశాల్లో ఆల్-ఖైదా చేసిందీ, చేస్తున్నదీ అదే. ఆల్-ఖైదా నాయకుడు ఐమన్ ఆల్-జవహరి అనేకసార్లు గడాఫీని చంపేయాలని పిలుపిచ్చాడు. ఇపుడాయన సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ ను చంపేయాలని పిలుపులిస్తున్నాడు. ఆయన జారీ చేసే వీడియో, ఆడియో ప్రకటనలకు ఫైనాన్స్ చేసేది నాటో సామ్రాజ్యవాదులేనని, ఆయన ఎక్కడ దాగునేదీ కూడా నాటో రహస్యమేననీ కెనడాకు చెందిన ‘గ్లోబల్ రీసెర్చ్’ లాంటి సంస్ధలు చెబుతున్నాయి.

సౌదీ అరేబియా ఫ్యూడల్ తరహా ఇస్లామిస్టులయిన  సలాఫిస్టులు, వహాబీస్టులు కూడా నాటో మిత్రపక్షమే కనుక, వారు కూడా గడాఫీ, అస్సాద్, ఇరాన్, హిజ్బొల్లాలకు వ్యతిరేకులే కనుక వారి పాత్ర కూడా ఇందులో లేదని గ్లోబల్ రీసెర్చ్ తెలిపింది. లిబియాలో సలాఫిస్టుల ఉనికికి ప్రత్యక్ష ఉదాహరణ ‘ఆన్సర్ ఆల్ షరియా.’ ఈ పేరు కింద పని చేసే వివిధ మిలిషియాలు లిబియాలో అచ్చమైన షరియా చట్టాన్ని అమలు చేయాలని ప్రబోధిస్తాయి. ఇవి నాటోకు అనుకూలం కాగా గ్రీన్ రెసిస్టెన్స్ కి వ్యతిరేకం. ఈ నేపధ్యంలో, గడాఫీని కూలదోసి లిబియాలో ముస్లిం ఛాందసవాదం పునరుద్ధరించడానికి తగిన ఆయుధ సంపత్తినీ, గూఢచార సహకారాన్నీ, అంతర్జాతీయ మద్దతునూ కూడగట్టడంలో ప్రత్యక్ష, ప్రధాన పాత్ర పోషించిన క్రిస్టఫర్ స్టీవెన్స్ ను చంపడానికి ఆల్-ఖైదా, దాని సోదర సంస్ధలు పూనుకున్నాయని చెప్పడం అత్యంత హాస్యాస్పదమైన బుకాయింపు. స్వయంగా అత్యాధునిక యుద్ధవిమానాలతో లిబియాలో విధ్వంసక దాడులు నిర్వహించి సహకరించిన అమెరికా ప్రభుత్వ అధికారిని మట్టుపెట్టడం అంటే అవి తమ వేలితే తమ కన్ను పొడుచుకున్నట్లే.

గ్రీన్ రెసిస్టెన్స్ పనే

సెప్టెంబర్ 11 వార్షిక దినానే బెంఘాజీ దాడి జరగడం యాదృచ్ఛికంగా జరిగినదే తప్ప రెండింటికీ సంబంధం లేదు. గడాఫీ ప్రభుత్వంలో గూఢచార విభాగానికి అధిపతిగా వ్యవహరించిన ‘అబ్దుల్లా ఆల్-సెనౌస్సీ’ మార్చి 17, 2012 తేదీన మారిటానియాలో అరెస్టయ్యాడు. మారిటానియాలో రక్షణ కోరుతూ నోక్చోట్ విమానాశ్రయంలో దిగినవెంటనే ఆయనను మారిటానియా ప్రభుత్వం అరెస్టు చేసింది. బెంఘాజీ దాడికి ఆరు రోజుల ముందు ఆయనను నాటో ప్రతిష్టిత లిబియా అధికారులకు బూటకపు విచారణ నిమిత్తం అప్పగించింది. సెనౌస్సీ అప్పగింతతో గ్రీన్ రెసిస్టెన్స్ మిలిటెంట్లు ఆగ్రహం చెందారు. అంతేకాకుండా బెంఘాజీ దాడికి ముందు రోజే గడాఫీ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ అధికారులను (అబ్దుల్ అతి అల్-ఓబీదీ, మహమ్మద్ జ్వాయ్) విచారణ చేయనున్నట్లు లిబియా ప్రకటించింది. ఒబీదీ గడాఫీ పాలనలో ప్రధానమంత్రిగా, విదేశీ మంత్రిగా ప్రభుత్వాధిపతిగా పని చేయగా, జ్వాయ్ పార్లమెంటు అధిపతిగా పని చేశాడు. లాకర్ బీ (స్కాట్లాండ్) విమాన ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడానికి 2.7 బిలియన్ డాలర్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వీరిపై నేరారోపణ చేశారు.

గడాఫీ పాలనలో ప్రధానిగా పనిచేసిన మరొక అధికారి ‘బాగ్దాది ఆలీ మహ్ముది’ నాటో దాడులనుండి, టెర్రరిస్టు మిలీషియాల నుండి తప్పించుకుని ట్యునీషియా సరిహద్దు దాటుతుండగా 21 ఆగస్టు 2011 తేదీన అరెస్టయ్యాడు. అక్రమంగా సరిహద్దు దాటాడని చెప్పి ట్యునీషియా ప్రభుత్వం ఆయనను ఆరు నెలలు జైల్లో ఉంచింది. అప్పీలు తర్వాత ఆరోపణలు కొట్టేసి విడుదల చేశారు. అయితే నాటో మద్దతుదారు అయిన ట్యునీషియా ప్రధాని హమాడి జెబాలి అకస్మాత్తుగా గత జూన్ ఆఖరులో ఆయనను మళ్ళీ అరెస్టు చేసి ట్రిపోలికి తరలించాడు.  అమెరికా యుద్ధాలతో ప్రపంచం మీదికి తెగబడాలని నిరంతరం ప్రబోధించే యుద్ధపిపాసులైన రిపబ్లికన్ సెనేటర్లు మెక్ కెయిన్ (ఒబామాపై ఓడిన వ్యక్తి), లీబర్మేన్ లకు ట్యునీషియా అధ్యక్షుడు అత్యంత విశ్వాసపాత్రుడని గ్లోబల్ రీసెర్చ్ సంస్ధ తెలిపిన విషయం ఇక్కడ సందర్భోచితం. అలీ మహ్ముది తరలింపును చట్టవిరుద్ధమని ట్యునీషియా అధ్యక్షుడు మొన్సెఫ్ మర్జౌకి తీవ్రంగా విమర్శించడం గమనార్హం.

ఈ విధంగా నాటో, ఆల్-ఖైదా దాడుల నుండి తప్పించుకున్న గడాఫీ విధేయ అధికారులపై నాటో కక్షగట్టి చర్యలకు దిగడంతో గ్రీన్ రెసిస్టెన్స్ తక్షణ ప్రతీకారానికి దిగింది. లిబియా వినాశనాన్ని పర్యవేక్షించిన క్రిస్టఫర్ స్టీవెన్స్ వారికి సరైన టార్గెట్ గా కనపడ్డాడు. లిబియాలో విధ్వంసం సృష్టించే లక్ష్యంతో ఏప్రిల్ 2011 లో గ్రీకు సరుకు రవాణా నౌకలో స్టీవెన్స్ ప్రత్యేకంగా ఏతెంచాడు. నాటో మద్దతుతో చెలరేగిన టెర్రరిస్టులను సమన్వయం చేస్తూ స్టీవెన్స్ ఏడునెలల పాటు నాటో వైమానిక దాడులకు తగిన ఏర్పాట్లు చేశాడు. లిబియా విధ్వంసం తర్వాత స్టీవెన్స్ ట్రిపోలీలోని ఒక హోటల్ ను కార్యాలయంగా మార్చుకున్నాడు. అమెరికా ఎంబసీపై గ్రీన్ రెసిస్టెన్స్ దాడి చేసి కూల్చివేయడంతో స్టీవెన్స్ కి హోటల్ ని ఎంచుకోక తప్పలేదు. అయితే హోటల్ వద్ద కూడా కారుబాంబుతో గ్రీన్ రెసిస్టెన్స్ దాడి చేసింది. దానితో స్టీవెన్స్ బెంఘాజికి తరలివెళ్ళాడు. గడాఫీ కూల్చివేతకు కేంద్రంగా పనిచేసిన బెంఘాజీ నగరం తనకు రక్షణ కల్పిస్తుందని స్టీవెన్స్ నమ్మాడు. ఇస్లాం జీహాదిస్టులకు కేంద్రంగానూ, అమెరికా అనుకూల నగరంగానూ బెంఘాజికి పేరు ఉండడం దానికి కారణం. 1980ల్లో నాటో కోసం పనిచేసిన ఆఫ్ఘన్ ముజాహిదీన్ కి, ఆ తర్వాత ఆల్-ఖైదాకి కూడా ఇక్కడినుండి కేడర్ సరఫరా అయిందని ప్రతీతి.

అయితే గ్రీన్ రెసిస్టెన్స్ ను స్టీవెన్స్ తక్కువగా అంచనా వేశాడు. బెంఘాజీ వీధుల్లో స్వేచ్ఛగా జాగింగ్ చేయగల తనను ఎవరూ ఏమీచేయలేరని ఆయన భావించినట్లుంది. ‘శాన్ ఫ్రాన్ సిస్కో క్రానికల్’ పత్రిక ప్రకారం స్టీవెన్స్, అతని అమెరికా సిబ్బంది ఆ సమయంలో అక్కడే ఉన్నారని అందరికీ తెలుసు. దుష్ట నాటోతోపాటు బెంఘాజీ విద్రోహులకు కూడా గుణపాఠం చెప్పాలని గ్రీన్ రెసిస్టెన్స్ భావించింది. ఫలితమే జాన్ క్రిస్టఫర్ స్టీవెన్స్ హత్య. రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు (ఆర్.పి.జి), తుపాకులతో స్టీవెన్స్ నివాస, కార్యాలాయాలపై పక్కా లక్ష్యశుద్ధితో గ్రీన్ రెసిస్టెన్స్ చేసిన దాడి ప్రపంచాన్ని, ముఖ్యంగా పశ్చిమ దేశాలను నివ్వెరపరించింది. గ్రెనేడ్లతో మొదట సిబ్బందిని నిరుత్తరులను చేసి అనంతరం ఒక్కో భవనంపై దాడులు సాగిస్తూ చేసిన దాడిలో స్టీవెన్స్ తప్పించుకోలేకపోయాడు. దట్టమైన పేలుడు పొగమధ్య ఊపిరి ఆడక కొట్టుకుంటున్న స్టీవెన్స్ ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఊపిరితిత్తుల్లో పూర్తిగా పొగ నిండడంతో చచ్చిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. స్టీవెన్స్ హత్య ఒక ఎత్తు కాగా ఆ తర్వాత రోజు అమెరికన్ల ‘సేఫ్ హౌస్’ పైన కూడా గ్రీన్ రెసిస్టెన్స్ చేసిన దాడి మరొక ఎత్తు. సేఫ్ హౌస్ పై దాడి పశ్చిమ పత్రికలను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. సేఫ్ హౌస్ నుండి పారిపోతున్న అమెరికా సిబ్బంది నడుస్తున్న మార్గంలోనే గురిచూసి ఆర్.పి.జి దాడులు చేయడం పట్ల పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ఆశ్చర్యాందోళనలు వ్యక్తం చేశాయి.

(ఇంకా ఉంది)

5 thoughts on “అమెరికా రాయబారి హత్యతో ఉనికిని చాటుకుని పురోగమిస్తున్న గడాఫీ అనుకూల ‘గ్రీన్ రెసిస్టెన్స్’ -1

 1. “ఆయన జారీ చేసే వీడియో, ఆడియో ప్రకటనలకు ఫైనాన్స్ చేసేది నాటో సామ్రాజ్యవాదులేనని, ఆయన ఎక్కడ దాగునేదీ కూడా నాటో రహస్యమేననీ కెనడాకు చెందిన ‘గ్లోబల్ రీసెర్చ్’ లాంటి సంస్ధలు చెబుతున్నాయి…..”

  ఈ వాక్యం సరిగా లేదు గమనించండి.

  మీ వ్యాసం చాలా ఉపయోగకర సమాచారంతో ఉంది. అభినందనలు.

  ఈ రోజు సామ్రాజ్యవాదానికి “ఇస్లాం” రూపంలో ప్రతిఘటన ఎదురవుతుందన్న విషయం పాక్షిక సత్యమేనని మీ వ్యాసమే తెలియ జేస్తుంది. పరస్పరం వ్యతిరేకంగా పని చేసే శక్తులు ఇక్కడ కనిపిస్తున్నాయి.

  సామ్రాజ్యవాదానికి మరొక సవాల్ దక్షణ అమెరికాలోని వివిధ దేశాలలో జరిగుతున్న ప్రయోగాల నుండి ఎదురవుతున్నది. అయితే ఇది పైన చెప్పిన దానితో పోలిస్తే సంక్లిష్టమైందేమీ కాదు. పైగా ప్రజాస్వామిక వాదులకు అవి ఎంతగానో భరోసాను కలిగిస్తున్నాయి.

  ఇక వివిధ విప్లవగ్రూపులు చేస్తున్న పోరాటం సరేసరి.

  అయితే విడివిడి అంశాలపై మీరు రాస్తున్న వ్యాసాలు కొన్ని సార్లు ఇంతకు ముందు రాసిన అంశాలతో విబేధించే విధంగా ఉన్నాయి(ఉదా: తాలిబాన్ పోరాటం లాంటివి). ఈ సమస్య నుండి పాఠకులను బయట పడేయడానికి స్థూలంగా పైనున్న మూడు రకాల పోరాటాలనూ కలిపి విశ్లేషిస్తూ ఒక అవగాహనను అందించగలరేమో ప్రయత్నించండి. ఇది పాఠకులకు ఉపయోగపడుతుంది.

 2. “ఆయన జారీ చేసే వీడియో, ఆడియో ప్రకటనలకు ఫైనాన్స్ చేసేది నాటో సామ్రాజ్యవాదులేనని, ఆయన ఎక్కడ దాగునేదీ కూడా నాటోకి పరిమితమైన రహస్యమేననీ కెనడాకు చెందిన ‘గ్లోబల్ రీసెర్చ్’ లాంటి సంస్ధలు చెబుతున్నాయి…..”

  నాగరాజు గారు, పై వాక్యంలో ‘కి పరిమితమైన’ (బోల్డ్ అక్షరాల్లో ఉన్నది) అని చేర్చాను. ఇపుడు మీరు చెప్పిన అయోమయం తొలగిపోతుందా? సరిగా లేదని ఎందుకన్నారో అర్ధం కాలేదు. అదనపు చేర్పు లేకపోయినా అదే అర్ధం వస్తుందనుకుంటా కదా.

  —-

  ఇస్లాం రెసిస్టెన్స్, టెర్రరిజం అంశాలపై మీరు చెప్పిన అయోమయం (విభేదం కాదనుకుంటాను) ఉన్న విషయం నిజమే. అయితే ఆ అయోమయం కూడా అసలు విషయానికి సంబంధించినదే. మీరు గతంలో చేసిన ఒక వ్యాఖ్యలో అలాంటి అయోమయాన్ని తొలగించే వివరణ ఉంది. దానిని డెవలప్ చేసి మరో విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను.

 3. “నాటోకి మాత్రమే పరిమితమైన” అనే మీ చేర్పు సరైన అర్థాన్ని ఇస్తుంది.

  అయోమయం పరస్పర విబేధాలకు కూడా దారి తీస్తుంది.ముఖ్యంగా ఇస్లాం రెసిస్టేన్స్ విషయంలో. దీనికి నేను కూడా మినహాయింపు కాదు. నిత్యం అధ్యయనానికి వీలు పడే వారికి మాత్రమే సరైన సమాచారం అందుబాటులో ఉంటుంది. దానిద్వారా సరిగా విశ్లేషించడానికి వీలవుతుంది.
  మీరు ఆ పనిలో ఉన్నారు. అందుకే మీకు సలహా ఇవ్వడానికి సాహసించాను.
  ఇస్లాం శక్తులు కొన్ని చోట్ల అమెరికాకు వ్యతిరేకంగా, మరికొన్ని చోట్ల అనుకూలంగా (ఒకే సమయంలో) పనిచేస్తున్నాయి. ఈ గందరగోళాన్ని వివరించగలరని కోరుతూ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s