అమెరికా రాయబారి హత్యతో ఉనికిని చాటుకుని పురోగమిస్తున్న గడాఫీ అనుకూల ‘గ్రీన్ రెసిస్టెన్స్’ -2


Photo: libyanfreepress.wordpress.com

లిబియా ప్రధాని తొలగింపు

బెంఘాజీ దాడి తర్వాత రోజు లిబియా ప్రధానమంత్రి అబ్దుర్రహీమ్ ఎల్-కీబ్ పదవినుండి తొలగించబడ్డాడు. స్టీవెన్స్ హత్య విషయమై నాటో/అమెరికా చెప్పమన్నట్లు చెప్పకపోవడమే దానికి కారణం. స్టీవెన్స్ ను చంపింది గడాఫీ విధేయ గ్రీన్ రెసిస్టెన్సేనని మొదట లిబియా ప్రభుత్వ నేతలు ప్రకటించారు. అయితే గ్రీన్ రెసిస్టెన్స్ నీడలో లిబియా ప్రజలు ప్రతిఘటన ఇస్తున్నారన్న వాస్తవం నాటో పరువు తీస్తుంది. గడాఫీకి వ్యతిరేకంగా లిబియా ప్రజలు తిరుగుబాటు చేశారన్న పశ్చిమ దేశాల ప్రచారం అబద్ధమని రుజువవుతుంది. ముస్లిం టెర్రరిస్టు సంస్ధల పాలనలో లిబియా ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ప్రచారం కూడా అబద్ధమేనని ప్రపంచానికి తెలిసి వస్తుంది. అందువలన స్టీవెన్స్ హత్యకు గ్రీన్ రెసిస్టెన్స్  కారణమన్న ప్రకటనలను ఉపసంహరించుకోవాలనీ, టెర్రరిస్టులే ఈ పని చేశారని చెప్పాలని నాటో, అమెరికాల నుండి లిబియా పాలకులకి ఆదేశాలు వెళ్ళాయి. ఈ ఆదేశాలను అనేకమంది తు.చ తప్పకుండా పాటించారు.

ఉదాహరణకి గడాఫీ విధేయ ‘తహ్లూబ్’ స్టీవెన్స్ హత్యకు కారణమని లిబియా ఉప హోమ్ మంత్రి వానిస్ ఆల్ షరీఫ్ సెప్టెంబర్ 12 ఉదయం ప్రకటించాడు. అల్ జజీరా చానెల్ ఈ ప్రకటనను ప్రసారం చేసింది. అధ్యక్షుడు మహమ్మద్ ఎల్-మెగారిఫ్, అమెరికాలో లిబియా రాయబారి అలీ ఔజాలి, ఐరాసలో లిబియా రాయబారి ఇబ్రహీం దబ్బాషి తదితరులంతా మొదట నిజమే చప్పారు. అయితే నాటోనుండి ఆదేశాలు వెళ్ళాక తమ ప్రకటనలను సవరించుకున్నారు. మూడు రోజుల తర్వాత బెంఘాజీ సందర్శించిన అధ్యక్షుడు మెగారిఫ్ ‘స్టీవెన్స్ హత్యకు ఆల్-ఖైదా కారణం’ అని ప్రకటించాడు. ఇతర అధికారులు కూడా విదేశీ టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పడం మొదలు పెట్టారు.

అయితే ప్రధాని అబ్దుర్రహీం నాటో వాదనను వినిపించడానికి నిరాకరించాడు. గడాఫీ విధేయులే స్టీవెన్స్ ని చంపారన్న తన ప్రకటనను తర్వాత రోజు కూడా కొనసాగించాడు. దానితో నాటో అతనిని ప్రధాని పదవినుండి తొలగించి తమ విధేయుడు ముస్తఫా అబుషాగుర్ ను నియమించింది. (ఈయన తన జీవితంలో అత్యధిక భాగం అమెరికాలో నివసించాడు. గడాఫీకి వ్యతిరేకి. అమెరికా ప్రతిష్టించిన ఇతర బ్యూరోక్రట్లలాగే ఈయన కూడా నాటో ప్రేరేపిత కిరాయి తిరుగుబాటు సందర్భంగా మే 2011లో లిబియాకి తిరిగి వెళ్ళాడు. అధ్యక్షుడితో పాటు ఇతర మంత్రులు, అధికారులు కూడా గడాఫీ పాలనలో అమెరికా, యూరప్ లలో తలదాచుకున్నవారే.) ఇంటర్ ప్రెస్ సర్వీస్ (ఐ.పి.ఎస్) లాంటి న్యూట్రల్ వార్తా సంస్ధలు తప్ప దాదాపు ఇతర పత్రికలు, చానెళ్లన్నీ నాటో వాదననే ప్రచారం చేస్తున్నాయి.

తమ పోరాటాన్ని తీవ్రం చేస్తామని గ్రీన్ రెసిస్టెన్స్ నాయకులు చెప్పినట్లు ఐ.పి.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది. బెంఘాజీ దాడికి ముందు కూడా ఐ.పి.ఎస్ వార్తా సంస్ధ గ్రీన్ రెసిస్టెన్స్ గురించి విస్తృతంగా వార్తలు ప్రచురించింది. లిబియాలో స్ధానిక మీడియాపైన గ్రీన్ రెసిస్టెన్స్ వార్తల విషయంలో ప్రభుత్వం నిర్బంధం అమలు చేస్తున్నదని, తహ్లూబ్ దాడుల గురించి ఫస్ట్ హేండ్ సమాచారాన్ని సేకరించకుండా, ఫోటోలు తీయకుండా విదేశీ విలేఖరులను అడ్డుకుంటున్నదనీ ఐ.పి.ఎస్ తెలిపింది. లిబియాలో వార్తా సేకరణకు గడాఫీ అడ్డంకులు సృష్టిస్తాడని గతంలో అబద్ధాలు ప్రచారం చేసిన పశ్చిమ కార్పొరేట్ మీడియా నాటో ప్రతిష్టిత కిరాయి ప్రభుత్వం మీడియాపై అమలు చేస్తున్న నిర్బంధం గురించి రాసిన పాపాన పోలేదు.

అమెరికా రాయబార కార్యాలయం అంటూ బెంఘాజీలో దాడి జరిగిన భవనాల గురించి పశ్చిమ మీడియా రాసింది కూడా అబద్ధమే. నిజానికి అది ఎంబసీ గానీ, కాన్సలేట్ గానీ కాదనీ, కనీసం కాంపౌండ్ కూడా కాదని తర్వాత కొన్ని పత్రికలు తెలిపాయి. అది కేవ్లమ్ అమెరికా అద్దెకు తీసుకున్న కొన్ని భవనాల సముదాయం మాత్రమేనని అవి తెలిపాయి. అమెరికా ఎంబసీ అంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం దానిపైన అమెరికాకి సార్వభౌమాధికారం ఉంటుంది. ఎంబసీ పైన దాడి అనగానే సార్వభౌమాధికారం పైన దాడి అనే అర్ధం వస్తుంది. ఈ అర్ధాన్ని ఉద్దేశ్యపూర్వకంగా రప్పించడం ద్వారా లిబియాలో సాగించిన విధ్వంసానికి మానసికపరమైన, భావోద్వేగపూరకమైన మద్దతు పొందడం లక్ష్యంగా పెట్టుకున్నారు. బెంఘాజీ దాడి తర్వాత పదుల సంఖ్యలో అమెరికా ప్రత్యేక బలగాలు అక్కడికి తరలివెళ్ళడానికి కూడా ఈ ‘రాయబార కార్యాలయంపై దాడి’ అనే పదబంధం మద్దతు సమకూర్చింది.

అసలు నిరసనలే లేవు

ముస్లిం వ్యతిరేక వీడియోపట్ల ఆగ్రహం చెంది లిబియా ప్రజలు అప్పటికప్పుడే తమ కాన్సలేట్ పై దాడి చేశారని వైట్ హౌస్ మొదట చేసిన ప్రకటన సత్యదూరం. ఎందుకంటే అసలక్కడ నిరసనలే జరగలేదు. దాడి జరిగినపుడు సో కాల్డ్ కాన్సలేట్ వద్దే కాక బెంఘాజీ మొత్తం మీద కూడా ప్రదర్శనలేవీ జరగలేదు. ఈ సంగతిని అమెరికా ఫాక్స్ న్యూస్ చానెల్ వెల్లడి చేసింది. గ్రీన్ రెసిస్టెన్స్ ఉనికిని దాచిపెట్టేందుకు ఉద్దేశించిన ఈ అబద్ధం ద్వారా ముస్లింలు మతిలేని హింసకు పాల్పడే రక్తపిపాసులన్న అర్ధం కూడా దాగి ఉంది. తద్వారా ‘నాగరికతల ఘర్షణ’ అంటూ అమెరికా మొదలుపెట్టిన మతిలేని ప్రచారానికి మద్దతును సమకూర్చుకునే లక్ష్యం ఇక్కడ ఉంది. గ్లోబల్ రీసెర్చ్ సంస్ధకు చెందిన విలేఖరులు మార్క్ రాబర్ట్సన్, ఫినియమ్ కన్నింగ్ హామ్ జరిపిన పరిశోధనలో కూడా నిరసనలు జరగలేదన్న వాస్తవం వెల్లడయింది. దాడికి గురయిన భవనాల గార్డులను వీరు కలిసి ఇంటర్వ్యూ చేశారు. ఎనిమిది మంది గార్డుల్లో అయిదుగురు బ్రిటిష్ సెక్యూరిటీ సంస్ధ అద్దెకు తీసుకున్న గార్డులు. ముగ్గురు ‘ఫిబ్రవరి 17 బ్రిగేడ్’ (నాటో అనుకూల టెర్రరిస్టు సంస్ధ) సభ్యులు. బ్రిటిష్ సంస్ధ గార్డుల్లో ఒకరు రెండు కాళ్లలోనూ బులెట్ గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెక్ క్లాచీ న్యూస్ సర్వీస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా తెలిపారు.

“అక్కడ నిరసనకారులు ఉన్నట్లయితే అమెరికన్లు అక్కడినుండి వెళ్లిపోయేవారే. కానీ అక్కడ చీమ కూడా లేదు. రాత్రి 9:35 కి 125 మంది దాకా వచ్చి దాడి చేసే వరకూ అక్కడ అంతా నిశ్శబ్దంగానే ఉంది. మెషీన్ గన్లు, గ్రెనేడ్లు, ఆర్.పి.జిలు, విమాన విధ్వంసక ఆయుధాలతో వారు దాడి చేశారు. భవనాల్లోకి గ్రెనేడ్లు విసరడంతో నేను తీవ్రంగా గాయపడి కుప్పకూలాను. తర్వాత వారు మెయిన్ గేటు గుండా దూసుకొచ్చారు. ఒక్కొక్క భవనంపైనా దాడి చేసుకుంటూ పోయారు.”

ది హిందూ పత్రిక కూడా నవంబర్ 1 తేదీన ప్రచురించిన Rise of the Libyan resistance అనే వ్యాసంలో ఈ ఇంటర్వ్యూని ఉటంకించింది. ఈ ఇంటర్వ్యూని బట్టి ‘స్పాంటేనియస్ ప్రొటెస్ట్’ అన్న అమెరికా ప్రచారం ఒట్టి అబద్ధమని స్పష్టం అవుతోంది. ఎంతో ముందుగా రూపొందించుకున్న పక్కా పధకం మాత్రమే ఇలాంటి దాడిని సుసాధ్యం చేయగలదు. తాను తోటమాలిని మాత్రమే అని చెప్పి తప్పించుకున్నానని పై సమాచారం ఇచ్చిన వ్యక్తి చెప్పినట్లు మెక్ క్లాచి న్యూస్ సర్వీస్ తెలిపింది. బెంఘాజీ భవన సముదాయం యజమాని మహమ్మద్ ఆల్ బిషారీ చెప్పిన విషయం కూడా పై సమాచారాన్ని ధ్రువపరుస్తోందని గ్లోబల్ రీసెర్చ్ సంస్ధ తెలిపింది.

ఉధృతంగా గ్రీన్ రెసిస్టెన్స్

నాటో విధ్వంసం తర్వాత లిబియాలో అనేక తెగలు, గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రజా జీవనం నిత్యం హింసాత్మక ఘర్షణలతో నిండిపోయింది. ప్రజలు దరిద్రంలోకి నెట్టబడ్డారు. గడాఫీ కాలంలో ఉపాధికోసం వచ్చిన ఆఫ్రికన్ నీగ్రో జాతి ప్రజలపై దారుణ అణచివేత అమలవుతోంది. టెర్రరిస్టు మిలీషియాలు నీగ్రో కార్మికులను జైళ్ళలో కుక్కి హింసించడం నిత్యకృత్యంగా మారింది. గడాఫీ పాలనలో ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక మానవాభివృద్ధి సాధించిన దేశంగా పేరుపొందిన లిబియా ఇపుడు దరిద్ర దేశంగా అవతరించింది. గడాఫీ పాలనలో అనేక సబ్సిడీలు, సదుపాయాలు, సంక్షేమ చర్యల రూపంలో ఆయిల్ వనరులనుండి ప్రజలకు గణనీయమైన వాటా దక్కింది. నాటో ప్రతిష్టిత ప్రభుత్వ పాలనలో ఈ ప్రజల వాటా రద్దయి అమెరికన్, యూరోపియన్ సామ్రాజ్యవాద కంపెనీలకు చేరుతోంది. లిబియా ప్రజలకు దక్కిన అత్యున్నతమైన విద్యా, వైద్య సౌకర్యాలు రద్దు కావడంతో వివిధ పార్స్వాలలో లిబియా ప్రజలు దారిద్ర్యంలోకి నెట్టబడుతున్నారు.

ఈ పరిస్ధితుల నేపధ్యంలో గ్రీన్ రెసిస్టెన్స్ క్రమంగా పుంజుకుంటోంది. భూముల కోసం వివిధ మిలీషియాల మధ్య జరుగుతున్నా ఘర్షణలతో పాటు బర్బరులు, అరబ్బుల మధ్య పాత ఘర్షణలు కొనసాగుతున్నాయి. గ్రీన్ రెయిస్టెన్స్ ను వీటికి భిన్నంగా చూడవలసిన అవసరం ఉంది. వాస్తవానికి గ్రీన్ రెసిస్టెన్స్ కూడా ఒక పాలకపక్షానికి ప్రతినిధే. స్ధూలంగా గడాఫీ హయాంలో అధికారం అనుభవించిన వర్గాలకు గ్రీన్ రెసిస్టెన్స్ ప్రతినిధిగా చూడవచ్చు. ఈ వర్గాలు నాటో ఆధిపత్యంతో రాజీకి సిద్ధపడకుండా స్వతంత్ర ప్రతిఘటనకు సిద్ధపడడం ఆహ్వానించదగిన పరిణామం. చివరిదశలో బలహీనపడినప్పటికీ, నాలుగు దశాబ్దాల పాటు గడాఫీ సాగించిన అమెరికా వ్యతిరేక ప్రతిఘటన గ్రీన్ రెసిస్టెన్స్ కు పునాదిగా ఉన్న సంగతి విస్మరించరాదు. ఈ పునాదితోనే గడాఫీ అనుకూల తెగలు, పట్టణాలు నాటో అనుకూల మిలీషియాలతో తలపడుతున్నాయి. 2012 లో గ్రీన్ రెసిస్టెన్స్ దేశవ్యాపితంగా అనేక దాడులను నిర్వహించింది. గడాఫీకి ద్రోహం చేసి నాటో పంచన చేరిన అధికారుల ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు చేసి చంపేసింది.

గ్రీన్ రెసిస్టెన్స్ ఆద్వర్యంలో జరిగిన కొన్ని ప్రధాన ఘటనలను ప్రస్తావించుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. మార్చి 18, 2012 తేదీన ట్రిపోలిలో గడాఫీ అనుకూల ప్రాంతం అయిన అబు సలీం వద్ద స్ధానికులు గ్రీన్ రెసిస్టెన్స్ ఆధ్వర్యంలో జింటాన్ నుండి వచ్చిన నాటో అనుకూల మిలీషియాతో తలపడ్డారు. నాటో టెర్రరిస్టులు కొందరు ఈ ఘర్షణలో చనిపోయారని రష్యా టుడే పత్రిక తెలిపింది. ఐరాస అధిపతి బాన్ ప్రతినిధి ఇయాన్ మార్టిన్ ప్రయాణిస్తున్న కారుపైన ఏప్రిల్ లో రోడ్డు పక్క బాంబుతో దాడి జరిగింది. ఇది గ్రీన్ రెసిస్టెన్స్ పనేనని ట్యునీషియా పత్రికలు వెల్లడించాయి. ఏప్రిల్ 29, 2012 తేదీన గడాఫీ పాలనలో ఆయిల్ మంత్రిగా పనిచేసిన శుక్రి ఘానేమ్ శవం డాన్యూబ్ నదిలో తేలింది. ఈయన గడాఫీకి విద్రోహిగా మారి మే 2011లో నాటో పక్షాన చేరాడు. అనంతరం లండన్, వియన్నా నగరాల్లో సుఖ జీవనం గడుపుతూ డాన్యూబ్ లో శవమై తేలాడు. ఈ చావుకు తామే కారణమని గ్రీన్ రెసిస్టెన్స్ ప్రకటించింది.   ట్రిపోలిపై నాటో బలగాలు దాడి చేసిన సందర్భంగా వారికి ప్రతిఘటన ఇవ్వకుండా తన ఆధ్వర్యంలోని 3,800 మంది గార్డులను నిరోధించిన మాజీ ట్రీపోలి గవర్నర్ అల్బర్రాని షాకల్ మే 2, 2012 న హత్యకు గురయాడు. ఈ హత్యకు కూడా తామే బాధ్యులమని గ్రీన్ రెసిస్టెన్స్ ప్రకటించింది.

సి.ఐ.ఏ, ఎం.ఐ6 లకు కవర్ గా పని చేసే రెడ్ క్రాస్ యొక్క బెంఘాజీ కార్యాలయంపై మే 22 తేదీన ఆర్.పి.జి లతో దాడి చేశారు. మే 26 తేదీన జరిగిన దాడినుండి లిబియా పశ్చిమ ప్రాంత మిలట్రీ కౌన్సిల్ అధిపతి ముఖ్తార్ ఫెర్నానా తృటిలో తప్పించుకున్నాడు. జూన్ 5 న ట్రిపోలి లో అమెరికా ఆధ్వర్యంలోని ఒక భవనంపై గ్రీన్ రెసిస్టెన్స్ బాంబు దాడి జరిపింది. జూన్ 11 తేదీన బెంఘాజీలో బ్రిటిష్ రాయబారి డొమినిక్ అస్క్విట్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై గ్రీన్ రెసిస్టెన్స్ ఆర్.పి.జి దాడి జరిగింది. ఇందులో తన బాడీ గార్డులిద్దరు గాయపడగా రాయబారి తప్పించుకున్నాడు. ఎంబసీకి కొద్ది మీటర్ల దూరంలోని జరిగిన ఈ దాడి ఇస్లామిస్టు మిలిటెంట్లు చేశారని రాయిటర్స్ పొంతనలేని కధనం ప్రచురించింది. నాటో సాయం పొందిన బెంఘాజీ ఇస్లామిస్టులు తిరిగి నాటో రాయబారులపై ఎందుకు దాడులు చేస్తారో చెప్పడంలో రాయిటర్స్ విఫలం అయింది. జూన్ 22 తేదీన అబ్దుల్ ఫతా యూనిస్ (గడాఫీకి ద్రోహం చేసిన ఈయన జులై 2011లో హత్యకు గురయ్యాడు) హత్యపై విచారణ చేస్తున్న జడ్జి బెంఘాజీలోనే హత్యకు గురయ్యాడు. గడాఫీ హయాంలో మిలటరీ ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసి నాటో పక్షం చేరిన సులేమాన్ బుజ్రైదా జులై 28 తేదీన బెంఘాజీ లో ఒక మసీదు వద్ద చంపబడ్డాడు. ఈ దాడులకు గ్రీన్ రెసిస్టెన్స్ ది బాధ్యత కాగా మిలీషియాల్లోనే గడాఫీ వ్యతిరేకులు సాగిస్తున్న దాడులుగా పశ్చిమ పత్రికలు చెబుతున్నాయి. అయితే నాటో ప్రతిష్టించిన అధికారులను నాటోకు మద్దతుదారులైన ఇస్లామిస్టులు ఎందుకు చంపుతారన్న దానికి అవి నమ్మదగ్గ కారణాలేవీ చెప్పవు. పాత కక్షలు తీర్చుకుంటున్నారని చెప్పడమే గానీ సరైన వివరణ ఇవ్వవు. ఐ.పి.ఎస్ లాంటి వార్తా సంస్ధలు చెప్పేవరకూ బైటి ప్రపంచానికి అందే పశ్చిమ వార్తా కధనాలు గందరగోళం సృష్టిస్తున్నాయి.

ఆగస్టు నెలలో గ్రీన్ రెసిస్టెన్స్ విస్తృతంగా దాడులు నిర్వహించింది. సెక్యూరిటీ భవనాలు, హోటళ్లు బాంబుదాడులతో దద్దరిల్లాయి. విదేశీ రాయబార సిబ్బంది, ఎంబసీలు టార్గెట్ చెయ్యబడ్డాయి. ట్రిపోలిలోని అమెరికా ఎంబసీ సిబ్బంది కార్ హైజాకింగ్ నుండి తృటిలో తప్పించుకున్నారు. అదే నగరంలో ఉన్న ఆల్ ఫోర్నాజ్ జైలునుండి ఎనిమిది మంది గ్రీన్ రెసిస్టెన్స్ కార్యకర్తలు తప్పించుకున్నారు. జైలు లోపలి ఖైదీలు, జైలు బైట రెసిస్టెన్స్ కార్యకర్తలు సమన్వయంతో చేసిన దాడిని గార్డులు నిరోధించలేకపోయారు. గడాఫీ హత్య తర్వాత ఈ జైలుపై మూడుసార్లు దాడులు జరిగాయి. ఆగస్టు 18 న ట్రిపోలి వచ్చిన బెంఘాజీ సెక్యూరిటీ అధికారులు ఫోర్ సీజన్స్ హోటల్ లో బసచేయగా వారిపై గ్రీన్ రెసిస్టెన్స్ కారుబాంబుతో దాడి చేసింది. ఈ దాడి జరిగాక నాటో అనుకూల ప్రభుత్వాధికారులు భారీ స్ధాయిలో బధ్రతా బలగాలు తరలించి ఫోటోలు తీయకుండా అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలోకి జర్నలిస్టులను అనుమతించలేదు. అనుమతి నిరాకరణకు కారణాలు కూడా ప్రభుత్వం చెప్పలేదు. ఆ తర్వాత రోజు ట్రిపోలిలో మరిన్ని కారుబాంబులు పేలాయి. నాటో నియంత్రణలోని హోమ్ శాఖ కార్యాలయం వద్ద ఒకటి, డిటెన్షన్ సెంటర్ గా నాటో వినియోగిస్తున్న మహిళా పోలీసు అకాడమీ భవనం వద్ద రెండు కారు బాంబులు పేలాయి. ఆగస్టు 20 తేదీన బెంఘాజిలో ఈజిప్టు ఎంబసీ అధికారి కారుపై జరిగిన బాంబు దాడిలో అధికారి తప్పించుకున్నాడు. ఆ తర్వాత రోజు లిబియా ప్రధాని టి.వి లో ప్రసంగిస్తూ గ్రీన్ రెసిస్టెన్స్ దాడులను ఖండించాడు. లిబియాను మళ్ళీ మునుపటి హింసలోకి లాగడానికి గడాఫీ అనుకూల శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించాడు. ట్రిపోలి బధ్రతాధికారి మహ్మౌడ్ షరీఫ్ ఈ దాడులకు కారణం గడాఫీ విధేయులే కారణమని ప్రకటించాడు. నిజానికి ట్రిపోలి పోలీసులకు కారుబాంబులను నిర్వీర్యం చెయ్యడమే ఒక పెద్ద కార్యక్రమంగా మారిపోయింది.

మహిళా పోలీసు అకాడమీ భవనంపై దాడి జరిగాక నాటో ప్రతిష్టిత భద్రతా సైనికులు ఒక ఫార్మ్ హౌస్ పై దాడి చేసి గ్రీన్ రెసిస్టెన్స్ కార్యకర్తలను చంపాయి. ఈ దాడిలో పట్టుబడిన రెసిస్టెన్స్ కార్యకర్తలు లిబియాలో స్లీపర్ సెల్స్ నిర్వహిస్తున్నారనీ, ట్యునీషియా నుండి ఆయుధాలు వీరు దిగుమతి చేస్తున్నారని భద్రతా సంస్ధలు చెప్పినట్లు ఐ.పి.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది. ఆగస్టు 23, 2012 తేదీన నాటో ఆదేశాలు అమలు చేసే సుప్రీం సెక్యూరిటీ కమిటీ ప్రతినిధి అబ్దెల్మీనం ఆల్-హర్ ఒక పత్రికా సమావేశం నిర్వహించాడు. గడాఫీ విధేయులు అధికారిక సెక్యూరిటీ బలగాలలో చొరబడ్డారని ఈ సమావేశంలో ఆయన అంగీకరించాడు. భారీ ఆయుధాలు కలిగి ఉన్న ఒక బ్యారక్ మొత్తమే రెసిస్టెన్స్ బ్రిగేడ్ అయిన ‘ఆఫీయా బ్రిగేడ్’ ఆధ్వర్యంలో ఉన్నదని ఆయన తెలిపాడు. జూన్ 2012 లో ఈ బ్రిగేడ్ కొద్దికాలం పాటు ట్రిపోలి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తన అదుపులో ఉంచుకుంది. స్టీవెన్స్ హత్య తర్వాత గ్రీన్ రెసిస్టెన్స్ బెంఘాజి లోనే ఉన్న బెనినా విమానాశ్రయంపై దాడి చేసి అమెరికా డ్రోన్ కేంద్రంపై ఆర్.పి.జి ప్రయోగించారు. దానితో అమెరికా మిలట్రీ తన డ్రోన్ బేస్ ను శాశ్వతంగా మూసుకుంది.

ఈ ఘటనల క్రమాన్ని పరిశీలించినపుడు అమెరికా రాయబారి స్టీవెన్స్ హత్య దారితీసిన పరిస్ధితులేమిటో బోధపడుతుంది. గత సంవత్సర కాలంగా సాగుతున్న గ్రీన్ రెసిస్టెన్స్ ప్రతిఘటన ఉధృతమైన నేపధ్యంలోనే స్టీవెన్స్ హత్య జరిగిందని తెలుస్తుంది. సిరియాలో కిరాయి తిరుగుబాటుపైన అమెరికా కేంద్రీకరించి ఉంది. సిరియాలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించి తద్వారా ఇరాన్ ను లొంగదీసుకోవడానికి అమెరికా, నాటో లు కేంద్రీకరించి ఉన్నాయి. అందువలన గ్రీన్ రెసిస్టెన్స్ అణచివేతను లిబియాకు అవి వదిలిపెట్టాయి. అయితే స్టీవెన్స్ హత్యతో లిబియా రెసిస్టెన్స్ పట్ల ఉదాసీనత చూపడానికి అవకాశం లేదని అమెరికా గ్రహించి ఉండవచ్చు. బహుశా అందుకే అదనపు ప్రత్యేక బలగాలను లిబియా తరలించడానికి అమెరికా నిర్ణయించి అమలు చేసింది. మరిన్ని మెరైన్ సైనికులు, డ్రోన్లు లిబియాకు తరలించింది. అదనపు యుద్ధ నౌకలను కూడా తరలించింది. అయితే ఈ అదనపు బలగాలను వినియోగించడానికి అవకాశాలు లేవు. గడాఫీ ఉన్నపుడు ఆయన స్ధావరాలపైనా, ప్రభుత్వ భవనాలపైనా దాడులు చేసింది. ఇపుడు ప్రభుత్వమే తన ఆధీనంలో ఉన్నపుడు అమెరికా బలగాలకు టార్గేట్ లు ఏమీ లేవు. ఈ కారణంతోనే స్టీవెన్స్ హత్యపై విచారణ జరపడానికి కూడా ఎఫ్.బి.ఐ తిరస్కరించింది. ఈ పరిస్ధితిని చూడడానికి నిరాకరించి గడాఫీ లాయలిస్టులను అమెరికా చంపుతూ పోతే ప్రతిఘటన పెరుగుతుందే తప్ప తగ్గదు. ఆరు మిలియన్ల లిబియన్లలో కేవలం బెంఘాజీ జనం మాత్రమే నాటో దాడిని కోరుకున్న సంగతి గుర్తిస్తే ప్రతిఘటనను అంతం చెయ్యడానికి నాటో లిబియాను మొత్తంగా తుడిచిపెట్టాల్సి ఉంటుంది.

మరోవైపు లిబియా వాస్తవాలు తమ ప్రజలకు చేరడం నాటో దేశాలకు, ముఖ్యంగా అమెరికాకి ఇష్టం లేదు. నాటో ప్రసాదించిన విముక్తి తర్వాత ఇస్లాం టెర్రరిస్టుల పాలనలో లిబియన్లంతా సుఖ సంతోషాల్లో ఓలలాడుతున్నారని పశ్చిమ ప్రభుత్వాలు, పత్రికలు చెప్పుకుంటున్నాయి. లిబియాపై సాగించిన విధ్వంసంలో 50,000 మందికి పైగా చనిపోయినా అది లిబియా అభివృద్ధి కోసమేనని చెబుతున్నాయి. అలాంటి ప్రచారం నేపధ్యంలో లిబియా ప్రజలు ప్రతిఘటిస్తున్నారన్న వార్తలు పశ్చిమ ప్రభుత్వాలకు ఒక విధంగా ఆత్మహత్యాసదృశం అవుతుంది. ఆ కారణంతోనే అంతకు ముందు గడాఫీ విధేయుల దాడులంటూ అప్పుడప్పుడూ చెప్పిన పశ్చిమ పత్రికలు ఇపుడు వారి ప్రసక్తినే తేవడం లేదు.

లిబియా ప్రజలు తమ దేశాన్ని నాటో నుండి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఎంతవరకు సఫలం అవుతారన్నది వారి ఐక్యత, మిలట్రీ సామర్ధ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ పరిస్ధితులు కూడా వారికి సహకరించాలి. అలాంటి ఐక్యతను, సామర్ధ్యాన్ని గ్రీన్ రెసిస్టెన్స్ ఎంతవరకు సమకూర్చగలదో మునుముందు తెలుస్తుంది. అయితే నాటో పరోక్ష దురాక్రమణకు, ముస్లిం మతఛాందస పాలనకు లిబియా ప్రజలు బలంగా, చురుకుగా ప్రతిఘటిస్తున్నారన్నదే ఇపుడు గుర్తించవలసిన విషయం.

(అయిపోయింది)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s