అమెరికా ప్రజలు గుండెలు చిక్కబట్టుకుని ఆందోళనతో ఎదురు చూసిన పెను తుఫాను సాండీ అనుకున్నట్లుగానే పెను విలయాన్ని సృష్టించింది. బోస్టన్ పత్రిక ప్రకారం సాండీ ధాటికి ఏడు రాష్ట్రాల్లో 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మంగళవారం సాయంత్రానికి అట్లాంటిక్ తీరం వెంబడి 55 మంది చనిపోయారని ‘ది హిందూ’ తెలిపింది. ఐ.హెచ్.ఎస్ గ్లోబల్ ఇన్సైట్ ప్రకారం 20 బిలియన్ డాలర్ల మేరకు ఆస్తి నష్టం జరిగింది. 10 నుండి 30 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపార నష్టం జరిగింది. సాండీ విలయాన్ని అధ్యక్షుడు ఒబామా ‘మేజర్ డిసాస్టర్’ గా ప్రకటించాడు.
ఎ.పి ప్రకారం 130 కి.మీ వేగంతో వీచిన గాలులకి 8.2 మిలియన్ల ఇళ్ళు విద్యుత్ సౌకర్యం కోల్పోయాయి. వీరిలో నాలుగు వంతులు న్యూయార్క్ వాసులు. అమెరికన్ రెడ్ క్రాస్ ప్రకారం 16 రాష్ట్రాల్లో 11,000 మంది ప్రజలు 258 రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ‘సబ్ వే’లు వరదనీటిలో మునిగిపోయాయి. సొరంగాల రోడ్లను వరదనీరు ముంచెత్తింది. 15,000 కు పైగా విమానాలు రద్దయ్యాయి. 108 యేళ్ళ తర్వాత వాతావరణం కారణంగా మొదటిసారిగా రెండు రోజుల పాటు న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజీ మూతబడింది. స్కూళ్ళు మూతబడ్డాయి. ఆఫీసులు పని చేయలేదు. తుఫాను తీరం దాటిన న్యూ జెర్సీలో ఇళ్ళు పునాదులతో సహా కొట్టుకుపోయాయి. మిడ్ వెస్ట్ వరకూ తాకిన సాండీ కుండపోత వర్షంతో పాటు అడుగులోతు మంచును తెచ్చిపెట్టింది.
ఈ ఫోటోలను బోస్టన్ పత్రిక అందజేసింది.