రామాయణ విషవృక్షం – మతవిమర్శ


బొమ్మ: vivvi-karthikeya.blogspot.in నుండి

(రంగనాయకమ్మ గారి ఉద్గ్రంధాల్లో ఒకటి ‘రామాయణ విషవృక్షం’. ఆ పుస్తకంపై ప్రశంసలు ఎన్నివచ్చాయో, విమర్శలు అన్ని వచ్చాయి. ఆ పుస్తకం వలనే రచయిత్రిపై విద్వేషం పెంచుకున్నవారు అనేకులు. “మతమన్నది, నిజానికి, ఇంకా తనను తాను జయించలేని లేదా తనను తాను మరొకసారి కోల్పోయిన మనిషి యొక్క ఆత్మ-చేతన (self-consciousness) మరియు ఆత్మ-గౌరవం (self-esteem)” అనీ “మతం, ప్రపంచపు ప్రజాదరణ పొందిన రూపంలోని తర్కం. మతం, ప్రపంచపు అత్యాధ్మిక గౌరవాన్ని సమున్నతపరిచే అంశం” అనీ కారల్ మార్క్స్ అభివర్ణించాడు. అలాంటి మతవిశ్వాసాలను అవమానిస్తే విశ్వాసులు సహజంగానే బాధపడతారు. బహుశా విప్లవాచరణలో ఉన్నవారికి ఈ బాధ ఎక్కువ అర్ధం అవుతుంది. అలాగని సామాజిక చరిత్రను సమర్ధవంతంగా తెలియజేప్పే అవకాశాన్ని జారవిడవడం కూడా తప్పే అవుతుంది. ఈ చర్చలో భాగంగా ‘మావో ఆలోచనా విధానం అంటే ఏమిటి?‘ అన్న ఆర్టికల్ కింద రాజశేఖర రాజు గారు రాసిన ఈ వ్యాఖ్యను టపాగా మారుస్తున్నాను. టపాగా మార్చాలని అప్పట్లోనే అనుకుని మర్చిపోయాను. -విశేఖర్)

భావవాదం అంటే ఏమిటి భౌతిక వాదం అంటే ఏమిటి అనే ప్రాధమిక విషయాలు కూడా తెలియని వాళ్లకి, అసలు ఆ పదాలే జీవితంలో ఎన్నడూ విననివారికి రామాయణ విషవృక్షంలోని ఆ సుదీర్ఘ ముందుమాట మహత్తర భావనను కలిగిస్తుంది. రామాయణ రాముడిని విషవృక్షంలో మరీ అంటకాగినట్లుంటుంది, రాముడిని మరీ క్యారికేచర్‌లాగా వ్యంగ్యీకరించి రాముడిని, రామాయణాన్ని నమ్మేవారిని కర కర కోసినట్లుంటుంది కాని విషవృక్షంలోని ఆ ముందుమాట మాత్రం ఏ కమ్యూనిస్టు ఫిలాసఫీ రచనలో కంటే సుబోధకంగా మానవ పరిణామాన్ని వివరించిందనడంలో సందేహమే లేదు.

రామాయణ విషవృక్షం ప్రింట్ రూపంలో అందుబాటులో లేనప్పటికీ ఆ ముందుమాటను మాత్రం తప్పనిసరిగా విడిగా పుస్తక రూపంలో ప్రచురించవలసిందిగా రంగనాయకమ్మగారిని అప్పట్లోనే కలిసినప్పుడు కోరాను. ఆమె, గాంధీ గారు ఈ సలహా మంచిదేనని, తప్పకుండా ఆలోచిస్తామని చెప్పారు కాని తర్వాత అది సాధ్యపడినట్లు లేదు. వంద రెండు వందలు పెట్టి విషవృక్షం కొనలేనివారికి కూడా ఈ ముందుమాట అందుబాటులో ఉండాలి.

కాని నాకు ఒక విషయంలో తీవ్ర అభ్యంతరం ఉంది. మత విశ్వాసాల మీద లేదా అతీత శక్తిమీద ఈరోజుకీ నూటికి 99 మందికి నమ్మకం ఉంటున్నప్పుడు ఆ విశ్వాసాలను విమర్శిస్తున్నపుడు లేదా వ్యతిరేకిస్తున్నప్పడు చాలా బ్యాలెన్సెడ్‌గా ఉండాలనేది నా అనుభవం నేర్పిన పాఠం. లక్షసార్లు నాస్తిక ప్రకటనలు గుప్పించినా మత పునాదికి ఏమీ కాదు. మతానుయాయులను, మత పెద్దలను కూడా ఐక్య సంఘటనలో భాగంగా కలుపుకున్న, సమాదరించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలకు ఉంది.

మతాన్ని రాజ్యవ్యవహారాలనుంచి దూరంగా పెట్టిన సందర్భాల్లో కూడా మతాన్ని నమ్మేవాళ్లను దూరంగా పెట్టకూడదని, అలా పెడితే కమ్యూనిస్టు పార్టీకి ఎవరూ మిగలరని నా అభిప్రాయం. రాజ్యం సాధించిన తర్వాత కూడా చేయవలసిన కార్యాలను పక్కన బెట్టి, చేయకూడని కార్యాలను వరుసగా చేస్తూ పోతే ప్రజలు మతాన్ని ఎన్నిటికీ వదలకపోగా లక్షలాది ఇళ్లలో సైలెంటుగా మతం మళ్లీ రాజుకునే ప్రమాదముందని కూడా మనం సోవియట్ అనుభవాలనుంచి చూశాం.

మత భావనను ఏ మాత్రం విశ్వసించని కార్యకర్తలు కూడా కేమోప్లెజ్ కోసం, రహస్య మనుగడ కోసం, మత చిహ్నాలను పాక్షికంగా అయినా సరే స్వీకరించవలసిన, పాటించవలసిన స్థితి మన దేశంలోనూ ఆచరణ రూపంలో కొనసాగుతోంది. “రహస్య సమావేశం కోసం ఏ తిరుపతికో, తిరుత్తణికో, కంచికో వెళ్లిన కార్యకర్తలు, నేతలు ఆ ప్రాంతాలకు జనం ఎందుకు వస్తారో తెలిసి కూడా, కేమొప్లెజ్ కోసం బొట్టు పెట్టుకుని, సాంప్రదాయికంగా కనబడకపోతే, జనంలో భాగంగా తాము ఉండకపోతే సులభంగా శతృదృష్టిలో పడతాం. విప్లవ కార్యాచరణ అంటే నేను విప్లవకారుడిని, విప్లవకారిణిని అని మోర విడిచి బయట తిరగడం కాదు” అంటూ నాయకులు చెపుతుంటారని వారి పత్రికల్లో చదివాను.

మనం నిజాలనే చెప్పాలి. నిజమే. కాని అలా చెప్పే క్రమంలో అవతలివారిని రెచ్చగొట్టకూడదు. ఒక ప్రాంతంలో కొత్తగా విప్లవ పార్టీలోకి వచ్చిన ఒక పేద యువకుడు విప్లవమంటే దైవదూషణ, విగ్రహ వ్యతిరేకత అని పొరపడి పట్టణం నుంచి ఊరి కొచ్చాక వీరావేశంతో, ఊర్లో జనం కొలిచే అమ్మదేవతను విగ్రహాన్ని పట్టుకుని పాదరక్షలతో అందరూ చూస్తుండగా కొట్టేశాడట! ఇంకేముంది తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఆ చుట్టుపక్కల ఊర్లలో పార్టీకాని కార్యకర్తలు కాని అడుగుపెట్టలేకపోయారని చదివాను.

బృందాకారత్ రాజకీయాలను మనం విమర్శించవచ్చు కాని దేశవ్యాప్తంగా ఆమె పర్యటిస్తున్నప్పుడు మతాన్ని ఆచారాలను నమ్మే 99 శాతం మంది మహిళలను ఆమె కలుస్తున్నప్పుడు, బొట్టు పెట్టుకోవడం ద్వారా కూడా వారి విశ్వాసాన్ని పొందే అవకాశం ఉన్నప్పుడు ఆమె పోలేరమ్మ బొట్టును పెట్టుకుంటే తప్పేమీ లేదు కదా.. ఇది సిపిఎం వారికే కాదు విప్లవపార్టీ కార్యకర్తలకు కూడా వర్తిస్తుంది.

బొట్టు పెట్టుకోకపోవడం ద్వారా ప్రజలు నిన్ను నమ్మలేని, విశ్వసించలేని పరిస్థితులు ఏర్పడితే నువ్వు నీ విశ్వాసానికి విలువ ఇచ్చి వేరుపడిపోతావా లేక ముందు వారి విశ్వాసానికి విలువ ఇచ్చి క్రమంగా వారిని మార్చడానికి ప్రయత్నిస్తారా? దండకారణ్యంలో ముప్పై ఏళ్లుగా పోరాడుతున్న విప్లవోద్యమం అక్కడి స్త్రీల పట్ల కొనసాగుతున్న వివక్షతను, దురాచారాలను కొన్నింటిని మార్చగలిగినా, వాళ్లు తీవ్రంగా భావించే, గౌరవించే కొన్ని విశ్వాసాల విషయంలో ఈనాటికీ మార్పు తేలేకపోతోందని వారి ఉద్యమాచరణే చాటుతోంది.

తమ కాళ్లమీద తాము నిలబడి జీవించే రోజులు ప్రజలకు లభించనంతవరకు, మానవ శ్రమశక్తే అన్ని సమస్యలను పరిష్కరించే కాలం రానంతవరకు మనం విశ్వాసాల విషయంలో జనాలను ఎన్నటికీ మార్చలేము. పైగా ఏ పార్టీ కూడా జనం విశ్వాసాలను మార్చే ఎజెండాతో ఏ దేశంలోనూ పనిచేసిన చరిత్ర కూడా లేదు. ఆచరణతో అంతో ఇంతో సంబంధం ఉన్న ఎవరికయినా ఇది సులభంగా అర్థమవుతుంది.

(“రామాయణ విషవృక్షం”-రాముడు దేవుడా?! అన్న టైటిల్ తో వచ్చిన ఒక టపాను ఇంతకుముందే చూశాను. బ్లాగర్ వివేక్ పుస్తకాన్ని విశ్లేషించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఆసక్తి ఉన్న పాఠకులు చూడగలరు.)

21 thoughts on “రామాయణ విషవృక్షం – మతవిమర్శ

 1. ఒరిస్సాలోని జిమిడిపేట, కొల్నార ప్రాంతాలలో ఉండే గిరిజన మహిళలు బొట్లు పెట్టుకోరు. పెట్టుకున్నా బయటి ప్రపంచం గురించి తెలిసిన కొంత మంది చదువుకున్న మహిళలు పెట్టుకుంటారు. ఆ ప్రాంతంలో పర్యటించడానికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకోవడం అవసరమా?

 2. దేశంలోని అన్ని ప్రాంతాలలో సంప్రదాయాలూ, ఆచారాలూ, వేషధారణ అనేవి ఎన్నడూ ఒకేలాగ లేవు. కనుక వేషధారణ చూసి ప్రజలు తమని నమ్ముతారని బృందా కారత్ లాంటివాళ్ళు అనుకునేది తప్పే.

 3. రంగనాయకమ్మ గారికి రామాయణ విషవౄక్షం వల్ల మిత్రులు ఎమొగాని శత్రువులు ఆ పుస్తకం పేరు వల్ల బారీగా పెరిగారు.ఆ పుస్తకానికి చారిత్రకమైన అర్దంవచ్చేలా వేరే పేరు పెట్టివుంటే బాగుండేది. ఆంద్రప్రదేశ్ లొ ఆ పేరు వల్ల మార్కిజాన్ని కుడా ద్వెషించడానికి కారణమైదని నా అభిప్రాయం.

 4. రామ్మోహన్ గారూ మీ సూచన వాస్తవికంగా ఉంది. మీరు చెప్పినట్లు సామాజిక చరిత్ర అందులో ఉన్నదని చెప్పేలా మరొక పేరు ఉంటే బాగుండేది. ఈ ఆలోచన నాకయితే ఎప్పుడూ తట్టలేదు.

  రంగనాయకమ్మగారికి ఈ సూచన ఇంకెవరైనా చేసి ఉన్నారేమో తెలియదు గానీ చక్కటి సూచన చేసారు. ఇప్పటికే రచనకి రావలసిన పేరు వచ్చేసింది గనుక ఇక మార్చి లాభం లేదేమో. అయినా ‘బెటర్ లేట్ దేన్ నెవర్’ అన్నట్లుగా ఇప్పుడు మార్చినా ఎంతో కొంత లాభం ఉండవచ్చేమో కూడా. లాభం సంగతి ఎలా ఉన్నా మీరు చెప్పినట్లు మార్సిస్టు విద్వేషం అనే నష్టానికి ఇక ముందు ఆస్కారం ఉండవచ్చేమో కదా!

 5. రామ్మోహన్ గారూ! ‘రామాయణ విషవృక్షం’ పేరు మత విశ్వాసాలున్నవారి మనోభావాలను దెబ్బతీసి మార్క్సిజానికి నష్టం కలిగించిందనే భావం మీ వ్యాఖ్యలోకనపడుతోంది.

  ‘ఆంద్రప్రదేశ్ లొ ఆ పేరు (రామాయణ విషవృక్షం) వల్ల మార్కిజాన్ని కుడా ద్వెషించడానికి కారణమైదని నా అభిప్రాయం’ అన్నారు.

  ఈ పుస్తకం ద్వారా మార్క్సిజాన్ని ద్వేషించేవాళ్ళు ఉంటే- వాళ్ళు ఎవరై ఉంటారు? కేవలం ఆస్తిక భావాలున్నవారూ, దైవభక్తి పరులూ అయివుండరు. మార్క్సిజం పట్ల వ్యతిరేకత ఉన్నవారైవుంటారు. అలాంటివారు ఈ సిద్ధాంతాన్ని ద్వేషించటానికి ఈ పుస్తకం ఓ సాకుగా చెపుతుండివుండాలి.

  ఎందుకంటే… విషవృక్షంలోని వ్యంగ్య హాస్యాలను ఎంతో ఆనందించిన ఆస్తికులు కొందరు నాకు తెలుసు. రచయిత్రి పవని నిర్మల ప్రభావతి రామాయణాన్ని ఆరాధిస్తూనే.. మరో పక్క విషవృక్షాన్నీ అదే స్థాయిలో అభిమానిస్తూ వచ్చారు.

  అసలు ఒక పుస్తకం ‘పేరు’ ని బట్టే ఒక సిద్ధాంతాన్ని ద్వేషించేస్తారా ఎవరైనా? ఆ పుస్తకంలోని కంటెంట్ నచ్చక కాదా? పేరు మార్చేస్తే కంటెంట్ సంగతి? దాన్ని కూడా మార్చాలంటారా?

  రచయిత్రి చెప్పదలిచిన విషయానికి విషవృక్షం అనే టైటిల్ ఎంతో బాగా సరిపోయిందని నా అభిప్రాయం!

  ఇంతకీ ఈ పుస్తకంలో విషయం ఏమిటి? రామాయణం అనే కాల్పనిక రచనను మార్క్సిస్టు దృక్పథంతో పరిశీలించటం. నాటి సామాజిక పరిస్థితులను విశ్లేషించటం. దీన్ని సరిగా అర్థం చేసుకోక అనవసర ద్వేషాలు పెంచుకునేవాళ్ళూ, వ్యతిరేకతలు పెంచుకునేవాళ్ళూ అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. మరెప్పుడూ ఉంటారు.

  ఈ పుస్తకం తార్కిక ఆలోచనలను పదునెక్కించి, ఆలోచనా పరిధిని పెంచుతుందనేది నా అనుభవం!

  విష వృక్షం వల్ల మార్క్సిస్టు వ్యతిరేకులు పెరిగారని మీరంటున్నారు. ఈ పుస్తకం ద్వారా మార్క్సిజం పరిచయం జరిగి, మార్క్సిస్టులుగా మారినవారు గత మూడున్నర దశాబ్దాల్లో తెలుగునాట చాలామంది ఉన్నారు. వాళ్ళ సంగతేమిటి?

 6. వేణు గారూ,

  రామ్మోహన్ గారి వ్యాఖ్యలో మీరు చూసినంత నెగిటివ్ భావం లేదనుకుంటా.

  మీరన్నట్లు మార్క్సిస్టు ద్వేషులకు విష వృక్షంతో పనిలేదు. అది ఉన్నా లేకున్నా వారి విద్వేష ప్రచారం కొనసాగుతుంది. కానీ ఇజాలపట్ల ఏ ఇష్టమూ, ద్వేషమూ లేకుండా రాముడిని భక్తితో కొలిచేవారు దేశంలో చాలానే ఉన్నారు. రాముడి భక్తి దేశంలో సర్వవ్యాపితం. సినిమాల వల్లనేమో గానీ అంతకుముందు లేని చోట్లకి కూడా రాముడి భక్తి వ్యాపించింది.

  దేశంలో తూర్పు తీరం పొడవునా ఏం ఉన్నా లేకపోయినా మత్స్యకార గ్రామాల్లో రాముడి గుడి తప్పనిసరి. అనేక సాంస్కృతిక రూపాల్లో రాముడి కధలు విస్తృత ప్రచారంలో ఉన్న సంగతి మీకు తెలియనిది కాదు. ఈ ప్రచారం మధ్యనే పిల్లలు చదువుకుని కాలేజీల్లో ప్రవేశిస్తారు. మీరు గతంలో ఒకసారి చెప్పినట్లు విప్లవ పార్టీల సంస్కృతి బలహీనపడి, ప్రత్యామ్నాయ భావజాలం అందక కొత్తతరం విద్యార్ధులు, యువత దైవ అస్తిత్వాన్నే ప్రామాణికంగా చూస్తున్నారు. ఈ పరిస్ధితిలో ‘రామాయణ విషవృక్షం’ అనగానే తక్షణ ప్రతిస్పందన ప్రతికూలంగానే ఉంటుంది తప్ప సానుకూలంగా ఉండే అవకాశం తక్కువ.

  విష వృక్షం పుస్తకం ఎవరు రాశారు అన్న ప్రశ్న వచ్చినపుడు ఒక మార్క్సిస్టు రచయిత అని సమాధానం వస్తుంది. మార్క్సిస్టులు దేవుడి అస్తిత్వాన్ని ఒప్పుకోరు గనక వారలాగే రాస్తారు అనుకుని పుస్తకం వైపు రాకపోవచ్చు. అలా కాకుండా రామాయణ కాలం నాటి వాస్తవ చరిత్ర విశ్లేషణ ఇందులో ఉంటుంది అని సూచించే టైటిల్ ఉంటే తక్షణ వ్యతిరేకత స్ధానంలో తక్షణ ఆసక్తి వ్యక్తం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ దృష్ట్యా టైటిల్ లో రామాయణం అని ఉంచుతూనే పాజిటివ్ విశ్లేషణాన్ని ఉపయోగిస్తే సానుకూలత సంగతి ఎలా ఉన్నా, వ్యతిరేకతకు స్ధానం ఉండదు కదా! ఈ కోణంలోనే రామ్మోహన్ గారి వ్యాఖ్యని కూడాలి.

  రామ్మోహన్ గారి షార్ట్ కట్ వ్యాఖ్య వలన పేరును బట్టే సిద్ధాంతాన్ని ద్వేషించేస్తారా అన్న ప్రశ్న వచ్చింది. నిజానికి పేరు వలన మాత్రమే అని కాదు. ఒక పుస్తకాన్ని చూసేటపుడు మొదట పేరునే చూస్తాం. తర్వాత రచయిత పేరు, ఆ తర్వాత వెనుక అట్ట, ముందుమాట ఇలా పరిశీలన ఉంటుంది. న్యూట్రల్ వ్యక్తులకు మొదటి చూపులోనే రామాయణంలో విషం ఉంది అని చెప్పేస్తే ఇక ఆ తర్వాత పరిశీలన ఆగిపోతుంది. వెనుక అట్ట, ముందుమాట, లోపలి పేజీలు ఇలా తొంగి చూసే అవకాశం మూతపడిపోతుంది. ‘పేరువల్ల’ అన్నదానిలో ఇదంతా చూడాలి.

  విష వృక్షం పుస్తకం గురించి ఇప్పటికే ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడిపోయింది. ఇది జనరల్ పాఠకుల్లో కూడా వ్యాపించి ఉంది. ఈ పాఠకులంతా మార్క్సిస్టు ద్వేషులని చెప్పలేము. వారిలో అత్యధికులు దేవుడికి సంబంధించిన ఉపరితల భావాల దృష్ట్యా, పుస్తకం గురించి ఆనోటా ఈనోటా చెప్పింది విని వ్యతిరేకత పెంచుకున్నవారు. వీరి వ్యతిరేకతలో ద్వేషం ఉండకపోవచ్చు. రాముడిపైన ఉన్న భక్తిని చిన్నబుచ్చే సూచన వారికి చేరడంవల్ల, దానికి కొంత ప్రచారం తోడై వ్యతిరేకత పెంచుకున్నవారు అనేకమంది ఉంటారు. వీరిలో కొంతమందైనా టైటిల్ సానుకూలంగా ఉంటే పుస్తకం జోలికి వచ్చేపనైతే వారికా అవకాశాన్ని ఎందుకు నిరోధించాలి?

  రామాయణ విషవృక్షం పుస్తకం వల్ల మార్క్సిస్టు వ్యతిరేకత పెరిగిందనడం నిజం కాకపోవచ్చు. కానీ రావలసిన సానుకూలత పుస్తకం పేరు వల్ల రాకపోతే అది నష్టమే కదా. పుస్తకంలోని విషయాన్ని పేరును బట్టి అంచనా వేయడం సహజంగా జరుగుతుంది. అలాంటి నష్టం, ఎంత తక్కువైనా, ఆపగలిగితే ఉపయోగమే కదా. అయితే ఆ నష్టం ఎంతవరకు ఉందన్నది చర్చాంశం.

 7. మతపరమైన ఆచారాల ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెపుతున్నాను. ఒకే ప్రాంతంలోనైనా సరే ఇద్దరు వ్యక్తులు నమ్మే ఆచారాలు ఒకేలా ఉండవు. మల్లీశ్వరి గారి బ్లాగ్‌లో నేను ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్పిన వ్యాఖ్య ఇక్కడ గుర్తుకి వస్తోంది.
  లింక్ ఇది: http://goo.gl/IAzcb

  కులం కట్టుబాట్లు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ అనవసరం. ఉదాహరణకి బ్రాహ్మణ కుటుంబాలలో ఇప్పటికీ భర్త చనిపోయిన స్త్రీలని కుంకుమ, గాజులు పెట్టుకోనివ్వరు. కానీ బ్రాహ్మణాచారాలు తెలియని పల్లెటూరి స్త్రీలు భర్త చనిపోయిన తరువాత కూడా కుంకుమ, గాజులు పెట్టుకుని తిరుగుతారు. వాళ్ళని చూసినప్పుడు బ్రాహ్మణులు “కలికాలం వచ్చేసిందనీ, అందుకే ఆడవాళ్ళు ఇలా తయారవుతున్నారనీ” అనుకుంటారు.

  పల్లెటూరి స్త్రీలకి బ్రాహ్మణాచారాలు తెలియవు అని మనం ఆ బ్రాహ్మణులకి చెప్పినా అది వాళ్ళకి అర్థం కాదు. తమ నమ్మకాలే కరెక్ట్ అన్నట్టు బ్రాహ్మణులు మాట్లాడుతారు. మా అమ్మగారు శ్రీకాకుళం RCBలో పని చేసే రోజులలో వాళ్ళ బ్యాంక్‌కి ఒక పల్లెటూరి స్త్రీ వచ్చింది. ఆమె వ్యక్తిగత సమాచారం అడిగినప్పుడు ఆమె తన భర్త చనిపోయాడని చెపితే ఆ బ్రాంచ్‌లో ఉన్న ఒక మహిళా ఉద్యోగి నమ్మలేదు. పల్లెటూరి స్త్రీలకి బ్రాహ్మణాచారాల గురించి తెలియదని మా అమ్మగారికి అర్థమైంది కానీ పక్కన కూర్చున్న ఉద్యోగినికి అర్థం కాలేదు.

  మైదానం రాజేశ్వరి లాంటి స్త్రీలు ఉంటారని చెప్పినా కొందరు ఇలాగే నమ్మకపోవచ్చు. వాళ్ళు పుట్టి పెరిగిన కుటుంబ వాతావరణం వల్ల కూడా వాళ్ళకి ఇది నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ భౌతిక ధర్మాలు అనేవి కులాన్ని బట్టి మారవు కదా. ఈ నిజాన్ని అంగీకరిస్తే ఒక బ్రాహ్మణ స్త్రీ భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకున్నా, భర్త ఉండగా ఇంకో పురుషునితో వెళ్ళిపోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

  కులం కట్టుబాట్ల పేరుతోనో, మతం పేరుతోనో చిన్నప్పటి నుంచి మనిషి ఆలోచనలని కట్టడి చేసే కట్టుబాట్లని బోధించినంతమాత్రాన సహజ సిద్ధంగా కలిగే కోరికలు ఆగవు. “ఆమె కులం ఏమిటి, ఆమె చేసిన పని ఏమిటి?” అని ఎవరు అనుకున్నా సహజమైనది అసహజమైపోదు.

  ప్రజలని ఆకర్షించడానికి వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలని అనుకరించాలనుకుంటే మనం ప్రాంతానికొక వేషం ఏమిటి, ఇద్దరు వేరువేరు వ్యక్తుల దగ్గర వేరువేరు వేషాలు వెయ్యాల్సి వస్తుంది. కనుక పోలేరమ్మ బొట్లు పెట్టుకుంటే ఆడవాళ్ళు ఏదో దగ్గర అవుతారనుకోవడం ఒక జోక్.

 8. దేవుడు ఉన్నాడా, లేడా అనే ఆర్గ్యుమెంట్‌లు పక్కన పెట్టి భౌతికత అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి తదితర విషయాలు చర్చించినా ప్రజలలో భౌతిక జ్ఞానం పెరుగుతుంది. మనం చెయ్యాల్సిన పని అది. అంత మాత్రాన అది నాస్తికత్వాన్ని త్యజించడం అవ్వదు. Indirectly, it makes road to atheism.

  హెగెల్ నాస్తికుడు కాదు. అతను కన్సర్వేటివ్ ప్రొటెస్టంట్ క్రైస్తవుడు. కానీ అతని శిష్యులైన మార్క్స్, ఎంగెల్స్, ఫోయర్‌బాక్‌లు మాత్రం నాస్తికులు. భౌతికత అంటే ఏమిటి, వస్తుగతం (objectivity) అంటే ఏమిటి, విషయగతం (subjectivity) అంటే ఏమిటి తదితర విషయాలు చర్చించడం వల్లే వాళ్ళు నాస్తికులయ్యారు. అంతే కానీ వాళ్ళు కేవలం బైబిల్‌లో ఉన్న చెత్తపై విమర్శలు చదవడం వల్ల నాస్తికులు అవ్వలేదు.

  మత గ్రంథాలు అనేవి బానిస, భూస్వామ్య సమాజాల కాలంలో వ్రాయబడినవి. ఆ గ్రంథాలలో ఆ వ్యవస్థలని సమర్థించే చెత్త ఉండడంలో విచిత్రం లేదు. ఈ విషయం మార్క్స్, ఎంగెల్స్, ఫోయర్‌బాక్‌లకి కూడా తెలిసిన విషయమే. అయినా వాళ్ళు కేవలం మత గ్రంథాలని విమర్శిస్తూ కూర్చోకుండా సత్య శోధనకి ప్రాధాన్యత ఇచ్చారు. భౌతికత అంటే ఏమిటో తెలియకపోతే మనిషి నిజ జీవితంతో సంబంధం లేని గాంధేయవాదం లాంటి అభివృద్ధి నిరోధక సిద్ధాంతాల వైపు కూడా వెళ్ళగలడు. అతను కేవలం మతపరమైన మూఢ నమ్మకాల వైపే వెళ్తాడని అనుకోలేము.

 9. పై వ్యాఖ్యలు చదువుతున్నప్పుడు నాకు మరో సారి బలంగా నాటుకున్న అంశం మార్క్సిస్టులు ప్రజలతో వ్యవహరించే పద్ధతి మిగతా వారికంటే భిన్నంగానూ, ప్రజలకు ఉపయోగకరంగానూ ఉండాలని. ఇది “విష వృక్షం”లో కొరవడింది.

  మరొకటి మతం గురించి: మతం అనేది ఈ రోజు చూస్తున్న వివిధ రూపాలుగా, పేర్లుగా మాత్రమే అర్థం చేసుకుంటే అది మార్క్సిజానికి తప్పుడు అన్వయమే అవుతుంది. దీనికోసం “మత” పూర్వ సమాజాలనుండి, ఆదిమ మతం, సైన్స్- ఇంకా విడిపోక ముందరి సమాజపు భావనల నుండి అధ్యయనం మొదలు పెట్టవలసి ఉంటుంది.

  అప్పుడు మనం, ఈ రోజుటి “మత” భావనలలో కలగలిసి పోయిన అనేక అంశాలను విడివిడిగా గుర్తించడానికి వీలవుతుంది. గ్రహించవలసినది, త్యజించవలసినదీ బోధ పడుతుంది. మతం పేరుతో చూస్తున్నఅనేక ఆచరణలకు, వివిధ చిహ్నాలకు సవ్యమైన అర్థాలను ఆపాదించి, పొల్లును పక్కన పడేసి, గింజను ఏరుకొనేందుకు వీలవుతుంది. సమాజ మార్పుకు తోడ్పడడానికి సాధ్యపడుతుంది.

  “అమరత్వ” భావన ఇలాంటిదే అని నేను అనుకుంటున్నాను. చావును అర్థం చేసుకొనే క్రమంలో నేలరాలిన ఒక విత్తనం తిరిగి పైకి లేస్తుందన్న భౌతిక సత్యం నుండి, లేకుంటే నిద్రించిన ఒక మనిషి తిరిగి చైతన్యం పొంది తన ప్రపంచంతో నిమగ్నమయ్యే రోజువారీ అనుభవాల నుండి రూపొందిన భావన అది.

  చిరంజీవి, అమరుడు(ఇవి మతంలోనూ ఉంటాయి) భావనలను రోజువారీ ఉద్యమ పరిభాషలో మనం మాట్లాతున్నప్పుడు దీని వెనుక ఉన్న చరిత్ర మనకు స్ఫురించక పోవచ్చు. వాటిని మతం ప్రయోగించే పద్ధతి కన్నా భిన్నంగా ప్రయోగిస్తున్నామన్న ఆలోచనా కలగక పోవచ్చు. కానీ గొప్ప ఆచరణకు దారితీసిన చారిత్రక భౌతిక వాద అవగాహనగా అది నాకు తోస్తుంది. ఇలాంటి భావనలను చరిత్ర, సంస్కృతులనుండి గ్రహించి, తిరిగి చరిత్ర, సంస్కృతులను మార్చగలిగే శక్తి చారిత్రక భౌతిక వాద అవగాహనకు ఉంది.

  మతం సామాజిక వాస్తవికతను తలకిందులు చేసి నిలబెడుతుంది అని మార్క్స్ చెబుతాడు. మత పరిభాషలో మాట్లాడిన వాళ్ళందరూ తమ కాలపు శాస్త్ర, సాంకేతికతల భుజాల మీద నిలబడి, తమ సమాజపు ఆత్మిక అవసరాలను ఉద్దేసిస్తూ మాట్లాడిన వాళ్ళని మనం గ్రహించినప్పుడు మార్క్స్ మాటలను మనం బాగా అర్థం చేసుకోగలం. అలా మాటాడిన వాళ్ళందరూ తమ తమ మతాలకు కొత్త శక్తిని, సమకాలీనతనూ(వొట్టి విశ్వాసంగా అయినా) ఇవ్వగలిగారు. కానీ మతం గురించి మార్క్సిస్టులు మాట్లాడేటప్పుడు పైన చెప్పిన రెండు విషయాలు- తమ కాలపు శాస్త్ర సాంకేతికతల స్వభావం, తమ సమాజపు ఆత్మిక అవసరాలను మరచి పోతుండడం వారి మార్క్సిస్టు అవగాహనకు నిదర్శనంగా మాత్రమే నిలబడతాయి.

  ఇక కట్టు, బొట్టు అనేవి ప్రాంతాలకు పరిమితం అయినవి. మార్క్సిస్టులకు వాటితో వైరుధ్యం అవి ప్రజా వ్యతిరేకం అయినప్పుడే ఏర్పడుతుంది. (స్త్రీలు ధరించే)బొట్టు అనేది పితృ స్వామిక సమాజపు చిహ్నం. దానితో పేచీ సమంజసమే కానీ, సంస్కృతిలో భాగమైన అటువంటి చిహ్నాలతో పోరాటం వర్గ శతృ నిర్మూలనంత తేలికయిన విషయం కాదు.

 10. విశేఖర్ గారూ,
  మీ ఒకప్పటి వ్యాసంలో నా వ్యాఖ్యకు వ్యాసగౌరవం కల్పించి టపాగా మార్చినందుకు కృతజ్ఞతలు.

  ముందుగా పోలేరమ్మ బొట్టు పెట్టుకోవడంపై ప్రవీణ్ గారి విమర్శను నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఎంత పెద్ద బొట్టు పెట్టుకుంటే అంత మందికి దగ్గరవవచ్చు అనేందుకు ఆధారాలు లేవు.

  పైగా పౌరజీవితంలో ఉంటూ జనం మధ్యన పనిచేయవలసి వచ్చినప్పుడు ఆ ప్రాంత ఆచారాలను గౌరవించడంలో, అవసరమైతే పాటించడంలో కూడా వీలైనంత సింపుల్ గా ఉండటం ఉద్యమ జీవితంలో తప్పనిసరి. ప్రవీణ్ గారికి ఉద్యమాచరణకు సంబంధించి పెద్దగా తెలీదని, తనకు ప్రత్యక్ష ఉద్యమాలతో పరిచయం లేదని నా భావం. దీన్ని తప్పుగా భావించనవసరం లేదని మనవి.

  బృందాకారత్ గారి పోలేరమ్మ బొట్టు గురించి చర్చకన్నా సైనిక జీవితంలో మహిళలు, పౌరజీవితంలో మహిళలు ఉద్యమాల్లో ఎలా ఉంటారు,అవసరాన్నిబట్టి వారి వేషభాషలను ఎలా మార్చుకుంటారు అనే విషయాన్ని పరిశీలిస్తే బాగుంటుంది.

  మన దేశంలో పరిమిత స్థాయిలో జరుగుతున్న ఉద్యమాల్లో కూడా సైనిక జీవితంలో యూనిఫారం వేసుకుని పనిచేస్తున్నవారు ఏ ఆచారాలను బొట్టు, తాళి వంటి సాంప్రదాయిక అలంకరణను నూటికి నూరుపాళ్లు పాటించడంలేదని నా అవగాహన.

  అటవీ ఉద్యమానికి మాత్రమే పరిమితమై ఉన్న మహిళా గెరిల్లాలు కూడా బొట్టు, నగలు వంటి వాటి జోలికి పోవడం లేదు. కాని కాంటాక్టులు, కొరియరింగ్, సరకుల కొనుగోలు వంటి పనులకోసం బయటకి అంటే మైదాన ప్రాంతాలకు, పట్టణాలకు, గ్రామీణ కేంద్రాలకు పరిమితంగా అయినా సరే పోవలసి వచ్చినప్పుడు పౌరజీవిత చిహ్నాలను తప్పకుండా ధరించాల్సిందే. వీటిని మనం ఏ మార్క్సిస్టు సిద్ధాంత గ్రంధాలలోనూ చూడం.

  పైగా ఉద్యమాచరణలో ఇది సైనిక జీవితమని, ఇది పౌరజీవితమని గిరిగీసి చూడలేము.చెప్పలేము కూడా. అందుకే పక్కా గెరిల్లామహిళ కిట్ బ్యాగులో కూడా బొట్టు, తాళి, లేదా మహిళలు బయటి సమాజంలో ధరించే అత్యంత సాధారణమైన హారాలు కూడా ఉంచుకునే తిరుగుతుంటారు. బయటకు పోవలసివచ్చినప్పుడు వాటిని ఎక్కడి నుంచో తీసుకుని,తెప్పించుకుని పోవడం కుదరదు. ఇది ఉద్యమ పార్టీలలో కూడా మహిళలకే ప్రత్యేకమైన సమస్య.

  ఇది తెలీకనే, ఎన్ కౌంటర్లలో మహిళలు నేలకొరిగినప్పుడు వారి కిట్ బ్యాగులలో కన్పించే బొట్టు,తాళి వంటి చిహ్నలపై మీడియా చాలాసార్లు వక్రీకరించింది. కమ్యూనిస్టులు కూడా తాళి ఉంచుకుంటారని, నగలు ధరిస్తారని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులంటే భూమ్మీద ప్రత్యేక జాతిగా ఉంటారని, ఉండాలని కోరుకోవడం ఫక్తు ఆదర్శవాదమే.తప్ప నిర్దిష్ట సమాజపు పరిమితులలోనే వారూ మనగలగాలి అనే వాస్తవాన్ని ఇలాంటి సందర్భాల్లో మర్చిపోతుంటారు.

  ఉద్యమాల్లో పనిచేసే పురుషులు కూడా ఆయా ప్రాంత పరిస్థితులకు తగిన వేషభాషల్లో తిరగకపోతే వాళ్ల ఉనికికి కూడా భంగం జరుగుతుంది. ఆ భంగం ఒక్కోసారి ప్రాణాలతో చెలగాటంగా కూడా మారుతుంది.

  నాజీల గడ్డమీద నువ్వు తిరిగేటప్పడు అచ్చం నాజీల్లాగే నువ్వు తిరగాల్సి ఉంటుంది. నువ్వు దేన్నయితే తీవ్రాతితీవ్రంగా అసహ్యించుకుంటావో ఆ స్వస్తిక్ దుస్తులతో తిరుగుతూనే నువ్వు లక్ష్యాన్ని కొట్టాలి. ‘దిటవు గుండెలు’ అనే నవలలో సోవియట్ గెరిల్లా కుజ్నుత్సోవ్ ఎంత స్పష్టంగా చెప్పాడీ విషయాన్ని?

  శేఖర్ గారూ, ఇక్కడ చర్చకు తావు లేదనుకుంటూనే వ్యాఖ్యను పెద్దది చేసేశాను.

  పోలేరమ్మ బొట్టు ధరించే బృందాకారత్ గారు రేపు సిపీఎమ్ వారి రాజ్యం వచ్చిన తర్వాత కూడా నేను బొట్టు పెట్టుకు తిరుగుతాను అంటే ఆమె వ్యక్తిగత హక్కును మనం గౌరవించాలా వద్దా అనేది మరొక మౌలిక ప్రశ్న.

  వేషభాషల్లో కూడా యూనివర్శల్ పేరుతో మూస విధానాలను అమలు చేస్తే అవి దీర్ఘకాలం మనలేవు. చైతన్యాన్ని పైనుంచి బలవంతంగానో, మెజారిటీ ఓటింగుతోనో రుద్దాలని చూస్తే అది వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది.

  ఈ చర్చ ఇక్కడ తెగదనే భీతితో ఇక్కడితో ఆపేస్తున్నాను. పైగా ఈ హైదరాబాద్ దోమల భయంకర కాట్లు ఒకటీ ఇక్కడ.

 11. రాజశేఖర్ గారు, చత్తీస్‌గఢ్‌లోని లోహండిగూడ గ్రామం దగ్గర ఓసారి పోలీసులు నన్ను పట్టుకున్నారు. ఆ సమయంలో నేను ఫుల్ హ్యాండ్స్ టి షర్ట్, నైలాన్ బూట్లు వేసుకుని ఉన్నాను. పైగా నా ముఖం కూడా గిరిజనుడి ముఖంలాగ లేదు. నన్ను కొన్ని గంటల పాటు స్టేషన్‌లో ఉంచి విచారించారు. నాకు మావోయిస్ట్‌లతో ప్రత్యక్ష సంబంధాలేమీ లేవు. కేవలం ఫొటోలు తియ్యడానికి ఆ ప్రాంతంలో తిరిగాను, అంతే. నా సంగతి సరే, పట్టణ ప్రాంతంలోని అగ్రకుల కుటుంబం నుంచి వచ్చిన మహిళ పోలీసులకి అనుమానం రాకుండా ఉండేందుకు గిరిజన స్త్రీలాగ రవిక వేసుకోకుండా చీర కట్టుకుని తిరగగలదా? మగవానికి గిరిజనునిలాగ లుంగీ వేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ఆడవాళ్ళకే గిరిజన స్త్రీ వేషం వేసుకోవడానికి ధైర్యం సరిపోదు.

  నేను జగదల్‌పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక గిరిజన మహిళని చూశాను. ఆమె చీర కట్టుకుంది కానీ రవిక వేసుకోలేదు. ఆ పట్టణంలోని అగ్రకుల మహిళలందరూ డీసెంట్ వేషధారణలోనే ఉంటారు. కానీ రైల్వే స్టేషన్ దగ్గర మురికివాడలో నివసించే గిరిజన మహిళలు రవికలు వేసుకోరు. పట్టణ ప్రాంతానికి చెందిన ఒక అగ్రకుల మహిళ పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాల కోసం గిరిజన ప్రాంతంలో పని చెయ్యాల్సి వచ్చిందనుకుందాం. అప్పుడు ఆమెకి పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు గిరిజన స్త్రీ వేషం వేసుకోమంటే వేసుకుంటుందా?

  విజయనగరం జిల్లాలో బొబ్బిలి-సాలూరు రైల్వే లైన్ పక్కన ఉన్న నారాయణప్పవలస, రొంపల్లి, చిన్నబోరబంద తదితర గ్రామాలకి చెందిన మహిళలు 25 పైసలు నాణెం అంత సైజ్‌లో బొట్లు పెట్టుకుంటారు. ఆ రైల్వే లైన్‌ నుంచి పది కిలో మీటర్లు దూరంగా వెళ్ళి మక్కువ ప్రాంతంలోని గిరిజన గ్రామాలకి వెళ్ళి చూస్తే బొట్లు పెట్టుకోని గిరిజన మహిళలు కనిపిస్తారు. వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళు హిందువులో, క్రైస్తవులో చెప్పలేము.

  జెనెరల్ కాటెగరీవాళ్ళు ఉండే గ్రామంలో ఉన్నప్పుడు బొట్లు పెట్టుకోవడం, గిరిజన గ్రామానికి వెళ్ళేటప్పుడు బోట్లు తీసెయ్యడం పెద్ద సమస్య కాదు. కానీ వస్త్రధారణ అనుకరణే మహిళా కార్యకర్తలకి ఇబ్బందిగా ఉంటుంది. కార్యకర్తలు ప్రజల వేషభాషలని పూర్తిగా అనుకరించడం అన్ని సందర్భాలలోనూ సాధ్యం కాదు.

 12. “కార్యకర్తలు ప్రజల వేషభాషలని పూర్తిగా అనుకరించడం అన్ని సందర్భాలలోనూ సాధ్యం కాదు.”

  ఇది కరెక్ట్. రవికె వేసుకోకపోవడం లాంటి పూర్తి వేషధారణ అనుకరించాల్సిన అవసరం ఏర్పడకపోవచ్చు కూడా. రాజు, నాగరాజు గార్ల వ్యాఖ్యల్లోని ఉద్యమ అవసరాల స్ఫూర్తిని మాత్రమే ఇక్కడ చూడాలి. ఏది చేసినా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నదే అంతిమ లక్ష్యం.

  చర్చను మళ్లీ విషవృక్షంవైపుకి మళ్ళిద్దాం.

 13. మత వ్యతిరేక పోరాటం చేస్తే గాంధేయవాదానికి కూడా వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుంది. మతంలాగే గాంధేయవాదం కూడా నిజ జీవితంతో సంబంధం లేని విషయమే. పాము పుట్టలో పాలు పోసేవాడు ‘పుట్టలో చెయ్యి పెట్టి, పాము చేత కరిపించుకోకుండా బయట పడి, పాము నిజంగా దేవతే అని నిరూపించుకునే ధైర్యం చెయ్యలేడు’ అనేది ఎంత నిజమో ‘గాంధీలాగ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించేవాళ్ళు నిజ జీవితంలో ఎవరూ ఉండరు’ అనేది కూడా అంతే నిజం.

  ‘గాంధీలాగ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించేవాళ్ళు నిజ జీవితంలో ఎవరూ ఉండరు’ అనే నిజం తెలిస్తే దోపిడీ వ్యతిరేక పోరాటాలు చేసేవాళ్ళకి ధైర్యం పెరుగుతుంది. ప్రజా పోరాటాలలో పాల్గొనేవాళ్ళకి ఈ ధైర్యమే ముఖ్యం.

  కానీ దేవుడు లేడు, దెయ్యాలు లేవు అని తెలుసుకుంటే ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది? ‘దేవుడు లేడు కనుక మనిషి కర్మ (fate) & దైవ నిర్ణయం (god’s will)తో సంబంధం లేకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి’ అనుకునేంత వరకు మనిషిలో చైతన్యం పెరుగుతుంది, మనిషి నాస్తికునిగా మారితే. కానీ సామాజిక జ్ఞానం పెరగడానికి నాస్తిక చైతన్యం సరిపోదు. సమాజం విషయంలో మత భక్తులకి ఉన్న అభిప్రాయాలే నాస్తికులకి కూడా ఉంటాయి. ఉదాహరణ: ‘డబ్బున్నవాళ్ళందరూ మంచివాళ్ళు’, ‘పేదవాళ్ళు సోమరిపోతులు’, ‘వాళ్ళు కష్టపడకుండా తమ స్థితికి ధనవంతులే కారణం అనుకుంటూ సమాజం మీద ద్వేషం పెట్టుకుంటారు’ లాంటి అభిప్రాయాలు నాస్తికులలో కూడా ఉంటాయి.

  సమాజాన్ని ద్వేషిస్తే పేదవానికి ఏమీ రాదు. మార్క్సిజం వ్యక్తికీ, సమాజానికీ మధ్య సమతుల్యత ఉండాలని చెపుతుంది. ఈ సమతుల్యత ఉండడం ఇష్టం లేని పెట్టుబడిదారీ వర్గంవాళ్ళకే సమాజం మీద ద్వేషం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొట్ట కూటి కోసం దొంగతనాలు చేసే పేదవాడు తాను చేసే పనిని సమాజం ఆమోదించడం లేదని సమాజం మీద ద్వేషం పెట్టుకుంటే అది వేరే విషయం. కార్మికుల చేత శ్రమ చెయ్యిస్తూ వంద మంది చేసే శ్రమ మీద ఒకడు బతికే సమాజంలో ‘సామాజిక ప్రయోజనాలు వ్యక్తి ప్రయోజనాలకి అడ్డు‌’ అని సమాజం మీద ద్వేషం పెట్టుకోవాల్సిన అవసరం పెట్టుబడిదారీ వర్గంవాళ్ళకే ఉంటుంది.

  నాస్తికత్వం వల్ల దోపిడీ విషయంలో అభిప్రాయాలు మౌలికంగా మారవు. కేవలం వ్యక్తిగత చైతన్యం (కర్మ, దైవ నిర్ణయం వంటి వాటితో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం) విషయంలో మాత్రం అభిప్రాయాలు మారుతాయి.

 14. వెణు గారూ సమయం చాలక ఆలస్యంగా చుశాను. నా వ్యాఖ్యలొ వివరణ తక్కువగా వుంది. ఫలితంగా వేరే అర్దం వచ్చివుండవచ్చు. దాన్ని విశెఖర్ గారు విస్తరించి అపార్దాన్ని తొలగించారు. ఈ బ్లాగుల్లొ కొంతమంది మార్కిజాన్ని ద్వెషించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ గాలి వార్తల ద్వారా కొంతమంది మనుసులు కలుషితం అయి దానిగురించి ఎమీ తెలియకుండానే ఒక అభిప్రాయం ఎర్పరుచుకున్నారు. బయట గానీ , ఈ బ్లాగుల్లొ గానీ దాన్ని గురించి తెలిసి విమర్శించడం నేను ఇంతవరకు చుడలేదు. కొంతమంది బక్తులకు విషవౄక్షం పేరు చుడగానే యవరొ ఉన్మాదంతొ రాశారనుకుంటారు. దానిలొ విషయం గురించి వాళ్ళకు తెలియదు కదా.

 15. రామాయణ విషవృక్షం పుస్తకం టైటిల్ ఎలా ఉన్నా ఆ పుస్తకంలోని కాంటెంట్ గురించి ఆలోచించాల్సిందే. మతం అనేది కేవలం ఊహాత్మక శాస్త్రం (speculative philosophy). దానికి నిజ జీవితంతో సంబంధం ఉండదు. ఒక ఉదాహరణ చెపుతాను. జైన మతం ప్రకారం మాంసం తినడం తప్పు. కానీ వడ్డీ వ్యాపారం చెయ్యడం తప్పు కాదు. మార్వాడీ జైనులు (రాజస్థాన్ నుంచి వలస వచ్చిన జైనులు) మాంసం ముట్టుకోరు కానీ వడ్డీ వ్యాపారంలో బాగానే ఇన్వాల్వ్ అయ్యి ప్రజల నుంచి డబ్బులు మెడ పట్టుకుని మరీ లాగుతారు. జైన మతంలో ఒకప్పుడు బట్టలు వేసుకోకూడదు అనే రూల్ ఉండేది. ఆ రూల్ పోయి తెల్ల వస్త్రాలు వేసుకోవాలని రూల్ వచ్చింది. ఇప్పుడు జైనులందరూ రంగు వస్త్రాలే వేసుకుంటున్నారు. మనిషి మాంసం తినకపోయినా బతకగలడు. కానీ మనిషి బట్టలని త్యజించి సమాజంలో అడవి మనిషిలా తిరగలేడు. కనుక వస్త్ర త్యాగం చెయ్యాలి అని అంటే అది ఊహాత్మకతని బోధించే వాదన (speculative advocacy) అవుతుంది.

  ఇలాంటి ఉదాహరణలు మరి కొన్ని ఉన్నాయి. గాంధీలాగ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేవాళ్ళు నిజ జీవితంలో ఎవరూ ఉండరు. కనుక గాంధేయవాదం కూడా ఊహాత్మక శాస్త్రమే. ప్రజలు వర్గ పోరాటాల వైపు వెళ్ళకుండా చెయ్యడానికి పాలక వర్గంవాళ్ళు ప్రజలకి గాంధేయవాదాన్ని బోధిస్తారు. కానీ పాలక వర్గంవాళ్ళు తమ వ్యక్తిగత విషయానికి సంబంధించి మాత్రం గాంధీ జయంతి నాడు & గాంధీ వర్ధంతి నాడు తప్ప మిగితా రోజులలో గాంధీ విగ్రహం వైపు చూడరు. దోపిడీ అనేది కేవలం అహింస పేరుని అడ్డం పెట్టుకుని చెయ్యడం సాధ్యం కాదు. అవసరమైతే పోలీసులు & తుపాకులని నమ్ముకుని ప్రజా పోరాటాలని అణచివెయ్యాల్సి వస్తుంది. పోలీసులు & తుపాకులని నమ్ముకుంటూనే గాంధేయవాదాన్ని ఆచరించడం అంటే అది పాలకులకి ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక గాంధేయవాదాన్ని అడ్డం పెట్టుకుని తమ పనులు కానిచ్చుకోవాలనుకునే దోపిడీ వర్గంవాళ్ళకి కూడా అది ఊహాత్మక శాస్త్రమే.

  ఊహాత్మకతకీ, వాస్తవికతకీ మధ్య తేడాలు గురించి చర్చించాలంటే దేవుడు, దెయ్యం లాంటి మూఢ నమ్మకాలని దూరంగా ఉండాల్సిందే. వ్యక్తిగతంగా దేవుణ్ణి నమ్మినా, సమాజం గురించి చర్చిస్తున్నప్పుడు ఆ నమ్మకాలని పక్కన పెట్టి వాస్తవికత గురించి మాట్లాడాల్సి వస్తుంది. “మూఢ నమ్మకాల వైపు వెళ్ళకు, భౌతిక జీవితం గురించి ఆలోచించు” అని కొన్ని సార్లైనా సాధారణ ప్రజలకి చెప్పాలి. ఆ విషయం చెప్పకపోతే కేవలం మతపరమైన నమ్మకాలే కాదు, మతానికి పరిమితమవ్వని గాంధేయవాదం లాంటి ఆధునిక వైరాగ్య వేదాంతాలు కూడా బలపడతాయి.

 16. “మేము చరిత్ర తెలుసుకోము అనీ, స్కూల్ పుస్తకాలలో వ్రాసిన చరిత్రనే ప్రామాణిక చరిత్రగా నమ్ముతాము అనీ” పంతం పట్టేవాళ్ళకి ఎవరూ ఏమీ చెప్పలేరు. మార్క్సిస్ట్‌లని కూడా కులం పేరుతో తిట్టే కంచ ఐలయ్య అనే కుల గజ్జి మేతావి “రామాయణం నిజంగా జరిగింది కానీ అందులో రావణాసురుడు హీరో” అని అంటే కంచ ఐలయ్య కూడా మార్క్సిస్టే అని తీర్మానించేశారు కొంత మంది పచ్చ కామెర్ల రోగులు. పచ్చ కామెర్ల వాడుకి లోకం అంతా పచ్చగానే కనిపించినట్టు వీళ్ళకి తమ భావజాలాన్ని వ్యతిరేకించేవాళ్ళందరూ ఎర్ర బాబులలాగే కనిపిస్తారు. కంచ ఐలయ్య మార్క్సిస్ట్ కాదు అని నేను చెపితే అతను మావోయిస్ట్ అయ్యుంటాడు అని అడ్డమైన సమాధానం చెప్పారు. మావోయిస్ట్‌లు కూడా మార్క్సిస్ట్‌లే. చారిత్రక భౌతికవాదాన్ని అవగాహన చేసుకునేటప్పుడు మావోయిస్ట్‌లు మావో జెడాంగ్ ప్రతిపాదించిన “New Democracy” థియరీని విశ్వసిస్తారు. అదే ఇతర మార్క్సిస్ట్‌లకీ, మావోయిస్ట్‌లకీ మధ్య ఉన్న తేడా. “మార్క్సిజంకి కాలం చెల్లిందనీ, మేము ఎర్ర పుస్తకాలు చదవము అనీ” పంతం పట్టినవాళ్ళకి మనం చెప్పగలిగేది ఏమీ ఉండదు. రంగనాయకమ్మ గారు వ్రాసిన “రామాయణ విషవృక్షం” పైన కూడా ఇవే తరహా విమర్శలు వస్తున్నాయి. “రంగనాయకమ్మ హిందువుల మనోభావాలని దెబ్బతీసింది” అని వాళ్ళ వాదన. రంగనాయకమ్మ గారు ఒక మతాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చెయ్యలేదని “రామాయణ విషవృక్షం” పుస్తకంలో ఇంట్రొడక్షన్ చదివినా అర్థమైపోతుంది. అయినా ఆ పుస్తకం ముఖం చూడడానికి వాళ్ళు ఇష్టపడకపోతే వాళ్ళని ఎవరూ మార్చలేరు.

 17. ప్రజలు బొట్టు పెట్టుంటున్నారని ఈ నాయకులు బొట్టు పెట్టూకుంటున్నారని అన్నారు అలా ఐతె ప్రజలు ఏది చెస్తె వీల్లు అదే చేస్తారా ప్రజలని వీల్లు అనుకరించాలా, ప్రజలు వీల్లని అనుసరించాలా ……..

 18. రామాయణం విష వ్రుక్షమో ఏవ్రుక్షమో ఇప్పుడు అనవసరం రామ రాజ్యం అంటే శ్రేయో రాజ్యం సంక్షేమ రాజ్యం అనేగా అర్దం ఆ భావన ల కోసమే కదా ఎవరు ఏది రాసినా అందరి గోల ఒక్కటే పాలించటం ………… అందరి లక్ష్యం ఒక్కటె దారులు వేరు .

 19. madyalo paapam kanche ilayya emi chesaru ravanasurudu hero ani enduku anakoodadu ravanasurudu konta mandiki hero kadu DEVUDU evariki ishtam unnaa lekunnaa adi nijam. nijam matladite pacha kamerlu ante evaremi chestaru kanche ilayya marxist kadu maolist kadu oka medhaavi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s