సూడాన్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాల దాడులు


Photo: The Australian

దురహంకార ఇజ్రాయెల్ తమ రాజధాని నగరంపై బాంబు దాడులు చేసిందని సూడాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఫైటర్ జెట్ యుద్ధ విమానాలతో దాడి చేసి మందుగుండు ఫ్యాక్టరీని ధ్వంసం చేసిందని సూడాన్ సమాచార మంత్రి అహ్మద్ బెలాల్ ఒస్మాన్ బుధవారం తెలిపాడు. పౌరనివాస ప్రాంతాలపై అక్టోబర్ 23 తేదీన  ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందనీ, పేలుడులో ఇద్దరు పౌరులు చనిపోయారనీ మంత్రి తెలిపాడు. దాడులకు గురయిన చోట లభ్యమైన రాకెట్ శిధిలాల ద్వారా ఇది ఇజ్రాయెల్ పనేనని స్పష్టమయిందని తెలిపాడు. సూడాన్ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించలేదు. అలాగని ఆమోదించనూలేదు.

దొంగదాడులు చేసినపుడు నోరు మూసుకుని ఉండడం ఇజ్రాయెల్ అనుసరించే వ్యూహం. ఆ వ్యూహం ద్వారా ఇజ్రాయెల్ రెండు ప్రయోజనాలు ఆశిస్తుందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట! ఒకటి: దాడి తాము చేసిందేనని పరోక్షంగా చెప్పడం. రెండు: మౌనంగా ఉండడం ద్వారా ఐరాస, అంతర్జాతీయ ఖండన మండనలకు, విచారణా కమిషన్లకు దూరంగా ఉండడం. దాడి తాము చేయలేదని చెప్పడం అంటే తమకా ఉద్దేశ్యం లేదని చెప్పినట్లవుతుంది. అలా చెప్పడం ఇజ్రాయెల్ కి ఇష్టం ఉండదు. తమ మాట వినకపోతే వినడానికి ఎంతకైనా తెగిస్తామని ఇజ్రాయెల్ తన చర్యల ద్వారా చెబుతుంది. గూండాయిజంతో బలవంతంగా లొంగదీసుకోవడం ఇజ్రాయెల్ జాత్యహంకార దుష్ట పాలకులకు అత్యంత ఇష్టమైన ఎత్తుగడ. బలవంతపు అణచివేతలకు, దాడులకు, దురాక్రమణలకు చిరునామా అయిన అమెరికా దానికి అండ.

అందుకే సూడాన్ ఆరోపణలకు స్పందించడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. సూడాన్ పై దాడులు చేయడం ఇజ్రాయెల్ కి కొత్త కాదు. గాజా (పాలస్తీనా) ప్రజలపై ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుషమైన జాత్యహంకార అణచివేతకు వచ్చే ప్రతిఘటన ఇజ్రాయెల్ ని నిరంతరం భయపెడుతూ ఉంటుంది. మధ్యధరా సముద్రంలో ఏ ఓడ ప్రయాణించినా అది గాజా ప్రజలకు ఆయుధాలు ఇవ్వడానికే అని అనుమానిస్తుంది. పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా దేశాల్లో నిరంతరం నిఘా పెట్టి కార్లలో, బస్సుల్లో, రైళ్లలో గాజాకి ఆయుధాలు సరఫరా అవుతున్నాయేమో, టెర్రరిస్టులు ప్రయాణిస్తునారేమో అని వెతుకుతూ ఉంటూంది. అనుమానం వస్తే బాంబు దాడులు చేసి వాహనాల్లో ఉన్నవారిని ఎలాంటి వెనకంజా లేకుండా చంపేస్తుంది. సూడాన్, ఈజిప్టు, జోర్డాన్, లిబియా తదితర దేశాలన్నీ ఇజ్రాయెల్ దాష్టీకాన్ని నిత్యం అనుభవిస్తున్నవే. తాజా సూడాన్ దాడి దానికి కొనసాగింపు.

పాలస్తీనా మిలిటెంట్లకు సూడాన్ ఫ్యాక్టరీ నుండి ఆయుధాలు సరఫరా అవుతున్నాయని ఇజ్రాయెల్ అనుమానం. ఆ అనుమానం అనేకసార్లు ఇజ్రాయెల్ వ్యక్తం చేసింది. పాలస్తీనీయుల భూములను, ఇళ్లను, పొలాలనీ ఆక్రమించుకుని, వారి దేశాన్ని అక్రమంగా లాక్కున్న ఫలితంగా ఏర్పాటయిన ఇజ్రాయెల్ రాజ్యానికి స్వతంత్ర దేశాల సార్వభౌమ హక్కులను గౌరవించే బుద్ది, నియమం లాంటివేవీ లేవు. అందువల్లనే నిరంతరం ఇజ్రాయెల్ తన భద్రత గురించి భయాలు వ్యక్తం చేస్తూ కూడా సూడాన్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించి మరీ బాంబుదాడులకు తెగబడింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్ లోని ‘యార్మౌక్ ఆయుధ ఫ్యాక్టరీ’ నుండి పాలస్తీనా మిలిటెంట్లకు ఆయుధాలు సరఫరా అవుతున్నాయన్న అనుమానంతో మిలటరీ ఫైటర్ విమానాలతో దాడి చేసి ఇద్దరినీ బలిగొంది. ఇరాన్ నుండి సూడాన్, ఈజిప్టు, సినాయ్ ద్వీపం ల మీదుగా గాజా మిలిటెంట్ సంస్ధ ‘హమాస్’ కి ఆయుధాలు అందుతున్నాయన్న అనుమానాన్ని తమ విశ్లేషకుల ద్వారా పత్రికలకు చేరవేసింది. తన ఆరోపణకి రుజువులు చూపాలని ఇజ్రాయెల్ ఎన్నడూ భావించలేదు.

మౌమ్మర్ గడాఫీ మరణానంతరం లిబియా నుండి అత్యాధునిక ఆయుధాలు గాజా మిలిటెంట్లకు అందాయని గతంలో ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ నెలలో గాజా నుండి విమాన విధ్వంసక మిసైళ్ళను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలపై ప్రయోగించడంతో ఆ దేశ పాలకులకు విశ్రాంతి లేకుండా పోయింది. ఈ ఆయుధాలు లిబియానుండి సరఫరా అయ్యాయని చెబుతున్న ఇజ్రాయెల్ లిబియాలో ఉన్నది తాము ప్రతిష్టించిన ముస్లిం టెర్రరిస్టుల ప్రభుత్వమేనన్న విషయాన్ని దాచిపెడుతోంది.

సూడాన్ దాడి చేసిన విమానాలు ఆధునిక టెక్నాలజీని వినియోగించాయనీ, విమానాలని కనిపెట్టే వ్యవస్ధను అవి అధిగమించి దాడి చేశాయనీ సూడాన్ మంత్రి తెలిపాడు. అలాంటి ఆధినిక టెక్నాలజీ ఇజ్రాయెల్ మాత్రమే కలిగి ఉందని తెలుస్తోంది. గతం దాడులకు కూడా ఇజ్రాయెల్ దే బాధ్యతని సూడాన్ గతంలో కూడా అనేకసార్లు ప్రకటించింది. 2009 లో తూర్పు సూడాన్ లో ప్రయాణిస్తున్న ట్రక్కులపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది. గత సంవత్సరం అదే ప్రాంతంలో ఒక వాహనంపై దాడి చేసి ఇద్దరినీ చంపేసింది. ఈ సంవత్సరం మే నెలలో అదే తరహా దాడి చేసి ఒకరిని చంపేసింది. తమ దేశ రక్షణ కోసం తాము అభివృద్ధి చేసుకుంటున్న మిలట్రీ సామర్ధ్యాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పెట్టుకుందని సూడాన్ ఆరోపించింది. ఇలాంటి దాడుల్లో తమ పాత్రను గురించి ఇజ్రాయెల్ ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. వ్యూహాత్మక మౌనం పాటించడం ద్వారా తాను చేసేది చేసేదే నని ఇజ్రాయెల్ సందేశం ఇస్తూ అమెరికా, యూరప్ ల తరహాలోనే రౌడీ విదేశాంగ విధానాన్ని అవలంబిస్తూ వచ్చింది. ఇజ్రాయెల్ దురుద్దేశ్యాలను గొప్ప లక్ష్యాలుగా ప్రచారం చేయడంలో తగిన పాత్ర నిర్వహించే పనిలో పశ్చిమ పత్రికలు ఎప్పుడూ అలసట ప్రదర్శించలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s