‘రివర్స్ స్టింగ్’ లో దొరికిపోయిన జీ న్యూస్ బ్లాక్ మెయిలింగ్


వీడియోలో ఓ దృశ్యం -ఫొటో: ఇండియా టుడే

స్టింగ్ ఆపరేషన్లతో ఠారెత్తిస్తున్న మీడియా రివర్స్ స్టింగ్ ఆపరేషన్ లో బైటపడిపోయి నీళ్ళు నములుతోంది. జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ (జె.ఎస్.పి.ఎల్) ఛైర్మన్ నవీన్ జిందాల్ ను బొగ్గు కుంభకోణం స్టోరీతో బ్లాక్ మెయిల్ చెయ్యబోయిన జీ న్యూస్ ఎడిటర్లు రహస్య కెమెరాకి అడ్డంగా దొరికిపోయారు. కుంభకోణం స్టోరీని ప్రసారం చెయ్యకుండా ఆపడానికి మొదట 20 కోట్లు ఆ తర్వాత 100 కోట్లు కెమెరా ముందు డిమాండ్ చేసిన జీ న్యూస్ ఎడిటర్లు తాము స్టింగ్ ఆపరేషన్ కోసం ఫేక్ డీల్ ని సృష్టించామే తప్ప వాస్తవానికి ఏ డీల్ నీ తాము చేయలేదని ఇపుడు తడబడుతున్నారు. భారత జాతీయోద్యమంతో ఉన్నంతవరకు ప్రతిష్టాత్మకమైన ఉద్యమ పాత్ర పోషించిన భారత మీడియా ఇపుడు పెట్టుబడి చేతుల్లోకి పోయాక పెట్టుబడికి ఉండే వైకల్యాలన్నింటినీ అంటించుకుందని జీ న్యూస్ వ్యవహారం స్పష్టం చేస్తున్నది.

కాంగ్రెస్ ఎం.పి కూడా అయిన నవీన్ జిందాల్ గురువారం ప్రెస్ మీట్ పెట్టి 14 నిమిషాల నిడివి గల వీడియో ఉన్న సి.డి ని విలేఖరులకు పంపిణీ చేయడంతో విషయం పూర్తిస్ధాయిలో బైటికి వచ్చింది. సెప్టెంబర్ మధ్యలో జె.ఎస్.పి.ఎల్ అధికారులతో సుధీర్ చౌదరి (జీ న్యూస్), సమీర్ అహ్లూవాలియా (జీ బిజినెస్) లు జరిపిన వరుస సమావేశాలను రికార్డు చేసి అందులో ముఖ్యమైన భాగాలని సి.డి లో పొందుపరిచినట్లు నవీన్ తెలిపాడు. మీడియా దుర్మార్గాలను మొట్టమొదటిసారిగా ఒక భారత కార్పొరేట్ సంస్ధ బైటపెట్టిందని ఆయన ప్రకటించాడు. “వార్తలను చూపడానికి ప్రభుత్వం చానెళ్లకు లైసెన్సులు ఇచ్చింది. బలవంతపు వసూళ్లకో, బ్లాక్ మెయిలింగ్ చెయ్యడానికో వారికి లైసెన్సులు ఇవ్వలేదు” అని నవీన్ వ్యాఖ్యానించాడు. బలవంటపు వస్తూళ్ళకు పాల్పడినందుకుగాను తాము జీ చానెల్ పై క్రిమినల్ కేసు పెట్టామని, తమ కంపెనీ పైనే బ్లాక్ మెయిల్ ఆరోపణ చేయడంతో వీడియోను బైటపెట్టక తప్పలేదని తెలిపాడు. కొద్ది రోజుల్లో పరువు నష్టం కేసు కూడా పెడతామని తెలిపాడు.

‘ది హిందూ’ పత్రిక ప్రకారం ఒక హోటల్ లో జీ ఎడిటర్లు జె.ఎస్.పి.ఎల్ కంపెనీ అధికారులతో బేరాసారాలు చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. కంపెనీ అధికారులు తమకు మొదట 20 కోట్లే అని చెప్పారని జీ ఎడిటర్లతో చెబుతున్నట్లు రికార్డయి ఉంది. అది సమాచార లోపం మాత్రమేననీ, సంవత్సరానికి 25 కోట్లు చొప్పున నాలుగేళ్ళకు 100 కోట్లు ఇవ్వాలని తాము చెప్పామనీ, కాఫీ బార్ లో పెద్ద శబ్దంతో వస్తున్న మ్యూజిక్ వల్ల సరిగా వినపడకపోయి ఉండవచ్చనీ అహ్లూవాలియా వివరిస్తున్న దృశ్యం కూడా రికార్డయి ఉంది.

కాంట్రాక్టు ఒప్పుకుని సంతకం చేస్తే ఇక ప్రతికూల ప్రసారం (negative coverage) చానెల్ లో ఉండదని చౌదరి హామీ ఇస్తున్నాడు. “చూడండి. మీకు అత్యంత పెద్ద రక్షణ ఏమిటంటే ఇక ఇప్పటినుండి ఏ విషయమూ బైటికిరాదు… పెద్ద లాభం ఏమిటంటే ఇకముందు ఎటువంటి నష్టమూ ఉండదు. అంటే ఆ గొయ్యిని మీరు తృటిలో తప్పించుకున్నట్లే” అని చౌదరి చెబుతున్నట్లు వీడియోలో రికార్డయింది. ఈ ఒప్పందాన్ని జీ చానెళ్లన్నీ పాటిస్తాయని చౌదరి హామీ ఇచ్చాడు. ఇకముందు జిందాల్ బొగ్గు కుంభకోణం గురించి జనం మాట్లాడకుండా ఉండడానికి సూక్ష్మమైన చతురతతో కవరేజ్ ఉంటుందని ఆయన హామీ ఇచ్చాడు. అంటే బొగ్గు కుంభకోణంతో జిందాల్ కంపెనీకి సంబంధం లేదని జనం నమ్మేవిధంగా వరుస కధనాలు ప్రసారం చేస్తామని జీ న్యూస్ ఎడిటర్లు హామీ ఇచ్చారన్నమాట!

తన హామీపై నమ్మకం కలిగించడానికి జీ ఎడిటర్లు చానెల్ లోపలి పని పద్ధతుల్ని కంపెనీ అధికారుల ముందు పరిచారు. తద్వారా తన హామీ నమ్మదగ్గదే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. సాధారణంగా వార్తా సంస్ధలో వార్తా విభాగానికి ప్రకటనల విభాగం ఒక క్లయింటు లాంటిదనీ, కాంట్రాక్టు కుదిరితే గనక ‘ఒక మాదిరిగా’ (go soft) పోవాలని యాజమాన్యం, ప్రకటనల విభాగం కలిసి వార్తా విభాగానికి నచ్చజెపుతుందనీ వివరించారు. అయితే జిందాల్ కంపెనీ విషయంలో అలా కాదని తెలిపారు. అంటే ఈ సారి మాత్రం యాజమాన్యం, ప్రకటనల విభాగంతో పాటు వార్తల విభాగం కూడా బలవంతపు వసూలులో భాగం పంచుకుంటోందనీ కనుక పాజిటివ్ కవరేజి తో వార్తలని కుమ్మేస్తామని జీ చానెల్ చెప్పిందని స్పష్టం అవుతోంది. స్వయంగా ఎడిటర్లే చర్చల్లో పాల్గోవడంతో జిందాల్ ఆరోపణలకి నిఖార్సయిన ఆమోదం లభించే అవకాశం చేకూరింది. తామే వాస్తవంగా స్టింగ్ జరుపుతున్నామని జీ న్యూస్ చెప్పినప్పటికీ దానికి తగిన ఆధారాలేవీ సదరు చానెల్ ఇంతవరకూ బైటపెట్టలేదు.

వసూళ్లకి సిద్ధపడిన ఎడిటర్లు తమ వసూళ్ళు కొత్తేమీ కాదనీ, తమకు మాత్రమే పరిమితం కాదనీ కూడా చెప్పుకున్నారు. “ఎనీవే, ప్రపంచంలో లేనిదేమీ మేము అడగడం లేదు. ఎక్కడినుండో ఊడిపడిన ప్రాక్టీస్ కాదిది” అని అహ్లూవాలియా వీడియో చివరన ప్రకటించాడు. “నిజానికి మీతో మేము చాలా పారదర్శకమైన ఒప్పందం చేస్తున్నాం. మేము కనీసం డబ్బులు తీసుకుని ఫ్రంట్ పేజీ వార్తలు వెయ్యడం లేదు…” అని చెప్పిన అహ్లూవాలియా ఇలా కొనసాగించాడు. “ప్రతి ఒక్కరూ ఈ వ్యాపారంలో ఉన్నారు… ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తో మీరు వ్యాపారం ఆపి చూడండి. వారిక మొదలుపెడతారు (నెగిటివ్ కవరేజ్ ని)… ఒకసారి ప్రయత్నించి చూడండి మరి.” తమ వాదనకి మద్దతుగా చౌదరి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ అనుబంధ కాపీలను చూపించాడు. డిల్లీ టైమ్స్, బోంబే టైమ్స్ (టైమ్స్ ఆఫ్ ఇండియా అనుబంధ పత్రికలు) పూర్తిగా డబ్బులు తీసుకుని వార్తలు రాస్తున్నవేనని చౌదరి కుండబద్దలు కొట్టాడు. అందులో వచ్చే ఇంటర్వ్యూలు, ఫోటోలు అన్నీ స్పాన్సర్ చేసినవేనని తెలిపాడు. మీడియానెట్ లో వచ్చే పాజిటివ్ సినిమా రివ్యూలు కూడా ఏర్పాటు చెయ్యబడ్డవేనని ఆయన తెలిపాడు. ఇతర పత్రికలపై జీ ఎడిటర్లు వీడియోలో చేసిన ఆరోపణల గురించి టైమ్స్ గ్రూప్ పబ్లికేషన్స్ ను వివరణ కోరగా వారు వ్యాఖ్యానించడానికి నిరాకరించారని ‘ది హిందూ’ తెలిపింది.

అయితే వీడియో సంభాషణల గురించి జీ ఎడిటర్లను వివరణ కోరగా అదంతా అబద్ధమని కొట్టిపారేశారని ‘ది హిందూ’ తెలిపింది. తాము చెప్పింది డమ్మీ కాంట్రాక్టు గురించేననీ, వార్తను అణగదొక్కడానికి జిందాల్ ఎంతకు తెగిస్తారో చెప్పడానికే స్టింగ్ ఆపరేషన్ చేశామని తెలిపారు. దానికి తగిన ఆధారాలు మాత్రం వారు విడుదల చేయలేదు. కోల్ గేట్ పై సాగుతున్న స్వతంత్ర దర్యాప్తుని పక్కదారి పట్టించడానికి, నోళ్ళు మూయించడానికీ జిందాల్ ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నాడని ఆ తర్వాత ప్రకటనలో వారు ఆరోపించారు. అయితే జీ న్యూస్ పై తప్పుడు సాక్ష్యాలు ఇస్తే కోల్ గేట్ దర్యాప్తు ఎలా పక్కకు మళ్లుతుందో వారు చెప్పలేదు.

నవీన్ జిందాల్ బైటపెట్టిన సాక్ష్యాలతో మీడియా కంపెనీలు దాదాపు హతాశులయ్యాయి. బహుశా తమ వార్తల వ్యాపారం మరీ ఇంత పచ్చిగా బైటపడుతుందని వారు కలలో కూడా ఊహించి ఉండరు. తెలుగు చానెళ్లు జిందాల్, జీ న్యూస్ వ్యవహారాన్ని పెద్దగా కవర్ చేయనేలేదు. స్క్రోలింగ్ లో కూడా వచ్చినట్లులేదు. జాతీయ చానెళ్లు కూడా ఈ వార్తను సంచలనంగా కాకుండా రోజువారీ వార్తగా ప్రసారం చేసి వదిలిపెట్టినట్లు కనిపిస్తోంది. జీ ఎడిటర్ చెప్పినట్లు చానెల్, పత్రిక ఏదయినా ఇలాంటి వ్యవహారాలన్నీ మీడియా కంపెనీలకు తెలియనిదేమీ కాదు.

వార్తకు ఉన్న సామాజిక ప్రయోజనాన్ని, చైతన్యయుత పాత్రనీ క్రమంగా పక్కకు నెట్టి వ్యాపార ప్రయోజనాలు ప్రధాన స్ధానంలోకి ప్రవేశించడమే నేటి కార్పొరేట్ మీడియాకి ఉన్న స్వాభావిక లక్షణం. జాతీయోద్యమం నడుస్తున్న రోజుల్లో పత్రికల లక్ష్యం స్వాతంత్ర్య పోరాటానికి ప్రజలను తయారు చేయడం. అప్పటి పత్రికలకు ఆర్ధిక వనరులను సమకూర్చినవారు కూడా జాతీయ విముక్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. అందువల్లనే అవి త్రికరణశుద్ధిగా విలువలను పాటించి వార్తా లక్ష్యాల్ని సమర్ధవంతంగా నెరవేర్చాయి. ఇప్పుడు పరిస్ధితి అది కాదు. దేశ వనరులను అక్రమ పద్ధతుల్లో స్వాధీనం చేసుకుంటున్న అంబానీ లాంటి వారే పత్రికలను, చానెళ్లను కొనేయడం ప్రారంభించాక జాతి ప్రయోజనాలను మీడియా కంపెనీలు నెరవేరుస్తాయని ఆశించడమే దండగ కావచ్చు.

పెట్టుబడి రంగంలోకి వచ్చాక అది తన లక్ష్యమైన లాభం కోసమే పని చేస్తుంది, చేయిస్తుంది. లాభం ఎన్ని అక్రమాల వల్ల వచ్చినా దానికి ఫర్వాలేదు. పెట్టుబడికీ సమాజం, మనిషి, దేశం ఇవేవీ పట్టవు. అలాంటి పెట్టుబడి నీడలో కునుకుతున్న మీడియాకు విలువలు లేవని ఆక్రోశించడం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే కావచ్చు. పెట్టుబడి ప్రయోజనాల కోసం కాకుండా సామాజిక లక్ష్యం కోసం పని చేస్తున్న అనేక చిన్న, మధ్య స్ధాయి పత్రికలు దేశంలో ఉన్నాయి. అవింకా ప్రకటిత లక్ష్యసాధన కోసం పాటుపడుతుండడం సంతృప్తి కలిగించే విషయం.

5 thoughts on “‘రివర్స్ స్టింగ్’ లో దొరికిపోయిన జీ న్యూస్ బ్లాక్ మెయిలింగ్

  1. మన దేశం లో కుడా BBC లాంటి మోడల్ ను ఆచరణ లోకి తీసుకుని రావాలి. దూరదర్శన్ ఉన్నప్పటికీ, వారికి సర్కారు నియంత్రణ ఎక్కువ ఉన్నట్లు అనిపిసు్తంది. బ్రిటన్ లో BBC ని ప్రజా ధనంతో నడుపుతారు మరియు సర్కారు కి ఆ సంస్ఠ పై అధికారము పెద్దగా ఉండదు. Its not perfect, but slightly better than the current situation.

  2. ఆల్రెడీ 10 టివి లో లాబీయింగ్ జ‌రుగుతుంది… అందులోను ఒక పార్టీ ఫండ్తో వచ్చే ఆ ఛాన‌ల్ను ఎవ‌రు న‌మ్ముతారు మిత్రమా.. మ‌నం అంద‌రం చందాలేసుకుకొని ఒక కొత్త ఛాన‌ల్ ఫెడ‌దాము.

  3. నందుగారూ 10 టి.వి లో లాబీయింగా? వివరించగలరా?

    అశోక్ గారూ, టెన్ టి.వి సి.పి.ఎం పార్టీదేనని కొందరూ, కాదని మరికొందరూ చెబుతున్నారు. సి.ఐ.టి.యు వాళ్లు పనిగట్టుకుని షేర్లు అమ్ముతున్న పరిస్ధితుల్లో సి.పి.ఎం కీ టెన్ టి.వి కి సంబంధం లేదన్న వాదనలో నిజం కనిపించడం లేదు. ఇంతకీ ఏది నిజం? టెన్ టి.వి లో సి.పి.ఎం పాత్రం ఎంతవరకు ఉంది?

  4. 10 టివిలో సిపిఎం ఫండ్స్ ఏవీ లేవు.సిపిఎంకు సంబంధం లేదు. కొందరు అభ్యుదయ వాదులు, సీఐటియు, యుటిఎఫ్ లాంటి సంస్థల భాగస్వామ్యంతో నడుస్తుంది. సిపిఎం మరియు ఇతర అభ్యుదయ వాదులందరి సలహాలు సూచనలూ తీసుకొని దీనిని నడిపిస్తున్నాము

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s