ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో మరింతగా కూరుకుపోతున్న నేపధ్యంలో ప్రపంచ ఆర్ధిక శక్తుల మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతున్నాయి. టోక్యోలో జరిగిన ఐ.ఎం.ఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకుల వార్షిక సంయుక్త సమావేశంలో ఈ విభేధాలు ప్రస్ఫుటంగా వ్యక్తం అయ్యాయి. ప్రపంచ కాబూలీ సంస్ధలయిన ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల 2012 వార్షిక సమావేశాలు జపాన్ రాజధాని టోక్యో లో అక్టోబర్ 9 నుండి 14 వరకు జరిగాయి. పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నిర్విఘ్నంగా నెరవేరడానికి సూత్రాలు, ఒప్పందాలు రచించే వార్షిక సమావేశాలు ఈసారి విభేదాల వ్యక్తీకరణకు కూడా బహిరంగ వేదికలుగా మారాయి. చైనా, జపాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ‘కరెన్సీ యుద్ధం’ కి దారీ తీసే విధంగా అమెరికా ప్రకటించిన ‘క్వాంటిటేటివ్ ఈజింగ్ –3’, యూరప్ లో పొదుపు విధానాల అమలులో జర్మనీ, ఐ.ఎం.ఎఫ్ ల మధ్య విభేదాలు, అమెరికాలో ‘ఫిస్కల్ క్లిఫ్’ గా పేర్కొంటున్న పన్నులు, కోతల జాతర… మొదలయిన అంశాలు ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు సమావేశాల్లో సంఘర్షణల రూపం తీసుకున్నాయి.
ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల వార్షిక సమావేశాల్లో అనేక ప్రభుత్వ, ప్రవేటు, అంతర్జాతీయ సంస్ధలు, వ్యక్తులు పాల్గొంటారు. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల అధిపతులు, ఆర్ధిక మంత్రులు, బహుళజాతి కంపెనీల అధిపతులు, ఆర్ధికవేత్తలు వీరిలో ఉంటారు. ఆర్ధిక వృద్ధి, ఆర్ధిక సహాయం, వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్ మున్నగు అంశాలు సమావేశాల్లో చర్చిస్తామని ఈ సంస్ధలు చెబుతాయి. దారిద్ర్య నిర్మూలన గురించి చర్చిస్తామని కూడా చెబుతాయి. అయితే ఈ సంస్ధలు ఆర్ధిక వృద్ధి గురించి చర్చించినా, ఆర్ధిక సహాయాలపై వాగ్దానాలు గుప్పించినా అవన్నీ అంతిమంగా అమెరికా, యూరప్, జపాన్ దేశాల బహుళజాతి కంపెనీల దోపిడీకి ఎదురవుతున్న సమస్యలను తీర్చే దిశలోనే సాగుతాయి. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత ‘మహా మాంద్యం’ (Great Recession) నెలకొన్న పరిస్ధితుల్లో వనరుల స్వాయత్తంలోనూ, మార్కెట్ల పంపిణీలోనూ అగ్ర దేశాల మధ్య తేడాలు పెరగడంతో తాజా వార్షిక సమావేశాలు సహజంగానే విభేధాలకు వేదికలుగా మారాయి.
జపాన్, చైనాల తగాదా
దక్షిణ చైనా సముద్రంలోని ద్వీప కల్పం విషయంలో టోక్యో సమావేశాలకు ముందే చైనా, జపాన్ ల మధ్య తీవ్రస్ధాయి విభేదాలు చోటు చేసుకున్నాయి. ‘సెంకాకు’ గా జపాన్, ‘దియోయు’ గా చైనా పిలుచుకునే ఈ ద్వీపకల్పం మానవ నివాసయోగ్యం కాదు. కానీ ఈ దీవుల వద్ద పెద్ద ఎత్తున ఆయిల్ వనరులతో పాటు మత్స్య సంపద కూడా పుష్కలంగా ఉండడంతో దీవుల సొంతదారు ఎవరన్న విషయంలో ప్రాంతీయంగా తీవ్ర పోటీలు, విభేదాలు నెలకొన్నాయి. జపాన్, చైనాల తో పాటు వియత్నాం, ధాయిలాండ్ లు కూడా ఈ దీవులు తమవేనని వాదిస్తుండడంతో బహుళపక్ష వివాదంగా ఇది రూపుదిద్దుకుంది. చైనాను నిలువరించేందుకు అమెరికా సాగిస్తున్న జియో పొలిటికల్ వ్యూహాలకు ఆటస్ధలంగా కూడా ఈ దీవులు మారిపోయాయి.
ఇలాంటి దీవులకు తమ దేశపౌరుడోకరు సొంతదారు అనీ అతని వద్ద నుండి తాము కొనుగోలు చేస్తున్నామనీ జపాన్ ప్రకటించడంతో దక్షిణ చైనా సముద్రంలో మరొకసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. దియోయు దీవులు తమ సార్వభౌమ ప్రాంతం అని చైనా మరొకసారి నొక్కి చెప్పింది. జపాన్ ప్రభుత్వ ప్రకటన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేదిగా ఉందని ఆగ్రహించింది. దీవుల వద్దకి సైనిక నౌకను కూడా చైనా పంపింది. టోక్యో సమావేశాల ముందు రోజు వరకూ దీవుల విషయమై ఇరు దేశాల మధ్య పోటా పోటీగా ప్రకటనల యుద్ధం సాగింది. చివరికి చైనా సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ఝౌ జియావోచువాన్ తాను టోక్యో సమావేశాలకు హాజరు కాబోనని ప్రకటించడం వరకూ పరిస్ధితి వెళ్లింది. ఆయన బదులు డిప్యూటీ గవర్నర్ హాజరయినప్పటికీ ప్రధాన అధికారి హాజరుకాకపోవడం తీవ్రమైన విషయంగానే అంతర్జాతీయ పరిశీలకులు భావించారు. కొద్ది రోజుల్లో ప్రపంచస్ధాయి సమావేశాలు ఉన్నాయనగా జపాన్ వివాదాస్పద ప్రకటన చేయడం ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందేననీ, అమెరికా నేతృత్వంలోని పశ్చిమ సామ్రాజ్యవాద శిబిరం చైనాపై ఒత్తిడి పెంచి తగిన ఫలితం సాధించేందుకు ఆ దేశాలు ఎత్తుగడవేసాయనీ అంతర్జాతీయ పరిశీలకులు కొందరు విశ్లేషించారు.
క్వాంటిటేటివ్ ఈజింగ్ –3 (క్యు.ఇ-3)
ఆర్ధిక వ్యవస్ధలో చురుకు పుట్టించే పేరుతో డబ్బును మార్కెట్లో పెద్ద మొత్తంలో కుమ్మరించడమే ‘క్వాంటిటేటివ్ ఈజింగ్.’ సెంట్రల్ బ్యాంకులు అమలు చేసే ద్రవ్య విధానంలో ఇదొక భాగం. ఇచ్చిన అప్పు తిరిగి వస్తుందో లేదోనన్న భయంతో ఏర్పడే ‘క్రెడిట్ క్రంచ్’ (డబ్బుని ఎక్కడికక్కడ బిగదీసుకుపోయి అప్పు పుట్టని పరిస్ధితి ఏర్పడడం) నుండి బయటపడడానికి ఫెడరల్ రిజర్వ్ వరుసగా క్యు.ఇ లను ప్రకటిస్తోంది. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కే పేరుతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్), ట్రెజరీలు వాల్ స్ట్రీట్ కంపెనీల నిలువుదోపిడి కోసం 1.5 ట్రిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీలు ప్రకటించి అమలు చేయగా, వాటికి అదనంగా క్యు.ఇ లను ఫెడ్ అమలు చేసింది.
2009 డిసెంబర్ లో 1.425 ట్రిలియన్ డాలర్ల మేరకు మొదటి క్వాంటిటేటివ్ ఈజింగ్ (క్యు.ఇ-1) ఒబామా ప్రభుత్వం ప్రసాదించింది. రెండు బెయిలౌట్లు, ఒక క్యు.ఇ ల ప్రభావం అంతర్ధానం కావడంతో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి 2010లో మళ్ళీ బాగా నెమ్మదించింది. (సంక్షోభం అనంతరం అమెరికా నమోదు చేస్తున్న వృద్ధి వాస్తవానికి సృష్టించినదే తప్ప ఒరిజినల్ కాదని ఈ సందర్భంగా గమనించవలసిన విషయం.) దానితో 2010 రెండో అర్ధ భాగంలో 600 బిలియన్ డాలర్ల మేరకు రెండవ క్యు.ఇ (క్యు.ఇ-2) ని ఫెడరల్ రిజర్వ్ ప్రకటించి అమలు చేసింది. క్యు.ఇ-2 ని ప్రకటించినప్పుడే అమెరికాపై ఇతర దేశాలనుండి తీవ్ర విమర్శలు వచ్చాయి.
అమెరికా విచ్చలవిడిగా డబ్బు కుమ్మరించడం వలన అది ప్రపంచ ద్రవ్య మార్కెట్లోకి ప్రవేశించి అన్ని దేశాల్లోనూ డబ్బు ప్రవాహాన్ని పెంచింది. ఫలితంగా ఇండియాతో సహా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. క్యు.ఇ పై విమర్శలకు ఇది ఒక కారణం కాగా కరెన్సీల విలువల్లో మార్పులు రావడం మరొక కారణం. డాలర్లను కుమ్మరించడం వలన డాలర్ల సరఫరా పెరిగి డాలర్ విలువ పడిపోతుంది. దానితో అమెరికా ఎగుమతుల విలువ కూడా పడిపోయి సాపేక్షికంగా అమెరికా ఎగుమతులకు డిమాండ్ పెరుగుతుంది. క్యు.ఇ లను ప్రకటించి అమెరికా ఉద్దేశ్యపూర్వకంగా డాలర్ విలువను తగ్గిస్తోందనీ, తద్వారా తన ఎగుమతులకు గిరాకీ పెంచుకుంటోందనీ యూరప్, చైనా, జపాన్ దేశాలు విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలను అమెరికా ఎన్నడూ పెద్దగా పట్టించుకున్నది లేదు. విమర్శలు అలా ఉండగానే నెల రోజుల క్రితం మరొక విడత క్యు.ఇ ప్రకటించింది. ఈసారి క్యు.ఇ కి పరిమితి లేదనీ, పరిస్ధితులు చక్కబడేవరకూ ప్రతినెలా 40 బిలియన్ డాలర్ల మేరకు తనఖా అప్పులను కొనుగోలు చేసి మార్కెట్లోకి డబ్బు ప్రవహింపజేస్తామని ఫెడ్ ప్రకటించింది. అమెరికా లెక్కలేనితనాన్ని ప్రపంచ దేశాలు తూర్పారబట్టాయి. క్యు.ఇ-3 పై బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, చైనాల విమర్శలు టోక్యో సమావేశాల్లో ప్రతిధ్వనించాయి.
అమెరికా ప్రకటించిన క్యు.ఇ-3 పై చివరి రెండు రోజుల సమావేశాల్లో విమర్శలు పెల్లుబుకాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానం వలన ప్రపంచంలో కరెన్సీ యుద్ధాలు తప్పవని బ్రెజిల్ ఆర్ధిక మంత్రి గిడో మాంటేగా తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. క్యు.ఇ-3 వలన డాలర్ విలువ తగ్గిపోతుందనీ, ఇది అమెరికా స్వార్ధంతో తీసుకున్న చర్య అనీ ఆయన విమర్శించాడు. క్యు.ఇ-3 వలన అమెరికాకే కాక ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు కూడా లాభకరమేనని ఆ తర్వాత రోజే ఫెడరల్ రిజర్వ్ అధిపతి బెన్ బెర్నాంక్ బ్రెజిల్ విమర్శకు సమాధానం చెప్పాడు. అయితే ఈ సమాధానం ఎవరినీ మెప్పించలేదు. ఫెడ్ ప్రకటించిన క్యు.ఇ-3 తదుపరి ఆర్ధిక సంక్షోభానికే దారి తీస్తుందని జపాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ మసాకి షిరకా ఘాటుగా ప్రకటించాడు. (జపాన్ కూడా తనదైన క్యు.ఇ ని అమలు చేస్తుండడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.) “2000 కాలం నాటి ‘అప్పు బుడగ’ (credit bubble) కు ముందరి పరిస్ధితులను క్యు.ఇ-3 ఏర్పరచనుంది” అని ఆయన వ్యాఖ్యానించాడు.
జర్మనీ – ఐ.ఎం.ఎఫ్ విభేదాలు
యూరప్ ఋణ సంక్షోభం పరిష్కరించే పేరుతో యూరోపియన్ దేశాలు వినాశకరమైన పొదుపు విధానాలు అమలు చేస్తున్నాయి. యూరోపియన్ కమిషన్ (ఇ.సి), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ లు (ఇ.సి.బి), ఐ.ఎం.ఎఫ్ (యూరప్ ఋణ సంక్షోభానికి సంబంధించి ఈ మూడింటిని ట్రొయికా అని పిలుస్తున్నారు) బెయిలౌట్ పేరుతో ఋణ పీడిత యూరో జోన్ దేశాలకు సంయుక్తంగా అప్పులు ఇస్తూ దారుణమైన షరతులను అమలు చేయిస్తున్నాయి. ఈ షరతుల సారాంశం ‘పన్నులు, రద్దులు, కోతలు.’ అనగా: కార్మికులు, ఉద్యోగులపై పన్నుల పెంపుదల; ఉద్యోగాలు, సదుపాయాలు రద్దు; వేతనాలు, పెన్షన్లలో కోతలు; వీటి ఉద్దేశ్యం ఖర్చులు తగ్గించడం అని చెబుతున్నా అంతిమ లక్ష్యం మాత్రం ప్రజల ఆదాయాలను బహుళజాతి కంపెనీల వ్యాపారాల లాభాలకు తరలించడం.
ఈ విధానాల వల్ల సంక్షోభం పరిష్కారం కావడానికి బదులు మరింత తీవ్రం అవుతోంది. పొదుపు విధానాలు అమలు చేసిన గ్రీసు, పోర్చుగల్, ఐర్లాండ్, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్ తదితర దేశాల్లో జి.డి.పిలు పడిపోయాయి. స్పెయిన్ జి.డి.పి గత రెండు సంవత్సరాలుగా తగ్గిపోయి మాంద్యంలోకి జారిపోగా బ్రిటన్ ది కూడా అదే పరిస్ధితి. జర్మనీ, ఫ్రాన్సులు వేట కుక్కల వలే చేసిన షరతుల దాడిలో ప్రధాన బాధితురాలిగా ఉన్న గ్రీసు జి.డి.పి 6 శాతానికిపైగా కుచించుకుపోయింది. గ్రీసు, స్పెయిన్ లలో నిరుద్యోగం 25% కి పైగా ఉండడంతో ఆ దేశాల్లో సమ్మెలు, ఉద్యమాలు నిత్యకృత్యం అయ్యాయి. ఇటలీ కూడా గ్రీసు, స్పెయిన్ ల సరసన చేరుతోంది. ఇ.యు నాయకురాలు జర్మనీ జి.డి.పి కూడా వచ్చే సంవత్సరానికి పడిపోతుందనీ, మాంద్యం తప్పదనీ ఐ.ఎం.ఎఫ్ తో పాటు అనేకమంది విశ్లేషిస్తున్నారు.
ఈ పరిస్ధితుల నేపధ్యంలో యూరో జోన్ దేశాల్లో పొదుపు విధానాల తీవ్రత తగ్గించాలని ఐ.ఎం.ఎఫ్ అధిపతి, ఫ్రాన్స్ మాజీ ఆర్ధిక మంత్రి కూడా అయిన క్రిస్టీన్ లాగార్డే కోరుతోంది. గ్రీసుపై కనికరం చూపాలనీ, ఆ దేశంపై రుద్దిన పొదుపు విధానాల అమలుకు మరింత గడువు ఇవ్వాలనీ కోరుతోంది. అక్టోబర్ 11 తేదీన సమావేశాల్లో ప్రసంగిస్తూ ఇదే అభిప్రాయాన్ని ఆమె పునరుద్ఘాటించింది. జి.డి.పి వృద్ధి బలహీనపడిన పరిస్ధితుల్లో బడ్జెట్ కోతలు, పన్నుల పెంపుదలలు సరికాదని వాదించింది. సమావేశాల సందర్భంగా ఐ.ఎం.ఎఫ్ ప్రచురించిన ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్’ నివేదికను లాగార్డే తన వాదనకు మద్దతుగా చూపింది.
లాగార్డే ప్రస్తావించిన నివేదికలోని అంశం గురించి చెప్పుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. సదరు నివేదిక ప్రకారం బడ్జెట్ కోత వలన జి.డి.పి వృద్ధి పై పడే గుణిజ (మల్టిప్లయర్) ప్రభావాన్ని అప్పటివరకూ తక్కువగా అంచనా వేస్తూ వచ్చారు. అనగా బడ్జెట్ కోత గుణిజం 0.5 ఉంటుందని అంచనా వేయగా వాస్తవంలో అంతకంటే ఎక్కువగానే ఉంటుందని ఐ.ఎం.ఎఫ్ నివేదిక తెలిపింది. దీని ప్రకారం ప్రభుత్వ బడ్జెట్ లో 10 బిలియన్ డాలర్ల కోత విధిస్తే జి.డి.పి $5 బిలియన్ ($10 బిలియన్ x 0.5) మేరకు తగ్గిపోతుంది. ఐ.ఎం.ఎఫ్ చీఫ్ ఎకనమిస్టు ఆలివర్ బ్లాంచర్డ్ జరిపిన విశ్లేషణలో ఇది తప్పని తేలింది. 2008 నాటి ‘మహా మాంద్యం’ తర్వాత బడ్జెట్ కోత గుణీజాన్ని చాలా తక్కువగా లెక్కిస్తూ వచ్చారనీ, వాస్తవానికి ఈ గుణిజం 0.5 కు బదులు 0.9 నుండి 1.7 వరకూ ఉంటుందని తేలింది. అంటే పొదుపు విధానాల పేరుతో యూరోపియన్ దేశాలపై అమలు చేస్తున్న బడ్జెట్ కోతల వల్ల ఆర్ధిక వ్యవస్ధపై పడుతున్న ప్రభావాన్ని తక్కువగా అంచనా వేస్తూ ఐ.ఎం.ఎఫ్ ఇన్నాళ్లూ ప్రపంచాన్ని మోసం చేసిందన్నమాట!
బడ్జెట్ కోత అంటే ప్రజలపైనా, కార్మికుల వేతనాలపైనా కోతలు విధించి ఆ భాగాన్ని పెట్టుబడిదారులకు తరలించడం అని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ కోతవల్ల అనివార్యంగా మార్కెట్లో కొనుగోళ్ళు తగ్గిపోతాయి. కొనుగోళ్ళు తగ్గితే కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఉత్పత్తి తగ్గడం అంటే జి.డి.పి తగ్గడం. ప్రజల ఆదాయాలు కంపెనీలకి తరలిపోవడం వల్ల అలా తరలిపోయిన మొత్తం మళ్ళీ ఉత్పాదక పెట్టుబడిగా వినియోగానికి వస్తే జి.డి.పి పెరగడానికి దోహద పడుతుంది. కానీ కేపిటల్ రియలైజేషన్ క్రైసిస్ నెలకొన్న నేపధ్యంలో పెట్టుబడిదారులకు వచ్చి చేరిన వేతనాల కోతలు తక్షణ లాభాల కోసం ఫైనాన్స్ పెట్టుబడిగా స్టాక్ మార్కెట్లలోకి, ఇతర ఫైనాన్స్ డెరివేటీవ్స్ లోకి వెళుతున్నదే తప్ప ఉత్పాదక పెట్టుబడిగా మారడం లేదు. వేతనాల కోతల వల్ల కొనుగోలు శక్తి పడిపోయి కొనుగోళ్ళు తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణం కాగా, ఋణ సంక్షోభం వల్ల ధైర్యంగా రుణాలు ఇచ్చే పరిస్ధితి లేకపోవడం మరొక కారణం. పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఇది మౌలిక విష వలయం. కంపెనీల లాభదాహం తిరిగి కంపెనీల మెడకే చుట్టుకుంటుంది. ఆ క్రమంలో కార్మిక వర్గం ఆదాయాలు కోల్పోయి బతుకు దుర్భరంగా మారుతుంది. లెక్క ప్రకారం ఈ పరిస్ధితి విప్లవకర కార్మిక శక్తి ఉద్భవించడానికి దారితీయాలి. ఇప్పటికే ఆ క్రమం ప్రారంభమయిందని యూరోపియన్ సమ్మె పోరాటాలు తెలియజేస్తున్నాయి.
ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల వార్షిక సమావేశాలకు వస్తే, ఐ.ఎం.ఎఫ్ తాజా ఔట్ లుక్ ప్రకారం $10 బిలియన్ బెడ్జెట్ కోతవలన జి.డి.పి తగ్గుదల $5 బిలియన్ కాకుండా, $9 నుండి $17 బిలియన్ వరకూ ఉంటుంది. ఈ రెండింటి సగటు తీసుకున్నా బడ్జెట్ కోత కంటే జి.డి.పి తగ్గుదలే ఎక్కువ. ఈ పరిస్ధితిలో యూరోపియన్ ప్రభుత్వాలు ‘ఫిస్కల్ కన్సాలిడేషన్’ పేరుతో కోతలు పెట్టడం సరికాదని చెప్పిన లాగార్డే కోతలు వద్దనడానికి బదులు వాయిదా వేయాలని కోరింది. అంటే కఠినంగా బాదే బదులు సుతిమెత్తగా బాదాలని లాగార్డే చెబుతోంది. ఈ బాదుడు వాయిదా సిద్ధాంతాన్ని జర్మనీ ఒప్పుకోలేదు. జర్మనీ ఆర్ధిక మంత్రి వోల్ఫ్ గాంగ్ షేబుల్, లాగార్డే వాదనను తిరస్కరించాడు. లాగార్డే ఐ.ఎం.ఎఫ్ సిద్ధాంతానికే విరుద్ధంగా మాట్లాడుతోందనీ, భారీ ఋణ భారం జి.డి.పి వృద్ధికి శత్రువన్న సిద్ధాంతం ఏమయిందని ఆయన ప్రశ్నించాడు. “మధ్యకాలిక లక్ష్యం విధించుకున్నాక వేరే దిశకు మళ్ళితే (మార్కెట్) విశ్వాసం దెబ్బతింటుంది….. పెద్ద పర్వతాన్ని ఎక్కాలనుకున్నాక దిగడం మొదలుపెడితే పర్వతం ఇంకా పెద్దదైపోతుంది” అని జర్మనీ ఆర్ధికమంత్రి వాదించాడు.
విభేదాలు బైటికి రావడంతో ఐక్యత ప్రదర్శించడానికి లాగార్డే, వోల్ఫ్ గాంగ్ లు తాము ఐక్యంగానే ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. బి.బి.సి లో సంయుక్త చర్చలో ప్రత్యక్షమై తేడాలేమీ లేవని చెప్పుకున్నారు. ఐ.ఎం.ఎఫ్ తన సిద్ధాంతాన్నేమీ మార్చుకోలేదనీ కోశాకార సర్దుబాటు (fiscal adjustment) తప్పనిసరి అన్నదే తమ నిశ్చితాభిప్రాయమనీ లాగార్డే చర్చలో తెలిపింది. “దాన్ని సర్దుబాటు అనండి. కోశాగార స్ధిరీకరణ (fiscal consolidation) ఆనండీ లేదా పొదుపు విధానం (austerity policy) ఆనండీ అన్నీ ఒకటే” అని లాగార్డే అసలు గుట్టు విప్పింది. తాము ప్రవచించే సిద్ధాంతాలూ, తికమకపెట్టే ఆర్ధిక పదబంధాలూ అన్నింటి లక్ష్యం ఒకటేననీ, అంతిమంగా సంక్షోభాలకు కారణమైన కంపెనీలను ముట్టుకోకుండా, శ్రామిక ప్రజలను తిరిగి తిరిగి బాదడమే తమ లక్ష్యం అనీ లాగార్డే పరోక్షంగా తెలిపింది. అయితే గ్రీసు విషయంలో మాత్రం మరికొంత కాలం సమయం ఇవ్వాలని కోరడం ఆమె మర్చిపోలేదు. గ్రీసులో ప్రభుత్వం మారినప్పటికీ కార్మికుల ప్రతిఘటన నానాటికీ పెరిగిపోతున్న నేపధ్యంలో నచ్చజెప్పి దండుకోవాలని లాగార్డే సూచిస్తున్నదని ఇక్కడ అర్ధం చేసుకోవలసిన విషయం. దీనిని కూడా జర్మనీ అంగీకరించడం లేదు.
ప్రయోజనాల ఘర్షణే విభేదాలకు మూలం
సమావేశాల్లో వ్యక్తం అయిన విభేదాలకు ఆయా దేశాల ఆర్ధిక ప్రయోజనాల మధ్య ఘర్షణలు తలెత్తడమే కారణంగా గుర్తించాలి. గ్రీసుకి గానీ, ఆ తర్వాత ఇతర ఋణ సంక్షుభిత దేశాలకు గానీ మరింత సమయం ఇవ్వడం అంటే ట్రొయికా మరింత భారాన్ని నెత్తిపైకి తెచ్చుకోవడమే. ఋణ సంక్షోభం పరిష్కారం కోసం వివిధ పేర్లతో ఏర్పరచుకున్న సంయుక్త ఋణ నిధులను మరింత పెంచుకోవలసిన అగత్యం ఏర్పడుతుందని జర్మనీ భయం. అదే జరిగితే యూరప్ నాయకురాలు జర్మనీ బ్యాంకులపైనే అధిక భారం పడుతుంది. అమెరికా, బ్రిటన్ ల ప్రయోజనాలు జర్మనీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి. లాగార్డే మాట్లాడేదంతా అమెరికా, బ్రిటన్ ల తరపున అని గుర్తిస్తే జర్మనీ, ఐ.ఎం.ఎఫ్ ల విభేదాలకు పునాది ఏమిటో అర్ధం అవుతుంది. జర్మనీ బ్యాంకుల వద్ద ఉన్న మిగులు నిధులను మార్కెట్ కంటే తక్కువ వడ్డీలకు యూరోపియన్ ఋణ సంక్షోభం పేరుతో పొందడానికి అమెరికా, బ్రిటన్ లు ప్రయత్నిస్తున్నాయి. అంటే వాల్ స్ట్రీట్, ది సిటీ (లండన్) లు ఒక్కటై ఫ్రాంక్ ఫర్ట్ లో చొరబడడానికి ప్రయత్నిస్తున్నాయన్నమాట!
జర్మనీ కోరికమేరకు కఠిన విధానాలు ఇంకా వేగంగా అమలు చేసినట్లయితే ఆర్ధిక వ్యవస్ధలు మరింత ఘోరంగా దెబ్బతింటాయని అమెరికా, బ్రిటన్ లు వాదిస్తున్నాయి. యూరో జోన్ ఆర్ధిక వ్యవస్ధ ఇప్పటికే మాంద్యంలో ఉన్నందున మరిన్ని కోతల వల్ల ఇంకా దెబ్బతిని ఎగుమతుల మార్కెట్ లు కోల్పోతుందని అవి చెబుతున్నాయి. గ్రీసుపై ఒత్తిడి పెంచుతూ పోతే చివరికి అప్పులు చెల్లించలేక గ్రీసు చతికలబడుతుందనీ, దానివల్ల యూరో దేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్ధ సంక్షోభానికి గురై అది కాస్తా అమెరికా, బ్రిటన్ ల ఫైనాన్స్ వనరులకే ప్రమాదం కొనితెస్తుందనీ ఆంగ్లో సాక్సన్ కూటమి భయపడుతోంది. యూరో జోన్ నుండి బైటికి వచ్చి సొంత కరెన్సీని పునరుద్ధరించుకోవాలని చెప్పే పార్టీలు గ్రీసులో బలం పుంజుకుంటున్న నేపధ్యంలో అమెరికా-బ్రిటన్ ల భయాలూ నిజమేనని గ్రహించవచ్చు. అంతిమ పరిశీలనలో జర్మనీ ఫైనాన్స్ పెట్టుబడి ప్రయోజనాలు, ఆంగ్లో-సాక్సన్ ఫైనాన్స్ పెట్టుబడి ప్రయోజనాలు పరస్పరం ఘర్షణ పడుతున్న పరిస్ధితిని జర్మనీ, ఐ.ఎం.ఎఫ్ ల ఘర్షణలు ప్రతిబింబిస్తున్నాయని గ్రహించవలసి ఉంటుంది.
పశ్చిమ దేశాలకు చెందిన వివిధ ఫైనాన్స్ పత్రికలు ముందుకు తెస్తున్న వాదనలు ఈ ఘర్షణల తీవ్రతను తెలియజేస్తున్నాయి. లండన్ ఆధారిత ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్.టి) పత్రిక ఐ.ఎం.ఎఫ్ వాదనను బలంగా వినిపిస్తోంది. గ్రీసుకు మరింత సమయం ఇవ్వాలన్న ఐ.ఎం.ఎఫ్ వాదనను ‘పవిత్ర సలహా” గా ఎఫ్.టి కీర్తించింది. జి.డి.పి క్షీణించిన దేశాల్లో కొత్త కోతలు వద్దని వాదిస్తూనే బ్రిటన్ లో మాత్రం పొదుపు విధానాలను సడలించనవసరం లేదని నొక్కి వక్కాణించింది. యూరో జోన్ దేశాలకు ఐ.ఎం.ఎఫ్ సలహా పవిత్రం కాగా అదే సలహా బ్రిటన్ కి పవిత్రం కాదన్న మాట! మరోవైపు అమెరికా ప్రయోజనాలను న్యూయార్క్ టైమ్స్ (ఎన్.వై.టి) పత్రిక ప్రతిబింబించింది. ఆర్ధిక నోబెల్ గ్రహీత, ఎన్.వై.టి కాలమిస్టు అయిన పాల్ కృగ్మెన్, అమెరికా మాజీ ట్రెజరీ సెక్రటరీ లారెన్స్ సుమ్మర్స్ లు యూరప్ పొదుపు విధానాలను విమర్శిస్తూ వ్యాసాలు రాశారు.
“ప్రపంచం ఒక విష వలయంలో కూరుకున్న” పరిస్ధితిలో ఐ.ఎం.ఎఫ్-ప్రపంచ బ్యాంకు సమావేశాల వలన వీసమెత్తు ప్రయోజనం కలగలేదని సమ్మర్స్ విమర్శించాడు. ఓపక్క అమెరికా ఫిస్కల్ క్లిఫ్ (అమెరికా అప్పు పరిమితి మించిపోతున్న పరిస్ధితి ఒక పక్కా, 2013 జనవరి నుండి ఆటోమేటిక్ గా అమల్లోకి రానున్న పొదుపు విధానాలు మరొక పక్కా ఉన్న పరిస్ధితిని ఫిస్కల్ క్లిఫ్ గా పిలుస్తున్నారు) సమీపిస్తుండగా, మరో పక్క చివరి నిమిషం వరకూ స్పందన లేకుండా యూరప్ వ్యవహరిస్తున్నదనీ సమ్మర్స్ విమర్శించాడు. పారిశ్రామిక ప్రపంచంలో కేవలం ద్రవ్య సమస్యగా ప్రారంభమయిన సంక్షోభం చివరికి వ్యవస్ధాగత సమస్యగా అవతరించిందని సమ్మర్స్ ముక్తాయించాడు. ద్రవ్య సంక్షోభంగా చెప్పిన 2008 ఆర్ధిక సంక్షోభం వాస్తవానికి పెట్టుబడిదారీ వ్యవస్ధలోని మౌలిక వ్యవస్ధాగత సమస్య అని చెప్పిన మార్క్సిస్టు అర్ధశాస్త్రవేత్తల నిర్ధారణను సమ్మర్స్ ముక్తాయింపు ధృవపరుస్తున్నదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరింతగా మాంద్యంలో కూరుకుపోతున్న పరిస్ధితుల్లో ప్రధాన ఆర్ధిక శక్తుల మధ్య వైరుధ్యాలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గబోవు. సమావేశాల చివర ఐ.ఎం.ఎఫ్ స్టీరింగ్ కమిటీ విడుదల చేసిన ప్రకటన ఈ విషయాన్నే స్పష్టీకరిస్తున్నది. ప్రపంచ ఆర్ధిక భవిష్యత్తు క్షీణదశలో ఉన్నదనీ, ఆర్ధికవృద్ధి తిరోగమన దిశలో ఉన్నదనీ స్టీరింగ్ కమిటీ ప్రకటన పేర్కొంది. భారీస్ధాయిలో అనిర్దిష్టతలు నెలకొన్నాయనీ, ఆర్ధిక పరిస్ధితి మరింతగా క్షీణించే ప్రమాదం ఎదురుగా నిలబడి ఉందనీ ఆర్ధిక కలాపాలు నెమ్మదించాయనీ స్వదేశీ, విదేశీ డిమాండు బలహీనంగా ఉండడం దానికి రుజువనీ ప్రకటించింది. ఆహారేతర సరుకుల ధరలు తగ్గుతుండగా, ఆహార ధరలు పైపైకి ఎగబాకుతున్నాయనీ దీనితో కొన్ని దేశాల పరిస్ధితి కనాకష్టంగా ఉందనీ తెలిపింది. అల్పాదాయ దేశాల ఆర్ధిక వృద్ధి కొంత బలంగానే ఉన్నప్పటికీ ఆ దేశాల్లో కోశాగార నిల్వలు (వసూళ్లు), విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోతున్నాయనీ తెలిపింది. బ్రిక్స్ లాంటి ఎమర్జింగ్ దేశాలలో కూడా ఆర్ధిక వృద్ధి క్షీణదశలోనే ఉన్నదనీ తెలిపింది. ఈ నేపధ్యంలో అతి పలుచగా ఉన్న సానుకూల పరిస్ధితులను సొమ్ము చేసుకోవడానికి ప్రపంచ ఆర్ధిక శక్తుల మధ్య పోటీ మరింత పెరిగి వైరుధ్యాలు తీవ్రం కావడానికే దారితీస్తుంది. ఆర్ధిక సంక్షోభాలను సొమ్ము చేసుకోగల బలాన్ని కార్మిక వర్గం సంతరించుకోకపోవడం కూడా నేటి ప్రపంచ పరిస్ధితుల మరో లక్షణంగా కొనసాగుతోంది.
very good informations… on ur blog for common readers…. thanku sir…
good article……… this article is did deep investigation on world economy & developed economies…….. let see how the countries come out of the great recession…….