2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత అమెరికాలో అల్పాదాయ వర్గాల సంఖ్య బాగా పెరిగిందని ‘ప్యూ రీసర్చ్ సెంటర్’ అధ్యయనంలో తేలింది. అమెరికా వినాశకర ఆర్ధిక, విదేశాంగ విధానాల ద్వారా ఉత్పన్నమయిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత అమెరికాలో సామాన్యుల ఆదాయాల్లో వచ్చిన మార్పులను ఈ అధ్యయనం రికార్డు చేసింది. ప్యూ అధ్యయనం ప్రకారం అమెరికాలో తమను తాము అల్పాదాయ తరగతికి చెందినవారిగా గుర్తించుకునేవారి సంఖ్య 2008 లో పోలిస్తే బాగా పెరిగింది. జనాభాలో ఇలా భావించుకునేవారి భాగం 2008 లో నాలుగో వంతు ఉంటే ఇపుడది మూడో వంతుకు పెరిగింది.
అల్పాదాయాలతో సరిపెట్టుకుంటున్నవారి సంఖ్య యువకుల్లో బాగా ఎక్కువగా ఉందని అధ్యయనంలో స్పష్టం అయింది. 18-29 మధ్య వయస్కులైన యువకుల్లో తమను తాము అల్పాదాయ వర్గంగా భావించుకునేవారు 2008లో 25 శాతం ఉండగా 2012 లో 40 శాతానికి చేరింది. మద్య వయసు నుండి రిటైర్ మెంట్ వయసు వరకూ (30-64 సం.) ఉన్నవారిలో అల్పాదాయ వర్గాలు 2008లో 26 శాతం ఉంటే 2012 లో 33 శాతానికి చేరుకుంది. జాతుల పరంగా చూస్తే తెల్లవారు, హిస్పానిక్కుల్లో అల్పాదాయ వర్గాల సంఖ్య బాగా పెరిగింది. తెల్లవారిలో ఈ పెరుగుదల 8 శాతం (23% నుండి 31% కు) ఉండగా హిస్పానిక్కుల్లో 10 శాతం (30% నుండి 40% కి) పెరుగుదల సంభవించింది.
వివిధ వయసులవారు, జాతుల వారు తమ ఆదాయాలను ఎలా వర్గీకరించుకున్నారో కింది గ్రాఫ్ ద్వారా ప్యూ తెలియజేసింది.
తమను తాము అల్పాదాయ తరగతిగా భావించుకునే వారి సంఖ్య తెల్లవారిలోనూ, నల్లవారిలోనూ దాదాపు సమానంగా ఉండడం పై గ్రాఫ్ ద్వారా గ్రహించవచ్చు. ఈ సమానత నల్లవారి ఆదాయాలు పెరగడం ద్వారా కాకుండా తెల్లవారి ఆదాయాలు మరింత పడిపోవడం ద్వారా రావడమే అసలు విషాధం. అమెరికాలోని తెల్ల పెట్టుబడి దొంగలకు తెల్ల కార్మికుల పట్ల ప్రేమాభిమానాలు ఏమీ ఉండవని దీనిద్వారా గ్రహించవలసిన విషయం.
ఇపుడు మరో చార్ట్ ను చూద్దాం. ఇది కూడా ప్యూ రీసర్చ్ అందించినదే. తమను తాము అల్పాదాయ వర్గాలుగా ఎందుకు భావించుకుంటున్నారో కింది చార్ట్ వివరిస్తుంది. తమను తాము ఉన్నత తరగతిగా భావించుకునేవారిలో కూడా చార్ట్ లో పొందుపరిచిన కష్టాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పడం బట్టి అమెరికా సమాజం దరిద్రంతో ఎంతగా కుమిలి రగిలిపోతున్నదో అర్ధం చేసుకోవచ్చు. డబ్బు లేకపోవడం వలన ఇంటి ఖర్చు తగ్గించుకున్నామని 41 శాతం ఉన్నత తరగతివారు చెప్పగా 62 శాతం మధ్య తరగతి, 84 శాతం అల్పాదాయ తరగతి వారు ఇంటి ఖర్చుల్లో కోతవిధించుకున్నామని తెలిపారు. నెలవారి బిల్లులు కట్టలేకపోతున్నవారి సంఖ్య, కుటుంబానికి వైద్య సౌకర్యం లేనివారి సంఖ్య, ఇంటి అద్దె చెల్లించలేనివారి సంఖ్య, ఉద్యోగాలు కోల్పోయినవారి సంఖ్య కూడా కింది చార్ట్ లో చూడవచ్చు.
ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ ‘లేమేన్ బ్రదర్స్’ కుప్ప కూలడంతో వెలుగులోకి వచ్చిన ప్రపంచ స్ధాయి ఆర్ధిక సంక్షోభానికి ‘సబ్-ప్రైమరీ’ హౌసింగ్ లోన్ల సంక్షోభమే కారణమని అమెరికా చెప్పింది. కానీ వాస్తవానికి పెట్టుబడిదారీ అత్యున్నత వ్యవస్ధ అయిన అమెరికన్ సామ్రాజ్యవాద వ్యవస్ధ ఎదుర్కొంటున్న సుదీర్ఘ ఆర్ధిక సంక్షోభం ఫలితమే 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అని అనేకమంది ఆర్ధికవేత్తలు స్పష్టం చేశారు. మార్క్సిస్టు ఆర్ధిక వేత్తలతో పాటు, పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు కూడా కాస్త అటూ ఇటూగా ఈ అంశంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధలో స్వతస్సిద్ధంగా నెలకొని ఉన్న మౌలిక కార్మిక-పెట్టుబడిదారీ వైరుధ్యంతో పాటు ఆఫ్ఘన్, ఇరాక్ లపై సాగించిన రెండు దురాక్రమణ యుద్ధాలు కూడా అమెరికా లలాట ఫలకాన సుదీర్ఘ, సంక్షుభిత, బాధాకరమైన ఆర్ధిక జీవన రేఖను లిఖించాయని ‘ప్యూ’ అధ్యయనం లోని అంశాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచీకరణ విధానాలు ఆర్ధిక సమస్యలకు దివ్యౌషధం అని చెప్పడం వాస్తవం కాకపోగా వాటి వల్ల పేదరికం బాగా పెరిగిపోవడం తధ్యం అని ఆర్ధిక నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ చెప్పిన వాస్తవాన్ని ప్యూ అధ్యయనం చక్కగా ప్రతిబింబిస్తోంది. కారల్ మార్క్స్ చేసిన ఆర్ధిక వర్గ విభజన నేటికీ ఎంతటి శిరోధార్యమో వాల్ స్ట్రీట్ కంపెనీల దోపిడీకి కుదేలవుతున్న అమెరికన్ ప్రజ చాటి చెబుతున్నది.
ప్రపంచ వ్యాప్తంగా సహజ వనరుల కొరత/ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఇందుకు ఒక పెద్ద కారణం. ఈ విషయం లో కూడా సరాసరి ఒక అమెరికన్ ఖర్చు చేసే ఇంధనం మిగతా దేశాలతో పోలిస్తే ఎంతో ఎక్కువ.
సహజ వనరుల కొరత వలన రానున్న కొన్ని సంవత్సరాలలొ ఆహార,ఇంధన వ్యయాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా అంతర్గత అసంతౄప్తి పెరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఎన్నో కొత్త విధానలు – ముఖ్యంగా లాభసాటి వ్యాపారాలు చేయల్సి ఉంటుంది. వారి వారి ప్రకృతిని బట్టి కొన్ని రాజ్యాలు ఎఫ్ డీ ఐ లను ఆహ్వానిస్తే కొందరు యుధ్ధాలు చేస్తారు.
చక్రిగారూ, సహజ వనరుల కొరత సమస్యకు లాభసాటి వ్యాపారాలను ఒక పరిష్కారంగా మీ వ్యాఖ్య సూచిస్తున్నది. అదెలాగో వివరించగలరా?
ఎఫ్.డి.ఐలను ఏ కారణం చెప్పి ఆహ్వానించినా అంతిమ ఫలితం వాటి యజమానులదేనని, ప్రజలకు వీసమెత్తు లాభం లేదనీ గత రెండు దశాబ్దాల భారత్ అనుభవం రుజువు చేసింది. వారి వారి ప్రకృతిని బట్టి ఎఫ్.డి.ఐ లను ఆహ్వానిస్తారన్న మీ వ్యాఖ్య ఈ అనుభవానికి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తొంది. మీ అభిప్రాయాన్ని కొంత వివరించండి.