2జి ఫీజు 36,000 కోట్లు ఉండాలని చెప్పా, ప్రధాని పట్టించుకోలేదు -కేబినెట్ కార్యదర్శి


Chandra Sekhar, Ex Cabinet Secretary

2జి కుంభకోణం విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటిత అమాయకత్వం ఒట్టి నటనే అన్న సంగతి అనూహ్య రీతిలో వెల్లడయింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణలో సి.పి.ఐ సభ్యుడు గురుదాస్ దాస్ దాస్ గుప్తా తరచి తరచి అడిగిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన మాజీ కేబినెట్ కార్యదర్శి అసలు సంగతి కక్కడంతో ప్రధాని దాపరికం గుట్టు రట్టయ్యింది. 2జి స్పెక్ట్రమ్ ఎంట్రీ ఫీజు అప్పటి మార్కెట్ ధరల ప్రకారం 36,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించాలని తాను 2008 లోనే సిఫారసు చేశాననీ, కానీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన సిఫారసును అసలు పట్టించుకోలేదని మాజీ కేబినెట్ సెక్రటరీ కె.ఎం.చంద్ర శేఖర్ గురువారం జె.పి.సి ముందు చెప్పి అందరినీ హతాశులని చేశాడు.

2001 రేట్ల ప్రకారం భారత స్పెక్ట్రమ్ ధరను లెక్కకట్టి 1651 కోట్లుగా నిర్ధారించారనీ, కానీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిగినప్పటి రేట్ల ప్రకారం ఎంట్రీ ఫీజు రు. 36,000 కోట్లు ఉండాలని ప్రధానికి రాసిన నోట్ లో పేర్కొన్నానని చంద్రశేఖర్ తెలిపాడు. దేశానికి అంతపెద్ద ఎత్తున ఆర్ధిక ప్రభావం కలగజేసే విషయంలో కేబినెట్ కార్యదర్శిగా ఎందుకు స్పందించలేకపోయారని గురుదాస్ గుప్తా ప్రశ్నించడంతో చంద్రశేఖర్ తానేమీ గమ్ముగా ఉండలేదనీ తనపని తాను చేశానని చెబుతూ ఇన్నాళ్లూ దాచిపెట్టిన నిజాన్ని వెల్లడి చేశాడు. 2జి కుంభకోణాన్ని ఆద్యంతం అధ్యయనం చేసిన గురుదాస్ గుప్తా, వివిధ కోణాల్లో గుచ్చి, గుచ్చి వేసిన ప్రశ్నలకు గుక్కతిప్పుకోలేని చంద్రశేఖర్ ఎవరూ ఊహించని నిజాన్ని వెళ్ళగక్కాడని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.

చంద్రశేఖర్ ప్రకారం ఆయన చెప్పిన నోట్ డిసెంబర్ 4, 2007 తేదీనే సమర్పించబడింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే చంద్రశేఖర్ తనంతట తాను సుమోటుగా ఆ నోట్ రాయలేదు. అరుదైన స్పెక్ట్రమ్ ను 2001 ధరల ప్రకారం కేటాయించిన పక్షంలో తలెత్తే ఆర్ధిక చిక్కుల గురించి ప్రధాని ప్రత్యేకంగా చేసిన ఎంక్వైరీకి సమాధానంగానే ప్రధానికి నోట్ రాశానని మాజీ కేబినెట్ కార్యదర్శి తెలిపాడు. మార్కెట్ సైజు (పదుల కోట్లలో ఉన్న భారత వినియోగదారుల సంఖ్య), టెలీసాంద్రతలో వచ్చిన మెరుగుదల (సెల్ ఫోన్ల వినియోగంలో విపరీత వృద్ధి), సఫ్లైను మించిన డిమాండ్ (స్పెక్ట్రమ్ లైసెన్సుల కోసం 575 కంపెనీలు దరఖాస్తు చేశాయి)… ఈ అంశాలన్నింటి ఆధారంగా తాను ఎంట్రీ ఫీజు పెంచాలని సూచించినట్లుగా చంద్రశేఖర్ తెలిపాడు. ఈ నోట్ రాసిన సమయాన్ని బట్టి చూస్తే, ప్రధానమంత్రి గనక చంద్రశేఖర్ సలహాను పాటించినట్లయితే స్పెక్ట్రమ్ కుంభకోణం జరగకుండా అడ్డుకోగలిగేవాడని అర్ధం అవుతోందని ‘ది హిందూ’ వ్యాఖ్యానించింది.

అయితే, ప్రధానమంత్రి స్పందించలేదు సరికదా, ఆ నోట్ తనకు రాలేదన్నట్లుగానే ఇన్నాళ్లూ వ్యవహరిస్తూ వచ్చాడు. ఈ నోట్ సంగతి బైటికి రాకుండా అనేక జార్గత్తలు ఆయన తీసుకున్నట్లుగా కూడా అర్ధం చేసుకోవాల్సి వస్తున్నది. ప్రధానమంత్రికి చంద్రశేఖర్ ఇచ్చిన సలహా కొత్తది కూడా కాదు. నవంబరు 2, 2007 తేదీన టెలికాం మంత్రి ఎ.రాజా రాసిన లేఖలో కూడా ఆయన ఈ సూచనలు చేశాడు. స్పెక్ట్రమ్ ని వేలం అయినా వెయ్యాలనీ అది సాధ్యంకాకపోతే ఎంట్రీ ఫీజయినా పెంచాలనీ ఆయన రాజా కి సూచించాడు. కానీ రాజా రెండింటికీ నిరాకరించాడు. అదే రోజు రాసిన ప్రత్యుత్తరంలో వేలం వేయడానికీ, ఎంట్రీ ఫీజు పెంచడానికీ నిరాకరిస్తున్నట్లు ఆయన తెలిపాడు.

ఆ తర్వాత ఫైనాన్స్ కార్యదర్శి డా.సుబ్బారావు కూడా 2001 ధరలపై స్పెక్ట్రమ్ ను కేటాయించటం పట్ల టెలికాం శాఖకు అభ్యంతరం తెలిపాడు. నవంబర్ 22, 2007 న రాసిన లేఖలో ఆయన తన అభ్యంతరాన్ని తెలియజేస్తూ భ్యవిష్యత్తులో జరిగే కేటాయింపులను ఆపేయాలని కోరాడు. అయితే టెలికాం శాఖ ఆయన సలహాను పెడచెవిన పెట్టింది. నవంబర్ 29, 2007 తేదీన ఆర్ధిక శాఖకు రాసిన లేఖలో వేలం విధానాన్ని తిరస్కరిస్తున్నట్లు టెలికాం కార్యదర్శి డి.ఎస్.మాధుర్ స్పష్టం చేశాడు. ప్రధాన మంత్రి, ఎ.రాజా, ఫైనాన్స్ కార్యదర్శి, టెలికాం కార్యదర్శి తదితరులంతా రాసుకున్న ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ముగిసిపోయి వారివల్ల వీసమెత్తు ప్రయోజనం కూడా జరగని పరిస్ధితుల్లో కేబినెట్ కార్యదర్శి చంద్రశేఖర్ రాసిన లేఖ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అంతటి ప్రాధాన్యత కలిగిన లేఖను వెల్లడి చేయకుండా ఉండడానికే ప్రధాని నిర్ణయించుకున్నాడు. చంద్రశేఖర్ లేఖ వెల్లడి అయినట్లయితే ప్రధాని మన్మోహన్ బాగా ఇరుకునపడేవాడన్నది స్పష్టమే.

ఈ అంశాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జె.పి.సి) సభ్యులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. సి.బి.ఐ తో సహా సంబంధిత మంత్రులు, అధికారులు అంతా చంద్రశేఖర్ నోట్ ని దాచిపెట్టడాన్ని తీవ్ర అభ్యంతరకరంగా వారు నిలదీస్తున్నారు. జె.పి.సి ముందు సాక్ష్యం ఇచ్చిన సి.బి.ఐ కూడా ఈ నోట్ సంగతి చెప్పలేదని వారు ఆగ్రహిస్తున్నారు. తీరా ఇపుడు వెల్లడి అయ్యాక ఆ లేఖపై ఏమీ చేయలేని పరిస్ధితి ఉన్నట్లు కనిపిస్తోంది. 2జి కుంభకోణంపై ఇప్పటికే అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కుంభకోణం బైటికి వచ్చి నాలుగేళ్ళు గడిచాయి. కేంద్ర మంత్రి రాజాతో సహా అనేక కంపెనీలు, అధికారులపైన ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయి. హైకోర్టులో అనేక కేసులు, సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు ముగిశాయి. ఫిబ్రవరి 2, 2012 తేదీన 122 స్పెక్ట్రమ్ లైసెన్సులను సుప్రీం కోట్టివేసింది. వందాలది ప్రకటనలు, పత్రికా ప్రకటనలు, టి.వి ఇంటర్వ్యూలు, జె.పి.సి ముందు సాక్ష్యాలు, పార్లమెంటులో ప్రకటనలు అన్నీ ఆయ్యాక చంద్రశేఖర్ నోట్ విషయం బైటికి వచ్చిందని ‘ది హిందూ’ వ్యాఖ్యానించింది.

ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా స్వయంగా ఫెబ్రవరి 16, 2011 తేదీన పూర్తిస్ధాయి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. మరో ఎనిమిది రోజులకి పార్లమెంటులో ప్రకటన చేశాడు. 2001 రేట్లపై స్పెక్ట్రమ్ కేటాయింపులు జరపడంలో ఫైనాన్స్, టెలికాం మంత్రిత్వ శాఖల కార్యదర్శుల మధ్య ఒక అంగీకారం కుదిరినందునే తాను ఎ.రాజా కేటాయింపులపై అభ్యంతరం చెప్పలేదని ప్రధాని చెబుతూ వచ్చాడు. అయితే వాస్తవానికి ఫైనాన్స్ కార్యదర్శి 2001 రేట్లను అంగీకరించలేదని తెలుస్తున్న నేపధ్యంలో మిస్టర్ క్లీన్ ప్రధాని మేడిపండు సచ్ఛీలత ఏపాటితో తెలుస్తున్నది. సీనియర్ బ్యూరోక్రాట్ చంద్రఖర్ రాసిన అతి ముఖ్యమైన నోట్ ను ఇంతవరకూ దేశానికి వెల్లడించకపోవడంలో మన్మోహన్ చేసింది దారుణ తప్పిదం. ఒక పెద్ద కుంభకోణాన్ని నిలువరించే అవకాశాన్ని ప్రధాని మన్మోహన్ పదే పదే నిరాకరిస్తూ రావడమే కాక కేంద్ర ప్రభుత్వ అధికారుల అభ్యంతరాలను కూడా పక్కకు నెట్టి, నేరపూరిత మౌనం వహించి దేశ ప్రజలకు తీరని ద్రోహం చేశాడు.

2 thoughts on “2జి ఫీజు 36,000 కోట్లు ఉండాలని చెప్పా, ప్రధాని పట్టించుకోలేదు -కేబినెట్ కార్యదర్శి

  1. 2జి కుంభకోణం విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పు చేసాడని నిరూపించడానికు ఇంకా నిరూపణలు అవసరంలేదు. అది ఎప్పుడో జరిగినట్లే. యుపియేని మల్లీ ఎన్నుకోవాలో లేదో ప్రజలు తేల్చుకోవలసిన అవసరం ఉంది. కాని ప్రజలు ఆ ఆలోచనలో ఉన్నట్లు లేరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s