సోనియా అల్లుడి కేసులో ‘విచ్ హంట్’ మొదలు


అశోక్ విచారణ ఉత్తర్వులు -ఫొటో: ది హిందూ (Click to enlarge)

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసులో విచ్ హంట్ మొదలయింది. వాద్రా, డి.ఎల్.ఎఫ్ ల అక్రమ భూ దందా పై విచారణకు ఆదేశించిన సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిని హర్యానా ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసింది. ఈ బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన కారణం ఏమీ ఇవ్వడం లేదు. 21 సంవత్సరాల సర్వీసులో 43 బదిలీలు ఎదుర్కోవడం అధికారి నిజాయితీకి తార్కాణం గా నిలుస్తుండగా, వాద్రా అక్రమ ఆస్తులపై విచారణకు ఆదేశించిన సదరు అధికారిని ఉన్నపళంగా బదిలీ చేయడం కేంద్ర, రాష్ట్రాల కుట్రనూ, వాద్రా అవినీతినీ రుజువు చేస్తోంది.

హర్యానా రాష్ట్ర ‘లాండ్ కన్సాలిడేషన్ అండ్ లాండ్ రికార్డ్స్’  విభాగానికి అశోక్ ఖేమ్కా డైరెక్టర్ జనరల్. రిజిస్ట్రేషన్ విభాగానికి ఇనస్పెక్టర్ జనరల్ కూడా అయిన అశోక్ సీనియర్ ఐ.ఎ.ఎస్ అధికారి. సదరు అధికారిని హర్యానా ప్రభుత్వం అక్టోబర్ 11 న ఉన్నపళంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డి.ఎల్.ఎఫ్, వాద్రాల భూ ఒప్పందాలపై విచారణకు ఆదేశించిన కొద్ది గంటల్లోనే ఆయనకు బదిలీ ఉత్తర్వులు అందాయి. ఈ బదిలీతో వాద్రా-డి.ఎల్.ఎఫ్ ల భూమి బదిలీ ఒప్పందాలు, కోట్లాది రూపాయల వడ్డీలేని రుణాలు అక్రమమేనని హర్యానా ప్రభుత్వం ఒప్పేసుకుంది. భారత దేశంలో ముఖ్యంగా ఢిల్లీ చుట్టు పక్కలా డి.ఎల్.ఎఫ్ అనే స్ధిరాస్తి కంపెనీ ఎదుగుదల వెనుక అవినీతి, అక్రమాలు ఉన్నాయని కూడా అశోక్ బదిలీ రుజువు చేస్తున్నది.

అశోక్ తన బదిలీని రాతపూర్వకంగా సవాలు చేశాడు. తనను అక్రమంగా బదిలీ చేశారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కి ఫిర్యాదు చేశాడు. బదిలీ ఆదేశాలను స్వీకరించడం తప్ప మరోదారి లేదు. అయితే డి.ఎల్.ఎఫ్, వాద్రాల మధ్య భూమి అమ్మకానికి సంబంధించి 3.531 ఎకరాల లాండ్ ముటేషన్ ను రద్దు చేస్తూ అక్టోబర్ 15 న ఆదేశాలు జారీ చేశాక మాత్రమే అశోక్ బదిలీని స్వీకరించాడు. వెళ్ళేముందు సోనియా గాంధీ కుటుంబ పరువుకు మరో గొయ్యి తీసి మరీ వెళ్ళిన అశోక్ బహుధా అభినందనీయుడు. ఈ చర్యని అశోక్ సాహసంగా చెప్పవచ్చుగానీ దానివల్ల మిన్ను విరిగి మీద పడేదేమీ లేకపోవచ్చు. కాకుంటే అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి కొద్దిపాటి ప్రతిష్ట, బి.జె.పి కి ఒక ప్రచారాయుధం లభించాయి.

అశోక్ ఖేమ్కా, 21 యేళ్లలో 43 బదిలీలు -ఫొటో: వరల్డ్ న్యూస్

వాద్రా భూ సంబంధాలపై అక్టోబర్ 12 తేదీన విచారణ ప్రారంభించిన అశోక్ మూడు రోజుల తర్వాత నాలుగు జిల్లాల్లో వాద్రా నిర్వహించిన భూమి ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఐ.ఎ.సి ఆరోపణలను, ‘ది హిందూ’ లో వచ్చిన పరిశోధనాత్మక కధనాలనూ ఆధారం చేసుకుని ఆయన విచారణకి ఆదేశించాడు. (ఉత్తర్వుల ప్రతిని పైన చూడవచ్చు.) తన విచారణలో తేలిన ప్రాధమిక ఆధారాలను బట్టి 3.531 ఎకరాల మ్యుటేషన్ ను అశోక్ రద్దు చేశాడు. ఈ లాండ్ అమ్మకంలోనే డి.ఎల్.ఎఫ్ కంపెనీ రాబర్ట్ వాద్రా కు 50 కోట్ల వడ్డీలేని రుణం ఇచ్చింది. దీనిని అడ్వాన్స్ గా కూడా చెబుతున్నారు. 7 కోట్లకు డి.ఎల్.ఎఫ్ నుండి కొన్న ఈ భూమిని వాద్రా రెండు నెలలకే తిరిగి డి.ఎల్.ఎఫ్ కి 58 కోట్లకు అమ్మినట్లు కేజ్రీవాల్ పత్రాలు బైటికి తీశాడు. 7కోట్లకు కొన్నట్లు టైటిల్ డీడ్ లో ఉన్నప్పటికీ 15 కోట్లకు కొన్నట్లు వాద్రా కంపెనీ (స్కై లైట్ హాస్పిటాలిటీ) బేలన్స్ షీట్ లో ఉండడం మరో విచిత్రం.

7.5 కోట్లకు వాద్రాకు అమ్మిన భూమిని కేవలం 65 రోజుల్లోనే 58 కోట్లకు వాద్రా నుండి డి.ఎల్.ఎఫ్ తిరిగి కొనుగోలు చేయదానికి కారణం డి.ఎల్.ఎఫ్ సంస్ధ హర్యానా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ‘నీకది-నాకిది’ (క్విడ్-ప్రో-కో) ప్రాతిపదికన లబ్ది పొందడమేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తన బదిలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అశోక్ చీఫ్ సెక్రటరీ కి ఘాటుగా లేఖ రాశాడు. “బాద్ గుజార్, రోజ్కా గుజార్, కోట్, శికోఃపూర్, కలెసార్, అన్హిర్, మాలిక్పూర్, బంగార్, చిర్శి గ్రామాలకు వెళ్ళి మీరే పరిశీలించండి. నిజాయితీతో వ్యవహరిస్తూ కుంభకోణాలనూ, అవినీతిని వెల్లడించినందుకు దోషులపై చర్యలు తీసుకోవడానికి బదులు నన్ను శిక్షించడం తీవ్రమైన అన్యాయం… కుంభకోణాల వెల్లడి వల్ల ప్రభావితులైన రాజకీయ బ్యూరోక్రటిక్ అధికార పరమపద సోపానంలోని స్వార్ధపరుల ప్రయోజనాల కోసమే అధికారాలు అమలు చేస్తున్న ముసుగులో ఉద్దేశ్యపూర్వకంగా నా బదిలీ జరిగినట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే సృష్టించబడిన రియల్టర్ కంపెనీలకు అనేక వందల కోట్ల విలువ గల పంచాయితీ భూములు బదిలీ చేశారు… ఉద్దేశ్యపూర్వకంగా కన్సాలిడేషన్ లో జరిగిన ‘అధో మూల్యాంకనం’ (undervaluation) వలన పంచాయితీలు పెద్ద మొత్తంలో భూములు కోల్పోయాయి… నన్ను నైతికంగా దెబ్బతీయడానికీ, కృంగదీయడానికీ నన్ను బదిలీ చేస్తామని ప్రతినెలా బెదిరించారు” అని అశోక్ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. తనకు 12 సంవత్సరాల జూనియర్ నిర్వహిస్తున్న ‘సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్’ పోస్టుకు అశోక్ ని బదిలీ చేయడం బట్టి ఆయన పై రాష్ట్ర ప్రభుత్వం ఎంత కక్షకట్టిందీ తెలుస్తున్నది.

“ఈ సమస్యలను వెలుగులోకి తెచ్చినట్లయితే నా నిర్ణయాలు సరైనవేననీ సాధారణమేననీ కనిపించవచ్చు. కానీ లోపల జరిగేది వేరు. మీరు భిన్నంగా వ్యవహరించాలని ఆదేశాలు, మార్గదర్శకాలూ జారీ అవుతాయి” అని అశోక్ ఖేమ్కా వ్యాఖ్యానించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. “మీరు కఠినమైనదిగా పిలిచేదీ, నేను సరైనదిగా చెప్పేదీ అయిన నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ తర్వాత మీకు వ్యతిరేకంగా చర్య తీసుకోబడుతుంది. అది నైతికంగా మిమ్మల్ని క్రుంగదీస్తుంది, అమానవీయంగా ఉండి మీపట్ల మీరే సిగ్గుపడేటట్లు చేస్తుంది. మీరేదో తప్పు చేస్తున్నందునే ఇవన్నీ జరుగుతున్నాయన్నట్లుగా చెబుతారు కూడా” అని అశోక్ వ్యాఖ్యానించాడు.

“‘ఇతరులతో మీరు సరిగా వ్యవహరించరు’ అనో, ‘జీవితంలో గ్రే షేడ్స్ కూడా ఉన్నాయి’ అనో వ్యాఖ్యానాలు మీకు ఎదురవుతాయి. ఇలాంటి అర్ధాలంకారాల సభ్యోక్తులను సృష్టించి తద్వారా మిమ్మల్ని సరైన మార్గం నుండి పక్కకు తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతాయి” అని అశోక్ వివరించాడు. ప్రభుత్వంలోని ఆధికార వ్యవస్ధల్లో నిజాయితీపరులయిన అధికారులు ఎదుర్కొనే నిశ్శబ్ద హింసను అశోక్ వ్యాఖ్యలు వివరిస్తున్నాయి. అవినీతితో నిండిపోయిన వ్యవస్ధ నీతిమంతంగా వ్యవహరించే వ్యక్తులను ఎ విధంగా దారితప్పించి తనదారికి తెచ్చుకునేదీ కూడా ఆయన వ్యాఖ్యలు వివరిస్తున్నాయి. వ్యవస్ధీకృతమైన అవినీతిని నిజాయితీపరులయిన కొద్ది మంది అధికారులే కాక వ్యవస్ధ పరిధిలో పని చేయాలని భావిస్తున్న కొత్త రాజకీయ పార్టీలు సైతం ఏమీ చేయలేవని కూడా అశోక్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

భూ వినియోగ అనుమతిని విచక్షణాయుతంగా జారీ చేసే అధికారాలను హర్యానా అధికారులు పాత పారిశ్రామిక లైసెన్సుల ఒప్పందాల పద్ధతిలోనే వినియోగించడమే వాద్రా భూ కుంభకోణాలకు వినియోగించారనీ, ఇదే కుంభకోణాలకు వనరుగా పని చేసిందనీ అశోక్ లేఖ ద్వారా తెలుస్తోంది. అశోక్ బదిలీ తర్వాత ఆయన ప్రారంభించిన దర్యాప్తు కొనసాగేదీ లేనిదీ తెలియలేదని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. అశోక్ బదిలీని ఐ.ఎ.సి నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఖండించాడు. ఆయన బదిలీకి వివరణ ఇవ్వాలని హర్యానా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s