మార్చి 11, 2011 తేదీన సంభవించిన భారీ భూకంపం ఫలితంగా ఫుకుషిమా అణు కర్మాగారం తీవ్ర ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల వాతావరణంలోకి అణుధార్మికత పెద్ద ఎత్తున విడుదలయి అమెరికా, యూరప్ ల కు కూడా ప్రయాణించింది. ప్రమాదం జరిగాక నాలుగురోజుల్లోనే రేడియేషన్ విడుదలను అరికట్టామని టెప్కో కంపెనీ, జపాన్ ప్రభుత్వం చెప్పినా అది అబద్ధమేననీ చెబుతూ అనేకమంది జపనీయులు సాక్ష్యాలు ప్రచురించారు. డిసెంబర్ లో కోల్డ్ షట్ డౌన్ కూడా చేశామని జపాన్ ప్రభుత్వం, కంపెనీలు ప్రకటించిన తర్వాత కూడా రేడియేషన్ ఇంకా లీక్ అవుతున్నట్లు స్వతంత్ర పరిశోధకులు తెలియజేసినా జపాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది.
రేడియేషన్ లీక్ కావడం ఆగిపోయిందన్న అబద్ధాలను కంపెనీల పాపపు సొమ్ముకు అలవాటు పడిన కల్తీ ఎకాలజిస్టులు, వూడూ సైంటిస్టులు నెత్తినవేసుకుని ప్రచారం చేశారు. అయితే వీరి కల్తీతత్వాన్ని ఎండగట్టే సాక్ష్యాన్ని జపాన్ ప్రభుత్వమే స్వయంగా బయటపెట్టక తప్పింది కాదు. గ్లోబల్ రీసర్చ్ సంస్ధ ప్రచురించిన పై గ్రాఫ్ ప్రకారం జపాన్ ఉత్తరాన చిట్టచివరన ఉన్న హోక్కైడో ద్వీపంలో అక్టోబర్ 14 తేదీన రేడియేషన్ స్ధాయి పెరిగింది. ఈ పెరుగుదల ఇంకా కొనసాగుతున్నట్లు కూడా జపాన్ ప్రభుత్వం ప్రకటించినట్లు సదరు సంస్ధ తెలిపింది. జపాన్ ప్రభుత్వ ‘విద్య, సంస్కృతి, ఆటలు మరియు సైన్స్’ మంత్రిత్వ శాఖ ఈ గ్రాఫ్ ను ప్రచురించిందని తెలుస్తోంది. రేడియేషన్ లీక్ అవుతున్నప్పటికీ అది అదుపులో ఉందని చెప్పడానికే ఈ గ్రాఫ్ ప్రచురించారని చెబుతున్నప్పటికీ రేడియేషన్ విడుదల ఆగలేదని ఈ వార్త స్పష్టం చేస్తున్నది.