ఇంటిపనికి వేతనం ఇవ్వాల్సింది భర్త కాదు, గృహిణుల శ్రమను దోచే ఆధిపత్య వర్గ ప్రభుత్వం -2


కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ట తీర్ధ ఒప్పుకోలు ఇక్కడ పరిగణిచాలి. ఆమె ఒప్పుకున్నది గనుక పరిగణించడం కాదిక్కడ. ఐరాస ఒప్పందం, సుప్రీం కోర్టు పరిశీలన, సామాజిక అధ్యయనవేత్తల లెక్కలు అన్నీ పరిగణిస్తే కృష్ట తీర్ధ ఒప్పుకోలు, పరిగణించవలసిన వాస్తవం అని గ్రహించవచ్చు. మంత్రి ఒప్పుకోలును పరిగణిస్తే భారత దేశ జి.డి.పి 2010 లో 1143 బిలియన్లు కాదు. దాని విలువ 1747 బిలియన్ డాలర్లు. ఇందులో 35 శాతం కేవలం గృహిణుల శ్రమనుండి వచ్చినదే. కానీ అది చెల్లింపుకు నోచుకోకుండానే వినియోగంలోకి పోతోంది. ఇది అంకెల్లో మాత్రమే లేదు గానీ వినియోగంలో లేకుండా పోలేదు. అనేకరకాల చికాకులతో, ఒత్తిడులతో అలసిసొలసి రాత్రి ఇంటికి చేరిన భర్తకు పరిచర్యలు, సేవలు చేసి ఉదయాన్నే ఒక తాజా శ్రమ జీవిగా భార్య గడపదాటిస్తుంది. స్కూల్ లో విద్యా శ్రమ చేసి, ఆటల్లో అలిసిపోయి, బండెడు హోమ్ వర్క్ తో ఇంటికి చేరిన పిల్లలకు వండి పెట్టి, హోమ్ వర్క్ చేయించి, కధలు చెప్పి సంతోషపరిచి నిద్రపుచ్చిన తల్లి ఉదయాన్నే మళ్ళీ అవసరమైన శ్రమ సేవలు అందించి తాజాపరిచి పిల్లలను స్కూల్ కి పంపుతుంది. వృద్ధులకు చేసే సేవలుకూడా గృహిణుల ఖాతాలోనివే. గృహిణులు అందించిన ఈ శ్రమల విలువ దేశ జి.డి.పి లో 35 శాతంగా వచ్చి చేరితే దాన్ని ఎక్కడా లెక్కించకుండానే సమాజం అనుభవిస్తోంది. లెక్కించడం లేదు గనుక గృహిణుల శ్రమ సమాజానికి చేరడం లేదనాలా లేక ఆధిపత్య వర్గాలు మౌనంగా సొమ్ము చేసుకుంటున్నారు గనక లెక్కించనవసరం లేదనాలా? ఇప్పటివరకూ లెక్కించకపోతే ఇకనుండయిన లెక్కించడానికి మార్గాలు వెతకాలి. అందుకోసం సమాజ మార్పు కోసం వేచి చూడనవసరం లేదు. ఇందులో సాధ్యా సాద్యాల సంగతి తర్వాత. కానీ గృహిణుల శ్రమ లెక్కకు రావాలన్న సైద్ధాంతిక కోణాన్ని పరిగణించి, దాన్ని భౌతిక విలువల్లోకి కూడా తేవలసిన అవసరాన్ని తప్పనిసరిగా గుర్తించాలి.

రంగనాయకమ్మ గారు ఇలా అన్నారు. “‘నాగరిక’ స్త్రీ పురుషుల మధ్య ఉన్నది, అసమాన శ్రమ విభజన.ఈ సంబంధంలో స్త్రీ, సేవక స్థానంలోనే ఉంటుంది. కానీ, ఈ సేవకత్వం, యజమాని కోసం అదనపు శ్రమనో, అదనపు విలువనో పోగొట్టుకునే సేవకత్వం కాదు.” మారకపు లెక్కల్లో ఇది నిజమే. అయితే 613 బిలియన్ డాలర్ల భార్యల శ్రమ విలువ ఎక్కడికి పోయినట్లు. అసమాన శ్రమ విభజన విప్లవం పరిష్కరించవలసిన సమస్యగా పక్కన పెట్టవచ్చు. కానీ గృహిణుల శ్రమని లెక్కల్లోకి తేకుండా సొమ్ముచేసుకుంటున్న విషయం పక్కనపెట్టేది కాదు. రంగనాయాకమ్మ గారు చెప్పిన ఈ వాస్తవంలో భర్త రిఫరెన్స్ అయితే, మరొక (అసలు) రిఫరెన్స్ సమాజం. ఇక్కడ సమాజం అంటే దాన్ని గుప్పిట్లో పెట్టుకుని అందులో జరుగుతున్న సమస్త శ్రమల్లోని అదనపు విలువను సొంతం చేసుకుంటున్న ఆధిపత్య వర్గాలుగా చూడాలి. ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనం కోసం రూపొందించుకున్న ఆర్ధిక లెక్కల్లో గృహిణుల శ్రమల లెక్కలు లేవని చెప్పి తీసివేయడం కంటే, లెక్కించాలని డిమాండ్ చేస్తూ దానికి తగిన ప్రతిఫలం చెల్లించాలని రాజ్యాన్ని (ప్రభుత్వాన్ని) కార్మికవర్గం డిమాండ్ చెయ్యాలి. అసలు విలువ ఎలాగూ చెల్లించరు గనుక ఇప్పటి వేతనాల దామాషాలోనైనా గృహిణుల శ్రమకు విలువ చెల్లించాలని కార్మిక వర్గం డిమాండ్ చెయ్యాలి. జి.డి.పిలో అనేకానేక ఉద్యోగుల, కార్మికుల వేతనాల దామాషా లెక్కకట్టి అదే దామాషాలో గృహిణుల శ్రమల జి.డి.పి ని గృహిణులకి చెల్లించాలని డిమాండ్ పెట్టాలి. 1143 బిలియన్ల జి.డి.పిలో ఇప్పటి వేతనాల దామాషాను లెక్కించి అదే దామాషాలో 613 బిలియన్ల జి.డి.పి లోని మొత్తాన్ని గృహిణులకు చెల్లించాలని డిమాండ్ చెయ్యాలి. ఈ లెక్కలో అటు ఇటుగానో లేక ఇంకా పెద్ద మొత్తంలోనో తేడాలు ఉంటే ఉండవచ్చు. కానీ గృహిణుల శ్రమ దేశ ఉపయోగపు జి.డి.పి లో చేరుతోందనీ, దానికి తగిన చెల్లింపులను ప్రభ్యుత్వమే చేయాలన్న నిర్ధారణలో మాత్రం తేడాను చూడరాదు. ప్రత్యామ్నాయంగా, వాల్యూ యాడెడ్ టాక్స్ లాగా భర్తల శ్రమ విలువకు గృహిణుల శ్రమ విలువను యాడెడ్ శ్రమ విలువగా గుర్తించే అంశాన్ని ప్రభుత్వాలు పరిగణించాలని డిమాండ్ చెయ్యవచ్చు. ఎలా చేసినా అంతిమ లక్ష్యం కార్మికవర్గం తమ శ్రమలో మరింత భాగాన్ని లాక్కోవడమే.

రంగనాయకమ్మగారు ఇంకా ఇలా అంటారు. “గృహిణులకు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం (గృహిణుల ఓట్ల కోసం) గొప్ప ప్రయత్నాలు మొదలుపెడితే, ఆ జీతాలు ఎక్కణ్ణించి ఇవ్వగలుగుతుంది? భర్తల జీతాల నించి తీసి, భార్యలకు అందించవలసిందే. భర్త, తన జీతంలో నించి కొంత భాగాన్ని అలా వదులుకోవడానికి అంగీకరిస్తాడా? గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడం లాంటి పరిష్కారాలు ఇవి. ఆడపిల్లలకి చదువులూ, ఉద్యోగాలూ, సమానత్వం కోసం ఆశలూ, మొగ పిల్లలకి సంస్కారాలూ, విప్లవ భావాలూ – ఇలాంటి వాటి జోలికి పోకపోతే, ఏ సమస్యకైనా మార్గం ఏముంటుంది, దానధర్మాల కోసం యాచించడం తప్ప? గృహిణులకు పారితోషికాలు ఇవ్వాలంటే, ప్రభుత్వం, తన పన్నుల ఆదాయంలో నించే ఇవ్వాలి. వృద్ధులకూ, అనాధ శరణాలయాలకూ, అంగ వైకల్యాల వారికీ, అతి పేదలకూ, ఇస్తుందే, అలాగ! భార్యకి జీతం ఇచ్చే బాధ్యతని భర్త మీద పెట్టకుండా, ఫ్రభుత్వం, తన ఆదాయంలో నించి ఇచ్చుకుంటే సరే. ప్రభుత్వానికి తమ శ్రమ ఇవ్వకుండా, ప్రభుత్వం ఇచ్చే దానం తీసుకునే గృహిణులు, అనాధ గృహిణులుగా మారినట్టు అర్థమే.”

కుటుంబం పరిధిలోనే ఎవరు ఎవరికి ఇవ్వాలన్న చర్చను దాటి గృహిణుల శ్రమను సొంతం చేసుకుంటున్నవారే వారి శ్రమకి విలువ చెల్లించాలన్న వాదన వద్దకు కూడా ఈ చర్చ రావాలి. రంగనాయకమ్మ గారు చెప్పినట్లు గృహిణుల శ్రమకి చెల్లింపులు చేయాలన్న డిమాండ్ పరిష్కారంలో భాగం కాదు. కార్మిక వర్గం శ్రమలోనుండి ఆధిపత్య వర్గాలు దోచుకుంటున్న అదనపు విలువలో మరింత భాగాన్ని పొందే పోరాటంలో భాగంగా దాన్ని చూడాలి. కార్మికవర్గం శ్రమను అదనపు విలువ రూపంలో ఆధిపత్య వర్గాలు సొమ్ము చేసుకుంటాయన్నది తెలిసిందే. ఈ అదనపు విలువలో ఇంకా ఇంకా ఎక్కువ భాగాన్ని వేతనాల రూపంలో గుంజుకోవడానికి కార్మిక వర్గం అనేక సంఘాల నీడలో పోరాటాలు చేస్తుంది. వ్యవస్ధ మారనంతవరకూ తమ శ్రమల ఫలితాన్ని వీలైనంత ఎక్కువ మొత్తంలో సొంతం చేసుకోవడానికి కార్మిక వర్గం ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నాలలో భాగమే సమాజానికి చేరుతున్న గృహిణుల శ్రమ కి ప్రతిఫలం చెల్లించాలన్న డిమాండు. విప్లవ కృషి మానేసి ప్రభుత్వ చట్టాలనే పరిష్కారంగా చూస్తే ఆమె చెప్పినట్లు ఇది గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడం లాంటి పరిష్కారం. కానీ ఇది పరిష్కారం కాదు. వర్గపోరాట డిమాండ్లలో భాగం.

గృహిణుల శ్రమకి ప్రభుత్వం చెల్లింపు చేయాలన్న డిమాండు ధానధర్మాల కోసం చేసే యాచన ఏమాత్రం కాదు. వృద్ధులకూ, అనాధ శరణాలయాలకూ, అంగ వైకల్యాల వారికీ, అతి పేదలకూ ప్రభుత్వాలు చెల్లిస్తున్నది దాన ధర్మాలు అన్న అవగాహనకు రంగనాయాకమ్మ గారు రావడం ఆశ్చర్యకరం. వీరికి ఇస్తున్నదంతా భారత దేశ శ్రామికుల శ్రమ ఫలితం. దాన్ని ప్రభుత్వాలు భిక్షంగా పడేస్తున్నంత మాత్రాన అది భిక్ష అయిపోదు. అదనపు విలువను సొమ్ము చేసుకున్న ఆధిపత్య వర్గాలు, ప్రజల తిరుగుబాట్లను అదుపులో ఉంచడానికి, ప్రభుత్వం రూపంలో ఇస్తున్న ఈ భిక్ష వాస్తవంలో శ్రామిక ప్రజల హక్కు. ఈ హక్కును నిలుపుకోవడం, మరింత విస్తరించుకోవడం యాచన కానేకాదు. రంగనాయకమ్మ గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. “భార్యకి జీతం ఇచ్చే బాధ్యతని భర్త మీద పెట్టకుండా, ఫ్రభుత్వం, తన ఆదాయంలో నించి ఇచ్చుకుంటే సరే” అని. మళ్ళీ అంతలోనే దాన్ని తీసుకోవడం అనాధ గృహిణులుగా మారడంగా ఆమె అభివర్ణించారు. కానీ ఇది సరి కాదు. ఇందులో రాజ్యం కోణాన్ని, ఆధిపత్య వర్గాల సొత్తు అంతా శ్రామిక ప్రజలదే అన్న కోణాన్నీ కూడా పరిగణిస్తే ప్రజల వైపుకి ఆదాయాలు ఏ రూపంలో వచ్చినా అది శ్రామిక ప్రజల హక్కుగానే పరిగణించాలని గ్రహించవచ్చు.

దీనిని ఆధిపత్య వర్గాల ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుందన్న ప్రశ్న ఉండనే ఉంది. ఇన్నాళ్లూ ఒప్పుకోలేదు నిజమే. దానికి తగిన ప్రాతిపదిక ఇన్నాళ్లూ లేదు. కానీ ఐరాస ఒప్పందం, సుప్రీం కోర్టు తీర్పు, సామాజిక అధ్యాయనాల నేపధ్యంలో ఎంతకొద్ది మేరకయినా ఒప్పుకోవలసిన అగత్యం ప్రభుత్వానికి ఏర్పడింది. తగిన ప్రాతిపదిక కూడా ప్రభుత్వం ముందు ఉన్నది. గృహిణుల శ్రమ లెక్కింపుకు నోచుకోవడం లేదనీ, లెక్కిస్తే జి.డి.పి ఇంకా ఎక్కువ ఉంటుందనీ ప్రభుత్వం చెబుతున్న నేపధ్యంలో ఈ డిమాండ్ సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలి. ఈ బాధ్యతను ప్రభుత్వం తెలివిగా భర్తలపైకి నెట్టి తప్పుకునే ప్రయత్నం చేస్తోంది. దీన్ని గుర్తించి ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలని కార్మికవర్గం డిమాండ్ చెయ్యాలి. ఈ డిమాండ్ ను ఒక్క మహిళా సంఘాలే కాకుండా, కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు కూడా చేపట్టాలి. భార్యకి జీతమిస్తే, మరి భర్తకి అన్న ప్రశ్న ఇక్కడ అనవసరం. శ్రామిక భార్యా భర్తలు చెల్లించుకునేది, చెల్లించవలసినదీ ఒకరికొకరు కాదనీ, ప్రభుత్వాల నుండి మరింత వాటా ఇరువురూ గుంజుకోవాలనీ గుర్తించాలి.

సామ్రాజ్యవాద హస్తం

గృహిణుల శ్రమకు వేతనాలు చెల్లించే చట్టానికి ఉన్న అంతర్జాతీయ కోణంలోని వాస్తవాలు కూడా ప్రస్తావించుకోవడం అవసరం. ప్రజాస్వామ్యం మెరుగుదల పేరుతోనో, గ్లోబల్ గవర్నెన్స్ పేరుతోనో, ఆధునిక విలువల పేరుతోనో ప్రపంచ వ్యాపితంగా అనేక హక్కుల భావనలు రంగం మీదికి వస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఒప్పందాల రూపంలో పురుడు పోసుకుని అయిష్టంగానే అయినా చట్టాల రూపాన్ని సంతరించుకుంటున్నాయి. వివిధ రకాల వివక్షలకు వ్యతిరేకంగా జాతులు, కులాలు, మహిళలు, కార్మికులు తదితర తరగతుల ప్రజల పోరాటాలు పెరిగేకొద్దీ సరికొత్త హక్కుల ఆలోచనలను ప్రపంచ స్ధాయిలోనే చేస్తున్నారు. మానవ హక్కులు, మహిళల హక్కులు, సమాచార హక్కు, విద్యా హక్కు, గృహిణుల హక్కులు తదితర అనేక హక్కులను ఐరాస ఒప్పందాల్లో ప్రతిపాదించి జాతీయ ప్రభుత్వాల చేత అమలు చేయించే ప్రయత్నాలు ఒక వరుసలో జరుగుతూ వస్తున్నాయి.ప్రజల పోరాటాలు లేవనెత్తుతున్న మౌలిక డిమాండ్లను పరిమిత స్ధాయిలో సంతృప్తిపరిచి అంతిమ లక్ష్యమైన వ్యవస్ధ మార్పునుండి పక్కకు మళ్లించడం ఈ హక్కుల చట్టాల రూప కల్పనలో ఒక ముఖ్య ఉద్దేశ్యం.

మరో పక్క సామ్రాజ్యవాద సంక్షోభం చిక్కనయ్యే కొద్దీ వివిధ దేశాల వనరులను, మార్కెట్లనూ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో జాతీయ ప్రభుత్వాల వల్ల ఏర్పడుతున్న ఆటంకాలు సామ్రాజ్యవాదులకు చికాకు కలిగిస్తున్నాయి. ఈ చికాకులు తప్పించడానికి సామ్రాజ్యవాదులు తమ అంతర్జాతీయ రాజకీయ సాధనం ఐరాస ను వినియోగిస్తున్నాయి. జాతీయ ప్రభుత్వాలు, వివిధ చట్టాల రూపంలో అవి ఏర్పరుస్తున్న ప్రతిబంధకాల వల్ల సామ్రాజ్యవాదం కోరుకుంటున్న తక్షణ పరిష్కారాలు కోరుకున్నంత వేగంగా ముందుకు కదలడం లేదు. ఈ పరిస్ధితిని అధిగమించడానికి సమాచార హక్కు లాంటి చట్టాలను సామ్రాజ్యవాదులే ముందుకు తెచ్చారు. జాతీయ ప్రభుత్వాలు ఏర్పరుస్తున్న రహస్య చట్టాల, జాతీయ భద్రతా చట్టాల ఆటంకాలను అధిగమించేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా సామ్రాజ్య వాదులు ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తించవలసిన విషయం. మానవ హక్కులు, ఉపాధి హక్కు, బాలల హక్కులు లాంటి చట్టాల ద్వారా మూడో ప్రపంచ దేశాల్లోని అప్రజాస్వామిక వ్యవస్ధల మౌలిక లోపాలనూ, లోసుగులను సొమ్ము చేసుకుని అక్కడి జాతీయ ప్రభుత్వాలను రాక్షసీకరించే ప్రయత్నాలు సామ్రాజ్యవాదులు చేస్తున్నారు. సామ్రాజ్యవాద దోపిడీయే ఒక పెద్ద అవినీతి కాగా, మూడో ప్రపంచ దేశాల్లోని అవినీతిని పెద్దఎత్తున చూపించి ఆ దేశాల్లోని ప్రజల పక్షాన ఉన్నట్లు కొట్టే ఫోజులు ఇందులో భాగమే.

ముస్లింలపై జరిపించిన మారణకాండను చూపి నరేంద్రమోడికి వీసా నిరాకరించినా, యు.పి.ఎ అవినీతిని చూపి మన్మోహన్ అసమర్ధుడని తిట్టిపోసినా, (తమ ప్రయోజనాలకు కొమ్ము కాసే) పత్రికలకు స్వేచ్చ ఇవ్వని ఈక్వెడార్ అధ్యక్షుడు జూలియన్ ఆసాంజే కు రాజకీయ ఆశ్రయం ఇవ్వడమా అని కపట ఆశ్చర్యం ప్రకటించినా, (పశ్చిమ కంపెనీలకు వాటా తిరస్కరిస్తున్న) వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావేజ్ కు నియంత అని ముద్రవేసినా, తెల్లవారి భూములు లాక్కునేందుకు ప్రయత్నించిన జింబాబ్వే అధ్యక్షుడు ముగాబేను పిచ్చివాడని ఈసడించినా… అన్నీ సామ్రాజ్యవాదుల బ్లాక్ మెయిలింగ్ ఎత్తుగడల్లో భాగమే.

వివిధ హక్కుల చట్టాలు కూడా ఒక కోణంలో సామ్రాజ్యవాద దోపిడీకి ఉపకరణాలు కాగా మరో కోణంలో కార్మికవర్గ వ్యతిరేక స్వభావాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు. అవసరానికి తగిన విధంగా, సామ్రాజ్యవాదులు ఈ రెండు కోణాలనూ ఉపయోగంలోకి తెస్తున్నారు. ఇవి పరస్పర విరుద్ధ కోణాలు అయినందున సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యానికి, వర్గపోరాట చైతన్యానికీ కూడా వీటిని కార్మికవర్గం ఉపయోగపెట్టుకోవచ్చు. ఆ విధంగా చూసినపుడు గృహిణుల శ్రమకు వేతనం లెక్కకట్టే చట్టాన్ని మూడో ప్రపంచ దేశాల్లోని కార్మికవర్గం ప్రజలను చైతన్యపరచడానికి వినియోగించాలి. ఆధిపత్య వర్గాలు కొల్లగొడుతున్న అదనపు విలువలో మరింత భాగాన్ని వశం చేసుకోవడానికి వినియోగించాలి.

——————————————————

అప్ డేట్

ఈ ఆర్టికల్ లో అపోహలకు, అపార్ధాలకు దారి తీసే అంశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా రంగనాయకమ్మ గారు చేసిన విశ్లేషణలో లేని పొరపాటుని పొరపాటుగా చెప్పాను. ఉపయోగపు విలువ, మారకపు విలువల కోణం ఈ ఆర్టికల్ లో కలగాపులగం అయింది. దీనివల్ల నేను ఉద్దేశించని అర్ధం ఇందులో వ్యక్తం అయింది.

గృహిణుల శ్రమ జిడిపి (613 బిలియన్ డాలర్లు) ఉపయోగపు విలువ మాత్రమే. అది గుర్తింపుకు నోచుకునే విలువగా మారే అవకాశం మారకపు విలువల వ్యవస్ధలో ఉండదు. ఈ పరిస్ధితి వల్లనే రంగనాయకమ్మ గారి విశ్లేషణ కుటుంబ పరిధిని దాటే అవకాశం లేదు. ఆమె చేసిన చర్చ కుటుంబ పరిధిని దాటి రావాలన్న నా సూచన ఉపయోగపు విలువ కోణం లోనే చూడాలి. అలాగే గృహిణుల శ్రమ ఆధిపత్య వర్గాలకు చేరుతోందన్న నా సూచన కూడా ఉపయోగపు విలువ కోణంలోనిదే.

ఈ సంగతి ఈ మధ్యాహ్నమే మిత్రుడొకరు ఎత్తి చూపాడు.  రామ్మోహన్ గారి వ్యాఖ్య ద్వారా ఈ అప్ డేట్ అవసరం తరుముకొచ్చింది.

“ఈ శ్రమ మారకపు విలువ పొందని ఉపయోగపు విలువగానే ఉండడం వలన, ఆధిపత్య వర్గాలు మౌనంగా, సమాధానం చెప్పే అవసరం లేకుండా, ఎటువంటి చట్టాల భయమూ లేకుండా తమ వశం చేసుకోగలుగుతున్నారు.”  ఈ అవగాహన నిజం కాదు. మారకపు విలువ లేనిదాన్ని సొమ్ము చేసుకోవడం అనేది జరగదు.

6 thoughts on “ఇంటిపనికి వేతనం ఇవ్వాల్సింది భర్త కాదు, గృహిణుల శ్రమను దోచే ఆధిపత్య వర్గ ప్రభుత్వం -2

  1. విశెఖర్ గారూ. గౄహ శ్రమ జి,డి,పి. కింద లెక్కించినా లెక్కించకపొయినా అది స్వంత శ్రమకింద కర్సైపొతుంది. లెక్కించి విలువకట్టనంత మాత్రానా ఆ శ్రమ లేకుండా పొదు.విలువ సుత్రం ప్రకారం చుసుకున్నా రెండు సురుకులు ముఖా ,ముఖి మార్పిడికి లొనైనప్పుడే విలువ ప్రసక్తి వస్తుంది. గౄహిణిల శ్రమ జి,డి,పి కింద లెక్కించనంత మాత్రాన ఆదిపత్య వర్గాల చేతుల్లొకి ఎలాపొతుందొ నాకు అర్దం కావడం లేదు. స్త్రీ, అయినా, పురుషుడైనా, ఒక యజమానికింద చేసినప్పుడు వాళ్ళ శ్రమ అదనపు విలువ రూపంలొ వెళ్ళుతుంది. మరి ఇంటి పని ఎలా వెళ్ళుతుంది?. ఇద్దరి మద్య ఎవిధమైన మారకం లేకుండా ఉచితంగా వాళ్ళ శ్రమ ఎలా పొతుంది.?

    గౄహిని బనిసుకొక బానిసని చలం గారు కుడా చెప్పారు రంగ నాయకమ్మ గారు కుడా అనేక సందర్బాలలొ దాన్ని గురించి ప్రస్తావించారు. అలా ఎందుకు జరుగుతుందొ కుడా చెప్పారు. ఇంటిపననేది అది వ్యక్తిగతం అపొయింది అది సామాజిక శ్రమ కానందునే ప్రదానంగా స్త్రీ బానిస అయింది. అది సమాజిక శ్రమ దొపిడీ వర్గ సమజంలొ కాలేదు.ఇది అర్దం కావాలంటే ఉత్పదక, అనుత్పాదక శ్రమల గురించి తెలియాలి. ఆర్దిక యునిట్టుగా కుటుంభం వుంది సమాజం లేదు కనుకనే అది సామాజిక శ్రమగా రూపుదాల్చలేదు.

    గౄహిని శ్రమ కుటుంబనికి మాత్రమే పరిగనించడం ఒకరు పరిగనించడం వల్ల అది ఉనికిలొలేదు. అది ఉనికిలొవుంది కాబట్టి అలా పరిగనిస్తున్నారు. ఒక పారిశ్రమిక స్తంస్తలొ జరిగేదన్ని ఇంటిపనితొ పొలికపెట్టి చుస్తున్నారు.ఉపయొగపు దౄష్టితొ చుస్తె రెండూ అవసరమే కాకపొతె ఒకటి మారకంలొకి వెళ్ళుతుంది ఒకటి వెళ్ళదు. మీరు మాటి మాటికీ గౄహిణుల శ్రమ ఆధిపత్యాలవారు సొమ్ముచేసుకుంటున్నారని అంటున్నారు అది యలా సొమ్ముచేసుకుంటున్నారొ ఒక్కదగ్గిరకుడా వివరణ లేదు.

    613 బినియర్ల బార్యల శ్రమ యక్కడికీ పొలేదు అది విలువలెక్కలు లేకుండ ఇంటి పనులకు కర్చైపొయింది. దాన్ని ప్రభుత్వం లెక్కవేసింది అంతే. బార్యలకు జీతం బర్త జీతంలొనుంచి తీసియ్యడమనేది.అసంబద్దమైన పక్రియ. ప్రభుత్వం ఇస్తె అది వేరేసంగతి.బర్తలనుంచి దొచుకున్న దాంట్లొ ఒక ముక్క తీసి ఇస్తారు.

  2. రామ్మోహన్ గారూ

    “మీరు మాటి మాటికీ గౄహిణుల శ్రమ ఆధిపత్యాలవారు సొమ్ముచేసుకుంటున్నారని అంటున్నారు అది యలా సొమ్ముచేసుకుంటున్నారొ ఒక్కదగ్గిరకుడా వివరణ లేదు.”

    నేను కొంత వివరణ ఇచ్చాను.

    “అనేకరకాల చికాకులతో, ఒత్తిడులతో అలసిసొలసి రాత్రి ఇంటికి చేరిన భర్తకు పరిచర్యలు, సేవలు చేసి ఉదయాన్నే ఒక తాజా శ్రమ జీవిగా భార్య గడపదాటిస్తుంది. స్కూల్ లో విద్యా శ్రమ చేసి, ఆటల్లో అలిసిపోయి, బండెడు హోమ్ వర్క్ తో ఇంటికి చేరిన పిల్లలకు వండి పెట్టి, హోమ్ వర్క్ చేయించి, కధలు చెప్పి సంతోషపరిచి నిద్రపుచ్చిన తల్లి ఉదయాన్నే మళ్ళీ అవసరమైన శ్రమ సేవలు అందించి తాజాపరిచి పిల్లలను స్కూల్ కి పంపుతుంది. వృద్ధులకు చేసే సేవలుకూడా గృహిణుల ఖాతాలోనివే.”

    ఇందులో గృహిణి చేసిన శ్రమ ఫలితం భర్త, పిల్లల్లో ఉపయోగపు విలువ రూపంలో నిక్షిప్తం అయి ఉంటుంది. భార్యకి మారక విలువగా తిరిగి చేరకపోవడం వల్లనే అది లెక్కలోకి రావడం లేదు తప్ప మీరు చెప్పినట్లు ఖర్చైపోవడం వల్ల కాదు. భార్య శ్రమ ద్వారా భర్త, తల్లి శ్రమ ద్వారా పిల్లలు, కోడలు ద్వారా అత్తమామలు, కూతురు ద్వారా తల్లిదండ్రులు కొత్త శ్రమ శక్తిని అందిపుచ్చుకుని మరుసటి రోజుకి తాజాగా తయారవుతారు. ఆ విధంగా భార్య శ్రమ, తల్లి శ్రమ, కూతురు కోడళ్ళ శ్రమలు భర్త, మామ, నాన్న మరియు ఎదిగిన పిల్లల తాజా శ్రమ శక్తి ద్వారా సమాజానికి చేరుతోంది.

    ఆధిపత్య వర్గాలు సొమ్ము చేసుకుంటున్నారు అని నేను అన్నది పై అర్ధం లోనే. ఉపయోగపు విలువ అర్ధంలోనే. మారకపు విలువ అర్ధంలో కాదు. ఈ అంశం కూడా ఆర్టికల్ లో వచ్చి ఉండాల్సింది. ఇది రాకపోవడం వల్ల కొంత అపోహకు దారి తీసింది.

    “ప్రభుత్వం ఇస్తె అది వేరేసంగతి. బర్తలనుంచి దొచుకున్న దాంట్లొ ఒక ముక్క తీసి ఇస్తారు.”

    అలా ఒక ముక్క తీసి ఇవ్వడానికి ఆధిపత్య వర్గాలు ఒప్పుకోకపోగా, ఇంకా ఇంకా అనేక రూపాల్లో వేతనాలు తగ్గిస్తూ మరింత దోచుకుంటున్నారు. ఇపుడు ప్రభుత్వము, సుప్రీం కోర్టు, ఐరాస ల సానుకూల అవగాహన నేపధ్యంలో కార్మికవర్గానికి తమ వేతనాల్లో మరొక ముక్కను మరొక రూపంలో డిమాండ్ చేసే అవకాశం వచ్చింది. దానధర్మం అని తీసేయకుండా, మరొక ముక్కను లాక్కోవడానికి ఈరూపంలో కార్మికవర్గం డిమాండ్ చేయాలని నేను చెప్పాను. అందుకే దీనిని వర్గపోరాటంలో భాగంగా చూడాలనీ, కుటుంబం పరిధిలో ఒకరికొకరు చెల్లించుకునేదిగా చూడవలసిన అవసరం లేదనీ రాశాను.

    దీన్ని ఆచరణలోకి తెచ్చినట్లయితే ఇంటిపనులకి విలువ కట్టే మెకానిజం బీజరూపంలోనైనా ఉనికిలోకి వస్తుందేమో చూడాలి.

  3. వివక్ష నిర్మూలనకీ, అసమానత్వ నిర్మూలనకీ మధ్య ఉన్న తేడా చాలా మందికి తెలియదు. ఐక్య రాజ్య సమితి ప్రతిపాదించినది కేవలం వివక్ష నిర్మూలన. ఒక స్త్రీకి ఆఫీసర్ ఉద్యోగం చేసే అవకాశం ఇస్తే అది కేవలం వివక్ష నిర్మూలన అవుతుంది. ఒక మహిళా అధికారికీ, ఒక మగ అధికారికీ సమాన గౌరవం ఇస్తే అది అసమానత్వ నిర్మూలన అవుతుంది. కానీ మహిళా అధికారికీ, మగ అధికారికీ సమాన గౌరవం ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందా?

    మన సమాజంలో మగవానికైతే గౌరవం ఇస్తారు, ఆడదానికైతే జాలి చూపిస్తారు. ఒక రాజకీయ నాయకుడు చనిపోయిన తరువాత అతని భార్య ఎన్నికలలో పోటీ చేస్తే జనం జాలిపడి ఆమెకి వోట్‌లు వేస్తారు. అదే ఒక రాజకీయ నాయకురాలు చనిపోయిన తరువాత ఆమె భర్త ఎన్నికలలో పోటీ చేస్తే అతని భార్య పేరు చెప్పి అతని మీద జాలి చూపించరు. మగవాళ్ళ మీద గౌరవం, ఆడవాళ్ళ మీద జాలి! ఈ పరిస్థితిని అసమానత్వ నిర్మూలన అని అనలేము, వివక్ష నిర్మూలన అని కూడా అనలేము.

  4. విశెఖర్ గారూ. మీరు చెప్పిన పద్దతిలొ స్త్రీలను ఆధిపత్య వర్గాలు దొచుకుంటె మరి పురుషులను యవరుదొచుకుంటున్నారు.? లేక ఇద్దరినీ దొచుకుంటున్నారనా? ఉత్పత్తి క్రమంలొ యవరైతే శ్రమను వెచ్చిస్తారొ {అది స్త్రీ,అయినా పురుషుడైనా} వాళ్ళ శ్రమ మాత్రమే అదనపు విలువగా దొపిడీ వర్గాలకు వెళ్ళుతుంది. అంతే గాని ఇంటిలొ స్త్రీలు చేసిన శ్రమ బయట వస్తువుకు చేరదు . దాని విలువను ఎవిధంగానూ ప్రబవితం చేయదు. అంతేకాదు ఉత్పత్తి క్రమంలొ పాల్గొన్న కార్మికులశ్రమే అనుత్పాదక కార్మికులకు కుడా చేరుతుంది .

    స్త్రీలు, పురుషులకు ఉచితంగా చేయడం లేదు. తను చేయవలసిన పనిని కుడా పురుషుడే చేస్తున్నాడు కాబట్టి పురుషుడు చేయవలసిన ఇంటిపనిని స్త్రీలు చేస్తున్నారు. దీనికి పరిస్కారం ఇద్దరికీ, ఇంటిపనీ, ఇద్దరికీ, బయటపని. ఈ వివరాలు మీరు చర్చించిన రంగనాయకమ్మ గారి వ్యాసంలొనే వున్నాయి.

  5. రామ్మోహన్ గారూ, ఆర్టికల్ చివర అప్ డేట్ రాసాను. అది మీరు చూసినట్లు లేదు.

    మొదటి పెరాలో మీరు చెప్పింది వాస్తవం. రెండో పేరాలో చెప్పిన విషయం మారకపు విలువల దృష్టిలో వాస్తవమే. ఉపయోగపు విలువ దృష్టితో చూస్తే గృహిణుల శ్రమకి తగిన గుర్తింపు సమాజంలో లేదు. దోపిడీ సమాజాల్లో సరుకుల్లోని శ్రమ విలువ, మారకపు మరియు ఉపయోగపు విలువలుగా విడిపోవడం వలన ఈ పరిస్ధితి ఏర్పడింది. సమాజంలోని సమస్త దోపిడిలకు మార్గం ఇలా ఏకరూపంలో ఉండవలసిన విలువలు విడిపోవడం వల్లనే ఏర్పడింది. వ్యవస్ధాగత దోపిడికి బీజం కూడా ఇదే.

    రంగనాయకమ్మ గారి విశ్లేషణతో మౌలికంగా నాకు విభేదం ఏమీ లేదు. అయితే గృహిణికి ప్రభుత్వాలు చెల్లించదలిస్తే అది దానంగానూ, అనాధ గృహిణులు తీసుకునేదిగానూ తను చెప్పడంతో నాకు విభేధం ఉంది. ఎందుకో ఆర్టికల్ లో చెప్పాను. దోపిడీవర్గ రాజ్యం చెల్లించేది ఏ పేరుతో చెల్లించినా అది కార్మికవర్గానికి అందవలసిందే తప్ప దానం కాదు. గృహిణి శ్రమ పేరుతో మరింత వాటా గుంజుకునే అవకాశం వచ్చినపుడు దానంగా భావించి తిరస్కరించవలసిన అవసరం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s