వాల్ మార్ట్ కార్మికుల ‘బ్లాక్ ఫ్రైడే’ సమ్మె హెచ్చరిక


Photo: The Huffington Post

వాల్ మార్ట్ వస్తే ఉద్యోగాలొస్తాయని భారత ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నమ్మబలికాడు. ప్రధాని చెప్పిన ఉద్యోగాల తీరు ఎలా ఉంటుందో అమెరికా వాల్ మార్ట్ కార్మికుల సమ్మె హెచ్చరిక స్పష్టం చేస్తున్నది. అతి తక్కువ వేతనాలతో కార్మికుల శ్రమను దోపిడి చేస్తున్న వాల్ మార్ట్ విధానాలకు వ్యతిరేకంగా రానున్న ‘బ్లాక్ ఫ్రైడే’ రోజున దేశ వ్యాపిత సమ్మెకు దిగుతామని కార్మికులు హెచ్చరించారు. అమెరికా వ్యాపితంగా అనేక నగరాల్లో ఇప్పటికే వాకౌట్లు, కవాతులు నిర్వహించిన వాల్ మార్ట్ ఉద్యోగులు, కార్మిక వ్యతిరేక విధానాలు మానుకుని తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. లేనట్లయితే సమ్మె తప్పదని హెచ్చరించారు.

నవంబరు 23 తేదీని ‘బ్లాక్ ఫ్రైడే’ గా అమెరికన్లు పరిగణిస్తారు. ‘ధ్యాంక్స్ గివింగ్ డే’ తర్వాత వచ్చే ‘బ్లాక్ ఫ్రైడే’ రోజునుండి అమెరికాలో అమ్మకాల జోరు పుంజుకుంటుంది. ఆ రోజునుండే క్రిస్టమస్ షాపింగ్ సీజన్ మొదలవుతుంది. ఆ రోజున తెల్లవారు ఝామునే షాపులు తెరిచి అమెరికన్ల పండగ సంతోషాన్ని సొమ్ము చేసుకోవడానికి వ్యాపారులు ప్రయత్నిస్తారు. వాల్ మార్ట్ కి కూడా బ్లాక్ ఫ్రైడే రోజే సంవత్సరం మొత్తంలో అత్యంత బిజీ డే. కఃస్టమర్ల కోసం ఉదయం 4 గంటలకే షాపులు తెరిచి ఉంచుతుంది. అలాంటి ‘బ్లాక్ ఫ్రైడే’ రోజునే సమ్మె చేయడం ద్వారా వాల్-మార్ట్ లాభాలకు గండి కొట్టి, కంపెనీ కార్మిక వ్యతిరేక విధానాలపై తమ నిరసన తెలియజేస్తామని కార్మికులు ప్రకటించారు.

వాల్ మార్ట్ కంపెనీ విధానాలకు నిరసనగా కార్మికులు ఇప్పటికే అనేక నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. షాపుల నుండి వాకౌట్ చేసి నిరసన తెలుపుతున్నారు. డల్లాస్, శాన్ డీగో, చికాగో, లాస్ ఏంజిలిస్, సియాటేల్, వాషింగ్టన్ డి.సి., సాక్రమేంటో మున్నగు నగరాలతో పాటు కంపెనీ కేంద్ర కార్యాలయం ఉన్న ఆర్కన్సాస్ లో కూడా వాల్ మార్ట్ కార్మికుల నిరసనలు, కవాతులు జరిగాయి. అయితే వాల్ మార్ట్ యాజమాన్యం కార్మికుల నిరసనను సహించడం లేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలుపుతున్న కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. కోర్కెలు తీర్చాలంటూ నిరసన తెలుపుతున్న కార్మికులపై ప్రతీకార చర్యలు తీసుకుంటోందని పి.టి.ఐ తెలిపింది. యాజమాన్యం కక్షసాధింపు చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వందకు పైగా అసోసియేట్లు కంపెనీ హెడ్ క్వార్టర్స్ కు ప్రయాణం చేసి కవాతు నిర్వహించారని సదరు వార్తా సంస్ధ తెలిపింది.

“మా నోరు మూయించడానికి వాల్ మార్ట్ చేస్తున్న ప్రయత్నాల వల్ల మా సహచరుల మద్దతు మరింత పెరుగుతోంది. స్టోర్లలో మార్పులు చేయాలన్న మా డిమాండ్లకు మద్దతు పెరుగుతోంది. మేము నోరు మూసుకునేది లేదు. బ్లాక్ ఫ్రైడే నాడు కుటుంబాలతో గడిపే మా సెలవు రోజులో కోతపెట్టి కంపెనీ లాభాలు ఆర్జిస్తుంది… బ్లాక్ ఫ్రైడే రోజున కార్మికులు పూర్తిగా పనిలో ఉండాలని వాల్ మార్ట్ కోరుకుంటున్నట్లయితే, సంవత్సరంలోని ఇతర రోజుల్లో వారి కోసం మరింత చేయాల్సి ఉంటుంది” అని వాల్ కార్మికుడు కోల్బీ హేరీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడని ‘ది హిందూ’ తెలిపింది. టెక్సాస్ లోని ల్యాంకస్టర్ షాపులో పని చేస్తున్న హేరీస్ మూడు సంవత్సరాల సర్వీసు తర్వాత కూడా 8.90 డాలర్లు మాత్రమే సంపాదిస్తున్నాడని ‘ది హఫింగ్‌టన్ పోస్ట్’ పత్రిక తెలిపింది. కోల్బీ పరిస్ధితి ఇలా ఉంటే వాల్ మార్ట్ అధినేత ఆరుగురు వారసుల ఆస్తి విలువ 89.5 బిలియన్ డాలర్లని, అమెరికాలో దిగువన ఉన్న 41.5 శాతం ప్రజల సంపాదనకి ఇది సమానమని పత్రిక తెలిపింది.

కంపెనీ ప్రతినిధి డాన్ ఫాగిల్మేన్ కార్మికుల ఆరోపణలను ఖండించాడు. ఏ.బి.సి న్యూస్ తో పాట్లాడుతూ కార్మికులంతా కంపెనీ వేతనాలతో సంతోషంగా ఉన్నారని తెలిపాడు. మెజారిటీ కార్మికులు సమ్మె యోచనలో లేరని తెలిపాడు. “రిటైల్ పరిశ్రమలో ఉన్నవాటిల్లో కొన్ని గొప్ప ఉద్యోగాలను వాల్ మార్ట్ అందిస్తున్నదని వారు గుర్తించినట్లు కనిపిస్తోంది. మంచి వేతనం, సౌకర్యవంతమైన సదుపాయాలు, అడ్వాన్స్ పొందే అవకాశం ఇవన్నీ వాల్ మార్ట్ ఇస్తోంది” అని డాన్ తెలిపాడు.

అయితే కంపెనీ ప్రతినిధి ఇస్తున్న సమర్ధనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. వాల్ మార్ట్ అత్యంత తక్కువ వేతనాలు చెల్లిస్తుందని అనేక సంవత్సరాలుగా ఆరోపణలు ఉన్నాయి. న్యూయార్క్ నగరంలో వాల్ మార్ట్ షాపు వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ చిన్న వ్యాపారులు తిరుగుబాటు చేసి దానిని ఊరిబయటికి మార్పించారు. సెప్టెంబర్ నెలలో వాల్ మార్ట్ కి చెందిన వేర్ హౌస్ కార్మికులు 15 రోజుల పాటు సమ్మె చేశారు. 6 రోజుల పాటు ఉద్యోగ భద్రత డిమాండ్ చేస్తూ నిరసన యాత్రలు కూడా వారు చేపట్టారు.

Photo: ABC News

అదే నెలలో డల్లాస్, శాన్ డీగో నగరాల్లో భరించరాని పని పరిస్ధితులకు వ్యతిరేకంగా వందల మంది కార్మికులు వీధుల్లో కవాతు నిర్వహించారు. డల్లాస్ నగరంలో ‘అవర్ వాల్ మార్ట్’ సంస్ధ ఆధ్వర్యంలో కార్మికులంతా సమ్మేలోకి దిగారు. డల్లాస్ నగరంలోనే మొదటిసారిగా వాకౌట్ చేసి కవాతు నిర్వహించారు. ఉద్యోగుల సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేసినందుకే కక్ష సాధింపు చర్యలకు దిగడంపై తీవ్ర నిరసన తెలిపారని ‘అవర్ వాల్ మార్ట్’ ఒక ప్రకటనలోలో తెలిపిందని ‘ది హిందూ’ తెలిపింది. మరోవైపు మియామి, డి.సి.-ఏరియా, సాక్రమేంటో, దక్షిణ కాలిఫోర్నియా, బే-ఏరియా తదితర ప్రాంతాల్లోని వాల్ మార్ట్ స్టోర్స్ ల నుండి కార్మికులు వాకౌట్ నిర్వహించి నిరసన తెలిపారని సదరు సంస్ధ తెలిపింది.

వాల్ మార్ట్ కంపెనీలో ఆఫ్రికన్ అమెరికన్లు, మహిళలు, లాటినోలు అత్యధిక సంఖ్యలో పని చేస్తున్నారని, వారికి అత్యంత తక్కువ వేతనాలు ఇస్తూ కంపెనీ లాభాలు గడిస్తున్నదనీ లాటిన్ అమెరికన్ లేబర్ కౌన్సిల్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ హెక్టార్ సాంఛేజ్ తెలియజేశాడు. కంపెనీ యాజమాన్యం వివక్షాపూరిత ఉపాధి విధానాలను అనుసరిస్తుందనీ, సదుపాయాలు కల్పించకుండా అమెరికా మధ్యతరగతి పునాదినే దెబ్బతీస్తున్నదనీ సాంఛెజ్ తెలిపాడు.

వాల్-మార్ట్ లాంటి చిల్లవర వర్తక కంపెనీలు భారత దేశానికి ఉద్యోగాలు తెస్తాయని భారత ప్రధాని చెబుతున్న మాటలు వాస్తవ విరుద్ధమని అమెరికన్ కార్మికుల పోరాటాల ద్వారా స్పష్టం అవుతున్నది. దేశంలో వివిధ తరగతుల ప్రజల మధ్య ఉండే విభేదాలను కూడా తన వ్యాపార లాభాలు పెంచుకోవడానికి వీలుగా కంపెనీ వినియోగించుకుంటుందని సాంఛెజ్ ప్రకటన ద్వారా తెలుస్తున్నది. వివిధ జాతులు, కులాల మధ్య భిన్నత్వాన్ని, వివక్షాపూరిత ఆచారాలను వినియోగించుకునే విధంగా కొందరికి ఎక్కువగానూ, మరికొందరికి తక్కువగానూ వేతనాలు నిర్ణయించి లబ్ది పొందుతుందనీ, తద్వారా కార్మికుల మధ్య విభేదాలు పెంచి పోషించి లబ్ది పొందుతుందనీ అర్ధం చేసుకోవచ్చు. ఆ ఉద్దేశ్యంతోనే హెచ్చు వేతనాలు చెల్లించవలసిన తెల్ల కార్మికులకు తక్కువ ఉద్యోగాలు, తక్కువ వేతనాలు చెల్లించినా చెల్లిపోయే నల్ల, లాటినో, మహిళా కార్మికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే విధానాన్ని వాల్ మార్ట్ అనుసరిస్తోందని తెలుస్తున్నది.

కుల, మత వివక్షలతో పాటు, మహిళా వివక్ష, రూప వివక్ష, భాషా వివక్ష, ప్రాంతీయ వివక్ష లాంటి అనేక వివక్షలతో కూడి ఉన్న భారత దేశంలో లాభాలు అనేక రేట్లు పెంచుకునే అవకాశం వాల్ మార్ట్ లాంటి కంపెనీలకు దండిగానే ఉన్నాయి. ఈ కంపెనీల రాకవల్ల ఉపాధి నష్టంతో పాటు పెను సామాజిక నష్టం కూడా పొంచి ఉందని ఈ అంశాల ద్వారా అర్ధం చేసుకోవచ్చు. పశ్చిమ బహుళజాతి రిటైల్ కంపెనీల రాక వల్ల జరిగే నష్టాన్ని అమెరికన్ కార్మికులు తమ పోరాటం ద్వారా ముందుగానే హెచ్చరిస్తున్నట్లు గమనించాల్సి ఉంది. వాల్ మార్ట్ కార్మికుల హెచ్చరిక వాల్ మార్ట్ కే కాదు, భారత ప్రజలకు కూడా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s