టర్కీ నుండి వచ్చిన టెర్రరిస్టుల వల్ల సంవత్సరం ఎనిమిది నెలల నుండి మా దేశ ప్రజలపై అమానుష రక్తపాతం జరుగుతున్నా తమ ప్రజలకు కనీసం సానుభూతి కూడా టర్కీ ప్రకటించలేదనీ, అలాంటిది ఏ తప్పూ చేయకుండా మమ్మల్ని ఆపాలజీ కోరడం ఏమిటని సిరియా ప్రశ్నించింది. సిరియావైపు నుండి జరిగిన దాడిలో టర్కీలో మరణించిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపాము తప్ప ఆపాలజీ చెప్పలేదని స్పష్టం చేసీంది. దాడికి ఎవరు కారకులో తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నామని, విచారణలో బాధ్యులెవరో తేలాక తదుపరి చర్యలు ప్రకటిస్తామని తెలిపింది.
“సిరియా ప్రభుత్వం ప్రమాద ఘటనపై పరిశోధన జరుపుతోంది తప్ప ఆపాలజీ చెప్పడం లేదు” అని ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి లో సిరియా శాశ్వత ప్రతినిధి బషర్ ఆల్-జఫారి ఒక వార్తా వెబ్ సైట్ కి తెలిపాడు. “సిరియాలో తన చర్యలకు టర్కీ ప్రభుత్వం ఆపాలజీ చెబుతుందని సంవత్సరం ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తున్నాం. టర్కీ మహిళ ఒకరు తన ముగ్గురు పిల్లలతో సహా దుర్మరణం పాలవడం అత్యంత విచారకం. ఆమె ఒక అమాయక టర్కీ పౌరురాలు గనుక మా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం” అని జఫారీ తెలిపాడు.
సిరియా ప్రభుత్వం తమకు ఆపాలజీ చెప్పిందని టర్కీ పాలకులు చెప్పుకుంటున్నారు. “ఐదుగురు టర్కీ పౌరుల మరణానికి దారితీసిన దాడికి తమదే బాధ్యత అని సిరియా అంగీకరించింది. అందుకు ఆ దేశ ప్రభుత్వం ఆపాలజీ చెప్పింది” అని టర్కీ ఉప ప్రధాని బేసిర్ ఆటాలే పత్రికలకు తెలిపాడు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని సిరియా హామీ ఇచ్చింది అని ఆయన తెలిపాడు. సిరియా రాయబారి ఈ ప్రకటనను తిరస్కరించాడు. సిరియాలో నెలలతరబడి టెర్రరిస్టు దాడులు జరుగుతున్నాయనీ, టర్కీ నుండి వచ్చిన టెర్రరిస్టులు జరుపుతున్న ఈ దాడుల్లో వేలాది సిరియా పౌరులు మరణించినా కనీస ఖండన లేదన్నాడు.
“అలెప్పో నగరంలో జరిగిన టెర్రరిస్టు పేలుళ్లలో మరణించిన అమాయక సిరియా పౌరుల కోసం టర్కీ వైపునుండి ఒక సానుభూతి గానీ, విచారవచనాలు గానీ మేము వినలేదు… కనుక మన మాటల్లో నిజాయితీ ఉండాలి ” అని జఫారీ ఎత్తి చూపాడు. బుధవారం అలెప్పో నగరంలో జరిగిన నాలుగు ఆత్మాహుతి బాంబు పేలుళ్లను ఉద్దేశిస్తూ జఫారీ ఈ మాటలన్నాడు. సిరియాలో అతి పెద్ద నగరమైన అలెప్పోలో జరిగిన ఈ బాంబుపేలుళ్లలో 31 మంది ప్రజలు మరణించారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లలో అనేక భవనాలు పూర్తిగా ధ్వంసం కాగా, మరిన్ని భవనాల ముందు భాగాలు కుప్పకూలాయి.
స్పందనలేని భద్రతా సమితి
భద్రతా సమితి కూడా అలెప్పో పేలుళ్లకు స్పందించలేదని సిరియా రాయబారి జఫారీ ఎత్తిచూపాడు. అలెప్పో ఆత్మాహుతి దాడులను ఖండించవలసిందిగా కోరుతూ సిరియా ప్రభుత్వం ఐరాస భద్రతా సమితికి లేఖ రాసిందనీ, అయినప్పటికీ ఈ టెర్రరిస్టు దాడులకు భద్రతా సమితి నుండి కనీస స్పందన లేదనీ జఫారి తెలిపాడు. సిరియా ప్రభుత్వం దాడుల్లో వందలమంది సిరియన్లు మరణించారంటూ బ్రిటన్ నుండి వచ్చే ఏక వ్యక్తి మానవ హక్కుల సంఘం ప్రకటనలకు ఆధారం లేకపోయినా సిరియా ప్రభుత్వాన్ని ఖండించడానికి ఐరాస అధిపతి బాన్-కి-మూన్ ఆత్రం ప్రదర్శిస్తాడు. ఉరుకులు పరుగులతో ఖండన మండనలు జారీ చేసి అమెరికా, యూరప్ లకు తన విధేయత ప్రకటించుకుంటాడు. కానీ సిరియా ప్రజలపై జరుగుతున్న టెర్రరిస్టు దాడులకు మాత్రం ఆయన ఇంతవరకూ స్పందించిన పాపాన పోలేదు. రష్యా, చైనాలు ఒత్తిడి చేస్తే ఇరు పక్షాలు సంయమనం పాటించాలంటూ పనికిమాలిన బోధనలకు దిగడం బాన్ అనుసరించే ఎత్తుగడ.
సిరియానుండి జరిగిన మోర్టార్ దాడి వెనుక ఫాల్స్-ఫ్లాగ్ కుట్ర ఉండే అవకాశాన్ని సిరియా రాయబారి కొట్టివేయలేదు. సిరియా, టర్కీ ల మధ్య యుద్ధాన్ని ప్రేరేపించే ఉద్దేశ్యంతో టర్కీ నుండి వచ్చిన టెర్రరిస్టులే ఈ మోర్టార్ దాడికి పాల్పడ్డారన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. “సిరియా, టర్కీ ల మధ్య ఘర్షణ రెచ్చగొట్టడానికి ఆ ప్రాంతంలో పని చేస్తున్న అనేక గ్రూపులకు ఆసక్తి ఉంది” అని జఫారి స్పష్టం చేశాడు.
టర్కీలో యుద్ధ వ్యతిరేక నిరసనలు
సిరియా, టర్కీ ల మధ్య ఉద్రిక్తతలు పెచ్చుమీరుతున్న నేపధ్యంలో టర్కీ లో యుద్ధ వ్యతిరేక నిరసనలు ఊపందుకున్నాయి. టర్కీలో అతిపెద్ద పట్టణమయిన ఇస్తాంబుల్ లో వేలాది ప్రజలు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాద యుద్ధాలకు టర్కీ సైన్యాన్ని వినియోగించడం పట్ల నిరసన తెలిపారు. టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ ను అమెరికాకు కీలుబొమ్మగా చెబుతూ బ్యానర్లు ప్రదర్శించారు. “సిరియాకి వ్యతిరేకంగా టర్కీ యుద్ధం చేయాలని అమెరికా కోరుతోంది. ఎందుకంటే అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల వలన సిరియాకి అమెరికా సైన్యాన్ని పంపడం ఒబామాకి ఇష్టం లేదు. టర్కీ సైన్యం తమ పరికరంగా ఉపయోగపడాలని అమెరికా కోరుతోంది. కానీ మధ్యప్రాచ్యంలో మరో రక్తపాతంలో భాగం కావడం మాకు ఇష్టం లేదు” అని ప్రదర్శనకారుల్లో ఒకరు అన్నారని ‘ది హిందూ’ తెలిపింది. టర్కీలోని ఇతర పట్టణాల్లో కూడా యుద్ధ వ్యతిరేక నిరసనలు నిత్యకృత్యంగా మారాయి.