‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ (ఐ.ఎ.సి) నేత అరవింద్ కేజ్రీవాల్, రాబర్ట్ వాద్రా అక్రమాస్తులపై ఆరోపణలు సంధించాక కాంగ్రెస్, బి.జె.పి ప్రతినిధుల మాటల్లో తేడా మసకబారింది. డి.ఎల్.ఎఫ్, వాద్రా కంపెనీల లావాదేవీల్లో తప్పేమీ లేదని కాంగ్రెస్ నాయకులు, మంత్రులు వెనకేసుకొస్తుంటే, వాద్రాపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు సాక్షాలు లేవని బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ వారికి వంతపాడాడు. లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు వాద్రా అవినీతిపై అసలు గొంతే ఎత్తలేదు. బి.జె.పి అధికార ప్రతినిధులు విలేఖరుల సమావేశాల్లో ఏమన్నా మాట్లాడినా ఎప్పుడూ ఉండే రౌద్రం అసలే కనిపించదు.
బొగ్గు కుంభకోణంపై పార్లమెంటులో శివాలెత్తిన బి.జె.పి, బొగ్గు మసి తమ ప్రభుత్వాలకూ, నాయకులకూ కూడా అంటిన విషయం వెల్లడి కావడంతో ఇపుడు బొగ్గు మాటే ఎత్తడం మానేసింది. 1.86 లక్షల కోట్ల కుంభకోణాన్ని సైతం రాజకీయ ప్రయోజనాలకు వాడుకోలేని బి.జె.పి బలహీనతకు బి.జె.పి ప్రభుత్వాలూ, నాయకుల అవినీతే పునాది. సోనియా గాంధీ అల్లుడి అవినీతి అంటే కాంగ్రెస్ పై రాజకీయంగా పై చేయి సాధించడానికి బి.జె.పి కి అంది వచ్చిన అద్భుతమైన అవకాశమే. అయినా దానిని బి.జె.పి అందుకోలేకపోయింది. ఎన్.డి.ఎ హయాంలో వాజ్ పేయ్ అల్లుడి అవినీతిని కాంగ్రెస్ సహిస్తే, యు.పి.ఎ హయాంలో సోనియా అల్లుడి అవినీతిని బి.జె.పి సహిస్తుంది. బోఫోర్స్ కుంభకోణంలో గాంధీల చేయి తడిస్తే, మహారాష్ట్ర ఇరిగేషన్ కుంభకోణంలో నితిన్ గడ్కారీ చేయి తడుస్తుంది.
పార్లమెంటరీ ఎన్నికలంటే కేవలం అధికారం కోసం తన్నులాటలే. ఎన్నికలు పూర్తయ్యాక ఒకరికొకరు అందరూ మిత్రులే. ఇరు పార్టీలూ కలిసి దేశ ప్రజల వనరులను ఖాళీ చేసి స్వదేశీ, విదేశీ కంపెనీల బొక్కసాలు నింపుతారు. అందరూ కలిసి ప్రజలకు శత్రువులుగా వ్యవహరిస్తున్నారన్నదే ప్రజలు తెలుసుకోవలసిన విషయం.